22, అక్టోబర్ 2016, శనివారం

క్యాన్సర్ వ్యాధి - సూచనలు - చికిత్స - కాన్సర్ రాకుండా కాపాడే దివ్య ఔషధాలు - మీరు చెయ్యగలిగింది

క్యాన్సర్ మహమ్మారి పట్ల 

మన కర్తవ్యం  ఏమిటి ?


ఈ మధ్య, కాన్సర్ వ్యాధి  చాలా ఎక్కువై పోతోంది  ఎవరికి వస్తుందో , ఎప్పుడు వస్తుందో , ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. చిన్న పాపల నుండి ముసలి వారి వరకు - ఎవరికైనా , ఎప్పుడైనా రావచ్చు . వచ్చిన వారి కుటుంబాలలో అనంతమైన భయం , నిరాశ చోటు చేసుకుంటూ వున్నాయి.

ఆలోపతీ చికిత్స మహా  నగరాల్లోనే ఉంది. గ్రామాల్లోని వారు , చిన్న ఊర్లలో వున్న  వారు ఈ ఖరీదైన అలోపతీ చికిత్స పొందడం చాలా కష్టంగా వుంది. ఎన్ని లక్షలు ఖర్చు  అవుతుందో తెలియదు . ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. చివరికి  పూర్తిగా నయమయినట్టా , కాదా అని కూడా తెలియదు. మళ్ళీ తిరగబెడుతుందా అన్న సంగతీ తెలియదు.

కాన్సర్ వ్యాధిని నయం చెయ్యడానికి ఆపరేషన్,  కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్మ్యూనోథెరపీ, టార్గెట్టెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, ప్రెసిషన్ మెడిసిన్ లు ఆలోపతీ వైద్యంలో ప్రధానంగా వుంటున్నాయి. యివన్నీ కాన్సర్ కాస్త తక్కువ స్టేజి లో వుంటే బాగా పనిచేస్తాయి. ముదిరిన తర్వాత వీటి ప్రయోజనం ఎలా వుంటుందో చెప్పలేం .


ప్రధానంగా ,కాన్సర్ ను TNM సిస్టం  ప్రకారం, సైజు ను బట్టి మొదట (T సిస్టం) 4 స్టేజి లుగా గుర్తు పడతారు. 1 అంటే కాన్సర్ గడ్డ చిన్నది, 4 అంటే బాగా  పెద్దది అని అర్థం.  తరువాత , ఎన్ని లింఫ్ నోడ్స్ కు ప్రాకింది తెలుసుకుని (N  సిస్టం ), 0 నుండి 3 వరకు నంబర్స్  యిస్తారు. M సిస్టం ప్రకారం - ఒక చోటి నుండి మరోచోటికి  కాన్సర్ ప్రాకిందా  అని నిర్ణయిస్తారు . 0 అంటే ఒకే చోట ఉంది . 1 అంటే మరో చోటికి కూడా ప్రాకింది అని అర్థం . ఇవన్నీ రక రకాల టెస్టులు , స్కాన్ ల ద్వారా తెలుసుకుంటారు.

ఆ తరువాత , వైద్య పధ్ధతి  కాన్సర్ స్పెషలిస్ట్స్  నిర్ణయిస్తారు . కాన్సర్ ను మొదట్లోనే గుర్తు పట్టడానికి కొన్ని వైద్య విధానాలు వున్నాయి . ఫెకెల్ ఆకల్ట్ టెస్ట్ , కాలోనోస్కోపీ లాంటివి 50 ఏళ్ళ  పైబడ్డ వారు చేయించుకోవాలి. ఆడవాళ్లు మామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవాలి . ఇలాంటి టెస్టులు అన్ని వూళ్ళలో వున్నాయో లేదో తెలీదు.

 సరే . మనమేం చెయ్యవచ్చు - అది చూద్దాం.   

కాన్సర్ వ్యాధి ని కనిబెట్టడానికి C.A.U.T.I.O.N. అన్న పదం ద్వారా మనం చెయ్యదగిన సూచనలు చెబుతారు. 

