14, జనవరి 2012, శనివారం

సుమతి శతకం = బంగారు తెలుగు వెలుగులు = కొన్ని ఆణి ముత్యాలు

సుమతి  శతకం
కొన్ని ఆణి ముత్యాలు 

తెలుగులో భారతం, రామాయణాల లాంటి కావ్యాలు, అత్యద్భుతంగా అతి గొప్ప  కవీంద్రుల చేత రాయ బడ్డాయి.  మరెన్నో కావ్యాలు, నాటకాలు, ఎన్నో,ఎన్నో వచ్చాయి.

అయితే - తెలుగు వారి నోటిలో - ఎక్కువగా నానేవి - సుమతి, వేమన శతకాలే - అంటే  అతిశయోక్తి కాదు.

తమిళం లో తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ వారికి చాలా గర్వ కారణం అని అందరికీ తెలుసు. అలాగే - ప్రతి భాషలోనూ - ఏదో వొక గొప్ప పుస్తకం వుండనే వుంటుంది. ఎవరి గొప్ప వారికానందం.

తెలుగు వరకు - వేమన, సుమతి శతకాలు - ఎంత గొప్పవి - అంటే - చెప్ప లేనంత.మాకు చిన్న తనంలో - మా అవ్వ గారు - కాళహస్తి గుళ్ళో నేర్పించేవారు - అవన్నీ.

కాబట్టి - వాటిలోని - ఆణిముత్యాలు మనసులో పదిలంగా అలాగే నిలిచి పోయాయి. జీవితంలో - ఏ వొత్తిడి వచ్చినా, ఏ సమస్య  వచ్చినా, ఈ శతకాలలోని పాఠాలు - నన్ను ఆదుకున్నాయని  తప్పకుండా చెప్ప గలను. యివన్నీ ప్రతి వొక్కరికీ - బాల్యంలోనే, తప్పక  నేర్పించాలి. అలా నేర్పించడం వలన, వారి జీవితం సుఖ మయం అవుతుందనడంలో  ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
 
వేమన శతక పద్యం వొక్కటి మొదట చూద్దాం.

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ

తప్పులే చేయని వారు ప్రపంచం లో లేనే లేరు. మరొకరి తప్పులే వెదుకుతూ వెళ్ళే వాళ్లకు తమ తప్పులు తెలుసుకునే సమయమూ వుండదు. సామర్థ్యమూ వుండదు. వారి జీవితమంతా - మరొకరి తప్పులు వెదకడంలో జరిగిపోతుంది. వారు - ఏ రకమైన ఆనందమూ అనుభవించ లేరు. ఎంత గొప్ప జీవిత సత్యం యిది! నిజానికి మన తప్పులు మనం సరిజేసుకుంటూ   వెడితే - మనం బాగుపడతాము. యితరుల తప్పులే వెదికితే - ఎవరూ మన దగ్గరికి కూడా రారు. మనకు ఏ స్నేహాలూ, చుట్టాలూ వుండవు. మనం బాగు పడే ఆవకాశమూ వుండదు. 

కానీ, వేమన గారి దగ్గర వేదాంతం పాలు ఎక్కువగా కనిపిస్తుంది. అద్భుతమైన అద్వైత వేదాంతం - అతి సులభ మార్గంలో చెబుతారు వేమన గారు. అవన్నీ మరో సారి చూద్దాం.

సుమతి శతకంలో - నిజ జీవితానికి సంబంధించిన సూక్తులు ఎక్కువ.  అవి పిల్లలకూ, పెద్దలకూ - చాలా బాగా నచ్చుతాయి.సుమతి శతక కర్త పేరు బద్దెన కవి. 13  వ శతాబ్దికి చెందిన వాడు. ఆయన సూక్తులు, చాలా వరకు, ఈ నాటికీ వర్తిస్తాయి. కొన్ని సూక్తులు - యిప్పటి కాలానికి పనికి రానివి వున్నాయి.

మనకు చాలా, చాలా, ఉపయోగ పడే - కొన్ని సూక్తులు యిక్కడ ఉదాహరిస్తున్నాను :

"అక్కరకు రాని చుట్టము ;   మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తా;నెక్కిన బారని గుఱ్ఱము;  గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!  " అంటారు ఆయన.

చుట్టమంటే  - సమయానికి సహాయపడే వాడే గానీ మొహం చాటు చేసే వాడు కాదు. మనమూ అలాగే వుండాలి గదా. మీరు ఎవరికి సహాయ పడతారో - వారే, మీకు సహాయ పడే ఆవకాశం ఎక్కువ. వరమీని వేలుపు సంగతి ప్రక్కన పెడితే - మీరు యుద్దానికని  వెళ్ళారు; మీ గుఱ్ఱము, మీకు అనువుగా పరుగెత్త నంటుంది . మీరేం చేయాలి? అక్కరకు రాని చుట్టం లాగే యిదీ. వెంటనే వదిలి పెట్టండి. అవసరానికి పనికి రానివి - మనం వెంటనే వదిలి పెట్టాలి.  జీవితానికి కావలసిన సత్యమే కదా.

"అప్పిచ్చు వాడు, వైద్యుడు; ఎప్పుడు,ఎడతెగక బారు ఏరును, ద్విజుడున్; చొప్పడిన ఊరనుండుము ; చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ! " అంటారు శతక కారుడు. 

మీ వూళ్ళో, అవసరానికి అప్పిచ్చే వాడు వున్నాడా? వైద్యుడు వున్నాడా? నిరంతరం త్రాగునీరు సదుపాయం వుందా? మంచీ,చెడూ చెప్పే బ్రాహ్మణుడున్నాడా? ఈ రోజూ కూడా - ఎవరికైనా -  యివన్నీ వున్న వూళ్ళో వుండడమే శ్రేయస్కరం. వీటి రూపాంతరాలు వుండొచ్చు. కాలంతో బాటు కొంత మార్పు సహజం. కానీ - (1) అవసరానికి అప్పు (2 ) రోగాలకు మంచి వైద్యుడు (3 ) మంచి నీటి సదుపాయం (4 ) మంచి చెడులు తెలియ జెప్పే వాడు - వుండే వూరిలో వుండడం, వుండని ఊరిని వదిలి పెట్టడం  అందరికీ మంచిదే కదా.

"ఎప్పటికెయ్యది ప్రస్తుత; మప్పటికా మాటలాడి యన్యుల మనముల్; నొప్పింపక తానొవ్వక; తప్పించుక   తిరుగువాడె ధన్యుడు సుమతీ!" 

యిది ఎంత మంచి మాట. ఎవరినీ నొప్పించకండి  . మీరూ నొచ్చుకోకండి. అలా - ఎప్పుడు ఏది మాట్లాడితే  అందరి మనుసుకూ బాగుంటుందో - అప్పుడు అది మాట్లాడి - సమస్యలు రాకుండా తప్పించుకోండి.

కొంత మందికి -తమకు తెలియకుండానే - చుట్టూ వున్న వారిని - నొప్పించే మాటలనడం -చాలా అలవాటుగా వుంటోంది . అలా మాట్లాడడం తప్పని ప్రతి వొక్కరూ తెలుసుకోవాలి. తెలియని వారికి, ఎవరో వొకరు,చెప్పి తీరాలి. లేదంటే - వారి వలన, వారి చుట్టూ వున్న వారు ఎప్పుడూ, బాధ పడుతూనే వుంటారు.

"తన కోపమె తన శత్రువు; తన శాంతమె తనకు రక్షా దయ చుట్టంబౌ; దన సంతోషమె స్వర్గము ;తన దుహ్ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!"

యిది వొక ఆణిముత్యం. మనకు, మన కోపాన్ని మించిన శత్రువు మరొకరు లేరు. మనల్ని కాపాడేది మన శాంతమే. మనలోని దయా గుణమే మనకు బంధువు. మన స్వర్గం మరెక్కడో లేదు - మన సంతోషం లోనే వుంది. అలాగే మన నరకం మరెక్కడో లేదు. మన దుహ్ఖమే మనకు నరకప్రాయము.  ఎంత గొప్ప నిజం!  యిది వొక్కటి  జ్ఞాపకం వుంటే - జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు. మన మిత్రులూ, శత్రువులూ - మనలోనే వున్నారు. గుర్తించండి.

"నవ్వకుమీ సభలోపల; నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్; నవ్వకుమీ పరసతితో; నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!"

యిక్కడ నవ్వకుమీ అంటే - రక రకాల అర్థాలున్నాయి. (1 ) పెద్ద వారున్న సభలలో - వూరికే నవ్వడమో, ఎవరినైనా అపహాస్యం చేయడమో అస్సలు చేయరాదు. సాధారణంగా సభలో, వూరికే నవ్వితే - ఎవరినో అపహాస్యం చేసినట్టు పదుగురు అనుకోవచ్చు.  దాని వలన పదుగురూ, మనలను అసహ్యించుకుంటారు.(2 )  అలాగే - తల్లిని, తండ్రిని, భర్తను గానీ, రాజును కానీ (నాథుడు  అంటే - రెండు అర్థాలూ వున్నాయి) ఎప్పుడూ అపహాస్యం చేయకండి.  యివన్నీ పాప హేతువులు. (3 ) మరొకరి భార్యతో పక పకా నవ్వడం ఎప్పుడూ చెయ్య కండి. అది ఆమెకూ, ఆమె భర్తకూ, మీకూ - మంచిది కాదు. (4 ) మీకు మంచీ ,చెడూ చెప్పే విప్రుడిని అపహాస్యం చెయ్యకండి. యివి చేస్తే ఏమిటనే వారికి -ఎప్పుడో వొకప్పుడు చేటు రానే వస్తుంది.

"కనకపు సింహాసనమున; శునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమునం; దొనరగ పట్టము గట్టిన; వెనుకటి గుణమేల మాను గదరా సుమతీ!"    

యిది కూడా సర్వత్ర, సర్వదా వర్తించే సూక్తి. అర్హుడైన వాడినే ముఖ్య పదవులకు అధికారిగా చేయ వలెను గాని - అనర్హుడైన వాడిని, మూర్ఖుడిని అధికారిగా చేస్తే - ఎవరికీ మంచిది కాదని భావము. ఈ రోజుల్లో - ప్రజలు - మంచి వాడికి, సమర్థుడికి   వోటు వెయ్యాలే కానీ - అసమర్థుడికి  పట్టం కడితే - దేశం దుర్గతి పాలవుతుందని భావం.

"కులకాంత తోడ నెప్పుడు; గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ; కలకంఠి  కంట కన్నీ; రొలికిన సిరి యింట నుండ దొల్లదు సుమతీ!"  

భార్యతో నెప్పుడూ  కలహింపకు;కొట్లాడకు; ఆమెలో లేని తప్పులు వూరికే చెప్పకు; అటువంటి కుల స్త్రీల కంటి నీరు పడిన యింటిలో - లక్ష్మి (అంటే - సిరి సంపదలు) ఎప్పుడూ నివసించదు. నివసించడానికి యిష్టపడదు. యిది మగ వారందరూ గుర్తుంచుకోవాలి.  యిది మనువు కూడా చెప్పాడు. మీ యింట్లోని ఆడ వారు - సంతోషం గా వుండడం - మీ, అంటే, మగ వారి బాధ్యత - అన్నది - భారత సంస్కృతి.

"కూరిమి గల దినములలో; నేరములెన్నడును కలుగ;నేరవు మరియా; కూరిమి విరసంబైనను; నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!"

యిది కూడా గొప్ప ఆణిముత్యమే. మనసులో, స్నేహభావమో, ప్రేమో వుంటే -  ఎదుటి వారిలో మనకు ఎటువంటి చెడూ కనిపించదు. కాని ఆ స్నేహభావము, ప్రేమ ఏ కారణము వలనైనా పోయి, ఏహ్యభావం చోటు చేసుకుంటే - ఎదుటి వారు చేసేవన్నీ - మనకు నేరాలుగానూ, సహింపలేనివి   గానూ కనిపిస్తాయి. కాబట్టి - మన మనసులో ఏం ఉండాలో - స్నేహమా, ఎహ్యమా? అనేది మనమే నిర్ణయించుకోవాలి.

"కొరగాని కొడుకు బుట్టిన; గొరగామియే గాదు తండ్రి గుణముల జెరచున్;జెరకు తుద వెన్ను బుట్టిన;జెరకున తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!"

కొడుకు పనికిరాని వాడితే - వాడు పనికి రాని వాడని మాత్రం అనరు. వాడి తండ్రిని కూడా లోకం తప్పు పడుతుంది. తండ్రి ఎంత మంచి వాడైనా, మూర్ఖపు కొడుకు గుణాలను తండ్రికీ అంటగడతారు. చెరకు గడ ఎంత బాగా వున్నా, దాని చివర వెన్ను పుట్టిందంటే   - గడ అంతటా చేదు తయారవుతుంది. తీపి పోతుంది. యిదీ అలాగే.

"తన వారు లేని చోటను; జనవించుక లేని చోట జగడము చోటన్; అనుమానమయిన చోటను; మనుజున కట నిలువ దగదు మహిలో సుమతీ!"

