5, మే 2011, గురువారం

పంచ మహా యజ్ఞాలు చివరి మాట = అమృతం మీ చేతిలో వుంది! = మీరు దేవతలా? రాక్షసులా?

పంచ మహా యజ్ఞాలు 
చివరి మాట 

యింత వరకు మనం చూసిన ఐదు యజ్ఞాలు - దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. 

అంటే - ప్రపంచం లోని - దాదాపు ప్రతి ప్రాణి పట్ల - మీ కర్తవ్యం ఏమిటో చూసాము.
ఈ ప్రపంచం లోని అన్ని ప్రాణులూ - వొకటి  పై మరొకటి  ఆధార పడి ఉన్నదన్న  సత్యాన్ని - ఈ యజ్ఞాలు గుర్తు చేస్తాయి. 

మీరు ప్రార్థిస్తే - దేవతలు సంతోష పడితే - దాని అర్థం ఏమిటి? దేవతల సంతోషం కూడా - కొం త వరకు, మీ ప్రార్థనలపైన ఆధార పడి వుందనా? 

ఆధార పడక పోయినా - వారు సంతోష పడతారన్న మాట నిజమే.

ప్రకృతి శక్తులు (దేవతలు) ప్రపంచంలోని - ప్రతి ప్రాణినీ - సమానం గానే చూస్తారు.
 
వొక్క మానవుడి విషయం లోనే - ప్రకృతి శక్తులు - కొంత భిన్నంగా నడుచు కుంటాయి 
.
 ప్రార్థన చేయ గల, అర్థించ గల, ప్రకృతి శక్తుల పనికి తోడు పడ గల , లేదా, వాటి పనికి, కొంత అడ్డు పడ గల - శక్తి  వొక్క మనిషికే వుంది. 

మనిషి వొక్కడే - ప్రకృతి శక్తుల శక్తి ని అధిగమించి  - తన లోని పరమ తత్వాన్ని, దైవత్వాన్ని, సిద్ధింప చేసుగోగల  సమర్థుడు.  ఆ ప్రయత్నంలో, వొక భాగమే, పంచ మహా యజ్ఞాలు. 

ఏనుగు కానీ, సిం హము కాని - వొకరికొకరు సహాయం చేసుకోవాలని - ఎప్పుడూ అనుకోలేవు. పాము, కప్ప సఖ్యంగా వుండటం - మనం చూడలేం.వొక్క కార్టూన్ ఫిల్ములో తప్ప.

మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం.
అలాగే - మనిషితో మాత్రమే - సఖ్యంగా వుండటం, ప్రతి ప్రాణికీ సాధ్యం. లేదంటే - వాటి గుణం - స్వజాతితో సఖ్యం విజాతితో విరోధం. స్వజాతిలో కూడా - కేవలం, స్వప్రయోజనాలకోసమే సఖ్యం. లేదంటే - విరోధం సహజం.

అంటే  -  మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం. అంటే - మనిషిలో మాత్రమే  - దైవత్వపు చాయలు  పూర్తిగా వున్నాయి. ప్రతి ప్రాణిలోనూ, తనను తాను చూసుకోగలడు. తనలో, ప్రతి ప్రాణినీ చూడ గలడు.
ప్రతి ప్రాణినీ, తన ప్రేమతో, దయతో - కట్టి పడేయగలడు. అంతకు మించి క్రూరత్వం వుంటే - సంహరించనూ గలడు.  ఇదీ దైవత్వమే.   

మనిషి తనలోని దైవత్వంతో , మనం చూసిన పంచ మహా యజ్ఞాల ద్వారా,  ప్రకృతికి ఎంతో తోడుపడ గలడు. ఆ ప్రయత్నంలో - తన జీవితాన్ని కూడా, ఆనందమయం చేసుకో గలడు.

కాని - స్వార్థం తలెత్తితే  - మనకు, ప్రకృతి శక్తులూ, ఎదురు నిలుస్తాయి. దైవం కూడా ఎదురు నిలుస్తుంది. 

అప్పుడు - సాధారణ మృగాల లాగా - ప్రకృతి శక్తి ముందు, మనం సమసి పోతాం.
సరే. పంచ మహా యజ్ఞాలలో - మనం చూడని వొకే వొక ప్రాణి - "మనమే".  అంటే - మీరే.

నిజమా? కాదు. సర్వే జనాః  సుఖినో భవంతు - అంటే, ఆ అందరిలో, మీరు వున్నారా, లేదా? ఉన్నారుగా!

మనం, ముఖ్యంగా; చాలా, చాలా, ముఖ్యంగా - గుర్తు పెట్టుకోవలసిన గొప్ప నిజం వొకటుంది.
మీరు - మీకోసం, మీ స్వార్థం కోసం  చేసే ప్రయత్నాలలో - మీకు వచ్చే సుఖం, ఆనంధం చాలా తక్కువ. సాధారణ జంతువులకొచ్చే ఆనందమే మీకూ వస్తుంది. అంతే.

కానీ- మనం చెప్పుకున్న - పం చ మహా యజ్ఞాలలో, మీ కొచ్చే ఆనందం, అలౌకికం, దైవీకం, వెల కట్ట లేనిది.

అందుకే  - నిస్స్వార్థ సేవ చేసే వారి ముఖంలో - ఎప్పుడూ, (ఎంతో) ఆనంధం, చిరునవ్వు  వుంటుంది.

స్వార్థపరుల ముఖాలలో, మనస్సులో - ఆనందం చాలా తక్కువ, అశాంతి చాల ఎక్కువ. ఎందుకంటే - స్వార్థం మృగ లక్షణం గనుక . 

మీరే  చూడండి . మీకే తెలుస్తుంది.

చిన్న కథ -

దేవతలకూ, రాక్షసులకూ,  చేతులు వంగకుండా గట్టిగా కట్టివేసాడట దేవుడు.  తరువాత, వారి  వొక్కొక్కరి దోసిలిలో , అమృతం పోసి - తాగమన్నాట.

రాక్షసులు - కట్టిన చేతులు వంచలేక, అమృతం తాగడానికి, నానా అవస్థలూ పడి, చేతుల్లోని అమృతం క్రింద పారబోసుకున్నారట.

దేవతలు - కట్టిన చేతులలోని అమృతాన్ని,తమకు ఉపయోగ పడక పోయినా - ఎదుటివారికి, తమ దోసిలితో , త్రాగిం చారట. అలా, దేవతలందరికీ, ఎవరో, వొకరు త్రాగిపించారట. 

నిస్స్వార్థంతో, ప్రేమతో,  అమరత్వాన్ని సాదించ వచ్చునని వారు తెలుసుకున్నారు.

మనమైనా అంతే. మనకైనా అంతే.  

మీ చేతులు మీకు  కనిపించని త్రాళ్ళతో కట్ట బడి వున్నాయి. మీ చేతులలో, ప్రేమ అనే అమృతం వుంది. అది మీరు త్రాగలేరు. కాని, పది మందికి త్రాగించ గలరు. 

మీరది చేయాలే గాని - వందలాది, వేలాది, లక్షలాది చేతులు - ప్రేమనే, ఆనందమనే, అమృతంలో - మిమ్మల్ని ముంచెత్తుతాయి. 

యిక - ఆలస్యం వద్దు. ...రండి. ...పదండి ముందుకు; 

- మీ

వుప్పలధడియం విజయమోహన్ .

పంచ మహా యజ్ఞాలు - 5 వ వ్యాసము = భూత యజ్ఞము = పంచ కవ్యం ఏమిటి? = చెట్లతో మాటలు = కాకికి అన్నం

పంచ మహా యజ్ఞాలు - 5 వ వ్యాసము
 భూత యజ్ఞము 

సర్వ ప్రాణులనూ - మనం భూతములనే పిలుస్తాము. భూతమంటే - పుట్టినదని అర్థం. 
సంభూతము - అంటే - బాగా పుట్టినదని - ఏదో వొక మాతృక నుండి పుట్టిందని చెప్ప వచ్చు.

పుట్టిన ప్రతి దానికి - మరణం తథ్యము! 

మరి పంచ మహా భూతాలంటాము గదా?భూమి, జలము, తేజస్సు (అగ్ని), వాయువు, ఆకాశము - 

మరి వాటి సంగతేమిటి ? అవి కూడా - సృష్ట్యాదిలో - పుడతాయి. సృష్ట్యంతములో వెళ్ళిపోతాయి. 

