5, నవంబర్ 2013, మంగళవారం

ఆట కదరా శివా ; ఆట కద కేశవా - ఇండియా క్రికెట్ లో గెలవాలా, వొద్దా - సిగరెట్ త్రాగడం పెద్ద వ్యసనం - సెక్స్ మగ వాడి బలహీనత


ఆట కదరా శివా ; ఆట కద కేశవా - అన్నాడు  వొక తెలుగు కవి.
ఆ ఆట ఉత్తరాఖండ్ లో కావచ్చు; ఒడిశా లో కావచ్చు ; అమెరికా లో కావచ్చు . ఆంధ్రా లో కావచ్చు . మరో చోట కావచ్చు . మన యిళ్ళలో కావచ్చు . మనలోనే కావచ్చు .  ప్రతి చోట ఏదో వొక ఆట. ఆ.... .పై వాడి ఆట అన్ని చోట్లా జరుగుతూనే వుంది . ఎప్పుడు, ఎక్కడ - ఏం చేస్తాడో చెప్పలేం . ఎప్పుడు, ఎవరిది గెలుపో, ఎవరిది వోటమో చెప్పలేం.

ఎక్కడైనా, ఏదైనా , ఆ .... ఆట , అతని ఆటే కదా. యిది మనకు గుర్తుంటే , ఆ  ఆటను ప్రేక్షకులుగా చూస్తూ, ఆనందిస్తూ వుంటాము.   లేదా, ఆ ఆటలో, మనమూ మునిగి తేలుతూ వుంటాము .

టెండుల్కర్ అవుట్  అయిపోతే - అతని కంటే, మనమే ఎక్కువ బాధ పడి పోతాం.  బంతి వేసిన వాడు ఎంత బాగా వేసాడో , అని అనుకోం.  మన యింట్లోనో, మన వారి యింట్లోనో - ఎవరికైనా, ఆక్సిడెంట్ జరిగినా, రోగాలు వచ్చినా , వారికంటే, మనమే ఎక్కువ చింత లో పడిపోతాం .

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికి తెలుసు? ఆ...పై వాడికి తెలుసు . ఈ ఆట ఆడించే వాడికి తెలుసు .
కాకపోతే మన యిష్టానిష్టాలు మనకుంటాయి. మోడీ గారు గెలవాలని, ప్రధాన మంత్రి కావాలని నేను అనుకుంటాను . కాకపొతే , జేత్మలాని , సుబ్రమణ్యం స్వామి లాంటి వారు - ఎక్కువగా మాట్లాడకుంటే  మేలు - అని అనుకుంటాను. 60 నెలల్లో, దేశంలోని ప్రతి వొక్కరూ , అభివృద్ధి పథం లోకి రావాలని -  నా ఆకాంక్ష . యిది జరుగుతుందా ? 2014 లో తెలుస్తుంది .

 సరే. ఇండియా క్రికెట్ లో గెలవాలా, వొద్దా ? యిదేం ప్రశ్న ? గెలవాలి కదా ? నాకు మాత్రం ఆ ప్రశ్న, ఆ అనుమానం ఎప్పుడూ వుంది. ఇండియా క్రికెట్ లో గెలిస్తే , ఇండియా లోని పిల్లలందరూ చదువు తగ్గిస్తారు.  టీవీ కే అతుక్కుని పోతారు.   త్రాగుడు కంటే, క్రికెట్ చూడడం-ఆడడం కాదు- చూడడం పిల్లలకు పెద్ద వ్యసనం . పరీక్ష రోజు కూడా, పది నిమిషాల ముందు కూడా - చదువు కంటే , క్రికెట్ ముఖ్యంగా - చూసే పిల్లలు ఎంత మంది ? మెజారిటీ  వాళ్ళే కదా. ఎంత మంది చదువులు చెడుతోంది- ఇండియా క్రికెట్ లో గెలవడం వల్ల ? ఏది వ్యసనం గా మారుతుందో - దాని పట్ల మోజు పెంచుకో కూడదు. మితంగా వుంటే పరవాలేదు. కానీ క్రికెట్లో అది కుదరదు . రోజంతా చూడాల్సిందే . రోజంతా చూస్తే ?  చదువులూ , పనులూ - అన్నీ - గోవిందా !

కొన్ని వ్యసనాలు మనం తయారు చేసుకునేవి. కొన్ని,  మనతో బాటే పుట్టేవి. త్రాగుడు లాంటివి  మనమే అలవాటు చేసుకునేవి . సెక్స్ చాలా వరకు మనతో బాటే పుట్టేది .

నాకు యిద్దరు సహోద్యోగులు వుండే వారు. వారికి, సిగరెట్ త్రాగడం పెద్ద వ్యసనం గా వుండేది. అదేదో గొప్ప అయినట్టు వారిలో వొక భావన. చీఫ్ జనరల్ మేనేజర్  గారితో - మా అందరి మీటింగ్  జరిగేటప్పుడు కూడా - వున్నట్టుండి, వీరిద్దరూ మాత్రం చెప్పా పెట్టకుండా, వెలుపలికి వెళ్లి పొయ్యే వారు. ఆ తరువాత, వరండా లోకి వెళ్లి చూస్తే - అక్కడంతా వొకటే సిగరెట్ పొగ . చెబితే వినే వారు కాదు. అది వ్యసనం అని వారికి తెలీదు. అది ప్రపంచం లోనే, గొప్ప అలవాటుగా వారి భావన.  కాకపొతే, వొక సారి, దాదాపు యిద్దరికీ, వొకే సారి, కాస్త గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మరో సిగరెట్ త్రాగితే, మీ గుండె - అంతే, మళ్ళీ పని చెయ్యదు - అన్నారాయన. అప్పుడు నిలిపారు వారిద్దరూ, పొగ త్రాగడం. అంత వరకు అది వొక బలహీనత, వొక వ్యసనం  అని ఎప్పుడూ అనుకోలేదు వారిద్దరూ. 

మరి సెక్స్ -  విషయానికి వస్తే, అది కొంత వరకు మనతో బాటే పుట్టింది . సృష్టి క్రమాని కోసం  నిర్దేశింప బడింది.  యిది - పై వాడి ఆట .  మగ వాడి ఈ బలహీనత ను, బలంగా మార్చడానికే - వివాహము, వావి వరుసలు, వాటి గౌరవాలు - ఏర్పడ్డాయి . కానీ, యిప్పుడు, కొంత మంది ఆడవారే, అవన్నీ వొద్దు - అని బయలుదేరుతున్నారు . అది పెద్ద మూర్ఖత్వం.  సినిమా, టీవీ లతో ప్రారంభం అయింది. నేను ఎలాంటి బట్టలయినా వేసుకొంటాను - లేదా, అసలు వేసుకోను, మీరెవరు అడగడానికి - అని ఆ కొద్ది మంది అంటున్నారు. యిదీ, పై వాడి ఆటే. ఆకర్షణ  మొగుడు పెళ్ళాల మధ్య వుంటే  సమాజం మొత్తం సురక్షితంగా వుంటుంది. మిగతా ఆడవారిపై, మగ వారిపై  - గౌరవం వుంటుంది. ఆడది, నేను ప్రపంచం లోని - మగ వారినందరినీ  ఆకర్షించాలి - అనుకుంటే , ప్రపంచమంతా  చెడిపోతుంది. అది తన బలహీనత మాత్రమే కాదు. మగ వాళ్ళందరి బలహీనత. వారితో బాటే  పుట్టిన బలహీనత . టీవీ లో, సినిమాల్లో,  24 గంటలూ , ఇలాంటి వాళ్ళను చూసి, చూసి , తమ బలహీనతకు లోనయిన  మగ వాళ్ళు కొంత మంది వొంటరిగా దొరికిన ఆడవారిపై, చిన్న పిల్లలపై కూడా, అత్యాచారానికి పాల్పడుతున్నారు . అత్యాచారానికి లోనైన వారి తప్పు లేక పోవచ్చు. కానీ, ఈ సినిమాలు , టీవీ లలో వచ్చే అర్ధ నగ్న ఆడ వారి పాత్ర పూర్తిగా వుంది. వారి - వల్లే మగ వారిలో ఈ బలహీనత ప్రేరేపించ బడుతూ వుంది. ఆ ప్రేరేపణ వల్లనే - అత్యాచారాలు జరుగుతూ వున్నాయి. విశ్వామిత్రుడి లాంటి వాడి తపస్సు చెడచడానికి, ఇంద్రుడు డబ్బు ఎర చూపలా. అర్ధ నగ్నంగా వుండే ఆడదాన్నే పంపించాడు . అది యింద్రుడి  స్టాండర్డ్  టెక్నిక్ . ఎక్కడా అంతే . యిది మగ వాడి  బలహీనత -అన్నది అందరికీ తెలుసు. సాక్షాత్తు శివుడి ధ్యానం భగ్నం చెయ్యడానికి కూడా - అదే టెక్నిక్  ఉపయోగించ బడింది.

మగ వాడికి డబ్బు పెద్ద బలహీనత కాదు ; ఆడదానికి కావచ్చు . మరేదీ, మగ వాడికి - తీరని బలహీనత  కాదు . ఆడదొక్కటే - తన బలహీనత . ఆదైనా - తనతో వావి వరుసలు లేని వారి పట్లనే చాలా యెక్కువ. అన్న- చెల్లెలు, అనుకుంటే , మళ్ళీ, ఆ బలహీనత  లేదు. అమ్మ, కొడుకు, అక్క, తమ్ముడు - యిలా అనుకుంటే - ఆ బలహీనత  లేదు. కానీ, ఈ కాలంలో, దుస్తుల విషయంలో కానీ, వావి వరుసల విషయంలో కానీ , పాత పరిజ్ఞానం  మూల బడుతోంది . విశృంఖలత్వం  చోటు చేసుకుంటూ వుంది. అదేదో గొప్ప, అధునాతనత్వం - అనుకుంటూ వున్నారు . కొన్ని విశ్వ విద్యాలయాల్లో , మీ దుస్తుల పైన, చిన్న దుపట్టా  వేసుకోండి -అంటే,  పెద్ద రభస చేస్తున్నారు - మా దుస్తులు, మా యిష్టం అంటూ . యిది పెద్ద మూర్ఖత్వం . యింత కంటే పెద్ద  మూర్ఖత్వం ఆ ఆడవారిలో మరొకటి లేదు. యిది చాలదన్నట్టు - మగ వారితో బాటు, బార్లకు వెళ్లి మేమూ తాగుతాం - అంటూ బయలు దేరుతున్నారు . తాగిన ఆడదానికి, తనను, ఎవరు, ఏం చేస్తున్నారో ఏం తెలుస్తుంది. తాగిన మగ వాడికీ అంతే. వావి వరుసలు కూడా అప్పుడు పోతాయి.  అమెరికాలో యిప్పుడు , చిన్న పిల్లల గర్భ ధారణ  చాలా, చాలా, ఎక్కువగా మారింది . అయితే, తండ్రి ఎవడో తెలీదు. ఎలా తెలుస్తుంది? జరిగేది, యిద్దరూ ( యింకా ఎక్కువ మంది) తాగేసినప్పుడు కదా. అటువైపే వెడుతున్నాం మనం . 

