ఆట కదరా శివా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆట కదరా శివా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఈ రోజు మీరు ఆడిన ఆట ఎలా ఆడారు - 5 నిమిషాల్లో మనసుపైన మీరు సాధించే విజయం ఎలా ?


వొకాయన  భార్య తనకు బహుమతిగా కొనిచ్చిన తెల్ల గుర్రంపైన కూర్చుని స్వార్తీ చేస్తున్నాడు . కాకపోతే , ఆయన తోకవైపు తిరిగి కూర్చుని స్వారీ చేస్తూ , గుర్రాన్ని తిడుతూ, కొడుతూ వున్నాడు . ఆయన భార్య కోపంతో , నీలాంటి మూర్ఖుడికి ఈ తెల్ల గుర్రం కొనివ్వడమే పొరబాటు . ఎవరైనా తోకవైపు కూర్చుని ప్రయాణం చేస్తారా - అన్నది .

అందుకాయన కూడా కోపంతో - నువ్వు మూర్ఖురాలివి, నీ గుర్రం నీకంటే మూర్ఖపుది . నేను, నేను వెళ్ళ వలసిన వైపే కూర్చుని వున్నా. యిది దానికి విరుద్ధంగా వెడుతుంటే నేనేం చేసేది ? అన్నాడు .

తప్పెవరిది ? గుర్రందా , ఆయనదా ? లేక ఆయన భార్యదా ? ఆయన మాత్రం తను వెళ్ళాల్సిన వైపే కూర్చుని ఉన్నాడట . గుర్రం దానికి విరుద్ధంగా వెడుతున్నదట.

ఏ గుర్రమైనా  ముందుకే వెడుతుంది . ఈయన వెనుక వైపున్న దారిలో వెళ్ళాలి . యిప్పుడేం చెయ్యాలి . గుర్రాన్ని వెళ్ళాల్సిన వైపుకి తిప్పితే , అది ఆ మార్గంలో ముందుకే వెడుతుంది . అప్పుడు యిద్దరి గమ్యం వొకటే అవుతుంది .

నా గమ్యం వేరు . నా వాహన గమ్యం వేరైతే  ఎలా ?

నిజానికి వాహనానికి గమ్యం లేదు . అది ముందుకే వెళ్ళగలదు . కాకపోతే , బయల్దేరే ముందు  ఏ  ప్రక్కకు తిప్పి నిలబెడితే , అది ఆ ప్రక్కన ముందుకే వెడుతుంది .

మనుషులకు ముఖ్య వాహనం - వారి వారి మనసు . అదీ సాధారణంగా, గుర్రం లాగా , ముందుకే దూసుకుని వెళ్ళ గలదు .

ఏ వైపు వెళ్ళాలో , గమ్యం ఏమిటో నిర్ణయించాల్సింది  మనమే . మనకు మన గమ్యమే తెలియకుంటే ,లేదా మనం మనసు యొక్క తోక వైపు కూర్చుంటే -అంటే , మనసు పరుగెత్తే వైపు కాక మరోవైపు పోవాలనుకుంటే , ఎలా కుదురుతుంది ?

మనం ఏదో పరీక్ష పాసు కావాలి . అదీ మన గమ్యం. ఇప్పుడు మనం మన మనసును ఆ వైపు త్రిప్పి నడిపించాలి , మనసును టీవీ వైపు పెట్టి పరీక్ష పాసు కావాలంటే ఎలా ?

ఏ గమ్యం చేరాలన్నా , మనసా, వాచా, కర్మణా అ గమ్యం వైపే  కృషి చేస్తేనే, చేరడానికి  అవకాశాలుంటాయి . అలా కాక , మనసొక వైపు, మాటొక వైపు , చేతలు మరొక వైపు వుంటే - గమ్యం చేరలేము కదా .

