20, ఫిబ్రవరి 2017, సోమవారం

భగవద్ గీత (9) - సాంఖ్య యోగము - 2.18,19 - దేహి, దేహము ,వీటిలో మీ కేంద్రం యిప్పుడు ఎక్కడ - ఎందుకు యుద్ధం ?



 

భగవద్ గీత (9)


  

 రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం

యిదవ వ్యాసంలో శ్రీకృష్ణుడి మొదటి ఉపదేశ శ్లోకం చూశాం.  పోయిన  వారి కోసమైనా, వున్న వారి కోసమైనా జ్ఞాని అయిన వాడు దుఃఖించ రాదని శ్రీకృష్ణుడు చెప్పాడు.  శ్రేయస్ అంటే శాశ్వతమైన సుఖాలు, ప్రేయస్ అంటే అశాశ్వతమైన, భౌతిక సుఖాలు అన్నది తెలుసుకున్నాం. అలాగే, మనిషి కోరదగిన రెండు వరాలు  ఏమిటో కూడా తెలుసుకున్నాం.

ఆరవ వ్యాసంలో - మనకెవరికీ ఎప్పుడూ మరణం లేదు, మనం లేని సమయమంటూ  ఎప్పుడూ లేదు - అని శ్రీకృష్ణుడు అన్నాడు. మన దేహాలు మాత్రం, సమయానుసారం, మరణించి, పంచ భూతాలలో కలిసిపోతాయి. మనం అప్పుడు మరో శరీరాన్ని వెదుక్కుంటూ వెళ్లి శరీరాన్ని  ధరిస్తాము  - అని చెప్పాడు. 

ఏడవ వ్యాసంలో - యింద్రియాలు తమ తమ సంబంధిత వస్తువుల స్పర్శ వలన, మనకు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు కలిగిస్తున్నాయి.వన్నీ వస్తూ, పోతూ వుండే, అశాశ్వతమైన విషయాలు. వీటిని నువ్వు భరించక తప్పదు. వచ్చే సుఖాన్నీ, దుఃఖాన్నీ, రెండింటినీ  సమానంగా  తీసుకుంటూ వుండే వాడికి, అవి ఎవరినైతే బాధించవో అటువంటి వాడికి - చావు, పుట్టుకలు లేని అమృతత్వానికి  అర్హత వస్తుంది- అన్నాడు శ్రీకృష్ణుడు

ఎనిమిదవ వ్యాసంలో "సత్యం కానిది ఎప్పుడూ వుండింది లేదు. సత్య మైనది ఎప్పుడూ లేకుండా లేదు. అది విశ్వమంతటా  వ్యాపించి వున్నది. దాన్ని   నాశనం చేయగల సమర్థులు ఈ విశ్వములో ఎవరూ లేరు" అని శ్రీకృష్ణుడు అన్నాడు


ప్పుడు, సత్యమైన దానికీ(దేహికీ), అనిత్యమైన దేహాలకూ  గల సంబంధాన్ని వివరిస్తున్నాడు. 

 శ్రీకృష్ణుడి మాట :

"అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః  | 
నాసినోప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ  భారత  ||  (2. 18)

అంతవంతః = అంతం/నాశనము వున్నవి; ఇమే  దేహాహ్ = ఈ శరీరాలు ; నిత్యస్య = శాశ్వతమని; ఉక్తాహ్ = చెప్పబడిన; శరీరిణః =  శరీరములో నివసించి యున్న దేహి ; నాసినః = నాశనము లేనటువంటి ;  అప్రమేయస్య = కొలవలేనటువంటి(కొలతలే లేనటువంటి) ; తస్మాత్ = అందువలన ; యుద్ధస్వ = యుద్ధం చెయ్యి ; భారత = ఓ అర్జున!

"ఓ అర్జునా ! దేహాలలో నివసించియున్న దేహి (ఆత్మ) ఆద్యంతాలు లేనిది, వినాశమే లేనటువంటిది, కొలవలేనటువంటిది, విశ్వమంతా వ్యాపించి యున్నది. కానీ దేహి నివసించి వున్న అన్ని దేహాలూ అంతం వున్నవే సుమా.  కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి."

ప్పుడు శ్రీకృష్ణుడు దేహానికి, దేహంలో నివసించి యున్న దేహికీ, అంటే - ఆత్మ స్వరూపుడైన నిజమైన నీకు వున్న సంబంధము, వ్యత్యాసము రెండింటినీ వివరిస్తున్నాడు. 

ఈ యోధులందరూ, దేహాలని నీవనుకుంటూ వుంటే , ఈ దేహాలు ఎలాగైనా నాశనమయ్యేవే, చనిపోయేవే - అని తెలుసుకో. ఇంతకు ముందే చెప్పను కదా - చనిపోయిన దేహాలను వదిలి, దేహి మరో క్రొత్త శరీరాన్ని  వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడున్న దేహం యొక్క చావూ తథ్యమే. క్రొత్త దేహంతో మళ్ళీ పుట్టడమూ తథ్యమే.  

దేహానికి చావు తథ్యం. దేహికి చావు ఎప్పుడూ లేదు. నువ్వు చంపక పోయినా, ఈ దేహాలు చావక తప్పదు. కాబట్టి నీ క్షత్రియ ధర్మమైన యీ ధర్మ యుద్ధం చెయ్యి. 

