4, మార్చి 2014, మంగళవారం

కొత్త రాష్ట్రం ఏది ? తెలంగాణానా -సీమాంధ్రానా ? కె సి ఆర్ ను నమ్మితే...దేన్లో మునిగినట్టు ? కాంగ్రెస్ వారే చెప్పాలి .


కొత్త రాష్ట్రం ఏది ?
తెలంగాణానా -సీమాంధ్రానా 
క్రొత్త రాష్ట్రానికి ఏం కావాలి ?

ఇదీ ప్రశ్న . ఇదివరకెప్పుడూ ఇలాంటి ప్రశ్న , ఏ రాష్ట్ర విభజనలోనూ రాలేదు. వుత్తరాఖాండ్ , ఝార్ఖండ్, ఛత్తీస్ గర్హ్  లాంటి రాష్ట్రాలన్నీ కొత్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన సందర్భంలో - ఈ ప్రశ్నే లేదు. కానీ యిప్పుడొచ్చింది. హైదరాబాద్  కూడా, కర్నూలు, విజయవాడ, విశాఖ  లా వుండి  వుంటే , ఇలాంటి ప్రశ్న వచ్చేది కాదు.  వాళ్ళకూ మనకూ,  ఎందు వల్లనో పొసగ లేదు . పొతే పోనీ . వేరు కుంపటి పెట్టుకుంటే - మనకూ , వారికీ కూడా మేలే - అన్న విధంగా లేదాయె . 

మనం  హైదరాబాదులో రాజధాని పెట్టుకున్నాం. వొక్కటి మాత్రం వొప్పుకుని తీరాల్సిందే . NT రామారావు ముఖ్యమంత్రి  కాకముందు , హైదరాబాదు లో తెలుగు వాతావరణం శూన్యం . ఎక్కడికి వెళ్ళినా , తెలుగు తెలిసిన వారు కూడా - ఉర్దూ లో మాట్లాడే వారు. మరి పట్టణం లో ఏ విధమైన  అభివృద్ధీ  కనిపించేది  కాదు . నిజాముల భవనాలు తప్ప - మిగతా ముస్లిముల యిండ్లు కూడా కూప గృహాలుగా  దర్శనమిచ్చేవి. రామారావు గారు వచ్చిన తరువాతే , నిజంగా అభివృద్ధి ప్రారంభమయ్యింది .  ఆ తరువాతే - అక్కడ కాస్తో కూస్తో తెలుగు మాట్లాడడం కూడా ప్రారంభమయ్యింది . ఆ తరువాత, IT రంగం కానియ్యండి, ఫార్మా రంగం కానియ్యండి - చాలా శీఘ్రంగా అభివృద్ధి  కావడానికి రామారావు గారు , ఆ తరువాత చంద్ర బాబు గారు  కారణం గా నిలిచారు .

ఆ తరువాత మళ్ళీ - కాంగ్రెసు వారి ప్రభుత్వాలు రావడం - క్రమక్రమంగా వున్న విద్యుత్తు  పోయి , కొరతగా మారి  అన్ని రంగాలకు కరెంటు లేదనే స్థితికి వచ్చేసింది . ఆ తరువాత మళ్ళీ - మన రాష్ట్రానికి - హైదరాబాదుకు కూడా -  . క్రొత్త కంపెనీలు రావడం తగ్గి, యిప్పుడు దాదాపు రావడం మానేశాయి . దీనికి కారణం సగం కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత, లంచగొండి తనం కాగా, మిగతా సగం, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి "మధురవాక్కులకు " బెదిరిపోయిన పారిశ్రామిక వేత్తలు  కారణం .

అయితే రామారావు గారు, చంద్రబాబు గారు , మిగతా ముఖ్యమంత్రులు కూడా - చేసిన అతి పెద్ద తప్పు - చెయ్యవలసిన అభివృద్ధిలో సగానికి పైగా , హైదరాబాదు లో మాత్రమే  కేంద్రీకరించడం , దాన్ని మాత్రమే అభివృద్ధి చెయ్యడం .  మిగతా నగరాలేవీ కావలసినంతగా అభివృద్ధి చెంద లేదనే చెప్పాలి . అయినా - ఆంధ్రా ప్రజలు తెలంగాణా కు ఏదో అన్యాయం చేసినట్టుగా చిత్రీకరించడం జరిగింది . అందుకు కారణం కే సీ ఆర్ మాత్రమే కాదు . అసమర్థమైన కాంగ్రెస్ నాయకత్వం. వారికి - వారి వారికి కావాల్సిన సొత్తుల సేకరణ తప్ప మరేదీ పెద్దగా పట్ట లేదు. అందుకే వచ్చింది తెలంగాణా వుద్యమం .

తమిళనాడులో చూస్తే - కోయంబత్తూరు లో వున్నన్ని కంపెనీలు - చెన్నై లో కూడా లేవు . ఇప్పుడు  IT  కంపెనీలు కూడా కోయంబత్తూరు లో చాలా వచ్చాయి . వస్తున్నాయి . మనం ఎందుకలా చెయ్యడం లేదు ? - అంటే తమిళనాడు లో ఎలా వుంటే అలా చెయ్యాలని కాదు . రాష్ట్రము లోని ప్రతి ప్రాంతమూ వీలైనంత సమంగా అభివృద్ధి చెందాలి కదా.


ఈ కేంద్రీకరణలో - ఉత్త ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు; ఉత్త కంపెనీలు మాత్రం కాదు - మన ఆర్టిస్టులు, రచయితలు, మేధావులు కూడా హైదరాబాదు కు వెళ్లి - అక్కడే స్థిరపడి పోయారు. యిప్పుడు వారందరూ మా వాళ్ళు కాదు - అనే విధంగా , దేశంలో మరెక్కడా జరగని విధంగా మనకు క్రొత్త రాష్ట్రం ఏర్పడుతూ వుంది. రామారావు గారు , వున్నప్పుడు తెలంగాణా ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత, చంద్రబాబు గారికి కూడా అన్ని ప్రాంతాల ఆదరమూ లభించింది . ఎప్పుడైతే - ఘనతవహించిన  YSR  గారు - అన్ని రకాల భూ ఆక్రమణలను , లంచగొండి తనాన్ని ప్రోత్సహించారో, అన్ని రకాల కుల, మత రాజకీయాలను ప్రోత్సహించారో, - అప్పటి నుండే , KCR గారికి అక్కడి ప్రజలు పట్టం గట్టడం ప్రారంభమయ్యింది .

అది, యిప్పుడు - విభజన కు దోహదం చేసింది . మధ్యలో వచ్చిన సమైక్యాంధ్ర వుద్యమం మంచిదే కానీ - దాని వెనుక నున్న నాయకత్వం సరి లేదు . సమైక్యాంధ్ర అంటే ఏమిటి ? ఏ వొక్కరైనా - తెలంగాణా ప్రాంతంలో కూడా తిరిగి , వారిని నమ్మించే ప్రయత్నం చేశారా ? లేదు కదా . మరి సమైక్యాంధ్ర ఎలా వస్తుంది ? సీమాంధ్ర లో బస్సులు నిలపడం, కార్లు నిలపడం, విద్యుత్తు నిలపడం, హాస్పిటళ్ళతో సహా, అంగళ్ళతో సహా, స్కూళ్ళతో సహా - అన్నింటినీ మూయించడం , పార్లమెంటులో గోల గోల చేసి మన పరువు తీయడం - యిది చేసారే  తప్ప - తెలంగాణా ప్రజలను నమ్మించడం  చెయ్య లేదు ; పార్లమెంటులోని - ఏ ముఖ్య పార్టీనీ నమ్మించ లేదు. కాస్తో కూస్తో ఈ ప్రయత్నం చేసింది వొక్క చంద్ర బాబు మాత్రమే . మిగతా వారిలో - రాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్య మంత్రిని నేనే కావాలి - అన్న ఆత్రుత వొక్కటే నాకు కనిపించింది. యిప్పుడు తెలంగాణా వచ్చేసినట్టే . అది  పోనీయండి . జరిగే ప్రతి కార్యం, జరిగే ప్రతి విపత్తు కూడా - మనకొక క్రొత్త అవకాశాన్నిస్తుంది.  అదే ప్రకృతి నియమం . దాన్ని మనం వుపయోగించుకుంటామా - అన్నదే యిప్పుడు ముఖ్యం .  


యిప్పుడు సీమాంధ్ర ప్రజలు కొత్త రాజధాని నిర్మించుకోవాలి . కొత్తగా పరిశ్రమలను ఆకర్షించాలి . కొత్త, అత్యున్నత విద్యాలయాలను ఆకర్షించాలి. నదులలోని నీరు శ్రీకాకుళం నుండి చిత్తూర్ జిల్లా వరకు అన్ని ప్రాంతాలకూ తీసుకు రావాలి. సినిమా , ఫార్మా, ఐ టీ రంగాలకు కావలసిన ప్రోత్సాహాన్ని, సదుపాయాలను కలుగజెయ్యాలి . యివన్నీ చెయ్యాలంటే - స్వార్థ రహిత నాయకులకే పట్టం కట్టాలి . లంచగొండి తనం తో , కుల మత రాజకీయాలతో, ఫాక్షన్ రాజకీయాలతో పైకొచ్చిన వారిని ప్రక్కన బెట్టాలి . మంచి నాయకులైన జే పీ లాంటి వారిని - యిటు వైపుకు ఆకర్షించాలి .

కానీ, యిప్పుడు జరుగుతున్నదేమిటి ? ఎవరు అవినీతికి పేరు మోశారో , వారికే ఆంధ్ర ప్రజలు పట్టం కట్ట బెడతారేమో అన్న అనుమానం వస్తూ వుంది .

అది వొక  ప్రక్క వుండనిస్తే , మన క్రొత్త రాజధాని ఎక్కడ వుండాలన్నది - పనికి మాలిన స్వార్థాలలో, రాజకీయాలలో చిక్కుకుంటూ   వుంది . మా గ్రామంలో  పెడితే బాగుండు - మా గ్రామంలోనే పెట్టాలి - అనే విధంగా మన (వి)నాయకులు ఘోషిస్తూ వున్నారు .

రాజధాని కనీసం 50 చ కి మీ  విస్తీర్ణం అయినా వుండాలి . వీలైనంతగా రాష్ట్రానికి మధ్యలో వుండాలి . కనీసం వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కు వీలైనంత దగ్గరగా వుండాలి . మనకు వున్న పెద్ద నేషనల్ రహదారికి వీలైనంత సమీపంగా వుండాలి . మంచినీటి వసతి వుండాలి; లేదా, కృష్ణ, గోదావరులనుండి నీరు తీసుకురావడానికి అనుకూలంగా వుండాలి.  IT పరిశ్రమకు అనుకూలంగా వుండాలి . ఫార్మా పరిశ్రమకు అనుకూలంగా వుండాలి .

మనమే వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కట్టుకునే వరకు - చెన్నై ఎయిర్పోర్ట్ ను వాడుకోవడంలో తప్పు లేదు. మళ్ళీ, మళ్ళీ హైదరాబాదు ను, అక్కడి ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చెయ్యడం మన మూర్ఖత్వమే అవుతుంది . కానీ వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ మనం కట్టుకునే లాగా సరిపడేటంత  స్థలం యిప్పుడే వుంచుకోవాలి. వొక చిన్న ఎయిర్పోర్ట్ వెంటనే కట్టుకోవాలి కూడా.  చెన్నై - కలకత్తా నేషనల్ రహదారికి వీలైనంత సమీపంలో వుండాలి . చిత్తూరుకు, శ్రీకాకుళానికి రెంటికీ అందుబాటులో వుండాలి - అవే రాష్ట్రానికి ఎల్లలు గనుక. 

గుజరాత్ కూడా అహమదాబాద్ నే పెట్టుకోలేదు . గాంధీనగర్ ను కట్టుకున్నారు. సీమాంధ్ర  కూడా అలాంటి క్రొత్త నగరాన్నే నిర్మించుకోవాలి. అక్కడ స్థలాలను ఆక్రమణ దారుల స్వంతం చెయ్యకూడదు . వొక్కొక్క స్థలాన్నీ - వొక్కొక్క నిర్ణీత పథకానికి కేటాయించాలి . యిళ్ళ  స్థలాలను , సరైన ధరకు సరైన వాళ్లకు అమ్మాలి . అక్కడ వుండాల్సిన ప్రభుత్వోద్యోగులకు - యిళ్ళ స్థలాలను కేటాయించాలి . ఎన్ని క్వార్టర్స్  కావాలో - అన్ని కట్టడానికి స్థలం పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో - యివన్నీ నెల్లూరుకు దగ్గరగా , నేషనల్ రహదారికి సమీపంగా, కనీసం 50 చ కి మీ ఖాళీ స్థలం నిర్దేశించి, ఏదైనా ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ సంస్థకు - ఆ పని వొప్పగిస్తే , బాగుంటుంది - అనిపిస్తుంది .

యిది ఎవరు చెయ్యగలరు ? నా ఉద్దేశంలో - చంద్రబాబు గారు , జే పీ  గారు - మోడీ గారితో కలిస్తే - కలిసి ప్రభుత్వం నెలకొల్పితే - చాలా సులభంగా సాధ్యమవుతుంది . చాలా బాగా సాధ్యమవుతుంది . నాకు మిగతా వారిపై నమ్మకం లేదు . లంచగొండి తనానికి పేరు మోసిన కాంగ్రెస్ వారిపై అసలు నమ్మకం లేదు . అది ఏ కాంగ్రెసైనా  సరే .

ఆలోచించండి మరి . యిందులో మళ్ళీ, కొట్లాటలకు , ఉద్యమాలకు తావు లేదు . వుండకూడదు .

సరే . కెసిఆర్ గారితో కలిస్తే  ఏమవుతుందో కాంగ్రెస్ వారికి ఈ రోజు తెలిసొచ్చింది. తెలంగాణా యివ్వండి - మా పార్టీని మీ పార్టీ లో విలీనం చేసేస్తానన్న పెద్ద మనిషి - తెలంగాణాను కాంగ్రెసు వారు చాలా కష్ట పడి యిచ్చేశాక - యిప్పుడిక విలీనం ప్రసక్తే లేదంటున్నారు .

కాంగ్రెసుకు యిది కావాల్సిందే . కె సి ఆర్ గారిని నమ్మకండి - అని ఎందరో రాసారు; ఎన్నో రకాలుగా చెప్పారు. ఆయన నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు తప్ప  వేరే రావాయె .   దేశాన్ని నట్టేట్లో దింపిన కాంగ్రెసును,  కె సి ఆర్ గారు ఈ రోజు నట్టేట్లో దింపారు. అయినా పిచ్చి గాకపోతే - కె సి ఆర్ ను నమ్మితే , కాంగ్రెసుకే కాదు, తెలంగాణా ప్రజలకూ చివరికి అదే అవుతుంది కదా. కానీ వారు బాగుండాలి; వారు మంచి నాయకులను ఎన్నుకుంటారని ఆశిద్దాం. అలాగే - దేశమంతటా , నమ్మకం కోల్పోయిన కాంగ్రెసుకు , అది పాత కాంగ్రెసైనా, క్రొత్త కాంగ్రెసైనా, ఏదైనా  సరే - దాన్నే మళ్ళీ నమ్మితే - దానికే మళ్ళీ వోటేస్తే  - కే సి ఆర్ ను నమ్మినట్టే వుంటుంది  మన గతీ . 

అయితే - కొంత మంది మారొచ్చు . మారిన నాయకులు మంచి దార్లో నడుస్తారా అన్నది  చూడాలి. వారి పాత చరిత్ర చూడాలి . స్వార్థ రాజకీయాలు, కుల మత  రాజకీయాలు, నేర చరిత్ర, లంచగొండి తనం ,గూండా చరిత్ర లాంటివి లేని వారిని ఎవరినైనా ఆహ్వానించ వచ్చు . నిజానికి - అందరూ అలా మారాలి . అప్పుడే రాష్ట్రం బాగుంటుంది .

సర్వే  జనాః  సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం  విజయమోహన్




22, ఫిబ్రవరి 2014, శనివారం

నా సలహా ఏమిటంటే ... సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో? చెప్పకూడదో ? తెలుసుకోండి . యిది సలహాల సైన్స్ - శ్రీకృష్ణుడి సలహా భగవద్ గీత


నా సలహా ఏమిటంటే ...


మనకు సలహా లివ్వడం పరిపాటి . అడిగిన వాడికీ , అడగని వాడికీ , దావన పోయ్యే  ప్రతి దానయ్యకూ, బస్సులోనో , ట్రైన్ లోనో ప్రక్కన కూర్చున్న వాడికీ,  వినే వాడికీ, వినని వాడికీ, ప్రొద్దు పోకుండా కూర్చున్న సోమరి వాడికీ - అందరికీ సలహాలిస్తాం . మరొకరు మనకిస్తే - వొక్కో సారి వింటాం . వొక్కో సారి వినం .  వాళ్ళూ అంతే .