శంకరాచార్యుల వారు అన్నారు - నారీ స్తన భర నాభీ దేశం, దృష్ట్వా మాగా మోహావేశం - అని.

మగ  వాళ్లకు అలాంటి మోహావేశం - కలిగించడం ఎప్పుడూ ప్రమాద కరమే. అది వారి బలహీనత . దాన్ని ఆడవారు రెచ్చ గొట్టడం మంచిది కాదు. రావణాసురుడిలో, శూర్ఫణక,  కేవలం సీత అందాన్ని విధ విధాలుగా  పొగిడి , అతనిలో , సీత పట్ల కామాన్ని  రెచ్చగొట్ట గలిగింది . శూర్ఫణకకు  తెలుసు, రావణుడి ఆ బలహీనత . రావణుడిలో ఆ బలహీనత లేకుంటే , రామాయణమే  లేదు. శూర్ఫణక  సీత అందాన్ని అలా పొగడ కుండా వుండి వుంటే  కూడా - రామాయణం  లేదు. అసలు మన సంస్కృతి లో మగ వాడు - తన లోని యిటువంటి బలహీనతలను గెలవడమే చాలాముఖ్యమైన ధ్యేయంగా చెప్ప బడింది . అలా గెలిచిన మగ వాడు - మహా యోగి అవుతాడు ; దేవుడే అయిపోతాడు . ఈ బలహీనత తో ఆడుకోవడమే - పై వాడి ఆట . ఆడది  తెలిసో, తెలియకో, ఆకర్షించడం, మగవాడు ఆకర్షించ బడడం, వొకరిపై ప్రేమ, వొకరిపై ఆకర్షణ, మరొకరితో పెళ్లి, మరొకరితో మరొకటి - యివన్నీ ఆడ, మగ రెండు వైపులా నుండీ జరుగుతో వున్నాయి . ఆట కదరా శివా , ఆట కదా కేశవా .. ..

యివన్నీ -  నేనో, మీరో చెబితే , అందరూ వెంటనే మారి పోతారని కాదు . ఈ ఆట యిలా సాగి పోతూనే  వుంటుంది. అందరూ వినరు. ఎవరో కొంత మంది  వినచ్చు . బాగు పడొచ్చు .  

ఈ ఆటను - ఆటగా చూసే వాళ్లకు , లోపల, ఎక్కడో, కాస్త, జ్ఞానోదయం కావచ్చు

సర్వే జనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్

4, నవంబర్ 2013, సోమవారం

రోగాలు ఎందుకు వస్తాయి ? అవి కర్మ ఫలాలా ? కాన్సర్ లాంటి వ్యాధులు పోతాయా? ఎలా?


కాన్సర్ లాంటి వ్యాధులు పోతాయా? ఎలా?

మనకు తెలుసు - పుట్టిన ప్రతి వాడికి, అంటే , ఆడ, మగ అందరికీ  - రోగాలు, చావు తప్పవని. ముందుగా పోతే - వార్ధక్యం తప్ప వచ్చు. అంతే కానీ , రోగాలు, చావు తప్పని సరి. 

రోగాలు ఎందుకు వస్తాయి ? మనం, మన కర్మ ఫలాన్ని అనుభవించడానికి. అంతే . యిది చాలా సరళమైన వివరణ .  

అయితే - అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా రోగాలు వస్తున్నాయి గా! బిడ్డ ఏం కర్మ చేసింది ? పూర్వ జన్మ కర్మ కావొచ్చు. లేదా - పెద్దలు చేసిన కర్మ ఫలాన్ని పిల్లలు అనుభవించ వలసి వుండొచ్చు. పక్కింటి వాడు - తన యింటిలో రొచ్చు రొచ్చు గా పెట్టుకుంటే , అక్కడ- దోమలు, ఈగలు  ఎక్కువైతే, అవి మనల్ని వచ్చి కుట్టితే , మనకి ఏ మలేరియానో వస్తే - అది కూడా మన కర్మ ఫలమే . 

కర్మ ఫలం - అంటే మనమే చెయ్య నక్కర లేదు . పక్కింటి వాడు చేసినా, ఎదురింటి వాడు చేసినా - మనం, ఆపకుంటే చాలు - వారి కర్మ ఫలం మనకూ వచ్చేస్తుంది . రాజు చేసే తప్పులు -ప్రజలకందరికీ సమస్యలు తెచ్చి పెడతాయి .  అవునా, కాదా ?

కాక పొతే - మీకు రావలసిన కర్మ ఫలాలే మీకు వస్తున్నాయి . మీకు రాకూడనివి మీకు రావడం లేదు . 

ఈ కర్మ సిద్దాంతం - చాలా శాస్త్రీయమైనది. యింతకీ మించిన సశాస్త్రీయమైన సిద్దాంతం మరొకటి లేదు - అని చెప్ప వచ్చు . 

అయితే, యిది పూర్తిగా అర్థం కావడం కష్టం . అర్థం అయినా - దాన్లోని అన్ని అంశాలు - మనం, అన్ని వేళలా, అంగీకరించడానికి మరీ కష్టం . 

సీతను రావణుడు ఎత్తుకెళ్ళాడు - అది ఆమె కర్మ ఫలం . అలా అని రాముడు వూరికే కూర్చొని  వుండ లేదు కదా. మానవ ప్రయత్నం వుంటే, దేవుడు - మన కర్మ ఫలాన్ని , ప్రస్తుత కర్మకు అనుగుణం గా మార్చ గలడు . 

రోగం వచ్చింది - అది మన కర్మ ఫలం. నిజమే. కానీ, డాక్టర్ వద్దకు వెళ్లచ్చు. మందు తీసుకోవచ్చు. రోగం పోగొట్టుకోవచ్చు . కర్మ ఫలం అనేది - మనం భూతకాలంలో చేసిన పనుల ఫలితం. అది యిప్పుడు వచ్చింది . కానీ, వర్తమానంలో మనం వూరికే కూర్చొని ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ వుండమని ఎవరూ చెప్ప లేదు . యిప్పుడు మళ్ళీ కర్మ చెయ్యాలి . తప్పదు.

కర్మణ్యేవ  అధికారస్తే - అంటే - ప్రస్తుత కర్మ మీరే చేస్తున్నారు. అది చెయ్యడానికి మీరే కర్తలు . 

అదేదో - దేవుడు మీ చేత చెయ్యిస్తున్నాడనుకుంటే  తప్పు . వొక వేళ - మీరలా అనుకుంటే - ఫలితం కూడా దేవుడే అనుభవిస్తున్నాడని - మీరు అనుకోవాలి .   నా హం కర్తా  హరిహి కర్తా -అని,  చేసేది వాడే, చేయించేది వాడే  అనుకుంటే, అనుభవించేది వాడే - అని కూడా అనుకోవాలి . మళ్ళీ చేసింది వాడు , అనుభవించేది నేనా - అని అనుకోవడం తప్పు . 

కర్మ ఫలాలు - మనం మూడు రకాలుగా తీసుకోవచ్చు . కొన్ని సుఖంగా వుంటాయి . ఏదో లాటరీ వచ్చింది ; ప్రమోషన్ వచ్చింది; మంచి భార్య/భర్త  దొరికారు. యివి సుఖం గా అనిపిస్తాయి. యేవో రోగాలు వచ్చాయి . ఆక్సిడెంట్  అయ్యింది -కాలో, చెయ్యో విరిగింది ; ఇలాంటివి దుహ్ఖాన్ని కలిగిస్తాయి . 

సుఖ, దుహ్ఖాలను - సమానంగా తీసుకునే మనస్తత్వం   వుంటే - జీవితంలో, ఇవేవీ బాధించదు . అంటే -  మనం జడుని లా  వుండి పోతామని కాదు . నిజానికి, అన్నిటినీ మించిన ఆనందం మనలోనే వుంది . అది బయటి నుండి మనకు రావడం లేదు.   బయటికి పోవడమూ లేదు అది అనుభవం లోకి వచ్చేస్తే - కర్మలకు, కర్మ ఫలాలకు, పెద్ద  ప్రాముఖ్యత  వుండదు . అవి బయట జరిగేవి . ఆనందం ఎప్పుడూ లోపల వుండేది . 

అది వచ్చేస్తే - మళ్ళీ, సుఖ దుహ్ఖాలు మనల్ని బాధించవు. అబ్బే. సుఖాలు మనలను ఎందుకు బాధ పెడ తాయండీ - అని సందేహం వస్తుంది ! అవి సుఖ పెడతాయి కదా ? నిజమే. సుఖాలు సుఖంగా కొంత సమయం వుంటుంది.  మళ్ళీ , అవే, దుహ్ఖంగా మారిపోతాయి ; లేదా, ఏదో, వొక దుహ్ఖానికి దారి తీస్తాయి. సుఖ దుహ్ఖాలు వొక తిరుగుతున్న వృత్తం కొన లో మనం చేసే ప్రయాణం లాంటివి. యిది పొతే అది, అది పొతే యిది వస్తూనే వుంటాయి. 

అందుకే ప్రతి వొక్కరి జీవితంలో -సుఖాలూ వుంటాయి . దుహ్ఖాలూ వుంటాయి . 