మనం ఎక్కువ కాలం వుండాలంటే - తన, మన అని అనే వారు, మనం తమ వారు అనుకునే వారు వున్న చోటే వుండాలి కానీ . తన, మన అనే వారు ఎవరూ లేని చోట వుండ రాదు. అదే లాగ, ఏదో కాస్త - మనకూ స్వాతంత్ర్యం వున్న చోట వుండాలి కానీ, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, అనే చోట వుండ రాదు. ఎప్పుడూ, మనల్ని అనుమానం తో,  చూసే వారున్న చోట కూడా ఉండరాదు. అటువంటి వారు - ఎప్పుడో వొకప్పుడు, మనపై అపవాదులు పెట్టడం ఖాయం. అటువంటి స్థలాల్లో నివసించడం క్షేమ కరం కానే కాదు.

"వినదగునెవ్వరు చెప్పిన; వినినంతన వేగపడక వివరింపదగున్; గనికల్ల నిజం దెలసిన;  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!"

మనిషికి సలహాలిచ్చే వారు, ఉన్నవీ లేనివీ వార్తలు చెప్పే వారు ఎంతో మంది వస్తారు. సలహాలు, వార్తలు  వినవచ్చు. తప్పు లేదు. కానీ -ఏది వింటే, అది వెంటనే నమ్మేయాలనీ,  చేసేయాలనే ఆత్రుత పనికి రాదు. అదంతా నిజం అనుకునే మనస్తత్వం పనికి రాదు. ఏది నిజమో, కాదో; ఏది చేస్తే మంచిదో కాదో, బాగా వివరంగా తెలుసుకుని - మరీ కార్యంలో దిగాలి కానీ - వినినంతనే - ఆత్రుత పడితే - ముప్పే.

మొదట వినండి. మంచి వారి మాట ఎక్కువగా వినండి.  మీ శ్రేయోభిలాషులైన వారి మాట వినండి.  తల్లీ, తండ్రీ, గురువూ మాట తప్పక వినండి. ఏది విన్నా - అందులోని నిజమెంతో తెలుసుకుని మరీ ఏ కార్యమైనా చేయండి. 

ఇలాంటి ఆణి ముత్యాలు మన శతకాలలో కోకొల్లలుగా వున్నాయి. అవన్నీ - యిప్పుడే చెపినట్టు - యిప్పటికి తగినవే అనుకోవడం సబబు కాదు. కాలానుగుణం గా కొన్ని మార్చుకోవాలి. కొన్ని - అన్ని కాలాలకూ పనికొచ్చేవి వున్నాయి. అవి తెలుసుకోవాలి. మనసులో రంగరించుకోవాలి . మన జీవితం సుఖమయం చేసుకోవాలి.


యిక్కడ యిచ్చినవి - అన్నీ యిప్పటి కాలానికీ తగినవే - యివి మనమూ పాటించాలి. మన పిల్లలికీ నేర్పించాలి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

13, జనవరి 2012, శుక్రవారం

మానవీయ సంబంధాలు = యండమూరి వీరేంద్రనాథ్ = డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం = వొక జ్ఞాపకాల వెల్లువ = ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి ఎంత ముఖ్యమో


వొక జ్ఞాపకాల  వెల్లువ 

నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మన హైదరాబాద్ లోనే వుంది. అప్పట్లో - అంటే నేను అక్కడ వున్న రోజుల్లో - భారత్ సంచార్ నిగం వారి ఆధ్వర్యంలోచాలా, చాలా బాగా, జరిగేది. జరిపించే వాళ్ళం.

నేను అందులో  మానవీయ సంబంధాలు (హ్యూమన్ రిలేషన్స్) అండ్ మేనేజ్మెంటు విభాగానికి హెడ్ గా వుండే వాడిని.  ఎన్నో రకాల  ట్రైనింగులు, సెమినార్లు,వర్కు షాపులు - రకరకాల నూతన ప్రక్రియలతో నిర్వహించాము.


వొకరికొకరిని పరిచయం చేసే విధానం నుండి - అన్నీ - సరి కొత్త విధానాలే.  అన్నీ, ఎన్నో రకాలుగా యోచించి మేము  తీసుకొచ్చిన ప్రక్రియలే.

ప్రతి మనిషిలోనూ - వొక గొప్ప సృష్టికర్త -ఉన్నాడని - అతన్ని - బయటకు తీసుకు రావడమే - మనిషి చేయాల్సిన పని అని - మాకు బాగా తెలిసి వచ్చింది - అప్పుడే.

హైదరాబాదులో వున్న మన తెలుగు వారిలో - ముఖ్యంగా మానవీయ సంబంధాలలో  - చాలా గొప్ప రచయితలుగానూ, వక్తలుగానూ, పేరుపొందిన వారిని - భారత దేశానికంతా పరిచయం చేయాలని మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. 

అందులో భాగంగానే - అప్పట్లో - యండమూరి వీరేంద్రనాథ్   గారిని,  డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం గారిని , వారి సోదరుడిని , మరెంతో మంది - ప్రముఖులను ఆహ్వానించే వాళ్ళం.  

వీరేంద్ర నాథ్ గారి ప్రసంగము, పట్టాభిరాం గారి ప్రసంగము - వీటిలో - బయటి వారిని బాగా ఆకర్షించేవి.  సరే. మా అకాడెమీ లోని వక్తలలో - నేను. కల్యాణ్ సాగర్ గారని యింకొకరు - మా యిద్దరి  ప్రసంగాలూ -  చాలా బాగుండేవని - అందరి ప్రశంసలూ పొందేవి .  

వీరేంద్రనాథ్   గారిని -  ముఖ్యంగా వారి విజయానికి అయిదు మెట్లు ను గురించి మాట్లాడమనే వాడిని. ఆయనా - అది తనకిష్టమైన విషయం కాబట్టి - చాలా ఆకర్షణీయంగానూ, మనస్సులో హత్తుకుని పోయే లాగానూ మాట్లాడే వారు.

పట్టాభిరాం గారు - తనకు బాగా నచ్చిన ఏదో వొక విషయం పైన మాట్లాడే వారు. రక రకాల వుదాహరణాలతో,  చాలా ఆసక్తి కరంగా జరిపే వారు.

అన్ని రాష్ట్రాల నుండి - చాలా మంది మా ట్రైనింగ్ కు వచ్చే వారు.

క్లాసు రూములో - సాధారణ సంఖ్య ముప్పైకి మించరాదు. అటువంటిది - వద్దన్నా - వంద మంది వరకు భారత దేశమంతటి నుండీ వచ్చేసే వారు. మేమూ - వారిని నిరుత్సాహ పరచకుండా - రెండు క్లాసు రూముల్లో - వొకే సారి, వొక్కొక్క క్లాసు రూములో, యాభై మంది దాక ఎలాగో సర్ది - జరిపే వాళ్ళం.

మొదటి అంశం పరిచయం. నేనే చేసే వాడిని. నేను జరిపే పరిచయం ఎలా వుండేదంటే   -  వో ముప్పావు  గంటలో - క్లాసులోని ప్రతివొక్కరికి, అందరినీ - వారి పేర్లూ, వారి వూరి పేర్లతో  సహా జ్ఞాపకం వుండేటట్టు చేసే వాడిని.  మరి నాకూ గుర్తుండాలిగా. ఆ ప్రక్రియ వచ్చిన వారికి చాలా ఆశ్చర్యకరంగా  వుండేది. వచ్చిన వారిలో ఏ వొక్కరూ - తాము యాభై మంది క్రొత్త వాళ్ళను - వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన వాళ్ళను -  వారి పేర్లు, ఊర్లతో సహా మనుషులను కూడా 45 నిమిషాలలోగా గుర్తించగలమని    మొట్ట మొదట నమ్మగలిగే వాళ్ళు కాదు. కానీ - ఆ 45  నిమిషాల తర్వాత - అది చెయ్య లేని వాళ్ళూ ఎవరూ లేదు.

ఆ ప్రక్రియ మా ట్రైనింగ్ కు గట్టి   పునాదిగా మారింది.   అంతర్జాతీయ ప్రఖ్యాతి గల శివ్ ఖేరా లాంటి వారి ట్రైనింగ్ కు కూడా నేను వెళ్లాను కానీ - మా ట్రైనింగ్ లోని యిటువంటి అద్భుతమైన అంశాలు మరెక్కడా నాకు కనిపించ లేదు.

దానితో, వచ్చిన వారికి ట్రైనింగు పైన - చాలా గౌరవం వెంటనే కలిగేది. మానవీయ సంబంధాల పైన ట్రైనింగు కదా.

ట్రైనింగును - వొక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళే వాళ్ళం. అయిదు రోజులు అయ్యే సారికి - వారిలో - మేము కోరుకున్న మార్పు వచ్చి తీరాలని ప్రయత్నం చేసే వాళ్ళం. వచ్చిన వాళ్ళు ప్రతి వొక్కరూ, వచ్చినట్టు  వెళ్ళకూడదు. కొంత, నిరంతరమైన , సకారాత్మకమైన - మార్పు తోనే వెళ్ళాలి.
మొదటి రోజు - జీవితాన్ని - ఆట లాగా, పాట లాగా  హాయిగా, ఆనందంగా గడపాల్సిన అవసరం గురించి చెబుతూ - కడపటి రోజు ప్రతి వొక్కరూ, కనీసం వొక పాట లోని వొక చరణమైనా పాడాలని చెప్పే వాళ్ళం. అందుకని ప్రతి వొక్కరూ ప్రయత్నమూ చేసే వాళ్ళు. పాడే వాళ్ళు.   డాన్సు కూడా చేసే వాళ్ళు. చివరి రోజు, చివరి క్లాసు వాళ్ళదే. చాలా బాగా జరిగేది.

సరే. యండమూరి గారి క్లాసు చాలా విజ్ఞాన దాయకంగా జరిగేది. ఆయన యిచ్చే ఆలోచనలు - ప్రతి వొక్కరి మనస్సులోనూ హత్తుకు పోయేవి. మరి విజయానికి మెట్లు కదా. ఆయనను పరిచయం చేయడం మొదట నా సహ ఆఫీసర్లు లో ఎవరికైనా వొప్పగించే వాడిని. వారు - ఆయనను గురించి పేపర్లో రాసుకుని పూర్తిగా క్లాసులో చదివే వారు.

వొక్కో సారి నేనే చేసే వాడిని. యండమూరి గారి కథలు, నవలలు, అన్నీ- పత్రికలలో ప్రచురితమైనప్పుడే చదివిన వాడిని నేను. ఆయన జీవితం లోని - ముఖ్య సంఘటనలు, ఆయన విజయాలు అన్నీ బాగా తెలిసున్న వాడిని. సరే - ఆయనంటే - బాగా అభిమానమూ వున్న వాడిని అవడం వల్ల -  నాకు పేపర్లో రాసుకోవలసిన అవసరం లేదు. నేను పరిచయం చేయడంలో - ప్రతి సారి చాలా వైవిధ్యం వుండేది.  అది ఆయనకు బాగా నచ్చేది.

తరువాత, తరువాత   - ఆయన, నా పరిచయం మాత్రం మీరే చెయ్యండి - అనే వారు. నేనూ అలాగే చేసే వాడిని. ఆ తరువాత - ఆయన, విజయమోహన్ గారూ, నేను మాట్లాడడానికి ముందు మీరు వొక పది పదిహేను నిమిషాలు మాట్లాడరా, నేను వినాలి - అనే వారు. అప్పటికప్పుడు, ఏదైనా వొక విషయాన్ని గురించి మాట్లాడే వాడిని. అంతా మానవీయ సంబంధాల గురించే. అప్పట్లో - ఎన్నో వందల పుస్తకాలు చదివాను. వేల పస్తకాలు కూడా వుండొచ్చు.

అందులోని - అతి ముఖ్యమైన విషయాల గురించి, ఆ పదిహేను నిముషాలు మాట్లాడే వాడిని. ఆ తరువాత, యండమూరి - తన ప్రసంగం ఆరంభించే వారు.  యండమూరి, పట్టాభిరాం గార్ల ప్రసంగాలు - గొప్ప హై లైట్ గా చెప్పొచ్చు.

వొక రోజు - యండమూరి గారి కారు ఎక్కడో - ట్రాఫిక్ జామ్ లో యిరుక్కు పోయింది. కాస్త ఆలస్యం అవుతుందని వార్త వచ్చింది.   ఆయనకు తెలుసు - అంత వరకు - నేను కొన సాగిస్తానని. సరే. నేనూ ఏదో చెబుతున్నాను. కాని - వచ్చిన వాళ్ళు - సార్,  ఆఖరి రోజు మమ్మల్నంతా పాడమని అన్నారు కదా.  మీరు ఈ రోజు - వొక పాట   పాడండి - అని బలవంతం చేసారు. సరే. తప్పేదేముంది.

నేను పెద్ద గాయకుడిని కాను. కానీ - ఎవరైనా సరే. కొద్దో, గొప్పో పాడగలరు - అని నమ్మే వాడిని. ఆ రోజు - కభీ, కభీ - హిందీ చిత్రంలోని - కభీ,కభీ, మేరె దిల్ మే - అనే పాట కళ్ళు మూసుకుని పాడాను.

యండమూరి ఎప్పుడు వచ్చారో తెలీదు కానీ - పాటంతా అయిన తరువాత- నేను కళ్ళు తెరిచి చూస్తే -  క్లాసులోని అందరితో బాటు - ఆయన కూడా కరతాళ ధ్వనులు చేసేస్తున్నారు.

తరువాత - ఆయన పరిచయం చేసాను. మీరు పాటలో - బాగా లీనమై, చాలా బాగా పాడారని ఆయన మనస్ఫూర్తిగా అనడం - నాకు చాలా బాగా అనిపించింది.