సాధారణంగా సలహాలన్నీ ఉచిత సలహాలే . కానీ డాక్టర్ సలహా కావాలంటే , ఫీజు యిచ్చుకోవాలి . అలాగే , వొక మంచి లాయరు , చార్టర్డ్  అకౌంటెంట్ , స్టాక్ బ్రోకర్ లాంటి వాళ్ళ సలహాలకు కూడా ఫీజు యిచ్చుకోవాలి .

ప్రపంచంలో  బాగా పేరు మోసిన పాత సలహాదారు  శ్రీకృష్ణుడు .

ఆయన ఎప్పుడు సలహా యిచ్చాడు ? అర్జునుడు  తన గాండీవము , శస్త్రాస్త్రాలు - అన్నీ తీసుకుని దేవతలిచ్చిన దివ్య రథాన్నెక్కి , కౌరవులను అందరినీ చంపేస్తాను - అని బయల్దేరాడు . అతని సారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు . తీరా యుద్ధ భూమికి వచ్చి  - భీష్ముల వారిని , ద్రోణుల వారిని, కౌరవులను చూసే సరికి , అర్జునుడిలో  విషాదం పుట్టుకు వచ్చింది . నాకు ఎంతో యిష్టమైన తాత గారిని, గురువును, ఇతరులను చంపి వచ్చే  రాజ్యమూ , ఆ నెత్తుటి కూడు నాకక్కర లేదు - అని,  శస్త్రాస్త్రాలు అన్నీపారేసి, ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు . అప్పటికీ శ్రీ కృష్ణుడు  ఏమీ మాట్లాడ లేదు . దాదాపు వొకటిన్నర ఛాప్టరు " నేను యుద్ధం చెయ్యను . ఎందుకంటే ..."  అని ఎన్నో , ఎన్నెన్నో కారణాలు అర్జునుడు చెబుతూ వచ్చాడు . అన్నీ విన్న శ్రీకృష్ణుడు అప్పుడు కూడా ఏ గొప్ప సలహానూ యివ్వ లేదు. మొదట కాస్త మందలించాడు . నీకసలు బుద్ధుందా ? యుద్దానికొచ్చేసి ,  యిక్కడ శస్రాస్త్రాలు పారేసి,  పేడి లాగా  మాట్లాడుతున్నావా ?  నలుగురూ నవ్వి పోతారు  - అన్నాడే కానీ అప్పుడూ సలహా యివ్వ లేదు .

ఈ తిట్లు అర్జునుడిలో - ఎక్కడో - తను ఏదో తప్పు చేస్తున్నట్టే  వుంది - అన్న భావన కలిగించింది .

అప్పుడు అన్నాడు - కృష్ణా ! నేను నీ శిష్యుడిని . నీ దాసుడిని . నాకు నీవు తప్ప మరొకరు మంచి చెప్పే వారు , సక్రమ మార్గంలో పెట్టె వారు ఎవరూ లేరు. దయ చేసి - నాకు సరైన మార్గం చూపించు . నువ్వు చూపించే  మార్గం లోనే నేను నీ వెనుకే వస్తాను. మామేకం శరణం మమ అని పూర్తిగా కృష్ణుడి ముందు దాసోహం  అనేశాడు .

అప్పుడు మొదలైంది శ్రీకృష్ణుడి సలహా . అదే భగవద్ గీత . దాసోహం అనే వారికి ఉపయోగ పడే భగవంతుడి  సలహాల సంపుటి . నాకు తెలిసి అంత కంటే  గొప్ప విజ్ఞాన సంచిక మరొకటి లేదు. రాదు.

అందులో - ఎన్ని రకాల విజ్ఞానం పొందుపరచ బడిందో చూస్తే - చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని గురించిన వివరణ తో కూడిన వ్యాఖ్యానం నా ఆంగ్ల బ్లాగ్ 'wisespiritualideas.blogspot.com ' లో రాస్తూ వున్నాను . సమయం వచ్చినప్పుడు క్లుప్తంగా ఈ తెలుగు బ్లాగ్ లో కూడా రాస్తాను.

యిక్కడ శ్రీకృష్ణుడి పాలసీ మనం గమనించాలి .
  • మొదటిది - అడగనిదే సలహా యివ్వ కూడదు .
  • అడిగినా - ఆ అడిగిన వాడు మనం యిచ్చే సలహా తీసుకుంటాడా, లేదా చూసి,   తీసుకునే  వాడికే సలహా యివ్వాలి . అలా లేని వాడికి సలహా యివ్వ కూడదు .
  • దాసోహం - అన్న వాడికి తప్పకుండా యివ్వాలి .
  • వాడు - చెయ్య గలిగేదే చెప్పాలి కానీ చెయ్య లేనిది చెప్ప కూడదు.
  • సలహా అడిగాడు కదా అని - అడిగిన వాడిని చిన్న చూపు చూడ కూడదు
  •  అడిగిన వాడికి - 4,5 మార్గాలుంటే అన్నీ చెప్పాలి.  ఆ మార్గాలన్నిటిలో  వుండే సాధక బాధకాలన్నిటినీ చెప్పి - అందులో ఏది , ఎందుకు మేలో చెప్పాలి .
  • అడిగిన వాడిని ఉత్సాహ పరచాలే తప్ప , నిరుత్సాహ పరచ కూడదు .
  • ధర్మ మార్గంలో వుండే మార్గాలు చెప్పాలే తప్ప - అధర్మ మార్గాలు కాదు .

- యిలా , సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో  చేసి చూపిన వాడు  శ్రీ కృష్ణుడు . ఆధునిక కాలంలో మనం కమ్మ్యూనికేషన్ స్కిల్స్ అని అంటాము కదా . అందులో ఆయన్ను మించిన నిష్ణాతుడు మరొకరు లేడు . భగవద్ గీత అంతా ఈ స్కిల్ల్స్ కు వొక శాస్త్రీయ గ్రంధం లాంటిది .

సరే . ఈ సలహాలను గురించి - ప్రపంచం లో నలు మూలలా ఏమనుకుంటున్నారు - అన్నది చూద్దాం .

  • మన సుమతి శతక  కారుడంటాడు - వినదగునెవ్వరు చెప్పిన , వినినంతనే వేగపడక వివరింప  దగున్ - అని. అది 'సలహా' కూ వర్తిస్తుంది .
  • సత్యం బ్రూయాత్ ; ప్రియం బ్రూయాత్ ; న బ్రూయాత్ సత్యమప్రియం :- అంటే సత్యమే చెప్పాలి . కానీ వినేవారికి  ప్రీతికరం గా వుండేటట్లు   చెప్పాలి.  అప్రీతికరం గా సత్యాన్ని చెప్ప వద్దు . యిది చాలా పురాతనమైన సూక్తి . యిది సలహాలు చెప్పే వారికి పూర్తిగా వర్తిస్తుంది. కఠినంగా మాట్లాడే వాళ్ళు సలహా యివ్వకుండా వుండడమే , వుభయులకూ మంచిది .  నేను కట్టె  విరిచినట్టు మాట్లాడే వాడిని - అనే వాళ్ళలో సత్యాని కంటే , నిర్దయ, అమానుషత్వం ఎక్కువగా వుంటాయి . వారు సలహాలు యివ్వడానికి అనర్హులు
  • సలహా యిచ్చే వారికి తీసుకునే వారి పట్ల అభిమానం , అక్కర వుండక పొతే - వారి సలహా సరైన సలహా కానే కాదు.  అలాగే, తీసుకునే వారికి, ఇచ్చే వారి పట్ల గౌరవము ,  అభిమానము లేకపోతే - వారికి సలహా ఇవ్వనే రాదు .
  • సలహా పాటిస్తే వచ్చే పరిణామాలు ఎలా వుంటాయో పూర్తిగా అర్థం చేసుకుని కానీ - సలహా యివ్వ కూడదు; పాటించ కూడదు . 
  • సలహాలు - తీసుకునే వారి మనస్స్థితి , ధైర్య సాహసాలు , వివేకము, విజ్ఞానము , వయస్సు - వీటిని బట్టి మారిపోతూ వుంటాయి . క్రూర మృగం కనిపిస్తే - పోరాడి వధించమని సుక్షత్రియునికి చెప్పాలి . చెట్టెక్కి తప్పించుకోమని   మిగతా వారికి చెప్పాలి .
  • మూర్ఖుడు ఎవరి సలహా తనకు అక్ఖర్లేదు - అని అనుకుంటాడు . కానీ వివేక వంతుడు  యితర్ల ఆలోచనలు వింటాడు - అంటుంది బైబిల్ .
  • మంచి సలహాలు అడగని, తీసుకోని వాడికి - జీవితంలో పడే దెబ్బలే - సరైన సలహాలనివ్వ గలదు   - అంటాడు హొరేజ్ .
  • నా జీవితమే - నేనివ్వగలిగే సలహా - అన్నది మహాత్మా గాంధీ అభిప్రాయం .
  • సహాయం చెయ్యడం - సలహా యివ్వడం కంటే మంచిది - అని మార్క్విస్  అనే ఆయన అంటాడు
  • నువ్వు నీలాగే వుండు - అన్నది కొంత మందికి మనం యిచ్చే మహా మూర్ఖమైన సలహా - అంటాడు థామస్ యల్ మేసన్. బాగు లేని వాడే సలహా అడిగే వాడు - నీవు అలాగే వుండు అనడం సలహా కానే కాదు . 
  •  పోగాలం దాపురించిన వారు - ఆప్త వాక్యమును వినరు - అని ఏకాలం నాటిదో వొక అభిప్రాయం . మరో రకంగా చూస్తే - ఆప్త వాక్యము (శ్రేయోభిలాషులు , వివేకులు అయిన వారు ఆప్తులు ) వినక పొతే - పోగాలము దాపురిస్తుందని అర్థం. 
  • కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా శయనేషు రంభా - అని భార్యను గురించి వొక "గొప్ప మాట" - భార్య యిలా వుంటే బాగుండునని అన్నారు . అటువంటి  భార్యను మించిన  సలహాదారు మరొకరు వుండరు - అని అర్థం .
  • అలాంటి (భర్త పైన అమితమైన ప్రేమ వున్న) భార్యల మాటలు విని బాగు పడిన భర్తలు, కుటుంబాలు ఎంతో మంది వున్నారు. అటువంటి భార్య దొరకడం దేవుడిచ్చిన వరం - అని తమిళ సామెత . కొంత మంది  (భర్త తప్ప మిగతా విషయాలపై ప్రేమ వున్న) భార్యల మాటలు విని - నాశనమయిన కుటుంబాలూ వున్నాయి . . 
  • సలహాల వరకు - ప్రపంచం లో అడిగే వారి కంటే - యిచ్చే వాళ్ళు చాలా, చాలా  ఎక్కువ అని వొకాయన అభిప్రాయం .
  • అయాచిత సలహాలు యిచ్చే వారికి - వాటిని ఆచరించడం లో వున్న సాధక బాధకాలు అర్థం కావు - అన్నది వొక పూర్వోక్తి .
  • యెవడైనా వొక్కడు నిన్ను  గాడిదా అంటే దాన్ని అసలు పట్టించుకోకు . కానీ మరో యిద్దరు అన్నారంటే - వెంటనే వొక కళ్ళెం కొనుక్కొని తగిలించుకో - అంటాడు తాల్ముడ్ . 
  • పడవలో నుండి - క్రింద నీళ్ళలో మునుగుతున్న వాడికి సలహా యివ్వడం తేలిక . పాటించడం కష్టం .
  • అన్నీ నువ్వనుకున్నట్టు జరిగితే - మరి నేనెందుకు ? దేవుడెందుకు ? నువ్వనుకున్నట్టు జరిగేవి కొన్ని . నేననుకున్నట్టు జరిగేవి కొన్ని . 99 శాతం దేవుడనుకున్నట్టు , నువ్వూ , నేనూ  అనుకోని విధంగా జరుగుతాయి . అందుకే వివేక వంతుల సలహాలు అడగాలి . పాటించాలి . 
  •  నీకే తెలీని విషయాలలో అస్సలు సలహా యివ్వకు 
  •  ప్రేమ లాంటి కొన్ని విషయాలలో - వద్దు, కాదు లాంటి సలహాలను  ఎవరూ వినరు గాక వినరు. 
  • కొంత మందికి సలహా చాలదు . థెరపీ కావాలి. 
  • ధనవంతుడు బీద వాడికి సలహా యివ్వడం మనం చూడొచ్చు . బీద వాడు ధనవంతుడికి సలహా యివ్వడమో , అది యితడు పాటించడమో చూడడం చాలా అరుదు .
  •  ధనవంతుడు - బీదవాడికి యిచ్చే సలహా - సాధారణంగా పాటించ లేనిది గానే వుంటుంది . 
  • నిన్ను వూరికే పొగిడే వాడి సలహాలో నిజం సాధారణంగా వుండక పోవచ్చు . 
  •  నీ సలహా ఎప్పుడూ కాస్త క్లుప్తంగానే వుండనీ - అంటాడు హోరాజ్ 
  • కొంత మంది సలహా అడుగుతున్నారో , తమ కష్టాల్లో భాగస్వామ్యం తీసుకో మంటున్నారో - బాగా జాగ్రత్త గా గమనించి మరీ సలహా యివ్వండి . 
  • వొకరికొకరు సలహా యిచ్చుకో వడం లోనే -అందరి రక్షణా వుంది (బైబిల్  వాక్యం )
  • రాజులకు మంత్రులూ వుంటారు . భట్రాజులూ వుంటారు . మంత్రుల వద్ద పొగడ్త ఎదురు చూడకూడదు . భట్రాజుల వద్ద సలహా అడగ కూడదు .
  • మంచి సలహా దొరికితే - పది మందికి చెప్పండి .
  • తండ్రిని మించిన శ్రేయోభిలాషి అరుదు . ఆయన యిచ్చే సలహా తీసుకోండి . తరువాత మంచి వివేక వంతులనూ  అడగండి . వొక్కో సారి తండ్రి సలహా మిన్న గా వుండొచ్చు -అది మెదడు నుండి మాత్రం కాక , హృదయం నుండి కూడా వస్తుంది గనుక . 
  •  స్టాక్ మార్కెట్ కు చాలా మంది రోల్స్ రాయిస్ కార్లో వస్తారు. సబ్ వే లో నడిచి వెళ్ళే వారి వద్ద సలహా తీసుకుంటూ వుంటారు.    ( వారన్ బఫ్ఫే)
  • పోప్  వద్ద సెక్స్ ను గురించి సలహా అడగొద్దు . అవి ఆయనకు తెలిసి వుండ కూడని విషయాలు  - GB  షా 
  •  సలహా యిస్తే యివ్వు కానీ - ఆ తరువాత ఎదుటి వారు అది పాటించే తీరాలని అనుకోకు . వారిని నీవే సరి చేయాలని అనుకోకు . 
  •  హృదయ కవాటం తెరిచి లేక పొతే - అందులోకి ఏ సలహా ఎక్కదు . అది వృథా శ్రమ . 
  •  నువ్వు  చెయ్యలేనిది ఎదుటి వాడు చెయ్యాలని సలహా యివ్వకు .  అలాగే ఎదుటి వాడు చెయ్య లేనిది - చెయ్యమని సలహా గా యివ్వకు 
  •  నువ్వు మొయ్య లేనిది , ఎదుటి వాడు ఎలా మోయ్యాలో చెప్పకు . అది నువ్వు మోసినప్పుడే తెలుస్తుంది  - అది ఎలా మొయ్యాలో  
  • మన దేశాన్ని ఎంత బాగా ఎలా నడపాలో చెప్ప గలిగే వాళ్ళంతా ఆటో డ్రైవర్ లు గానో , అదీ కాకుండానో  వున్నారు . ఎంత దురదృష్టం!
  • గొప్ప గురువు చెప్పేదంతా గొప్ప సలహా నే -  వొక మంచి గురువు ఎల్లప్పుడూ కావాలి . 
  • ప్రతి రోజూ - లోకాః సమస్తాః సుఖినో భవంతు ; సర్వే జనాః సుఖినో భవంతు; అని మొదట అనుకోండి . ఆ భావం వుంటేనే - సలహాలు యివ్వండి . లేకపోతే  వద్దు .
  • చిట్ట చివర - నా సలహా ఏమిటంటే - ప్రతి రోజూ , మొట్ట మొదట, మీరు, మీకే వొక మంచి సలహా యిచ్చుకోండి .  వీలైనంత పాటించండి . అప్పుడే - అది మంచి సలహానా , కాదా అని మీకు తెలుస్తుంది . 
సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్   

19, ఫిబ్రవరి 2014, బుధవారం

తెలంగాణా బిల్లు - యిక వుద్యమాలు,మనలను మనం శిక్షింకోవడం వద్దు - సీమాం ధ్రను దేశంలో నంబర్.1 రాష్ట్రం గా తీర్చి దిద్దాలి - ఎలా? (యిలా!)


