= తెలంగాణా బిల్లు =
పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్ట బడింది. అందులో ఏముంది ? తెలంగాణా ప్రాంతం వొక ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని మాత్రం వుంది.
యిక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోంది కదా . దాని మాటేమిటి ? ఎందుకని సమైక్యాంధ్ర ప్రజలు, నాయకులు అందరూ - ఈ రాష్ట్ర విభజన వద్దంటున్నారు ? యివి ఏదీ జాతీయ స్థాయి నాయకులు యోచనే చేయరా?
నాగేశ్వర రావు , రామారావు గార్ల నుండి , చిన్న స్థాయి టెక్నిషియన్ వరకు సినిమా రంగమంతా మద్రాసు నుండి హైదరాబాద్ కు "మన రాష్ట్రం" అంటూ, అనుకుంటూ వచ్చారు . ఎన్నో స్టూడియోలు , మరెన్నో సినిమారంగ వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు . చంద్రబాబు గారు తెచ్చిన ప్రతి సంస్థా , హైదరాబాదు కే తెచ్చారు.
అలా వచ్చిన వారినెవరూ - యిది మీ రాష్ట్రం కాదు - యిక్కడికెందుకొచ్చారు, యిక్కడెందుకున్నారు - అని అడగ లేదు; వారూ చెప్పవలసిన అవసరం రాలేదు.
అంతే కాదు. రామారావు గారికి బ్రహ్మ రథం పట్టి తెలంగాణా వారంతా కూడా వారిని ముఖ్య మంత్రిని చెయ్య లేదా ? అప్పుడు లేని వేర్పాటు భావం యిప్పుడెక్కడ నుండి పుట్టుకొచ్చింది ? ఈ విషపుబీజం నాటిన వారెవ్వరు ? పెంచి పెద్ద చేసిన వారెవ్వరు ? ప్రజలంతా కాస్త యోచన చెయ్యాలి .
రామారావు మాత్రమే కాదు . చంద్రబాబు నాయుడు గారు, చివరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు , వేర్పాటు రాష్ట్ర వాదపు విష బీజాలు తెలంగాణా లో పెద్దగా మొలవ లేదు ; పెరగ లేదు . యిదే చరిత్ర . వారందరికీ వోటు వేసి గెలిపించిన వారు తెలంగాణా ప్రజలు . అప్పుడు లేని అన్యాయం ఎప్పుడు మొలిచొచ్చింది ?
అన్యాయం, అన్యాయం అని TRS నేతలు ఘోషిస్తే - శ్రీకృష్ణ కమిటీ వేసారు . ఆయన లెక్కలన్నీ చూసి - అయ్యా ఏ అన్యాయమూ లేదు - జరుగ లేదు అని తేల్చి చెప్పారు . మరి - ఆ కమిటీ పైనే బురద చల్లారు TRS నాయకులు . కానీ , ఆ కమిటీ వారు చెప్పింది ఎలా తప్పు అన్నది ఎవరూ చెప్ప లేదు ; ఏది రైటో కూడా వారు చెప్ప లేదు . యిప్పుడు తెలంగాణా ఎందుకు - అన్న వాదం మరో రకంగా తిరిగింది .
మా వూళ్ళలో - ఆంధ్ర వుద్యోగులు వున్నారు - వుండకూడదు - అన్నారు. అదే మాకు జరిగిన అన్యాయం అన్నారు. పని గట్టుకుని వాళ్ళ యిళ్లకు వెళ్లి - మీరు మీ ప్రాంతానికి వెళ్లి పొండి - అన్నారు . మేము శాంతంగా చెబుతున్నాం - వెళ్ళిపొండి - అన్నారు, బెదిరించారు . యివన్నీ వార్తాపత్రికలలో కూడా వచ్చాయి . యిది ఎంత అరాచకమైన , క్రూరమైన, చట్ట వ్యతిరేకమైన చర్య ? అయ్యా - ఉద్యోగులు అలా ఎలా వెళ్లి పోగలరు ? అసలు, ఎవరయినా అలా యెలా వెళ్లి పోగలరు? అలా వెళ్ళ గొట్టే అధికారం TRS వారికి గానీ, మరెవరికి గానీ ఎవరిచ్చారు? యిది అడగాల్సింది ఎవరు ? తెలంగాణా ప్రజలే అడగాలి. వొకాయన అంటారు - పక్క వాడికి అన్యాయం జరిగేటప్పుడు మీరు అడ్డుకోక పొతే , ఆ తరువాత జరిగే అన్యాయం మీకే , అని .