నేను అప్పుడప్పుడూ వెళ్లి ఆయన క్లాసులోనూ, పట్టాభిరాం గారి క్లాసులోనూ వెళ్లి కూర్చుని, వినే వాడిని.

నా  ప్రసంగం -  లైఫ్ స్కిల్స్ - అనే అంశం పైన చేసే వాడిని. అందులో నేను చెప్పే విషయాలు - ఏ పుస్తకం లోనూ దొరకవు. నేను మానవీయ సంబంధాల పైన చేసిన రీసెర్చ్ ఫలితాలే. చాలా సులభంగా - ప్రతి వొక్కరూ - చేయ గలిగే అంశాలే. నేను చేయ లేనివి, నేను చేయనివి - నేను చెప్పకూడదని  సిద్ధాంతం   పెట్టుకున్నాను. అలాంటి అంశాలే చెప్పే వాడిని.

చిన్న రహస్యం - ఏమిటంటే - నా ప్రసంగం లో   - ప్రతి వొక్కరూ - చాలా సార్లు నవ్వాలి. కొన్ని సార్లు వారి కళ్ళల్లో నీళ్ళు రావాలి - యిది జరిగితేనే - నా ప్రసంగం విజయవంతం అయినట్టు - అని వొక  గోల్ / గుర్తు పెట్టుకున్నాను.

అది జరిగేది - కానీ, చివర అందరూ, మీరు బలే ఏడిపిస్తారు సార్ - అని సంతోషంతోనూ, వొక రకమైన సంతృప్తితోనూ, చెప్పే వారు.

ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి  ఎంత ముఖ్యమో - ఎంత తృప్తి నిస్తాయో - అందరికీ తెలిసొచ్చేది. హృదయాన్ని కన్నీళ్లు ఎంత బాగా కడగ గలవో - నాకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి "భావ స్పందన" అనే యోగా ట్రైనింగ్ లో - చాలా బాగా తెలిసొచ్చింది.

మనిషికి ఈ రెండూ కావాలి. నవ్వ గలగాలి. యేడవ గలగాలి. తరువాత - ఆ రెండింటినీ -  దాటి పరిణితి చెందాలి. ముందుకెళ్లాలి.

మనిషి ఆనంద స్వరూపుడు. అది తెలుసుకున్న వాడే యోగి. ఆ ఆనందంలోనూ - కన్నీళ్ళున్నాయి. అదీ తెలుసుకోవాలి. రామకృష్ణ పరమ హంస ఎన్నో సార్లు సంతోషంతో కన్నీళ్ళు కార్చే వారు.

నిర్లిప్తంగా, నిర్వేదంగా - వుండటంలో - జీవితం సాఫల్యం చెందదు. ఆడండి. పాడండి. చిన్న పిల్లల్లా గంతులెయ్యండి. నవ్వండి. ఏడవాల్సి వస్తే, తృప్తిగా ఏడవండి. నిద్ర పోయేటప్పుడు - హాయిగా, ప్రపంచాన్ని మరిచి నిద్ర పోండి.

ప్రతి రోజూ, సృష్టి కర్త గా, సకారాత్మకంగా ఏదో వొకటి సృష్టించండి. ముఖ్యంగా - కనీసం వొకరి మనసులో, ఏదో కొంత, సంతోషాన్ని సృష్టించండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

5, జనవరి 2012, గురువారం

దేశం పాడవడం చెడ్డ వాళ్ళ చర్యల కంటే - మంచి వాళ్ళ మౌనం వలన ఎక్కువ = మాన భంగాలకు అసలైన కారణం ఏమిటి?


ఈ మధ్య మానభంగాల సంఖ్య చాలా ఎక్కువయిపోతోందని - అందుకు కారణాలేమిటని -      మీడియా వారడిగిన వొక ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ డీ.జీ.పీ. గారు - అందుకు కొందరి ఆడవారి అర్ధనగ్న దుస్తులు, మితి మీరిన ఫాషన్లు కూడా కారణమని  అన్నారట.

ఆ వొక్క మాటకు - (కొంత మంది) ఆడవారినుండి   - తీవ్ర వ్యతిరేక స్పందన ఎదురైంది.

కానీ యిదే మాట ఢిల్లీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ గారు కూడా అన్నారట. అసలింతకీ - ఈ విషయం వొక సామాజిక పరిశోధనలో తేలిన అంశమట.

ఎక్కువయి పోతోన్న మాన భంగాల సంఖ్యకు అర్ధ నగ్న, మితిమీరిన  ఫాషను దుస్తులు  కూడా వొక కారణం కాదా?

నిస్సందేహంగా - అది కూడా వొక బలమైన కారణమే  అని - నా వరకు నేను డీ.జీ.పీ గారి పై మాటతో తప్పకుండా అంగీకరిస్తాను. నిజాన్ని చెప్పినందుకు ఆయన ఎవరికీ సంజాయిషీ యివ్వాల్సిన పని లేదు- అన్నది నా అభిప్రాయం. అదే మాట చెప్పిన షీలా దీక్షిత్ గారు -జీవితాన్ని మధించి చెప్పిన మాటే అది.

పాషన్ల పేరిట ప్రపంచం లోని అందరు మగాళ్లనూ - ఆకర్షించాలని కొందరు ఆడవారు చేసే ప్రయత్నాలు -అందరు ఆడ వాళ్ళ కొంప ముంచుతుందనడంలో  నాకు సందేహం లేదు.

ఆడ-మగ మధ్య పరస్పర సంబంధాలు, ఆకర్షణలు,ప్రేమలు, పెళ్ళిళ్ళు, -ఈ వ్యవస్థకు  పునాది నే పీకి పారేయాలని మూర్ఖంగా ఆలోచిస్తే - సమాజమంతా  - అస్తవ్యస్తంగా తయారవుతుంది.

దుస్తుల విషయంలో, ఆడవారికి గానీయండి, మగ వారికి గానీయండి - పూర్తి స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.

వొకరిపై, వొకరికి గౌరవం వచ్చే విధంగా దుస్తులు వుండాలి గాని - సెక్సీ గా, ఆకర్షించే విధంగా వుంటే - ప్రమాదమే - అన్నది ప్రతి వొక్కరు తెలుసుకోవాలి.

మగ వారి విషయంలో - చాలా వరకు, దుస్తులు దేహాన్ని కప్పే వున్నాయి. ఎవరో, వొకరిద్దరు తప్ప.

ఎటుతిరిగీ - కొంతమంది (అందరూ కాదు) ఆడ వారే - సినిమాల్లో కానీయండి, టీ.వీ లో కానీయండి, మరీ బరి తెగించి  ఎంత భాగం నగ్నంగా ప్రదర్శించ గలమా అని చూస్తున్నట్టు తెలుస్తూనే వుంది కదా. పైగా - అది నా యిష్టం అంటున్నారు.

అందుకు కొంత మంది మగ నిర్మాతలూ, దర్శకులూ కూడా చాలా, చాలా, కారణం గా వుంటున్నారు.

సరే. ప్రేక్షకుల్లో వొక భాగం - దీనికి బానిసలై పోతునారు. మందు కొట్టడం, పొగత్రాగడం లాగా, యిది కూడా వొక వ్యసనమే అని - ఆ వ్యసనానికి బానిసలైతే - మనం మరే మంచి పనీ చేయలేమని సమాజం గుర్తించాలి.

టీ.వీ. తెరిస్తే చాలు - ఈ అర్ధ నగ్న డాన్సులు ప్రత్యక్షమవుతున్నాయి. యివి మగ వారి మనస్సులో సెక్సు కాంక్షని కొద్దో, గొప్పోరేకెత్తిస్తాయి- అనడంలో అతిశయోక్తి లేదు.  సమాజం మొత్తం వీటికి బానిసై పోతున్నారు . మరి యివి చూసి, చూసి, మగ వాళ్ళు పక్కన ఎవరున్నారా, వీధిలో ఎవరున్నారా - అని చూస్తే - అది ఎవరి తప్పు?

మన సమాజంలో - యివన్నీ తెలిసే - కొన్ని నిబంధనలు పెట్టారు. అలాగని - పైనుండి, క్రింది వరకు ముసుగులో దాచెయ్యలేదు. మగ వాడు చేసే తప్పుకు కూడా ఆడవారిని కొట్టి చంపాలని చెప్ప లేదు.

కానీ - ఎవరికైనా - ఎప్పుడూ -విశృంఖలమైన   స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.వుంటే - అది కావాలనుకుంటే - మళ్ళీ ఆ సమాజానికి భవిష్యత్తు లేదనే చెప్పొచ్చు.

సరే. యిందులో - మగ వారి తప్పు లేదా? మగ వారి తప్పు లేకుండా - ఆడది తప్పు చెయ్య లేదు. అలాగే - ఆడ వారి తప్పు లేకుండా - మగ వాడు తప్పు చెయ్య లేదు.

మానభంగం జరిగితే - అది చేసేది - మగ వాడే కాని - ఆడది కాదుగా. అది మగ వాడి తప్పే. అందులో ఆవ గింజంత సందేహం కూడా అక్కర లేదు.

వొక ఆడది యిచ్చే నగ్న ప్రదర్శనలను - తప్పు అని మొట్ట మొదటే చెప్ప గలిగే - ధైర్యం మగ వాడికి వుండాలి. ఎందుకు? అది కొంప ముంచేది - మగ వాడినే గనుక!

మన పురాణాల్లో కూడా- యిది మళ్ళీ,మళ్ళీ చెప్ప బడింది. ఎక్కడో అడవిలో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే విశ్వామిత్రుడిని - పనిగట్టుకుని వెళ్లి , మేనక చెడిచింది - ఇలాంటి అర్ధ నగ్న దుస్తులు, డాన్సులుతోనే కదా.  

మరి తపస్సు చేసుకునే విశ్వామిత్రుడినే చెడప గలిగే లాంటి దుస్తులు, చాలా మంది ఆడ వారు వేసుకుంటే - జరిగేదేమిటి?   మాన భంగాలు పెరగవా? కాక పొతే - రోడ్డు మీదో, సినిమా లో నో, టీ.వీ. లోనో - యివన్నీ చూసి, చూసి - మనసు పాడైన -  కొందరు - ఎక్కడో దొరికిన చోట, ఎవరో అమాయకులను మాన భంగాలు చేసేస్తున్నారు. తప్పొకరిది. చేటొకరికి. మాన భంగం చెయ్య బడిన అమ్మాయి తప్పు అస్సలు లేక పోవచ్చు. కాని మరెక్కడో తప్పు జరిగింది.

అదే విధంగా - కేవలం డబ్బు కోసం - కొంత మంది నిర్మాతలు, దర్శకులు - ఇలాంటి అర్ధ నగ్న డాన్సులు, ప్రదర్శనలను ప్రోత్సహించడం వలననే - కొంత మంది ఆడ వారు యిలా చేస్తున్నారనడం లో కూడా - సందేహం లేదు. అంటే- సగం తప్పు మగ వారిది. సగం తప్పు ఆడ వారిది. కానీ - నష్టం అందరికీ.

తప్పును - తప్పు అని చెప్పే ధైర్యం మనకు లేదంటే - తప్పులే పెరుగుతాయి.

ఆడవారిపై, మగ వారికీ, మగ వారిపై ఆడవారికి -గౌరవం యిచ్చే లాగా యిద్దరి ప్రవర్తనా వుండాలి. అదే అందరికీ క్షేమం.

రోడ్డు పై నడిచే మగవారిలో - 25 శాతం మంది - సరే. కనీసం అయిదు శాతం మంది - సెక్సు కాంక్షతో   - వుంటే - జరిగేదేమిటి?

యిది పోవాలంటే - సినిమాల్లో, టీ.వీ.లలో, ఆమ్మాయిలు వేసుకునే దుస్తులలో - కాస్త  గౌరవ నీయత వుండాలంటే - తప్పేమిటో - నాకు తెలియడం లేదు.

మగ వారిలో - ఆడవారి పట్ల గౌరవం పెంచాలి - కానీ ఆకర్షణ ను  కాదు - అన్న విషయం - అందరూ అర్థం చేసుకోవాలి.

అప్పుడే - గాంధీ గారు అన్న - "అర్ధ రాత్రి కూడా, ప్రతి ఆడది, వొంటరిగా, భారత దేశంలోని ఏ వీధిలో నైనా నిర్భయంగా తిరగగలిగే" -  స్వాతంత్ర్యం వస్తుంది.

యిప్పుడి జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటే, చదివితే, చాలా, చాలా బాధ కలుగుతుంది. మూడేళ్ళ పసిపాపను యింట్లో వారే , లైంగికంగా వాడుకున్నారట. మరో యింట్లో - డెబ్భై ఏళ్ళ ముసలమ్మపై అత్యాచారం జరిగిందట. వాళ్ళు మనుషులేనా - అన్న సందేహం మనకు రావాలి. అమ్మంటే గౌరవం లేదు. అవ్వంటే మర్యాద లేదు. అక్క చెల్లెళ్ళంటే కూడా  ఏమీ స్నేహ భావం లేదు. యిలా తయారవుతున్నారు - కొంత మంది మగ వారు.

మరి కొంత మంది ఆడవారైతే - మామ  గారి ఎదురుగా, తండ్రి ఎదురుగా, మరుదుల ఎదురుగా - ఇలాంటి సెక్సు ఆకర్షణ కలిగించే విధంగా తిరగొచ్చునా   -  అన్న విచక్షణ లేకుండా వున్నారు.