తెలంగాణా బిల్లు

తెలంగాణా బిల్లు ప్రపంచానికి తెలియనివ్వకుండా, TV  చానళ్ళు లేకుండా , లోక్ సభలో డిస్కషన్ లేకుండా , అసలేం జరిగిందో  ఎవరికీ తెలియనివ్వకుండా , ఆంధ్రా MP లు లేకుండా - లోక్ సభలో పాస్ చేసుకున్నారు .

పార్లమెంటులో పాసయ్యే  చాలా బిల్లు లకు  కేనీసం 20 శాతం మంది MP లు కూడా సభలో లేకుండా పాస్ చేసేసుకోవడం  పాత విషయం . అది మనం ఎన్నుకుంటున్న నాయకుల గొప్ప తనం. నన్నడిగితే - కనీసం 95 శాతం బిల్లులకు -  మద్దతు గానో ,వద్దనో వోటు చెయ్యని  MP లను జీవితాంతం  అనర్హులుగా ప్రకటించాలి . ప్రభుత్వోద్యోగులూ - మీ లాగే ముఖ్యమైన విషయాలు, పనులు  చెయ్యాల్సి వున్నప్పుడు బయటికి వెళ్లి పోతూ వుంటే  - ఎలా వుంటుంది? నిజానికి - మీ నాయకత్వ లక్షణాల వల్ల ,  వాళ్ళూ కొంత అలాగే వున్నారు కూడా . ఈ MP లు బాగుంటే , ప్రభుత్వోద్యోగులూ బాగానే వుంటారు . యథా రాజా తథా ప్రజా . 

సరే . ఈ పాత , వున్న విషయాలు ప్రక్కన బెడితే - కొత్త  ఏమిటంటే సభలో అసలేం జరిగిందో ప్రజలకు తెలియనివ్వ కుండా  TV  చానళ్ళు కూడా బ్లాక్ అవుట్  చేసి , డిస్కషన్  లేకుండా, సంబంధిత MP లు కూడా లేకుండా , బిల్లు పాస్ చెయ్యడం . కాంగ్రెసే వస్తే - యిక మున్ముందు , ఇలాంటివి ఎన్ని జరగ నున్నాయో ?

L.   రాజగోపాల్  గారు మిరియాల పొడి స్ప్రే  చల్లారట . మరి, ఆయనేమో , తెలంగాణా MP ల నుండి  నన్ను నేను  రక్షించు కునేందుకు అలా చేశాను  అంటారు .  నిజమేది ? కనీసం - ఆ విడియో ప్రజలకు పూర్తిగా చూపండి . ఎవరు ఏం చేసారో తెలుస్తుందిగా . అది చెయ్యండి ముందు . మరో MP,  కత్తి పట్టుకు వచ్చారు - అన్నారు . ఆయనేమో, అయ్యా , అది కత్తి కాదు స్పీకర్  ముందున్న మైకు అంటున్నారు . అందులో ఏది నిజం . ఎక్కడో హోటళ్ళలో , మాళ్ళలో  CCTV లు వుండాలి - అనే వారు , పార్లమెంటులో , ఎందుకు లేదో మాకు చెప్పండి .  వుంటే - ఆ ఫుటేజ్ ప్రజలకు చూపండి .  అది లేకుంటే - మీరు చెప్పేవన్నీ అబద్ధాలే -అనుకోవాల్సి వుంటుంది .

అయినా - మా వాదం యిది అని సమర్థ వంతంగా సభ ముందు పెట్ట లేని వాళ్ళు - స్పీకర్ ముందు గలాటా చెయ్యడం ఏమీ బాగు లేదు . స్పీకర్ గారు కూడా - మీ వాదం వినిపించండి - అని వారికి పూర్తి అవకాశం  యిచ్చి వుండాలి . కనీసం పార్లమెంటు లో నైనా ప్రజాస్వామిక పద్ధతులు , విలువలు పాటింప బడాలి . నాకు ఈ స్పీకర్ గారంటే  చాలా యిష్టం . బాగా నవ్వుతూ, సభను  బాగా సమర్థంగా నడిపేస్తారు . మరి ఈ విషయంలో - ఆమె ఎందుకు యిలా చెయ్యాల్సి వచ్చిందో   తెలియడం లేదు .

నిజానికి తెలంగాణా రాష్ట్ర నినాదమే - TRS  పార్టీ వారి అబద్ధాల తోనూ , కాంగ్రెసు వారి అసమర్థత తోనూ వున్న పునాది పైనే నిలబడి వుంది . NT  రామారావు గారికి తెలంగాణా వారు  పూర్తిగా వోటు వెయ్యలేదా ? వేశారు కదా. అలాగే , చంద్ర బాబు గారికి కూడా తెలంగాణా వారు పూర్తిగా వోట్లు వేశారు కదా . అప్పుడు TRS వారికి, KCR గారికి కూడా తెలంగాణా లో వోట్లే పడ లేదు . మరి ఎప్పుడొచ్చింది , తెలంగాణాకు ఆంధ్రా వారు  అన్యాయం  చేశారన్న వాదం ? చంద్ర బాబు తరువాత -  కాంగ్రెసు వారి కుల, మత రాజకీయాల వలన, వారి అసమర్థ నాయకత్వం వలన నే వచ్చింది. వారి పాలనలో- రెండు లేదా మూడు కులాలు మాత్రమే  విపరీతంగా లబ్ధి పొందాయనే  విషయం తెలియని వారెవరు ? నాకనిపిస్తుంది - KCR  గారు కూడా అలా చెప్ప లేక యిలా   చెబుతున్నారేమో అని . కానీ - ఆయన నోరు తెరిస్తే అపభ్రంశపు  మాటలే కానీ , తిట్లే కానీ మంచి మాటలు అస్సలు రావాయె . యిక ఆయన తెలంగాణా నాయకుడు . తెలంగాణా కు ఎటువంటి నాయకుడు   దొరికాడు?

తెలంగాణా విషయం మర్చి పోయే ముందు వొకే వొక మాట. రాజకీయ నాయకుల సంగతి ప్రక్కన పెడితే - మిగతా సీమాంధ్ర వారు ఎన్నో లక్షల  కోట్లు తెలంగాణా లోనే  ఖర్చు పెట్టారు . వారు ఎప్పుడూ తెలంగాణా వాసుల క్షేమం , అభివృద్ధి కోరారు తప్ప - ఎప్పుడూ వివక్షతో , పక్ష పాతమో చూపలేదు . యిది ముమ్మాటికి నిజం .శ్రీ  కృష్ణ కమిటీ కూడా యిదే  చెప్పింది . మరే నిష్పాక్షిక కమిటీ వేసినా అదే  తేలుతుంది .  రోశయ్య గారు, YSR గారు , కిరణ్ కుమార్ రెడ్డి గారు  మరో నిష్పాక్షిక కమిటీ కూడా వేసి, TRS వారి అబద్ధాలు "నిస్సందేహంగా"  ప్రపంచం ముందు తేల్చి వుండాల్సింది. కానీ వారది చెయ్య లేదు . ,అందువలన ఆంధ్రులేదో  అన్యాయం చేశారు - అని KCR  గారు, వారు పార్టీ వారు చెప్పడం - ఈ పచ్చి అబద్ధాలు వంద సార్లు చెబితే  ప్రజలూ నమ్మడం జరిగి పోయింది. యిలా అబద్ధాలు చెప్పే వారికి - దేవుడే బుద్ధి చెప్పాలి . 

అయితే - రాజకీయ నాయకులు చాలా మంది - అప్పుడూ, యిప్పుడూ వారి స్వప్రయోజనాలకే ఎక్కువ ముఖ్యత్వం యిచ్చారు . అది తెలంగాణా వారైనా సరే , ఆంధ్రా వారైనా సరే .

సరే . యిప్పుడు మేము వేరే , మీరు వేరే - అనే భావానికి తెలంగాణా ప్రజలు కూడా వచ్చినట్లు - వుంది కదా . అలాగే వుండనీ . అదీ మంచిదే. జరిగేవన్నీ మంచిదే . ఇకనైనా , సీమాం ధ్రలో - ఏం చెయ్యాలో  ప్రజలు యోచన  చెయ్యాలి . ఏదో  జగన్ గారో , మరొకరో చెప్పారని, బందులు - చేసుకుంటూ పొతే , మనల్ని మనమే శిక్షిం చుకోవడమే కానీ - అందులో , ప్రయోజకత్వం  ఏ మాత్రమూ లేదు. బందు రాజకీయాలు కట్టి పెట్టి, ఇకపై సీమాంధ్ర ను ఎలా భారత దేశంలో  నంబర్ . 1  రాష్ట్రం గా తీర్చి దిద్దాలో ఆలోచించాల్సిన సమయం వచ్చింది .

ఇందులో - నా అభిప్రాయాలు  ఇవి :

1.  మొట్టమొదట - రాయలసీమ , కోస్తా లాంటి దరిద్రపుగొట్టు విభజింపు పదాలు , అన్ని  పుస్తకాల్లో నుండి తీసి వెయ్యండి . వాటికి అర్థమే లేదు . తమిళనాడులో కూడా కోస్తా వుంది . లోతట్టు ప్రాంతాలూ వుంది . అక్కడా ఏదో చరిత్రలు వుండనే  వున్నాయి . కానీ వారు మనలా, ప్రాంతాల వారీగా - మనుషులను గానీ, మనసులను గానీ , ప్రభుత్వ పాలసీలను గానీ  ఎప్పుడూ విభజించ లేదు .  మనలో - అందు వల్లనే వచ్చింది  తెలంగాణా నినాదం . మరో విభజన నినాదానికి  తావివ్వకుండా - ఈ  అర్థం లేని పదాలను పూర్తిగా విడిచి పెట్టండి. 

సీమాంధ్రలో కూడా, విభజించి పాలించుమన్నా - అనే దరిద్రుడు ఎవడో వొకడు పుట్టనే పుడతాడు,  . ఏదో వొకటి చెబుతాడు , అన్యాయం జరిగింది - అదీ, యిదీ అని . వాడి వెనుక వెళ్ళే మూర్ఖులూ వుండనే వుంటారు . కాబట్టి , సమైక్యాంధ్ర లేకుంటే - ఏం మునిగి పోలేదు. కనీసం సీమాంధ్ర వొకటే ప్రాంతం అనే భావన ప్రజలలో కలిగించాలి . కాబట్టి - విభజింపు  పదజాలం తీసి పారెయ్యండి . ప్రభుత్వ పాలసీలన్నీ - అన్ని జిల్లాలకు సమానంగా వర్తింప జేయండి.

2.  సీమాంధ్ర - భారదేశం లోనే  నెం . 1 రాష్ట్రం గా రావాలంటే - ఏం చెయ్యాలో , అది యోచన చెయ్యండి . గొప్ప, గొప్ప సంస్థలనీ వొకే నగరంలో  వద్దు . అన్ని జిల్లాలూ , అన్ని నగరాలూ అభివృద్ధి చెందాలి . వొక్కొక్క జిల్లాకూ వొక ప్రణాళిక రూపొందించండి .   IIT   తిరుపతి లో పెట్టండి .  IIM విశాఖపట్టణం  లో పెట్టండి . AIIMS  సంస్థ విజయవాడ లోనో, నెల్లూరు లోనో  పెట్టండి.

3. IT రంగం - అభివృద్ధికి సులభమైన , కీలకమైన రంగం . అది - రాబోయే రాజధానిలో పెట్టండి . అన్ని IT  సంస్థలను అక్కడికి ఆహ్వానించండి.  అలాగే - మనకూ వొక రైల్వే జోన్ కావాలి . అది విజయవాడలో పెట్ట వచ్చు . యిదీ కేంద్రాన్ని అడగాలి . సాధించాలి .

4. క్రొత్త రాజధాని అన్ని జిల్లాలకూ అందుబాటులో వుండే లాగా  - వచ్చే 10 సంవత్సరాల కాలం లో త్వరగా అభివృద్ధి చెందే  లాగా - వొక  "క్రొత్త" నగరం గానే  నిర్మించాలి . కనీసం 50 చ.కి.మీ . వైశాల్యంతో  వుండాలి . గుజరాత్ లో క్రొత్తగా  గాంధీ నగర్  పెట్టుకున్నట్టు - అంతకంటే మిన్నగా - పెట్టుకోవాలి . అందులో, మన రాష్ట్రం లో సర్వ సాధారణంగా  జరిగే  భూ-ఆక్రమణలు అసలు లేకుండా చూసుకోవాలి .  నా వుద్దేశంలో - అదేదో , నెల్లూరు విజయవాడ ల మధ్య వుంటే - మేలని - అనిపిస్తుంది . విశాఖ , చాలా ప్రాంతాలకు అతి దూరం . హైదరాబాదు కంటే కూడా చాలా దూరం . అక్కడ తుఫాన్ల నుండి కూడా ఎక్కువ ప్రమాదం వుంది . ప్లేన్లు నిలవడం కూడా కష్టం .  భవిష్యత్తు దృష్ట్యా - అంత మంచి రాజధాని  కాదు - అనిపిస్తుంది . సరిక్రొత్త నగరం ప్లాన్ చెయ్యాలి . అదే మంచిది అని నా అభిప్రాయం . అందుకు సరిపడ్డ నిధులు కేంద్రం యివ్వాలి . ఆ నగరం - అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే  ఎక్కువ అభివృద్ధి కాగలిగింది గా వుండాలి .

5. చిత్తూరు జిల్లా లాంటి ప్రాంతాలలో - చాలా ఊళ్లలో - త్రాగు నీళ్ళు కూడా లేవు . ఇదేదీ , YSR  గారికి గానీ , ఆ తరువాత వచ్చిన వారికి గానీ , NTR  గారికి పూర్వం వున్న  వారికి గానీ - ఏ మాత్రము పట్ట  లేదు . కనీసం త్రాగు నీటి వసతి కల్పించ లేని  రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వాలు? ఇలాంటి పరిస్థితే తెలంగాణాలో కూడా కొన్ని ప్రాంతాలలో వుంది.  అందు వలన - వచ్చే  క్రొత్త రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి , నీటి వసతి కావాలి. యిది కేంద్రాన్ని అడగండి . 66 ఏళ్లలో చెయ్యనిది - యిప్పుడైనా చెయ్యమనండి . ఎలాగైనా యిది సాధించి  తీరాల్సిన అంశం . లేదంటే ఈ ప్రాంతాలలో త్వరలో ఎడారులు తయారు కావడం తథ్యం .

6. క్రొత్త రాష్ట్రానికి - విద్యుచ్చక్తి చాలా ముఖ్యం . ప్రజలు చాలా విషయాలు అర్థం చేసుకోవలసి  వుంది . కాంగ్రెసు పాలనలో - చాలా రాష్ట్రాలలో , అసలు విద్యుచ్చక్తి వుత్పాదన లేకుండా పోయింది . వుత్పాదకులకు కావలసిన భూసేకరణ కూడా చెయ్య లేదు . గత 10 సంవత్సరాలలో భారత దేశమంతటా జరిగిన నిర్వాకం యిది . బడ్జెట్టులో , వచ్చే డబ్బు , ఎన్నికల కోసం , వోట్ల కోసం , పంచడం వొక్కటే జరుగుతో వుందే తప్ప - పరిశ్రమలు, విద్యుత్తు , త్రాగు నీరు - లాంటి మౌలిక సదుపాయాలు కూడా చెయ్యడం లేదు . ఫలితంగా - బాగా చదువుకున్న వారికి కూడా ఉద్యోగావకాశాలు  బాగా తగ్గి పోయాయి . అందరికీ ఉద్యోగావకాశాలు వుంటే - రిజర్వేషన్లు అక్కరే లేదు. వున్నది వెయ్యి మంది ; ఉద్యోగాలు 10 మందికి  - అంటే , రిజర్వేషన్లు, పోరాటాలు   కావాలి . వస్తాయి . ఎన్ని చేసినా , 990 మందికి , ఉద్యోగాలు లేక పోవడం - జరగనే జరుగుతుంది . కాంగ్రెస్ పాలన లో అదే జరుగుతూ వుంది చాలా రాష్ట్రాలలో . 

నరేంద్ర మోడీ పాలనలో  అది లేదు . బీహారీలు వస్తే - రండి , మా వారికే కాదు , మీకూ ఉద్యోగాలున్నాయి రండి అంటారు ఆయన . అదే   KCR  గారు , వారి అనుయాయులు,  దశాబ్దాలకొద్దీ తెలంగాణా లో  వున్న కొంత మంది ఆంధ్రులను - మీరు వెళ్ళిపొండి - అని , పనిగట్టుకుని యిళ్ళకు కూడా  వెళ్లి చెబుతున్నారు . యివన్నీ వార్తా పత్రికలో కూడా అప్పట్లో వచ్చాయి . ఆయన కూడా ఈ దేశంలో వొక నాయకుడు !! అందుకని  క్రొత్త రాష్ట్రంలో - విద్యుచ్చక్తి ఉత్పాదన మనకు కావాల్సిన  దానికంటే 200 శాతం  ఎక్కువ జరగాలి . అందుకు ప్రైవేటు రంగ సంస్థలను పెద్ద ఎత్తున ఆహ్వానించ వలసి వుంది . అలా చెయ్య గలిగే నాయకుడినే ఎన్నుకో వాల్సి వుంది .  ఎంత విద్యుచ్చక్తి  వుంటే అంత ఉద్యోగావకాశాలు , పరిశ్రమలు  అన్నీ వస్తాయి. అందుకే, వున్న పరిశ్రమలన్నీ యిప్పుడు  గుజరాత్ వైపు వెళ్లి పోతున్నాయి. 