మళ్ళీ సృష్ట్యాదిలో - పుడతాయి. సృష్ట్యంతములో వెళ్ళిపోతాయి. యిది వేదాంతము.

ఈ వేదాంతము జోలికి యిప్పుడు  మనం వెళ్ల నవసరం లేదు. వెళితే - అది వొక బ్లాక్ హోల్ - లాంటిది.  అందులోనుండి - ఇప్పుడప్పుడే, బయటికి రాలేము.

యిప్పుడు, భూత యజ్ఞం అంటే - మొదటి నాలుగు యజ్ఞాల తెగలలో - మనం చూడని ప్రాణులన్న మాట. వాటి కొరకు  మనం చేసే నిస్స్వార్థ సేవనే - భూత యజ్ఞం అంటారు.

అంటే - దేవతలు (పంచ భూతాలతో సహా) , ఋషులు, పితృ దేవతలు, మనుష్యులు - కాక, మిగతా ప్రాణులన్నీ కూడా , ఏదో వొక సృష్టి ప్రయోజనం కోసం పుట్టినవే. వాటి ప్రయోజనం నెరవేరడానికి - మానవులుగా, మనం అందించే సహాయమే భూత యజ్ఞము.

యిది కాక - అవి మనకు అందించే సహాయమూ - చాలా వుంది. వాటికి మనం కృతజ్ఞత తెలుపవలసిన అవసరమూ చాలా వుంది. యివన్నీ - భూత యజ్ఞం కోవ లోకే వస్తాయి.

సరే. ఈ భూతాలలో,అంటే, ఈ ప్రాణులలో -మొట్ట మొదటగా - మనం గౌరవించ వలసిన ప్రాణి  - గోమాత.

ఆవును - మాతృ సమానురాలన్నాము. గోవు మనకు యిచ్చేట టువం టి - గోమూత్రం, గోమయం, క్షీరం, దధి, ఘ్రుతం - అన్నిటినీ కలిపి పంచ కవ్యం  -  అని అంటారు.

ఈ పంచ కవ్యం లో - వొక్కొ క్కటికీ, తన తన , ప్రత్యేక, ఔషధ  గుణాలున్నప్పటికీ -   అన్నిటినీ - తగు పాళ్ళలో కలిపిన పంచ కవ్యానికి  - మరెన్నో, ఔషధ  గుణాలున్నాయని  చెబుతారు.

ఇదిలా వుంచితే - యివన్నీ - మనిషికి  ఉత్తమోత్తమమైన  "సత్వ" గుణాన్ని కలిగించేవిగా కూడా మనం తెలుసుకోవాలి.

ఆవు పాలూ పాలే. గేదె పాలూ పాలే. 

విటమిన్లూ , ప్రోటీన్లూ వొక ప్రక్కన  వుంచితే - మనిషికి  "ప్రశాంతతనూ, సంతోషాన్నీ  జ్ఞానాన్నీ" - ఎక్కువగా యివ్వ గలిగేది    - ఆవు పాలే నని చెప్పొచ్చు.అందుకే - మహర్షులు , గురువులు, దేవతలు కూడా  - ఆవులను ఎక్కువగా చేరదీసారు. ఆవు పాలకు  వొక ముఖ్యత్వాన్ని - ఆపాదిం చారు.

మీరూ  చూడండి. ఆవు మోహంలో కనిపించే ప్రశాంతత - మరే ప్రాణి మొహంలో నైనా తెలుస్తుందేమోనని.  

మీకు - ఆ ప్రశాంతత, ఆ సంతోషము కావాలంటే -  ఆవు నాశ్రయించండి. ఆవిను, అన్ని విధాలుగా కాపాడండి.

ఏ ముఖ్యత్వమూ లేకుంటే - మన వారు, దేవుడి పూజకు ముందు  ఆవుకు పూజ చేస్తారటండీ?  భూత యజ్ఞం లో ప్రథమ స్థానం ఆవుకే. 
సరే. సంక్రాంతి తరువాతి రోజు  - మనం పశువుల పండగ జరుపుతాం గదా. అందులో - మన పెంపుడు పశువులన్నీ చేరుతాయి. వాటన్నిటికీ -  పూజ చేస్తాం గదా. అదీ భూత యజ్ఞమే .

ఎన్నో జంతు స్వరూపాలకు - మనం దైవత్వాన్ని ఆపాదిం చి పూజిస్తాము. మత్స్య , కూర్మ, వరాహ, నాగ, గరుడ, భైరవ, నెమలి, ఏనుగు, సింహము, పులి లాంటి చాలా జంతువులకు దైవత్వాన్ని ఆపాదించి పూజిస్తాము.

వాటిని - బలమైన, కారణము లేకుండా, చంపాలని అనుకోము. యివన్నీ, వున్న అడవులను - నాశనం చేసే వుద్దేశమెప్పుడూ  - భారత దేశం లో లేదు. కానీ - అడవులను వదలి, మనుషులపై బడి, చంపేటటువంటి క్రూర మృగాలను  - మాత్రము, వేట ఆడి - క్షత్రియులు సంహరించేవారు. 

వొక్కొక్క పెంపుడు జం తువుకూ - వొక్కొక్క ప్రయోజనం వుండేది.  గుర్రాలను స్వారీకి ఉపయోగిస్తే - గాడిదలను, చాకలి బట్టలకు వుపయోగించారు. ఎద్దును, దున్నడానికి, కుక్కను - యింటి బయట కావలికి ఉపయోగించారు. కుక్క విశ్వాసాన్ని, యింటి బయటనే  వుపయోగిం చుకున్నారు. - లోపల కాదు - ఈ నాటి లాగా.
విశ్వాసము లేని జంతువులను ( పిల్లి ??), క్రూర మృగాలను - మన వాళ్ళు పెంచ లేదు. కానీ, అనవసరంగా చంపనూ లేదు. చీమల్లో కూడా - సాధు చీమలను, దేవుడి చీమలన్నారు. వాటి కోసం , ప్రతి రోజూ - యింటి ముందు, ముగ్గులు వేసే సమయంలో - బియ్యపు పిండి ( చాక్ పీసు కాదు) ఉపయోగించే వారు. ఇది - అవి తినటానికే.. 

మరి, కుట్టే చీమలు, కీటకాలు లోపలి రాకుండా, పేడ లాంటివి వాడేవారు. 

అన్నం తినే ముందు - యింటి ముందు, లేదా యింటి పైన, కాస్తా  ఎత్తయిన ప్రదేశంలో, కాకులకు, యితర  పక్షులకు వండిన అన్నం పెట్టే వారు. యిందుకు, ఎన్నో కారణాలు చెబుతారు. ఈ కాకులు, మిగతా పక్షులోచ్చే చోట - పాములు రావు. యిదొక ముఖ్య కారణం. కాకుల వల్ల, మనకొచ్చే పెద్ద ప్రమాదం లేదు కానీ -  పాముల వల్ల వుంది కదా. 

యిలాం టి పద్ధతులు - ఎన్నో వున్నాయి. అయితే - మిమ్మల్ని కరవగలిగే పాము మీ మీదికి వస్తుంటే - చంపొద్దని మన వాళ్ళు  ఎప్పుడూ చెప్ప లేదు.  మిమ్మల్ని చంపి తినడానికి, పులి మీ  మీద పడితే - చంపొద్దని మన వాళ్ళు  ఎప్పుడూ చెప్ప లేదు. మిమ్మల్ని - మీరు రక్షించుకోవడం కూడా ముఖమైన యజ్ఞమే. 

నిజానికి - ధ్యానానికి - జింక చర్మము  గాని,  పులి చర్మము గాని (దర్భ పైన) వేసుకుని, దానిపై తెల్లని గుడ్డ వేసుకోవడం శ్రేష్టమని -  గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. అది యోగులకు ఉపయోగకారి అన్నాడు.అంటే - అహింస ఎంత వరకు, ఎప్పుడు , ఎంత హింస వాడవచ్చుననేది - మన వారు - ఈ పంచ మహా యజ్ఞాలద్వారా - చాలా నిర్దిష్టంగా చెప్పారు.

ముఖ్యమైనది - మీ మనస్సులో - అమాయక ప్రాణుల పట్ల - దయ వుందా. మీరు వాటి రక్షణకై ఏమైనా చేస్తున్నారా?