ఈ పధ్ధతి మారాలి.

కొన్నేళ్ళ  క్రితం - దక్షిణ రైల్వే లోని - వొక ట్రైన్ రూటు లో - నేను ప్రతి రోజూ ఫస్టు క్లాసు, సెకండు క్లాసులలో - ఆఫీసుకు వెళ్ళే వాడిని. అప్పట్లో - ఆ రూటులో - స్త్రీ వేధింపు చర్యలు ( ఈవ్ టీజింగ్) చాలా, చాలా ఎక్కువగా  వుండడం నేను చూసాను.

నా సహ ప్రయాణీకులతో ప్రతి రోజూ అనే వాడిని - మనమంతా కలిసి - ఈ రౌడీ వెధవల ఆగడం అరికట్టాలి - అని.  వొక్కరంటే - వొక్కరు కూడా ముందుకు రావడానికి సాహసించ లేదు.

కొన్ని రోజుల పాటు చూసి, చూసి - వోర్చుకోలేక - పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు, జనరల్ మేనేజర్ గారికి - పెద్ద ఫిర్యాదు రాసి పంపించాను. వారి పోలీసు ఆఫీసర్లు - మా ఆఫీసుకు వచ్చి - నా వద్ద - రాసింది నేనేనా, నాకు యింకా చెప్ప వలసింది ఏదైనా   వుందా -  అని మాత్రం అడిగి తెలుసుకుని వెళ్ళారు.

అంతే. తరువాత - నెల రాజులు వారు తీసుకున్న చర్యల ఫలితంగా - ఆ రూటులో -యిప్పటి వరకూ స్త్రీ వేధింపు చర్యలు దాదాపు లేవనే చెప్పొచ్చు. కానీ - దురదృష్టమేమంటే   -  వొక్కరంటే, వొక్కరు, నాకు మొదట సపోర్టు యిచ్చిన వారు లేరు. అయినా నేను ముందుకు వెళ్లి పోయాను. అదృష్ట వశాత్తూ - దక్షిణ రైల్వే లోని - ఆఫీసర్లు చిత్త శుద్ధితో వ్యవహరించారు. అందువలన ఆ రూటులో - ఆడవారి సమస్యలు - తీరిపోయాయి.

సరే. ఆడదే , మరో ఆడదానికి సమస్యగా మారితే?

డీ.జీ.పీ. గారు చెప్పిన దానికి అర్థం అదే. ఆ పరిస్థితి కూడా మారాలి.

సరిగ్గా ఆలోచించే ఆడవారు, మగ వారు - అందరూ - వెర్రితలలు వేస్తున్న అర్ధ నగ్న దుస్తులను, శరీరాన్ని  పూర్తిగా అంటుకుని, అంతటినీ - దాదాపు బహిర్గతం చేసే లాగున్న దుస్తులు మంచిది కావన్న సంగతి - మన పిల్లలందరికీ  చెప్పాలి.  అలాగే, ఐటం సాంగు పేరుతో - అశ్లీల ప్రదర్శనలు చేయించే  నిర్మాతలకు, దర్శకులకూ కూడా చెప్పాలి.

లేదంటే - డీ.జీ.పీ. గారు చెప్పినట్టు - మానభంగాలను అరికట్టడం సుసాధ్యం కాదు.

చదివే వారిని - నేను కోరేదేమిటంటే - అయ్యలారా,అమ్మలారా, మీ అభిప్రాయాలూ చెప్పండి. మన పిల్లలు - తప్పు మార్గాల్లో వెళ్ళకూడదంటే   -  అందరూ క్షేమంగా, ఆనందంగా వుండాలంటే - సరైన సమయంలో - సరైన అభిప్రాయం చెప్పక తప్పదు.

దేశం పాడవడం చెడ్డ వాళ్ళ చర్యల కంటే - మంచి వాళ్ళ మౌనం వలన ఎక్కువ - అని అందరం గ్రహించాలి. ఈ విషయంలో అందరూ చేయి కలపండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

30, డిసెంబర్ 2011, శుక్రవారం

2012 వ సంవత్సరపు శుభారంభం = మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు = 2011 ఎలా గడిచింది?

2012  వ సంవత్సరపు శుభారంభం 
ఈ శుభ సమయంలో -  మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు .

2011  - మీ జీవితంలో ఎలా గడిచింది?

కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు; కొన్ని సంతోషాలు, కొన్ని దుహ్ఖాలు;

కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు; కొంత ఆరోగ్యం, కొంత అనారోగ్యం.


సరే. దేశానికెలా  గడిచింది?

లంచగొండితనం రాక్షస విహారం చేసింది. ధరల పెరుగుదల పారాకష్ట చేరింది.

రాజకీయాల్లో - అవినీతి మాత్రమే కాదు, తెలివిమాలిన తనం, కుల,మత రాజకీయాలు, 2011 లో ఎన్నో యింతలు పెరిగింది.

వొక బలిష్టమైన, సమర్థ వంతమైన, నిష్పాక్షికమైన    లోక్ పాల్ తీసుకురండని ప్రజల పక్షాన అన్నా హజారే గారు కోరితే - అందుకు, ప్రజలు, విపక్షాలు వారిని సమర్థిస్తే - చివరికి, రాజకీయ చదరంగంలోని - అన్ని రకాల చాణక్య నీతులూ ఉపయోగించి - ప్రభుత్వం - అది రాకుండా చేసింది. ముందేం జరుగుతుందో తెలీదు.  లోక్ పాల్ వస్తుందా, రాదా? గత 60 సంవత్సరాలలో - ఎందుకు రాలేదో  మాత్రం - చాలా స్పష్టంగా తెలిసి పోయింది.

అంతకు ముందు - అదే బాణీలో, బాబా రాం దేవ్ గారు - నల్ల ధనం గురించి చేపట్టిన ఆందోళన కూడా చాలా గొప్పదే. కాని - ప్రభుత్వం వారు, చేపట్టిన అర్దరాత్రి దాడి వలన - అది వీగిపోయింది.

మహాభారత యుద్ధం తర్వాత నిద్ర పోతున్న వీరుల పై అశ్వత్థామ  దాడి చేసి - వారిని చంపాడట.   ఆ పాపానికి - అప్పటి నుండి, యిప్పటి వరకు, కలియుగాంతం వరకు అశ్వత్థామ శిక్ష అనుభవిస్తూ వుంటాడట . నాకు మాత్రం - ఈసంఘటన తలుచుకుంటే - అదే జ్ఞాపకం వచ్చింది.

కాని - ప్రజలలో - రావాల్సిన స్పందన రాలేదు. రాందేవ్ గారు, పైనుండి క్రిందికి దూకాడట. ఎవరో ఆయన  శిష్యులిచ్చిన   చుడీదార్  వేసుకున్నాడట. నిద్ర నుండి లేచిన ఆ క్షణంలో  జరిగిన ఆ చిన్న చర్యను రకరకాలుగా ప్రభుత్వం వారు చెప్పుకున్నారు గానీ, ప్రజలూ దాన్ని విన్నారు గానీ -  ప్రభుత్వం నిర్వహించిన అమానుష చర్యను ఖండించాల్సినంతగా   ఖండించలేదనే  చెప్పాలి.

నా ఉద్దేశంలో - మన దేశానికి పట్టిన వొక రాక్షసి నల్ల ధనం. మరొకటి, దాని చెల్లెలు లంచగొండి తనం. రాం దేవ్ గారు మొదటి నుండి, మన దేశస్తుల నల్ల ధనం విదేశీ బాంకుల్లో  మూలుగుతోందనీ   - అది తీసుకు రాగలిగితే - మనం దేశం సుసంపన్నంగా వుంటుందనీ   -  చెప్పారు. కానీ - అది వెనక్కు తీసుకు రావడంలో - ప్రభుత్వానికి ఎంత మాత్రం - చిత్త శుద్ధి లేదని తెలుస్తూనే వుంది. ఎన్నో దేశాలు చేస్తున్న ఆ పని - మనం మాత్రం చేయడం లేదు. ఎందుకు? ఎందుకు?

అయితే - ప్రజల మనస్తత్వం విచిత్రమైనది. పక్కింటి వాడిని, రౌడీలో, పోలీసులో - కొడుతూ వుంటే - చంపేస్తే కూడా మనకేమీ పట్టనట్టు ఊరుకునే తత్వం   పెరిగిపోయింది మనకు. అది పోవాలి.

ప్రజల కంటే - టీం అన్నా సభ్యులు కూడా - రాం దేవ్ జీ గారిని - ప్రక్కన బెట్టడం - నాలుగెద్దులు, సింహం కథ లాగా వుంది. తరువాత - అదే పంథాను మళ్ళీ ప్రభుత్వం టీం అన్నా పై కూడా  ప్రయోగించాలని చూసింది.

కానీ - విపక్షాలూ, ప్రజలు, టీం అన్న సభ్యులూ బాగా మేల్కొనడంతో - చేయలేక పోయింది.

యూ.పీ.ఏ -1 ప్రభుత్వం దేశాన్ని నిజంగా,  అభ్యుదయ పంథాలో తీసుకెళ్ళిన  మాట   వాస్తవం. మరి అదే  యూ.పీ.ఏ -2  ప్రభుత్వం  - ఎందుకిలా ప్రవర్తిస్తోందో   అస్సలు తెలియడం లేదు.  ప్రధాని మన్మోహన్  సింగు గారు  యిప్పుడైన మేల్కొనాలి. వారిదైన - నిజాయితీ తో - ప్రభుత్వం నడపాలి. చెప్పుడు మాటలు పక్కన బెట్టి - మహాత్మా గాంధీ గారి పద్దతిలో - దేశాన్ని ముందుకు నడిపించాలి. తన పేరు చెడి పోతోందని, దేశం వక్ర మార్గాన్ని పట్టిందని - ఆయన అర్థం చేసుకోవాలి.

దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా - అస్తవ్యస్తం గా అయిపోతోంది. దేశ పాలనలో - తప్పులు చేయడమే -తమ వుద్యోగమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యిది చాలదన్నట్టు, ధరల పెరుగుదలను అరికట్టుతానంటూ -  రిజ ర్వు బ్యాంకి వారు - యిష్టం వచ్చినట్టు - వడ్డీ రెట్లు పెంచి - పారిశ్రామిక పెరుగుదలను పూర్తిగా తగ్గించేసింది. ప్రభుత్వం వారు ధరల తరుగుదలకు చేయవలసిన ఏ పనీ చేయలేదు.   దీనితో - కుక్క అరవాల్సిన చోట -గాడిద అరిచి దెబ్బలు తిన్న చందం అయిపోయింది. ధరలు తగ్గలేదు. అభివృద్ధి పడిపోయింది.

ఎవరు చెప్పినా - ఆర్.బీ.ఐ. పట్టించుకోవడం లేదు.

సరే. ఈ దెబ్బలతో - స్టాక్ మార్కెట్ - ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. ఎన్నో, గొప్ప లాభాలు గడిస్తున్న కంపెనీల ధరలు కూడా -     ఎప్పుడూ లేనంతగా పడిపోయాయి.

అమెరికాలో - నిరుద్యోగుల సంఖ్య 6 %  దాటితే - వారు పెద్ద గోల పెట్టేస్తున్నారు. దానికి, ఎన్నో రకాల ప్రయత్నాలు, ప్లాన్లు అమలు చేస్తున్నారు. మన దేశంలో - నిరుద్యోగుల సంఖ్య ఎంత? చిరుద్యోగుల సంఖ్య ఎంత?

గణాంకాలే లేవు. మరి ప్లాన్లు ఎక్కడి  నుండి వస్తాయి? ఇంజనీరింగ్ చదివి నిరుద్యోగులు గానూ, చిరుద్యోగులు గానూ - వున్న వారిని ఎంతో మందిని నేను చూస్తున్నాను. అయిదు వేల రూపాయలు కూడా మాస వేతనం లేని , పట్ట భద్రులయిన నర్సులను, పది వేల జీతంతో పని చేస్తున్న డాక్టర్లను  చూస్తున్నాము.

ఈ పధ్ధతి మారేది ఎప్పుడు? అసలు యిది ఎవరు పట్టించుకుంటారు, ఎప్పుడు?

యిది చాలదన్నట్టు - రీటైల్ ఆర్ధిక వ్యవస్థలో - వాల్ మార్ట్ లాంటి విదేశీ కంపెనీలను తీసుకు రావాలని ప్రభుత్వం రకరకాల వాదనలు చేస్తోంది. తెచ్చేస్తానని బెదిరిస్తోంది. మన దేశంలో, వ్యవసాయం తరువాత - ఉపాధి కల్పన ఎక్కువగా వున్న మొదటి రంగం రీటైల్ వ్యవస్థ. అందులో - దాదాపు ఆరుకోట్ల మంది వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నిస్సందేహంగా, వీరిలో - అసమర్థత, వుంది. లేదని కాదు. అదే అసమర్థత అన్ని రంగాల్లోనూ - వుంది. దాన్ని సవరించడానికి బదులు - వారి స్థానంలో - విదేశీ సంస్థలను తెస్తాననడం - ఏ మాత్రం న్యాయంగా లేదు. ప్రభుత్వ   రంగంలో - నికరంగా - వొక్క ఉద్యోగమూ సృష్టించ లేని ప్రభుత్వం, ఏకంగా, కోట్ల వుపాధులపై వేటు వేయ బూనడం,  చాలా ప్రమాద కరమైన విషయం. దీని వల్ల వ్యవసాయ దారులకు, వాడకం దారులకు మేలు జరుగుతుందట. అది తప్పని వాల్ మార్ట్ పుట్టిన దేశంలోనే మనకు తెలుస్తూ వుంది.

