కలిసి వుంటేనే - కలదు సుఖం
మనం చెయ్య గలిగే పనులు ఎన్నో వున్నాయి.
మనం చెయ్య లేని వాటితో పోలిస్తే - చెయ్యగలిగేవి చాలా తక్కువ . నిజమే .
కాక పొతే .... చెయ్య గలిగే పనులు సకాలంలో చెయ్యడం లోనే, మన సంతోషం , అభివృద్ధి -రెండూ వుంటాయి .
- పుట్టడం మనం చేసిన పని కాదు. మన వల్ల అయ్యే పని కూడా కాదు. ఎందుకు ఫలానా వారి కడుపున, ఫలానా , ఫలానా జాతి, కులాల్లో , ఫలానా రంగు,రూపు లతో, ఫలానా, ఫలానా జన్యు గత స్వభావాలతో, ఫలానా చోట - యిలా ఎలా పుట్టామో మనకు తెలీదు. అది మన చేతిలో లేదు. మన తల్లిదండ్రుల చేతిలోనూ లేదు.
- కొంత మందికి ఎదుటి వాడి రంగు, కులం, మతం, పుట్టిన స్థలం, తేదీ కూడా నచ్చడం లేదు . నచ్చక పొతే పెద్ద బాధేం లేదు కానీ - మా వూరు విడిచి వెళ్ళిపో - అంటున్నారు.
- వొక సారి వొక పులి అందట - మేకా, నువ్వు త్రాగుతున్న ఎంగిలి నీరు నాకు వస్తోంది. నీ ఎంగిలి నీరు నేనెలా త్రాగను? కాబట్టి నిన్ను చంపి తినేస్తాను - అని. మేక అందట - నేను ఎంతో క్రింద వున్నాను, మీ ఎంగిలి నీరే నాకు వస్తోంది - కానీ నా ఎంగిలి నీరు మీకెలా వస్తుంది అని! నువ్వు కాక పొతే, మీ నాన్న అయి వుంటాడు . ఏమైనా, నేను నిన్ను తినాల్సిందే -అని పులి అందట . ఇలాంటి వాదనలకు - సమాధానాలు వుంటాయా?
- వెనకటికి వొకాయన - ఈ యింటి కాకి ఆ యింటిపై వాలకూడదని కోప్పడ్డాడు . కాకులేవీ ఆయన మాట వినలేదు . ఆఖరికి, కాకులేమో అన్ని ఇళ్ళపై వాలుతూనే వున్నాయి . ఆయన మాత్రం స్మశానంలో బూడిదై మాయమై పొయాడు. ఇళ్ళూ వున్నాయి. కాకులూ వున్నాయి. వాలకూడదని చెప్పిన వాడు అన్నిటికీ దూరంగా, బూడిద గానో, మట్టిగానో వున్నాడు.
- మనలో కొందరు - యిటువంటి వారి మాటలు విని - మేము వేరే, మీరు వేరే అని కొట్లాడుకుంటున్నాము. పోతన వరంగల్ జిల్లాలో పుట్టాడు. శ్రీనాథుడు కోస్తా ప్రాంతం వాడు. వారు బావా మరుదులు గా - యిద్దరూ గొప్ప కవులుగా వుండడం మనకు తెలీదా? ఎప్పుడు మనం వేరయ్యాము? అప్పట్లో రాయల సీమ, తెలంగాణా , కోస్తా అన్న పేర్లే లేవు . అందరూ తెలుగు వారే . మరి, ఈ విభేదాలు ఎప్పుడు వచ్చాయి? ఇరాన్ నుండి, అరేబియా నుండి వచ్చిన తురుష్క ప్రభువుల నుండి వచ్చింది. వాళ్ళు గుళ్ళూ కొట్టారు. గోపురాలూ కొట్టారు. మాతృదేవోభవ అనే మన సంస్కృతిని కూడా కొట్టారు. వారు మధ్యలో వచ్చారు. మధ్యలో పొయ్యారు.
- యిప్పుడున్న తురుష్క రాజ సంతతి వారు కూడా తురుష్క దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నారే తప్ప , తెలంగాణా వారితో కాదు ; కోస్తా వారితో కాదు. అసలు భారదేశ వాసులతోనే కాదు. వారికి లేని తీట మనకొచ్చింది. మన దేశం తోనే పెద్దగా సంబంధాలు యిష్ట పడని వారు పెట్టిన పేరు మనకు శాశ్వతం అనుకుంటున్నాము.