అంతే.  అందుకని, మరీ అతిగా చేయనవసరం లేదు - మీరు మహా యోగులైతే తప్ప. వొక సారి, వొక యోగి, శిష్యులతో నది వొడ్డున వెళుతూ వున్నాడు. నదిలో, వొక తేలు మునిగి పోతూ కనిపించింది.  యోగి  గారు - ఆ తేలును, చేతితో పట్టి బయట పెట్టారు. తేలు బ్రతికింది - కాని, బ్రతికించిన యోగి చేయిని కుట్టింది. యోగికి  చేయి బాగా నొప్పి పెట్టింది. శిష్యులు  - ఎందుకండీ, గురువుగారూ, తేలును బ్రతికించారు?  దాని బుద్ధి అది మానలేదు చూడండి. బ్రతికించిన  మిమ్మల్నే కుట్టింది - అన్నారు. 

గురువుగారు - అవును. కుట్టే దాని బుద్ధి, అది మాన లేదు. బ్రదికించే  నా  బుద్ధి నేను మాన లేను - అన్నారు.

అదండీ భూత యజ్ఞం లో పారాకాష్ఠ. మీరు మాత్రం  - మీ చేత ఐనటువంటి భూత యజ్ఞం చేయండి.

మన సంస్కృతిలో - చెట్లకు, నీటి ప్రవాహాలకు,  కొండలకు చాలా ప్రముఖ స్థానం వుంది. వీటన్నిటికీ ప్రాణముందనీ -  వొక విలక్షణమైన - వ్యక్తిత్వము కూడా వుందనీ - మన నమ్మకం. హిమాలయాలు లేని భారత దేశమే లేదు. అలాగే, వింధ్య పర్వతాలు. మరెన్నో పర్వతాలు.

గంగ మన తల్లి అంటాము. గోదావరి మన తల్లి అంటాము. స్వచ్చమైన, గంగా జలాన్ని , కల్మషం చేసి - ఆ నీటిని శుభ్రపరిచి, 10 -15  రూపాయలకు చిన్న బాటిల్సు లో కొనుక్కునే స్థితి వచ్చేసింది .
అడుసు త్రొక్క నేల - కాలు కడుగనేల -  అంటారు. శుభ్రమైన గంగనీళ్ళను - కల్మషం చేయనేల. కల్మషం నీళ్ళను మళ్ళీ శుభ్రము చేయ నేల - అనే స్థితికి వచ్చేశాము.

కొన్ని దశాబ్దాల క్రితము - వీర బ్రహ్మము లాంటి యోగులు - చెప్పారట - ముందు, ముందు , నీళ్ళను కొనుక్కునే దుస్థితి వస్తుందని.    మన స్వార్థము వలన ఆ దుస్థితి  వచ్చేసింది. 
యిప్పుడు, గాలిని కూడా - విపరీతంగా కల్మషం చేస్తున్నాము. గాలి కూడా - మళ్ళీ శుభ్ర పరిచి , మనమే కొనుక్కో వలసిన పరిస్థితి- మనమే తెస్తున్నాము.

దేవుడిచ్చిన శుభ్రమైన నీళ్ళను, గాలిని - కొందరు చేరి కల్మష పరిచి, దాన్ని కొందరు శుభ్రపరిచి, మళ్ళీ, అందరూ, కొనుక్కోవడం -  హాస్యాస్పదం కాదా? 

 చెట్లు మనకు ఎలా ఉపయోగ పడతాయో - మరో వ్యాసంలో- రాసాను. మనం పీల్చే ఆక్సిజను చెట్లే మనకు యివ్వ గలవు. కాంక్రీటు రోడ్డు యివ్వలేదు. మనం విడిచే కార్బను డై ఆక్సైడును విడగొట్టి - కార్బనును వేరుగా చేసి, ఆక్సిజను వేరుగా చేసి - వాతావరణ కాలుష్యాన్ని నివారించి - మన ప్రాణాన్ని నిలుపగల శక్తి, చెట్లకు మాత్రమే వుంది. మన 8 అంతస్తుల భవనాలకు లేదు.  వర్షాలు తెప్పించ గల శక్తి చెట్లకే వుంది. వైద్యానికి కావలసిన అన్ని మూలికలనూ యివ్వగల శక్తి చెట్లకే వుంది. 

మీకు తెలుసా - ప్రకృతి ద్వారా వచ్చిన ఏ వ్యాధి కైనా - మందు, ప్రకృతి లోనే వుంది - ముఖ్యంగా చెట్లలోనే వుంది.

మందు లేని వ్యాధి ప్రకృతిలో లేదు. చెట్లకూ ప్రాణం వుందన్న సంగతి మన వారికెప్పుడూ తెలుసు. తులసికీ, రాగిచేట్టుకూ, బిల్వానికీ, మరెన్నో చెట్లకు - మనం దేవుడి స్థానం కల్పిస్తాము.

చాలా చెట్లు - గుళ్ళలో - తప్పకుండా వుండాలంటాము. చెట్లనే  - గుళ్ళుగా  మార్చి, దాని చుట్టూ మనం తిరగడం కూడా వుంది. 

మీ మాటలను, మీ చేతలను - యింతెందుకు  , మీ ఆలోచనలను కూడా -  చెట్లు గ్రహించ గలవు. చెట్లను ప్రేమించం డి. చెట్ల నూ గౌరవించండి. చెట్లు మీకు ఎంతో మేలు చేస్తాయి.

కాని - అవి మనకు చేయగలిగే మేలు - మనం వాటికి చేయ గలిగే మేలు - మనం మరిచి పోతున్నాము. 

అందుకే మనకు - భూత యజ్ఞం తప్పక కావాలి.

ఈ రోజు నుండి - 

(1 ) ఏదో వొక చెట్టుకు మీరు నీళ్ళు  పోయడము, ఎరువు వేయడము చేయండి. 
(2 ) ఆ చెట్టుతో మాట్లాడడానికి ప్రయత్నించండి.
(3 ) ఆ చెట్టుకు - మీ ప్రేమ, ఆదరణ తెలియ చేయండి. 
(4 ) మీకు తెలుసా- యిదొక యోగ శాస్త్ర  ప్రక్రియ అని.
(5 )  కాకికి  ప్రతి రోజూ, కొద్దిగా అన్నం పెట్టి చూడండి.
(6 ) మరెవరికీ హాని చేయని - జంతువుతో స్నేహం చేసి చూడండి. ఆ జంతువుతోనూ - మాట్లాడండి.
(7 )  ఆవులను పెంచే ఏ గుడికైనా, ఆశ్రమానికైనా - ఆవులను పెంచడానికి - విరాళాలివ్వండి. ఆవులను పెం చ గలిగితే - చాలా  మంచిది. లేదంటే - పెంచే వ్యక్తికి - ప్రోత్సాహమివ్వండి.

భూత యజ్ఞంలో - మరేమేం చేయ గలరో - యోచన చేసి - చేయండి. మీ జీవితం చాలా మారుతుంది.

మరో చిట్టా చివరి - చిన్న వ్యాసం కూడా వుంటుంది  . అదీ చదవండి - ఆ అంశం పైనే.   

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

4, మే 2011, బుధవారం

పంచ మహా యజ్ఞాలు -4 వ వ్యాసం = మనుష్య యజ్ఞం = "ఈ రోజు - మీరు కనీసం యిద్దరిని సంతోష పెట్టాలి"

పంచ మహా యజ్ఞాలు -4 వ వ్యాసం 
మనుష్య యజ్ఞం 

మానవ సేవే మాధవ సేవ - అన్న ధర్మం మనకు, మొదటినుండి వుంది. 

కానీ ఈ కాలం లో - మానవ సేవకు మాత్రమే -ప్రాధాన్యత నిస్తున్నారు.
పంచ మహా యజ్ఞాలలో - ప్రతి యజ్ఞానికీ ప్రాధాన్యత  వుంది.
మనం - ప్రకృతిని - బాగా చూసుకుంటే - మనలో, ఎవరికీ, దరిద్రమంటూ  వుండదు. వుండాల్సిన అవసరమే లేదు.

ప్రకృతిని ఎండబెట్టిన - ఏ దేశమూ, ఏ ప్రాంతమూ  బాగుపడలేదు. 