వొక వేళ రైటే అయినా  - మధ్య వాడిని చంపేస్తే, వాడి అన్నకూ, తమ్ముడికీ ఆస్తి ఎక్కువగా వస్తుంది - అన్న వాదనలాగా వుంది, యిది.  మరి, మధ్య వాళ్ళ నందరినీ చంపేద్దామా?

ప్రక్కనింటి   వాడి పెళ్ళాం కు ముక్కు బాగుందని -స్వంత పెళ్ళాం కు విడాకులిచ్చేసి - ఆవిడను పెళ్లి చేసుకున్నాడట. తరువాత తెలిసింది - ఆవిడ ముక్కు బాగుందని; మెదడు మాత్రం సరి లేదని.  ఇలాంటి పిచ్చి పనులు యిప్పుడు చాలా చూస్తున్నాము.

సరే. ప్రభుత్వం మారాలంటే - మనం చాలా మారాలి.

2012  లో  ప్రభుత్వం తీరు మారుతుందని - ఆశిద్దాము. నాకు మాన్ మోహన్ సింగు గారిపై - చిన్న ఆశ యింకా వుంది.

యింట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మనం 2012 లో యింట గెలవాలి. యింట్లోని   అందరి మనసులనూ గెలవాలి. ప్రతి యింట్లోనూ - ప్రేమ, అభిమానం, సంతోషం, ఆదరణ చాలా, చాలా పెరగాలి. అహంకారము, కక్షలు, కార్పణ్యాలు పూర్తిగా పోవాలి.

పొరుగు వాడితో సఖ్యత పెరగాలి. పెరగాలంటే - పొరుగు వాడిపై నమ్మకం పెరిగేటట్లు - అందరం ప్రవర్తించాలి.  పొరుగు వాడి కష్టంలో - అడగకుండా మనమే సహాయం అందించే మనస్తత్వం పెరగాలి.

మన దేశంలో - దరిద్రమూ వుంది. మధ్య వర్గమూ వుంది. ధనిక వర్గమూ వుంది. దేశంలోని - అందరు బీద పిల్లలకూ - చదువూ, తిండీ -లోటు లేకుండా చేయడానికి మన వంతు సహాయం మనం ప్రతి వొక్కరూ చెయ్యాలి.  ఏదో వొక శరణాలయానికి, మీ వంతు సహాయం మీరు తప్ప కుండా చెయ్యండి. మీకు తెలుసు. మనం వెళ్ళేటప్పుడు మనతో, వచ్చేది ఈ మంచి (చెడు) పనుల ఫలితం మాత్రమే. యిచ్చేటప్పుడు వున్న సంతృప్తి, మరెప్పుడూ వుండదు.

ఈ కాలంలో -మరో జాడ్యం ప్రబలి పోతోంది. వొక ప్రక్క వయసయిన తల్లి తండ్రులను గమనించడం లేదు. మరో వైపు పిల్లలనూ గమనించడం లేదు. తల్లి దండ్రులపై గౌరవం పెరగాలి. పిల్లలపై ప్రేమ పెరగాలి. యిది రెండూ - సామాజిక వ్యవస్థకు పునాదులు. ఈ పునాదులు కూలిపోతే - మొత్తం వ్యవస్థే కూలిపోతుంది.

నా ఉద్దేశంలో - ఆడ వాళ్లకు - మెట్టినింటిపై   - గౌరవం, మమకారం క్రమక్రమంగా సడలి పోతోంది.  దీనికి - ఎన్నో కారణాలు. వచ్చిన కోడలిపై ప్రేమ చూపక పోవడం వొక కారణం. మరో వైపు, వచ్చే కోడళ్ళకి కూడా, పెద్ద వారిపై ఏ మాత్రము గౌరవం లేక పోవడం మరో కారణం. మన వ్యవస్థను కూల్చేసే చట్టాలు - మరో కారణం. ముఖ్య కారణం, ఆడవారిలో - సహనం బాగా తగ్గి పోతోంది. ప్రేమాభిమానాల స్థానంలో - అహంకారం పెరుగుతోంది. మా చిన్న తనంలో చెప్పే వారు - మగ వాడు చెడితే - వాడు మాత్రమే చెడతాడు; ఆడది చెడితే - ఊరంతా చెడుతుందని.

మన వ్యవస్థలో - ఆడ వాళ్ళకున్నంత గౌరవం - మరెక్కడా లేదు. ఆ గౌరవం తరగరాదు. అదే సమయంలో - ఆడవాళ్ళు - యింటికీ, దేశానికి చెడ్డపేరు తీసుకు రారాదు. ఈ మధ్య కొన్ని చోట్ల కొంత మంది ఆడ వారు, స్లట్ వాక్  అని - మా యిష్టం వచ్చినట్టు, మేము దుస్తులు వేసుకుంటాం, మా యిష్టం వచ్చినట్టు - మేము రోడ్లపై నడుస్తాం - అని ప్రదర్శనలు యిచ్చారు. యింత కంటే మూర్ఖత్వం మరోటి లేదు.  యిలా జరుగుతూ, జరుగుతూ, యిప్పుడు అమెరికా లాంటి దేశాలలో - పరిస్థితి ఏమిటంటే - వొకరిపై వొకరికి ఆకర్షణ పూర్తిగా పోయి, మగ వారిని మగవారు; ఆడవారిని ఆడవారు పెళ్లి చేసుకునే  స్థితికి వచ్చేసింది. యిప్పుడిప్పుడు, మన దేశంలో కూడా, యిది పెరుగుతూ వుంది. ఈ పరిస్థితి మారాలి. ఆడవారిలో - ఎంతో మంది మేధావులున్నారు. వారు, యిటువంటి వాటిని మార్చడానికి పూనుకోవాలి.

సరే. ఈ పరిస్థితికి కారణం 50  శాతం  మగవారిలో చోటు చేసుకున్న - విశ్రుంఖలత్వం  అని చెప్పక తప్పదు. నీకొక రూలు, నాకొక రూలు - అని మగ వాళ్ళు ప్రవర్తించడం మానాలి. రామాయణమంతా -  అదే చెబుతుంది.

మగ వారిలో - భార్యా పిల్లల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన చోటు చేసుకోవాలి. మనం మారుతామా? 2012  లో మనం మారాలి.

2012  వ సంవత్సరానికి -కొన్ని ప్రత్యేకతలు వున్నాయని అంటారు.

ప్రపంచం ఏదో అయిపోతుందని - మాయన్ సంస్కృతి వారు వేల  ఏండ్ల క్రిందట రాసి పడేసారు. డిసెంబర్, 21 వ తేదీ నాడు, ఆ తేదీ దగ్గర - ఏదో అయిపోతుందని - వొక నమ్మకం. మిగతా ప్రత్యేకతలు, మరో సారి మాట్లాడదాం.

అయితే, గియితే - ఏం పరవాలేదు. మనమంతా, వొక్క సారి ఎక్కడికి వెళ్ళినా - మంచిదే. ఎక్కడికి వెళ్ళితే - అదే మన ప్రపంచం అయిపోతుంది. దాన్ని గురించి వచ్చే వదంతులను ప్రక్కన పెట్టండి.

దేశమును ప్రేమించుమన్నా ; మంచి అన్నది పెంచుమన్నా -అన్నది ఆర్యోక్తి.

కుల, మత, ప్రాంతీయ, భాషా విభేదాలను ప్రక్కన పెట్టి -మనమంతా వొక్క కుటుంబమే , మనమంతా సహోదరులమే. ప్రేమైక జీవులమే - అని గ్రహించి - మన యింటిని, ఊరినీ, దేశాన్ని - నందన వనం చేద్దాం.   

= మీ

వుప్పలధడియం విజయమోహన్

23, డిసెంబర్ 2011, శుక్రవారం

నన్ను చేరడానికి నాలుగు మార్గాలు? నీవెవరో తెలుసుకో?

ఆంగ్లంలో వొక నానుడి వుంది.

  • ఆయనకు తెలుసు. తనకు తెలుసుననీ ఆయనకు తెలుసు. ఆయన విజ్ఞుడు. మనం ఆయనను అనుసరిద్దాం.
  • మరొకాయనకు తెలుసు. కానీ, తనకు తెలుసునని ఆయనకు తెలీదు. ఆయన వొక రకమైన నిద్రలో వున్నాడు. తన జ్ఞానాన్ని వుపయోగించ లేని స్థితిలో వున్నాడు. ఆయనను నిద్ర లేపుదాం.
  • యింకొకాయనకు   తెలీదు. కానీ, తనకు తెలీదనే సంగతి ఆయనకు తెలుసు. ఆయన నేర్చుకో గలిగే స్థితిలో వున్నాడు.ఆయన విజ్ఞుడి దగ్గరకు వెళ్లి నేర్చుకోవాలి.
  • మరొకాయనకు తెలీదు. కానీ, తనకు తెలీదనే విషయం కూడా ఆయనకు తెలీదు. తనకు తెలుసనే భ్రమ లో ఉన్నాడు. తెలిసినట్టు ఏదేదో వాగుతున్నాడు. అటువంటి వారి చాయలకు కూడా వెళ్ళకండి.  వారు చాలా ప్రమాద కరమైన వ్యక్తులు.
యిలా నాలుగు రకాల మనుషుల గురించి ఈ నానుడి వుంది. ఏ విషయానికైనా - ఈ నాలుగు రకాల మనుషులూ వుంటారు.

క్షుణ్ణంగా తెలుసుకొని, అధ్యయనం చేసి, ఉపయోగిస్తున్న వారు విజ్ఞులు. వారు, తమ విజ్ఞత వలన తాము  ప్రయోజనం పొందుతున్నారు.  అందువలన, అటువంటి వారి వద్దకు మనమూ వెళ్లి, వారి విజ్ఞతను మనమూ పొందచ్చు.

మరి కొంత మందికి - కొన్ని విద్యలు వారికి తెలుసు. కాని, అవి తమకు తెలుసునన్న విషయమే వారు మర్చి పోయారు. హనుమంతుడు సర్వ విద్యా సంపన్నుడు. కాని - ఎవరైనా ఆయనకు చెప్పాలి. అప్పుడే అవన్నీ ఆయనకు  గుర్తుకు వస్తుంది.

కొంత మందికి కనీసం తమకు తెలీదన్న విషయం తమకు తెలుసు. వ్యాధి వస్తే, వైద్యుడి దగ్గరకు వెళ్లాలని, చదువుకోసం స్కూలుకెళ్ళాలని, వొక్కొక్క పని కోసం - ఆ పనిలో నిష్ణాతులైన వారి వద్దకు వెళ్లాలని - మనకు తెలుసు. మనకు  తెలీని విషయాలు నిజంగా తెలిసిన వారి దగ్గర నేర్చుకోవాలి.
కానీ - కొంత మంది - సరైన సమయానికి - సరైన వారి వద్దకు వెళ్ళకుండా కాలయాపన చేయడం, చిక్కుల్లో పడడం మనం చూస్తూనే ఉన్నాము. వీరు నాలుగో రకం మనుషులు. తమకు తెలీదు. తెలీదనే విషయం కూడా తెలీదు.  అంతే కాదు.తెలీని విషయం తెలిసినట్టు భ్రమలో వుండటమే కాకుండా - మిగతా వారికి ఉచిత సలహాలు యివ్వడము,  తాము చిక్కుల్లో పడడము, చుట్టూ వున్న వారిని చిక్కుల్లో పెట్టడము ఎన్నో సార్లు - అన్ని రంగాల్లో మనం చూస్తున్నాము. 

మనకు క్షుణ్ణంగా  తెలిసిందేది? తెలీనిది ఏది? యిదైనా మనకు తెలిసుండాలి.

మీకు రెండు చేతులున్నాయి. అది మీకు స్పష్టం గా తెలుసు. దానికి నమ్మకంతో మరి పని లేదు. నాకు రెండు చేతులున్నాయని నేను నమ్ముతున్నాను - అని మీరు చెబితే అది హాస్యాస్పదం. మీకు తెలీని విషయానికే   నమ్మకమో, అప నమ్మకమో కావాల్సి వస్తుంది.

మీ ముత్తాత గారెవరో మీరు చూడలేదు. మీ నాన్నగారికి వారి నాన్న గారు చెబుతుండగా, వారు విని మీకు చెబితే- వోహో, ఔనేమో - అని మీరు  అనుకున్నారు. అది మీకు తెలిసిన విషయం కాదు; మీరు నమ్మే విషయం. తెలిసిన విషయం వేరు. నమ్మే విషయం వేరు. తెలిసిన విషయాన్ని నమ్మాల్సిన పని లేదు. తెలీని విషయాన్నే - మనం నమ్మొచ్చు. లేదా, నమ్మక పోవచ్చు. తెలిసిన విషయం తెలిసిన విషయమే. దానికి నమ్మకం అక్కర లేదు.