C – Colorectal cancer.మన మల మూత్ర విసర్జన లలో  ముఖ్యమైన మార్పులు మనం గమనించాలి . దీని ద్వారా కాన్సర్ రావడాన్ని ముందుగా తెలుసుకోవచ్చు . ఈ మార్పులు   కొలెరెక్టల్  కాన్సర్ కు గుర్తు కావచ్చు . కాన్సర్ మాత్రమే కాదు. jaandice లాంటి వ్యాధులు కూడా  మనం సులభంగా చెయ్య గలిగే మల మూత్ర పరిశీలన ద్వారా కనిబెట్ట వచ్చు. కలర్  మారినా , రక్తం పడుతున్నా , మరే మార్పు వున్నా మనం చూడాలి . డాక్టర్ ను అడగాలి. 4 నెలలకు ఒక సారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకోవాలి. 
A – A sore that does not heal in a normal amount of time. చర్మము , నోరు లాంటి ప్రదేశాల్లో వచ్చి , ఎన్నాళ్లయినా ఆరని పుండ్లు వుంటే అక్కడ కాన్సర్ రావచ్చు అనడానికి అవి సంకేతం .వీటిని మాన్పుకోవాలి. డాక్టర్ ను శ్రద్ధగా ముందస్తుగా అడగాలి . 
U – Unusual bleeding or discharge. మల,మూత్ర , వెజైనా లాంటి  ద్వారాల గుండా వచ్చే అధిక రక్త స్రావము , మరేదైనా స్రావము - వాటికి సంబంధించిన ఏ  బాహ్య లేదా అంతర్ అంగాలలో వచ్చే క్యాన్సర్లకు సంకేతం .వీటిని గురించి కూడా జాగ్రత్త పడాలి. 
T – Thickening of breast tissue or a lump. స్త్రీలలో రొమ్ముల్లో పెరిగే టిష్యూ లు,గడ్డలు అక్కడ కాన్సర్ రావడానికి సంకేతం కావచ్చు. అలాగే మగవారిలో టెస్టికల్స్ లో గడ్డలు పెరగడం కూడా.యివి మనమే అప్పుడప్పుడూ చూసి, గడ్డలు వుంటే , డాక్టర్ ను కన్సల్ట్ చెయ్యాలి . యివి కాన్సర్ గడ్డలే  కానవసరం  లేదు . మామూలు క్రొవ్వు లాంటి గడ్డలు కూడా కావచ్చు. 
I – Indigestion and/or difficulty IN swallowing. అజీర్తి కానీ, ఆహారం మింగ లేక పోవడం  తరచుగా ఉంటే - గొంతునుండి ప్రేవుల వరకు ఎక్కడైనా కాన్సర్ రావడానికి సంకేతం కావచ్చు.యివి కూడా మనం మందుల ద్వారా  మొదటనే పోగొట్టుకుంటే మంచిది. 
O – Obvious changes to moles or warts. చర్మము పైన  మచ్చలు , పులి పురులు లాంటివి పెరగడం కూడా చర్మపు కాన్సర్ కు సంకేతం కావచ్చు .ఇలాంటివి వుంటే , స్కిన్ స్పెషలిస్ట్స్ ద్వారా సులభంగా , బాధ లేకుండా, మొదటనే  తీసేసుకోవచ్చు. అశ్రద్ధ మంచిది కాదు. 
N – Nagging cough. 4 వారాల మించి  తగ్గని దగ్, గు గొంతు మరియు ఊపిరి తిత్తుల  కాన్సర్ కు సంకేతం కావచ్చు.దగ్గుకు మంచి మందులు వున్నాయి .  వెంటనే  పోగొట్టుకొండి. వారం దాటితే డాక్టర్ ను తప్పకుండా చూడండి. 

యివన్నీ తప్పకుండా కాన్సర్ ఉందని చెప్పడానికి ఆధారాలు ,  నిదర్శనాలు కావు .  కానీ , యివన్నీ , మనం ఆరంభ దశలోనే పోగొట్టుకోవడానికి వుపకరించే మంచి సంకేతాలు .

ఇక , కాన్సర్ రాకుండా వుండాలంటే  ఏం చెయ్యాలో  తెలుసుకుందాం .

దీనికి సాధారణంగా 10 ముఖ్య సూత్రాలు చెబుతారు .


1. పొగాకు, పొగాకు పొగ  విడిచి పెట్టండి. యివి  త్రాగే వారి నుండి మనకు వచ్చే పొగ మరీ అనర్థ దాయకం . మనదేశంలో మనషులు తిరిగే ప్రాంతాలలో పొగ త్రాగడం నిషేధించారు . మీరు మనుషులే గనుక  పొగ త్రాగడం మానండి . మీకు, మీ  వారికీ, చుట్టూ వున్న వారికీ  ప్రమాదం తప్పించండి.  
2. మీ భోజన పద్ధతులు బాగుండాలి. saturated fat, red meat లాంటివి విడిచి పెట్టండి. పండ్లు   కూరగాయలు, ధాన్యాలు ఎక్కువ చేయండి. నూనెలో వేయించినవి, కాల్చిన ఆహారాలు బాగా  తగ్గించండి. 
3. శారీరక పరిశ్రమ , వ్యాయామము తగినంతగా  వుండాలి. యోగా చాలా మంచిది. 
4. శరీరం బలంగానూ, సన్నగానూ వుండేలాగా చూసుకొండి.  Obesity -  అంటే శరీరంలో  భాగాల్లో కొవ్వు పేరుకు పోవడం కాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది.
5. మద్యపానం వదిలేయండి . లేదా , బాగా తగ్గించండి.
6. రేడియేషన్ - సెల్ ఫోన్లు , సెల్ టవర్స్ , స్కేన్ టెస్టులు యివన్నీ రేడియేషన్ కలిగించేవి. వీటికి దగ్గరుండడం బాగా తగ్గించండి. రాత్రి పూట సెల్ ఫోన్లను మీకు తప్పకుండా దూరంగానే  వుంచండి.పిల్లలకు సెల్ ఫోన్లు ఆట వస్తువులు కాకూడదు. వారి బలహీనమైన చెవి నరాల పైన ,  మెదడు పైన రేడియేషన్ ప్రభావం చాలా  ఎక్కువగా వుంటుంది . దయ చేసి సెల్ ఫోన్లు పిల్లలకు ఇవ్వకండి. యిచ్చి వాళ్ళను అల్పాయుష్కులు , రోగ  గ్రస్తులు  చెయ్యకండి 
7. కొన్ని పారిశ్రామిక విషాలు మన  చుట్టూ వున్నాయి. ఆస్బెస్టాస్,బెంజీన్, లాంటివి . వాటిని దూరంగా వుంచండి. 
8. వైరస్ ఇన్ఫెక్షన్ లు రాకుండా చూసుకోండి.
9. చిన్న, చిన్న డోసు లలో, ఆస్పిరిన్  అప్పుడప్పుడూ తీసుకోవడం కాన్సర్  రాకుండా చూస్తోంది - అంటారు.
10. విటమిన్ డ్, ఏ, బి 17 లు కాన్సర్ రాకుండా కాపాడతాయని  అంటారు .

యివి కాక , ఈ మధ్య తెలిసొస్తున్న మన నాటు వైద్యాలు కొన్ని చాలా మంచివని తెలుస్తున్నాయి . యివి కాన్సర్ వున్నా . లేకున్నా , రాకుండా వుండడానికి , వస్తే  నయం కావడానికి మనం పాటించ గలిగేవి .