మనలో చాలా మందికి - యిదే సమస్య . మీ గమ్యం ఏమిటని అడిగితే - సగం మంది అసలు చెప్పలేరు . వారికి గమ్యం లేదు . వారి గుర్రం - అంటే  మనస్సు ఎటు  వైపు వెడితే , వారి జీవితం అటువైపు వెళ్ళిపోతూ వుంటుంది.
ప్రత్యేకించి గమ్యం అంటూ వుండదు .

మరి కొంత మందికి గమ్యం అంటూ ఏదో వొకటి లోపల వుంటుంది . కానీ వారు - తమ మనస్సును, బుద్ధిని - తమ గమ్యం వైపు త్రిప్పి వుంచరు . అందు వలన మనస్సు పరిపరి మార్గాల్లో పోతూ వుంటుంది . అప్పుడప్పుడూ , నిరాశతో , నిస్పృహతో - అయ్యో, ఎన్నో చెయ్యాలనుకున్నానే , ఏమీ చెయ్య లేక పోతున్నానే - అనుకుంటూ వుంటారు .

మనసు గతి యింతే ; మనిషి బ్రదుకింతే ;  మనసున్న మనిషికీ సుఖము లేదంతే -  అని సినిమా పాటలో లా అనుకుంటే  ఎలా ? సినిమా అయితే  ట్రాజెడీ  కానివ్వండి . పర్లేదు . కానీ మన జీవితం ట్రాజెడీ కానక్కర్లేదు .


 మీ మనస్సు - మీకు సేవకుడుగా వుంటే - మీకు అది అత్యంత ఆంతరంగికమైన,  నమ్మ దగిన సేవకుడుగా , మిమ్మల్ని మీ గమ్యం వైపు తీసుకుని వెడుతుంది .మీ అన్ని విజయాలకు అది కారణమవుతుంది.  

అలా కాక మీ మనస్సు మీకు యజమానిగా  ప్రవర్తిస్తూ , మిమ్మల్ని శాసిస్తూ వుంటే - అది మీకు అత్యంత అంతరంగిక విరోధిగా, మిమ్మల్ని మీ గమ్యం నుండి బహు దూరంగా తీసుకుని వెడుతుంది .మిమ్మల్ని అన్ని రకాల చిక్కుల్లో పడ  వేస్తుంది .

ఈ మాట చెప్పింది  సాక్షాత్తు  శ్రీకృష్ణుడు . అదీ భగవద్గీత లో .

మనసు యజమానైతే , మనం సేవకులైతే - ఏమవుతుంది .

మనసుకు నచ్చినవి , అలవాటైనవి కొన్ని వున్నాయి . వాటినన్నిటినీ  కలిపి అంతః  శత్రువులు  అని అంటారు.  అవి - (అ) మితి మీరిన కోరికలు (కామం),    (ఆ)  రక రకాల కోపాలు (క్రోధం ),   (ఇ)  అన్నీ నాకే కావాలన్న స్వార్థం (లోభము),   (ఈ) ప్రతి దానిపైన  వ్యామోహం (మోహం),  (ఉ) నేనే గొప్ప అన్న సుపీరియారిటీ  కాంప్లెక్స్ (మదం),   (ఊ) ప్రక్క వాడి సంతోషాన్ని, విజయాన్ని వోప్పుకోలేని యిన్ఫీరియారిటీ  కాంప్లెక్స్ (మాత్సర్యం ),  (ఎ) ఎన్నో రకాల భయాలు. 

మనస్సు యజమానైతే - అది మనల్ని వీటి వైపే లాగుతుంది . వీటన్నిటిలో , మన పతనమే  వుంటుంది  కానీ , సంతోషం , విజయం  రెండూ వుండవు .

మనం, మనస్సుకు యజమానిగా వుంటే - ఆయురారోగ్య , ఐశ్వర్య , సంతోష , శాంతి, విజయాల్లాంటివి , అన్నీ లభిస్తాయి . మన  మనస్సు , మనల్ని , వీటి వైపూ నడిపించ గలదు.