దేవుడు వొక నమ్మకం. ఆత్మ వొక నమ్మకం.  శివుడు, స్వర్గం, నరకం, శని, డెవిల్, ఇంద్రుడు, ఏంజెల్, అల్లా యివి నమ్మకాలు. మనం చూడలేదు.  నిజంగా వున్నాయో, లేదో తెలీదు. ఏదో పుస్తకాల్లో రాసున్నాయి. మీరొక పుస్తకం నమ్మొచ్చు. నేనొక పుస్తకం నమ్మొచ్చు. మరొకరు మరొక పుస్తకం నమ్మొచ్చు.

ఈ గ్రంధాలతో వచ్చిన చిక్కు ఏమిటంటే - మీరు నమ్మాలి. నమ్మి తీరాలి. అవేం చెప్పినా, ఎంత నమ్మలేని మాట చెప్పినా - మీరు నమ్మి తీరాలి. లేకుంటే - మీకు స్వర్గం లేదు. లేకపోతె మానె. మీరెంత మంచి వారైనా - మీకు నరకం తప్పదు. యిలా చెప్పే గ్రంధాలెన్నో వున్నాయి. కొన్ని కొన్ని దేశాలలో - మేమంతా స్వర్గానికి పోతున్నాము. మీ మాటేమిటి? అనే పెద్ద బోర్డులు  కనిపిస్తాయట .

ఎవరి పిచ్చి వారికానందం. కాకపొతే - వారి వారి పుస్తకాల్లో వున్నది నమ్మి, పొరుగువారితో యుద్ధానికి దిగుతున్నారు.  నమ్మకం పరమైన యుద్ధాలు - స్వార్థ పరమైన యుద్ధాల కంటే - చాలా ఎక్కువ.అదీ ప్రస్తుత కాలంలో. యిది చాలా దురదృష్టం.

మన దేశంలో కూడా - దేవుడు, స్వర్గము వీటిపై నమ్మకాలు వున్నాయి. అయితే - ఈ పరిధిని, మన ధర్మ శాస్త్రాలు ఎప్పుడో దాటేసాయి. యివి లేవని శాస్త్రాలు చెప్పడం లేదు. అయితే - మంచి వాడెవడైనా - స్వర్గానికి అర్హుడే అన్నది సిద్దాంతం. మీకు దేవుడిపై నమ్మకం వున్నదా, లేదా అన్నది అక్కర లేని ప్రశ్న.

మంచి వాడి మార్గాన్ని కర్మ మార్గం లేదా కర్మ యోగం అన్నారు. వీడు దేవుడిని నమ్మక పోయినా ఫరవా లేదు. మన దేశంలో - దేవుడిని నమ్మని చార్వాకులు, జాబాలి లాంటి ఋషులు కూడా వుండేవారు. ప్రపంచం లోని  - అన్ని రకాల నమ్మకాలూ - మన దేశంలో - ప్రతి యుగంలోనూ వుండేవి. వీరికీ - అంటే, వీరిలోని మంచి వారికి - స్వర్గ ద్వారాలు తెరిచే వుంటాయి.

దేవుడిని నమ్మే మంచివారిది - భక్తి మార్గం అన్నారు. ప్రహ్లాదుడిది దాదాపుగా భక్తి మార్గమనే చెప్పొచ్చు.  శబరి, గోపికలు, హనుమంతుడు -ఇలాంటి భక్తులు - అప్పుడూ వున్నారు. యిప్పుడూ వున్నారు. భక్తి కాస్త జ్ఞానంతో కూడిన భక్తీ కావచ్చు. కన్నప్ప లాంటి వారి మూఢ భక్తీ కావచ్చు. వీరికి స్వర్గ ద్వారాలు మరింతగా తెరిచి వుంటాయి. "యిందు గలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే" అంటాడు ప్రహ్లాదుడు. దేవుడు లేని యిసుక రేణువు కూడా ప్రపంచంలో లేదని చెబుతాడు. అయితే - భక్తుల విషయంలో వారిది నమ్మకమా - నిజంగా వారికి తెలుసా - అని మనం చెప్పలేం. మొదట నమ్మకంగా వుండొచ్చు. కొంత మందికి అది నిజంగా కూడా మారొచ్చు.

ప్రహ్లాదుడు - దేవుడు, అన్ని చోట్లా వున్నాడన్నాడు.

కాని కొంత మంది - దేవుడు ఎక్కడో, స్వర్గంలోనో, వైకుంఠం లోనో, కైలాసంలోనో - వున్నాడనుకుంటారు.  ఏది నిజం? తెలీదు. అన్నీ నమ్మకాలే. మీరు చూడగలిగితే, విన గలిగితే, అనుభవించ గలిగితే - మీకు అది అనుభవైక సత్యం. లేకుంటే - వుట్టి నమ్మకం.

మీరు విష్ణు భక్తులను కోండి . మీరు చచ్చాక - మిమ్మల్ని కైలాసం తీసుకు వెళ్ళారనుకోండి ? పైకెళ్లినా -   మీ వేదన సులభంగా పోదు. మళ్ళీ - ఆయన చెప్పాలి. ఆయనా, నేనూ వేరే కాదు. వొకటే. వూరికే యిప్పుడు ఫ్రెండ్సు గా వున్నాం. అంతే - అని.  నమ్మకాలలో - యిటువంటి - అపనమ్మకాలకు చాలా చోటుంది. భక్తిలో పూర్తి నమ్మకం వుండేది - కొద్ది మందికే.

చాలా మందికి  భక్తి - స్వర్గ ద్వారానికి వెళ్ళే, వొక అపనమ్మకాలతో నిండిన, మార్గం మాత్రమే.  దేవుడిని మనం చూడలేదు. కొన్ని గ్రంధాలలో వ్రాసిన కథలలో హీరో గారే దేవుడు. మనకు తెలిసిందల్లా అంతే. కాని - భూమ్మీద జరిగేవన్నీ చూస్తుంటే - వొక్కో సారి - అపనమ్మకం ఎక్కువై - దేవుడిపై నమ్మకం సన్నగిల్లుతుంది. జీవితమంతా- నమ్మకాలు, అపనమ్మకాల మధ్య గడిచిపోతుంది - చాలా మందికి.

మరొక మార్గం  జ్ఞాన మార్గం. దేవుడున్నాడు - కానీ, నాలోనే వున్నాడు. నేనే ఆ దేవుడిని - నా అజ్ఞానం తొలిగితే నేనే దేవుడిగా మారిపోతాను - అన్నది జ్ఞాన మార్గం. యిది కాస్త మోటుగా చెప్పాము. మరి కాస్త నిశితంగా అర్థం చేసుకోవాల్సి వుంది.
నేనెవరు? - అన్నది మన ధర్మ శాస్త్రాలలో మొదటి ప్రశ్న.    నేనెవరు - అన్నది తెలియకుండా - మరేదీ క్షుణ్ణంగా, తెలుసుకోలేరు. దేవుడి సంగతి దేవుడెరుగు. మొదట నేనెవరో కూడా నాకు తెలీకుండా వుందే-  అన్న మధన కొంత మందిలో వుంటుంది. దీనికి సమాధానం జ్ఞాన మార్గం. మొదట మీరెవరో తెలుసుకోండి.

అవి తెలుసుకునే మార్గంలో - దేవుడి లాంటి మరెన్నో విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు.స్వర్గం వుంటే - ఆ స్వర్గానికి వెళ్ళేదెవరు? నా దేహం భూమిపైనే వుండి పోతోంది కదా? మరి నేను - అనే ఆ నేను ఎవరు? స్వర్గం మాట తరువాత చూద్దాం. నేనెవరో తెలుసుకోవాలి ముందు - అన్నది జ్ఞాన మార్గం.

చాలా దేశ  సంస్కృతులలో  కర్మ మార్గం వుంది. భక్తి మార్గం వుంది. కానీ, నాకు తెలిసినంత వరకు - జ్ఞానం మార్గం భారత దేశం లో మాత్రమే వుంది. అదీ - అతి పురాతన కాలం నుండీ వుంది. వేదాలు, ఉపనిషత్తుల కాలం నుండీ వుంది.

వేదాలలో "నేనెవరు" అన్న దాన్ని గురించి మనకు తెలియజేసే "మహావాక్యాలు"  చాలా వున్నా  - వాటిలో ప్రముఖంగా నాలుగిటిని చెబుతాము.

  • ప్రజ్ఞానం బ్రహ్మ - (ఋగ్వేదం - ఐతరేయ బ్రాహ్మణం) :- దీనికి అర్థం గొప్ప జ్ఞానమే బ్రహ్మ అని. బ్రహ్మ లేదా దేవుడు అంటే - మరేం లేదు - ప్రజ్ఞానమే, విశిష్టమైన జ్ఞానమే  -  బ్రహ్మ. 
  • అహం బ్రహ్మ అస్మి - నేనే  బ్రహ్మ గా వున్నాను. (యజుర్వేదము - బృహదారణ్యక) :- బ్రహ్మ అయినటువంటి ఆ ప్రజ్ఞానం మరేదో కాదు. అది నేనే.
  •  తత్ త్వం అసి :- (సామ వేద - ఛాందోగ్యం) :- ఆ బ్రహ్మ మరెవరో కాదు. అది నేను గానే వున్నాను. అది నేనే.
  • అయం  ఆత్మా బ్రహ్మ (అథర్వణం - మాండూక్య) ;- ఆత్మ నైన నేనే బ్రహ్మను.
నాలుగు వేదాలూ - ఘోషించే మహావాక్యాలివి. యివి నిజమా? కాదా?

మరి నేనే బ్రహ్మ నైతే - నేనెందుకిలా వున్నాను.  జీవితమంతా ఏదో తప్పులు చేస్తున్నాను. నవ్వుతాను. ఏడుస్తాను. సంపాదిస్తాను.ఖర్చు పెడతాను. పుడతాను. చస్తాను. నేనెలా బ్రహ్మ నౌతాను. నా భార్య ఎలా బ్రహ్మ అవుతుంది. బ్రహ్మ నైన నాతో ఎప్పుడూ గొడవ పడుతుంది కదా?  ఎప్పుడూ, కొట్టుకు చచ్చే మేము యిద్దరూ - బ్రహ్మలం ఎలా అవుతాం. మరి ఎంత మంది బ్రహ్మ లున్నారు? వారి స్వరూపమేమిటి?

బ్రహ్మ అన్నా బ్రహ్మము అన్నా వొక్కటే. బ్రహ్మమొక్కటే - అని అన్నమాచార్యుల వారు గళమెత్తి పాడారు.  బ్రహ్మమొక్కటే - అన్నది వేద ఘోష. ఉపనిషద్ ఘోష. పురాణాలు, ఇతిహాసాలూ అదే చెబుతుంది.

మరి ఈ బ్రహ్మము ఎలా వుంటుంది?

బ్రహ్మ స్వరూపాన్ని గురించి  యిలా అన్నారు  - "సత్, చిత్, ఆనందం" బ్రహ్మ స్వరూపం.

సత్ అంటే సత్యమైనది. ఎప్పుడూ వుండేది. ఆద్యంత రహితమైనది. మార్పు లేనిది. అది ఎవరో కాదు. అది నేనే (నువ్వే).

చిత్ - అంటే జ్ఞానం. ప్రజ్ఞానం అని వేదంలో చెప్పబడిన బ్రహ్మ ప్రజ్ఞానమే. దీన్ని ఆంగ్లంలో కాన్షస్ నెస్ - అన్నారు. ఈ ప్రజ్ఞానమే - ప్రపంచమంతటా, అణువణువులోనూ, వుంది. మనలోనూ వుంది.

ఆనందం - అంటే -దుహ్ఖరాహిత్యం అని చెప్పొచ్చు. నిజానికి, ఈ మూడు పదాలకూ సరి అయిన పదాలు, తెలుగులో కానీ, ఆంగ్లం లో కాని లేవని చెప్పచ్చు.

అయినా - నేను ఎవరు అని తెలుగులో మనం చెప్పాలంటే - ఆద్యంత రహితుడైన, నిత్య సత్యమైన (సత్), ప్రజ్ఞానమైన (చిత్), ఆనందమైన (ఆనందం) - అనంతుడైన వాడిని నేను.  ఆ నేనే బ్రహ్మ లేదా బ్రహ్మము.

అన్ని చోట్లా నేనే వుంటే -మరి నీవెక్కడ వున్నావు. నీవూ, బ్రహ్మమే. నీవూ,నేనూ రెండూ బ్రహ్మమే. అంటే - నీవూ,నేనూ వేరు కాదు. వొకడే.

మరెందుకు తిట్టుకుంటున్నాము?కొట్టుకుంటున్నాము? ప్రజ్ఞానాన్ని - అజ్ఞానం కమ్మేసింది. అందువలన. ఆ అజ్ఞానాన్నే మాయ - అన్నాము. ఎందుకలా? అదే సృష్టి విచిత్రం. అదెలా తెలుస్తుంది? నేనెవరో, అనుభవ పూర్వకంగా తెలిస్తే - సృష్టి విచిత్రమంతా తెలిసిపోతుంది. అజ్ఞానం పోతే - ప్రజ్ఞానం. నేనెవరో తెలిస్తే - మిగతా అంతా తెలిసే ఆవకాశం   వచ్చేస్తుంది.

కానీ - ఆ అజ్ఞానం నుండి మనం ఎలా బయట పడగలం? అజ్ఞానం నుండి బయట పడిన - జ్ఞానులున్నారు. వారిని గురువులుగా అంగీకరించండి. వారి వద్ద మీకు ఈ జ్ఞానం పూర్తిగా లభిస్తుంది. జ్ఞానం వచ్చిన వెంటనే - అజ్ఞానం తొలగిపోతుంది.