1. గచ్ఛ కాయ  పప్పు ఒకటి , దానితో 4 మిరియాల గింజలు పొడి చేసి - రోజుకు రెండు సార్లు చొప్పున  తీసుకుంటూ ఉంటే - కాన్సర్ గడ్డలు,  ఇతరమైన  ఏ గడ్డలు శరీరంలో వున్నా , కరిగిపోతాయని, ఒక  వైద్య నిపుణుడు , యిప్పటికి  వంద సార్లయినా చెప్పాడు. యిది చెయ్యడం చాలా మంచిదని నా అభిప్రాయం .

2. సముద్ర పాల ఆకు రసం రోజుకు రెండు సార్లు తీసుకుంటూ ఉంటే - కొన్ని నెలలలో కాన్సర్  నయమవుతుందని  ఎంతో మంది చెబుతున్నారు. యిప్పుడు వీటి చూర్ణము , ట్యాబ్లేట్ల్ ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకోవచ్చు .

3. ఒకటిన్నర కిలోల కారట్లు , రసం తీసి, ఒక రోజులో  త్రాగాలి .  యిలా ప్రతి రోజూ చేస్తూ వుంటే కొన్ని నెలలలో కాన్సర్ పూర్తిగా నయమవుతుందని చాలా మంది చెబుతున్నారు.

4.  గో మూత్రము  పరిశుద్ధి చేసి  తీసుకుంటే కాన్సర్ నయమవుతుంది -అని చాలా మంది చెబుతున్నారు .

5.  పసుపు, పుదీనా రసము, గార్లిక్ , జింసెంగ్ , అల్లము, వెల్లుల్లి -యివన్నీ కాన్సర్ రాకుండా కాపాడే దివ్య  ఔషధాలే . యివి మనం వాడాలి . కాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలి. 

5. యివన్నిటినీ మించి మీ యిళ్ళలో  మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం , ధైర్యం  పెంచుకోవడం , ఆరోగ్యకరమైన , ఆహ్లాద కరమైన కుటుంబంగా  వుండడం  - చాలా ముఖ్యం .

 సర్వే జనాః సుఖినో భవంతు

ఆరోగ్య ప్రాప్తి రస్తు

= మీ

ఉప్పలధడియం  విజయమోహన్



5, అక్టోబర్ 2016, బుధవారం

నా పుస్తకావిష్కరణ - కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్ పతంజలి యోగ సూత్రాస్ - ఆర్గాన్ డొనేషన్ - దసరా శుభాకాంక్షలు

పుస్తకావిష్కరణ 

 


2016, సెప్టెంబర్, 29 వ తేదీ, ప్రజాశక్తి దిన పత్రిక వారు పుంగనూరు (చిత్తూర్ జిల్లా) లో, తమ 36 వ వార్షికోత్సవం బసవరాజా గవర్నమెంట్ హై స్కూల్ లో జరిపారు. ఆ  సందర్భంగా  నన్ను పిలవడం, నా పుస్తకాన్ని (కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్  పతంజలి  యోగ సూత్రాస్), స్థానిక మునిసిపల్ కమీషనర్ , శ్రీ లోకేశ్వర్ వర్మ గారి చేత, పలువురు స్థానిక ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరింప జేయడం జరిగింది. 

 ఆంగ్లం లో రాయ బడిన 760 పేజీలున్న పుస్తకం యిది. పెద్దదే. అందుకే యిది కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ అన్నాను. ఈ పుస్తకాన్ని యిది వరకే అన్ని పెద్ద లైబ్రరీ లకు , యోగా ప్రముఖులకు పంపించడం జరిగింది. వారిలో చాలా మంది యోగా ప్రముఖులు స్వయంగా నాకు టెలిఫోన్ చేసి నా పుస్తకాన్ని ఎన్నో విధాలుగా ప్రశంసించడం జరిగింది.  అలాగే, చాలా మంది  లిఖిత  పూర్వకంగా కూడా ప్రశంసించడం జరిగింది. ముఖ్యంగా , రామకృష్ణ  మిషన్ స్వామీజీలు భారత దేశపు పలు మిషన్లనుండి ఈ పుస్తకాన్ని రక రకాలుగా ప్రశంసించారు. వారందరికీ నా కృతజ్ఞతా పూర్వక పాదాభివందనాలు. 

ఈ  పుస్తకం లో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. పతంజలి మహర్షి రాసిన అన్ని సూత్రాలను, వాటికి ప్రతిపదార్థము, సంక్షిప్త అర్థము , సమగ్ర వివరణ, ఉదాహరణలు , భగవద్ గీత , ఉపనిషత్తులు దీన్ని గురించి ఏం చెప్పాయి , వాటికి వివరణ , ప్రాక్టికల్ ఎక్సరసైజ్స్ , యిలా యిన్నో వివరణలు యిందులో సమగ్రంగా రాయ బడింది. 

చివర 4 అనుబంధాలు (Annexures); అందులో, ఒక సాధకుడు  ఏం   చెయ్యాలి, ఎలా చెయ్యాలి , అతని దైనిక యోగా కార్య క్రమం ఎలా వుండాలి అన్నవంతా సమగ్రంగా యివ్వబడింది. 

భారత దేశపు పలు ప్రాంతాల నుండి, ఎంతో మంది  ఈ పుస్తకాన్ని తమ స్థానిక లైబ్రరీ లలో చదివి నాకు ఫోన్ మూలకంగా తమ అభినందనలు తెలియ జేస్తున్నారు. కాపీలు కొనడానికి ఉత్సాహంగా వున్నారు.