వీటిలో - చాలా తమాషాలూ వున్నాయి.  మీకు 95  మార్కులు వచ్చాయి . చాలా సంతోష పడ్డారు . తరువాత తెలిసింది, పక్కింటి వాడికి 100 మార్కులు వచ్చాయని . ఎదురింటి వాడికి 99 వచ్చాయని . వెనకింటి వాడికి, 98 వచ్చాయని. యిప్పుడేమయ్యింది? మీ 95 మార్కులు ఎక్కడికీ పోలేదు. కానీ, మీ సంతోషం పారిపొయ్యింది !

మీ ఇల్లు బాగానే వుంది . చిన్నగా, ముచ్చటగా  వుంది . కానీ, ఎదురింటి వాడు ఫస్ట్  ఫ్లోర్ కట్టాడు . మంచి డిజైన్ తో కట్టాడు . కానీ మీ ఇల్లు అలాగే వుందిగా ? మరి , మీ సంతోషం  ఏమయ్యింది ? ఎక్కడో వెళ్లి పొయ్యింది . 

ఆనందం అంటూ - అనుభవం లోకి వచ్చేస్తే - మరి ఎవరు ఎలా వున్నా , మీరు ఆనందం గానే వుంటారు . 

మీకు కూడా, ఏ నష్టం వచ్చినా, కష్టం వచ్చినా - మీ అనందం మాత్రం పోదు. 

యిది సాధ్యమా? సాధ్యమే - అని మాత్రం - నాకు తెలుసు.  ఏది సాధ్యమో - దాన్ని మనం సాధించాల్సి వుంటుంది. సాధిస్తే - ఆ తరువాత , ఆ సాధించిన దాన్ని, సిద్ధం (లేదా, సిద్ధి ) అంటారు . సాధించే సమయంలో - మనల్ని సాధకుడు అనీ; సాధించిన తరువాత, సిద్ధుడు - అనీ అంటారు .

ఈ సాధకత్వం - మన జీవితంలో - అన్ని విషయాల లోకీ , తీసుకు రావాలి . 

చిన్న జలుబు చేసినా , మనం ఎంతో కష్ట  పడి పోతూ వుంటాము. జలుబైనా, దగ్గైనా, అంతకు మించిన వ్యాధి లేదు, అని అనుకుంటూ వుంటాము . కానీ, ఎంత పెద్ద వ్యాధైనా , కడపటి క్షణం వరకు సంతోషం గా వుండ గలిగిన వారు కూడా ఎంతో మంది వున్నారు. 

దాదాపు 40 ఏళ్ళ క్రితం , యిటువంటి వారిని గురించిన వొక పుస్తకం చదివాను. వొకాయనకు కాన్సర్  వచ్చింది .  మరో 2 నెలల కంటే  ఎక్కువ బ్రదకడని డాక్టర్లు  చెప్పేశారు . ఆయన రెండు రోజులు ఏడ్చారు . తరువాత ఏదో అయ్యింది ఆయనలో . ఆయన మనసులో, ఏదో వొక మార్పు; వొక నిశ్చయం . అంతే . మరుసటి రోజు వున్న ఆస్తంతా వదిలేసి , వున్న డబ్బంతా మూట కట్టుకుని , ప్రపంచ యాత్ర చేస్తున్న వొక లక్జరీ నౌక లో ఎక్కి ప్రపంచ యాత్రకై  బయల్దేరాడు ఆయన .   

ఆయనకు వున్న ఆయుర్దాయం 2 నెలలు. ప్రపంచ యాత్ర 3 నెలలు. సరే . పొతే, ఆ నౌకలోనే పోదాం - అని అనుకుని బయల్దేరాడు. నౌకలో అడుగుపెట్టిన మరు క్షణం నుండి ఆనందం గా  వుండాలని నిశ్చయించుకున్నాడు.  అలాగే వున్నాడు కూడా. ఆయన్ను చూసి , ఆ నౌక లో వున్న వారంతా కూడా, ప్రభావితులై , ఆ మూడు నెలలు సంతోషంగా గడుపుతూ వచ్చారు . మూడు నెలలు గడిచి పోయాయి . అందరూ, బయలు దేరిన స్థలానికి తిరిగి వచ్చేసారు; ఆయన కూడా . 

ఆయన తన యింటికి వెళ్ళాడు .యింట్లోని  వాళ్ళు ఆయన్ని చూసి ఆశ్చర్య పొయ్యారు . అప్పటికి ఆయన తన కాన్సర్ గురించి  పూర్తిగా మర్చి పొయ్యాడు. తన వాళ్ళ బలవంతం పైన - మళ్ళీ టెస్ట్ చేయించు కున్నాడు . యిప్పుడు, ఆశ్చర్య పోవడం, డాక్టర్ల వంతైంది . కాన్సర్ ఛాయలు అసలు లేవు ఆయనలో-యిప్పుడు. ఏదో కారణంగా ఆయన శరీరమే తనలో, కాన్సర్ ను సృష్టించింది. ఆ కారణం ఎలాగో, పూర్తిగా పొయ్యింది . దానితో బాటు, కాన్సర్ కూడా, పూర్తిగా పొయ్యింది. 

కాన్సర్ లాంటి చాలా, చాలా వ్యాధులకు , మనం అనుభవించే - స్ట్రెస్ , మానసిక ఆందోళన, భయం - ముఖ్య కారణాలుగా తెలుస్తూ వుంది . అవి లేకుండా చేసుకుంటే - కాన్సర్ లాంటి వ్యాధులు  రావు . వచ్చినవి కూడా త్వరగా తగ్గి పోతుంది . మనం చేసే కర్మ - స్ట్రెస్ , మానసిక ఆందోళన, భయం. వాటి కర్మ ఫలం మనం అనుభవించే వ్యాధులు . ఆ కర్మ లేకుంటే, ఈ కర్మ ఫలం కూడా లేదు . 

అంటే - ఏ వ్యాధి వచ్చినా, డాక్టర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పడం   లేదు . వెళ్ళండి. కాక పొతే - మీ మానసిక స్థైర్యాన్ని - మీతో బాటే వుంచుకోండి . మీ ఆనందాన్ని ఎప్పుడూ విడనాడకండి.  

వీటితో బాటు - అనులోమ-విలోమ ప్రాణాయామము ; కపాల భాతి ప్రాణాయామము, బాహ్య ప్రాణాయామము ; ధ్యానము - యివి తప్పకుండా చెయ్యండి . యివి సులభంగా నేర్చుకోవచ్చు . సులభంగా చెయ్య వచ్చు . ధ్యానం, మనలోని ఆనందాన్ని, ప్రశాంతతను , బయటకు తెస్తుంది. యివే, ఎన్నో రోగాలకు మందులుగా పని చేస్తుంది . 

నిజానికి - కాన్సర్ లాంటి వ్యాధులకు కూడా , అలోపతీ  వైద్యం తో బాటు , ప్రాణాయామాలతో బాటు , ధ్యానం తో బాటు , మనం తప్పక తీసుకో వలసిన   ఆయుర్వేద మందులు ఎన్నో వున్నాయి . ఉదాహరణకు - గోధుమ పైరు యొక్క రసం , గోమూత్రం ,  బొప్పాయి ఆకుల రసం , యిలా ఎన్నో  మందులు , ఎన్నో వ్యాధులు కరిగించేవిగా తెలుస్తున్నాయి. 

ముఖ్యంగా , ప్రాణాయామాలు , ధ్యానం , వొత్తిడి తగ్గించుకుని కాస్త తేలిక జీవితాన్ని గడపడం - యివి, రోగాలు రాకుండా వుండడానికి, వచ్చిన రోగాలు పోవడానికి - చాలా ముఖ్యమైన ఔషదాలు. 

రోగాలు - వొత్తిడి వల్ల , సరికాని ఆహార విహారాల వల్ల , నిద్ర లేమి వల్ల - సరి కాని పరిసరాల వల్ల  వచ్చేవి; అయితే , యివి సరి చేసుకుంటే - రోగాలు పోతాయనడం కూడా కరెక్టే . శ్రీకృష్ణుడు  భగవద్గీతలో - ఈ విషయం, రక రకాలుగా చెప్పాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట స్య కర్మణి -అంటాడు శ్రీకృష్ణుడు. సరైన ఆహారము, విహారము , నిద్ర - వున్న వాడే యోగానికి అర్హుడు ; ఆనందానికి అర్హుడు. ఆరోగ్యానికి అర్హుడు.  ఆ ఆహారము ఎలాంటి ఆహారం కావాలో, మరో చాప్టర్ లో చెబుతాడు. సాత్వికాహారం ఏదో, దాని గుణాలేమిటో, రాజసిక, తామసిక ఆహారాలేవో, వాటి గుణాలేమిటో - అన్నీ చెబుతాడు.  సాత్వాకాహారం తినే వాడికి రోగాలు (చాలా వరకు) రావు. ఆనందంగానూ వుంటాడు . 

నిజానికి ఏ కర్మకు ఏది ఫలమో కూడా - భగవద్ గీత లో చాలా చోట్ల వుంది . గీతను మించిన సైన్సు లేదు . 

వొత్తిడికి, చెత్త ఆహారానికి, నిద్ర లేమికి ... ఇలాంటి వాటికి ఫలం కాన్సర్ లాంటి వ్యాధులు. మనలో వుండే భయం  అన్నింటి కన్నా పెద్ద వ్యాధి . భయం విడిచేసి, వొత్తిడి తగ్గించుకుని , ఆనందంగా వుండి , యుక్తాహార, విహారాలతో  వుంటే - కాన్సర్ కూడా తప్పకుండా పోతుంది. చర్మ వ్యాధులూ పోతాయి . ఏ వ్యాధి అయినా పోతుంది. ఆ నమ్మకం ముఖ్యం .

మీ దగ్గరలో -  అలాంటి వ్యాధిగ్రస్తులు వుంటే - వారిలో ఈ నమ్మకం కలుగ జేయండి.  భయం పూర్తిగా విడి చేయమని చెప్పండి . ఆనందం  గా వుండమని , ఆనందంతో బాటు , మందులు - అలోపతీ, ఆయుర్వేదా రెండూ - తీసుకోమనండి . ప్రతి రోజూ , పై చెప్పిన ప్రాణాయామాలు , ధ్యానం చేయమనండి వారు బాగవడం ఖాయం . 

సర్వే  జనాః సుఖినోభవంతు . 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్

మోడీ ప్రభంజనం - సర్వే జనాః సుఖినో భవంతు - వొక 60 నెలలు మోడీ కిచ్చి చూద్దాం .