7. తెలంగాణా తో యిటువైపు వారికి ఎప్పుడూ వైరం  లేదు . యిక ముందూ వద్దు . మన రాష్ట్రం అభివృద్ధి వైపే మనసు పెట్టాలి . కాకపొతే - నీటి పారుదల విషయంలో - సరైన  జాగ్రత్తలు తీసుకోవాలి . ఈ విషయంలో కాంగ్రెసు పాలనలో మనం ఎంతో ఘోరంగా పొగొట్టుకున్నామనే చెప్పాలి . కనీసం  ప్రతి పక్ష నాయకుడు గా చంద్ర బాబు తీసుకున్న చర్యలకు కూడా అండగా నిలవ లేదు  కాంగ్రెస్ ప్రభుత్వం . యిది మారాలి . యిటువంటి సందర్భాలలో  -  తమిళ నాడు  లోని ,ప్రతి పార్టీ అందరితో బాటు వొక్కటిగా నిలుస్తుంది. అది మనం నేర్చుకోవాలి . 

8.  ఎవరు - మన క్రొత్త రాష్ట్రానికి సరైన మద్దతు యిస్తారో  - కేంద్రం లో వారితోనే పొత్తు పెట్టుకోండి . వారి వద్ద అటువంటి హామీలు అడగండి . తీసుకోండి . 

9. యిక వుద్యమాలు వద్దు . అది వూరికే మనలను మనం శిక్షింకోవడం తప్ప , కొంత మంది రాజకీయ  ప్రయోజనాలకు తప్ప - అందులో ప్రజలకు వొరిగేదేమీ లేదు. ఈ ఉద్యమాలు - దొంగలు పోయిన ఆరు నెలలకు - కుక్కలు మొరిగిన సామెత లాగా వుంటుంది . పదవిలో వున్నప్పుడు - TRS వారిని , వారి అబద్ధాలను - ప్రజల ముందు, పార్లమెంటు ముందు నిర్దిష్టంగా పెట్ట లేని వారు , యిప్పుడు ఉద్యమాలు చెయ్యడం ఏ ప్రయోజనమూ లేదు . ప్రపంచం దృష్టిలో హాస్యాస్పదం గా వుంటుంది . ఈ నాయకులు ఏ కోణంలోనూ , కేంద్రం లోని అధికార , ప్రతిపక్ష నాయకులను  ఎవరినీ మా వాదం వెనుక నున్న బలం యిది అని చెప్పి నమ్మించ లేక పోయారు.  అందు వలన యిక ఉద్యమాలు వద్దు .

10. యిక - మంచి నాయకులను వెదకండి . కుల,మత రాజకీయాలకు అతీతంగా  మోడీ లాంటి నాయకుడు దొరుకుతాడేమో చూడండి.  జయ ప్రకాష్ నారాయణ్, చంద్రబాబు లాంటి వారు ప్రజల మనస్సులో విద్వేషాలు రేకెత్తకుండా, అభివృద్ధి సాధించే వారని నా అభిప్రాయం . వారిలో - లంచగొండి తనమూ లేదు.

11. చిట్ట చివర - నా ఆశ, అభిప్రాయం , మనవి  ఏమిటంటే - ప్రజలంతా అభివృద్ధి పథం లోకి వచ్చెయ్యండి . తెలంగాణా ప్రజలూ బాగుండనీ. మనమూ బాగుందాం . ఈ వివాదంలో మనం నేర్చుకోవలసిన విషయాలు యివీ. 

సర్వే జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్




14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలంగాణా బిల్లు - సమైక్యాంధ్ర ఉద్యమం - అన్ని ప్రాంతాలకూ న్యాయం - సర్వే జనాః సుఖినో భవంతు


= తెలంగాణా బిల్లు =


పార్లమెంటులో  తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్ట బడింది. అందులో ఏముంది ? తెలంగాణా ప్రాంతం వొక ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని మాత్రం వుంది. 

యిక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోంది కదా . దాని మాటేమిటి ? ఎందుకని సమైక్యాంధ్ర ప్రజలు, నాయకులు అందరూ - ఈ రాష్ట్ర విభజన వద్దంటున్నారు ?  యివి  ఏదీ జాతీయ స్థాయి నాయకులు యోచనే చేయరా?

నాగేశ్వర రావు , రామారావు   గార్ల  నుండి , చిన్న స్థాయి   టెక్నిషియన్ వరకు సినిమా రంగమంతా  మద్రాసు నుండి హైదరాబాద్ కు "మన రాష్ట్రం" అంటూ, అనుకుంటూ వచ్చారు . ఎన్నో స్టూడియోలు , మరెన్నో సినిమారంగ  వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో  నిర్మించారు . చంద్రబాబు  గారు  తెచ్చిన ప్రతి సంస్థా , హైదరాబాదు కే తెచ్చారు. 

అలా వచ్చిన వారినెవరూ - యిది మీ రాష్ట్రం  కాదు - యిక్కడికెందుకొచ్చారు, యిక్కడెందుకున్నారు - అని అడగ లేదు; వారూ చెప్పవలసిన అవసరం రాలేదు. 

అంతే కాదు. రామారావు గారికి బ్రహ్మ రథం పట్టి తెలంగాణా వారంతా కూడా వారిని ముఖ్య మంత్రిని చెయ్య లేదా ? అప్పుడు  లేని వేర్పాటు భావం యిప్పుడెక్కడ నుండి  పుట్టుకొచ్చింది ? ఈ విషపుబీజం నాటిన వారెవ్వరు ? పెంచి పెద్ద  చేసిన వారెవ్వరు ? ప్రజలంతా కాస్త యోచన చెయ్యాలి .

రామారావు మాత్రమే  కాదు . చంద్రబాబు నాయుడు గారు, చివరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు , వేర్పాటు రాష్ట్ర వాదపు విష బీజాలు  తెలంగాణా లో పెద్దగా మొలవ లేదు ; పెరగ లేదు . యిదే  చరిత్ర . వారందరికీ వోటు వేసి గెలిపించిన  వారు తెలంగాణా ప్రజలు . అప్పుడు లేని అన్యాయం  ఎప్పుడు మొలిచొచ్చింది ? 

అన్యాయం, అన్యాయం అని TRS నేతలు ఘోషిస్తే - శ్రీకృష్ణ కమిటీ వేసారు . ఆయన లెక్కలన్నీ చూసి - అయ్యా ఏ అన్యాయమూ లేదు - జరుగ లేదు అని తేల్చి చెప్పారు . మరి - ఆ కమిటీ పైనే బురద చల్లారు TRS  నాయకులు .  కానీ , ఆ కమిటీ వారు చెప్పింది ఎలా తప్పు అన్నది ఎవరూ చెప్ప లేదు ; ఏది రైటో కూడా  వారు చెప్ప లేదు . యిప్పుడు తెలంగాణా  ఎందుకు - అన్న వాదం  మరో రకంగా తిరిగింది . 

మా వూళ్ళలో  - ఆంధ్ర వుద్యోగులు  వున్నారు - వుండకూడదు - అన్నారు. అదే మాకు జరిగిన అన్యాయం  అన్నారు.  పని గట్టుకుని వాళ్ళ యిళ్లకు  వెళ్లి  - మీరు మీ ప్రాంతానికి  వెళ్లి పొండి - అన్నారు . మేము శాంతంగా  చెబుతున్నాం - వెళ్ళిపొండి - అన్నారు, బెదిరించారు . యివన్నీ వార్తాపత్రికలలో  కూడా వచ్చాయి .  యిది ఎంత అరాచకమైన , క్రూరమైన, చట్ట వ్యతిరేకమైన చర్య ? అయ్యా - ఉద్యోగులు అలా ఎలా వెళ్లి పోగలరు ? అసలు, ఎవరయినా  అలా  యెలా  వెళ్లి పోగలరు? అలా వెళ్ళ గొట్టే అధికారం TRS వారికి గానీ, మరెవరికి  గానీ ఎవరిచ్చారు?  యిది అడగాల్సింది ఎవరు ? తెలంగాణా ప్రజలే  అడగాలి.  వొకాయన అంటారు - పక్క వాడికి అన్యాయం జరిగేటప్పుడు  మీరు అడ్డుకోక   పొతే , ఆ తరువాత  జరిగే అన్యాయం మీకే , అని . 

ఇప్పుడున్న వినాయకులు తెలంగాణా పాలకులైతే - ఈ విద్వేషాల బీజాలు పెరగడం తప్ప మరో గొప్ప పనేమే జరగదనేది తథ్యం .

తెలంగాణా లో ఎన్ని పరిశ్రమలు  పెట్టారు! ఎన్ని విశ్వవిద్యాలయాలు పెట్టారు ! అందు వలన తెలంగాణా కు న్యాయం జరిగింది కాదా ? ఎలా జరగలేదంటారు?  

నాకు మాత్రం మొదటి నుండీ ఈ పధ్ధతి నచ్చ లేదు . రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ - యివి రావాలి. వొక IIT  కానీ , IIM  కానీ , ISB  కానీ మరే అత్యున్నత విద్యాసంస్థ కానీ , రాయలసీమ లో కానీ , కోస్తా ప్రాంతం లో గానీ  ఎందుకు లేదు ? వొక్క IT రంగ సంస్థ కూడా - తెలంగాణా ప్రాంతం తప్ప - మరెక్కడా ఎందుకు పెట్ట బడ లేదు ? వొక్క జాతీయ / అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? యిక్కడే జరిగింది తప్పు . అన్ని ప్రాంతాల లోనూ - అటువంటి సంస్థలు వస్తే , ఈ వేర్పాటు వాదాలు  రావు ; వుండవు ; వచ్చినా , రాష్ట్రాలను విభజించినా  పెద్ద ప్రశ్న లేదు .  యిప్పుడు ప్రశ్న అదే . మేమూ ,మీరూ  అభివృద్ధి చేసిన  ముఖ్యమైన ప్రాంతం మీది - మాకేమీ హక్కు లేదు అంటే - అది అన్యాయం  కాదా .

66 ఏళ్ళ తరువాత కూడా - రాయలసీమలో త్రాగడానికి వూళ్ళలో నీళ్ళు లేవు . రామారావు గారు కూడా హైదరాబాదుకు , మద్రాసుకు  నీళ్ళు వస్తే చాలనుకున్నారు . ఆయన వుంటే - యివన్నీ చేసేవారేమో - నాకు తెలీదు .  కర్ణాటకా  వారు ముందు  యిటు వైపు వస్తున్న నీళ్ళు , వాళ్ళ రాష్ట్రంలో  నిలిపేస్తే -అడిగే వాడే లేడు మన రాష్ట్రంలో . యిప్పుడు సమస్య  తెలంగాణా రాష్ట్రం వస్తే - రాయల సీమకు - కనీసం త్రాగు నీళ్ళు అన్ని ప్రాంతాలకూ  రావాలి . వస్తుందా ? లేదా , TRS  వారు అది జరగనివ్వరా ? జరగనివ్వరనేది అందరి అభిప్రాయం.  కేంద్ర ప్రభుత్వం వారు రాయలసీమ కు ఏం న్యాయం చేస్తారు ? యిది - ఏవీ , పార్లమెంటులోని  బిల్లులో లేవు .  విభజిస్తే - ఏ ప్రాంతం వాళ్లకు , ఏం న్యాయం చేస్తాం - అన్న అంశం ఏదీ - ఈ బిల్లులో లేదు. యిదీ వొక బిల్లేనా ? తొందర పడి తాతాచార్యులు మతం మార్చుకున్నాడట. అలా వుంది పరిస్థితి . మన దేశంలో ఈ మధ్య వచ్చిన చాలా చట్టాలు తొందరపాటుతో చేసిన చట్టాలే . కోడలు ఫిర్యాదు చేస్తే - యింట్లో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని వొక చట్టం . కొంత మంది కోడళ్ళు ఆరడికి గురి అవుతున్న మాట నిజమే . ఎవరూ కాదనటం లేదు. కానీ, ఎంతో మంది కోడళ్లు పెళ్ళైన వెంటనే , యింటిని విడగొట్టడమూ , యింట్లో ఏ బాధ్యతలూ తీసుకోక పోవడమూ అంతే నిజం. మొత్తానికి ఎవరిది తప్పైనా , అది సాంతంగా విచారించి, సమస్యను పరిష్కరించాలా ? యింట్లో వాళ్లందిరినీ జైల్లో  పెట్టాలా ? సరే ; జైల్లో పెట్టిన తరువాత , ఆ కోడలితో , ఆ భర్త కానీ, యింట్లో వాళ్ళు కానీ ఎలా వొకటిగా వుంటారు ? యిదా ఆ కోడలి సమస్యకు పరిష్కారం ? ఈ చట్టం క్రింద ఎవరికీ ఏ రకమైన న్యాయమూ జరగడం లేదు - నాకు తెలిసినంత వరకూ . తెలంగాణా చట్టమూ అంతే . విడగొట్టడం గురించి మాట్లాడుతున్నదే తప్ప - తరువాత ఏమిటన్నది ఏమీ మాట్లాడడం  లేదు .

మన దేశంలో ప్రజలను విడగొట్టడం అంత సులభమైన పని మరొక్కటి లేదు . మీకన్యాయం జరిగింది ; జరిగింది ; అంతా వారివలనే - అంటే చాలు . నిజమే కాబోలు అనుకునే ప్రజలు మనం . ఏమన్యాయం జరిగింది; ఎప్పుడు జరిగింది ? ఎవరి వలన జరిగింది? యివి అడిగే వాడూ లేదు; చెప్పే వాడూ లేడు . 

నిజమే.  ప్రజలందరికీ అన్యాయం జరిగింది - కొన్ని విషయాల్లో . యిది అన్ని ప్రాంతాల్లోనూ  జరిగింది . ఉదాహరణకు , భూ ఆక్రమణలు . యివి పెద్ద ఎత్తున, అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి .  హైదరాబాదు లోనూ జరిగాయి . తిరుపతి లోనూ జరిగాయి . మరెన్నో ప్రాంతాల్లో జరిగాయి . వీటిలో కూడా - కొన్ని ధనిక కుటుంబాలకు చెందిన , కొన్ని  కులాల వారు మాత్రమే   చాలా ఎక్కువ గా చేశారు , చేస్తున్నారు - అన్న విషయం అందరికీ తెలుసు . వీరే రాజకీయాల్లోనూ, రౌడీ యిజం లోనూ, పేరు  మోశారన్నది మనకందరికీ తెలుసు. అంటే - ఆ కులాల వారందరూ అలా చేస్తున్నారని కాదు . చేస్తున్న వారిలో - కొన్ని కులాల వారు చాలా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయం . అదే కులాలలో మంచి నాయకులూ  వున్నారు . 

యిప్పుడు రాజకీయాలు అంటే రౌడీ ఇజం అన్న స్థాయికి దిగిపోయింది . యిటువంటి నాయకులకు యెదురుగా , సాధారణ ప్రజలకు ఎవరికీ న్యాయమూ లేదు ; రక్షణ కూడా లేదు - అన్న విషయం అందరికీ తెలుసు .

మనం మంచి నాయకులను ఎన్నుకుంటే - అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది . లేదా - ఏ ప్రాంతానికీ , న్యాయం జరుగదు . సాధారణ ప్రజలు కులాల వారీ, మతాల వారీ కాకుండా  మంచి వాళ్లకు వోటు వేస్తే , మంచే జరుగుతుంది . మన రాష్ట్రంలో - మనం మంచి  నాయకుడి కోసం వెదకాలే తప్ప , రాష్ట్ర విభజన కోసం కాదు . 

లాంకో హిల్ ఎక్కడ పోయినా - సాధారణ ప్రజలకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ, ప్రతి ప్రాంతం లోనూ త్రాగే నీళ్ళు  కావాలి కదా . వుద్యోగావకాశాలు అందరికీ కావాలి కదా. పరిశ్రమలు అన్ని చోట్లా రావాలి కదా . గొప్ప విద్యా సంస్థలు అన్ని చోట్లా రావాలి కదా . అన్నీ హైదరాబాదులో పెడితే , కనీసం యికపై వొప్పుకోకండి. మహబూబ్ నగర్  లోనూ రావాలి ; చిత్తూరు లోనూ రావాలి ; శ్రీకాకుళం  లోనూ రావాలి . 