మరణించిన దేహంలో వున్న దేహి, ఎలాగూ దేహాన్ని వదలి, మరో దేహాన్ని వెదుక్కుంటూ  వెళ్ళిపోతాడు. అవినాశి అయిన,  మరణమే లేనటువంటి దేహిని గురించి నువ్వు చింత పడాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు. 

పుట్టుక, పెరుగుదల, చావు, కోరికలు, ధర్మాధర్మాలు అన్నీ ఈ దేహానికే. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ధర్మ యుద్ధం గనుక, అది నీ ధర్మం గనుక, నువ్వు యుద్ధం చెయ్యాలి.   మరి దేహిని నువ్వు చంపగలవా? ఎలాగూ చంప లేవు - అంటున్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడి మాట : 

 "య యేనం వేత్తి హన్తారం  యశ్చైనం మన్యతే హతం | 
ఉభౌ  తౌ  న విజానీతో నాయం హంతి న హన్యతే      || (2. 19) 

యః = ఎవరైతే ; ఏనం = దీన్ని (దేహిని / ఆత్మను) ; వేత్తి = తెలిసిన వాడు;  హన్తారం = చంపెడి వాడు;  యః - ఎవరైతే ; చ = మరియు ; ఏనం = దీన్ని ; మన్యతే = అనుకుంటున్నాడో ; హతం = చంపబడ్డదని; ఉభౌ = వారిరువురూ ; తౌ = వాళ్ళు;  న = కాదు / లేదు ; విజానీతః = తెలిసివుండుట ; న = కాదు / లేదు ; అయం = యిది ; హంతి = చంపుట;  న = కాదు / లేదు ; హన్యతే = చంపబడుట ; 

"ఎవరైతే దేహి/ఆత్మ చంపుతుందనుకుంటాడో, లేదా, చనిపోతుంద నుకుంటాడో వారిద్దరూ మూర్ఖులే, అజ్ఞానులే. దేహి / ఆత్మ చావదు, చంపదు, చంపబడదు."

ఆత్మనే దేహి అన్నాడు శ్రీకృష్ణుడు. అది చావదు, చంపదు. చంపబడదు. అది చస్తుందనో, చంపబడుతుందనో అనుకునే వారు అజ్ఞానులు. దానికి చావు లేదు. అది చంపనూ లేదు. చావు పుట్టుకలకు  అతీతమైనది అది. శ్రీకృష్ణుడు దీని స్వరూపాన్ని మరింత చక్కగా వివరించబోతున్నాడు   ముందు, ముందు.  ఒక్క మాటలో చెబితే చాలదా ? చాలదు. ఇదే ఆత్మదర్శన విజ్ఞానము. ఇది పూర్తిగా, సందేహాతీతంగా, సుస్పష్టంగా,  మనసు లోతులకు దిగిపోవాలి. అక్కడినుండే అంతర్దృష్టి  ఆరంభమవుతుంది, కావాలి.  అవుతుందా? చూద్దాం 
  
 ఆట కదరా శివా, ఆట కద కేశవా -  అనే అద్భుతమైన పాట  మీరు వినే  వుంటారు. అంతర్దృష్టి లేనంత వరకు, యీ  ఆట మనకర్థం కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలతో సతమతమై పోతూ జీవితమనే సుడిగుండంలో   మునుగుతూ,తేలుతూ వుంటాము.  

అంతర్దృష్టి  వుంటే, మన కేంద్రం బాహ్య ప్రపంచం నుండి మన శరీరానికి, శరీరం నుండి మనస్సుకు, మనస్సు నుండి బుద్ధికి, బుద్ధి నుండి నిజమైన మనకు, దేన్నైతే శ్రీకృష్ణుడు 'దేహి' అన్నాడో ఆ ఆత్మస్వరూపుడికి, వెళ్లి స్థిరపడి పోతుంది. మన కేంద్రం 'దేహి' అయితే, బాహ్య ప్రపంచంలో మనం ఏ ఆట ఆడినా బాగానే ఆడుతాము. అందులో, మనకు ఏ సమస్యా రాదు. కామమూ, క్రోధము, భయము  లాంటి అంతః శత్రువులు మనలను ఏమీ చెయ్యలేవు.  కానీ చాలా మందికి యిప్పుడు, వారి కేంద్రం బాహ్య ప్రపంచం గా  వుంది. కొందరికి తమ శరీరం గానూ , కొందరికి  మనస్సు గానూ, కొందరికి బుద్ధిగానూ వుంది. పూర్తిగా - నేను 'దేహి'ని, చిదానంద స్వరూపుడిని అని చెప్పగలిగేవారు ఎవరో ?

 ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది

సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    
ఉప్పలధడియం   విజయమోహన్ 
పద్మాసనం




16, ఫిబ్రవరి 2017, గురువారం

భగవద్ గీత (8) - సాంఖ్య యోగము - 2.16,17 - తత్వ దర్శనము - సత్, అసత్, నిజం, అబద్ధం యివి ఏమిటి?