అందుకే పతంజలి  మహర్షి , యోగః  చిత్త వృత్తి  నిరోధః - అన్నారు . మనస్సును మన యాజమాన్యం లో పెట్టుకుంటే - అదే యోగం. అదే సంతోషం . అదే అతి గొప్ప విజయం .

జీవితం లో మరే గమ్యమూ ,   దీని కంటే గొప్ప గమ్యం కాదు. 

కానీ - మన జీవితాల్లో, కొన్ని సాధారణ గమ్యాలు వుండనే వుంటాయి .

ప్రేమ, పెళ్లి , భార్య , భర్త, పిల్లలు, చదువులు, ఉద్యోగాలూ, సంపాదనలు, ఆటలు, స్నేహాలు, రోగాలు , యవ్వనము , మధ్య వయస్సు . ముసలితనము , చావులు -  యివన్నీ సాధారణ గమ్యాలకు సంబంధించిన విషయాలు .  వీటిని తప్పించుకుని  మనం వుండ గలమా ?

యివి వొద్దని ఎలా చెప్పగలం ? యివి వుండనే వుంటాయి , మన సాధారణ జీవితాల్లో . 

బాల్యము , కౌమారము, గార్హస్థ్యము , ముసలితనము అన్నీ వున్నాయి మనకు . ఆయా జీవిత కాలాలకు తగిన వ్యాపకాలూ వున్నాయి

శంకరాచార్యులు చాలా సందేహ రహితంగా అన్నారు - బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రాహ్మణి కోపిన సక్తః.  యిది మన అందరికీ వర్తిస్తుంది .

చిన్నతనంలో గోలీలతో ఆడుకుంటారు . చిన్న చిన్న రాళ్ళను దాచుకుంటారు . మరి యవ్వనం వస్తే , ఈ యిష్టాలన్నీ పోతాయి. క్రొత్త ఇష్టాలు వస్తాయి.  స్త్రీల వెంట  పురుషులూ, వీరి వెంట వారూ  లవ్వో,లవ్వో  అంటూ పోతారు . అది కొన్నాళ్ళే . ఆ తరువాత, అందరి అమర ప్రేమలు మరో రకంగా మారిపోతాయి . 

పిల్లలూ , వారి చదువులూ , వారు పెరగడమూ , మనం ముసలివారవడం , అప్పుడు వచ్చే చింతలు ఎన్నో , ఎన్నెన్నో. అవీ తమకు అనవసరమైన చింతలు; అందుకే  - మనవారు, వానప్రస్థము , సన్యాసము లాంటి  నియమాలు, ఆశ్రమాలు  ఏర్పరిచారు - ఎవరికీ కష్టం లేకుండా .

వయసు పెరిగే కొద్దీ - మనం ఎవరో , మన అసలు, సిసలు  గమ్యం  ఏదో తెలుసుకోవాలి . అందులో వుండే ఆనందం అర్థం చేసుకోవాలి . 

గృహస్తాశ్రమం లో భార్య, భర్త - వొకరిపై వొకరికి అనురాగం ; వొకరికి వొకరు ప్రాణం గా వుండడం ; పిల్లలను కనడం ; వారిని అపురూపంగా , ప్రేమగా పెంచడం ; వుద్యోగాలు , వ్యాపారాలు - యివన్నీ వుండనే  వుంటాయి . వొక వయస్సులో - వుద్యోగాలు , వ్యాపారాలు పిల్లలకు వదిలేసి , భార్యాభర్తలు వొకరినొకరు బాగా చూసుకోవలసిన ఆశ్రమం, దేవుడా అని కొంతైనా అనుకోవలసిన ఆశ్రమం వానప్రస్థం. ఈ రోజుల్లో  యిది మానసికంగా  చెయ్య గలమే కానీ , ముందులా - అరణ్యాలకు పోలేం కదా . అందుకే  పాపం వృద్ధాశ్రమాలు  వస్తున్నాయి. కానీ యివి రావడం, పిల్లల బాధ్యతా రాహిత్యం వలన, మరెన్నో కారణాల వలన రావడం దురదృష్టకరం .