అదే విధంగా - తమ తమ తల్లిదండ్రులను, తమ, తమ పిల్లలనూ -   బాగా చూసుకునే సమాజంలో - మానవ సేవ చేయించుకోడానికి మనుషులెవరు? ఎక్కడుంటారు?

భారత సంస్కృతిలో - మనుష్య యజ్ఞానికొక విలక్షణమైన అర్థం వుంది.
"అతిథి దేవో భవ" అంటే - అతిథి అన్న వాడు, దేవుడితో సమానమని అర్థము.


మన సంస్కృతిలో - నువ్వు యిచ్చేది గొప్ప కాదు. అతిథి పుచ్చుకోవడమే గొప్ప. 

యిచ్చేవాడు గొప్ప కాదు. పుచ్చుకునే వాడే గొప్ప.

యివ్వ గలగడం దానం కాదు. అతిథి పుచ్చుకోవడం ,అతను మనకిచ్చే ఆశీర్వాదం, వరం - అని అంటారు. అంటే - మీరు, ఎటువంటి వారిని , అతిథులుగా పిలవాలో - నిర్ణయించుకోండి.

అతిథి కాని వారికి - ఇచ్చేది దానం.

దానాల్లోనూ - "అపాత్ర దానము" చేయరాదని మనకొక గొప్ప సామెత వుంది.  బాగా తిన్న వాడికి, క్రూరుడికి, బద్ధకస్తుడికి, దొంగకు, కామ శీలుడికి -  యిటువం టి వారికి - దానం చేయడం వలన - పాపం వస్తుందే తప్ప మరేమీ రాదు అని కూడా చెబుతారు.

దేవ, ఋషి, పితృ యజ్ఞాలకు  - మన భక్తి, గౌరవమూ ఎలా కారణాలౌతాయో, అలాగే, మనుష్య భూత యజ్ఞాలకు, ముఖ్యంగా మన ప్రేమ, గౌరవాలు , కొంతవరకు మన దయ, కారణాలుగా వుంటాయి.

ప్రతి మనిషి లోనూ - మిమ్మల్ని, మీరు చూడ గలగాలి. 
మీలో - ప్రతి మనిషినీ మీరు చూడ గలగాలి. 
అందుకే మనుష్య యజ్ఞం. అదే మనుష్య యజ్ఞం.


కాళ్ళూ చేతులూ లేని వారిని  చూస్తే - మీలో దయ, ప్రేమ  వస్తుందా, రాదా? వారికి ఏం కావాలో - మీరు చేస్తారా, లేదా?

అనేక రోగాలతో బాధ పడే వాళ్ళను చూస్తే - మీలో దయ కదలాడుతుందా, లేదా?

చదువుకునే బ్రహ్మ చారి - మీ యింటి ముందు నిలిచి, అహంకారాన్ని పూర్తిగా జయించి, "భవతి బిక్షం దేహి" అంటే, మీలో గౌరవమూ రావాలి, దయా రావాలి. వస్తుందా, లేదా?

వూరికే కూర్చుని తినాలనుకునే - బద్ధకస్తుడిని చూస్తే - వారికి సరైన దండన కూడా ఈవాలి. అటువంటి బద్ధకస్తులను పోషించడం -  మనుష్య యజ్ఞం కాదు.

మనుష్య  యజ్ఞంలో - మన "పాత్ర నిర్వహణ" అనే యజ్ఞం కూడా వుంది.

మీరు - మీరు మాత్రం కాదు. మీరు - (1 )  వొక కొడుకు / కూతురు (2 ) వొక తండ్రి / తల్లి (3 ) వొక భార్య / భర్త  (4) వొక అన్న / తమ్ముడు / అక్క / చెల్లెలు  (5 ) వొక స్నేహితుడు (6 ) రాజు / సేవకుడు  - ఇలా, మీరు ఎన్నో పాత్రలను - సమర్థ వంతం గా పోషించడం కూడా - వొక రకంగా మనుష్య  యజ్ఞమే . 

ప్రతి చోట - మీరు పుచ్చుకునే జీతానికో, మరోకటికో -  ముడి పెట్టకుండా, మీరు పంచగలిగే ప్రేమ, సుఖానుభూతి,  శాంతి ఎంతో వుంది.   


మీరు, మీ  అన్ని పాత్రలకూ, సరైన న్యాయంగా,  మీరు  చేయగలిగేధంతా,  మనస్ఫూర్తిగా, నిస్స్వార్థం గా - చేయ గలిగిన నాడు - మీరు చేసేదంతా - యజ్ఞం గానే వుంటుంది.

మంచి మాట, మనసుకు నచ్చే మాట చెప్పడం - కూడా వొక మహా యజ్ఞమే.


సత్యమైన మాట మాట్లాడండి ; ప్రియమైన మాట మాట్లాడండి. అప్రియమైన సత్యాన్ని - మాట్లాడ కండి. 

 "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్, సత్యమప్రియం" అన్నారు.

మీ మొహం అందంగా లేదని వారితో చెప్పాలా? మీ డ్రెస్సు మీకు అస్సలు నప్ప లేదని చెప్పాలా? మీ యింటి రంగు అస్సలు బాగు లేదని చెప్పాలా? ఇటువంటి సత్యాల కంటే - అసత్యాలే - మేలు కాదా. 

యిలా చెప్పడం యజ్ఞం కాదు కదా - నిజానికి, యివి పాపమని చెప్పచ్చు.  


అప్రియమైన సత్యాన్ని, ప్రియం గా చెప్ప గలిగే నేర్పు వున్న వాడు -  ఏదైనా చెప్పచ్చు. 

"మీ అమ్మ, నాకు కూడా అమ్మ లాంటిదే; ఏడవకు"  అనిచెప్ప గలిగే వాడికి, " నీ భార్య, నాకు కూడా భార్య లాటిదే" అనే తెలివి హీనుడికీ తేడా వుంది కదా. 

మనుష్య యజ్ఞం ఈ రెండింటి  మధ్య గల తేడాయే కదా.


అందుకనే అంటారు - మాటలతోనే  - స్వర్గానికీ తీసుకెళ్ళచ్చు. మాటలతోనే - నరకానికీ  తీసుకెళ్ళచ్చు - అని 


ప్రియమైన మాటలకు, ప్రియమైన చేతలకూ - మనుష్య యజ్ఞం లో ప్రముఖ స్థానం వుంది. 


మిమ్మల్ని - పది మందో, వంద మందో, వెయ్యి మందో మంచి వాడు - అని  అనుకుంటే - మీరు మనుష్య యజ్ఞం చేస్తున్నట్టే - అనుకోవచ్చు. 


గాంధీ గారు చేసింది ; థెరెసా  గారు చేసింది, మరెంతో  మంది - అనాథాశ్రమాల ద్వారా, వృద్ధాశ్రమాల ద్వారా, వికలాంగుల ఆశ్రమాల ద్వారా , మరెన్నో రకాలుగా - మనుష్య యజ్ఞం చేసారు, చేస్తున్నారు. 


మీ వలన - ఏ వొక్కరో, ఇద్దరో ఈ రోజు సంతోష పడితే - మీరు, కొంత మనుష్య యజ్ఞం చేసినట్టే. 


పుణ్యం ఎప్పుడో రాదు. యిప్పుడే వస్తుంది. పుణ్య ఫలం ఎప్పుడో రాదు. అదీ యిప్పుడే వస్తుంది. 


"ఈ రోజు - మీరు కనీసం యిద్దరిని సంతోష పెట్టాలి".  

నిస్స్వార్థంగా. 

వారి సంతోషంలో - మీ సం తోషాన్ని  చూడాలి.


చేస్తారా మరి. చేయండి.  మీకేం నష్టం లేదు. కష్టం లేదు.

మీ జీవితమే - మరో మలుపు తిరుగుతుంది.

అందమైన మలుపు. ఆనందమైన మలుపు.


మీరు మనుష్య యజ్ఞం లోని  రుచి - చూశారంటే - మళ్ళీ, మళ్ళీ చేస్తారు.


శుభం భూయాత్.


= మీ


వుప్పలధడియం విజయమోహన్ 

3, మే 2011, మంగళవారం

పం చ మహా యజ్ఞాలు -3 వ వ్యాసం - పితృ యజ్ఞం - మీకు "అదృష్టం" ఎలా వస్తుంది?