ప్రజ్ఞానం కలుగదు - ప్రజ్ఞానం మీరే అని తెలిసిపోతుంది. దీపం చుట్టూ మసి వుంది. దీపం దేదీప్యమానంగా వెలిగినా వెలుగు కనిపించడం లేదు. మసి వలన. మసి కడిగితే - వెలుగు తెలుస్తుంది. కానీ - ఆ తెలిసే వెలుగు ఎప్పుడూ వుంది. యిప్పుడు మసి పోయింది. అంతే. ప్రజ్ఞానం ఎప్పుడూ వుంది. అజ్ఞానం కమ్మితే,  మాయలో, సృష్టిలో మునిగి పోతాం. సుఖ దుహ్ఖాల ప్రవాహాలలో కొట్టుకుపోతూ వుంటాము.

అజ్ఞానం తొలిగితే - సృష్టి నడుస్తూ వుంటుంది. కాని నేను మాత్రం - ప్రజ్ఞానం గా, సత్,చిత్, ఆనందంగా వుండిపోతాను. మరి దేవుడున్నాడా? వున్నాడు. అది నేనే. శివుడు? అదీ నేనే? విష్ణువు? అదీ నేనే? నేను? అదీ నేనే?నీవు? అదీ నేనే? సర్వం బ్రహ్మ మయం. బ్రహ్మము తప్ప మరేమీ లేదు. మాయ? అదీ బ్రహ్మస్వరూపమే. మరి మాయ నన్ను ఆవరించడమేమిటి ? నేనూ బ్రహ్మమే. మయా బ్రహ్మమే - అయినప్పుడు? అది తెలియాలంటేనే - జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే - గురువు దగ్గర కెళ్ళాలి.   యిది ఎన్నాళ్ళ చదువు? అది మీ అక్కరను బట్టి. వొక రోజు కావచ్చు. వొక సంవత్సరం కావచ్చు. వొక జన్మ కావచ్చు. ఎన్ని జన్మలైనా కావచ్చు.

అబ్బా. అయితే వద్దులే. మరేదైనా, సులభ మార్గం చెప్పండి.

సులభమో కాదో కాని - మరొక మార్గం వుంది. దాన్ని ధ్యాన మార్గం అన్నారు. శ్రీకృష్ణుడు దాన్ని ధ్యాన యోగం అన్నాడు. పతంజలి మహర్షి - అష్టాంగ యోగం, క్రియాయోగం అన్నారు.

అందులో - ఎనిమిది భాగాలు, లేదా మెట్లు వున్నాయి.అంటే - వొక దాని తర్వాత వొకటి ఎక్కాలి. వొకే సారి, ఎనిమిదో మెట్టుకు , లేదా ఆరో మెట్టుకు యెక్క లేము. అలా ప్రయత్నం చేస్తే, ఎక్కినట్టే ఎక్కి జారి మళ్ళీ క్రిందికి వచ్చేస్తాము.

ఆ మెట్లేమిటో  - పతంజలి గారే - టూకీగా చెప్పారు. అది మరింత టూకీగా - యిక్కడ పేర్లు మాత్రం యిస్తున్నాను.

(1 ) యమ :ఈ మెట్టులో 5  భాగాలున్నాయి. (1) అహింస (2)సత్య వ్రతము (3)అస్తేయం (దొంగతనం ఎటువంటిదీ  చేయకుండడం )   (4 ) బ్రహ్మచర్యం (5 ) అపరిగ్రహం : వీటికి, క్రింద వాటికీ కూడా  వివరణ మీరు నా ఆంగ్ల బ్లాగు వైజ్ స్పిరిచువల్ ఐడియాస్.బ్లాగ్ స్పాట్ . కాం లో చదవచ్చు.

(2 )  నియమ : ఈ మెట్టులో 5  భాగాలున్నాయి. (1) శౌచము (2) సంతోషము (3 )తపము (4 )స్వాధ్యాయము (5 ) ఈశ్వర ప్రణిధానము  :యిక్కడ ఈశ్వరుడు,అంటే శివుడు కాదు. పతంజలి గారు ఆ పదానికి వొక విశేష నిర్వచనం యిచ్చారు.

(3 ) ఆసనం :మీకు తెలుసు - ఆసనాలు ఎన్ని రకాలో. అయితే పతంజలి గారు - స్థిరంగా , సుఖంగా  కూర్చోగలిగేదే ఆసనం అన్నారు.

(4 ) ప్రాణాయామం :దీన్లోనూ రకరకాలున్నాయి.

(5 ) ప్రత్యాహారం : యిప్పుడు యింద్రియాల్ని  అంతర్ ముఖం చేయాలి. 

(6 ) ధారణ  : మనస్సును ఏదో వొక విషయం పై యిప్పుడు స్థిరంగా నిలపాలి.  అదెలాంటి   వస్తువైతే ధారణకు మంచిదో మనకు తెలియాలి.

(7 ) ధ్యానం : ఆ వస్తువు పై - ఏకాగ్ర చిత్తమైతే అప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది.

(8 ) సమాధి : ధ్యానం లో - మరేమీ వుండక, ధ్యాన వస్తు స్వరూపం   మాత్రం మిగిలితే - అది సమాధి అవుతుంది. మళ్ళీ అందులో -అంచెలంచెలుగా  నిర్వికల్ప ధ్యానం వద్దకు వెళ్ళిపోతారు. అప్పుడు -  మీకు స్వరూప దర్శనం అవుతుంది. అప్పుడు, అక్కడ వున్నది మీరే. అప్పుడు తెలుస్తుంది మీరెవరో.  మీరు సత్,చిత్,ఆనందం -గా మిగిలిపోతారు.

మీరెవరో తెలిసాక - మీ మిగతా ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం తెలిసిపోతుంది. అప్పుడు నమ్మకాలు పనిలేదు. ప్రశ్నలు అక్కర లేదు. సమాధానాలు అక్కర లేదు. స్వర్గం, నరకం, దేవుడు, వేదం, దేనితోనూ పని లేదు.

జ్ఞాన మార్గం లోనూ ఇవేవీ పని లేదు. ధ్యాన మార్గం లోనూ ఇవేవీ పని లేదు.  ధ్యాన మార్గం కూడా మరే సంస్కృతిలోనూ చెప్పబడలేదు.

ధ్యాన మార్గం వొక నిశ్చితమైన, అడుగడుగుగా ముందుకు వెళ్ళే మార్గం. యిక్కడ, మీకు   పెద్దగా నమ్మకాలతో పని లేదు. వొక్కొక్క మెట్టు ఎక్కే సరికి -మీలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అవి మీకు అపారమైన నమ్మకం కలుగ జేస్తాయి. అయితే వచ్చే అద్భుత శక్తులే - మన ఆశక్తతగా , మన బలహీనతగా, మనమే మార్చుకుని, ఆ మెట్టు వద్దే వుండి పోయే ప్రమాదం చాలా వుంది. అక్కడి నుండి క్రింది మెట్టుకు జారే ప్రమాదమూ ఉంది. అలా చేయకుంటే - కైవల్యం చేరడం - నిశ్చయం.

శ్రీ కృష్ణుడు - భగవద్గీతలో - ఈ నాలుగు మార్గాలూ, నాలుగు రకాల మనుషుల కోసం చెప్పాడు. అన్నింటిలోనూ - మనిషి భగవంతుడిని చేరగలడని చెప్పాడు. భారత సంస్కృతిలో -జ్ఞాన, ధ్యాన మార్గాలు విశిష్టం.   యివి - మరే సంస్కృతిలోనూ మనకు అంతగా కనిపించవు. యివన్నీ ఎప్పటి నుండీ వున్నాయి. సృష్ట్యాది నుండీ వున్నాయి. యివి ఏ మతానికీ సంబంధించినవి కావు. యిదొక గొప్ప విజ్ఞానం - అందుకునే వారికి లభిస్తుంది.

నన్ను చేరడానికి ముందు నిన్ను నువ్వు తెలుసుకో - అనడం - ఎంత బాగుంది!

16, డిసెంబర్ 2011, శుక్రవారం

పరంజలి యోగ సూత్రాలు = 2.36 = సత్యానికి బలం ఎంత? మీకు తెలుసా? = యోగి వాక్కు బ్రహ్మ వాక్కు =జరిగి తీరుతుంది

పరంజలి యోగ సూత్రాలు 
2.36  =  సత్య ప్రతిష్ట 

గత రెండు మూడు నెలలుగా - నా బ్ల్లాగు - వైజ్ స్పిరిచువల్ ఐడియాస్.కాం లో -   పతంజలి యోగ సూత్రాలకు, ఆంగ్లంలో వ్యాఖ్యానము రాస్తున్నాను.  అది రాయడానికి, స్వామీ వివేకానందా, స్వామీ గురుపరానందా, స్వామీ శివానందా,  ఓషో లాంటి  వారి  వ్యాఖ్యానాలూ పరిశీలించి , గీతలోని ధ్యాన యోగాన్నీ పరిశీలించి ఆకళింపు చేసుకునే రాస్తున్నాను.

ఎన్నో ఏళ్ళుగా రక రకాల ధ్యాన ప్రక్రియలు పాటిస్తున్నా - యిది రాసేటప్పుడు - నేను చేస్తున్న పొరబాట్లను సరిదిద్దుకోవడానికి  ఎంతో ఉపయోగంగా వుంది.

కొన్ని, కొన్ని విషయాలు చదివితేనే చాలు. మనం చేసేస్తామని అనిపిస్తుంది.

కొన్ని కొన్ని విషయాలు పతంజలి మహర్షి చెప్పినవి - మహాత్ములు వ్యాఖ్యానించినవి  -  చాలా ఆనంద పరుస్తుంది.

అందులో మచ్చుకు వొక్కటి క్రింద ఉదాహరిస్తున్నాను.

సాధన పాదంలో -36 వ సూత్రంలో యిలా చెప్ప బడింది.

సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం.

దీనికి వివేకానందుల   వారి వ్యాఖ్యానం ప్రకారం - సత్యంలో నెలకొని వుండటం వల్ల యోగి (తన కొరకూ, యితరుల కొరకూ కూడా) కర్మలను చేయకుండానే కర్మ ఫలాలను పొందే శక్తి సంపన్నుడౌతాడు.

యిలాగే, స్వామి గురుపరానందా, తదితరులు కూడా సత్య నిష్ఠ తో వున్న యోగి వాక్మహిమ ను గురించి చాలా చెప్పారు.  

యోగి ఏమన్నా - దీవించినా, శపించినా -  అది జరిగి పోతుంది.యోగి సాధారణంగా శపించడు.   ఆయనకు కష్టం కలిగిస్తే చాలు. ఆయన ఏమీ అనక పోయినా - కలిగించిన వాడికి వినాశనం తప్పదు. ఆయన ఆజ్ఞా పాలన చేయడానికి, ఆయన మనస్సుననుసరించి  నడవడానికి -   ప్రకృతి సంతోషంతో కాచుకుని వుంటుంది.

భారత సంస్కృతిలో - యిది అందరికీ తెలుసు. ఏ యోగి మన వూరికి వచ్చినా - సాధారణంగా - అందరూ వెళ్లి - వారి ఆశీర్వచనం తీసుకోవడం మనం చూడొచ్చు.  ముఖ్యంగా చిన్న పిల్లలను వారి పాదాలకు నమస్కరింప చేసి - ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వుంది.

అసలు సాయి బాబా లాంటి - పరమపదించిన యోగుల శిలా విగ్రహాలపై కూడా - పసిపాపలను పడుకోబెట్టి ఆయన ఆశీర్వాదము, అనుగ్రహమూ కోరుకొనే  వారు ఎందరో వున్నారు.

ఏసుక్రీస్తు - అడగండి. మీకు యివ్వ బడుతుంది - అన్నారు. అయితే - ఎవరిని అడగాలి. ఎం అడగాలి అన్నది ముఖ్యం. ఎదురుగా వున్న దైవ స్వరూపులు, సత్య స్వరూపులు యోగులు. వారిని అడగండి. ముఖ్యంగా వారి ఆశీర్వాదం అడగండి.

యోగి అంటే, ముక్కు మూసుకుని కూర్చొన్న వారు మాత్రమే కాదు. కొద్దో, గొప్పో, సత్య నిష్ఠ వున్న వాళ్ళందరికీ - ఈ ఆశీర్వాద బలం వుంటుంది. సత్య నిష్ఠ వున్నవారందరూ యోగ సాధకులే. అటువంటి సత్య సాధకులు మీ వూళ్ళో, మీ ఎదురుగా కూడా వుండొచ్చు . వారి వారి సత్య నిష్టను బట్టి, వారి వారి ఆశీర్వాద బలం వుంటుంది.

ఈ కాలంలో కూడా - చాలా మంది యోగుల వెనుక కోట్ల కొద్ది శిష్యులు వుండటం మనం చూడొచ్చు. వారికి గురువులు ఏం ఇస్తున్నారు? రెండు మంచి మాటలు. హృదయ పూర్వక ఆశీర్వాదమూ.  అంతే. వాటితోనే - వారి మనస్సులో - మహదానందం నింప గల శక్తి ఆ యోగుల మాటల్లో వుంది.