యిప్పుడు నా ఈ పుస్తకం, నేను చదివిన స్కూల్ లో ,  నేను చదివిన క్లాస్ రూమ్ (పెద్ద హాల్) లో, నేను ప్రప్రథమంగా యోగా నేర్చుకున్న హాల్ లో, మా వూరి  స్థానిక ప్రముఖుల ముందు ఆవిష్కరింప బడడం చాలా ఆనందం గా  వుండింది . 

 నేను ఈ పుస్తకాన్ని అంతర్జాతీయంగా అమెజాన్ లాంటి కంపెనీల మూలంగా విక్రయానికి సన్నద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే సఫలం అవుతుందని ఆశిస్తున్నాను. అందుకే దేశీయ సంస్థల వారికి  యివ్వ లేదు. 

మా కుటుంబం లో - అంటే ఉప్పలధడియం వంశంలో , మరో యిద్దరు తెలుగు రచయితలూ  వున్నారు. 

మా చిన్నాన్న , ఉప్పలదడియం రామమూర్తి , వయసు 76 ఏళ్ళు , ఆయన గత 8 ఏళ్లలో మూడు మంచి పుస్తకాలు రాశారు. 

అవి - మహా భారత  నామ కోశము , భాగవత నామకోశము, రామాయణ నామ కోశము. సంస్కృత గ్రంధాల లోని అన్ని పాత్రల వివరణ ఈ తెలుగు పుస్తకాలలో ఆయన చాలా బాగా యిచ్చారు. యివి మూడూ మూడు రీసెర్చ్ గ్రంధాలే. అలాగే , రీసెర్చ్ కు ఉపయోగ పడే గ్రంధాలే. యింకా, యింకా, ఆయన ఇటువంటి ఉత్తమ గ్రంధాలు  రాయాలని కోరుకుంటున్నాము. 

ఆయన పెద్ద కొడుకు, డాక్టర్ వెంకటేశ్వర తెలుగులో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. కవితలు , పద్యాలు, వ్యాసాలు, కథలు లాంటి అన్ని రకాల తెలుగు సాహిత్య రీతులను ఒక పట్టు పట్టి చూస్తున్నారు. అనేక సత్కారాలనూ అందుకున్నారు. యింకా, యింకా రాస్తూనే వున్నారు.  చాలా  మంచి  రచయిత , వుజ్వల భవిష్యత్తు వున్న వాడు. 

మా అన్న వుప్పలధడియం  నాగరాజ పుస్తకాలు రాయలేదు కానీ అద్వైత సిద్దాంతంలో ఎంతో జ్ఞాని అని చెప్ప వచ్చు. స్వామి దయానంద గారి గొప్ప శిష్యుడైన స్వామి పరమార్థానంద గారి వద్ద ఒక దశాబ్దం పైగా శ్రవణము, మననము, నిదిధ్యాసనము చేసినవాడు. మా 6 మంది అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెళ్లను  ఒక తండ్రిగా ముందుకు  తీసుకు వచ్చిన వాడు. 

మా నలుగురు చేసిన, సాధించిన  పై విషయాలను గురుతుంచుకుని, ఒక "ఉప్పలధడియం  సాధకుల సభ"  మా అన్న గారింట్లో, ఈ నెల 2 వ తేదీ నాడు  జరిగింది. మా బంధువర్గమంతా ఒక చోట చేరడం, మా సాధనలను సమీక్షించడం , సత్కరించడం  జరిగింది. మాకు యిది చాలా ఆనంద దాయకమైన విషయం. 




యిది ఆ సందర్భంగా తీసిన ఫోటో. యిందులోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత, సృజనాత్మకత ఉండనే వుంది. ఈ సభలో  ఆర్గాన్ డొనేషన్ అన్న అంశం పైన కూడా చిన్న చర్చ జరిగింది. అందరూ కలిసి , ఆర్గాన్ డొనేషన్  కు సరైన సంస్థలకు, లిఖిత పూర్వకంగా అథారిటీ లెటర్లు  ఓకే సారి యివ్వాలని  ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము.  ఇదొక మంచి నిర్ణయం. ఇది ప్రతి కుటుంబం లోనూ, చెయ్య గలిగితే  బాగుంటుంది. నా వుద్దేశంతో , యిది ఒక జాతీయ  వుద్యమం లాగా జరుప గలిగితే చాలా బాగుంటుంది. 

యిలా, జీవితం లో ఎన్నో జరుగుతూ వుంది . మలుపులూ, మార్సులూ , పురోగతి , కొంత తిరోగతి ఉంటూనే వున్నాయి. యిప్పుడు దసరా కదా.  మాయింట్లోనూ బొమ్మల కొలువు పెట్టాము. ఇదో చూడండి. 
  





పాఠకులందరికీ నా (మా) దసరా శుభాకాంక్షలు.


 సర్వే జనాః సుఖినో భవంతు 

= మీ 

ఉప్పలధడియం  విజయామోహన్







28, సెప్టెంబర్ 2016, బుధవారం

నిత్య జీవితం లో యోగా


నిత్య  జీవితం లో యోగా 
 ఒక  విశేష యోగా ప్రక్రియ 

చిన్నపిల్లల నుండి పెద్దవాళ్లవరకు మనం అందరూ నిత్యజీవితంలో యోగ ప్రక్రియలు ఎన్నో వాడుతూ వున్నాము. 
ఉదాహరణకు -
గోపీ 10 వ తరగతి విద్యార్థి. బాగా చదువుతాడు. గోపీ సెక్షన్ లో, 30  మంది విద్యార్థులున్నారు. గోపీకి  రాము బెస్ట్ ఫ్రెండ్. చదువులోనూ, ఆటలలోనూ, మాటల లోనూ, అన్నింట్లో గోపీ, రామూతో బాటే వుండాలని ఇష్టపడతాడు. తెల్లవారి లేస్తే గోపీకి మొదట జ్ఞాపకం వచ్చేది రామూ. 