పం చ మహా యజ్ఞాలు -3 వ వ్యాసం 

పితృ యజ్ఞం 

ముందు వ్యాసాల్లో - 

దేవ యజ్ఞము, ఋషి యజ్ఞాలను  గురిం ఛి - చదివాము.

మూడవది పితృ యజ్ఞం.

యజ్ఞము - అం టే  "స్వార్థ రహితమైన, పరులకు వుపకారమైన" - కార్యము.

మనం మన కోసం చేసేది యజ్ఞం కాదు. పరుల కోసం చేసేదే యజ్ఞం.

ఈ యజ్ఞం చేయడానికి మనకున్న పరికరాలేమిటి?

మనకున్న ధన, ధాన్యాదులను- వొక పక్క నుంచితే -

మనలోనే నిక్షిప్తమైన మూడు అద్భుత శక్తులను  మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం వుంచుకోవాలి.

అవి -  మన జ్ఞాన శక్తి,  ఆలోచనా శక్తి,  క్రియా శక్తి.

ఈ మూడు శక్తులూ, వొకటిగా చేర్చి-  మనం చేసే పనులకు,  బలం చాలా  ఎక్కువ. ఫలితం చాలా ఎక్కువ. 

అందుకనే - మనం, "మనో, వాక్, కాయ, కర్మణా" - పని చేయాలని, మన అన్ని శక్తులూ వొకటిగా జోడించి, పని చేయాలని - మన ఋషులు చెప్పారు.

ఈ పంచ మహా యజ్ఞాలలో - దేవతలకు, ఋషులకు, పితృ దేవతలకూ, మిగతా  మనుషులకూ, భూత గణాలకు, జరిగే మేలు చాలా వున్నా- వారి ద్వారా - మనకు జరిగే మేలు అంతకంటే ఎక్కువ.

యిక - పితృ యజ్ఞం గురిం ఛి చూద్దాం. 
పితృ దేవతలంటే - చని పోయిన మన పూర్వీకులు మాత్రమే కాదు. 

బ్రతికి వున్న , మన తలిదండ్రులు - వారి సమానులు కూడా .

వారికి మనమిచ్చే గౌరవము, వారికి మనం చేసే సేవ, వారి పట్ల మనం ప్రదర్శించే శ్రద్ధా భక్తులు - యిదీ పితృ యజ్ఞమం టే.

మీరు, మీ పరిధిలో - మీ తల్లిదండ్రులకు , వారు ఉన్నప్పుడే, ఏం చేయగలరో - అవన్నీ చేసేయండి.
మన ఋషులు, గురువులు చెప్పడం ఎమిటంటే -  మీ పితృదేవతలు, బ్రతికి వున్నప్పుడు, వారిని సంతోష పెట్టండి.

ఏమేమి చేయ గలరో - అవన్నీ - చేసెయ్యండి. అది చాలా ముఖ్యం.

అందుకనే అన్నారు - మాతృ దేవో భవ; పితృదేవోభవ; ఆచార్య దేవో భవ - అని.
 
కానీ - ఈ కాలం లో , పెద్దవాళ్ళయిన కొడుకులతో వుండటానికే   - తల్లి దండ్రులు అంత యిష్టం చూపని పరిస్థితులు వస్తూ వుంది. తల్లిదండ్రులకు యిష్టం వున్నా- కొడుకుకో, కోడలికో - యిష్టం లేక పోవడమూ జరుగుతూ వుంది.  కొడుకులు, ఎక్కడెక్కడో - వుండడం వలన - యిద్దరికీ యిష్టం వున్నా, కలిసి వుండ లేని పరిస్థితులూ - వున్నాయి.

"వృద్ధాశ్రమాల" సంస్కృతి  అనివార్యమై పోతూ వుంది.

యిందులో - ఎవరి బాధ్యత ఎంత - అని వ్రేలెత్తి చూపడం - యిక్కడ కుదరదు - కాబట్టి -  మీరు ఏమేమి చేయగలరో, మీ బ్రతికి వున్న పితరుల సంతోషానికి - అవన్నీ చేసెయ్యండి - అని మాత్రము చెబుతున్నాను.
మీరు - ఏమేమి చేస్తారో - అవి - మీ పిల్లలు - భవిష్యత్తులో మీకు  చేసే అవకాశం కాస్త వుంది. 

తల్లిదండ్రులకు - ఏమీ చేయని వాడు - నేను సమాజనికి సేవ చేస్తాననడం - హాస్యాస్పదంగా వుంటుంది.

మీరు - ఏమి చేయగలరు ?


ప్రతి "మంఛి రోజు" కూ - వారికి నమస్కారం చేసి - వారి ఆశీర్వాదం పొందండి.  
 
మా నాన్న, మా అమ్మ నాకు ఎంత  చేసారో - అని వారు మీకు చేసిన త్యాగాలన్నీ - మీ భార్య / భర్త, స్నేహితులతో -
చెప్పండి. 

మీ అమా, నాన్నా ఎదురుగా కూడా చెప్పొచ్చు. వారిపై - మీకెంత గౌరవం వుందో, వారికీ తెలియనివ్వండి.

మీ ఆర్ధిక పరిస్థికి తగ్గని ఆర్ధిక పరిస్థితి - వారికి కలుగ జేయండి.

తల్లి దండ్రులతో -  ఎంత గౌరవం గా మాట్లాడినా -అది మీకు మేలే చేస్తుంది.

మీ తల్లిదండ్రుల - పితరుల గురిం ఛి తెలుసుకోండి. వారి పట్ల మీ గౌరవం తెలియచేయండి. వారి పేరు మీద - అన్న దానాలో, మరేదైనా - దానాలో - మీ తల్లిదండ్రులకు తెలిసేటట్టు చేయండి.
 
యిలా, మీరు ఎన్నో చేయొచ్చు. చేయాలని భావన రావాలి. అంతే. 

మన సంస్కృతిలో - సంవత్సరానికొక సారి - మరణించిన పితరుల కందరికీ పితృ యజ్ఞం జరిపే ఆనవాయితీ వుంది.

శ్రద్ధతో చేయాల్సిన కార్యం కాబట్టి - దాన్ని "శ్రాద్ధము" అన్నారు.

అది కాక, ప్రతి అమావాస్య నాడు - మన పితరులకు మాత్రమే కాక, చనిపోయిన అందరికీ - గౌరవం తెలిపే పద్దతిగా -  పితృ యజ్ఞం చేసే  పద్ధతి కూడా మనకుంది.  ఈ రోజుల్లో - మీకు తోచిన పద్ధతిలో - మీకు వీలున్న విధంలో - మీరు చెయ్యండి.
మనసు ముఖ్యం. మనసుం టే - మార్గాలెన్నో దొరుకుతాయి.

దీని వలన మీకేం లాభం. చాలా లాభాలున్నాయి. 

అదృష్టం - అనే మాట మీకు తెలుసు. 

కనిపించ కుండా -స్పష్టమైన కారణం తెలియకుండా -  మీకు వచ్చే లాభమే -  "అదృష్టం". 

అదృష్టమేనేది - మీకు ఈ పంచ మహా యజ్ఞాల వలననే  వస్తోందని  - మీకు తెలుసా?

దేవతలు - మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు   "అదృష్టం" వస్తుంది. 

ఋషులు, గురువులు - మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు   "అదృష్టం" వస్తుంది. 

మీ పితృ దేవతలు, మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు   "అదృష్టం"  వస్తుంది.

వొకరి "ఆశీర్వాదానికీ" -  మీ "అదృష్టానికీ"  - మీరు, మీ కనులతో  చూడ లేని - అతి పెద్ద లింకు   వుంది.

ఈ కాలం లో - పాశ్చాత్య దేశాలలో కూడా - "లా ఆఫ్ అట్రాక్షన్ " అనే వొక ప్రకృతి  ధర్మం పైన చాలా చర్చ జరుగుతూ వుంది. మీరు నిస్స్వార్థంగా అనుకునేది మీకు దగ్గరగా వస్తుందని - ఈ లా యొక్క సారాంశం.

నిజమే. యిది మన దేశంలో - మొదటి నుండి మనకు తెలుసు.