ఈ ఆట ప్రతి వొక్కరి జీవితాల్లో - దాదాపు యిదే రకంగా , చర్విత చర్వణం గా జరుగుతూ వుంది .

బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రహ్మణి కోపిన సక్తః.  యివన్నీ , పెరిగే కొద్దీ , మనలో, శారీరకం గా, మానసికంగా, సహజ సిద్ధంగా  జరిగే మార్పులు. అంటే, ప్రకృతి మన శరీరానికి, మనస్సుకు, ముక్కుత్రాడు వేసి లాక్కు పోతూ వుంటే - మనమూ దాని వెంట అలాగే  వెళ్లి పోతూ వున్నామన్న మాట . 

దీన్ని దాటి, ముందుగా, మున్ముందు జరిగేది కూడా తెలుసుకున్న వారు ఎవరు?

ఆట కదరా శివా; ఆట కదా కేశవా - అని, సాక్షీభావంతో - ద్రష్టగా ఈ జగన్నాటకాన్ని -  ఆనందంగా చూస్తూ, ఆడుతూ వుండ గలిగే వారెందరు? 

కృష్ణుడూ - ఈ నాటకం ఆడాడు , కానీ ద్రష్టగా . అయితే , కృష్ణుడు ఈ ఆట ఆడినంత తన్మయంగా, ఆనందంగా , "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడుతూ , ఆ పనులు చేస్తూ" తమ తమ పాత్రలలో అంత బాగా లీనమై న వారు  అప్పుడూ లేరు ; యిప్పుడూ లేరు. అంటే, మన పాత్రను మనం ఆనందిస్తూ కూడా , అందులో లీనమై కూడా - ద్రష్టగానూ  వుండొచ్చు , అలా వుండాలని మనకు చెప్పిన వాడు కృష్ణుడు .

కృష్ణుడిలో - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యర్య, భయాలు లేవు. కానీ అమితమైన వాత్సల్యం వుంది , ప్రేమ వుంది . కరుణ వుంది . శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ రెండూ చేశాడు . 16 వేల మంది గోపికలు , ఆ నీల మేఘ శ్యాముడి వెనుక బడ్డారు. పైగా 8 మంది భార్యలు కూడా . అందరూ ఆయన భక్తులే . అందరికీ ప్రేమను పంచాడు . ఆయన లో అశక్తత, అధైర్యం లేదు. దుష్ట శిక్షణ తానూ చేశాడు . పాండవుల ద్వారానూ చేయించాడు . కృష్ణుడి జీవితాన్ని మనసులో వుంచుకునే - మనం భగవద్ గీతను  చదవాల్సి వుంటుంది ; అర్థం చేసుకోవాల్సి వుంటుంది. జీవితాన్నుండి  పారి పొమ్మని కృష్ణుడెప్పుడూ  చెప్పలేదు .

ఈ ఆట ఆడాల్సిందే. ఆనందంగా, సమర్థ వంతంగా ఆడాలి. వోటమికి క్రుంగి పోవడం, పారిపోవడం మన పాత్ర కు  న్యాయం చేసినట్టు కాదు. మళ్ళీ ఆడాలి .

"వొక్కొక్క  రోజూ కొత్త ఆటే. ఈ రోజు ఆట మీరు బాగా ఆడారా - అన్నదే ప్రశ్న. ఈ రోజు మీరు సంతోషంగా వున్నారా? ఎంత మందిని మీరు సంతోష పెట్టారు? నిన్నటి కంటే ఈ రోజు - క్రొత్తగా ఏం నేర్చుకున్నారు? ఏ విధంగా మీరు నిన్నటి కంటే బాగు పడ్డారు?  మీకు మీ గమ్యం జ్ఞాపకం వుందా? అటువైపే వెడుతున్నారా? మీరు ఈ రోజు చేసిన పనుల కంటే భిన్నంగా, గొప్పగా మరేదైనా చేసి వుండ వచ్చునా? వుంటే అది రేపు చేస్తారా? ఈ రోజు ఎవరికి సహాయ పడ్డారు? ఈ రోజంతా మీలో వచ్చిన భావనలు, ఆలోచనలు - సకారాత్మకమైనవా, నకారాత్మకమైనవా ? రేపంతా మీరు సకారాత్మకం గానూ , ఆనందం గానూ వుండాలంటే  చెయ్యాలి? "