మోడీ ప్రభంజనం


ఈ మధ్య కాలం లో మన దేశంలో - చాలా పరిణామాలు వచ్చాయి. మన రాష్ట్రంలో వరదలు - వరద బాధితులు , సమైక్యాంధ్ర నా , వేర్వేరు రాష్ట్రాలా - వీటికి పోరాటాలు - యిలా ఎన్నో సమస్యలు . 

దేశంలో - మోడీ ప్రభంజనం వచ్చింది . యిది - కొన్ని నెలలు గానే వచ్చింది. అంతకు ముందు - భాజపా లోనే - ఎవరు, ఎవరు అన్న ప్రశ్నలు, మోడీ పట్ల కొందరి నాయకుల విముఖత  - అన్నిటినీ దాటి - మోడీ గారిని భాజపా యొక్క ప్రధాన మంత్రి  కాండిడేట్ గా అందరు అంగీకరించడం జరిగింది. 

అంతకు ముందు - ప్రతి TV  చానెల్  లోనూ, ఆయనను గురించిన విమర్శలే వచ్చేవి - అందులో వొక్కటీ సద్విమర్శలు   వుండేవి కావు . ఇప్పుడది మారుతూ వుంది . ఆయనకు ముస్లిం ల పట్ల ఎప్పుడూ విముఖత లేదు . 2002 సంఘటనలు - ఆయన వలన జరిగినవి కావు. అందులోని పాత్ర దారులందరికీ శిక్ష కూడా పడేలా చేసింది - ఆయన ప్రభుత్వమే - అని చెప్పక తప్పదు . 

అదే - సిక్ఖులకు ఎదురుగా కాంగ్రెసు పార్టీ వారు (అంతకు ముందే ఎప్పుడో ) జరిపిన ఘోరాలకు ఈ రోజు వరకూ శిక్ష లేదు. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వున్న కాంగ్రెసు పార్టీ  నిర్వాకమే అని చెప్పక తప్పదు . యిన్ని తమ వొడి లో పెట్టుకుని - వారు మోడీ ని విమర్శించడం  అసంగతం కాదా.

అంత కంటే ముఖ్యమైనది -దేశ ఆర్ధిక వ్యవస్థ  ఎన్ని రకాలుగా చెడాలో - అన్ని రకాలుగా చెడి పోతూ వుంది.  కేంద్ర ప్రభుత్వానికి వోట్ల గొడవ తప్ప మరేదీ పట్టనంటుంది. దేశం లోని పెట్టుబడి దారులే - దేశంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు . లంచగొండి తనం దీనికి అతి ముఖ్య కారణం. విదేశీ పెట్టుబడి వస్తే చాలు - దాన్ని ఎలా వెళ్ళ గొట్టాలో - అన్న తరహాగా వుంది, మన పన్నుల శాఖలూ, ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలు, కొన్ని స్వచ్చంద  సంస్థలు . 

వొక స్టీల్ ప్లాంట్  వస్తే - లక్షల మందికి  ఉపాధి దొరుకుతుంది . కొంత మందికి  ( 4-5 వేల గిరి జనులకు) పునరావాసం కల్పించాల్సి వుంటుంది . వీరికి పునరావాసం కల్పించరు. స్టీల్ ప్లాంట్ రానివ్వరు . స్టీల్ ప్లాంట్ కు అడ్డం కాంగ్రెస్ వారే వస్తే ఎలా?  ఎంతో సులభంగా రెండు పనులూ చెయ్యొచ్చు . కాకపొతే - స్టీల్ ప్లాంట్ వచ్చి . గిరిజనులకూ పునరావాసం కలిగితే - అందరూ సంతోష  పడితే - వోట్లు - ఆ రాష్ట్రాన్ని ఏలే ఏదో పార్టీ కి వస్తుంది . అదీ బాధ. 

యిలా అయితే - దేశం ఎప్పటికి బాగు పడేను ? 

అందుకే - నా ఉద్దేశం లో , మోడీ రావాలి. 65 సంవత్సరాలలో , మీరు తీసుకు వచ్చిన (తీసుకు రాలేని) ప్రగతి  నేను తీసుకు వస్తాను - అని ఆయన అంటున్నారు. అందుకని ఆయన రావాలి. గుజరాత్ లో వచ్చిన ప్రగతి - మద్య నిషేధం వుండి కూడా వచ్చిన ప్రగతి . ఆ శాఖ సుంకాలు లేకుండా సాధించిన ప్రగతి. 

యిందులో, గొప్ప రహస్యం ఏమీ లేదు. 

చేసే వాడిని చెయ్య మంటే చాలు. ప్రోత్సహిస్తే చాలు. చెయ్య కుండా ఆపకుంటే చాలు. అడిగే వాడికి ,ప్రభుత్వం  యివ్వాల్సిన  వొప్పుదలలు, వెంట వెంటనే యిస్తే చాలు.  కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అలా కాదు కదా.  ఎన్నో రాష్ట్రాలకు యివ్వాల్సిన వొప్పుదలలు  - ఎన్నో సంవత్సరాలుగా  యివ్వడం లేదు. యిది మాత్రం కాక - కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన గవర్నర్లు కూడా ఎన్నో పథకాలకు వొప్పుదల యివ్వడం లేదని వార్తలు!  అభివృద్ధి కి యిన్ని రకాల ఆటంకాలు మరే దేశంలోనూ వుండ వేమో ? 

అందుకనే - మోడీ గారు రావాలి. నా ఉద్దేశంలో, మోడీ గారు - భాజపా లోని  చాందస వాదాలను కూడా చాలా వరకు కడిగి వేస్తారు. అందరినీ సమానంగా చూస్తారు. అయితే - టెరరిస్టులను మాత్రం   వదిలి పెట్టే ప్రసక్తి లేదు. యిప్పటి మెతక విధానాలు టెరరిస్టుల విషయంలో చాలా, చాలా మారాలి . పాకిస్తాన్ విషయంలో చాలా మారాలి. వారు, మన సైనికుల తలలు ఎత్తుకు పోతే కూడా  - చూస్తూ కూర్చునే విధానం చాలా, చాలా మారాలి. అమెరికా చూడండి . దాక్కుని వుండే  తాలిబానీయులను కూడా - వెదికి , వెదికి  సంహరిస్తోంది. అదే - వారికి తగిన గుణ పాఠం. 

వొక్క భారతీయుడి పై ఆక్రమణ / హత్య జరిగితే - మన దేశం కూడా, అమెరికా లాగా - అది చేసిన వాడిని / వారిని  వొక్కరిని విడువ కుండా తరిమి సంహరించాలి. వొక్క అమెరికా నే కాదు - చిన్న దేశం ఇజ్రాయెల్  కూడా అలాగే చేస్తూ వుంది. శాంతి అనేది - శత్రువు మనసులో భయం, నీతి  వుంటేనే వస్తుంది. నీతి లేని వాడికి భయమైనా వుండాలి. ఈ రోజు ఆ భయం లేదు వారికి . 

మారణాయుధాల తయారీ - మన దేశంలోని,  మన సంస్థలకే వొప్పగిస్తే; వారిని - అమెరికా లాంటి  దేశాలతో, వొప్పందం  కుదుర్చు కోవడానికి  అనుమతిస్తే - చాలా సులభంగా జరిగి పోతుంది . కానీ - మన ప్రభుత్వం వారికి - అదేమీ పట్టడం లేదు . వాల్ మార్ట్ వొక్కటి వస్తే చాలు అన్నట్టు గా వున్నారు .  యిప్పుడు వారూ రావడం లేదు. 

చేస్తే, గీస్తే, చైనీస్  ప్రభుత్వం తో, వారి సంస్థలతో - టెలికాం లాంటి కీలక సెక్టార్లలో కూడా - పొత్తు పెట్టు కుంటున్నారు . యిది, ఎప్పుడు, ఎక్కడ, మనను దెబ్బ తీస్తుందో  తెలీదు. 

 మనం, ప్రజలు కూడా అలాగే ఉన్నాము . మన యువతీ యువకులకు - ఎంతో మందికి ఉపాధి లేక పోయినా , మనం మాత్రం మన దేశంలోని సంస్థలు తయారు చేసినవేవీ కొనం . చైనా వాడు రెండు రూపాయలకు తక్కువగా అమ్మితే - అదే కొంటాం. మన యింటి లోనే,  యిద్దరు నిరుద్యోగులున్నా - అది మనం కొనుగోలు చేస్తున్న విదేశీ వుస్తువుల వల్లే అనేది మనం ఎప్పుడూ అర్థం చేసుకోం. మన ప్రభుత్వం వారు కూడా - మన సంస్థల పైన ఎక్కువ పన్ను, విదేశీ సంస్థల పైన తక్కువ పన్ను లాంటి -  గొప్ప విధానాలు పెట్టుకున్నారు. చైనా  మన కన్న ముందుండడానికి - మనం వొక్కక్కరుగానో , సంస్థా గతం గానో,  చైనా నుండి చేసే కొనుగోళ్ళు - చాలా పెద్ద కారణం - అని నా గట్టి నమ్మకం.  యిది మనం నిలిపితే, వారికంటే - ఆర్థికం గా మనమే కాస్త ముందుండ వచ్చు . 

కల్తీ చెయ్యడమంటే - మనకు చాలా యిష్టం. లంచం పుచ్చుకోవడం అంటే - మరీ యిష్టం . 

యింట్లో  ఆడ వాళ్ళు - పక్కింటి ఆయనను చూడండి; ఎన్నెన్ని చేసుకుంటున్నాడో, వాళ్లావిడకి ఏమేం చేసిస్తున్నాడో,  మీరెందుకూ  పనికి రారు - అని, తమ యింటి మగ వాళ్ళను పురి కొల్పి లంచ గొండులుగా మార్చడం వుందా? లేదా? అంటే మగ వాళ్ళేం తక్కువ తిన్నారని కాదు . కొంత  మంది మగ వాళ్ళు లంచం కోసం ఏదైనా త్యాగం చేసేస్తున్నారు.  దేశాన్ని కూడా . యివన్నీ మారాలి . 

ఆమ్. ఆద్మీ. పార్టీ వారేమో - కాంగ్రెస్, భాజాపా పార్టీ ల వారు మాత్రమే లంచగొండులు -వారిద్దరినీ విడిచి  మమ్మల్ని ఎన్నుకోండి; మీ సమస్యలన్నీ-యిట్టే మాయమవుతాయి, అంటున్నారు.