- అంతకు ముందు రాముడు తిరిగిన ప్రాంతం మనది. అది మనకు గుర్తు లేదు. విజయనగర రాజులు, వోరుగల్లు రాజులు మరెంతో మంది రాజులు రెండు ప్రాంతాలనూ చేర్చి పాలించ లేదా ? అదెందుకు మనకు గుర్తు రాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్దార్ పటేల్ గారు మళ్ళీ కలిపాడు మనల్ని. లేదంటే, మనలో వొక పాకిస్తాన్ పుట్టి వుండేది. యిప్పుడు పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు వున్నాయో మనం చూస్తూనే వున్నాం కదా. అది మనకు కావాలా? అందునా తెలుగు వాళ్లకు అది కావాలా?
- మొన్నొకాయన టీవీ చానల్ లోనే అన్నాడు - మేము ఇండియన్స్ కాము..కాము..కాము. భారత దేశం దురాక్రమణ చేసి మమ్మల్ని తనలో కలిపింది - ఇలా ఎన్నో అన్నాడు. ఇలాంటి వాళ్ళా మనకు నాయకులు? వీరి మాటా మనం వినేది ? మనకు - కలిపిన వాళ్ళెవరూ గుర్తు రారెందుకు? విడదీసిన వాడు మాత్రం గుర్తున్నాడు. వాడేదో మనకు గొప్ప ఉపకారం చేసినట్టు! అతను కూడా - ఏదో వొక పేరు పెట్టాడు -వొక ప్రాంతానికి - అంటే కాని , మనం విడి పోవాలని ఎప్పుడూ చెప్పలా. మనం వేరే, వేరే - అని కూడా చెప్పలా.
- పోతన్న, శ్రీనాథుడు బావ మరుదులైతే - మనం వేరే ఎలా అవుతాము. గోపన్న, పోతన్న, తిక్కన్న, వేమన అందరూ - మన వారు కాదా? ఎవడో వొక విదేశీయుడు కొన్నాళ్ళు రాజ్యమేలితే -మీరు వేరు, మేము వేరా - మనం మనం కామా ? ఇదెక్కడి పిచ్చి?
- వొక్క పోతన, శ్రీనాథుడు మాత్రమే కాదు ,ఎంతో మంది తెలుగు వారు అన్ని ప్రాంతాలకూ వెళ్ళారు, వచ్చారు
- మొదట మనకు కర్నూల్ రాజధాని అయ్యింది. రాజధాని అక్కడే వుండి వుంటే - ఈ విభజనా గట్రా ఆలోచనలు వచ్చేవి కావేమో. ఆ తరువాత హైదరాబాద్ రాజధాని అయ్యింది . తరువాత మన రాష్ట్రంలో అక్కడ మాత్రమే విపరీతమైన అభివృద్ధి తీసుకొచ్చారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ లేనంత అభివృద్ధి అక్కడే, మనమంతా చేరి తీసుకు వచ్చాం.
- ఆ తరువాత -మద్రాసు నుండి సినిమా పరిశ్రమ అంతా - హైదరాబాద్ కే తరలి వచ్చింది. అప్పుడెవరూ - మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళు లేరు. రచయితలు, కళాకారులు, సైంటిస్టులు , పారిశ్రామికులు - అందరూ - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చారు. అప్పుడు కూడా మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళెవరూ లేరు.
- ఈ కాలంలో - భార్యాభర్తల మధ్య కూడా చాలా సులభంగా చిచ్చు పెట్టే వారున్నారు. అమ్మా, మీ వారిని ఏదో హోటల్లో చూసాను, మరో అమ్మాయితో కూర్చొని వున్నారు - అంటే చాలు. అన్న వాడు తెలియనివాడైనా ఫరవాలేదు. ఆమె యింట్లో - ఆ రోజు రామ రావణ యుద్ధమే.
- అలాగే, మీ యింట్లో, మీ ఆవిడ ఎవరితోనో కూర్చొని మాట్లాడుతూ వుందండీ.. మరేమో .. అని చెప్పారనుకోండి. ఆయన యింట్లో మహా భారత యుద్ధమే. పెళ్ళాం పైన,మొగుడి పైన వున్న నమ్మకం కన్నా మనలో చాలా మందికి - ముక్కు, మొహం తెలియని వాళ్ళు చెప్పే పితూరిలపై వుంటుంది. యిది మనకున్న పెద్ద బలహీనత .