 

భగవద్ గీత (8)


  

 రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం

యిదవ వ్యాసంలో శ్రీకృష్ణుడి మొట్టమొదటి ఉపదేశ శ్లోకం చూశాం.  పోయిన  వారి కోసమైనా, వున్న వారి కోసమైనా జ్ఞాని అయిన వాడు దుఃఖించ రాదని శ్రీకృష్ణుడు చెప్పాడు.  శ్రేయస్ అంటే శాశ్వతమైన సుఖాలు, ప్రేయస్ అంటే అశాశ్వతమైన, భౌతిక సుఖాలు అన్నది తెలుసుకున్నాం. అలాగే, మనిషి కోరదగిన రెండు వరాలు  ఏమిటో కూడా తెలుసుకున్నాం.
ఆరవ వ్యాసంలో - మనకెవరికీ ఎప్పుడూ మరణం లేదు, మనం లేని సమయమంటూ  ఎప్పుడూ లేదు - అని శ్రీకృష్ణుడు అన్నాడు. మన దేహాలు మాత్రం, సమయానుసారం, మరణించి, పంచ భూతాలలో కలిసిపోతాయి. మనం అప్పుడు మరో శరీరాన్ని వెదుక్కుంటూ వెళ్లి శరీరాన్ని  ధరిస్తాము  - అని చెప్పాడు. 
ఏడవ వ్యాసంలో - యింద్రియాలు తమ తమ సంబంధిత వస్తువుల స్పర్శ వలన, మనకు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు కలిగిస్తున్నాయి.వన్నీ వస్తూ, పోతూ వుండే, అశాశ్వతమైన విషయాలు. వీటిని నువ్వు భరించక తప్పదు. వచ్చే సుఖాన్నీ, దుఃఖాన్నీ, రెండింటినీ  సమానంగా  తీసుకుంటూ వుండే వాడికి, అవి ఎవరినైతే బాధించవో అటువంటి వాడికి - చావు, పుట్టుకలు లేని అమృతత్వానికి  అర్హత వస్తుంది- అన్నాడు శ్రీకృష్ణుడు

ఇప్పుడు శ్రీకృష్ణుడు యింకా ఏం చెబుతాడో చూద్దాం. 
  
శ్రీకృష్ణుడి మాట :
నాసతో  విద్యతే భావో నాభావో విద్యతే సతః   |  
ఉభయోరపి దృష్టాంతస్త్వనయోహ్ తత్వ దర్శిభిః ||  (2.16) 
  న = కాదు / లేదు; అసతః = సత్యం కానిది, మిథ్య; విద్యతే = వున్నది ; భావః = వుండడము; న = కాదు / లేదు; అభావః = లేకుండడము ; విద్యతే = వున్నది; సతః = సత్యమైనది; ఉభయోహ్ = ఈ రెండింటి యొక్క ; అపి = మరియు ; దృష్టాహ్ = చూడబడింది ;అంతః = చివరిది (సత్యము); తు = నిజముగా ; అనయోహ్ = ఈ రెండింటి మధ్యలో ; తత్వ = సత్యాన్ని ; దర్శిభిః = చూడగలిగిన / చూచిన వారు .  
 
"సత్యం కానిది ఎప్పుడూ వుండింది లేదు. సత్య మైనది ఎప్పుడూ లేకుండా లేదు. జ్ఞానులకు ఈ రెండింటి యొక్క సత్యము, వాటి మధ్య  గల తారతమ్యము బాగా తెలుసు . "


తత్వ దర్శనము అంటే - ఈ విశ్వము యొక్క నిజమైన, సత్య స్వరూపాన్ని బాగా చూడగలగడం, తెలుసుకో గలగడం. చాలా నిజాలు మన పంచేంద్రియాలకు పూర్తిగా అందవు. అందుకే, చూసినవన్నీ నిజం కావు, విన్నవన్నీ నిజం కావు, వాటిని, ఎంతో జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాటి నిజాలు బోధపడతాయి. 

మన శరీరానికి బోధ పడే శీతోష్ణాలు, సుఖ,దుఃఖాలు, మన మనసుకు బోధపడే  మానావమానాలు, సంతోష, విచారాలు లాంటివన్నీ శాశ్వతమైన  నిజాలు కావు. ఇవి వస్తుంటాయి; పోతుంటాయి. ఒకరికి సుఖమనిపించేది, మరొకరికి దుఃఖం కావచ్చు. ఒకరికి సంతోషం కలిగించేది, మరొకరికి విచారం కలిగించొచ్చు. ఒకరి శరీరానికి చలి అనిపించేది, మరొకరి శరీరానికి వేడి అనిపించొచ్చు. ఏది నిజం? ఏదైనా, యీ నిముషమున్నది, మరో నిముషానికి మారిపోతుంది, లేకుండా పోతుంది. ఎప్పుడూ మారుతూ వుండేది మిథ్య అన్నారు. ఎప్పుడూ మారకుండా వుండేది మాత్రమే  'సత్యము' అన్నారు. 
మన శరీరం కొన్ని సంవత్సరాలకు ముందు లేదు. ఇప్పుడుంది. కానీ, క్షణ, క్షణమూ, మారుతూ వుంది. అంటే, ఇప్పుడున్న శరీరం, ముందెప్పుడూ లేదు,  యిక ముందూ వుండదు. 
మన మనసూ అంతే. ఈ క్షణంలో వుండే మనసు, యిలా ముందెప్పుడూ లేదు, యిక ముందూ వుండదు. క్షణ క్షణమూ మారుతూ వుంది. వీటినే మిథ్య లేదా అసత్ - అన్నారు. పంచేంద్రియాలకు అందే ప్రపంచమంతా మిథ్యే, అసత్తే.  

