జరగాల్సిందేమిటి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జరగాల్సిందేమిటి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మే 2014, మంగళవారం

చంద్రబాబు నేతృత్వంలో - జరగాల్సిం దేమిటి ? ఏది మొదట? ఏది ముఖ్యం ? ఏది సులభం?


 అభివృద్ధి పథం లో 

మన రాష్ట్రం

ఎన్నికలు ముగిసిపోయాయి . వాటి ఫలితాలూ వచ్చేశాయి .

ఇవి రెండూ, నాకు బాగా నచ్చినట్టే వచ్చాయి . ఆ మాటకొస్తే , మనందరికీ బాగా నచ్చిన వాళ్ళే అధికారం లోకి వచ్చారని చెప్పుకోవచ్చు .

సీమాంధ్ర లో -  చంద్రబాబు నాయుడు గారి తెలుగు దేశం పార్టీ కి 102 సీట్లు , వారి తో బాటు పోటీ చేసిన భా.జ.పా. కు 4 అసెంబ్లీ స్థానాలు రాగా , జగన్ గారి పార్టీ కి 67 సీట్లు వచ్చాయి . కాంగ్రెసుకు ఏమీ రాలేదు . అలాగే - పార్లమెంటు స్థానాలకు, సీమాంధ్ర నుండి TDP + BJP  కూటమికి 17 స్థానాలు రాగా మిగతా 8  YSR కాంగ్రెసుకు వచ్చాయి .ప్రజలు చంద్ర , నరేంద్రులకు  బ్రహ్మ రథం పట్టి గెలిపించేశారు.  

యిక చంద్రబాబు గారు యిక్కడ , నరేంద్రుడు అక్కడ - తమ పరిపాలనా దక్షతను చూపడమే  తరువాయి .

సీమాంధ్ర లోని మొదటి పెద్ద పనులేమి ?

నా ఉద్దేశంలో - కరెంటు కొరత వెంటనే తగ్గించాల్సి వుంది . కరెంటు లేకుండా పరిశ్రమలు కానీ , వ్యవసాయం కానీ ఏదీ అభివృద్ధి చెయ్యలేము . పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యం అన్నీ కుంటు పడతాయి . ఆ విషయంలో చంద్రబాబు గారు మొదట తన దృష్టి సారించాలి .

(1) రాష్ట్రంలో - వున్న విద్యుత్తు కర్మాగారాలన్నీ సరిగా పని చేసే లాగు చూడాలి . నిజానికి దేశం అంతటా , ఎన్నో కర్మాగారాలలో - విద్యుదుత్పాదనకు సంసిద్ధంగా వున్న కర్మాగారాలున్నాయి .  వాటికి బొగ్గు, గ్యాస్ సప్లయ్  లేదు.  కొన్ని లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కర్మాగారాలన్నీ పనిచేస్తే - దేశంలో, రాష్ట్రంలో , అతి త్వరగా, విద్యుదుత్పాదన ఘనంగా పెరుగుతుంది . యిది - సులభంగా , అతి త్వరగా చెయ్యగల పని . చాలని విద్యుత్తు నేషనల్ గ్రిడ్ నుండి కొనుగోలు చెయ్యాలి .  కానీ, 2 సంవత్సరాలలోపు, రాష్ట్రాన్ని కొరత రాష్ట్రం నుండి సర్ ప్లస్ రాష్ట్రంగా మార్చ వచ్చు . మార్చాలి . తమిళనాడులో జయలలిత గారు కూడా అదే చేస్తున్నారు .

(2) మన రాష్ట్రంలో నదులున్నాయి . ఈ నదులను కలిపే ప్రణాళిక తయారు చెయ్యాలి . శ్రీకాకుళం నుండి కుప్పం వరకు నదుల నీరు ప్రవహించే ఏర్పాటు మనం చెయ్యాలి. నా చిన్న సలహా - కుప్పం పేరు శ్రీ కుప్పం అని  మారిస్తే బాగుంటుంది . అప్పుడు, మన రాష్ట్రం శ్రీకాకుళం నుండి, శ్రీ కుప్పం వరకు, అని చెప్పుకోవచ్చు . రాష్ట్రం - 'శ్రీ' ,అంటే, సిరి తో నిండి వుంటుంది.  మోడీ గారు, నవీన్ పట్నాయక్ గారు వొప్పుకుంటే - మహానది ని కూడా కలిపి - వొడిశా వొక కొన  నుండి ఆంధ్రప్రదేశ్ మరొక కొన వరకు - అన్ని జిల్లాలలో నదులు ప్రవహించే ఏర్పాటు చెయ్యవచ్చు . యిది అయిదేళ్ళు లేదా పదేళ్ళు పట్టినా ఫరవాలేదు , కానీ ఈ పనికి శ్రీకారం చుట్టాలి . మన రాష్ట్రంలో , చాలా ప్రదేశాలలో ఇప్పటికే మంచినీటి సరఫరా  చాలా తక్కువ . ఈ పరిస్థితి మారాలి. మహానది, గోదావరి , కృష్ణా   నదుల వరద నీరు మాత్రం కాలువల ద్వారా వచ్చినా , చిత్తూరు జిల్లా లాంటి ఎన్నో ప్రాంతాలకు నీటి సదుపాయం కుదురుతుంది