అన్నీ చెప్పినా - చిట్ట చివర , నాకనిపించేది  ఏమిటంటే - ప్రజలుగా  మనం అందరం  వొకటే . దయ చేసి , మీరు వేరు, మేము వేరు -అనకండి. ఈ వేర్పాటు వాదానికి  అంతు  లేదు. ఎంతగానో వొకరినొకరు అభిమానించే  భార్యాభర్తల మధ్య కూడా - యిటువంటి వేర్పాటు విషబీజాల ద్వారా, విడిపోయే పరిస్థితులు  కల్పించే వారున్నారు. విడిపోయే వారూ వున్నారు. అది ఎంత తప్పో ఎప్పుడో తెలుస్తుంది . చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వొరిగేది ఏమీ లేదు . మాకు నవాబులైనా ఫరవాలేదు ,కానీ మీరు వద్దు - అనే మూర్ఖుల మాట నమ్మ వద్దు . 

సరే . రాష్ట్రాలు విభజించాల్సిందే - అనుకుంటే ; కాస్త  ముందు  చూపుతో,అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే లాగా వున్న బిల్లు వస్తే - కొంతలో కొంత మేలు .

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్




23, జనవరి 2014, గురువారం

అక్కినేని నాగేశ్వరరావు గారు - 90 ఏళ్ల మహత్తర జీవితం - వారు మిగిల్చిన తీపి గురుతులు ఎన్నో , ఎన్నెన్నో


అక్కినేని నాగేశ్వరరావు గారు పోయారు. 

90 ఏళ్ల మహత్తర జీవితం గడిపి , తుది వరకు , ఉత్సాహంగా , చిన్న పిల్లాడిలాగా తుళ్ళుతూ , అందరికీ ఆనందాన్ని పంచుతూ , ఎవరికీ కష్టం లేకుండా వెళ్లి పోయారు.

పోయినోళ్ళందరూ మంచోళ్ళు ; వున్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు - కదా . నిజమే. అక్కినేని ఎన్నో తీపి గురుతులని మిగిల్చి వెళ్లి పోయారు. ఆయన తీపి గురుతులే ఎన్నో , ఎన్నెన్నో. మరి ఆయన కొడుకులు మనమలు మళ్ళీ సినిమా ప్రపంచంలో, తమదైన  స్థానం , ఆయన్ను మరపించేది కాదు , ఆయన్ను తలపించేది సంపాదించుకున్నారు.

75 ఏళ్ళ నట జీవితం సామాన్యం కాదు . అందులోనూ - ఆయన నట జీవితం చాలా అసామాన్యం . ఎందరో నటులు వచ్చారు , వెళ్ళారు - అందరూ ANR లు , NTR లు కాలేదు కదా.  ANR గారు ఎక్కువగా చదువుకో లేదట. చదువంటే బళ్ళో చదివేదే చదువా ? నిజ జీవితంలో, నట జీవితంలో , ఆయన ఎంతో చదివారు. ఎంతో నేర్చుకున్నారు .  

నిజానికి - తెలుగు ప్రజానీకం ఆయననుంచి ఎంతో నేర్చుకుంది . భక్త జయదేవుడు తెలుగు వాడు కాదు ; కానీ నాగేశ్వరరావు గారి ద్వారా తెలుగు వాడు అయ్యదు. అలాగే, భక్త తుకారాం, విప్రనారాయణుడు,  కాళిదాసు, జక్కన్న , చివరికి కబీరు - వీరు అందరూ, తెలుగు వారు కాకున్నా , అక్కినేని ద్వారా - మనవారయ్యారు . దేశంలోని - అన్ని రాష్ట్రాల లోని గొప్ప వారిని మనకు పరిచయం చేసి, తెలుగు వారన్నా , భారతీయులన్నా వొకటే - అన్న ఏకీకృత భావం మనలో కలిగించారు అక్కినేని.  ఈ మహా కార్యం మరో నటుడెవ్వరూ, ఏ భాషలోనూ యింత ఎక్కువగా చెయ్యలేదు.  యివి మాత్రమా ! అనార్కలి, దేవదాసు, లైలా మజ్నూ లాంటి చిత్రాల ద్వారా - దేశంలోని - వివిధ రాష్ట్రాల లోని అత్యుత్తమ ప్రేమ కథలనూ మనకు అందించారు. దిలీప్ కుమార్ గారు అన్నారట - దేవదాసు అంటే వొక అక్కినేని నాగేశ్వర రావు గారు మాత్రమే అని . హిందీ లో ఆ పాత్ర పోషించింది ఆయనే .

255  పైగా చిత్రాలలో నటించిన అక్కినేని - తనకు నచ్చని, నప్పని పాత్రలను ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎప్పుడూ పదవుల కోసమో , ప్రతిష్ట కోసమో ప్రాకులాడలేదు . కావాలంటే - అవన్నీ వచ్చి పడేవే . కానీ - ఆయనకు, తన జీవితంలో - ఏం కావాలో, నిర్దిష్టంగా తెలుసు . అలాగే చివరి వరకు వున్నారు .

అయినా ఆయనకు ఎన్నో ప్రతిష్టలు , అవార్డులు  వచ్చిపడ్డాయి .అందులో కొన్ని యివి :-

1. పద్మ విభూషణ్ 
2.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 
3. ఫిల్మ్ ఫేర్  బెస్ట్ ఆక్టర్  అవార్డు - తెలుగు - 4 సార్లు
4. రఘుపతి వెంకయ్య అవార్డు 
5. NTR నేషనల్ అవార్డ్ 
6. నంది అవార్డ్ - బెస్ట్ ఆక్టర్ - 2 సార్లు 
7. కలై మామణి  అవార్డ్ -తమిళనాడు 
యింకా ఎన్నో ....

నాకు దేవుడంటే పెద్ద నమ్మకం లేదు - అని అనే వారట.  అంటూ, అంటూ, దేవుడి దగ్గరికి వెళ్లి పోయారు . NTR  లాగా ఎక్కువ "దేవుడి" పాత్రలు వెయ్యలేదు.  కానీ,  అన్ని రకాల "భక్తుడి" పాత్రలు వేశారు . దేవుడు లేదనే మహా మనీషి ప్రజలలో దేవుడి పట్ల భక్తిని బాగా పెంచారు. 

అదంతే. సాధారణంగా కొట్టుకుంటూ వుండే గుండె - దేవుడా , దేవుడా అంటూ వుంటుంది. అదేదో లబ్ - డబ్  అని మనం అనుకుంటూ వుంటాము. 

దేవుడు, ఆ, ఏమిటీ - అని పలికిన రోజున మరి కొట్టుకోదు. దేవుడు పిలిస్తే - వెళ్ళిపోతాం . అంత వరకు, మరో గుండె కొట్టుకునే శబ్దం వినాలి - అనుకుంటూ వుంటుంది ; దానికోసం వెంపర్లాడుతూ వుంటుంది.  అదే  మన మనసుల్లోని ప్రేమాభిషేకం.   

ANR  గారి ప్రేమాభిషేకానికి, హైదరాబాదు - 533 రోజులు ఉర్రూతలూగి పోయింది.  యిప్పటి వరకు, అన్ని రోజులు ఏకధాటిగా చూడ బడిన ఏకైక తెలుగు సినిమా అదే.

ANR  గారి సినిమాల్లో  పాటలు  పెద్ద హై లైట్ . పాటల్లో, రాసే వారి గొప్పదనం, పాడిన ఘంటసాల, బాలు వారి కంఠం, సంగీత దర్శకుడి గొప్పదనం - యివన్నీ వున్నా, ఆ పాటలకు ANR  గారు ఎలా స్పందించారో - అది చూస్తూ వింటే - ఆ అనుభూతే  వేరు. పాట  వింటే , ANR  గుర్తుకొస్తారు. నటనలో జీవించడం - ఆయనలా మృదువుగా , నిజ జీవితానికి అంత దగ్గరగా చేసిన వారు చాలా అరుదు. 

వారి కాలం లో, వారిలాగా, నాట్యానికి వొక కొత్త నిర్వచనం  చెప్పిన వారు లేరు గాక లేరు. పచ్చ గడ్డి కోసేటీ పడుచు పిల్లోయ్ - అంటూ ఆయన చూపే హావ భావాలు - ఆయనకు ముందూ లేదు ; చెప్పాలంటే , ఆయన తరువాతా లేదు . 

పిల్లల్నీ, పెద్ద వారినీ, ముసలి వారినీ, ఆడవారినీ - వొక్కరేమిటి , అందరినీ వుర్రూత లూగించిన అక్కినేని  - అమరజీవి అయిపోయ్యారు.   ఆ లోటు వుండనే  వుంటుంది . 

కొందరికి కుటుంబం అంటే - మహా వుంటే 10 -20 మంది దాకా వుంటారు . కానీ, చాలా కొద్ది మందికి కోట్ల మంది తమ కుటుంబం గా వుంటారు. అంటే - వారిది వసుధైక కుటుంబకం. అందునా కొంత మంది, మరణం తర్వాత ఎన్నో దశాబ్దాలు  జీవిస్తూనే వుంటారు - వున్న వారి మనస్సులో. 

మనం ముఖ్య మంత్రులను , గవర్నర్లను  సులభంగా మర్చి పోతాం. మీకు గుర్తున్నారా - మన ముఖ్య మంత్రులందరూ? నాకు లేరు . వారి వల్ల  మనకు పెద్దగా వొరిగిందేమీ లేదు. 

కానీ - NTR , ANR  గార్లు కనీసం వొక శతాబ్దం కాలం అందరి మనస్సులో వుంటారు ; వున్నారు . మా అవ్వ గారు , మా అమ్మగారు , నేను , నా పిల్లలు - యిలా కనీసం 4 తరాలు - దాదాపు అన్ని తెలుగు కుటుంబాల్లోనూ వారిని బాగా అభిమానించిన వారే . 

యింత చెప్పినా - కడపట శ్రీకృష్ణుల వారి ఉపదేశం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొవలసిందే.  

"గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః" -   బుద్ధిమంతులు, వున్న వారికోసం కానీ , పోయిన వారి కోసం కానీ శోకించరు. 

"న త్వే వాహం  జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ;  న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం"  - నీవూ , నేనూ , వీరెవరూ - ముందెప్పుడూ లేని వారు కాదు . యిక ముందెప్పుడూ వుండని వారు కూడా కాదు. ( ఎల్లప్పుడూ  వుండే వారే ) . 

"దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ; తథా దేహాంతర ప్రాప్తిహ్ ధీరస్తత్ర న ముహ్యతి" - ఆత్మగా వున్న మనం , ఈ దేహంలో వుండి బాల్యం , యవ్వనం , ముసలితనం  ఎలా అనుభవిస్తామో , అలాగే , వొక దేహం నుండి మరో దేహానికి కూడా వెళ్లి పోతాము . జ్ఞాని అయిన వాడు , బుద్ధి మంతుడు - దీని కోసం శోకించడు. 

అంతే . ఈ ప్రవాహం యిలా సాగి పోతూనే వుంటుంది . కొన్ని తీపి గురుతుల్ని , మిగిల్చి  పోతూ వుంటుంది . ANR  మిగిల్చిన  తీపి గురుతులు  ఎన్నో , ఎన్నెన్నో . 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్

 
 

 


12, జనవరి 2014, ఆదివారం

2014 : క్రాంతి : సంక్రాంతి - మనం ఏం చేస్తే అది నిజమైనక్రాంతి - నిజమైన సంక్రాంతి

2014 : క్రాంతి : సంక్రాంతి

 


2013 వెళ్ళిపోయి 12 రోజులయింది . అంతలో భోగి వచ్చేసింది. సంక్రాంతి వచ్చేస్తో వుంది .  మన  జీవితాల్లో ఏం క్రాంతి వచ్చింది; లేదా రాబోతూ వుంది ? ప్రపంచంలో ఎన్నెన్నో జరిగి పోతున్నాయి ; మన ప్రమేయంతో కొన్ని . మన ప్రమేయం ఏమాత్రం లేకుండా ఎన్నో ! 

మనకు పండగలు చేసుకోవడం అలవాటు.  

చేస్తే - 365 రోజులూ ఏదో వొక పండగ చెయ్యొచ్చు. మన సంస్కృతి లో ఆ వెసులుబాటు వుంది. అలా చేస్తూ వుండే వాళ్ళం కూడా . పండగలు, వ్రతాలు , పూజలు, నోములు, అన్నీ - ఏదో రకంగా మనల్ని ఆనంద పరిచేవే . 

పంటలు పండాయని కొన్ని, వానలు కురిసాయని కొన్ని, పూలు పూసాయని కొన్ని,  పండ్లు, ఫలాలు చెట్ల నిండుగా వున్నాయని కొన్ని, ఋతువులు మారాయని కొన్ని, చంద్రుడు వచ్చాడని , రాలేదని, యిలా ప్రతి దానికీ పండగే . సూర్యుడు కక్ష్య మారితే పండగ.

ఈ రోజు, యిప్పుడు ఆనందంగా ఉన్నామని కొన్ని పండగలు, వ్రతాలు, నోములూ చేస్తే, భవిష్యత్తులో మరింత  ఆనందంగా వుండాలని మరి కొన్ని చేస్తాం. మగ వాళ్ళు చేసేవి కొన్ని, మగ , ఆడా కలిసి చేసేవి కొన్ని, ఆడవాళ్ళు మాత్రమే చేసేవి కొన్ని, ఊరంతా కలిసి చేసేవి కొన్ని. దేశమంతా  కలిసి చేసేవి మరి కొన్ని.  ఆనందంగా వుండడానికి అన్నీ కారణాలే . ప్రతి పండుగకూ , పెద్ద వాళ్లకు మొక్కడాలూ , పిల్ల వాళ్లకు ఆశీర్వాదాలూ , స్పెషల్ వంటలు ,పూజలు, నైవేద్యాలు, ప్రసాదాలు - అంతా కోలాహలమే . అంతా వొక్కో రకమైన ఆనందమే; అన్నిటిలో, అంతర్లీనంగా వుండే అతి గొప్ప సంస్కృతి .

మనం చెట్లలో దేవుడిని చూస్తాం . రాళ్ళలో దేవుడిని చూస్తాం.   ప్రతి జంతువులో, పాముల్లో, అన్నిటిలో దేవుడిని చూస్తాం . తులసి చెట్టు దేవుడు . రాగి చెట్టు, మద్ది చెట్టు -యిలా ఎన్నో దేవుళ్ళు . యిన్ని దేవుళ్ళు వుంటారా ?
నాగు పామూ దేవుడే . దాన్ని వేటాడే గరుడ పక్షీ దేవుడే . కాకి కూడా దేవుడే . ఎలా ? 

అంతేనా . మొదటి దేవుడు తల్లట. మాతృదేవో భవ . రెండో దేవుడు తండ్రట.  పితృదేవోభవ . గురువూ దేవుడే . అతిథీ దేవుడే . సరే . పెళ్ళైన ఆడవాళ్ళు  అత్తారింటికి వెళ్లి పొతే , తల్లీ , తండ్రీ దూరమౌతారు కదా . అప్పుడెలా ? పతిదేవుడు. అదెలా? ఆడా, మగా సరి సమానులు అనే రోజుల్లో, పతి ని దేవుడు అంటే ఎలా ? పక్కింటి వాడినో , ఎదురింటి వాడినో - దేవుడంటే - సమస్యలు కదా.  ఎక్కడో వొక చోట దేవుడిని చూడాలి. ప్రేమ వున్న చోట, రక్షణ వున్న చోట  దేవుడు వుండనే వుంటాడు.  లేకుండా ఎలా పోతాడు ? 

 ప్రేమ, రక్షణ  వున్న చోట దేవుడు తప్పకుండా వుంటాడు. ధర్మేచ , అర్థేచ, కామేచ - నాతి  చరామి అన్న వాడు, అన్నిటా తోడు  గా వుండే వాడు,  వాడిలో - దేవుడు లేదంటే ఎలా ? ఎందుకుండడు? ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, భార్యను రక్షించే వాడే భర్త . అదే మన సంస్కృతి . మరి పత్ని దేవత కాదా ? నిస్సందేహంగా దేవతే !  అందుకే  కదా అర్ధ నారీశ్వర తత్వము దేవుడు అన్నాము . శివుడు లేనిది శక్తి లేదు ; శక్తి లేనిది శివుడు లేదు. 

అంతటా దేవుడే. నాలో దేవుడు . నీలో దేవుడు . అయినా,  బ్రహ్మచారి, సన్యాసి యిద్దరూ భిక్ష మడిగి బ్రతకాల్సిందే . వారిలో - అహం అనేది వుండకూడదు. గర్వం అనేది వుండకూడదు . కానీ, గృహస్తు - వారికి భిక్ష వెయ్యనని చెప్పడానికి వీలు లేదు . యింట్లో ఏదుంటే అది భిక్ష వెయ్యాలి . ఉపనిషత్తుల్లో చెప్పడం - గృహస్తు ఎంతైనా సంపాదించ వచ్చు - తనకు, పిల్లలకు, అతిథులకు కూడా తగినంత సంపాదించాలి . అదీ రూలు . అతిథులకు లేదనకుండా పెట్టడం గృహిణి వంతు . యింట్లో  లేకపోతే క్రొత్తగా చేసైనా పెట్టాలి .