మారుతూ వుండే ఈ ప్రపంచమంతటా వ్యాపించి వున్నా, సామాన్యులకు అగోచరమైన సత్య పదార్ధం ఒకటి వుండనే వుంది. అది ఎప్పుడూ ఒకే విధంగా, మార్పు లేకుండా వుంది. 
అది నిత్యం; సత్యం; నిర్వికల్పం; నిరాకారం; నిర్వికారం.  సత్యాన్ని, మిథ్యనూ - రెండింటినీ సుష్పష్టంగా దర్శించ గలిగిన వాడు, అర్థం చేసుకోగలిగిన వాడు - తత్వ దర్శి, జ్ఞాని అని చెప్పబడతాడు .

ఇప్పటి వరకూ యీ నిత్య సత్య పదార్థానికి శ్రీకృష్ణుడు ఏ పేరూ పెట్ట లేదు. ఉపనిషద్వాక్యాలలో - 'తత్  త్వం ఆసి' అన్నారు. ఏదైతే, నువ్వు వెదుకుతున్నావో, అది (ఆ సత్య పదార్ధం) నువ్వే- అని అన్నారు.    'ప్రజ్ఞానాం బ్రహ్మ' - అని కూడా అన్నారు. నువ్వు దాన్ని తెలుసుకుంటే , నువ్వే ఆదిగా వుండి పోతావు. ' అహం బ్రహ్మ అస్మి'  = నేనే సత్య పదార్థమైన బ్రహ్మాన్ని.  'అయం ఆత్మా బ్రహ్మ' = నేనే బ్రహ్మాన్ని ; యిలా సత్య పదార్ధం ఏది అని ఎన్నో రకాలుగా వివరించారు,  వుపనిషత్తులలో . 
మరి అసత్,లేదా మిథ్య అయినది ఏది? అది కూడా వివరించారు.  బ్రహ్మ సత్యం; జగన్మిథ్యా - అన్నారు.  బ్రహ్మం సత్యం. జగత్తు మిథ్య .  ఇక్కడ - అసత్, లేదా మిథ్య  అనే పదాలకు అర్థం - అసలు లేనే లేదని కాదు. ఎప్పుడూ మారుతూ వుంటుంది, కాబట్టి ఒకే విధంగా ఎప్పుడూ వుండదు. సత్ - అంటే ఎప్పుడూ మార్పు లేనిది. అసత్ - అంటే ఎప్పుడూ మారుతూ వుండేది. 
నేను కళ్ళతో చూస్తున్నాను కదా! చెవులతో వింటున్నాను కదా. యిది అసత్ - అంటారేమిటి? 
మీరు చూసారు, విన్నారు - కానీ మరుక్షణం అది ఆదిగా లేదు. అది మరొకటిగా మారిపోయింది.   అందుకని  'అసత్ ' అన్నారు.

దీన్ని మరి కాస్త విశ్లేషిద్దాం. సత్, అసత్ అనేవి వేరు. మనం తెలుగులో చెప్పుకునే నిజం, అబద్ధం వేరు. మనం ఏదో చూశాం లేదా విన్నాం. అది యధాతథంగా మనం చెప్పగలిగితే - అది నిజం అనబడుతుంది.  ఆ నిజం యిప్పుడు లేదు. ఎప్పుడో వుండింది. ఇక ముందెప్పుడూ ఉండదు. మారిపోయింది.  ఇక ముందు వుండబోయేది మరో నిజం అవుతుంది.  దీన్ని వ్యావహారిక సత్యం - అని చెప్పుకోవచ్చు. లేదా, మిథ్య అనీ చెప్పొచ్చు. ఇది అబద్ధం కాదు. అబద్ధం అంటే - అసలు జరగని దాన్ని, అసలు లేని దాన్ని - జరిగినట్టుగా, వున్నట్టుగా కల్పించి చెప్పడం. జగత్తు మిథ్య - అన్నారు. అంటే, ఎప్పుడూ మార్పుచెందేది అని అర్థం చేసుకోవాలి.   దీన్నే, శ్రీకృష్ణుడు  విశదంగా బోధిస్తున్నాడు అర్జునుడికి.
 శ్రీకృష్ణుడి మాట :


" అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం   | 

  వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి   || (2. 17)


  అవినాశి = నాశనం లేనిది; తు = నిజముగా; తత్  = అది ; విద్ధి = (నువ్వు) తెలుసుకో ;  యేన  = ఎవరిచేత;  సర్వం  = అంతయు; యిదం   = యిదంతయూ ; తతం  = వ్యాపించబడి వుంది ; వినాశం = నాశనము ; అవ్యయస్యాస్య  = (నాశనము లేకుండా) ఎల్లప్పుడూ వుండునది ఏదో ; న = కాదు / లేదు; కశ్చిత్ = ఎవరైనా సరే; కర్తృమ్ = చేయుటకు ; అర్హసి  = అర్హుడు; చేయ గలిగిన వాడు. 