వొక్క 5 నిమిషాలు - కళ్ళు మూసుకుని (TV కి దూరంగా) ఈ రోజు మీరు ఆడిన - మీ ఆట గురించి ఈ ప్రశ్నలు వేసి నిజమైన సమాధానాలు మీరు వెతుక్కుంటే - నిజమైన ద్రష్టగా మీరు మారిపోతారు.

మీకు యిష్టమైతే 10 నిమిషాలు గానీ , అంత కంటే ఎక్కువ కానీ ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. మీకు నిజమైన , స్వచ్చమైన ఆనందం - అప్పుడే వస్తుంది.

 ఎందుకంటారా ?

ఆ పది నిమిషాల తరువాత - మీరే  "ఆనందం " గా మారిపోతారు గనుక .

లోపలున్న చెత్తంతా పొతే, మీరే ఆనందం . అదే యోగం . అదే సాధన . అంతే .

చాలా సులభమైన విషయం యిది. ప్రతి 24 గంటలలో - 5-10 నిమిషాల కృషి తో యిది సాధించదగిన విషయం. సాధించ వలసిన విజయం.

మీ మనసుపైన మీరు సాధించే విజయం యిది .

చేస్తారా మరి .

= మీ

వుప్పలధడియం విజయమోహన్




5, నవంబర్ 2013, మంగళవారం

ఆట కదరా శివా ; ఆట కద కేశవా - ఇండియా క్రికెట్ లో గెలవాలా, వొద్దా - సిగరెట్ త్రాగడం పెద్ద వ్యసనం - సెక్స్ మగ వాడి బలహీనత


ఆట కదరా శివా ; ఆట కద కేశవా - అన్నాడు  వొక తెలుగు కవి.
ఆ ఆట ఉత్తరాఖండ్ లో కావచ్చు; ఒడిశా లో కావచ్చు ; అమెరికా లో కావచ్చు . ఆంధ్రా లో కావచ్చు . మరో చోట కావచ్చు . మన యిళ్ళలో కావచ్చు . మనలోనే కావచ్చు .  ప్రతి చోట ఏదో వొక ఆట. ఆ.... .పై వాడి ఆట అన్ని చోట్లా జరుగుతూనే వుంది . ఎప్పుడు, ఎక్కడ - ఏం చేస్తాడో చెప్పలేం . ఎప్పుడు, ఎవరిది గెలుపో, ఎవరిది వోటమో చెప్పలేం.

ఎక్కడైనా, ఏదైనా , ఆ .... ఆట , అతని ఆటే కదా. యిది మనకు గుర్తుంటే , ఆ  ఆటను ప్రేక్షకులుగా చూస్తూ, ఆనందిస్తూ వుంటాము.   లేదా, ఆ ఆటలో, మనమూ మునిగి తేలుతూ వుంటాము .

టెండుల్కర్ అవుట్  అయిపోతే - అతని కంటే, మనమే ఎక్కువ బాధ పడి పోతాం.  బంతి వేసిన వాడు ఎంత బాగా వేసాడో , అని అనుకోం.  మన యింట్లోనో, మన వారి యింట్లోనో - ఎవరికైనా, ఆక్సిడెంట్ జరిగినా, రోగాలు వచ్చినా , వారికంటే, మనమే ఎక్కువ చింత లో పడిపోతాం .