యిప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ ను దాటి కాస్త ముందుకు వెడదాం. 

ఒకవేళ, గోపీకి, రామూ మాత్రమే కాక , తన క్లాసులోని వారందరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా అయ్యారనుకొండి . ఒక్కో సారి అలా జరుగుతుంది . గోపీని వాళ్ళ  మేష్టారు క్లాస్ లీడరుగా పెట్టారనుకొండి.  అందరు  విద్యార్థులను సమానంగా చూడవలసిన అవసరాలు వస్తుంటాయి. అప్పుడు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు కూడా . 

అప్పుడు గోపీ మనస్థితి ఎలావుంటుంది ? 
అప్పుడు తెల్లవారి లేస్తే గోపీకి ఎవరు జ్ఞాపకం వస్తారు ?
30 మంది పేర్లు చెప్పు కోకున్నా , గోపీ, నా ఫ్రెండ్స్ అందరూ  సుఖంగా వుండాలనుకుంటాడా? 
నా  ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా, రోగాలు లేకుండా - అందరూ క్లాస్ కు రావాలని అనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ ఆపదలూ  లేకుండా  భద్రంగా ఉండాలనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ శోకాలూ , దుఃఖాలూ లేకండా  వుండాలనుకుంటాడా ?
యిలా గోపీ కాస్త స్ట్రాంగ్ గా మనస్సులో అనుకుంటే , గోపీ యోగా లో ప్రవేశించినట్టే. 

యిదే, గోపీ సంస్కృతం లో చెప్పాలనుకుంటే ఈ శ్లోకం చెబుతాడు :
సర్వే  భవంతు సుఖినః  (లేదా సర్వే  మిత్రాహ్ సుఖినో భవంతు )
సర్వే  సంతు నిరామయాహ్ 
 సర్వే భద్రాణి పశ్యంతు 
మా కశ్చిత్  దుఃఖ భాగ్ భవేత్ 

యిది దేవుడికి  చేసే  ప్రార్థన కాదు . గోపీ మనసులో రేగిన బలమైన, నిస్స్వార్ధమైన కోరిక
యిలా హృదయపూర్వకంగా అనుకున్నప్పుడు గోపీ కొంత యోగిగా మారిపోతాడు.   అందరికీ లీడరు గదా  మరి . 
మానసికంగా అందరూ నాలో వున్నారు , అందరి శ్రేయస్సూ నేను కోరుకుంటున్నాను - అనే భావనే యోగా లో ఒక ముఖ్యమైన  భావన. 
యిప్పుడు ఒక  గొప్ప అద్భుతం జరుగుతుంది . 
గోపీ మనసులోని ఈ బలమైన, నిస్స్వార్ధమైన కోరికను చుట్టూ వున్న ప్రకృతి  కూడా వింటుంది .
మనసులో అనుకున్నాసరే. 
ప్రకృతి ఈ నిస్స్వార్ధమైన, న్యాయమైన కోరికను తప్పకుండా వింటుంది. ప్రకృతికి ఆ శక్తి  ఉంది. ప్రకృతికి అనేక రకాల శక్తులున్నాయి 
సరే . ఎంతైనా కొంత, ఈ గోపీ కోరికను నిజం చేద్దామని ప్రయత్నం చేస్తుంది. 
దీన్ని యిప్పుడు పాశ్చాత్య దేశాల్లో   లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు పెట్టుకున్నారు.
యిప్పుడు యితని బలమైన కోరికకు ప్రకృతి బలం కూడా కొంత తోడవుతుంది . 
ప్రకృతి  ఇతన్ని చూసి 'శభాష్ ' అంటుంది . తన చెయ్యి చాస్తుంది , యితని చేతిలో చెయ్యి కలపడానికి . 

యిది మనకు అనుభవం కావాలి . ప్రకృతి తో చెయ్యి కలపడం మనకు రకరకాలుగా అనుభవం కావచ్చు . 

దీనిపై - ఇప్పుడొక ఎక్స్పరిమెంట్ చెయ్యొచ్చు . 

సర్వే భవంతు సుఖినః - అందరూ సుఖంగా ఉండాలి - అని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా  ఒక్కసారి అనండి . అన్నారా ?

యిప్పుడు కళ్ళు మూసుకునే ,మీ చెయ్య చాచండి . మీ ముందు విశ్వమంతా వ్యాపించి యున్న ప్రకృతి మాత
అతి సుందరంగా చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉంది. మీ చెయ్యి వైపు తన చెయ్యి చాచింది. మీ చేతిని అందుకుంది - ఒక తల్లి తన బిడ్డ చేతిని పట్టుకున్నట్టు . ప్రకృతి మాత అదృశ్య హస్తం మీచేతిని తాకుతున్న అనుభూతిని మీరు పొందాలి. 

యిది ఒక గొప్ప అనుభూతి . యిది మీరు పొందే వరకు మీరు ఈ ఎక్సపెరిమెంట్  చెయ్యొచ్చు . 

మరొక సింపుల్ ఎక్స్పరిమెంట్ చేద్దాం. 

మీచుట్టూ వున్న ప్రకృతి లో మహా గొప్ప చైతన్యము ఉంది . మీకున్న పంచేంద్రియాల శక్తి కంటే ఎన్నో కోట్ల రేట్లు అధికమైన శక్తి ఆమెకు ఉంది . 

మీరు ఎక్కడ వున్నా ఆమె మీ చుట్టూ వుంది. మిమ్మల్ని చూస్తూనే వుంది. 

మీరు మీ స్వార్థాని  కోసం ఏ  పని చేసినా దానితో ఆమెకు సంబంధం లేదు. 