అయ్యా- చిట్ట చివరి గుమాస్తా, ప్యూను - ఆఖరికి, నిన్న చేరిన దిన కూలీ వాడి వరకు లంచ గొండి తనం  నర నరాల్లో ఊరిపోయింది  మంచి వాళ్ళూ వున్నారు - కానీ వారు అశక్తులు . దీనికి దండం దశ గుణం భవేత్ - అన్నదే విరుగుడు . వారిని మీరు మార్చ లేరు. 

ఆమ్  ఆద్మీ పార్టీ వారు, మోడీ లాంటి  నాయకుడితో చేరితేనే , అందరికీ మేలు - అన్నది నా అభిప్రాయం. అలాగే మన రాష్ట్రంలో - చంద్ర బాబు నాయుడు గారు, జయప్రకాశ్ నారాయణ్ గారు - మోడీ గారితో, పొత్తు కలిపితే - అందరికీ మేలు . 

మన దేశం లంచ గొండుల దేశం అన్న అపఖ్యాతి  పోవాలి. అందుకు ఈ పార్టీ లన్నీ నడుం కట్టాలి . వొక 60 నెలలు మోడీ కిచ్చి చూద్దాం . 

60  నెలల తర్వాత - వోటు మన చేతిలోనే కదా వుంది . అప్పుడు చూద్దాం . 
సర్వే  జనాః సుఖినో భవంతు

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

మనం వొకటి కాగలం. కులాలు మాపుకోగలం ; అభివృద్ధి సాధించ గలం. పేదరికం పోగొట్ట గలం -మనల్ని విడదీయకుండా పరిపాలించే వాడికి వోటు వేయాలి . అంతే.


కేంద్ర ప్రభుత్వం వారు ఆహార సెక్యూరిటీ బిల్లు ను పాస్  చేశారు. 

66 ఏళ్ళ తరువాత, మన దేశంలో, చాలా మందికి సరైన ఆహారం కూడా లేదని వొప్పుకోవడమే యిది.  యిది ఎవరి వల్ల జరిగింది ? యిప్పుడు , ఉన్నట్టుండి , 2014 ఎలెక్షన్ల  ముందు , 66 ఏళ్ళుగా రాని  ఈ జ్ఞానోదయం ఎలా, ఎందుకు వచ్చింది .

66 ఏళ్ళ క్రిందట 1 రూపాయ కు వొక డాలర్  విలువ వుండేదట . యిప్పుడు , 66 ఏళ్ళ తరువాత, దాదాపు 66 రూపాయల కు  వొక డాలర్   గా మన రూపాయ విలువ పడి పోయింది.

ఎందుకిలా జరిగింది ? దీనికి ఎవరు కారణం ?  మీకు తెలీదా? నాకు తెలీదా ?

 దేశం లో మూడో భాగం లో నక్సలైట్ల ప్రభావం చాలా ఎక్కువగా వుందట . దీనికెవరు కారణం? మిగతా రెండు వంతుల భాగంలో మన నాయకుల లంచ గొండి  తనం, వారి దుశ్చర్యల ప్రభావాలు కనిపిస్తూనే వున్నాయి. రెండో దాని వలన మొదటిది వచ్చిందా - అన్నంత ఎక్కువ గా వుంది

సరే . ఎవరు కారణం అన్నది వొక ప్రక్క వుంచితే - జరిగిన తప్పు లలో ముఖ్యమైనవి ఏమిటి - అనేది చాలా  ముఖ్యమైన అంశం  కదా . 

మన దేశంలో - మనం, ఉత్పత్తిని పెంచడానికి చాలా తక్కువ ప్రాముఖ్యత  యిస్తూ వచ్చాము . మనకు సహజ వనరులు చాలా వున్నాయి. రూపాయ విలువ పెరగాలంటే - దేశంలో , ఉత్పత్తులు పెరగాలి.  వేరే మార్గమే లేదు .

కానీ, కేంద్రం గానీయండి , రాష్ట్రం కానీయండి - వున్న దాన్ని పంచడమే గానీ- పెరిగే జనాభా కంటే - ఎక్కువగా ఉత్పత్తులు పెరగాలని, పెంచాలని మనస్స్ఫూర్తిగా   ప్రయత్నించడం లేదు .  జనాభా తగ్గాలనీ ప్రయత్నించడం లేదు. 

అందువలన ,  జనాభా పెరుగుతూ వుంది . ఉత్పత్తులు పెరగడం ఎప్పుడో మానేశాయి.  రూపాయ విలువ పడిపోతూ వుంది. అభివృద్ధి అసలు లేదని కాదు . కానీ వచ్చిన అభివృద్ధి చాలా వరకు ప్రైవేట్ వ్యక్తిగత ప్రయత్నాల వలన వచ్చిందే .  అదీ,జనాభా పెరుగుదల వల్ల , వ్యర్థమై పోతూ వుంది. 

ప్రభుత్వాలు చెయ్య వలసిన పనులు అసలు చెయ్యడం లేదు .

కొన్ని ఉదాహరణలు -

1.  విద్యారంగంలో పిల్లలకు, ముఖ్యంగా - దేశ  భక్తీ, ఉన్నతమైన సామాజిక విలువలు అతి ముఖ్యం.  అటువంటి దేశ భక్తీ, వున్నత విలువలు - విద్య ద్వారా పిల్లలకు కలగడం లేదని - మనకూ తెలుసు. 16 ఏళ్ళ పిల్లలు , కళాశాలల్లో చదివే యవకులు  మానభంగాలకు, దోపిడీలకు, హత్యలకు పాల్పడడం రోజు రోజుకూ  ఎక్కువవుతోంది . ఉద్యోగాల్లో వున్న వారిలో - ఎంతో మంది, లంచ గొండులుగా వుండడం మనకు తెలుసు. యిది కూడా చెడిపోయిన విద్య ప్రభావమే. వొక్క విద్య యొక్క విలువల ప్రమాణాలు  పెంచితే  - మరో 15 సంవత్సరాలలో - జాతిని పూర్తిగా మార్చ గల, చేవ గల తరం వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఎన్నో సమస్యలు గణనీయంగా - తగ్గిపోతాయి .  యిది ఎప్పుడు జరుగుతుంది ? పాలకులకు లేని విలువలు - వారు విద్యలో ప్రవేశ పెడతారా ? నాకు నమ్మకం లేదు .  మంచి విలువలున్న నాయకులొస్తే - విద్య లోని విలువల ప్రమాణాలు పెరగొచ్చు . నాకు తెలిసి -  భూ ఆక్రమణలలో కూడా - చాలామంది  నాయకుల హస్తమే వుంది -అది  ఏ రాష్ట్రమైనా కానియ్యండి.  వారిలో లేని విలువలు మరొకరికెలా వచ్చేటట్టు  చేస్తారు వారు?

2. జనాభా పెరుగుదల మన దేశంలో ఉన్నంత ఎక్కువగా చైనా లో కూడా లేదు. చైనా లో ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా వొక కుటుంబానికి వొకే సంతానం అనే విధానం తీసుకు వచ్చారు . ఫలితంగా - చైనా , అమెరికా ఆర్ధిక ప్రమాణాలను దాటి వెల్లగల స్థితికి వచ్చేసింది. మనకంటే నాలుగింతలు పెద్ద దేశంలో - మనకంటే తక్కువ జనాభా రాగల సమయం వచ్చేసింది . అమెరికా అంత కంటే చాలా పెద్ద దేశం . అక్కడ - జనాభా మనకంటే చాలా తక్కువ.    వారంతా- అభివృద్ధి చెందడానికి  కారణాలు - (1) జనాభా సంఖ్య పెరుగుదల కంటే - చాలా, చాలా ఎక్కువగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా సంబంధ  ఉత్పత్తులు పెరిగాయి. (2) జనాభా లోని విలువల ప్రమాణాలు కూడా యిప్పుడూ బాగుంది . 

మన దేశం లో ,   మనం, ఈ రెండు విషయాల్లోనూ, క్రిందికి పడిపోతున్నాము . దేశ భక్తి మన దేశంలో చాలా, చాలా, తగ్గిపోతున్నదనే  నా విశ్యాసం ; ముఖ్యంగా మన నాయకుల్లో . చాలామందిలో వారికి వుండవలసినంత  దేశ భక్తి, సామాజిక విలువలు లేవనే నా ప్రగాఢ విశ్వాసం . ఎక్కడ చూసినా అసత్యాలే . ఎక్కడ చూసినా నమ్మక ద్రోహమే.  ఎక్కడ చూసినా లంచ గొండి తనమే. 

సరే . వారిని ఎన్నుకొనే ప్రజలలోనూ అవి గణనీయంగా తగ్గి పోయాయి . మంచి , నిస్స్వార్థ పరులైన నాయకులను ఎన్నుకుంటే - మళ్ళీ, దేశం త్వరగా బాగుపడుతుందని - నా ప్రగాఢ విశ్వాసం. 

దేశంలోని ఏ సమస్య చూసినా - ఎక్కడో వొక చోట నాయకత్వ లోపంగానే తేలుతుంది. 66 సంవత్సరాలు, దాదాపు వొకే పార్టీకి అధికారం కట్టబెడితే - రూపాయ విలువ పెరగాల్సింది పోయి 1/2 కు కాదు, 1/4 కు కాదు ; ఏకంగా 1/66 వ వంతుకు పడిపోయింది.  ఈ మధ్య కాలంలో - ఎన్నో దేశాలు మనలను దాటి ముందుకు వెళ్లి పోయాయి. 

కులాలు పూర్తిగా పోయి, మనమందరం వొకే కులం అనే స్థితి రాక పోగా, కులాల వారీగా పార్టీలు, బాంకులు, టీవీ  చానల్లు, సొసైటీలు - అన్నీ ఈ రోజు కుల ప్రాతిపదిక పైనే జరుగుతున్నాయి. బ్రిటిష్ వాడు - విడదీసి పాలించుమన్నా -అన్నాడని అనే వారు కానీ - ఆ పని చేసింది, చేస్తూ వున్నది మన పాలకులే అని తెలుస్తూనే వుంది . మనం వొకటి కావాలి. కాగలం.  మనల్ని విడదీయకుండా  పరిపాలించే  వాడికి వోటు వేయాలి . అంతే. 