"ఈ విశ్వమంతటా  వ్యాపించి వున్న (సత్యమైన ) దేదో, అది ఎల్లప్పుడూ నాశనమే లేకుండా వుంటుంది. దాన్ని   నాశనం చేయగల సమర్థులు ఈ విశ్వములో ఎవరూ లేరు "   

విశ్వము - అని మనం అనేది, మన పంచేంద్రియాలకు అందేది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి - అనే పంచ భూతాలతో కూడింది. యిది కూడా అనంతమే. ఇందులో మనము వుండే భూమి చిన్న గోళమే. అందులో మనమెంత? చాలా, చాలా చిన్న వాళ్ళం కదా . 
ఇలా మనం చెప్పుకునేది, కేవలం, మన శరీరాన్ని గురించి , మనసు గురించి మాత్రమే. నిజమైన నేను - ఈ శరీరము,  మనసు వెనుక, వాటంతటా   దాగి వున్నాను. వాటికి నేను ప్రభువును. అవి నా కోసం పుట్టాయి. పెరిగాయి. నశిస్తున్నాయి. నాకు పుట్టుక, పెరుగుదల, తరుగుదల, మరణము లేదు. 
విశ్వమంతటా, వ్యాపించి వున్న బ్రహ్మ పదార్ధం - పుట్టుక, పెరుగుదల, నాశనము లాంటి ఎలాంటి మార్పులూ లేనిది.  విశ్వమంతటా అది వ్యాపించి వుంటే , నేను వుండే ఈ శరీరం లో కూడా అది వున్నట్టే  కదా ! మరి ఈ శరీరంలో నేనూ వ్యాపించి వున్నా; బ్రహ్మమూ వ్యాపించి  వుంది . అంటే అర్థం ఏమిటి?

 
ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది
సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    
ఉప్పలధడియం   విజయమోహన్ 
పద్మాసనం





15, ఫిబ్రవరి 2017, బుధవారం

భగవద్ గీత (7) - సాంఖ్య యోగము - 2.14,15 - సుఖదుఃఖాలు ఎలా వస్తాయి పోతాయి - చావు, పుట్టుకలు లేని అమృత తత్వానికి అర్హత ఎలా వస్తుంది

 



భగవద్ గీత (7)


  

 రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం

యిదవ వ్యాసంలో శ్రీకృష్ణుడి మొట్టమొదటి ఉపదేశ శ్లోకం చూశాం.  పోయిన  వారి కోసమైనా, వున్న వారి కోసమైనా జ్ఞాని అయిన వాడు దుఃఖించ రాదని శ్రీకృష్ణుడు చెప్పాడు.  శ్రేయస్ అంటే శాశ్వతమైన సుఖాలు, ప్రేయస్ అంటే అశాశ్వతమైన, భౌతిక సుఖాలు అన్నది తెలుసుకున్నాం. అలాగే, మనిషి కోరదగిన రెండు వరాలు  ఏమిటో కూడా తెలుసుకున్నాం.
తరువాత , ఆరవ వ్యాసంలో -
మనకెవరికీ ఎప్పుడూ మరణం లేదు, మనం లేని సమయమంటూ  ఎప్పుడూ లేదు - అని శ్రీకృష్ణుడు అన్నాడు. మన దేహాలు మాత్రం, సమయానుసారం, మరణించి, పంచ భూతాలలో కలిసిపోతాయి. మనం అప్పుడు మరో శరీరాన్ని వెదుక్కుంటూ వెళ్లి శరీరాన్ని  ధరిస్తాము  - అని చెప్పాడు. 
అంటే - నిజమైన నేను  పుట్టడమూ లేదు; మరణించడమూ లేదు. ఏదైనా వొక దేహంలో పుట్టి ప్రపంచాన్ని అనుభవిస్తాను. ఆ దేహం అశాశ్వతం. అది మరణించిన తర్వాత, మరో దేహాన్ని ధరిస్తాను. ఇలా, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం -  జరుగుతూ వుంటుంది అన్నాడు.  

ఇప్పుడు శ్రీకృష్ణుడు యింకా ఏం చెబుతాడో చూద్దాం. 
  
శ్రీకృష్ణుడి మాట :
మాత్రాస్పర్శాహ్ తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ్   |  
ఆగమాపాయినోనిత్యాహ్ తాంస్థితిక్షస్త్వ  భారత           ||  (2.14) 
మాత్రాస్పర్శాహ్ = ఇంద్రియాలు తమ తమ సంబంధిత వస్తువులతో సంపర్కము, లేదా స్పర్శ వలన ; తు = నిజముగా ; కౌంతేయ = ఓ కౌంతేయ (అర్జునా); శీతోష్ణ = చల్లదనము, వేడి అనే  ద్వంద్వాలు; సుఖదుఃఖ =  సుఖము, దుఃఖము అనే ద్వంద్వాలు; దాహ్ = ఇస్తున్నాయి; ఆగమాపాయినః = వచ్చి, పోవునవి లేదా ఆరంభము, ముగింపు రెండూ వున్నవి ; అనిత్యాహ్ = నిత్యమైనవి కావు, ఎల్లప్పుడూ వుండేవి  కావు; తాన్ = అవి, వాటిని; తితిక్షస్వ = (మనం)నువ్వు భరించక తప్పదు ; భారతా = ఓ అర్జునా; 
 