నిస్స్వార్థ  కార్యాలకు - దేవతలు - అంటే, ప్రకృతి శక్తులు "తథాస్తు" అంటారని,  మన శక్తికి వాటి శక్తిని జోడిస్తారని మనకు తెలుసు. అందుకే దేవ యజ్ఞం. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లాంటి దైవాంశ సంభూతులు కూడా -  దేవ యజ్ఞం చేసి గానీ - తమ పనులు మొదలు పెట్ట లేదు. అలాగే ఋషి యజ్ఞమూ, పితృ యజ్ఞమూ కూడా. వారి ఆశీర్వాదము - దేవతల ఆశీర్వాదానికి ఏ విధం గానూ తీసిపోదు.

మీరు - మీకోసం కోరే వాటికన్నా - మీ తలిదండ్రులు, మీ కోసం, కోరే వాటికి, బలం, ఫలితం, చాలా ఎక్కువ. వారు చేసేది, యజ్ఞం. మీరు చేసేది, మీరు అడిగేది - స్వార్థం.

యింకా యెంతో వుంది గాని -   మనసులో పడిపోతే - యిది చాలు. 

= మీ
వుప్పలధడియం విజయమోహన్


పం చ మహా యజ్ఞాలు - 2 వ వ్యాసము = ఋషి యజ్ఞం = కవి కాననిచో , ఋషి కాంచు నె య్యెడన్

పం చ మహా యజ్ఞాలు - 2 వ వ్యాసము

ముందు వ్యాసంలో - దేవ యజ్ఞం గురిం ఛి చూశాము.

భూమి నుండి  పుట్టి, భూమి నుండే,  ప్రతినిత్యం, ఆహారం నుండి, మందుల వరకు, సమస్తమూ  తీసుకుని,  పెరిగే - మన  చిన్ని   మెదడులో "యింత జ్ఞానం"  వుంటే -  యివన్నీ మనకిచ్చిన భూమికి మరెంత  జ్ఞానం వుంటుందో, మనం అర్థము చేసుకోవాల్సిందే.
   
 సూర్యుడు - మన ఆధారమైన - భూమి మనుగడకే ఆధారం. ఆటువంటి సూర్యుడికి  మరింకెంత జ్ఞానం వుంటుందో మనం అర్థము చేసుకోవాలి. 

అలాగే వాయువు, జలము, ఆకాశము - అన్నిటికీ - అపరిమితమైన పరిజ్ఞానము వుంది.  మన మనుగడకు కావలసిన వన్నీ యివ్వ గల శక్తీ వుంది. త్రిప్పి, వెనుకకు  తీసేసుకోగల సామర్థ్యమూ వుంది.

మన మాటలు, ప్రార్థనలు వినగల సామర్థ్యమూ వుంది.  అంతెందుకు.

మనం చెట్లు నాటడము కూడా దేవ యజ్ఞమే. తులసి చెట్టు, రాగి చెట్టు, మరెన్నో చెట్లను మనం దేవతలతో సమానంగా ఎందుకు  పూజిస్తామో తెలుసా? ప్రతి చెట్టు, ప్రతి పూవూ -ఏదో వొక దేవతకు ప్రీతి పాత్రమైనదని ఎందుకంటామో తెలుసా - వీటన్నిటికి శక్తీ నిచ్చే దేవతలను - వీటి ద్వారా మనం పూజిస్తున్నాము. మరి ఈ చెట్ల ఉపయోగం మనకూ కొంత తెలుసు. అవునా?

యిక ఋషి యజ్ఞాన్ని గురించి కొంత తెలుసుకుందాము.  

షి యజ్ఞం 

సప్తర్షులు, పతంజలి  లాంటి ఋషులు - మనకిచ్చిన జ్ఞానం అపారమైనది. మనకు తెలిసిన ప్రతి శాస్త్రాన్నీ, మనకిచ్చిన వారు మన ఋషులే.

ఋషులు - దేవతలకూ, మనుషులకూ - మధ్య, వారధి వంటి వారు. వారికి, స్వంతంగా కావలసిందేమీ లేదు.
మనకు అతి మూల్యమైన వజ్రం - వారి దృష్టిలో - మట్టిపెళ్ళ కంటే భిన్న మైనది కాదు. 

మనుషులలో - మహా పురుషులంటే - ఋషులే. కొన్ని దృక్కోణాలలో చూస్తే - దేవతల కం టే - ఋషులే గొప్ప వారు. ఆటువం టి వారి - ఆశీర్వాద బలం మనం ఎంత - అని చెప్పలేము. అందుకనే - తల్లులు, తండ్రులు  - తమ బిడ్డలకు - ఋషుల ఆశీర్వాదాలను ఇప్పించడానికి తహ తహ లాడుతారు.  విధినే మార్చ గల శక్తి  వున్న - ఋషులెంత మందో వున్నారు. రుషు యజ్ఞమం టే - అటువంటి ఋషులకు, గురువులకు - మనమేం చేయగలమో, అది చేయడము.  ఆ గురువులు కూడా, ఒప్రతి నిత్యమూ, తమ గురువులను ప్రార్థిస్తారు. 

ఋషి అయిన వాడే సరి ఐన గురువు కాగలడు. మిగతా వారు - ఉపాధ్యాయులుగా మాత్రమే - వుంటారు. ఈ కాలంలో కూడా - చాలా మంది, గొప్ప గురువులు భారత దేశంలో వున్నారు.  

మీరు - అటువంటి, ఏ గురువు దగ్గరి కెళ్ళినా -వారు ప్రతి రోజూ, పాఠం మొదలు పెట్ట డానికి  ముందు, వారి గురువులు, వా....రి గురువులు, ఆది గురువు వరకు   అందరికీ నమస్సులు చెప్పి, వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థింఛి, తరువాత పాఠం ఆరంభిస్తారు. ఇది, యిప్పుడు కూడా, వుంది.

"ఓం, సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీత మస్తు, మా విద్ విషావహైహీ..... ఓం శాంతిహ్;  శాంతిహ్; శాంతి హి..    , " అన్న ఉపనిషద్ వాక్యము  యిందుకే.

"సదాశివ సమారంభాం, (వ్యాస)శంకరాచార్య మధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం"  - అని  గురువులను స్మరించిన తరువాతనే - చాలా గురుకులాల్లో - యిప్పుడు కూడా, రోజువారీ శిక్షణను ఆరంభిస్తారు. కొంత మంది ఈ శ్లోకములో,  నారాయణ, రామానుజ పదాలను వాడుతారు.
.
సరే... మన మధ్య లేని ఋషుల గురింఛి అటు పెడితే - ఈ రోజు   మన మధ్య నున్న ఋషుల గురించి, గురువుల గురిం ఛి అనుకోవలసిన బాధ్యత   చాలా వుంది.

ఈ రోజు కూడా - మన మధ్య ఋషుల లాంటి గురువులు చాలా మంది వున్నారు.
స్వామి దయానంద, వారి అనేక శిష్యులు, స్వామి పరమార్థానంద, జగ్గి వాసుదేవ్, బాబా రాందేవ్,  స్వామి సుఖ బోధానంద,  శ్రీ శ్రీ రవి శంకర్, - లాటి మహానుభావులు  యింకా ఎంతో మంది వున్నారు.  

మీరు - వారి దగ్గరికి వెడితేనే, మీకు తెలుస్తుంది - మానవాళి కోసం - వారు - ఎంతెంత చేస్తున్నారని.     ఎంతగా శ్రమిస్తున్నారని. ఎన్నెన్ని నేర్పుతున్నారని. యిప్పుడు - వారి పాత ప్రసంగాలను - మనం, యు ట్యూబ్ ( ఇంటర్నెట్) లో కూడా విన వచ్చు. 

వినండి. ఎన్నో నేర్చుకుం టారు. మీ మనసు లోని, ఎన్నో ప్రశ్నలకు సులభ సమాధానాలు పొందుతారు. ఎంతో మనశశాంతి కలుగుతుంది. ఎంతో సంతోషమూ కలుగుతుంది. 

 దాదాపు - వీరందరి దగ్గరికి - ఏదో వొక ట్రైనింగు కోసమని, వెళ్ళిన అదృష్టము నాకు కలిగింది. వారందరూ - నాకు గురువులే.  ఋషి యజ్ఞమంటే - ఆటువం టి వారి పట్ల  ప్రతి రోజూ - మానసికంగా మన కృతజ్ఞత   తెలుపడమే. మీకు వచ్చే కష్ట సుఖాలలో - మీ గురువులు - ఎన్నో రకాలుగా   మీకు చాలా మంచి సలహాలనివ్వ గలరు. కొన్ని, మీరు వూహించనే లేనివి గా వుంటాయి.  అందుకే ఋషి యజ్ఞం.