- మరి ప్రజల మధ్య చిచ్చు పెట్టడం వొక లెక్కా? అది ఎంతో సులభం గా మారి పోయింది . అదో, వారి వలన "మనం" నష్టపోయాం - అంటే చాలు. అనుమానాలు, విరోధాలు వెంటనే వచ్చేస్తాయి . మంచి నాయకుడు లేకపోతే - యింకా త్వరగా వచ్చేస్తాయి . సరే ; అయ్యా - మీరేమీ నష్ట పోలేదు -యిదుగో, గణాంకాలు - మీరే చూడండి అంటే - ఈ గణాంకాలు - చేసిన వాడేదో కుట్ర చేసాడు - మీతో కలిసి . మేము నమ్మం గాక నమ్మం. మరి దీనికి జవాబు ఎక్కడ తెస్తాం . మరో సారి గణాంకాలు తెమ్మందాం -అంటే; వొద్దు; మొత్తానికి, మీకూ, మాకూ పొత్తు కుదరదు -అని రిప్లై . అసలు, ఏ తర్కానికీ లొంగని ఈ తర్కం ప్రకారం రాష్ట్ర ప్రజలు విడపోదామంటే - ఎంత అవాంఛనీయం
- అయితే - పాలక వర్గంలో - కొన్ని రకాల అవాంచనీయ పరిస్థితులు వచ్చాయనే చెప్పుకొవాలి. మా కులం, మాకులం అన్న పక్షపాతాలు ఎక్కువయ్యాయి. మన రాష్ట్రాభివృద్ధి, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కూడా చాలా, చాలా, కుంటు పడిందనే చెప్పుకొవాలి. యిది అన్ని ప్రాంతాలకూ చెందినదే. కానీ, యిది మనం ఎన్నుకున్న నాయకత్వ లోపమే. చూడబోతే - మంత్రివర్గంలో - అన్ని ప్రాంతాల నాయకులూ - ఎప్పుడూ వున్నారు . ఏ ప్రాంతం అభివృద్ధి చెందక పోయినా - ఆ ప్రాంతపు నాయకులే కారణం -మరెవరో కాదు .
- నిజానికి - మనకున్న వనరులకు - మనం, గుజరాత్ కంటే కూడా బాగా అభివృద్ధి చెందవచ్చు . కానీ చెంద లేదు. గోదావరి, కృష్ణ నదుల నీళ్ళు ప్రతి జిల్లా కూ ఎందుకు అందటం లేదు - ఈ రోజు వరకూ ? ఆదిలాబాద్ నుండి , చిత్తూర్ జిల్లా వరకు కాలువలు త్రవ్వి త్రాగు నీరు, పంట నీరు రెండూ, కల్పించి వుండ వచ్చు. కావాల్సినంత విద్యుత్తు ఉత్పాదన చేసి వుండ వచ్చు. ఎన్నో రకాలుగా,ఉద్యోగ, వృత్తి అవకాశాలు కల్పించి వుండ వచ్చు . యిప్పుడు చేస్తే కూడా - వచ్చే 5 సంవత్సరాలలో - యివన్నీ చెయ్య వచ్చు .
- యిప్పుడు వస్తున్న ఉద్యమాలు కూడా - ఈ పరిస్థితికి ప్రతికూలంగా వచ్చినవా - అన్న అనుమానం వుంది .
- ఏది ఏమైనా , మనమంతా కలిసి పనిచేస్తేనే , కులాలకతీతంగా, మంచి నాయకులను ఎన్నుకుంటేనే - మనం బాగుపడతాం .
- నా ఉద్దేశంలో - కలిసి వుంటేనే - కలదు సుఖం. అలాగే, నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే - మన అభివృద్ధి .అలా ఎన్నుకోలేక పోతే ఏ అభివృద్ధీ వుండ బోదు.
- వెనకటికి , వొక సామెత చెప్పే వారు - తొందర పడి , తాతాచార్యులు, మతం మార్చుకున్నాడట . ఆ తరువాత, ఆ మతం లోని నియమాలు, సమస్యలు తెలిసిన వెంటనే, మళ్ళీ మొదటికొచ్చేసాడట.
- మరో సామెత - ఏదో చెయ్యబోతే , పెద్ద ముక్కు రాలేదు కానీ ; వున్న ముక్కు ఊడి పోయిందట
- అలా అయిపోతుంది పరిస్థితి . ప్రజలంతా యోచన చెయ్యాలి.
- సర్వే జనాః సుఖినోభవంతు
- =మీ
- వుప్పలధడియం విజయమోహన్