ఎవరికీ కష్టం లేకుండా, సుఖంగా క్రమంగా కులాలు మాపుకోవచ్చు ; అభివృద్ధి సాధించ వచ్చు . పేదరికం పోగొట్ట వచ్చు . అంతే కాదు; మరే దేశంలోనూ , లేనంత సుఖ శాంతుల్ని మన దేశంలో నెల కొల్ప వచ్చు . 

యోచించండి మరి ! 

=మీ 

వుప్పలధడియం విజయమోహన్

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

శ్రీ వినాయక చతుర్థి -2013 - శుభాకాంక్షలు



విజయనామ సంవత్సర, శ్రీ వినాయక చతుర్థి 


నాడు 


తెలుగు వారందిరికీ 


మీరు ఏ జిల్లాలో వున్నా, ఏ రాష్ట్రంలో వున్నా, ఏ దేశంలో వున్నా


మీకు వినాయకుడు


సకల ఆయురారోగ్య, సుఖ, శాంతులనూ, సకల ఐశ్వర్యాలనూ , శుభాలనూ 

 

ప్రసాదించాలని  కోరుతూ 

 

= మీ 

 

వుప్పలధడియం  విజయమోహన్



కలిసి వుంటేనే - కలదు సుఖం = నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే - మన అభివృద్ధి


 కలిసి వుంటేనే - కలదు సుఖం


మనం చెయ్య గలిగే పనులు ఎన్నో వున్నాయి.
మనం చెయ్య లేని వాటితో పోలిస్తే - చెయ్యగలిగేవి చాలా తక్కువ . నిజమే .
కాక పొతే ....  చెయ్య గలిగే పనులు సకాలంలో చెయ్యడం లోనే, మన సంతోషం , అభివృద్ధి -రెండూ వుంటాయి .
  •  పుట్టడం మనం చేసిన పని కాదు. మన వల్ల అయ్యే పని కూడా కాదు. ఎందుకు ఫలానా వారి కడుపున, ఫలానా , ఫలానా జాతి, కులాల్లో , ఫలానా రంగు,రూపు లతో, ఫలానా, ఫలానా జన్యు గత స్వభావాలతో, ఫలానా చోట - యిలా ఎలా  పుట్టామో మనకు తెలీదు. అది మన చేతిలో లేదు. మన తల్లిదండ్రుల చేతిలోనూ లేదు. 
  • కొంత మందికి ఎదుటి వాడి రంగు, కులం, మతం, పుట్టిన స్థలం, తేదీ కూడా నచ్చడం లేదు . నచ్చక పొతే పెద్ద బాధేం లేదు కానీ - మా వూరు విడిచి వెళ్ళిపో - అంటున్నారు. 
  • వొక సారి వొక పులి అందట - మేకా, నువ్వు త్రాగుతున్న ఎంగిలి నీరు నాకు వస్తోంది. నీ ఎంగిలి నీరు నేనెలా త్రాగను? కాబట్టి నిన్ను చంపి తినేస్తాను - అని. మేక అందట - నేను ఎంతో క్రింద వున్నాను, మీ ఎంగిలి నీరే నాకు వస్తోంది - కానీ నా ఎంగిలి నీరు మీకెలా వస్తుంది  అని! నువ్వు కాక పొతే, మీ నాన్న అయి వుంటాడు . ఏమైనా, నేను నిన్ను తినాల్సిందే -అని పులి అందట .  ఇలాంటి వాదనలకు - సమాధానాలు వుంటాయా? 
  • వెనకటికి వొకాయన - ఈ యింటి కాకి ఆ యింటిపై వాలకూడదని కోప్పడ్డాడు . కాకులేవీ ఆయన మాట వినలేదు . ఆఖరికి, కాకులేమో అన్ని ఇళ్ళపై వాలుతూనే వున్నాయి . ఆయన మాత్రం స్మశానంలో బూడిదై మాయమై పొయాడు.   ఇళ్ళూ వున్నాయి. కాకులూ వున్నాయి. వాలకూడదని చెప్పిన వాడు అన్నిటికీ దూరంగా,  బూడిద గానో, మట్టిగానో వున్నాడు. 
  • మనలో కొందరు -  యిటువంటి  వారి మాటలు విని - మేము వేరే, మీరు వేరే  అని కొట్లాడుకుంటున్నాము. పోతన వరంగల్ జిల్లాలో పుట్టాడు. శ్రీనాథుడు  కోస్తా ప్రాంతం వాడు. వారు బావా మరుదులు గా - యిద్దరూ గొప్ప కవులుగా వుండడం మనకు తెలీదా? ఎప్పుడు మనం వేరయ్యాము? అప్పట్లో రాయల సీమ, తెలంగాణా , కోస్తా అన్న   పేర్లే లేవు . అందరూ తెలుగు వారే . మరి, ఈ విభేదాలు ఎప్పుడు వచ్చాయి? ఇరాన్ నుండి, అరేబియా నుండి వచ్చిన తురుష్క ప్రభువుల నుండి వచ్చింది. వాళ్ళు గుళ్ళూ కొట్టారు. గోపురాలూ కొట్టారు.  మాతృదేవోభవ అనే మన సంస్కృతిని  కూడా కొట్టారు. వారు మధ్యలో వచ్చారు. మధ్యలో పొయ్యారు. 
  • యిప్పుడున్న తురుష్క రాజ సంతతి వారు కూడా తురుష్క దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నారే తప్ప , తెలంగాణా వారితో కాదు ; కోస్తా వారితో కాదు. అసలు భారదేశ వాసులతోనే కాదు. వారికి లేని తీట మనకొచ్చింది.   మన దేశం తోనే పెద్దగా సంబంధాలు యిష్ట పడని  వారు పెట్టిన పేరు మనకు శాశ్వతం అనుకుంటున్నాము. 
  • అంతకు ముందు రాముడు తిరిగిన ప్రాంతం మనది. అది మనకు గుర్తు లేదు. విజయనగర రాజులు, వోరుగల్లు రాజులు మరెంతో మంది రాజులు రెండు ప్రాంతాలనూ చేర్చి పాలించ లేదా ? అదెందుకు  మనకు గుర్తు రాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్దార్ పటేల్ గారు మళ్ళీ కలిపాడు మనల్ని. లేదంటే, మనలో వొక పాకిస్తాన్ పుట్టి  వుండేది. యిప్పుడు పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు వున్నాయో మనం చూస్తూనే వున్నాం కదా.  అది మనకు కావాలా?  అందునా తెలుగు వాళ్లకు అది కావాలా?
  •  మొన్నొకాయన టీవీ చానల్ లోనే అన్నాడు - మేము ఇండియన్స్ కాము..కాము..కాము. భారత దేశం దురాక్రమణ చేసి మమ్మల్ని తనలో కలిపింది - ఇలా ఎన్నో అన్నాడు. ఇలాంటి వాళ్ళా మనకు నాయకులు?   వీరి మాటా మనం వినేది ? మనకు - కలిపిన వాళ్ళెవరూ గుర్తు రారెందుకు? విడదీసిన వాడు మాత్రం గుర్తున్నాడు. వాడేదో మనకు గొప్ప ఉపకారం చేసినట్టు! అతను కూడా - ఏదో వొక పేరు పెట్టాడు -వొక ప్రాంతానికి - అంటే కాని , మనం విడి పోవాలని ఎప్పుడూ చెప్పలా. మనం వేరే, వేరే - అని కూడా చెప్పలా.
  • పోతన్న, శ్రీనాథుడు బావ మరుదులైతే - మనం వేరే ఎలా అవుతాము. గోపన్న, పోతన్న, తిక్కన్న, వేమన అందరూ - మన వారు కాదా? ఎవడో వొక విదేశీయుడు కొన్నాళ్ళు రాజ్యమేలితే -మీరు వేరు, మేము వేరా - మనం మనం కామా ? ఇదెక్కడి పిచ్చి?
  • వొక్క పోతన, శ్రీనాథుడు మాత్రమే కాదు ,ఎంతో మంది తెలుగు వారు అన్ని ప్రాంతాలకూ వెళ్ళారు, వచ్చారు
  • మొదట మనకు కర్నూల్ రాజధాని అయ్యింది. రాజధాని అక్కడే వుండి  వుంటే - ఈ విభజనా గట్రా ఆలోచనలు వచ్చేవి కావేమో.  ఆ తరువాత హైదరాబాద్ రాజధాని అయ్యింది . తరువాత మన రాష్ట్రంలో అక్కడ మాత్రమే విపరీతమైన అభివృద్ధి తీసుకొచ్చారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ  లేనంత అభివృద్ధి అక్కడే, మనమంతా  చేరి తీసుకు వచ్చాం. 
  • ఆ తరువాత -మద్రాసు నుండి సినిమా పరిశ్రమ అంతా - హైదరాబాద్ కే తరలి వచ్చింది. అప్పుడెవరూ - మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళు లేరు. రచయితలు, కళాకారులు, సైంటిస్టులు , పారిశ్రామికులు - అందరూ - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చారు. అప్పుడు కూడా మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళెవరూ లేరు. 
  • ఈ కాలంలో - భార్యాభర్తల మధ్య కూడా చాలా సులభంగా చిచ్చు పెట్టే వారున్నారు. అమ్మా, మీ వారిని ఏదో హోటల్లో చూసాను, మరో అమ్మాయితో కూర్చొని వున్నారు - అంటే చాలు. అన్న వాడు  తెలియనివాడైనా ఫరవాలేదు. ఆమె యింట్లో - ఆ రోజు రామ రావణ యుద్ధమే. 
  • అలాగే, మీ యింట్లో, మీ ఆవిడ ఎవరితోనో కూర్చొని మాట్లాడుతూ వుందండీ.. మరేమో .. అని చెప్పారనుకోండి. ఆయన యింట్లో మహా  భారత యుద్ధమే. పెళ్ళాం  పైన,మొగుడి పైన వున్న నమ్మకం కన్నా మనలో చాలా మందికి -  ముక్కు, మొహం తెలియని వాళ్ళు చెప్పే పితూరిలపై వుంటుంది. యిది మనకున్న పెద్ద బలహీనత . 
  •  మరి ప్రజల మధ్య చిచ్చు పెట్టడం వొక లెక్కా? అది ఎంతో సులభం గా మారి పోయింది . అదో, వారి వలన "మనం" నష్టపోయాం - అంటే చాలు. అనుమానాలు, విరోధాలు వెంటనే వచ్చేస్తాయి . మంచి నాయకుడు లేకపోతే - యింకా త్వరగా వచ్చేస్తాయి . సరే ; అయ్యా - మీరేమీ నష్ట పోలేదు -యిదుగో, గణాంకాలు - మీరే చూడండి అంటే - ఈ  గణాంకాలు - చేసిన వాడేదో కుట్ర చేసాడు - మీతో కలిసి . మేము నమ్మం గాక నమ్మం. మరి దీనికి జవాబు ఎక్కడ తెస్తాం . మరో సారి గణాంకాలు తెమ్మందాం -అంటే; వొద్దు; మొత్తానికి, మీకూ, మాకూ పొత్తు కుదరదు -అని రిప్లై . అసలు, ఏ తర్కానికీ లొంగని ఈ తర్కం ప్రకారం రాష్ట్ర ప్రజలు  విడపోదామంటే - ఎంత అవాంఛనీయం 
  • అయితే - పాలక వర్గంలో - కొన్ని రకాల అవాంచనీయ పరిస్థితులు  వచ్చాయనే చెప్పుకొవాలి. మా కులం, మాకులం అన్న పక్షపాతాలు ఎక్కువయ్యాయి. మన రాష్ట్రాభివృద్ధి, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కూడా  చాలా, చాలా, కుంటు పడిందనే చెప్పుకొవాలి. యిది అన్ని ప్రాంతాలకూ చెందినదే.  కానీ, యిది మనం ఎన్నుకున్న నాయకత్వ లోపమే. చూడబోతే - మంత్రివర్గంలో - అన్ని ప్రాంతాల నాయకులూ - ఎప్పుడూ వున్నారు . ఏ ప్రాంతం అభివృద్ధి చెందక పోయినా - ఆ ప్రాంతపు  నాయకులే కారణం -మరెవరో కాదు .
  • నిజానికి -  మనకున్న  వనరులకు - మనం, గుజరాత్ కంటే కూడా బాగా అభివృద్ధి చెందవచ్చు . కానీ చెంద లేదు. గోదావరి, కృష్ణ  నదుల నీళ్ళు  ప్రతి జిల్లా కూ  ఎందుకు అందటం లేదు - ఈ రోజు వరకూ ? ఆదిలాబాద్ నుండి , చిత్తూర్  జిల్లా వరకు  కాలువలు త్రవ్వి త్రాగు నీరు, పంట నీరు రెండూ, కల్పించి  వుండ వచ్చు. కావాల్సినంత విద్యుత్తు  ఉత్పాదన చేసి వుండ వచ్చు.  ఎన్నో రకాలుగా,ఉద్యోగ, వృత్తి అవకాశాలు కల్పించి వుండ వచ్చు . యిప్పుడు చేస్తే కూడా - వచ్చే 5 సంవత్సరాలలో - యివన్నీ చెయ్య వచ్చు . 
  • యిప్పుడు  వస్తున్న ఉద్యమాలు కూడా - ఈ పరిస్థితికి ప్రతికూలంగా  వచ్చినవా - అన్న అనుమానం వుంది .
  • ఏది ఏమైనా , మనమంతా కలిసి పనిచేస్తేనే , కులాలకతీతంగా,  మంచి నాయకులను ఎన్నుకుంటేనే - మనం బాగుపడతాం .
  • నా ఉద్దేశంలో - కలిసి వుంటేనే - కలదు సుఖం. అలాగే, నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే -  మన అభివృద్ధి .అలా ఎన్నుకోలేక పోతే  ఏ అభివృద్ధీ వుండ బోదు. 
  •  వెనకటికి , వొక సామెత చెప్పే వారు - తొందర పడి , తాతాచార్యులు, మతం మార్చుకున్నాడట . ఆ తరువాత, ఆ మతం లోని నియమాలు, సమస్యలు  తెలిసిన వెంటనే, మళ్ళీ మొదటికొచ్చేసాడట.
  • మరో సామెత - ఏదో చెయ్యబోతే , పెద్ద ముక్కు రాలేదు కానీ ; వున్న ముక్కు ఊడి పోయిందట  
  • అలా అయిపోతుంది పరిస్థితి .  ప్రజలంతా యోచన చెయ్యాలి. 
  • సర్వే జనాః సుఖినోభవంతు
  • =మీ 
  • వుప్పలధడియం  విజయమోహన్   

