15, మే 2013, బుధవారం

దీర్ఘ దర్శి గా - గొంతు విప్పి , కలం విప్పి - ఈ వొక్క మార్పు - మనం తీసుకు రావాలి


 పంచ తంత్ర కథలలో - మనకు చాలా ఇష్టమైనవి , మనల్ని ఎంతో ఆలోచింప జేసేవి ఎన్నో వున్నాయి. అందులో - దీర్ఘ దర్శి, సమయోచిత ప్రజ్ఞుడు , మంద బుద్ధి  అనే మూడు చేపల కథ కూడా చాలా ప్రసిద్ధమైనదే. 


ఆ మూడు చేపలూ , తమ పేరుకు తగ్గ బుద్ధి వుండేవే . అవి పుట్టి పెరిగిన జలాశయంలో వొక సారి నీళ్ళు ఐపో వచ్చింది. ఎండలకు ఆవిరై పోతూ వుంది. క్రొత్త గా వర్షాలూ పడడం లేదు. 

ఈ పరిస్థితి గమనించిన     దీర్ఘ దర్శి, తన యిద్దరు స్నేహితులతో యిలా అంది -"మిత్రులారా, మన జలాశయంలో నీరు యింకి పోయే ప్రమాదం కనిపిస్తూ వుంది ; మరి కాస్త యింకిపోతే - చేపలు పట్టే  వాళ్ళు మనల్ని సులభంగా పట్టేస్తారు.  కాబట్టి మనం ముగ్గురం దీనికి నీటి ఊట వచ్చే పై జలాశయానికి యిప్పుడే యీదుకుంటూ  వెళ్లి పోదాం .ఆక్కడైతే , మన జీవిత కాలం హాయిగా గడిచి పోతుంది ."

కానీ దాని యిద్దరు మిత్రులకూ ఈ సలహా నచ్చలేదు .  వారు వద్దు, వద్దు , యిక్కడే వుందాం - అన్నారు. దీర్ఘ దర్శి ఎంత చెప్పినా, వారు వొప్పుకో లేదు.  మరి చేసేదేమీ లేక దీర్ఘ దర్శి వెళ్లి పోయింది. కొన్నాళ్ళకు - దీర్ఘ దర్శి చెప్పినట్టే జరిగింది . నీళ్ళు యింకి పోవడమూ, బెస్త వాళ్ళు వచ్చి, చేపలు పట్టడమూ జరిగింది . 

మంద బుద్ధి సులభంగా   వారికి దొరికి పోయింది. సమయోచిత ప్రజ్ఞుడు వొక   చిన్న ఎత్తు వేశాడు. దొరక్క ముందే - నీళ్ళలోనే - ఎప్పుడో చనిపోయినట్టు నటించ సాగాడు . ఎప్పుడో  చచ్చిన చేప మనకెందుకు - అని     బెస్త వాళ్ళు దాన్ని వదిలేశారు . మంద బుద్ధి మాత్రం వారికి దొరికి, ఆహారమై పోయింది.

చేపలలో ఈ మూడు రకాలూ వున్నాయో లేవో కానీ, మనుషులలో, మన మధ్యలో వున్న ప్రతి వారూ - వీటిలో ఏదో వొక కోవకు చేరుతారు. 

మనం ఏ కోవకు చెందాలో మనమే నిర్ణయించుకోవాలి; నిర్ణయించుకోవచ్చు . జీవితంలో దీర్ఘదర్శి గా మసలే వారు -ఆనందంగా, విజయవంతంగా , ఆరోగ్యంగా వుండ గలగడం పెద్ద వింతేమీ కాదు.  దీన్ని అంగ్లంలో  స్టీఫెన్  కోవీ అనే ప్రసిద్ధ రచయిత తన 'ఫస్ట్ థింగ్స్ ఫస్ట్'   అనే పుస్తకంలో  చాలా బాగా వివరించారు.  

జీవితం లో మన ముఖ్యమైన ధ్యేయాలను మనం గుర్తించగలగాలి . యిది మొదటి మెట్టు. మనకు ఏం కావాలో తెలియక పోతే అవి మనకెలా వస్తాయి? గుర్తించిన వాటిపై మన ధ్యాస, మన కృషి ఎక్కువగా వుండాలి .