అయితే, యిందు లోని మూల సూత్రం అంత సులభంగా అందరికీ వంట పట్టదని - వ్రతాలు, పూజలు, నోములు - యిలా పెట్టారు. అన్నిట్లోనూ వారి వారికి కావలసినంత ఆనందం నింపారు . 

గుళ్ళన్నీ రాళ్ళూ , మట్టే కదా . గుళ్ళోని దేవుడూ రాయే కదా . వాటిని పూజిస్తే , అవేం  చేస్తాయి మనకు ? యిదీ కొంత మంది  తర్కం . వినడానికి - నిజమే కదా అనిపించేలా వుంది కదా . 

సరే . ఆ మట్టి నుండే కదా - అన్ని పంటలూ, చెట్లూ, ఔషధాలూ వచ్చేది. నిజానికి- మన శరీరము, దాన్లోని అన్ని భాగాలు  మట్టి నుండి వచ్చిన వాటితోనే కదా తయారయ్యాయి.  మట్టి నుండే వచ్చాము. మట్టిలోకే వెళ్లి పోతాము - అన్నది మనకు కాస్తో, కూస్తో అర్థం అవుతూనే వుంది కదా. మనం మట్టే . రకరకాల మట్టే .

చిన్నప్పుడు 3 కిలోలున్న మనం, యిప్పుడు, యిన్ని కిలోలు ఎలా అయ్యాం?  ఇన్ని కిలోల శరీరమూ మట్టి నుండి వచ్చిందే కదా . 40-80 కిలోల మట్టి గా వున్న మనం ఎంత ఆలోచనా వంతులం , ఎంత జ్ఞాన వంతులం అనుకుంటున్నాం . అదంతా ఎక్కడి నుండి వచ్చింది మనకు ? అసలు అండము , శుక్రకణాలు కూడా మట్టి నుండీ కాక ఆకాశం నుండి  వచ్చాయా ? అంతా మట్టే నని తెలుసు మనకు . అప్పుడప్పుడు మర్చి పోతాం . అంతే .

కానీ ,యింత మంది మనుషులను  పుట్టిస్తూనే వున్న భూమాత లో  ఎంత జ్ఞానం, ఆలోచన వుండాలి ? యిది  మనకు తెలుసా ?అలాగే యింత మహా విశ్వంలో మరెంత జ్ఞానం వుండాలి ?

ఆ జ్ఞానాన్నే దేవుడు అన్నాం . మనం ఎక్కడ చూసినా ఆ జ్ఞానాన్నే చూడాలని ఆశిస్తాం . చదువు వున్న వాడైనా, లేని వాడైనా, శివ లింగానికి నమస్కరిస్తాడు . ఆచరణలో దేవుడిని చూసిన వాడికి , వేదాలు కూడా అక్కర్లేదని వేదాలే చెప్పాయి. కౌశిక మహర్షి తపస్సు చేసింది గొప్పా , ఆయన భిక్ష అడిగిన యింటి ఇల్లాలు గొప్పా, మాంసం అమ్మి బ్రదికే ధర్మ వ్యాధుడు గొప్పా?  అన్ని పనులూ తపస్సే - తపస్సు లాగా చెయ్యాలని చెప్పిన సంస్కృతి  గొప్ప.

సంక్రాంతి నాడు - సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడట. ఉత్తరాయణం ప్రారంభం చేస్తాడట. యిది కోట్ల సంవత్సరాలకు ముందు చెప్ప బడింది. మన పండగలలో, ఈ వొక్క పండగే సూర్య మానం ప్రకారం వస్తుంది గనుక, ఎప్పుడూ, యింగ్లీషు కాలెండర్ ప్రకారం కూడా, జనవరి 14 వ తేదీ నే వస్తుంది.  మిగతా పండుగలు చాంద్ర మానం ప్రకారం గనుక మన నక్షత్రాలు, తిథుల ప్రకారం వస్తాయే గానీ - యింగ్లీషు కాలెండర్ ప్రకారం కాదు. 

సూర్యుడు కక్ష్య మారితే మనకేం ? మనకు వసంత ఋతువు రాబోతూ వుంది . చలి తగ్గ బోతూ వుంది.  చెట్లన్నీ వికసించ బోతూ వున్నాయి  . పక్షులు కిలకిలారవాలు చేయ్యబోతూ వున్నాయి. ప్రకృతిలోని అన్నింటిలో - క్రొత్త ఉత్సాహం , క్రొత్త ఆనందం రాబోతూ వుంది . అదే ఆనందం మనలోనూ రావాలి. మనోహరమైన ప్రకృతిలో , మనోహరంగా మనిషి ఆడుకోవాలి . అదీ సంక్రాంతి . 

సంక్రాంతి  నాడు మనలో క్రాంతి  రావాలి . పాత సంస్కృతికి కొత్త మెరుగులు దిద్దాలి. మరిచిపోయిన మంచిని పునరుద్ధరించాలి.  మనలోని సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభించాలి. మనలోని ప్రకృతి  వసంత ఋతువుగా మారాలి . 

ఎలా? ఏం చెయ్యాలి?  కొన్ని కొన్ని చిన్న, చిన్న పనులు, పెద్ద పెద్దగా మనం చెయ్యొచ్చు . 

నా వొక్క అనుభవం మాత్రం చెబుతాను, వినండి. నేను వొకప్పుడు బిచ్చగాళ్ళకు బిచ్చం వేసే వాడిని కాదు. కొందరిలా, అసలు  వెయ్య కూడదని రూలేం పెట్టుకోలేదు . దార్లో, ఎక్కడైనా , బిచ్చ గాడిని చూస్తే , అయ్యో పాపం అనిపిస్తుంది . కానీ, జేబులో ఉన్న ఏ నాణ్యమైనా  వేద్దామని చెయ్యి అనుకోదు. బిచ్చ గాడిని దాటి వెళ్ళిన తర్వాత , వేసింటే  బాగుండేదేమో అని వొక్కో సారి అనిపిస్తుంది . కొంత మంది యింట్లో బయల్దేరేటప్పుడే , జేబులోనో, పర్సులోనో , యిందు కోసమే కొన్ని నాణ్యాలు వేసుకుని బయల్దేరడం , అవి ఎక్కడో వొక చోట, ఎవరికో వొకరికి వేసేసి వెళ్లి పోవడం, నేను చాలా సార్లు చూశాను . అందులో చాలా మంది ఆడవాళ్ళు . వారికుండే దయాగుణం నాకెందుకు రావడం లేదు అని నేను చాలా సార్లు అనుకున్నా కూడా. ఆ తరువాత నేను కూడా - అలాంటి అలవాటు కొంత పెట్టుకున్నా.  అయితే వొక సారి, వొక రైల్వే స్టేషన్ లో,  వొక కుంటి బిచ్చ గాడికి (యిరవై ఏళ్ళకి ముందు) - అర్ధ రూపాయి వేస్తే, ఆతను, దాన్ని పట్టాల పైకి విసిరి వేసేసి - నన్ను చూస్తూ వెళ్లి పొయ్యాడు . 

నాకూ కోపం వచ్చింది. కాస్త సిగ్గు వేసింది కూడా . మళ్ళీ కొన్నాళ్ళు షరా మామూలే; ఏ బిచ్చ గాడికీ బిచ్చం వెయ్య లేదు . కానీ కొంత మంది బిచ్చ గాళ్ళ ని చూస్తే - దేవుడు వీరిని ఎందుకిలా బాధ పెడుతున్నాడని చాలా సార్లు అనిపించింది .  అప్పుడప్పుడూ - కొంత మంది బిచ్చం వేసే వారిని చూస్తే  - ఆశ్చర్యం, ఆనందం  అనిపించేది.  ఎక్కడో అంత దూరం నుండి  బిచ్చ గాడిని చూస్తే  చాలు - వాళ్ళ వెళ్తున్న రూటు నుండి యింత దూరం వచ్చి, పర్సు లో నుండి, ఎంతో కొంత వేసి వెళ్ళే వారు. నేను మారాలి- అని చాలా సార్లు అనుకున్నా. 

దానికేదో ముహూర్తం వచ్చింది . ఎప్పుడో వొక సారి, నేను కూడా వారి లాగే చేశాను. ఏదో లోభితనం గానే అనుకోండి - కొంత, కొంత వేశాను. అప్పుడు అలవాటు, వొక రూపాయకు తక్కువ వెయ్యడం లేదు . తరువాత అది రెండు రూపాయలకు పెరిగింది . వొక సారి మరో నాణ్యం  లేక - అయిదు  రూపాయల నాణ్యం  మాత్రమే వుంటే - అయ్యో, యిప్పుడెలా, అనుకుంటూ, అదే వేశాను. ఆ తరువాత అనిపించింది - అయిదు రూపాయలే  వెయ్యాలి - యిప్పుడు అంత మాత్రం ఆర్ధిక స్తోమతు  నాకు వుంది; కాబట్టి మనసూ వుండాలి - అని . 

అదీ అలవాటు అయ్యింది. అప్పుడు అనిపించేది - నేను చేసే పని ఆ బిచ్చ గాడికి నిజంగా ఉపయోగ పడాలి - లేదంటే, మొక్కుబడిగా నేను వేసేది ఏం ప్రయోజనం అని . కానీ, ఏం చెయ్యాలో - తెలియ లేదు . ఆ తరువాత ఎప్పుడో , మా నేషనల్ అకాడెమీ లో HR & MANAGEMENT  విభాగానికి  DGM గా వెళ్ళిన తరువాత , అసలు  మానవతా దృక్పథం అంటే ఏమిటి అన్నది - కాస్త తెలిసి వచ్చింది . నేను యిచ్చే ప్రసంగాలు , వాటికి నేను చేసుకునే  ప్రయత్నాలు  - వీటి మధ్యలో - ఏదేదో  క్రొత్త ఆలోచనలు, ఐడియాలు  వచ్చేవి . కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు , CRY  లాంటివి వస్తే , ఏదో కొద్ది విరాళం యిచ్చే వాడిని . వంద, రెండు వందలు - యిలా . 

మళ్ళీ చెన్నై వచ్చిన తర్వాత - నేనున్న తిరునిన్రవూరు లోనే 20 ఏళ్ళకు పైగా వొక అనాథ బాలల, వృద్ధుల శరణాలయం వుండడం, అది చాలా బాగా నడప బడడం తెలిసొచ్చింది. ఆ శరణాలయం పేరు సేవాలయ. దాని ముఖ్య ట్రస్టీ  పేరు మురళీధరన్. వొకప్పుడు, అతి చిన్న సంస్థ గా వుండేది. యిప్పుడు 1300 నిరు పేద బాలలకు స్కూలు, 300 అనాథ బాలలకు ఉచిత విడుది , వంద మందికి పైగా అనాథ వృద్ధులకు శరణాలయం - యిలా ఎన్నో వున్నాయి. ఎంతో మంది దాతలు డొనేషన్లు యిస్తూ వున్నారు. 

సరే . మా ఊళ్లోనే వుంది. నేను కూడా ఏదో కొంత చెయ్యొచ్చు  కదా అనిపించింది . మొదట ఎంత యిచ్చానో జ్ఞాపకం లేదు . ఆ తరువాత 5 వేలు రూపాయలు విరాళం వొక్క సారిగా యిచ్చాను . యిది ఏదో కాస్త బాగా అనిపించింది . ఆ తరువాత, నాకు వీలైనప్పుడు , 5 వేలు, 5 వేలు యిలా యివ్వ సాగాను. వొక సంవత్సరంలో 20 వేలు అయ్యింది - యిలా విరాళం పెరిగింది .  

రిటైర్ అయ్యిం తరువాత నాకు కొన్ని వ్యాపకాలు బాగా పెరిగాయి.   అందులో వొకటి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్  చేసే ధ్యాస . వచ్చిన గ్రాట్యూటీ , ప్రావిడెంట్ ఫండ్ లాంటివన్నిటినీ కలిపి - షేర్ మార్కెట్లో పెట్టాలనుకునా; కానీ, మా ఆవిడ వొప్పుకొలేదు. అందుకని, సగం ఫిక్సెడ్ డిపాజిట్ , సగం షేర్ మార్కెట్ లో పెట్టాను.  నిజానికి - అదే మంచి విధానం. 

ఆ తరువాత - నేను మార్కెట్ ను బాగానే అధ్యయనం చేశాను . నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్  వారు పెట్టే ఎన్నో పరీక్షలు  పాసయ్యాను. ఫలితంగా, నాకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారి నుండి  (1) NSE  సర్టి ఫైడ్  మార్కెట్ ప్రొఫెషనల్ (NCMP ) -లెవెల్-5 (యిదే పెద్ద లెవెల్) (2) NSE  సర్టి ఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిస్ట్  ఛాంపియన్  (3) NSE  సర్టి ఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిస్ట్  ప్రో  అన్న సర్టిఫికెట్లు కూడా లభించాయి .

యిప్పుడు - ఈ రంగం లో కొంత నిపుణత వుంది . ఏ కంపెనీ లో  షేర్లు , ఎప్పుడు, ఎలా కొంటే, ఎలా అమ్మితే లాభకరమో బాగా తెలిసొచ్చింది . అందుకని  నేను ఇన్వెస్ట్  చేసిన మొత్తాలలో - నాకు లాభాలు వస్తూ వున్నాయి . మార్కెట్ పూర్తిగా పడిపోయిన రోజుల్లో కూడా నష్టాలు రాలేదు. యిక మీదట మోడీ గారు ప్రధాన మంత్రి గా వస్తే గిస్తే - దేశం , ముఖ్యంగా ఆర్ధిక రంగం, బాగా అభివృద్ధి చెందుతుంది అన్న వొక ఆశ మార్కెట్ లో చాలా మందికి వుంది . - చెప్పాలంటే నాకూ వుంది .  

సరే . లాభాలు ఏదో వస్తున్నాయి . యిప్పటి వరకు మెల్ల మెల్లగా పెరిగింది - యిక ముందు యింకా బాగా పెరగొచ్చు . యివన్నీ దేవుడిచ్చిన, యిస్తున్న అవకాశాలే కదా . అందుకని , రెండు సంవత్సరాల క్రితం , నా డొనేషన్లు - 25 వేల రూపాయలకు  పెంచాను . ఆ సంవత్సరం - 2012 లో- అలాంటి డొనేషన్లు 2 యిచ్చాను . అంటే - 50 వేలు అన్న మాట . 2013 లో  అలాంటివి 4 సార్లు యిచ్చాను; అంటే - 1 లక్ష రూపాయలు అన్న మాట. యిది కాక, ఈషా  ఫౌండేషన్ అన్న, సద్గురు  జగ్గి వాసుదేవ్  గారి సంస్థకు 6-7 వేలు దాకా ప్రతి సంవత్సరమూ యిస్తాను. అది గురుదక్షిణ అనుకుంటా. ఎందుకంటే , నేను వారి వద్ద, చాలా యోగా శిక్షణలు పొందాను గనుక . 

మరి, 2014 సంవత్సరం  మాటో ? నాకు తెలీదు . మార్కెట్ బాగా పెరిగితే - బాగా లాభాలు వస్తే - ఎంత యివ్వాలి ? నేను ఏ లిమిట్ పెట్టుకో లేదు. సేవాలయా లోని ఆ చిన్నారి పిల్లల మొహాలు చూస్తే , వారితో  బాటు నేనూ కూర్చుని భోంచేస్తే , వారికి ఏదో వొక ఐటెం వడ్డిస్తే, వారు చిన్ని చిన్ని మొహాలతో, థాంక్యూ సార్- అని చెబుతుంటే - ఆ అనుభూతికి - ఆ చిన్నారి దేవుళ్ళకి - ఎంతిస్తే  సరిపోతుంది?  అది దేవుడికి పెట్టే నైవేద్యం కాదా ?

మా యింట్లో, వొక్కో సారి, చిన్న వివాదం వస్తుంది - మీరు, మన పిల్లలకోసం పెట్టుకోకుండా, ఎవరికోసమో చేస్తున్నారేమిటి - అని. నిజానికి - పిల్లలు బాగానే వున్నారు . యిద్దరు కొడుకులు, కోడళ్ళు -అందరూ కాస్త మంచి వుద్యోగాల్లోనే వున్నారు.  నేను చెబుతాను - నేను ఏం సంపాదిస్తే - అందులో కనీసం నాలుగో భాగం - అనాథ బాలలకు -మిగతాది మన పిల్లలకు అని . కాకపొతే, నా మనసులో - సగం సగం అనుకుంటే బాగుంటుంది  అన్న అభిప్రాయం వుంది. విప్రో  ఛేర్మన్ డాక్టర్ అజీం ప్రేంజీ గారు వొక సారి అన్నారు - యింత మంది అనాథలు, నిరు పేదలు బయట తిండీ , గుడ్డా, చదువూ లేకుండా వుంటే , మనకు అసలు నిద్రెలా పడుతుంది ;తిండెలా సహిస్తుంది , అని. భారత దేశంలో అత్యధికంగా డొనేషన్లు యిస్తున్న వ్యక్తి  యిప్పట్లో ఆయనే. యివ్వడం కాదు గొప్ప. మనసులో వున్న ఆ భావం  గొప్ప . దాన్ని ఆచరణలో పెట్టే హృదయం గొప్ప . 