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

(1) అత్తలు-కోడళ్ళు- ఎద్దు ఈనింది, అంటే, గాట్లో కట్టేయండి -అన్న తరహాచట్టాలు;(2) సమైక్యాంధ్ర ఎందుకు ?

కలిసి వుంటే కలదు సుఖం - ఎప్పటి సినిమా? ఎన్నో దశాబ్దాలకు ముందు వచ్చింది. కుటుంబాలకు సంబంధించిన  కథ. అప్పట్లో అందరూ ఆ సినిమాను మెచ్చుకున్నారు. చాలా మందికి అప్పట్లో చాలా  నచ్చింది.  ఎందుకా సినిమా తీయాల్సి వచ్చింది ?  చాలా మంది  మనస్సులో, విడిపోతే బాగుండునేమో - అన్న భావనలు వుండడం వల్ల వచ్చింది . 

ఆ తరువాత - మన మానసిక దృక్పథం చాలా చాలా మారిపోయింది. విడిపోతే కలదు సుఖం - అనే  బాటలోనే యిప్పుడు చాలా మంది పయనిస్తున్నారు.  అందుకు ఎన్నో కారణాలు.  

కోడలు చెడ్డది అని పొరుగింటావిడ చెబితే  అత్త నమ్మేస్తుంది.  అత్తలందరూ చెడ్డ వాళ్లే - అంటే  నమ్మేస్తారు కోడళ్లు.   మనం చేసుకునే   చట్టాలూ అలాగే  ఏడిచాయి.  కోడలు చెబితే , నిజమో కాదో తెలుసుకోకుండా -అత్తారింటోళ్ల నందరినీ  జైల్లో  వేసేయమని  చట్టం. అత్తా వొక నాటి కోడలే ; కోడలూ వొక రోజు అత్తే -అన్న ప్రాథమిక  సత్యం అర్థం గాని వాళ్ళు చేసే చట్టాలు యిలాగే  ఏడుస్తాయి. అందరినీ జైల్లో వేయమని  చెప్పే కోడలు - మళ్ళీ ఆ యింట్లో  ఎలా వుండగలదు ? మొగుడితో ఎలా కాపురం చెయ్యగలదు ? ఈమె చెయ్యాలన్నా వాళ్ళు మళ్ళీ వొప్పుకుంటారా ?   వొకటిగా వుండగలరా? 

మనకు సంసారాలు  నాశనం చేసే  చట్టాలు కావాలా? సంసారాలు  సరి దిద్దే  చట్టాలు కావాలా?   కావాలంటే - సంసారాలు సరిదిద్దే చట్టాలు చాలా సులభంగా చెయ్యవచ్చు. 1955 లో చేసిన చట్టాలు సంసారాలు చక్కదిద్దే రీతిలో వున్నాయి. విడాకులు కావాలని వచ్చే వారికి- నచ్చ జెప్పి సరి చేసే ప్రక్రియ ఆ చట్టాల్లో వుంది. అప్పటికీ సరికాక పోతే విడాకులు యివ్వడం తప్పని సరి అన్నప్పుడు - యిచ్చేవారు. అప్పటి ఆ చట్టాల్లో వున్న విజ్ఞత- ఆ తరువాత వచ్చే చట్టాల్లో అస్సలు లేదు. 

కోడలు ఏది చెబితే - అదే నిజం అనుకునే వ్యవస్థ  వచ్చింది . కొన్ని చోట్ల నిజమే కావచ్చు . కొన్ని చోట్ల అబద్ధమూ  కావచ్చు . అన్ని చోట్లా కోడలు చెప్పేదే నిజం కానక్కర లేదు.  ఏది ఏమైనా -ఎవరిది తప్పు అన్నది కనీసం విచారించ కుండా అత్తగారి కుటుంబాన్నంతా జైల్లో తోసేయ్యడం అమానుషం. అటువంటి  చట్టాలు ఎన్నో కుటుంబాలను బాధించడం నాకే తెలుసు - మీకూ తెలిసి వుంటుంది . ఎవరి తప్పైనా - నచ్చ జెప్పడం , కౌన్సెలింగ్ , అంతకు మించితే చట్ట పూర్వకంగా కాస్త బెదిరించడం, సాంఘికంగా వొత్తిడి తీసుకు  రావడం  లాంటి ఎన్నో పద్దతులు వుపయోగించి సంసారం సరి చెయ్యాలి ; చెయ్య వచ్చు . 

అవేవీ చెయ్యకుండా - ఎద్దు ఈనింది, అంటే,  గాట్లో కట్టేయండి -అన్న తరహా చట్టాలు చేస్తూ పోతే సమాజం కుళ్ళి పోతుంది ; నాశనమై పోతుంది . చాలా చోట్ల కోడలికీ అన్యాయం జరుగుతూ వుంది .అలాగే కోడలు రాక్షసిగా, అత్త అస్సలు నోరు లేని దానిగా వుండే కుటుంబాలూ వున్నాయి. 

కాస్తో,కూస్తో సర్దుబాటు మనస్తత్వం లేని వారు ఎన్నో చోట్ల యిరు వైపులా వున్నారు.  అది సరి చేసి - కోడలు, అత్తారింట్లో , మొగుడితో సుఖంగా వుండేటట్టు  చూసే పద్ధతులు ఈ చట్టాల్లో లేనే లేవు. మొగుడినీ, అతడి కుటుంబం వారందిరినీ జైల్లో వేసే వొకే వొక పధ్ధతి వుంది.  కోడలినీ,  ఆమె మొగుడినీ, బద్ధ  విరోధులుగా చేసి, వారిరువురి జీవితాలూ పూర్తిగా నాశనం చేసి , ఆ మొగుడిని కన్నందుకు , అతని తల్లి తండ్రులు , వారి యింటిల్లి  పాదీ జైల్లో వుండాల్సిన పరిస్థితి  యిప్పటి  చట్టాల్లో వుంది.