కానీ, మీరు సర్వే జనః సుఖినో భవంతు అన్నప్పుడు, దాని కోసం పనిచేసినప్పుడు - ఆమె శభాష్ అంటుంది . మీతో చేతులు కలుపుతాను- అంటుంది. ఆ అనుభూతిని మీరు పొందాలి . 

ప్రయత్నించండి. ప్రకృతిమాత మా చుట్టూ వున్న అనుభూతిని మీరు పొందండి. 
 
 ఒంటి చేత్తో చప్పట్లు కొట్టగలరా? కొట్ట లేరు . కానీ ప్రకృతి తో కలిసి కొట్టగలరా ? కొట్ట గలరు.  ప్రయత్నించి  చూడండి . ఒక వైపు మీ చేయి. మరో వైపు ప్రకృతి తన చేయి కలపడం . ఆ అనుభూతి వచ్చే వరకు చెయ్యండి . 

యిలా చేస్తూ ఉంటే - మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రకృతి శక్తి కూడా మీకు తోడవుతుంది 

=సర్వే  జనాః  సుఖినో భవంతు 

మీ 

 విజయమోహన్ 
 
 

30, జూన్ 2016, గురువారం

సమాజంలో సమస్యలు - వాటి మూల కారణం

కమ్యూనికేషన్ స్కిల్స్ 

పరస్పర అవగాహనా నైపుణ్యం 



మాట్లాడ వలసిన వాడు -  మాట్లాడ వలసిన సమయంలో, మాట్లాడ వలసిన స్థలం లో, మాట్లాడ వలసిన వారితో మాట్లాడ వలసిన విధంగా మాట్లాడాలి. అలా మాట్లాడక పోతే చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి.

మరి, అలా మాట్లాడితే - వున్న మరియు రాబోయే చిక్కులు, ప్రమాదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలా మాట్లాడ గలిగి, మాట్లాడే వాడు బుద్ధిమంతుడు, జ్ఞాని. సమయస్ఫూర్తి గలవాడు. ప్రతి మనిషికీ, ప్రతి సమాజానికీ అటువంటి మనుషులు కావాలి .


కానీ, మాట్లాడ కూడని  వాడుమాట్లాడ కూడని  సమయంలో, మాట్లాడ కూడని స్థలం లో, మాట్లాడ కూడని వారితో, మాట్లాడ కూడని విధంగా మాట్లాడితే  చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. అటువంటి వాడు వాచాలుడు, మూర్ఖుడు. వాడి నోరు ముయ్యక పోతే, అన్నీ ప్రమాదాలే . తనకే కాదు, చుట్టూ వున్న వారికీ ప్రమాదాలు తెచ్చి పెడతాడు. 

అయితే, వినవలసిన  వాడు -  విన వలసిన సమయంలో,  విన వలసిన స్థలం లో,  విన వలసిన వారి మాటలను విన వలసిన విధంగా తప్పక వినాలి;అర్థం చేసుకోవాలి; పాటించాలి.

వినవలసిన వాడు -  అలా  వినక పోతే, పాటించక పోతే చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. వింటే , పాటిస్తే , వున్న చిక్కులు , ప్రమాదాలు మాయమవుతాయి. క్రొత్తవి రాకుండా వుంటాయి. 

అలాగే, విన కూడని  వాడు -   విన కూడని  సమయంలో,  విన కూడని  స్థలం లో,  విన కూడని  వారి మాటలను విన కూడని  విధంగా వింటే కూడా ఎన్నో చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. అలా వినే వాడు మూర్ఖుడు.

 సరైన విధంగా మాట్లాడడమూ , వినడమూ, మన జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన ప్రాథమిక విద్యలు, కళలు, విజ్ఞానమూ కూడా .

మంచి వాడితో, జ్ఞానితో, సమయ స్ఫూర్తి వున్న వాడితో   మాట్లాడమన్నారు; వాడి మాట వినమన్నారు; వాడి స్నేహం కట్టమన్నారు, మన పెద్దలు. అదే ముక్తికి కూడా సులభమార్గమన్నారు. సత్సంగత్వే ..... జీవన్ముక్తిహి - అన్నారు ఆది శంకరాచార్యులు.

భార్యాభర్తలు ఒకరితో ఒకరు  యెలా వుండాలి - అన్న విషయం కూడా ఇందులో మనం తెలుసుకో వచ్చు . తల్లిదండ్రులు పిల్లలు మధ్య సంబంధాలు ఎలా వుండాలి - అన్న విషయం కూడా ఇందులో మనం చూడ వచ్చు. స్నేహ, బాంధవ్యాలకు ముఖ్యంగా  ఈ సూత్రాలు పునాది .

సమయస్ఫూర్తి తో   మాట్లాడగలగడం,వినగలగడం , మంచి గ్రహించగలగడం, చెడు విడిచిపెట్ట గలగడం ఇవీ జీవితంలో విజయానికి పునాదులు. ఆనందానికి సోపానాలు.

ఇవి విద్యలో  మొదటి పాఠాలు గా ఉండవలసినవి. కడపటి పాఠాలు గా కూడా నేర్పడం లేదు.

అందుకే సమాజంలో యిన్ని సమస్యలు.

సర్వే జనాః సుఖినో భవంతు 

-మీ 

ఉప్పలాధడియం విజయమోహన్
 


 



11, మే 2016, బుధవారం

కామ్ప్రెహెన్సివ్ ట్రీ టైజ్ ఆన్ పతంజలి యోగ సూత్రాస్- నా ఆంగ్ల పుస్తకానికి - రామకృష్ణ మిషన్ స్వామీజీ ల ఆశీస్సులు , ప్రోత్సాహాలు

కామ్ప్రెహెన్సివ్  ట్రీ టైజ్  

ఆన్ పతంజలి  యోగ సూత్రాస్



వొక్క సంవత్సరంగ దీర్ఘదర్శి  తెలుగు బ్లాగ్  మౌనం గా వుండవలసి వచ్చింది . అందుకు కారణం యిదో - నేను రాసిన ఈ ఆంగ్ల పుస్తకం :




ఈ పుస్తకం రాయడానికి నాకు 2-3 సంవత్సరాల పైనే పట్టింది . 740 పేజీలు  A 4 సైజ్  పుస్తకం యిది . అంతా పతంజలి రాసిన యోగ సూత్రాల  గురించే . నాకు తెలిసినంత వరకు ,యోగ సూత్రాల గురించి యింత వివరణగా ,సిద్ధాంత పరంగానూ, ఆచరణ పరంగానూ  చెప్పిన పుస్తకం మరొక్కటి  లేదు . 