 "కృషితో నాస్తి దుర్భిక్షం"  అన్నది మొదటి నుండి వున్న  నానుడే  కదా . కృషి  లేని చోట అపజయం వుంటుంది . అపజయం వున్న చోట కృషి వుండదు. ఎక్కడో వొక 5 శాతం మనుషులను మినహాయిస్తే - 95 శాతం మనుషులకు యిది పూర్తిగా వర్తిస్తుంది.     

చాలా మందికి దీర్ఘ దర్శిత్వం లేక పోవడానికి - ఎన్నో కారణాలు వున్నాయి. 

1. కుటుంబ పరమైన పరిస్థితులు  అతి ముఖ్యమైన కారణం. తండ్రో, మరో పెద్దవారో, యింట్లో - త్రాగుబోతై వుంటే , ఆ యింట్లో పిల్లలు చాలా అవస్థ పడతారు.  వారు ఏ పనిలోనూ ముందుకు పోలేక పోవడానికి ఆ త్రాగుబోతు తండ్రే - కారణం అని నిశ్చయం గా చెప్ప వచ్చు . యిప్పటి త్రాగుబోతు తనానికీ , ప్రభుత్వాల విధానాలే ముఖ్య కారణం.  

2. తల్లిదండ్రుల మధ్య సఖ్యత  లోపించడం మరో కారణం . వారు సంతోషంగా లేకుంటే , పిల్లలనెలా  చూసుకోగలరు?

3. TV సీరియల్సు - పిల్లలకు, పెద్దలకు కూడా -  పెద్ద వ్యసనంగా మారిపోయింది . పిల్లలు పరీక్షలకు చదివే సమయంలో కూడా - పెద్దలు టీవీ సీరియల్సు -చూడకుండా వుండలేక పోతున్నారు . అలాగే పిల్లలు కూడా, క్రికెట్ లాంటివి చూడకుండా వుండ లేక పోతున్నారు.  

4. అన్నిటికంటే అతి ముఖ్య కారణం - స్కూల్లో, పిల్లలకు , వారి వారి జీవితాలను గురించిన  కనీస జ్ఞానము బోధించ బడడం లేదు.  జీవితానికి సంబంధించిన  ప్రాథమిక సూత్రాలు చెప్ప బడడం లేదు. ఉదాహరణకు - మనం చదువుతున్న   "దీర్ఘ దర్శి, సమయోచిత ప్రజ్ఞుడు , మంద బుద్ధి" అనే సూత్రం గురించి ఎంతో బాగా బోధించ వచ్చు.   పిల్లల మనసు మార్చ వచ్చు . ఉపాధ్యాయుడు యిది చెయ్య గలడు. కానీ, మన పాఠ్యాంశాలలో - యిది లేనే లేదు.  ఎక్కడో వున్నా, దానికంత ముఖ్యత్వం యివ్వ బడ లేదు.

జన్యు పరమైన కారణాలు  కొంత వుండ వచ్చు - కానీ వాటిని చాలా వరకు అధిగమించ వచ్చునని ఎంతో మంది జీవితాలు తెలుపుతాయి.    

జీవితానికి ముఖ్యమైన అన్ని అంశాల పైనా మన గమనం, శ్రద్ధ , కృషి వుండాలి. 

ముఖ్యమైన అంశాలంటే - (అ ) చదువు (ఆ) వుద్యోగం / వ్యాపారం  (ఇ ) వైవాహిక జీవితం  (ఈ )ఆరోగ్యం  (ఉ ) సమాజంలో ముఖ్యమైన అంగంగా వుండడం (వూ ) మన జీవితానికి చరమ లక్ష్యం మనం తెలుసు కోవడం 

యివన్నీ మనం తెలుసుకోవాలి.  వీటిలో మన శ్రద్ధ వుండాలి . వీటన్నిటిలో -చక్కటి విజయం సాధించాలి . 

చిన్న ఉదాహరణకు :- 

ఆరోగ్యం పైన అందరి శ్రద్ధా  చాలా తగ్గుతూ వుంది.  చక్కెర  వ్యాధి లాంటివి - అతి చిన్న వయసు నుండే వస్తూ వుంది. దీనికీ, మనం TV ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడానికీ, ఎంతో సంబంధం వుంది. మన జీవిత సమస్యలు పూర్తిగా విడిచేసి - TV  సీరియల్సు లోని పాత్రలతో మమేకమై - వారి కోపాలు, తాపాలు. కుట్రలు, శోకాలు మనవిగా చేసుకుని ఆపసోపాలు పడే వారు చాలా ఎక్కువ . వొకే చోట కూర్చుని , యిన్ని రకాల భావాలకు  యింత తీవ్రంగా మనం, మన మనస్సులో చోటిస్తూ పొతే  - రోగాలు రాకేం చేస్తాయి.      