కానీ - అటువంటి కొంత మంది యోగుల పై అసత్య ఆరోపణలు చెయ్యడం, వారిపై కేసులు బనాయించడం, వారిని జైలుకు పంపించిన సంఘటనలూ   జరిగాయి కొన్ని. వాటిని పరిశీలిస్తే - అవి చేసిన వారిపై -ప్రకృతి ఎంత తీవ్రంగా స్పందించిందో   - మనకు అర్థమౌతుంది. ఎంతో ఆర్ధిక, రాజకీయ, ఉద్యోగ   బలాలు అన్నీ వున్న వారిగా కనిపించిన వారు డిస్మిస్ కావడమూ, వారి కుటుంబాలు అనారోగ్యాల   పాలు కావడము, వారు అర్ధాంతరంగా చని పోవడము - మరి కొంత మంది వేరే ఎన్నో కేసుల్లో చిక్కుకోవడం లాంటివన్నీ చాలా జరిగాయి. 

కానీ ఆ యోగుల జీవితంలో జైల్లో వున్నా మార్పు రాలేదు.  వారు వీరిని తిట్టడమో, దూషించడమో  జరుగలేదు. వారిపై వచ్చే ప్రతి అభియోగానికీ - ప్రకృతి స్పందించడం చాలా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది.  కానీ - యిది ఎప్పటికైనా వారికి అర్థం అవుతుందా - అంటే - ఏమో. యిటువంటివి వచ్చినప్పుడు - మనం అప్పుడు చేసిన ఆ కర్మకు - యిది, యిప్పుడు  ఫలితం  అని తెలియడం విజ్నులకే గానీ అజ్నులకు సాధ్యం కాదు.

యిక ముందు కాస్త నిశితంగా చూడండి. యోగులకు చెడ్డ చేసే వారిపై ప్రకృతి ఎలా స్పందిస్తుందో?

అయినా - యోగులను గౌరవిస్తే, వారి ఆశీర్వాదం, వారి సలహా స్వీకరిస్తే - మేలు జరుగడం మాత్రం ఖాయం. 
 మనం వారి సత్-ప్రయత్నాలకు చేదోడుగా ఏదైనా చేస్తే - యింకా మంచిది. దీన్ని పంచ మహా యజ్ఞాలలో - రుషి యజ్ఞం అంటారు. రుషి యజ్ఞానికి ఫలితం చాలా గొప్పది.

ఈ మేలు - మీకు, ఎలా, ఎప్పుడు జరుగుతుంది? - అదీ విజ్నులకే తెలుస్తుంది. కానీ మీకు మేలు జరగడం ఖాయం. యిది పతంజలి చెప్పారు. శ్రీ కృష్ణుడు చెప్పారు. వేదాలు, వుపనిషిత్తులు, పురాణాలు, ఇతిహాసాలు - అన్నిటిలో చెప్పబడిన అంశం యిది.

మనం చేయవలసిన, సులభంగా చేయదగిన పని - యోగులను గురువుగా అనుకోవడం. వీలైనప్పుడు, వారి సన్నిధికి వెళ్లి వారి ఆశీర్వాదం స్వీకరించడం, వారి మహత్-ప్రయత్నాలకు మనం చేయ గలిగిన సహాయం చేయడం.

యింతకు మించి ఏమైనా చేయ గలరా? గలరు! మీరే సత్య నిష్టా పరులు అవడానికి ప్రయత్నించండి. మీరే యోగ విద్య అభ్యసించండి. అదేమంత   కష్టమైన విషయం కాదు.

బురద నుండి బయటకు వచ్చి మనల్ని మనం కడుక్కున్నట్టు వుంటుంది.  అంతే.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

వివరణ : యోగులకు కష్టం కలిగించే వారికి ప్రకృతి దండన విధిస్తుంది. అది సరే. మరి యోగులకు కష్టాలెందుకు? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. యోగులకు కష్టాలేమీ  లేవు. కానీ ప్రతి సాధనకూ - అప్పుడప్పుడూ - శోధన (పరీక్ష) వుంటుంది. ఆ శోధన యోగి మనః శక్తిని పెంచడానికే. అది మామూలే. ఆ శోధన యోగికీ తెలుసు. 

రమణ మహర్షి గారికి రాచపుండు వచ్చింది. ఆయనేం బాధ పడ లేదు. ఆయనకు తెలుసు. వొక్కొక్క శోధనతో, యోగి వొక్కొక్క మెట్టు పైకి వెళ్ళుతుంటాడు. 

హరిశ్చంద్రుడికి వచ్చిందీ శోధనే కాని కష్టం కాదు. హరిశ్చంద్రుడు కష్టం అని - ఈ విశ్వామిత్రుడేమిటి - యిలా చేస్తున్నాడే అంటే చాలు -   ప్రకృతంతా అంతటి విశ్వామిత్రుడిపైన విరుచుకు పడేది. కాని ఆయన అలా అనుకోలేదు. అదంతా - తన సత్యవ్రతానికి వచ్చిన శోధన అనుకున్నాడు.  లేదంటే - ఆయన మానవుడుగా వున్నా - బ్రహ్మ సభలో చర్చనీయుడయ్యే వాడా? 

శోధన అని తెలిసున్న యోగికి కష్టాలంటూ ఏం లేవు. వారి మనసులో - ఎప్పుడూ - ఆనందమే.

12, డిసెంబర్ 2011, సోమవారం

లోక్ పాల్ గోల = నిరశన వ్రతాలకు చక్కటి సమాధానం మౌన వ్రతం.=

ప్రహ్లాద్ జాని గారికీ, అన్నా హజారే గారికీ, మనకూ వున్నా తేడా ఏమిటంటే - అందరికీ తెలుసు.

ప్రహ్లాద్ జానీ గారు దాదాపు అరవై డెబ్భై ఏళ్ళుగా ఏమీ త్రాగడం లేదట. తినడం లేదట.  ఆయన ఏమీ తినకుండా, త్రాగకుండా, చేయకుండా ఎందుకున్నారో - అస్సలు ఎందుకుండాలో ,  ఆయనకే అంతు పట్టడం లేదు. యిప్పు డాయనను  ఎవరూ పట్టించుకోవడం లేదు.  లోక్ పాల్ బిల్లు కోసం - ఆయన నిరశన వ్రతం చేస్తే ఎలా వుంటుందో తెలీదు.  వొక వేళ చేస్తే, ఆ నిరశన వ్రతాన్ని ఆయన ఎప్పుడు, ఎలా వదిలి పెడతాడో - అదీ తెలీదు.

కానీ - అన్నా హజారే గారికి మాత్రం - అలసట వచ్చేస్తుంది. పోటీ తట్టుకోలేరు. మన్మోహన్ సింగు  గారితో తో పోటీ పడొచ్చు గానీ ప్రహ్లాద్ జానీ తో పోటీ పడ లేము. 

ఎంతటి, రాజా లాంటి వారి లంచగొండి తనమైనా మనం భరించ గలమేమో కానీ - భరిస్తున్నాము కదా - యిలా దినాల కొద్దీ, వారాల కొద్దీ, నెలల కొద్దీ నిరశన వ్రతాలు చేయడం మాత్రం మన వల్ల కాదు.

అది అన్నా గారికే వదిలేద్దాం. ఆయనకు అలవాటయ్యింది ఆయన చేయ నీయండి. మనకు తెలిసింది, చాతయ్యింది మనం చేద్దాం.  టీం అన్నా సభ్యులందరూ నిజానికి అదే చేస్తున్నారు. అన్నాజీ, నిరశన వ్రతం మీరు చేయండి. మాట్లాడడం మేము చేస్తాము - అని పనులు పంచుకున్నారు.

యిదేదో బాగానే వుంది. బంగారపు తట్టలలో భోంచేసినా - గనులలో ఏం మేసినా - చివరకు, జైళ్ళలో భోం చేయ వలసింది - గాలే కదా.  అది అలవాటున్న వారు చేయడమే మంచిది.

లంచగొండి తనం పోతుందా - లేదా? ఎలా పోతుంది. ఎప్పుడు పోతుంది?

లోక్ పాల్ వస్తారా - లేదా? ఏ రూపంలో వస్తారు? వచ్చి ఏం చేస్తారు? దేశాన్ని వుద్ధరిస్తారా? కాంగ్రెసును, డీ.ఏం. కే. ను వుద్ధరిస్తారా? ప్రతి పక్షాలను వుద్ధరిస్తారా? లంచ గొండులను   జైళ్ళలో పెట్టాలంటే -  ఎన్ని జైళ్ళు కావాలి?  వాళ్ళ, వాళ్ళ ఇళ్ళే   -  వాళ్లకు జైళ్ళు గా మారిస్తే పోలా? రాజా గారు ఏమంటారో?

లోక్ పాల్ గా ఎవరొస్తారు. కాంగ్రెస్ లో   చేరితే, గీరితే, ఎంచక్కా జగత్తునంతా మోహింప చేస్తూ - మన జగన్ గారు కూడా రావచ్చు. లేక పొతే - ఏ కరుణానిధి గారో, వారి అనుచరులో రావాల్సిందే. కొయాలిషన్   రాజకీయాలంటే   మాటలా.  వారొస్తే -  విపక్షాలలో వున్న లంచగొండి తనమంతా కడిగేస్తారు.

రచ్చ గెలిచామంటే -  యింట గెలవకున్నా ఏం మునిగి పోదు.  విపక్షాల రచ్చ గెలిస్తే చాలు.

కరుణానిధి గారు అర్జెంటుగా ప్రెసిడెంటుగా అయిపోతే - ఎలా వుంటుంది? జయలలితా గారు ఏం చేసినా - ఆయనను ఏమీ చేయలేరు కదా. ఏ లోక్ పాల్ వచ్చినా - ఏం భయం లేదు. యివన్నీ - కొన్ని ఊహలు మాత్రమే. సలహాలు కాదు.

కిరణ్ కుమార్ రెడ్డిగారు  ఎన్నో చేస్తున్నారు. చిరంజీవి గారు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అవకాశం యిప్పుడో, అప్పుడో వచ్చేస్తుంది. బాబు గారు మాత్రం - పథకాలు వేస్తున్నారు. కలలు చాలా కంటున్నారు. వయసయిన తర్వాత ఎలాంటి కలలు వస్తాయి? అవి నిజమవుతాయా?

రోశయ్య గారికి ఆరోగ్యం బాగాలేక సి.యం పదవి విడిచేసారు. కానీ -  గవర్నరు పదవికి అదేమీ పెద్ద అడ్డంకు కాదు. ఆయనకు - వద్దన్నా పదవులన్నీ వస్తున్నాయి. వడ్డించే వాళ్ళు మన వాళ్ళయితే అంతే మరి.

తెలంగాణా వచ్చేసినట్టు కల. చాలా మందికి. అది రామరాజ్యం లా, రామారావు రాజ్యంలా వున్నట్టు కొంత మందికి కల. కే.సి.ఆర్. గారు అప్పుడూ  ఏదేదో అర్థం లేకుండా మాట్లాడేస్తున్నారు.  తిట్టేస్తున్నారు. అలవాటుగా. కానీ, యిదంతా కలే. కలలో మాటే. నిజమూ అంతే ననుకోండి.

మన్మోహన్ సింగు గారు ఏమీ మాట్లాడడం లేదు. ఎప్పటి లాగే. నిరశన వ్రతాలకు చక్కటి సమాధానం మౌన వ్రతం. ఆయన ఆర్ధిక శాస్త్రం మరిచి పోయారు. రాజకీయ శాస్త్రం తెలీదు. హంస నడక మరిచిపోయే. కాకి నడక రాక పోయె. సోనియా గారికి ఎమోచ్చో ఎవరికీ తెలీదు. కాని చక్రం తిప్పగలరు. అది తిరిగితే.

దేశంలో - చిదంబర రహస్యాలెక్కువై పోయాయి. బురదలో చెయ్యి పెడితే మట్టి అంటుకోదా . ఈ బురద కడుక్కోవడం చాలా కష్టంగానే వుంది చిదంబరం గారికి. కడిగే కొద్దీ కొత్త బురద చల్లుతున్నారు.

శరద్ పవార్ గారిని ఫెళ్ళున చెంప దెబ్బ కొట్టాడట వొకాయన.  సగటు మనిషి కోపమే నేను చూపించాను - అన్నాడట. కూరగాయలు, తినే వస్తువుల ధరలన్నీ పెరిగినా - దాన్ని గురించి ఆయనకు  కొంత కూడా చింత లేదు. కారణం - ఆయనకు క్రికెట్ బోర్డు పై, మిగతా స్పోర్ట్సు బోర్డులపై   చాలా సరదా. మరి స్పోర్ట్సు మినిస్టరు గారికి అవంటే - పట్టదు.  అటు ఆటలూ పోయె. యిటు ఆహార పదార్థాలూ, వాటి వెలలూ  ఆకాశానికి  వెళ్లి పోయె. యివన్నీ కొయాలిషన్ రాజకీయాలు మరి. మన్మోహన్ సింగు గారు అలా చూస్తూ వుందా వలసిందే.

మిగతా వాళ్ళు ఎప్పటి లాగే - వర లక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారు. ఏంతొస్తే  అంత రానీ. మరో ఎలెక్షనొస్తే లక్ష్మి ఎవరి పక్కో ఎవరికి తెలుసు? పీత బాధ పీతది.  సీత బాధ సీతది. ఎవరి బాధ వాళ్ళది. రేపటి సంగతి ఎవరు చూసొచ్చారు? లోక్ పాల్ గానీ వచ్చేస్తే?

= మీ

వుప్పలధడియం విజయమోహన్