అంతే  కానీ, మనకు యిచ్చే వాడూ ఆ పై వాడే. మన నుండీ తీసుకునే వాడూ వాడే . తీసుకునే వాడిలో దేవుడిని చూడాలి , యిచ్చే వాడు .

అయితే - నరేంద్ర మోడీ గారు అంటారు - నా పాలనలో - మీకు ఉచిత కరెంటు, ఉచిత నీరు ఇలాంటి వాటిని గురించి మాట్లాడను . మీరు దేన్నైనా  సరే - దాని విలువను యిచ్చి మీరే కొనుక్కునే సామర్థ్యం - మీకు కల్పిస్తాను - అని. అది నాకు బాగా నచ్చింది .

అది జరిగే వరకూ - 

మన చుట్టూ వున్న అనాథ బాలలు, అనాథ వృద్ధుల మొహాల్లో - మనం ఆనందపు దీపాలు, అభివృద్ధి వెలుగులు వెలిగించాలి . అదీ క్రాంతి. అదీ మనకు సంక్రాంతి . మనలోని సూర్యుడు వుత్తరాయణం  వైపు  దిశ మళ్ళే  సంక్రాంతి. మనలో విరిసే నిజమైన వసంతఋతువుకు మనం పలికే సుస్వాగతం. 

అటువంటి సంక్రాంతికి - మీకు నా సుస్వాగతం . నా శుభాకాంక్షలు . 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్

6, డిసెంబర్ 2013, శుక్రవారం

స్వగతం (4) - టర్నింగ్ పాయింట్స్ - కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు నా ప్రయాణం

స్వగతం (4) - టర్నింగ్ పాయింట్స్

కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు నా ప్రయాణం

 

నేను  చెన్నై టెలిఫోన్స్ లో - మొదట చీఫ్ అకౌంట్స్  ఆఫీసర్ గా అయిదేళ్ళు పని చేసిన తర్వాత, వొక సంవత్సరం పైగా  అక్కడే  డిప్యూటీ  జనరల్ మేనేజర్ గా పని చేశాను. ఆ తరువాత నన్ను, హైదరాబాద్ లోని, నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలికాం ఫైనాన్సు అండ్ మేనేజ్ మెంట్ కు బదిలీ చేశారు. అప్పటి వరకు నేను ఏదో చిన్న చిన్న క్లాసులు అక్కడక్కడా తీసుకునే వాడినే కాని ఇలాంటి  నూటికి నూరు శాతం ఫైనాన్సు , మేనేజ్ మెంట్ లాంటి  విషయాలపై - అందునా సీనియర్  ఆఫీసర్లు కు కూడా పాఠాలు చెప్పడం లాంటి పనులు చెయ్య లేదు. నిజానికి ఈ సబ్జెక్ట్స్ ఏవీ నాకు తెలీదు. కాకపొతే, ఆ అకాడెమీ చీఫ్  జనరల్  మేనేజర్ గారు నాకు వొకప్పుడు చెన్నై టెలిఫోన్స్ లో బాస్ గా వున్న వారే. అందుకని, మరో మాట చెప్పకుండా వెళ్లి 2003 డిసెంబర్ లో జాయిన్  అయిపోయాను. 

ఇప్పుడు నా డ్యూటీ ఏమిటంటే -  టెలికాం ఫైనాన్సు, మేనేజ్ మెంట్, హ్యూమన్  రిలేషన్స్  స్కిల్స్ - ఇలాంటి విషయాలపై - చాలా లోతుగా అన్ని విషయాలనూ చదివి, పరిశీలించి, అన్ని రాష్ట్రాల నుండీ ట్రైనింగ్ కు వచ్చే సీనియర్ ఆఫీసర్లకు లెక్చర్  యివ్వాలి.  యిక్కడ, లెక్చర్ యిచ్చే వాడు వచ్చిన వారిని అంచనా  వెయ్యడం కాదు; అందుకు రివర్సు. ట్రైనింగ్ కు వచ్చిన వారు,  లెక్చర్లను యిచ్చే మమ్మల్ని అంచనా వేసి, మార్కులు వెయ్యాలి. వారి అంచనాలను, క్రోడీకరించి వొక్కొక్క లెక్చరర్ కు ఎన్ని మార్కులు వచ్చాయో - అది మా బాస్ గారికి పంపించాలి.  వారు అది చూసి, తరువాత యివ్వాల్సిన  లెక్చర్లకు - ఏం చెయ్యాలో చెబుతారు. అంటే - ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్కులు వెయ్యడం కాదు. విద్యార్థులు ఉపాధ్యాయుడికి మార్కులు వెయ్యాలి. అది హెడ్ మాస్టర్ గారు చూసి, ఉపాధ్యాయులు పాసో, ఫెయిలో నిర్ణయించాలి.   యిది చాలా ట్రైనింగ్ అకాడెమీ లలో వున్నదే. 

ఈ అకాడెమీ లో ట్రైనింగ్ వింగ్  వొకటి, అడ్మినిస్ట్రేషన్  వింగ్ వొకటి - ట్రైనింగ్ కు నేను హెడ్, అడ్మినిస్ట్రేషన్ కు మరొకరు, మాకిద్దరికీ పైన CGM  గారు. మాక్రింద , కొంత మంది చీఫ్  అకౌంట్స్ ఆఫీసర్  లు, వారి క్రింద అకౌంట్స్ ఆఫీసర్ లు, యిలా ఎంతో మంది వుండే వారు. మేము అందరమూ లెక్చర్లు  యివ్వాల్సిన వారమే.

వచ్చిన గొప్ప చిక్కు ఎక్కడంటే, ట్రైనింగ్ కు వచ్చిన వారు,  మాకందరిలో వొక జూనియర్ మోస్ట్, అంటే, వొక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గారి లెక్చర్ చాలా బాగుందని, మా, అంటే, DGM గారి లెక్చర్ బాగు లేదని రాసేయచ్చు. అంతెందుకు. చీఫ్ జనరల్ మేనేజర్ గారి లెక్చర్ కూడా బాగు లేదని రాసేయచ్చు. అంటే, యిది ఏదో, ఆఫీసుల్లో,  పైళ్ళలో, మనం ఏదో రాసెయ్యడం, మన అభిప్రాయాలు, మన నిర్ణయాలు చెప్పడం లాంటి పని కానే కాదు. మేము చెప్పే విషయాలు - వినే వారికి నచ్చిందా లేదా అన్నది - వినే వారు మాకు చెప్పాలి. అందు లోనూ, లిఖిత పూర్వకంగా. మాకు మార్కులు కూడా వెయ్యాలి .  మార్కులంటే మజాకా! ప్రతి వొక్కరికీ ఎక్కువ మార్కులు తీసుకోవాలని తాపత్రయం వుంటుంది కదా ! కనీసం క్రింద వారికంటే - మనకు ఎక్కువ రావాలని వుంటుంది కదా . మార్కులు వేసే వాడు , ఎందుకు, ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తాడో - చెప్పడం చాలా కష్టం .

డ్రెస్, మాట్లాడే తీరూ, జోకులు వెయ గలిగే నేర్పూ , ఎదుటి వారిని సంభాషణలో పెట్టడం,  వారిలో ఇంటరెస్ట్ , ఉత్సాహం రేకెత్తించడం, మాట్లాడాల్సిన సబ్జెక్టు లో పూర్తి అవగాహన, మనకు యివ్వ బడిన సమయం లో ఏది చెప్పాలో, ఏది విడిచి పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో, ఎలా ముగించాలో - యిలా ఎన్నో విషయాలు మనకు తెలియాలి . అంటే - వొక లీడర్ కు వుండ వలసిన సర్వ లక్షణాలు, వొక లెక్చరర్ కు కూడా వుండాలి.

ఇంతే కాదు. ఏది మాట్లాడ కూడదో - అదీ బాగా తెలిసుండాలి . మీరు ఎంత బాగా మాట్లాడినా, మాట్లాడకూడని మాట వొకటి మాట్లాడితే చాలు - మిమ్మల్ని అంచనా వేసే వాళ్ళు , ఆ వొక్క మాటపై మాత్రమే మిమ్మల్ని అంచనా వేస్తారు. గిన్నెడు పాలలో వొక్క చుక్క విషం కలిస్తే , పాలంతా విషమైన మాదిరి. ఇవన్నీ నాకు పూర్తిగా అర్థం కావడానికి - దాదాపు వొక సంవత్సరం పట్టింది . ఇవేవీ అర్థం చేసుకోకుండా, ఎన్నో సంవత్సరాలు లెక్చర్లు యిచ్చే వాళ్ళు కూడా ఎంతో మంది వున్నారు. నిజానికి - యివన్నీ ప్రతి మనిషికీ తెలియాల్సిన విషయాలు . వీటిని గురించి ముందు ముందు  ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన  అవసరం వుంది. 

కానీ, నా సర్వీసులో యిన్నాళ్ళూ, మూడు దశాబ్దాలకు పైగా, నేను చేసిన పని పైళ్ళలో రాయడమే. మరి, యిప్పుడు మాట్లాడాలి . అందునా వొక ముప్ఫై మందైనా ఆఫీసర్లు ట్రైనీలు గా వున్న, వొక అధునాతన క్లాస్ రూము లో, పవర్ పాయింట్  ప్రెజెంటేషన్ల తో బాటు,  ప్రపంచం లో వున్న సరి క్రొత్త విషయాలు, వాటిలో యిప్పుడు వస్తున్న మార్పులు  - సభికులకు నచ్చే విధంగా, వారిని మెప్పించే విధంగా మాట్లాడాలి.

మా బాసు ఎలాంటి వారంటే - యిప్పుడు హార్వర్డ్ , ఆక్స్ ఫర్డ్  లో చెబుతున్న విషయాలు కూడా తెలుసుకుని  చెప్పాలంటారు . అదీ, వారికిష్టం. వారి పేరు చివర, పెద్ద డిగ్రీల తోక వుంది.  మా మరో DGM  గారు కూడా యింజనీరు, MBA. నేనొక్కడే ఉత్త MA  ఎకనామిక్స్. మరెలా? ఎలా ఏమిటి ? చెయ్యాలి. వారి కంటే బాగా చెయ్యాలి . కనీసం వారితో సమానం గా చెయ్యాలి. ఎలా? 

యిదీ నాకు వచ్చిన ఛాలెంజ్ . నేను MBA  చెయ్య లేదు కానీ వారికంటే బాగా, MBA  లో రాని పాఠాలు కూడా,  చెప్పి, వచ్చే వారిని మెప్పించాలి.  నిజానికి , యిప్పుడు ట్రైనింగ్ వింగ్ కు నేను బాసు. ట్రైనింగ్ ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవ్వరు, ఏ పాఠాలు చెప్పాలో, ఏ ట్రైనింగ్ లో వచ్చే వారిని ఎలా ఆకర్షించాలో, ఎలా ఎక్కువ మంది వచ్చే లాగా చెయ్యాలో -అన్నీ నేనే ప్లాన్ చెయ్యాలి . వాటిని జరిపించాలి.  మరో DGM గారు, CGM  గారు, నా ప్లాన్ ను చూసి , సూచనలిచ్చి , ఆమోదం తెలిపే వారు  మాత్రమే.

యింతే కాదు . మిగతా అందరి కంటే, నేను బాగా చెప్పాలి. మిగతా అందరూ కూడా బాగా చెప్పేటట్టు, వారికీ సూచనలివ్వాలి . అంటే - వారి సబ్జెక్టు కూడా నాకు బాగా తెలిసుండాలి. 

 అప్పటికి మా కుటుంబ సభ్యులు యింకా హైదరాబాద్ రాలేదు. నేనూ, మా అకాడెమీ లోనే, వొక రూములో వున్నాను, యింకా క్వార్టర్స్  దొరక లేదని. అందుకని, వీలయినంత సమయం, మా లైబ్రరీ లో, పుస్తకాల వేట - చదువులతో గడప సాగాను . ఆఫీసు సమయంలో - కంప్యూటర్ లో పవర్  పాయింట్  ప్రెజెంటేషన్ లు ఎలా సిద్ధం చెయ్యాలో,  వెయ్యాలో - బాగా నేర్చుకున్నా. PA  పైన ఆధార పడకుండా చెయ్య గలిగితే , మన మనో భావాలకు  అనుగుణంగా  తయారు చెయ్య వచ్చు గదా; అందుకని. నా మొట్ట మొదటి లెక్చర్, "కమ్యూనికేషన్ స్కిల్స్" - గా నేనే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే - నాకు లేని స్కిల్ ముఖ్యంగా అదే కదా, అని.  అందుకని, దాదాపు 40-50 గొప్ప పుస్తకాలు చదివాను. చదవగా, చదవగా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత కష్టమైనదో; కానీ, మన జీవితం లోని ప్రతి రంగంలోనూ, ఎంత ముఖ్యమైనదో  తెలిసి వచ్చింది . పుస్తకాలు చదివి, చదివి, నాకు నచ్చిన అన్ని విషయాలు రాసుకున్నాను . అది హనుమంతుడి  తోక లాగా పోతోంది .

వొక ప్రెజెంటేషన్ 250 స్లైడ్స్ తో తయారు చేశాను. అంటే, గోడ మీద వున్న స్క్రీన్ లో పడేది వొక్క  స్లయిడ్  అన్న మాట - అలా 250 స్క్రీన్లు తయారు చేశాను. పుస్తకాల్లో వున్నవి, నేను చదివినవి అన్నీ చెప్పేయాలన్నది - నా తాపత్రయం .  అప్పుడు - ఈ క్లాసుకు వున్న సమయం, వొకటిన్నర ఘంటలు.

నేను చెప్పాల్సిన రోజు రానే వచ్చింది. కానీ నేను యింకా సంసిద్ధుడు కాలేదు. కాకపోతే - తరువాత ఎప్పుడో తెలిసి వచ్చింది - మనం ఎప్పుడూ, ఏ గొప్ప విషయం లోనూ, పూర్తిగా సంసిద్ధులు కాలేమని . దూకితే కాని యీత రాదు - ఎన్ని పుస్తకాలు చదివినా. దూకాలి. దూకాను.

ఆ రోజు గోడ మీది స్క్రీన్ పై స్లయిడ్  ఫోకస్ చేసి చెప్పడం ఆరంభం చేసాను. ఎప్పుడు, గోడ  చూస్తున్నానో , ఎప్పుడు సభికులను చూస్తున్నానో, నాకు తెలీదు . వొక్కొక్క స్లయిడ్ కు ఎంత టైం తీసుకున్నానో కూడా తెలియడం లేదు. వొకటిన్నర ఘంట అయ్యే లోపు, 20 స్లయిడ్ లు కూడా పూర్తి కాలేదు. నేను ప్రిపేర్  చేసింది  250 స్లయిడ్లు. చిట్ట చివర - వొక 5 నిముషాలు, చెప్పినవి టూకీగా మరో సారి చెప్పి నా మనసులోని విషయాలు మరో రెండు చెప్పి  ముగించాను. నాకు ఏ మాత్రము  సంతృప్తి గా లేదు . మనసులో, అయ్యో, ఏమీ చెప్ప లేదే - అన్న గుబులు. వచ్చిన వారిని అడిగాను. మీకెలా వుందని. వారు చాలా బాగుందన్నారు . యిది వరకు ఇలాంటి లెక్చర్ వినలేదన్నారు . వారిచ్చే మార్కులు కూడా బాగానే యిచ్చారు . కానీ, నాకు ఏ మాత్రమూ సంతృప్తి గా లేదు. 250 స్లయిడ్ లలో, 20 చెప్పి ముగిస్తే , సంతృప్తి ఎలా వస్తుంది?