వీటిని - యోగ నిష్ణాతులైన రామకృష్ణ మిషన్ స్వామీజీ లకు, మిగత యోగా గురువులకు , లైబ్రరీ లకు యూనివర్సిటీ లకు పంపించడం జరిగింది. చాలా మంది  రామకృష్ణ మిషన్ స్వామీజీలు తమ ఆశీస్సులు , తమ హర్షం , తమ ప్రోత్సాహాలను చాలా బాగా వ్యక్తీకరించారు (లెటర్ల ద్వారా, ఫోన్ కాల్ ద్వారా , ఈ మెయిల్  ద్వారా నాకు ఎంతో ప్రోత్సాహం  యిచ్చారు. అలాగే ద్రావిడియన్  యూనివర్సిటీ  వైస్  చాన్సెలర్ గారు కూడా ఫోన్లో తమ ప్రోత్సాహం  వ్యక్తీకరించారు. ఇంకా , ప్రతి రోజూ, ఈ ప్రోత్సాహ వాహిని సాగుతూనే వుంది యిప్పటి వరకూ . 

ఒక స్వామీజీ, యిది మీ జీవితాన్నే ధన్యం చేసే  రచన అన్నారు .

పూరీ రామకృష్ణ మిషన్ స్వామీజీ గారు, స్వామీ  పరిశుద్ధానంద యిలా అన్నారు :

"ఈ పుస్తకం అత్యున్నతమైన   సెల్ఫ్ హెల్ప్ పుస్తకం  అనటం లో సందేహం లేదు . 

"ఈ అద్భుతమైన  వివరణాత్మక పుస్తకం లో యోగా ను గురించి మీ రెంత  అధ్యయనం  చేసారో బాగా తెలుస్తూ వుంది ... యిది యోగా ను దేశ  విదేశాల్లో వ్యాపింపజేయడానికి ,చాలా బాగా ఉపయోగ పడగలదు . అందులోనూ , మన ప్రధాన మంత్రి గారు  పోయిన సంవత్సరం లో అంతర్జాతీయ  యోగా దినోత్సవం ఆరంభించిన  నేపథ్యంలో , దీని ఉపయోగం చాలా వుంది 
"యింత అత్యంత ఉపయోగకరమైన  పుస్తకం మానవాళి కి అందించడానికి మీరు పడ్డ శ్రమకు మా హృదయపూర్వక సంతోషాన్ని వెలి బుచ్చుతున్నాము . 

"రామకృష్ణ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు వుండుగాక ...... "

యిది స్వామీజీ గారు వ్రాతపూర్వకంగా  అంగ్లంలో రాసి పంపారు . దాదాపు యిలాగే మదురై , బెంగుళూరు స్వామీజీలు ఫోన్ చేసి నాతో    మాట్లాడి  ఎంతో ప్రోత్సహించారు . అలాగే ద్రావిడియన్  యూనివర్సిటీ  వైస్  ఛాన్సలర్  గారు కూడా ఫోన్ చేసి చాలా బాగా అభినందించారు; ప్రోత్సహించారు. 

నా వరకు నాకు - నా శ్రమ, ఈ అభినందనల పరంపర అన్నీ ఈశ్వరార్పణం. శివునాజ్ఞ  లేనిది చీమైనా కదలదు  . ఆయన ఆజ్ఞ అయితే ఏదైనా జరుగుతుంది . అంతే .

అయితే , మానవ ప్రయత్నం  లేనిదే  దైవ సాహాయ్యం  వుండదు కదా . మన ప్రయత్నం వుండాలి . నేను యిది పూర్తిగా నమ్ముతాను .  

ఈ పుస్తకం యింకా కొంత మంది మహానుభావుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తోంది . ఆ తరువాత నే , మార్కెట్ లో విక్రయాలు, యివన్నీ .

ఈ పుస్తకం  లో -వొక్కొక్క యోగ సూత్రానికీ  పూర్తి వివరణ యివ్వడమే కాకుండా, ఆ సూత్రప్రకారం  సాధకుడు ఆచరించవలసిన , పాటించ వలసిన ఎక్సర్సైజ్ లు కూడా యివ్వడం జరిగింది . అంటే - సూత్రం చదివిన వెంటనే  - ఆచరణలో కూడా పెట్టె య్యడమే, తద్వారా , దాని పూర్తి  ఫలితాన్ని పొందడమే పుస్తకం వుద్దేశ్యం .   చాలా సూత్రాలకు యిలా యివ్వడం జరిగింది .

ప్రతి దినం వొక యోగ సాధకుడుగా మీరు ఆచరించ దాగిన దైనిక చర్య కూడా సులభంగా, ఆచరణ యోగ్యంగా , మీ టైం  ప్రకారం  చెయ్య దగినట్టుగా, యివ్వడం జరిగింది . అయినా పతంజలి ఆదేశించిన నియమాలన్నీ పాటించ డమూ  జరిగింది . కొండల్లో, కోనల్లో, గుహలలో, అరణ్యాలలో  మాత్రమే కాదు , ఇళ్ళల్లో కూడా యోగా పూర్తిగా  ఎలా సాధించ  వచ్చో చెప్పడం జరిగింది .