ఇప్పుడున్న వినాయకులు తెలంగాణా పాలకులైతే - ఈ విద్వేషాల బీజాలు పెరగడం తప్ప మరో గొప్ప పనేమే జరగదనేది తథ్యం .
తెలంగాణా లో ఎన్ని పరిశ్రమలు పెట్టారు! ఎన్ని విశ్వవిద్యాలయాలు పెట్టారు ! అందు వలన తెలంగాణా కు న్యాయం జరిగింది కాదా ? ఎలా జరగలేదంటారు?
నాకు మాత్రం మొదటి నుండీ ఈ పధ్ధతి నచ్చ లేదు . రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ - యివి రావాలి. వొక IIT కానీ , IIM కానీ , ISB కానీ మరే అత్యున్నత విద్యాసంస్థ కానీ , రాయలసీమ లో కానీ , కోస్తా ప్రాంతం లో గానీ ఎందుకు లేదు ? వొక్క IT రంగ సంస్థ కూడా - తెలంగాణా ప్రాంతం తప్ప - మరెక్కడా ఎందుకు పెట్ట బడ లేదు ? వొక్క జాతీయ / అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? యిక్కడే జరిగింది తప్పు . అన్ని ప్రాంతాల లోనూ - అటువంటి సంస్థలు వస్తే , ఈ వేర్పాటు వాదాలు రావు ; వుండవు ; వచ్చినా , రాష్ట్రాలను విభజించినా పెద్ద ప్రశ్న లేదు . యిప్పుడు ప్రశ్న అదే . మేమూ ,మీరూ అభివృద్ధి చేసిన ముఖ్యమైన ప్రాంతం మీది - మాకేమీ హక్కు లేదు అంటే - అది అన్యాయం కాదా .
66 ఏళ్ళ తరువాత కూడా - రాయలసీమలో త్రాగడానికి వూళ్ళలో నీళ్ళు లేవు . రామారావు గారు కూడా హైదరాబాదుకు , మద్రాసుకు నీళ్ళు వస్తే చాలనుకున్నారు . ఆయన వుంటే - యివన్నీ చేసేవారేమో - నాకు తెలీదు . కర్ణాటకా వారు ముందు యిటు వైపు వస్తున్న నీళ్ళు , వాళ్ళ రాష్ట్రంలో నిలిపేస్తే -అడిగే వాడే లేడు మన రాష్ట్రంలో . యిప్పుడు సమస్య తెలంగాణా రాష్ట్రం వస్తే - రాయల సీమకు - కనీసం త్రాగు నీళ్ళు అన్ని ప్రాంతాలకూ రావాలి . వస్తుందా ? లేదా , TRS వారు అది జరగనివ్వరా ? జరగనివ్వరనేది అందరి అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం వారు రాయలసీమ కు ఏం న్యాయం చేస్తారు ? యిది - ఏవీ , పార్లమెంటులోని బిల్లులో లేవు . విభజిస్తే - ఏ ప్రాంతం వాళ్లకు , ఏం న్యాయం చేస్తాం - అన్న అంశం ఏదీ - ఈ బిల్లులో లేదు. యిదీ వొక బిల్లేనా ? తొందర పడి తాతాచార్యులు మతం మార్చుకున్నాడట. అలా వుంది పరిస్థితి . మన దేశంలో ఈ మధ్య వచ్చిన చాలా చట్టాలు తొందరపాటుతో చేసిన చట్టాలే . కోడలు ఫిర్యాదు చేస్తే - యింట్లో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని వొక చట్టం . కొంత మంది కోడళ్ళు ఆరడికి గురి అవుతున్న మాట నిజమే . ఎవరూ కాదనటం లేదు. కానీ, ఎంతో మంది కోడళ్లు పెళ్ళైన వెంటనే , యింటిని విడగొట్టడమూ , యింట్లో ఏ బాధ్యతలూ తీసుకోక పోవడమూ అంతే నిజం. మొత్తానికి ఎవరిది తప్పైనా , అది సాంతంగా విచారించి, సమస్యను పరిష్కరించాలా ? యింట్లో వాళ్లందిరినీ జైల్లో పెట్టాలా ? సరే ; జైల్లో పెట్టిన తరువాత , ఆ కోడలితో , ఆ భర్త కానీ, యింట్లో వాళ్ళు కానీ ఎలా వొకటిగా వుంటారు ? యిదా ఆ కోడలి సమస్యకు పరిష్కారం ? ఈ చట్టం క్రింద ఎవరికీ ఏ రకమైన న్యాయమూ జరగడం లేదు - నాకు తెలిసినంత వరకూ . తెలంగాణా చట్టమూ అంతే . విడగొట్టడం గురించి మాట్లాడుతున్నదే తప్ప - తరువాత ఏమిటన్నది ఏమీ మాట్లాడడం లేదు .