"ఓ అర్జునా! మన యింద్రియాలు తమ తమ సంబంధిత వస్తువుల స్పర్శ వలన, మనకు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు కలిగిస్తున్నాయి.వన్నీ వస్తూ, పోతూ వుండే, అశాశ్వతమైన విషయాలు. వీటిని నువ్వు భరించక తప్పదు. "


కళ్ళు చూస్తాయి. కొన్ని అందంగా, కొన్ని సామాన్యంగా, మరి కొన్ని వికారంగా కనిపిస్తాయి చూసే కళ్ళకు. అలాగే అనిపిస్తుంది కళ్ళ వెనుక నున్న మనసుకు, బుద్ధికి, వాటి వెనుక నున్న నిజమైన నాకు(మనకు)

చెవులకు వినిపించేది కొన్ని బాగుంటుంది. కొన్ని బాగుండవు.  ముక్కు ద్వారా గ్రహించే వాసనలలో, కొన్ని సువాసనలు, కొన్ని దుర్వాసనలు. 

చేతులతో (లేదా చర్మంలోని భాగం తో నైనా) తాకేవి కొన్ని బాగుంటుంది. కొన్ని బాగుండవు. అలాగే, కొన్ని వస్తువులు చల్లగా, కొన్ని సాధారణంగా, కొన్ని వేడిగా వుంటాయి. 

వేసవి కాలం లో ప్రపంచమంతా వేడిగా వున్నట్టు చర్మానికి, చర్మం ద్వారా మనకు తెలుస్తుంది. చలికాలంలో, ప్రపంచమంతా చల్లగా వున్నట్టు  తెలుస్తుంది. ఇవన్నీ యింద్రియాలు తమతమ సంబంధిత వస్తువులను తాకడం వలన మనకు కలిగే అనుభూతులు. శీతోష్ణాలు మనకు తెలిసేది చర్మము వలనకదా. అలాగే మిగతా నాలుగు ఇంద్రియాల వలన మనకు  వివిధ రకాల సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి.  

ఇంద్రియాలు తాకే వస్తువుల వలన మనకు కలిగే అనుభూతులు సుఖ,దుఃఖాలు.  ఎప్పుడో తాకిన వాటి వలన కూడా సుఖదుఃఖాల అనుభూతులు మనసులో యిప్పుడు కలుగవచ్చు. శీతోష్ణాలు కానీ, సుఖదుఃఖాలు కానీ -  వచ్చి వెళ్ళిపొయ్యేవే కానీ, వుండిపొయ్యేవి మాత్రం కాదు. 

చలికాలము వచ్చి వెళ్ళిపోతుంది. ఆ తరువాత, వేసవికాలమూ వచ్చి వెళ్ళిపోతుంది.  రెండూ మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో వెళ్లిపోతాయి.  ఏ ఇంద్రియమూ తానూ తాకిన ఏ పదార్థాన్నీ అలాగే పట్టుకుని  వుండలేదు ; విడిచిపెట్టాల్సిందే. 

మధురమైన గానం - వినేటప్పుడు మాత్రమే; ఆ శబ్దాన్ని చెవ్వు గానీ, మనసు గానీ పట్టుకుని వుండలేదు. కళ్ళతో చూసేవీ అంతే. విడిచిపెట్టాల్సిందే. నాలుకతో రుచి చూసేవీ అంతే. ముక్కుతో పీల్చే వాసనలూ అంతే. చర్మంతో తాకే వస్తువులూ అంతే. 

వాలెంటైన్ దినము వస్తుంది. మీరు గాఢంగా ప్రేమించే వ్యక్తి మీ పక్కనే వున్నారు. ఒక గంట సేపు వాళ్ళను కౌగలించుకుని వుండండి చూద్దాం.  మీ వల్ల కాదు.  పట్టుకున్న ప్రతి వ్యక్తినీ, పదార్థాన్నీ  కొన్ని  నిముషాల తర్వాత విడువక తప్పదు. వచ్చేవన్నీ, పొయ్యేవే. ఒక్కో సారి, వచ్చిన వాటిని విడిచి, మీరు వెళ్ళిపోతారు.  అవి మరి కొన్ని నాళ్ళు, పెట్టిన చోటే వుండిపోతాయి. లేదా, ఎవరు ఎత్తుకు పోతే వారి వెంట వెళ్లిపోతాయి.  లక్ష కోట్ల  రూపాయలు సంపాదించిన వాడు కూడా, దాన్ని పూర్తిగా విడిచిపెట్టి, వెళ్లిపోక తప్పదు.

తెలుగులో ఒక పద్యం వుంది :

దానము, భోగము , నాశము, 
పరగంగా మూఢుగతులె  భువి ధనమునకున్ 
దానము, భోగము నెరుగని  దీనుని 
ధనమునకు గతి తృతీయమె  సుమ్మీ . 

ధనాన్ని సంపాదించిన వాడు - (1) దాన్లో కొంత దానము చెయ్యొచ్చు (2) కొంత తానూ, తన వాళ్ళు కలిసి అనుభవించ వచ్చు ; లేదా (3) అది ఏదో రకంగా నాశనం కావచ్చు, దొంగలెత్తుకు పోవచ్చు, మరెవరైనా బలవంతంగా లాక్కోవచ్చు. 