అందులోనూ - మన టీవీ పాత్రలన్నీ - విలను పాత్రలే . అందులోనూ - ఆడవాళ్ళందరూ విల్లీలే . విల్లీలు కాని వాళ్ళు - మహా  మూర్ఖులుగా వుంటారు . వారిని, ఎవరైనా, ఎలాగైనా మోసగించ వచ్చు. అందుకు వారు ఎప్పుడూ సిద్ధంగావుంటారు - అంటే - మోస పోవటానికి, అన్న మాట . మన టీవీ  సీరియల్సు చాలా మారాలి . కాస్తో కూస్తో, స్వచ్చంగా, మానవత్వంతో కూడిన పాత్రలు , మాటలు,కథలూ రావాలి. 

ఇప్పుడున్న టీవీ  ప్రపంచం లో దీర్ఘ దర్శి  లాంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు?   అస్సలు లేరు.  ఈ పధ్ధతి మారాలి. 

సరే . సగటు మనిషి వైవాహిక జీవితంలో - సరైన అవగాహన, బాంధవ్యం చాలా తగ్గి పోతూ వుంది ఈ కాలంలో . 

నీ పూర్తి  బాధ్యత నాది;  అని, ఆడా మగా మనసారా అనుకున్నప్పుడు, గ్రహించినప్పుడు , యిప్పుడు  పెరుగుతున్న  పోటీ మనస్తత్వం  పోయి, దాని స్థానంలో నిజమైన  ప్రేమ పెరుగుతుంది. ధర్మేచ , అర్థేచ , కామేచ - అన్నిటిలో తోడూ, నీడగా వుందాం - అనే పెళ్లి నాటి ప్రమాణాలకు   కట్టుబడి వుంటే - వైవాహిక జీవితం బాగానే వుంటుంది. 

కానీ, జరుగుతున్న చరిత్రలో -  విడాకులు, వొకరిపై, మరొకరు పెట్టే కోర్టు కేసులు, గృహంలో పెట్టె హింసలు  -ఆడ, మగా యిద్దరూ సరి లేరని చెబుతుంది .  యిలా ఏ రంగం చూసినా  అన్నీ  దిగ జారి పోతూ వుంది. 

సరే . మన భారత రాజకీయ ప్రపంచం   అన్నిటి కంటే - చాలా, చాలా కంపు కొడుతోంది . ఎవరెంత లంచం తింటున్నారన్నది అంతు పట్టకుండా వుంది. తినే వాళ్లకు అస్సలు సిగ్గు భయం ఏమీ లేదు. వారిని సమర్థించే  వాళ్లకు అంతకు ముందే లేదు. 

దేశాన్నీ కూడా ఏదైనా ధర వస్తే అమ్మే లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు.  మరి రాజకీయాల్లో  దీర్ఘ దర్శి  ఎవరైనా  వున్నారా? మన రాష్ట్రంలో జయప్రకాశ్ నారాయణ్  లాంటి వారున్నా - వారికి మనం వోటు వెయ్యమ్ కదా. 

మోడీ గారున్నారు. వారు, కుల మత రాజకీయాలు , ఎప్పుడూ నాకు లేదు. యిక మీదట కూడా  నాకొద్దు - అని వొక్క మాట అంటే - వారు ఫరవాలేదు. ఆ వొక్క మాట వారి నోటి నుండి ఊడి పడుతుందా ? ఊహూ. నిజానికి ఆయన ఎవరికీ అన్యాయంగా ప్రభుత్వం నడపడం లేదు. కానీ వొక ముద్ర పడింది . అది సులభంగా  పోతుంది - ఈ వొక్క మాట అంటే. అంటే - అది దీర్ఘ దర్శిత్వం.   కానీ అనరు. 

ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి చదువులు, ఇలాంటి టీవీలు - వీటి మధ్య పిల్లల్లో దీర్ఘ దర్శిత్వం ఎలా వస్తుంది? 

వొకే ఆశా దీపం వుపాధ్యాయులు.  వీరి  ద్వారానే - యిటువంటి  మౌలిక సూత్రాల  బోధన జరగాలి. 