(3) మనకు మంచి రాజధాని కావాలి. హైదరాబాద్ పోగొట్టుకున్నది ఉత్తరోత్తరా మనకు అదృష్టంగా, మహా లాభకరంగా మారేలా చేసుకోవాలి. కొత్త రాజధానిని, రాష్ట్రం మధ్యలో, కనీసం 50 X 50 కి.మీ వైశాల్యం వుండేటట్టు , క్రొత్తగానే నిర్మించాలి . అది, చెన్నై- కోలకాతా జాతీయ రహదారికి వీలైనంత దగ్గర వుంటే మంచిది . అలాగే , కొంత చెన్నైకు సమీపం గా వుంటే చెన్నై లోని విమానాశ్రయము, పోర్ట్ మనం సులభంగా వాడుకునే వీలుంటుంది - అంటే మనం అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయము, పోర్ట్ నిర్మించే వరకు యివి అవసరం గనుక . యింతకు ముందు వొక సారి అది ఒంగోలు - నెల్లూరు మధ్య ప్రాంతాల్లో అయితే సరిపోతుంది అని రాశాను . అంటే ఒంగోలు ఆని కాదు . దానికి దగ్గర, ఢిల్లీ అంత నగరం నిర్మించ డానికి సరైన ప్రదేశం చూసుకోవాలి .

(4) మన రాష్ట్రంలో - IT  పార్కులు , ఫార్మా  పార్కులు సులభంగా నెలకొల్ప వచ్చు . వాటికి అన్ని రాయితీలు యివ్వాలి . ఈ విషయంలో - చంద్రబాబు గారికి వున్న అనుభవం తో - పారిశ్రామిక వేత్తలను సులభంగా ఆకట్టుకోవచ్చు .

(5) మన రాష్ట్రం పెద్దది. పక్క రాష్ట్రం చిన్నది. మనకు వొక రైల్వే జోన్ కావాలి కదా .  అది మోడీ గారిని అడిగి సాధించాలి .అలాగే - టెలికం సర్కుల్ , లాంటి కేంద్ర కార్యాలయాల విభజన జరగాలి . దీని వలన, ఆంధ్ర ప్రదేశ్ పైన గమనమూ పెరుగుతుంది , అభివృద్ధి     కూడా త్వరగా జరుగుతుంది . టెలికాం లో బ్రాడ్ బాండ్ రావడమూ త్వరగా జరుగుతుంది . రైల్వే లో క్రొత్త లైన్ ల నిర్మాణమూ జరుగుతుంది . వీటితో బాటు - హైదరాబాద్ లోని ఆంధ్రా ఉద్యోగులు కూడా కొంత మంది ఇక్కడికి  రావడానికి వీలుంటుంది . వీటి వలన చంద్ర బాబు గారు అనుకునే అభివృద్ధి తానుగా జరిగే వీలుంది .  అంత పెద్ద రైల్వే జోన్ తెలంగాణా కు అక్కరే లేదు అంత పెద్ద టెలికాం సర్కుల్ అక్కరే లేదు . కాని  మనకు కావాలి . అది మనం అడగాలి . 

(6) నన్నడిగితే,  TDP  పార్టీ నుండి రైల్వే మంత్రి వుంటే మేలు అని నాకు అనిపిస్తుంది . రైల్వే కాకపొతే - IT  మినిస్ట్రీ అయినా బాగుంటుంది , మన రాష్ట్ర అభివృద్ధికి . 

(7) మనకు వొక ఐ.ఐ.టి ., వొక ఐ.ఐ.యం., వొక ఏ.ఐ.ఐ.యమ్.యస్ . - లాంటి ఉత్తమ విద్యల నందించే సంస్థలు రావాలి . యివన్నీ, కేంద్రం నుండి, మనం అడగి తీసుకోవాల్సినవే ; మనం మనముగా చెయ్య వలసినవి కావు. 

(8) చంద్రబాబు గారు ఈ మధ్య పత్రికల వారికి , టీవీ చానెళ్లకు యిచ్చిన ఇంటర్ వ్యూలలో - చాలా సమస్యల గురించి బాగా చెప్పారు . మనకున్న 14 పోర్టుల గురించి , వాటికి చేయవలసిన అభివృద్ధి గురించి , వాటికి , మన వ్యవసాయ,  పారిశ్రామిక రంగాలకు మధ్య వుండవలసిన సహకారాల గురించి చెప్పారు . అలాగే , మనకు రాబోయే రాజధాని ఢిల్లీ కంటే బాగుండాలని చెప్పారు . యివన్నీ బాగుంది . 

చంద్ర బాబు గారు చెయ్యాల్సినవి చాలా వున్నాయి . యిందులో కొన్ని సులభంగా చేసేవి. కొన్ని వెంటనే చెయ్యాల్సినవి . కొన్ని నిదానమైనా, తప్పకుండా చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు.  మొదట ,సులభంగా చెయ్య వలసినవి చేసేసి, వెంటనే చెయ్యవలసినవి వెంటనే చేసేసి , తరువాత , ముఖ్యమైనవి  చిత్త శుద్ధితో , అందరి సహకారంతో చెయ్యాలి . 

చంద్రబాబు గారు యింకా ఎన్నెన్నో చెయ్యొచ్చు . అసలు ... పదేళ్ళలో , తెలంగాణా వారి కొందరు నాయకుల బూతు మాటలకు, లేని చేతలకు  మొహం మొత్తి , తెలంగాణా ప్రజలు మళ్ళీ, సమైక్యంగా వుందామన్నా - ఆశ్చర్యం లేదు . పక్క పక్క నున్నా , అటువంటి వారు  మధ్య లేకుంటే , కుటుంబ కలహాలు వుండవు . రాష్ట్రాల మధ్యా కలహాలు వుండవు . 

సర్వే జనాః సుఖినో భవంతు

- మీ 

వుప్పలధడియం విజయమోహన్