మన దేశంలో ప్రజలను విడగొట్టడం అంత సులభమైన పని మరొక్కటి లేదు . మీకన్యాయం జరిగింది ; జరిగింది ; అంతా వారివలనే - అంటే చాలు . నిజమే కాబోలు అనుకునే ప్రజలు మనం . ఏమన్యాయం జరిగింది; ఎప్పుడు జరిగింది ? ఎవరి వలన జరిగింది? యివి అడిగే వాడూ లేదు; చెప్పే వాడూ లేడు .
నిజమే. ప్రజలందరికీ అన్యాయం జరిగింది - కొన్ని విషయాల్లో . యిది అన్ని ప్రాంతాల్లోనూ జరిగింది . ఉదాహరణకు , భూ ఆక్రమణలు . యివి పెద్ద ఎత్తున, అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి . హైదరాబాదు లోనూ జరిగాయి . తిరుపతి లోనూ జరిగాయి . మరెన్నో ప్రాంతాల్లో జరిగాయి . వీటిలో కూడా - కొన్ని ధనిక కుటుంబాలకు చెందిన , కొన్ని కులాల వారు మాత్రమే చాలా ఎక్కువ గా చేశారు , చేస్తున్నారు - అన్న విషయం అందరికీ తెలుసు . వీరే రాజకీయాల్లోనూ, రౌడీ యిజం లోనూ, పేరు మోశారన్నది మనకందరికీ తెలుసు. అంటే - ఆ కులాల వారందరూ అలా చేస్తున్నారని కాదు . చేస్తున్న వారిలో - కొన్ని కులాల వారు చాలా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయం . అదే కులాలలో మంచి నాయకులూ వున్నారు .
యిప్పుడు రాజకీయాలు అంటే రౌడీ ఇజం అన్న స్థాయికి దిగిపోయింది . యిటువంటి నాయకులకు యెదురుగా , సాధారణ ప్రజలకు ఎవరికీ న్యాయమూ లేదు ; రక్షణ కూడా లేదు - అన్న విషయం అందరికీ తెలుసు .
మనం మంచి నాయకులను ఎన్నుకుంటే - అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది . లేదా - ఏ ప్రాంతానికీ , న్యాయం జరుగదు . సాధారణ ప్రజలు కులాల వారీ, మతాల వారీ కాకుండా మంచి వాళ్లకు వోటు వేస్తే , మంచే జరుగుతుంది . మన రాష్ట్రంలో - మనం మంచి నాయకుడి కోసం వెదకాలే తప్ప , రాష్ట్ర విభజన కోసం కాదు .
లాంకో హిల్ ఎక్కడ పోయినా - సాధారణ ప్రజలకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ, ప్రతి ప్రాంతం లోనూ త్రాగే నీళ్ళు కావాలి కదా . వుద్యోగావకాశాలు అందరికీ కావాలి కదా. పరిశ్రమలు అన్ని చోట్లా రావాలి కదా . గొప్ప విద్యా సంస్థలు అన్ని చోట్లా రావాలి కదా . అన్నీ హైదరాబాదులో పెడితే , కనీసం యికపై వొప్పుకోకండి. మహబూబ్ నగర్ లోనూ రావాలి ; చిత్తూరు లోనూ రావాలి ; శ్రీకాకుళం లోనూ రావాలి .
అన్నీ చెప్పినా - చిట్ట చివర , నాకనిపించేది ఏమిటంటే - ప్రజలుగా మనం అందరం వొకటే . దయ చేసి , మీరు వేరు, మేము వేరు -అనకండి. ఈ వేర్పాటు వాదానికి అంతు లేదు. ఎంతగానో వొకరినొకరు అభిమానించే భార్యాభర్తల మధ్య కూడా - యిటువంటి వేర్పాటు విషబీజాల ద్వారా, విడిపోయే పరిస్థితులు కల్పించే వారున్నారు. విడిపోయే వారూ వున్నారు. అది ఎంత తప్పో ఎప్పుడో తెలుస్తుంది . చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వొరిగేది ఏమీ లేదు . మాకు నవాబులైనా ఫరవాలేదు ,కానీ మీరు వద్దు - అనే మూర్ఖుల మాట నమ్మ వద్దు .
సరే . రాష్ట్రాలు విభజించాల్సిందే - అనుకుంటే ; కాస్త ముందు చూపుతో,అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే లాగా వున్న బిల్లు వస్తే - కొంతలో కొంత మేలు .
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
వుప్పలధడియం విజయమోహన్