అప్పుడు - వొక్క విషయం అర్థమయ్యింది . వచ్చిన వారికి నేను చెప్పిన విషయాలే తెలుసు కానీ, నేను చెప్పని విషయాలు ఏవి అన్నది తెలియదు - అని.  నా నెక్స్ట్  లెక్చర్ కు 3 గంటలు  టైం  తీసుకుంటే బాగుంటుందేమో - అనుకున్నా. అది మరో నెల తర్వాత వస్తుంది . మా మరో DGM  గారిని సలహా అడిగాను . యిద్దరం వెళ్లి CGM  గారినీ అడిగాము, ఆయన 3 ఘంటలు తీసుకోమన్నారు. కానీ కొన్ని సూచనలిచ్చారు. సభికులను, అప్పుడప్పుడూ, ఏదైనా ప్రశ్నలు అడగమన్నారు . ఇంటరాక్టివ్ గా - అంటే, మీరూ వాళ్ళతో మాట్లాడాలి; వారూ మీతో మాట్లాడుతూ వుండాలి - అని . యిలా కొన్ని సూచనలు . సరే . అన్నాను. మా మరో DGM  గారు అన్నారు - నేను, ఇక్కడికి వచ్చిన ఆరు నెలల తర్వాతనే, నా మొదటి క్లాస్స్ తీసుకున్నా. మీరు, ఎందుకు తొందర పడుతున్నారు - అని. కానీ , నాకు మాత్రం - ఆలస్యం చెయ్యడం లో ఏ ప్రయోజనం కనిపించ లేదు. 

మా అకాడమీ కు, మా BSNL  కంపెనీ  లోని - అంటే దేశం మొత్తం లోని,  అన్ని ప్రాంతాల నుండీ , చిన్న అఫీసర్ల నుండి, చాలా పెద్ద, చాలా సీనియర్ ఆఫీసర్లు వరకు,అందరూ వస్తారు. చాలా సీనియర్ ఆఫీసర్లు  వచ్చినప్పుడు,వారికి, DGM  లు, CGM గారు ఎక్కువగా క్లాసులు  తీసుకోవాలి. మిగతా వారు తక్కువ క్లాసులు, అవీ, అంత ముఖ్యం కానివి తీసుకోవాలి - యిలా వొక ఆనవాయితీ  వుంది .  నా కమ్యూనికేషన్  స్కిల్స్ - చాలా ముఖ్యమైన  క్లాసు - అని నాకు తెలిసింది . అంతే . ఈ పెద్ద, పెద్ద  ఆఫీసర్లు వచ్చే సమయంలో  నేను ఎలా చెప్పాలి - అన్నది, నా మనసులో ప్రశ్న . 

అప్పుడు అనుకున్నా - ఈ విషయంలో ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్  చెయ్యాల్సిందే - అని. వొక రోజు వార్తా పత్రికలు  చదువుతూ వుంటే -అందులో - కొంత మంది రాజకీయ నాయకులు, మినిస్టర్లు తప్పులు తడకలు గా చెప్పిన కొన్ని విషయాలు కనిపించాయి. అలా వెదుకుతూ వెడితే , ప్రపంచ చరిత్రలో - ఈ కమ్యూనికేషన్  స్కిల్స్ లేనందు వల్ల - అంటే, మాట్లాడ కూడనివి మాట్లాడడం వల్ల  వచ్చిన  ఉపద్రవాలు, మాట్లాడ వలసినవి మాట్లాడక పోవడం వల్ల  వచ్చిన పరిణామాలు ఎన్నో, ఎన్నో తెలిసాయి .  అవి నాకు చాలా బాగా అనిపించాయి. 

ఆ తరువాత, ప్రపంచ చరిత్రలో అతి గొప్ప భాషణలు (స్పీచ్ లు) - ఎందుకు గొప్పవయ్యాయో - బాగా పరీక్ష చేసి - అందులోని, కొన్ని  ముఖ్యమైన వాక్యాలను ఎంచుకున్నాను .అందులో అమెరికా ప్రెసిడెంట్లు  మాట్లాడినవే ఎక్కువ వున్నాయి.  వారు చాలా గొప్ప వక్తలు, చాలా గొప్ప మేధావులు, చాలా గొప్ప లీడర్లు అని తెలుస్తుంది. మన దేశంలో, గాంధీ గారి మాటలే - చాలా బాగున్నాయి . గాంధీ గారి తరువాత , మనుషులను, మనసులను , హృదయాలను అలా కదల్చ గల నాయకులు రాలేదనే చెప్పవచ్చు . యిప్పుడిప్పుడు - నరేంద్ర మోడీ గారు మెల్ల మెల్లగా అలా తయారవుతున్నారని చెప్పవచ్చు . అమెరికా లో అలా కాదు . అక్కడ ఎంతో మంది వున్నారు, దేశానికి ప్రెసిడెంట్ కాగల పూర్తి అర్హత వున్న వారు. దేశాన్ని, అభ్యుదయ పథంలో, తీసుకెళ్ల గలిగిన వారు ; ప్రజలను , తమ మాటలతో , చేతలతో, వొక్క ఊపు వూపగలిగిన వారు; తమ వెనుక తీసుకెళ్ల గలిగిన వారు - ఎంతో మంది వున్నారు .

ఎవరో వొక శత్రువును చూపి, అదుగో, అతడే మన పతనానికి, దుస్థితికి కారణం , పదండి, అతన్ని ఎదుర్కొందాం   - అని చెప్పి,  వేల మందిని కదనానికి తయారు చెయ్య వచ్చు. కానీ - ఎవరినీ ద్వేషించ వద్దు, యిదీ, మనకు  కావలసినది,యిలా సాధిద్దాం, రండి - అని పిలిస్తే, సాధారణంగా ఎవరూ రారు. పగ, ద్వేషంతో, కొట్టుకోవడానికి వొకటైనట్టు , మనుషులు మంచి పనులకు వొకటి కావడం చాలా కష్టం. ద్వాపర యుగం లో కూడా చూడండి. కోట్ల మంది వొక్క చోట కూడడం ఎలా సంభవించింది ? యుద్ధం చేద్దాం, అంటే - వచ్చారు, కానీ, దేశాన్ని బాగు చేద్దాం - అంటే వచ్చారా? రారు గాక రారు. రామాయణం  లోనూ అంతే. ప్రపంచ యుద్ధాల్లోనూ అంతే. వొక మంచి పని కోసం, ప్రజలను వూప గలిగిన శక్తి, గాంధీ గారి లాంటి బహు కొద్ది మందికే వుంది. పని చెయ్యొద్దు - స్ట్రైక్ చెయ్యండి అని చెప్ప గలిగే కార్మిక నాయకులు , చేయించ గలిగే కార్మిక నాయకులు, మీరు బాగా పని చెయ్యండి - అని చెప్ప గలరా? చాలా కష్టం . నాకు తెలిసి, స్ట్రైక్ చెయ్యించ గలిగే వారే కానీ పని బాగా చెయ్యండి అని చెప్పే కార్మిక నాయకులు చాలా, చాలా తక్కువ మన దేశంలో. నేను, యిది చాలా మంది కార్మిక నాయకులను అడిగాను కూడా. వారి జవాబు, స్ట్రైక్ చేయించడం మా పని; హక్కుల కోసం పోరాడడం మా పని. పని చేయించడం యాజమాన్యం పని, అని . కొంత మంది కార్మిక నాయకులు తమ పనిని మాత్రం బాగా చేసేస్తారు. కొంత మంది అదీ లేదు.  యిదంతా ఎందుకు చెబుతున్నానంటే - ఏదైనా వొక BSNL లాంటి సంస్థను, లేదా, వొక రాష్ట్రాన్ని , లేదా వొక దేశాన్ని బాగు చెయ్యాలంటే - నాయకుడికి , ఆ సంస్థ యొక్క బలమూ , బలహీనతా రెండూ తెలిసుండాలి. బలాన్ని పెంచడం ఎలాగో, బలహీనత తొలగించడం ఎలాగో తెలిసుండాలి. దీనికి, SWOT అనాలిసిస్ - అని వొక పధ్ధతి వుంది. నేను  వొక సంవత్సరం తరువాత ఎప్పుడో యిదీ చేశాను. BSNL కు, నాకు, మా అకాడెమీ కి, మన దేశానికి - అన్నిటికీ చేశాను .  ఆ పధ్ధతి నాకు చాలా బాగా నచ్చిన పధ్ధతి.  

సరే . నా మొదటి లెక్చర్ నాకు ఏ మాత్రమూ సంతృప్తి యివ్వ లేదు. అసంతృప్తినే మిగిల్చింది. అయితే - అసంతృప్తి వున్న చోటే - అవకాశం వుంటుంది. ప్రయత్నం వుంటుంది. ఫలితమూ వుంటుంది. కొందరికి మాత్రం యివి లేకనూ పోవచ్చు . నరేంద్రుడికి వున్న అసంతృప్తి కారణంగానే ,  తరువాత కాలం లో వివేకానందుడయ్యాడు. గాంధీ గారి అసంతృప్తి కారణం గానే స్వరాజ్యం వచ్చింది . అయితే - అసంతృప్తి ప్రగతి పథం లో వుండాలి. నా పరిస్థితి కి మరెవ్వరో కారణం అనుకునే వారి అసంతృప్తి  ప్రమాద కరమైనది.

యిప్పుడు - నా అసంతృప్తికి, కారణం నేనే, నా అసమర్థతే అని తెలుస్తూనే వుంది . యిప్పుడు నేనేం చెయ్యాలి ? అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ - అంటే ఏమిటి ? అసలా ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి? నాకు లేని స్కిల్స్ నేను మరొకరికి యివ్వగలనా? వారికి 3 గంటల లెక్చర్ యిస్తే - స్కిల్ వచ్చేస్తుందా ? మరి నేను చెయ్య వలసింది  ఏమిటి ?

 మా మరో DGM  గారు ఏం చేస్తున్నారో , చూశాను . ఏదో పుస్తకాల్లో,  ట్రైనీ ల కోసం యివ్వ బడిన - వొక 20 ప్రశ్నలు వుంటాయి; వాటికి ప్రతి దానికీ ఏదో నాలుగు సమాధానాలు వుంటాయి. వాటిలో - వారు తమకు సంబంధించినవి అనిపించేవి , టిక్  చెయ్యాలి . ఉదాహరణకు , క్రొత్త వారితో మాట్లాడాలంటే , మీరేం చేస్తారు ? భయ పడి పారిపోతారా; సిగ్గుతో తల వంచుకుని  కూర్చుంటారా, మెల్ల మెల్లగా, భయం భయంగా మాట్లాడుతారా , హాయిగా, ఉత్సాహంగా మాట్లాడుతారా ? యిన్ని జవాబులు వున్నాయి .  మీరు అందులో, ఏదో వొకటి , మీ స్వభావానికి అనుగుణంగా వున్నది టిక్ చెయ్యాలి.

20 ప్రశ్నలకు ట్రైనీలు  రాసిన తరువాత లెక్చరరు గారు సరైన జవాబు చెబుతారు. మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో చెబుతారు. ఇది వారికి MBA లో, వారి లెక్చరర్లు  చెప్పిన పధ్ధతి . పుస్తకాల్లో రెడీ మేడ్  గా వున్న పధ్ధతి. అది చెయ్యొచ్చు. బాగానే వుందనిపించింది.  యిందులో లెక్చరర్ గారు కూడా హాయిగా అర గంట పైగా వూరికే కూర్చో వచ్చు. ట్రైనీ లు - ఆ అరగంటా ఏదో వొకటి యోచన చెయ్యాలి . ఏదో వొకటి టిక్ చెయ్యాలి. మళ్ళీ దాన్ని గురించి లెక్చరర్ గారు చెప్పేటప్పుడు సరి చూసుకోవాలి. వొకటిన్నర ఘంట లెక్చర్ సులభంగా గడిచి పోతుంది. అంతే కాక - యిందులో , లెక్చరర్ గారు, ట్రైనీ లను పరీక్ష చేసి, మీరు యింతే , అంతే , యిలా మారండి , అలా మారండి - అని ప్లేటు  ఫిరాయించే  వీలు కూడా వుంది. 

అంతా మంచిదే, కానీ, నాకిది చాలదనిపించింది. దీన్లో, మరీ అంత పెద్ద ఉపయోగం కనిపించ లేదు. ట్రైనింగ్  వరకు బాగానే వుంటుంది . కానీ, నిజంగా వాళ్ల  జీవితంలో ఏదైనా మార్పు తేవాలి. నా మూడు ఘంటల ట్రైనింగ్ ద్వారా , వారిలో ఏదో వొక ముఖ్యమైన మార్పు రావాలి. యిదీ నా ఆలోచన.

అప్పుడొక ముఖ్యమైన ఆలోచన తట్టింది. మొదటే వొకటిన్నర ఘంటలు , వారి నిజ జీవితం లో, వారి యింటిలో జరుగుతున్న, జరగవలసిన  కమ్యూనికేషన్. రెండవ   వొకటిన్నర ఘంటలు, వారి ఆఫీసుల్లో జరుగుతున్న , జరగవలసిన  కమ్యూనికేషన్.  ఇక, ఉత్త, పుస్తకాల్లో వున్న కమ్యూనికేషన్ స్కిల్స్  ను పక్కన పెట్టి - మనకు, అంటే - ప్రతి మనిషికి , ముఖ్యంగా - మా ట్రైనింగ్ కు వచ్చే ట్రైనీ లకు , ఏది ముఖ్యంగా కావాలో - అది ఏమిటి?  అన్న ఆలోచన ఆరంభం అయ్యింది.

యింట్లో - భార్యాభర్తల మధ్య, పిల్లలతో, తల్లిదండ్రులతో, యిరుగు పొరుగుతో - వచ్చే సమస్యలు, కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఎలా తీర్చుకోవచ్చు?  అలాగే - ఆఫీసుల్లో, క్రింది వారితో, పై వారితో సంబంధాలు , అంతకు మించి, వచ్చే కస్టమర్లతో, ఎలా మాట్లాడాలి?  యిళ్లల్లో, ప్రతి వొక్కరికీ వున్న వొక సమస్య , ఆఫీసుల్లోని వొక సమస్య - కనీసం యివి  ప్రతి వొక్కరికీ తీరితే - నా ట్రైనింగ్ సఫలమైనట్టే . యిప్పుడు - యిదీ నా ఆలోచన .

దీనిపై - నా బ్రహ్మాండమైన పరిశోధన ఆరంభమైంది. అయితే, దీనిపై యిప్పటి వరకు పుస్తకాలలో  చదివిన  కమ్యూనికేషన్ స్కిల్స్ లో - నాకు దొరికిన బలమైన అంశాలు తక్కువే.  చాలా వరకు, ఆఫీసులకు, కస్టమర్లకు సంబంధించిన విషయాలే. అందునా, భారత దేశ పరిస్థితులకు, మన భాషలకు, మన వారి మనస్తత్వాలకు పూర్తిగా అనుగుణంగా లేవు . కాని, వాటిని పునాదిగా, నా లెక్చర్ మలుచుకోవాలి.

అప్పుడు మొదలైంది - నా ప్రయాణం - కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి, లైఫ్ స్కిల్స్ వైపు .

 అది చాలా, చాలా ఎక్కువగా, నాకు నచ్చిన టర్నింగ్  పాయింట్ . నా నిజ జీవితంలో కూడా వొక పెద్ద మలుపు . మరో సారి , విశదంగా చూద్దాం . 

యిప్పుడు సంస్కృతం  లోని  వొక శ్లోకం   : 
సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్;;  న బ్రూయాత్ సత్యమప్రియం. 
అర్థం : సత్యం చెప్పాలి ;  మనసుకు నచ్చే విధంగా చెప్పాలి ; మనసుకు నచ్చనిది సత్యమైనా చెప్పవద్దు .... యిది మాత్రం చదివితే - మనం నిజంగా, చెప్ప వలసినవి కొన్ని చెప్పక - తప్పు చేస్తాం . అప్రియమైన సత్యాలను, మీరే చెప్పాల్సిన సత్యాలను, మీరు మార్చాల్సిన మనుషుల దగ్గర, చెప్పి తీరాలి . మిగతా వారి వద్ద వద్దు . 

తమిళం లో విన్న వొక చాటువు ;
వున్మై ఏ పేసుగ  (నిజమే చెప్పండి); నన్మై ఏ  పేసుగ (మంచిదే చెప్పండి); అషగాగ పేసుగ (అందంగాచెప్పండి ); మనమరిందు  పేసుగ (ఎదుటి వాడి మనస్స్థితి తెలుసుకుని  దానికి అనుగుణంగా మాట్లాడండి ); అర్థం అరిందు పేసుగ ( మీరు మాట్లాడే మాటల అర్థం తెలుసుకుని మాట్లాడండి ); పలన్ అరిందు పేసుగ (చేస్తే తరువాత ఏమవుతుందో యోచించి మాట్లాడండి); సమయమరిందు పేసుగ (సరైన సమయం చూసి చెప్పండి); సబై అరిందు పేసుగ (చుట్టూ వున్న వారెవరో అర్థం చేసుకుని మాట్లాడండి); పేసాదిరుందుం పషగుగ (మాట్లాడకుండా వుండడం కూడా అలవాటు చేసుకోండి); 

తెలుగులో : 
ఎప్పటికెయ్యది ప్రస్తుత; మప్పటికా మాటలాడి అన్యుల మనముల్; నొప్పింపక తానొవ్వక ; తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ ;

యింతకు మించి కమ్యూనికేషన్ స్కిల్స్ వుందంటారా ?

= మీ

వుప్పలధడియం విజయమోహన్