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికి తెలుసు? ఆ...పై వాడికి తెలుసు . ఈ ఆట ఆడించే వాడికి తెలుసు .
కాకపోతే మన యిష్టానిష్టాలు మనకుంటాయి. మోడీ గారు గెలవాలని, ప్రధాన మంత్రి కావాలని నేను అనుకుంటాను . కాకపొతే , జేత్మలాని , సుబ్రమణ్యం స్వామి లాంటి వారు - ఎక్కువగా మాట్లాడకుంటే  మేలు - అని అనుకుంటాను. 60 నెలల్లో, దేశంలోని ప్రతి వొక్కరూ , అభివృద్ధి పథం లోకి రావాలని -  నా ఆకాంక్ష . యిది జరుగుతుందా ? 2014 లో తెలుస్తుంది .

 సరే. ఇండియా క్రికెట్ లో గెలవాలా, వొద్దా ? యిదేం ప్రశ్న ? గెలవాలి కదా ? నాకు మాత్రం ఆ ప్రశ్న, ఆ అనుమానం ఎప్పుడూ వుంది. ఇండియా క్రికెట్ లో గెలిస్తే , ఇండియా లోని పిల్లలందరూ చదువు తగ్గిస్తారు.  టీవీ కే అతుక్కుని పోతారు.   త్రాగుడు కంటే, క్రికెట్ చూడడం-ఆడడం కాదు- చూడడం పిల్లలకు పెద్ద వ్యసనం . పరీక్ష రోజు కూడా, పది నిమిషాల ముందు కూడా - చదువు కంటే , క్రికెట్ ముఖ్యంగా - చూసే పిల్లలు ఎంత మంది ? మెజారిటీ  వాళ్ళే కదా. ఎంత మంది చదువులు చెడుతోంది- ఇండియా క్రికెట్ లో గెలవడం వల్ల ? ఏది వ్యసనం గా మారుతుందో - దాని పట్ల మోజు పెంచుకో కూడదు. మితంగా వుంటే పరవాలేదు. కానీ క్రికెట్లో అది కుదరదు . రోజంతా చూడాల్సిందే . రోజంతా చూస్తే ?  చదువులూ , పనులూ - అన్నీ - గోవిందా !

కొన్ని వ్యసనాలు మనం తయారు చేసుకునేవి. కొన్ని,  మనతో బాటే పుట్టేవి. త్రాగుడు లాంటివి  మనమే అలవాటు చేసుకునేవి . సెక్స్ చాలా వరకు మనతో బాటే పుట్టేది .

నాకు యిద్దరు సహోద్యోగులు వుండే వారు. వారికి, సిగరెట్ త్రాగడం పెద్ద వ్యసనం గా వుండేది. అదేదో గొప్ప అయినట్టు వారిలో వొక భావన. చీఫ్ జనరల్ మేనేజర్  గారితో - మా అందరి మీటింగ్  జరిగేటప్పుడు కూడా - వున్నట్టుండి, వీరిద్దరూ మాత్రం చెప్పా పెట్టకుండా, వెలుపలికి వెళ్లి పొయ్యే వారు. ఆ తరువాత, వరండా లోకి వెళ్లి చూస్తే - అక్కడంతా వొకటే సిగరెట్ పొగ . చెబితే వినే వారు కాదు. అది వ్యసనం అని వారికి తెలీదు. అది ప్రపంచం లోనే, గొప్ప అలవాటుగా వారి భావన.  కాకపొతే, వొక సారి, దాదాపు యిద్దరికీ, వొకే సారి, కాస్త గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మరో సిగరెట్ త్రాగితే, మీ గుండె - అంతే, మళ్ళీ పని చెయ్యదు - అన్నారాయన. అప్పుడు నిలిపారు వారిద్దరూ, పొగ త్రాగడం. అంత వరకు అది వొక బలహీనత, వొక వ్యసనం  అని ఎప్పుడూ అనుకోలేదు వారిద్దరూ. 