కళ్ళు చూసేదీ, చెవులు వినేదీ మాత్రం నమ్మి  ఏ పనీ చెయ్యొద్దు. బాగా విచారించి, నిజమేమిటో  తెలుసుకుని మరీ చెయ్యి అన్న సామెత చాలా భాషల్లో - చాలా శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా  వుంది.  

అయినా, యిప్పుడు చట్టాలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్నీ - ఈ ప్రాథమిక సూత్రం విస్మరిస్తున్నాయి. నిజం ఏమిటి? నిజం ఏమిటి ? అన్న విషయం మనం, మన సమాజం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవడో చెప్పింది గుడ్డిగా నమ్మ కూడదు. దానిపై ఆధార పడి చట్టాలు  చెయ్యడం, స్నేహాలు , బాంధవ్యాలు నేల రాచేయ్యడం చాలా తప్పు.

మన మానసిక అంధత్వానికి  మరో ఉదాహరణ - యిప్పుడు జరుగుతున్న రాష్ట్ర విభజన కార్యక్రమం. నేను ఈ సమస్య యిప్పటి   వరకూ ఎక్కువ పట్టించు కోలేదు. కానీ, కొందరు రాజకీయ వాదుల పోకడ గమనిస్తే, వారి వలన రాష్ట్రానికే కాదు ; మున్ముందు దేశానికే ప్రమాదం రావచ్చు - అనిపించిది . అందుకనే, యిది రాయాలనిపించింది. రాష్ట్ర ప్రజలంతా, ముఖ్యంగా, తెలంగాణా ప్రాంతం వారు,  ఈ విషయాలు బాగా ఆలోచించాల్సిన  అవసరం వుంది. 

తెలుగు వాళ్ళంతా వొక  రాష్ట్రం గా వుండడం కుదరదు - అని   కొంత మంది రాజకీయ నాయకులు తెలంగాణా  ఉద్యమం లేవదీశారు. ఎందుకు - అంటే  మాకు అన్యాయం జరిగి పోతోంది;  మాకు  ఎప్పుడూ అన్యాయమే జరిగింది - అంటూ ఆవేశంగా మాట్లాడి  ప్రజలలో కూడా - ఆవేశం రగిలించారు.

సరే .  ఎద్దు ఈనింది -అంటే , గాట్లో కట్టేయండి -అన్న తరహా మనది. మనకు నిజంగా అన్యాయమే -జరిగింది కాబోలు - అని కొంత మందిలో వొక ఉద్దేశం సహజంగా వచ్చింది . అందుకే  శ్రీకృష్ణ  కమిటీ  వేశారు. కమిటీ వారు - తెలంగాణా  ప్రాంతానికి న్యాయమే జరిగింది. కాస్త ఎక్కువ న్యాయమే జరిగిందన్నారు. అసలు ఈ కమిటీ  రిపోర్ట్ మేం వోప్పుకోం అన్నారు - ఈ రాజకీయ వాదులు.

అప్పుడేం చెయ్యాలి? నన్నడిగితే, వో 2-3 వివిధ రాష్ట్రాల జడ్జీలు, ఆర్ధిక శాస్త్ర వేత్తలు వున్న మరో కమిటీ మళ్ళీ వేసిండొచ్చు . వారెలా చెబితే అలా చేసిండొచ్చు . నిజంగా అన్యాయం జరిగి వుంటే - న్యాయం ఎలా చెయ్యాలో ఆ కమిటీ చెబుతుంది  కదా .  అలా జరుగ లేదు. ఆ తరువాత  ఎంతో మంది  స్టాటిస్టిక్స్  యిచ్చారు - తెలంగాణాకు  న్యాయమే జరిగిందని .

కానీ, మాకీ స్టాటిస్టిక్స్ వద్దు. మీరు వద్దు; అంతే.  మీరు వెళ్లి పొండి -అని నీచంగా మాట్లాడే వాళ్ళ వద్ద  ఏ  తర్క మూ పని చెయ్యదు. నిజమేమిటి - అన్నది మాకనవసరం ; మేం విడి పోతం - అంతే అన్నది కొత్త వాదన .

కొన్ని ఏళ్ళ క్రితం, కొంత మంది రాజకీయ వాదులు - పని గట్టుకుని కొంత మంది ఉద్యోగుల యిళ్ళకు వెళ్లి , మీరు, మీ ప్రాంతాలకు  వెళ్లి పొండి అని చెప్పడం  వార్తా పత్రికల్లో వచ్చింది. వారు వుద్యోగులు . మూటా, ముల్లె సర్దుకుని ఎలా వెళ్ళిపోతారు ? యిది ఎంత అమానుష కార్యమో  - అలా అడిగిన వారికి అప్పటికీ, యిప్పటికీ  అర్థం కావడం లేదు. పైగా, పత్రికల వారు అడిగితే  - మేము వాళ్ళను కొట్టామా? తిట్టామా? వెళ్ళి పొమ్మన్నాము, అంతేగా - అన్నారు. యిలా రాజ్యంగా విరుద్ధంగా,  చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఏ చర్యా లేకపోతే , వారి చర్యలు మరీ యెక్కువవుతాయి. అలాగే అయ్యింది.

ఈ మధ్య వొక T.V. చానెల్  లో, వొక తెలంగాణా రాజకీయ నాయకుడి అభిప్రాయాలు  విన్నాను. అవి మరీ ఘోరంగా వున్నాయి.

ఆయనంటారు - యిదొక ప్రత్యేక దేశంగా వున్న ప్రాంతం ..వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్, వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్.. వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్..   దురాక్రమణ చేసి ఆక్రమించుకుంది భారత దేశం ..

యిది ఎంతో మంది వినే వుంటారు. నేను ఫేస్ బుక్  లో చూసాను. విన్నాను. యిందుకా   తెలంగాణా ? ఈయనకు నిజాం పాలన కూడా ఓకే .  హైదరాబాద్ ను పాకిస్తాన్ లో చేర్చాలని చూసిన వారు కూడా పరవాలేదు కానీ భారత దేశ పాలన, సర్దార్ పటేల్ గారి కృషి ఓకే  కాదు?
సర్దార్ పటేల్ గారి కృషినంతా వెనక్కు తిప్ప గలిగే రాజకీయ భావాలు ఈ కొంత మంది రాజకీయ వాదులలో వున్నాయని - భారత దేశం లోని అందరూ గ్రహించాలి. భారత దేశపు సమైక్యతను దెబ్బ తీయ గలిగే  భావాలు కావా యివి? రాష్ట్ర సమైక్యత వొక ప్రక్క వుండ నీయండి .

చంద్ర శేఖర రావు గారు సరే సరి. ఆయన నోటి వెంట ఎప్పుడు ఎవరిపై ఏ తిట్లు వస్తాయో - బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా వెళ్లి పొమ్మంటాడో - ఎవరూ చెప్ప లేరు. తెలంగాణా ప్రజలకు నిజంగా యిటువంటి  రాజకీయ నాయకుల పాలన కావాలా? వీరు, మొదట ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఎలా అన్యాయం చెయ్యాలో అదే యోచిస్తారు. అవి చేస్తారు.  యిదే అందరి భయం. నమ్మకం. అందుకే యింత పెద్ద ఎత్తున  సమైక్య ఆంధ్ర ప్రాంత పోరాటం జరుగుతూ వున్నట్టు తెలుస్తూ వుంది. 

మున్ముందు ఢిల్లీ  పాలకులు ఏం చేస్తారో   నాకు తెలీదు కానీ -  ఏది చెయ్యాలన్నా - చాలా, చాలా ఆలోచించి  చెయ్యాలి . లేదంటే - తెలుగు వారికి మాత్రమే  కాదు. యావద్దేశానికీ  ఏదో ప్రమాదం మున్ముందు  వచ్చే  సూచనలు మాత్రం వున్నాయి.

అయితే అక్బరుద్దీన్ ఒవాయిసి - లాంటి వారినే -మన చట్టాలు ఏమీ చెయ్య లేదు . ఆయన ఏమేం మాట్లాడాడో, వొక్క సారి వికీ పెడియా లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు మన దేశంలో చట్టాలేమీ లేవా - అనిపిస్తుంది.  ఆయనా  యిక్కడే వున్నాడు . మరి తెలంగాణా వస్తే - యింకా ఏమేం మాట్లాడుతాడో, ఏమేమి చేస్తాడో?


యిది  ప్రజలు ముఖ్యంగా గ్రహించాలి . మీరు వొక్క సారి ఈ తరహా రాజకీయ వాదుల  వద్ద చిక్కుకుంటే , మళ్ళీ, వేసిన తప్పటడుగు వెనక్కు తీసుకునే అవకాశమే లేదు .

ఈ  విషయంలోనే,కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా , మరింత శ్రద్ధ చొరవ తీసుకోవాలి . ఆయన పై చెప్పిన రాజకీయ నాయకుల స్వభావాలు , వాటి వల్ల , దేశానికి వచ్చే ప్రమాదం, తేట తెల్లంగా కేంద్రానికి చెప్పాలి.  యివి దేశానికంతా కూడా తెలియాలి . అలాగే, మిగతా నాయకులు , ముఖ్యంగా చంద్రబాబు గారు కూడా యివన్నీ పరిశీలించి కేంద్రానికి స్పష్టంగా, చెప్పాలి.

రాజకీయ నాయకులు మంచి వారైతే, మానవతా వాదులైతే , రాష్ట్ర  విభజన ,యివన్నీ పెద్ద విషయం కాదు. కానీ, యిక్కడ, అదే లోపించింది. అందరూ అని కాదు. కొంత మంది ముఖ్యమైన వారు, మహాదురుసుగా మాట్లాడుతున్న వారు పదవికెక్క గలవారు దేశానికి ప్రమాదం తెచ్చి పెట్ట గల వారే - అన్న విషయంలో నాకైతే సందేహం లేదు. 

దేవుడా - అందరి మనస్సులో, అందరి పట్లా , సుహృద్భావం నింపు . లేదంటే - ఆట కదరా శివా , ఆట కదా కేశవా - అని కేదార్నాథ్  ప్రమాదం ను గురించి పాడినట్టు పాడుకోవాల్సి వస్తుంది .

=మీ

వుప్పలధడియం విజయమోహన్