దానము, భోగము చెయ్యని వాని ధనానికి పట్టే గతి నాశనమే కదా ! ది అక్షరాలా నిజం.  లోభి అయిన వాడి సొత్తు, కడపట దొంగ పాలే. ధనమే కాదు. ఏ పద్దార్థమైనా అంతే.  అంగళ్లలో కూరగాయలు అమ్ముతూ వుంటారు. అవి 3-4 రోజులు నిలువ వుంటాయి. అంతే. వాటిని అంతలోపు అమ్మెయ్యాలి. లేదా, చివరి రోజుల్లో, వుదారంగా తక్కువ వెలకు అమ్మెయ్యాలి, లేదా వూరికే  పేదవారికి ఇచ్చేయ్యాలి . లేదా, వ్యర్థంగా, ఎవరికీ ఉపయోగం లేకుండా  నాశనం అయిపోతాయి.  ఇప్పటి రోజుల్లో వాటికి  యేవో విష పదార్థాలు, మైనము, ప్లాస్టిక్ లాంటివి  పూసి, ఎక్కువ రోజులు నిలువబెడుతున్నారు. వైనా నాశనం కావాల్సిందే; లేదా, తినే మనుషులను నాశనం చేసేస్తాయి. ఏదో రకంగా, మనకు ఏది వచ్చినా, వెళ్లిపోవడానికే వస్తుంది. వున్నప్పుడు, మనం అనుభవించ వచ్చు, దానం చెయ్యవచ్చు, లేదా, నాశనము కావడమో, మరో రకంగా వెళ్లిపోవడమో జరుగుతుంది. 

లా వచ్చిన అన్ని పదార్థాలూ వెళ్లిపోతాయి. వచ్చిన సుఖ,దుఃఖాలూ వెళ్లిపోతాయి. వచ్చిన శీతోష్ణాలూ వెళ్లిపోతాయి. వచ్చిన వ్యక్తులూ వెళ్ళిపోతారు. వచ్చిన మనమూ వెళ్ళిపోతాము. దీనికి చింతించడమెందుకు? ఏడవడమెందుకు?   వీటన్నిటినీ భరించాలి, అనుభవించాలి - అంతే. భరించాలి సరే. ఎలా భరించాలి?


" యం  హి  న వ్యథయన్త్యేతే పురుషం ఫురుషర్షభ   | 

సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ  కల్పతే    || (2. 15)

యం = ఎవరినైతే ; హి =నిజముగా; న = లేదు / కాదు; వ్యథయన్త్యేతే  = బాధపెట్టడము;  పురుషం = అటువంటి పురుషుడు;  పురుషర్షభ = గొప్ప మనిషి; సమదుఃఖసుఖం = సుఖదుఃఖాలను సమానంగా చూచు వాడు; ధీరం = ధీరుడు; సః = అతడు ; అమృతత్వాయ = అమృత తత్వానికి (చావు, పుట్టుకలు లేని వాడిగా వుండుటకు); కల్పతే = అర్హుడు. 

"వచ్చే సుఖాన్నీ, దుఃఖాన్నీ, రెండింటినీ  సమానంగా  తీసుకుంటూ వుండే వాడికి, అవి ఎవరినైతే బాధించవో అటువంటి వాడికి - చావు, పుట్టుకలు లేని అమృతత్వానికి  అర్హత వస్తుంది."   

సుఖదుఃఖాలు వస్తాయి, పోతాయి. అవేవీ నిత్యముగా వుండిపోయేవి కావు. ది తెలిసి, వాటిని సమానంగా చూచు వాడిని అవి బాధించ లేవు. అటువంటి ధీరుడు పురుషులలో గొప్ప వాడుగా వెలుగుతాడు. చావు పుట్టుకలు లేని అమృతత్వానికి అర్హుడవుతాడు. 

హిమాలయా పర్వతాలలో, కేవలం గోచీతో తిరిగే వారిని మనం చూడొచ్చు. అలాగే, మల మల మాడ్చే ఎండల్లో, అదే రకం గోచీతో  ఎక్కడంటే అక్కడ పడుకునే వాళ్ళనూ  మనం చూడొచ్చు. ది ఎలా సాధ్యం?  అనారోగ్యాలు వచ్చినా, ఖాతరు చెయ్యకుండా ఆనందంగా వుండే వారినీ మనం చూడొచ్చు. 

లా భారత దేశంలో - మనకు ఆశ్చర్యం కలిగించే, రకరకాల వింత మనుషులను మనం చాలా చోట్ల చూడొచ్చు. కోట్లు సంపాదించిన వాళ్ళే ధీరులు అని మనం చెప్పలేం. దగ్గరికెళ్లి చూస్తే వాళ్లలోని భయాల్ని, అనుమానాల్ని, సంతోష పూరిత మనసులనూ, ఆ మనసుల లోని  ఒత్తిడిని  మనం చూడగలం. 

మానవ సమాజంలో ఎవరు గొప్ప? ఏదీ లేకున్నా, సంతోషంగా ఎల్లప్పుడూ వుండగలిగే వాడా? ఎన్నో వున్నా, మానసిక వొత్తిడితో ఎప్పుడూ  బాధ పడే వాడా?  