మరి సెక్స్ -  విషయానికి వస్తే, అది కొంత వరకు మనతో బాటే పుట్టింది . సృష్టి క్రమాని కోసం  నిర్దేశింప బడింది.  యిది - పై వాడి ఆట .  మగ వాడి ఈ బలహీనత ను, బలంగా మార్చడానికే - వివాహము, వావి వరుసలు, వాటి గౌరవాలు - ఏర్పడ్డాయి . కానీ, యిప్పుడు, కొంత మంది ఆడవారే, అవన్నీ వొద్దు - అని బయలుదేరుతున్నారు . అది పెద్ద మూర్ఖత్వం.  సినిమా, టీవీ లతో ప్రారంభం అయింది. నేను ఎలాంటి బట్టలయినా వేసుకొంటాను - లేదా, అసలు వేసుకోను, మీరెవరు అడగడానికి - అని ఆ కొద్ది మంది అంటున్నారు. యిదీ, పై వాడి ఆటే. ఆకర్షణ  మొగుడు పెళ్ళాల మధ్య వుంటే  సమాజం మొత్తం సురక్షితంగా వుంటుంది. మిగతా ఆడవారిపై, మగ వారిపై  - గౌరవం వుంటుంది. ఆడది, నేను ప్రపంచం లోని - మగ వారినందరినీ  ఆకర్షించాలి - అనుకుంటే , ప్రపంచమంతా  చెడిపోతుంది. అది తన బలహీనత మాత్రమే కాదు. మగ వాళ్ళందరి బలహీనత. వారితో బాటే  పుట్టిన బలహీనత . టీవీ లో, సినిమాల్లో,  24 గంటలూ , ఇలాంటి వాళ్ళను చూసి, చూసి , తమ బలహీనతకు లోనయిన  మగ వాళ్ళు కొంత మంది వొంటరిగా దొరికిన ఆడవారిపై, చిన్న పిల్లలపై కూడా, అత్యాచారానికి పాల్పడుతున్నారు . అత్యాచారానికి లోనైన వారి తప్పు లేక పోవచ్చు. కానీ, ఈ సినిమాలు , టీవీ లలో వచ్చే అర్ధ నగ్న ఆడ వారి పాత్ర పూర్తిగా వుంది. వారి - వల్లే మగ వారిలో ఈ బలహీనత ప్రేరేపించ బడుతూ వుంది. ఆ ప్రేరేపణ వల్లనే - అత్యాచారాలు జరుగుతూ వున్నాయి. విశ్వామిత్రుడి లాంటి వాడి తపస్సు చెడచడానికి, ఇంద్రుడు డబ్బు ఎర చూపలా. అర్ధ నగ్నంగా వుండే ఆడదాన్నే పంపించాడు . అది యింద్రుడి  స్టాండర్డ్  టెక్నిక్ . ఎక్కడా అంతే . యిది మగ వాడి  బలహీనత -అన్నది అందరికీ తెలుసు. సాక్షాత్తు శివుడి ధ్యానం భగ్నం చెయ్యడానికి కూడా - అదే టెక్నిక్  ఉపయోగించ బడింది.