పిల్లలందరి  మానసిక దృక్పథం మార్చవచ్చు . వొక్క వారం రోజుల్లో , పిల్లలలోని అన్ని అవగుణాలు, అలసత్వము, పోగొట్ట వచ్చు . వారిలో మానసిక దృఢత్వం , లక్ష్య సాధన పై ఎకోన్ముఖత్వం - అన్నీ కలిగించ వచ్చు . ఉపాధ్యాయులు ఈ పనికి పూనుకుంటే . 

మళ్ళీ పంచ తంత్ర కథలు రావాలి . దానిపై దీర్ఘమైన పరిశోధనలూ జరగాలి. వాటిని వివరించి చెప్పే నేర్పు ఉపాధ్యాయులకు  కలగాలి.  అలాగే, వేమన శతక  పద్యాలు, సుమతి శతక  పద్యాలు - ఏవేవి నేటికీ పనికొస్తుందో - అవి నేర్పాలి. 

ఉదాహరణకు -

తన కోపమె తన శత్రువు 
తన శాంతమే తనకు రక్ష , దయచుట్టంబౌ   
తన సంతోషమె స్వర్గము 
తన  దుఃఖమె నరకమండ్రు , తథ్యము సుమతీ.   

యిది మన వాళ్ళ దీర్ఘ దర్శిత్వానికి  చాలా గొప్ప తార్కాణము . యిది వివరించి పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు వుండాలి . ఇలాంటివి  నేర్పకుండా - బాబాబ్లాక్ షీప్ లాంటి ఏమాత్రమూ ఉపయోగ పడని  ఆంగ్ల పద్యాలు మాత్రం నేర్పుతున్నాము. వీటిలో చాలా పద్యాలు మంద బుద్ధులనే తయారు చేస్తున్నాయి . 

రెండు మార్కులు తగ్గాయని ఆత్మ హత్య చేసుకునే పిల్లలు, మానసిక రోగాలతో సతమత మయ్యే పిల్లలే ఎక్కువవుతున్నారు. తల్లిదండ్రుల సలహాలను  ఏ మాత్రం ఖాతరు చేయని పిల్లలు ఎంతో మంది . 

వొకాయన IAS రిజల్టులో , తన నెంబరు కు ఎదురుగా, వేరేవరిదో పేరుందని  ఆత్మ హత్య చేసుకున్నాడట మొన్నటికి మొన్న. అంత మానసిక దుర్బలత్వం వున్న వాడు - నిజ జీవితం లో ఎలా రాణిస్తాడు ? జీవితపు ఆటుపోట్లను ఎలా ఎదుర్కొంటాడు? ఆయన తెలివి గల వాడే - కానీ   దీర్ఘ దర్శిత్వం ఏ మాత్రమూ లేని వాడని తెలుస్తుంది . ఆయన కలెక్టరైతే మనం  ఎలా బాగు పడతాం ?  

వీటన్నిటికీ కారణం - మన విద్యా విధానంలో - సరైన బోధన, శిక్షణ లేకపోవడమే . 

తల్లి దండ్రులను గౌరవించాలని వుపాధ్యాయుడు  చెప్పాలి . అది జరగడం లేదు . అలాగే - ఎక్కువ సమయం టీవీ  చూడ రాదని , ఆడ-మగ పిల్లల స్నేహాల్లో పరస్పర గౌరవం  వుండాలని, యిలా ఎన్నో, ఉపాధ్యాయుడు  చెప్పాల్సిన అవసరం వుంది . ఈ వొక్కొక్క విషయానికీ - పిల్లలకు మార్కులు వుండాలి . 

పాసు కావడం పాఠాల్లో మాత్రం కాదు. మనిషి వ్యక్తిత్వ లక్షణాల్లో  కూడా వుండాలి. అదే సరైన బోధన, శిక్షణ. 

దీర్ఘ దర్శి గా మనం పరిశీలిస్తే - మన సమాజం బాగుపడటం - పాఠ శాల  నుండే    ప్రారంభం కావాలి . ఉపాధ్యాయుడి బోధనా పధ్ధతి నుండే ప్రారంభం కావాలి. 


ఈ విషయం ప్రతి వొక్కరూ  - గొంతు విప్పి , కలం విప్పి - ప్రభుత్వానికి , విద్యా యంత్రాంగానికి , ఉపాధ్యాయులకు చెప్పాలి . ఈ వొక్క మార్పు రావాలి. మనం తీసుకు రావాలి . 


యిది వొక్కటే - మిగతా అన్ని మార్పులకు మూల కారణం కాగలదు  

శుభం భూయాత్ 

= మీ

వుప్పలధడియం విజయమోహన్  
  





.