ఏదీ సంపాదించ వద్దని చెప్పడం లేదు. ఆరోగ్యంగా వుండవద్దని చెప్పడం లేదు. సుఖాలు వస్తే అనుభవించ వద్దని అనడం లేదు. అవి అశాశ్వతం,  అని గ్రహించు; అవి వెళ్ళేటప్పుడు, దుఃఖాలు వచ్చేటప్పుడు - ఏది వున్నా, ఏది లేకున్నా, అదే సంతోషంతో వుండటానికి  ప్రయత్నించు. అటువంటి వాడే - ధీరుడు ; మానవోత్తముడు;  అటువంటి వాడు అమృతత్వానికి అర్హుడు - అంటున్నాడు శ్రీకృష్ణుడు. 

స్టీవ్ జాబ్స్ - ఆపిల్ కంపెనీ ని స్థాపించిన వాడు. ప్రపంచంలో అతి పెద్ద ధనవంతులలో  ఆయన ఒకడు. ఆయన అంటాడు - నన్ను పూడ్చి పెట్టిన సమాధిలో వున్న నేను, అతి గొప్ప ధనవంతుడని అందరూ అనడం కంటే, ప్రతి రోజూ ఏదో అద్భుతమైన పని చేశానే సంతృప్తితో ఆ రోజు రాత్రి హాయిగా నిద్ర పోవడమే నాకు ఎక్కువ ముఖ్యమని అనిపిస్తుంది. ఆయన సంపాదించిన అంత ధనాన్ని  ఆయన ఒక్క సెంటు కూడా ఎత్తుకుపోలేదు కదా. 

మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ గేట్స్ ప్రపంచంలో మొదటి స్థానంలో వున్న అతి గొప్ప ధనవంతుడు. ప్రతి సంవత్సరము, ఆయన ఎన్నో బిలియన్ల డాలర్లు దాదాపు ప్రతి దేశానికి విరాళంగా ఇచ్చేస్తున్నాడు. నా కొడుకులకు నేను ఏ మాత్రము ఆస్తీ యివ్వను , బాగా చదివిస్తాను అంతే - అంటాడాయన. వారెన్ బఫే అనే ఆయన  కూడా బిల్ గేట్స్  లాగానే, ప్రతి సంవత్సరమూ తన ఆస్తిలో ఎన్నో బిలియన్ల  డాలర్లు విరాళంగా యిచ్చేస్తున్నాడు. 

మనం సంపాదించాలి. కొంత అనుభవించాలి. మిగతాది దానం చెయ్యాలి. లేకుంటే, అది నాశనం అవుతుంది , లేదా పరుల పాలు అవుతుంది. 

మన శరీరమూ అంతే. మనకు ఉపయోగ పడాలి. కొంతైనా పరులకు ఉపయోగ కారి కావాలి.  లేదంటే, వ్యర్థమై పోతుంది. నాశనమై పోతుంది.  ఉపయోగ పడేటప్పుడు సుఖం; వ్యర్థమయ్యేటప్పుడు దుఃఖం. 

ఎన్నో సంవత్సరాలు తనను ప్రేమగా చూసుకున్న భర్త,  ఆయనపై చేయి వేసుకుని పడుకుంటేనే కాని ప్రశాంతంగా నిద్ర పోలేననే భార్య, ఆ భర్త చనిపోతే ఆయన  శరీరాన్ని చూడడానికి, తాకడానికి కూడా   భయపడుతుందంటాడు ఆది శంకరాచార్యుడు. "భార్యా బిభ్రతి తస్మిన్ కాయే" - నీలోని జీవుడు వెళ్ళిపోతే, నువ్వు, నీ భార్య ఇంతగా ప్రేమించే నీ శరీరాన్ని తాకడానికి కూడా నీ భార్యే భయపడుతుంది. నీ శరీరమూ వుండటానికి  రాలేదు. వెళ్ళడానికే వచ్చింది. 

వెళ్ళిపోయే  ఏ వస్తువు పైనా, మనిషి పైనా మోహం వద్దని  అంటాడు, శ్రీకృష్ణుడు. అర్జునుడి ముందున్న  భీష్ముడూ వెళ్లిపోయే వాడే.  ద్రోణుడూ వెళ్లిపోయే వాడే. అసలు వెళ్లిపోకుండా వుండే వాళ్ళు అటువైపు ఎవరు? ఆఖరుకు నువ్వు, నేను  కూడా వెళ్లిపోయే వాళ్ళమే, అర్జునా అని - మర్మంగా హెచ్చరిస్తున్నాడు, శ్రీకృష్ణుడు

ఇక్కడ అమృతత్వము - అంటే  ఏమిటో అర్థం చేసుకోవాలి. శరీరాలు  పడిపోయేవే. నీవు - నీ, మరియు పరుల శరీరాల నిజ రూపం తెలుసుకుంటే, అసలైన  నీతో, నిన్ను నువ్వు ఐక్యం  చేసుకుంటే - ఆ తరువాత, అనిత్యమైన ఈ శరీరాల రాకపోకలు నిన్ను బాధించవు. నీవు నిర్వికల్పుడివి, నిర్వికారుడివి, నిరాకారుడివి,  అమృతత్వానికి అన్ని రకాలా అర్హుడివి - అంటున్నాడు శ్రీకృష్ణుడు.

ఈ భావాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం.
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది
సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    
ఉప్పలధడియం   విజయమోహన్ 

నౌకాసన