ఋషి యజ్ఞానికి - మీరు ఎన్నో చేయచ్చు. వారి  ప్రయత్నాలకు సహకారం ఇవ్వవచ్చు. మీరు పెద్దగా ఏమీ చేయక పోయినా - ప్రతి రోజూ, వారి, వొక ప్రసంగము వినండి. పది నిమిషాల పాటు.

మీ జీవితం ఎంతో మారుతుంది.  మీకు ఎంతో సంతోషము, శాంతి లభిస్తాయి.

ఎవరినీ - గురువుగా - అంగీకరించని   వారి  జీవితం లో -  తప్పకుండా వుండే, అశాంతి మీ జీవితం లో వుండదు. 

నేను - దాదాపు అయిదేళ్ళు పాశ్చాత్య ప్రొఫెసర్ల - పర్సనాలిటీ డెవలప్మెంటు  పద్ధతులన్నీ - నేర్చుకుని - వాటిపై -  ఎన్నో వందల వర్క్ షాపులను, నడిపాను. అవి బాగున్నాయి. కాదనను. అవీ నేర్చుకోవలసినవే.

కానీ - మన గురువుల పద్ధతి వాటి  కంటే -  మహోన్నతమైనదని మాత్రం  తప్పక చెప్పగలను. 

ఎందుకంటే - మన వారు ఋషులు. 

రవి కాననిచో , కవి కాంచు నెయ్యెడన్ - అం టారు. 

అయితే - కవి కాననిచో - ఋషి కాంచు నె య్యెడన్ - అన్నది అక్షర సత్యం.

- మీ 

వుప్పలధడియం విజయమోహన్

తుది మాట :- క్షరం అంటే - సమసి పోయేది; నాశనమయ్యేది.   అక్షరం - అంటే - నాశనం లేనిది.

2, మే 2011, సోమవారం

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి? అవి - ఎవరు, ఎప్పుడు, ఎందుకు చేయాలి?


పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?

    అవి - ఎవరు, ఎప్పుడు, ఎందుకు   చేయాలి?


భారతీయ సాంప్రదాయం లో - పం చ మహా యజ్ఞాలకు చాలా, చాలా ప్రాముఖ్యం వుంది. స్వార్థ రహితంగా చేసే, ఏ పని అయినా - యజ్నమనే చెప్ప బడుతుంది. ఈ స్వార్థ రహిత కార్యాలను - మన వాళ్ళు 5 రకాలుగా  విభజించారు.

మనిషిగా పుట్టిన ప్రతి వొక్కరు -  యివి చెయ్యాలి.

ఎప్పుడు ? ప్రతి రోజూ.

ఎందుకు - అనేది తరువాత వొస్తుంది.

పంచ మహా యజ్ఞాలు యివి - (1 )  దేవ యజ్ఞము (2 ) రుషి యజ్ఞము (3 ) పితృ యజ్ఞము (4 ) మనుష్య యజ్ఞము (5 ) భూత యజ్ఞము.

వీటిని గురించి - క్లుప్తం గా రెండు, మూడు వ్యాసాల్లో  చెబుతాను. 


 దేవ యజ్ఞము 

సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, భూమి, ఆకాశము, జలము, -లాంటి    ప్రకృతి శక్తులను - మనం దేవతలుగా చెప్పుకుంటాం. ప్రతి రోజూ - వారి నుండి  , వారి శక్తిని కొంత అడుగుతాం; వారు యిస్తారు.  ఆ శక్తితో మన పనులు మనం చేసుకుంటాం. ఆ శక్తీ అయిపోతుంది. మళ్ళీ అడుగుతాం. మళ్ళీ యిస్తారు. జీవితం యిలా జరిగిపోతూ వుంటుంది. ప్రతి నిముషం వారి పైన - మనం ఆధార పడి ఉన్నాము. 

రెండు నిమిషాలు, ముక్కు మూసుకుని కూర్చోండి. మీకు గాలి ఎంత అవసరమో - తెలిసి పొతుంది. 

వొక్క రోజు - నీళ్ళు తాగకుండా వుండండి. మీకు నీళ్ళ అవసరం తెలిసి పోతుంది. 

రెండు రోజులు - భోం చెయ్య కుండా వుండండి. మీకు, భూమి అవసరం ఎంతో తెలిసిపోతుంది. 

సూర్యుడి అవసరం, చంద్రుడి అవసరం, - అందరి  దేవతల  అవసరం మనకు తెలిసి పోతుంది. 

అయితే - ఆధునిక యుగంలో - మనకు తెలియనిది, ఆ దేవతలందరూ, మన మాట , మన ప్రార్థన వింటారని.  

ఆ దైవీక శక్తులకూ -  మన ప్రార్థనంటే  యిష్టమని.

మనం దేవ యజ్ఞం ప్రతి రోజూ చెయ్యాలి. దేవతలకు యివ్వవలసింది వారికి యివ్వాలి. చెయ్య వలసిన ప్రార్ధన చెయ్యాలి. ఉదాహరణకు - సూర్యుడికి సూర్య నమస్కారాలు చేస్తాము.తద్వారా - మన ఆరోగ్యం బాగుపడుతుందని మనకు తెలుసు. 

మీరు "ప్రహ్లాద్ జాని" గారిని గురింఛి విని వుంటారు.  

ఆయన - పూర్తిగా - సూర్య శక్తి ద్వారానే - తన ఆహారాన్ని సంపాదిం చుకుంటూ  వున్నారు. ఎన్నో ఏళ్ళు గా - భోజనం, నీళ్ళు లాంటివి తాకడము కూడా లేదు. 

ప్రహ్లాద్ జాని గురించి - వికిపీడియా లోను, చాలా వెబ్ సైట్లలోనూ - మనం చదువ వచ్చు.  ఇలాంటి వారు - చాలా మంది వున్నారు.

అంటే - సూర్య శక్తి ద్వారానే - భూమి కూడా - తన పనులు  తాను చెసుకుం టూ వున్నదని  తెలుస్తున్నది కదా.

సూర్యుడు మనకెన్నో యివ్వ గలిగిన సమర్థుడు. అడగ గలిగే - నేర్పు, వోర్పు, భక్తి  మనకుండాలి. అంతే. అలాగే - 

భూదేవి - మనకెన్నో యివ్వ గలిగిన సమర్థురాలు. చంద్రుడూ అంతే. వాయు దేవుడూ అంతే.  వాళ్ళను - ఎలా అడిగితే - ప్రసన్నులౌతారని, పతంజలి  మహర్షి తన యోగ సూత్రాలలో కూడా - విభూతి పాదం లో - చాలా బాగా చెప్పారు. మన ధ్యానానికి, ప్రార్థనకూ - చాలా, చాలా బలం వుంది.

మన సంస్కృతిలో - ఉదయం లేచిన వెంటనే-   కళ్ళు  తెరవకుండా, రెండు చేతుల తోనూ,  కళ్ళు మూసుకుని - క్రింది శ్లోకం చెబుతారు.

"కరాగ్రే, వసతే లక్ష్మీ, కర మూలే సరస్వతీ, కర మధ్యే భవేద్ గౌరీ, ప్రభాతే కర దర్శనం" 

అంటే - నా వేళ్ళ అంచుల లోనే - లక్ష్మీ దేవి వసిస్తూ వుంది. నా దగ్గరే లక్ష్మి దేవి వున్నప్పుడు - నాకం టే - భాగ్య వం తుడు ఎవరుంటారు. నేను, ఎవరికైనా సహాయం చేయడానికి - వీలుగా, నా వేళ్ళ అంచుల లోనే లక్ష్మీ మాత సర్వదా వసిస్తూ వుంది.

చేతి మొదటి భాగం లో - చదువుల తల్లి సరస్వతి వుంది.

చేతి మధ్యలో - అన్ని మంగళాలనూ,  శుభాలనూ - యిచ్చే తల్లి, సర్వ మంగళ -  గౌరీ దేవి వుంది.

అన్నీ వున్న వాడిని / దానను నేను - అన్న సంతృప్తితో తెల్ల వారి కళ్ళు తెరిచే సంప్రదాయం మనది.

సరే - మన పూజలు, వ్రతాలు ఎన్నో, ఎన్నెన్నో.