మగ వాడికి డబ్బు పెద్ద బలహీనత కాదు ; ఆడదానికి కావచ్చు . మరేదీ, మగ వాడికి - తీరని బలహీనత  కాదు . ఆడదొక్కటే - తన బలహీనత . ఆదైనా - తనతో వావి వరుసలు లేని వారి పట్లనే చాలా యెక్కువ. అన్న- చెల్లెలు, అనుకుంటే , మళ్ళీ, ఆ బలహీనత  లేదు. అమ్మ, కొడుకు, అక్క, తమ్ముడు - యిలా అనుకుంటే - ఆ బలహీనత  లేదు. కానీ, ఈ కాలంలో, దుస్తుల విషయంలో కానీ, వావి వరుసల విషయంలో కానీ , పాత పరిజ్ఞానం  మూల బడుతోంది . విశృంఖలత్వం  చోటు చేసుకుంటూ వుంది. అదేదో గొప్ప, అధునాతనత్వం - అనుకుంటూ వున్నారు . కొన్ని విశ్వ విద్యాలయాల్లో , మీ దుస్తుల పైన, చిన్న దుపట్టా  వేసుకోండి -అంటే,  పెద్ద రభస చేస్తున్నారు - మా దుస్తులు, మా యిష్టం అంటూ . యిది పెద్ద మూర్ఖత్వం . యింత కంటే పెద్ద  మూర్ఖత్వం ఆ ఆడవారిలో మరొకటి లేదు. యిది చాలదన్నట్టు - మగ వారితో బాటు, బార్లకు వెళ్లి మేమూ తాగుతాం - అంటూ బయలు దేరుతున్నారు . తాగిన ఆడదానికి, తనను, ఎవరు, ఏం చేస్తున్నారో ఏం తెలుస్తుంది. తాగిన మగ వాడికీ అంతే. వావి వరుసలు కూడా అప్పుడు పోతాయి.  అమెరికాలో యిప్పుడు , చిన్న పిల్లల గర్భ ధారణ  చాలా, చాలా, ఎక్కువగా మారింది . అయితే, తండ్రి ఎవడో తెలీదు. ఎలా తెలుస్తుంది? జరిగేది, యిద్దరూ ( యింకా ఎక్కువ మంది) తాగేసినప్పుడు కదా. అటువైపే వెడుతున్నాం మనం . 

శంకరాచార్యుల వారు అన్నారు - నారీ స్తన భర నాభీ దేశం, దృష్ట్వా మాగా మోహావేశం - అని.

మగ  వాళ్లకు అలాంటి మోహావేశం - కలిగించడం ఎప్పుడూ ప్రమాద కరమే. అది వారి బలహీనత . దాన్ని ఆడవారు రెచ్చ గొట్టడం మంచిది కాదు. రావణాసురుడిలో, శూర్ఫణక,  కేవలం సీత అందాన్ని విధ విధాలుగా  పొగిడి , అతనిలో , సీత పట్ల కామాన్ని  రెచ్చగొట్ట గలిగింది . శూర్ఫణకకు  తెలుసు, రావణుడి ఆ బలహీనత . రావణుడిలో ఆ బలహీనత లేకుంటే , రామాయణమే  లేదు. శూర్ఫణక  సీత అందాన్ని అలా పొగడ కుండా వుండి వుంటే  కూడా - రామాయణం  లేదు. అసలు మన సంస్కృతి లో మగ వాడు - తన లోని యిటువంటి బలహీనతలను గెలవడమే చాలాముఖ్యమైన ధ్యేయంగా చెప్ప బడింది . అలా గెలిచిన మగ వాడు - మహా యోగి అవుతాడు ; దేవుడే అయిపోతాడు . ఈ బలహీనత తో ఆడుకోవడమే - పై వాడి ఆట . ఆడది  తెలిసో, తెలియకో, ఆకర్షించడం, మగవాడు ఆకర్షించ బడడం, వొకరిపై ప్రేమ, వొకరిపై ఆకర్షణ, మరొకరితో పెళ్లి, మరొకరితో మరొకటి - యివన్నీ ఆడ, మగ రెండు వైపులా నుండీ జరుగుతో వున్నాయి . ఆట కదరా శివా , ఆట కదా కేశవా .. ..

యివన్నీ -  నేనో, మీరో చెబితే , అందరూ వెంటనే మారి పోతారని కాదు . ఈ ఆట యిలా సాగి పోతూనే  వుంటుంది. అందరూ వినరు. ఎవరో కొంత మంది  వినచ్చు . బాగు పడొచ్చు .  

ఈ ఆటను - ఆటగా చూసే వాళ్లకు , లోపల, ఎక్కడో, కాస్త, జ్ఞానోదయం కావచ్చు

సర్వే జనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్