-పెద్ద, పెద్ద యాగాలూ, యజ్ఞాలూ కూడా -  ఈ కోవ లోకే వచ్చినా - మనం రోజు వారీ చేసే, ఈ చిన్ని యజ్ఞాలు ప్రకృతి శ క్తులైన - ప్రతి దేవతకూ - పరమ ప్రీతి పాత్రమైనవి.

అన్ని ప్రార్థనల లోను - అంతర్భాగంగా - అంతిమ భాగం గా మనం చెప్పే మాటలు, కోరే వరాలు  -

"సర్వే జనాః  సుఖినో భవంతు"  ;

"లోకాః సమస్తాః సుఖినో భవంతు" ;

యివి - మనం దేవతలనడిగే వరాలు.
దేవతలకు ప్రీతి పాత్రమైనవి - ప్రార్థన, పూజ, లాంటివి , వారికి సమర్పిం ఛి, వారిని మనం అడిగే యజ్న ఫలాలు యివి.

= వొక్కటి మాత్రం మనం జ్ఞాపకం వుం చుకోవాలి. 

ప్రపం చ యుద్ధానికైనా, తాజ మహాలు  కట్టాలన్నా మన మనస్సులో  వచ్చే దృఢమైన ఆలోచనలే పునాది.

దేవ యజ్ఞం - మం గళ కరమైన - అన్ని పనులకూ మనం వేసే గట్టి పునాది.

అది ఎప్పుడు చెయ్యాలి? యిప్పుడే. ఎప్పుడైనా. ప్రతి రోజూ.

 ముఖ్యం గా - ఉదయం; సాయంకాలం; రాత్రి పడుకునే ముందు.  నిర్మలమైన, నిస్స్వార్థమైన మనస్సుతో. 
అందరి కోసం

- అందరిలో మీరూ ఉన్నారుగా.  సకల శుభాలు మీకూ కలుగుతాయి.

.  .  . మరో యజ్ఞం, మరో వ్యాసంలో.

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

1, మే 2011, ఆదివారం

పెద్ద గీత చిన్నదెలా అవుతుంది = పిచ్చి కి మరో రూపం ఏమిటో తెలుసుకోండి




మీరు క్రొత్త స్కూటరు కొన్నారు. ఎలాగోలా డ్రైవు చెసుకుంటూ యింటికొచ్చారు.  మీరు, మీ ఆవిడ (మీ వారు), మీ పిల్లలు సంతోషం లో మునిగి, తేలుతున్నారు.

మీరు స్వీట్లు కొన్నారు. మీరందరూ తిన్నారు. ఆ స్కూటరులో,  ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నీ, నిర్ణయించుకున్నారు. ఆ రోజు మంచి రోజు. భలే మంచి రోజు. మరిచిపోలేని రోజు. కుటుంబమంతా , చాలా, చాలా  సంతోషములో    మునిగి ఉన్న  రోజు.

మీరు - పక్కింటాయనతో  కూడా  ఈ శుభ వార్త  చెప్పాలనుకున్నారు. మీరు, మీ ఆవిడ - పక్కిం టికి బయలు దేరారు. 

వీధిలో, వో కొత్త కారు నిలబడి వుంది.  కారు ప్రక్కన  పక్కింటాయన నిలబడి వున్నారు.  లోపల ఎవరో, కూర్చొని వున్నారు.

మీరు, మీ శుభ వార్త చెప్పారాయనకు.

చాలా సం తోషమండి -అన్నారాయన.

"ఈ కారు చూసారా? ఈ రోజే కొన్నానండి. దాదాపు నాలుగు లక్షలు అయ్యింది. ఏదో లెండి. ఈ స్కూటర్లలో పోవడం ఈ మధ్య చాలా రిస్కుతో కూడిన వ్యవహారం గా మారిపోయింది, నా లాంటి వాళ్ళకి....
నా వల్ల అస్సలు కావడం లేదండి.  అందుకనే - కారు కొన్నానండి.  మీరు నాకంటే, నాలుగేళ్ళు చిన్న వాళ్ళు  గనుక స్కూటర్లలో -పోగలరు. ...మీ స్కూటరు - బాగుందండి.కంగ్రాచులేషన్స్! " - అన్నారాయన  మామూలుగానే.

మీ - పెద్ద గీత - చిన్న గీత అయిపోయింది.

మీ సంతోషం - ఆవిరై పోయింది.

మీలో - మీ ఆవిడలో - అశాంతి, ఆ వేదన, వెలితి, మరేవేవో -  భావనలు వున్నాయి, యిప్పుడు.

కాని - క్రొత్త స్కూటరు తాలూకు సంతోషం మాత్రం లేదు.

మీ - పెద్ద గీత - చిన్న గీత ఎలా అయిపోయింది?

పోల్చి చూసుకుంటే  - పిచ్చి పట్టిందట.

మీ  పెద్ద గీతలు, చిన్న గీతలవడం - చిన్న గీతలు పెద్ద గీతలవడం - మీ  భాగ్య రేఖ పైన 25 శాతం, పక్క వారి, భాగ్య రేఖ పైన 75 శాతం ఆధార పడి వుం టుంది - మీ పోల్చి చూసుకునే మనస్తత్వము మారనంత వరకూ.. 

మీ స్కూటరు ఎక్కడికీ పోలేదు. మీ దగ్గిరే వుంది. ప్రక్కనింటి వారి కారు వారి దగ్గిరే వుంది.

మీ ఆనందం  ఎక్కడికీ పోవాల్సిన పని లేదు.

అయినా - నూటికి ఎనభై శాతం మనుషుల విషయంలో - వారి ఆనందం బాగా తగ్గి పోవడము గానీ, పూర్తిగా యిగిరి పోవడము గానీ, దేవుడు తమకు  చాలా అన్యాయం చేసినట్టు  క్రుంగిపోవడము గాని -  జరగడము మనము చూస్తూనే ఉన్నాము.

మీ కొడుక్కో, కూతురికో, 92 శాతము  మార్కులు వస్తే మీకు  సంతోషం. 

కాని పక్క వారి కొడుక్కో, కూతురికో, 96 శాతం వస్తే - మీ సంతోషం కనిపించ కుండా పొతోంది.

జీవితం లో  ప్రతి చిన్న, పెద్ద విషయాల్లో ,    ప్రక్క వాళ్ళతో పోల్చుకునే వారు చాలా మంది వున్నారు. వారిని జాగ్రత్త గా గమనించండి.

కొద్దో, గొప్పో నిరాశా భావం కలగడం నుండీ, మనిషి  డిప్రెషన్లోకి  జారిపోవడం వరకు - రక రకాలుగా మనుషులు - స్పందించడం  మనం చూడొచ్చు.

అందుకనే అంటారు -  పోల్చి చూసుకుంటే  - పిచ్చి పట్టిందని.

మన గీతల్ని, అనవసరంగా- చిన్న గీతలు చేసుకుని  బాధ పడటం మనలో చాలామందికి, బాగా అలవాటై పొయింది.

చిన్న వాడితో పోల్చుకుని - సంతోష పడటమూ తప్పు. పెద్ద వాడితో పోల్చుకుని అసూయ పడటమూ తప్పు.

ఏ స్థాయి వారికైనా - దేవుడు - యివ్వడమూ, తీసుకోవడమూ చేస్తూనే వుంటాడు.

మీకూ అంతే.

కానీ  మీ   సంతోషము  - మనసులో ఎల్లప్పుడూ వుండాలి.

పెద్ద  గీతలు చిన్నవి గానో, చిన్న గీతలు పెద్దవి గానో - చేయకండి

మీ గీతలు, ఎలా వున్నా మీరు సంతోషము గా వుండవచ్చు. 

మీకు తెలుసా - సంతోషంగా వుండటానికి   - కారణమే అక్కర్లేదు.

సంతోషంగా వుండటము  - మీ నైజం - మీ జన్మ హక్కు.

పోల్చి చూస్తేనే -పిచ్చి పడుతుంది.

కాబట్టి - ఈ గుణానికి దూరంగా - సంతోషంగా -వుండండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

(తెనాలి రామకృష్ణుడు - వొక గీతను - దాన్ని తాకకుండా - ఎలా చిన్నది చేసాడో - (దాని ప్రక్క మరో పెద్ద గీత గీచి) - ఆ కథ మీకు తెలిసే వుంటుంది.)