పతంజలి మహర్షి చెప్పింది మాత్రమే  కాక , శ్రీకృష్ణ భగవానుడు, ఉపనిషత్తులు, శంకరాచార్యులు - యోగాచరణ గురించి చెప్పినవి కూడా  యిందులో  విశదంగా పొందు పరచడం  జరిగింది .

అష్టాంగ  యోగా కొరకు - మీరు ఈ పుస్తకం దాటి పోననవసరం లేకుండా వుండటమే నా వుద్దేశ్యం . సిద్ధాంత పరం గానూ , ఆచరణ పరంగానూ , ఈ పుస్తకం చాలు - అన్నంతగా వుంటుంది . అంటే , గురువు  వద్దని చెప్పటం లేదు . కొంత  గురు ముఖంగా నేర్చుకుంటే మేలు . కానీ, మీ వూళ్ళో, మీ దగ్గర్లో  ఎక్కడా , గురువే లేకుంటే ? యోగా మర్చిపోవాలా ? అక్కర్లే దు . అప్పుడూ యోగా చెయ్యొచ్చు . చెయ్యాలి .   యోగా భారత దేశం ప్రపంచానికిచ్చిన గొప్ప విజ్ఞానం . యిది అందరికంటే మనమే ఎక్కువగా నేర్చుకోవాలి .

అష్టాంగ యోగా అంటే - శరీరాన్ని రకరకాలుగా బంధించే విన్యాసాలు కాదు . యిది మొదట మనకు తెలియాలి. ఆ విన్యాసాల అవసరం పతంజలి  అష్టాంగ  యోగా లో చాలా తక్కువ . దాదాపు అవసరం లేనంత తక్కువ . యోగా అనేది మనసుతో మనం ఆడే ఆట . మనసును  మన అధీనం లో సంతోషంగా వుంచుకునే విజ్ఞానం . ఆ పైన మనసును దాటి, మనలను  గురించి  మనం పూర్తిగా తెలుసుకునే విజ్ఞానం యిది .

ఇదండీ కథ...

సర్వే  జనాః  సుఖినో  భవంతు

వుప్పలధడియం  విజయమోహన్ 







10, ఏప్రిల్ 2015, శుక్రవారం

శేషాచలం లో- మానవ హక్కులు - సామూహిక హక్కులు

శేషాచలం లో మానవ హక్కులు 

సామూహిక హక్కులు 


శేషాచలం అడవుల్లో యెర్ర చందనం వృక్షాలను అక్రమం గా కొట్టడమూ , ఆ కలపను అక్రమంగా రవాణా చెయ్యడమూ చాలా కాలం గానే  జరుగుతూ వుంది .   కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకు పట్టించుకోలేదో , ఎవరు చెబుతారు ?


యిప్పుడు చంద్రబాబు గారు  ముఖ్య  మంత్రి గా వచ్చారు . తెలంగాణా  విడి పోయిన తర్వాత , రాష్ట్రానికి పెద్దగా  నిధుల కొరత అనే సమస్య కూడా   వచ్చి పడింది.


మొట్టమొదటి నుండి  ముఖ్య మంత్రి గారు, మిగతా మంత్రులూ చెబుతూనే   వున్నారు - వొక్క ఈ యెర్ర చందనం అక్రమ రవాణా  ను నిలిపి ప్రభుత్వ పరంగా దాన్ని అమ్మ గలిగితే , ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్ధిక సమస్యలు  తీరుతాయని .


 ఎన్నో వేల, లక్షల కోట్ల విలువ గలిగిన ఈ యెర్ర చందనం - స్మగ్లర్ల చేతిలో పడి - ఆంధ్ర  ప్రజల వుమ్మడి సొత్తు , స్మగ్లర్ల సొత్తుగా మారి పోతూ వుంది . యింత విలువ గలిగిన, ఆంధ్ర ప్రజల వుమ్మడి సొత్తు దొంగలు దోచుకు పోతూ  వుంటే , అది ప్రజలందరి మానవ హక్కుల ఉల్లంఘన కాదా ? యిది నిలపడానికి మానవ హక్కుల సంఘాలు ఏం చేశాయి ? ఏం చేస్తున్నాయి ? దీన్ని గురించి వారెవరికీ ఏమీ  పట్టినట్టు లేదు . అయ్యా ! ఈ యెర్ర చందనం చంద్రబాబు సొత్తు కాదు . మీ సొత్తే . అది పోతే , మీ అందరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే .

వ్యక్తి హక్కులూ ముఖ్యమే . కానీ , సామూహిక హక్కులు అంత కంటే ముఖ్యం . అది పట్టించుకోరా ?


సరే . ప్రజలందరి వుమ్మడి సొత్తు పోతూ వుంటే - ప్రజలేం చేస్తున్నారు ? అదేదో చంద్ర బాబు స్వంత విషయమే గాని తమ విషయం కాదన్నట్టు వున్నారు . మన ప్రజలలో ఈ స్తబ్దత పోవాలి .


సర్వే  జనాః సుఖినో భవంతు


= మీ

వుప్పలధడియం విజయమోహన్

20, మార్చి 2015, శుక్రవారం

ఉగాది 2015 - మీకు నా శుభాకాంక్షలు , శుభాభినందనలు

ఉగాది -2015

 

ప్రకృతి లో 

మామిడీ , చెరుకూ , వేపా , మిరపా, ఉప్పూ , చింతా - షడ్రుచులకు ప్రతీకలు .   

 అవి కలసిన ఉగాది పచ్చడి 

జీవితంలో 

సంతోషానికి , మాధుర్యానికి , కష్టాలకూ , శోకాలకూ , బాధలకూ , రోగాలకూ , 

నిజానికి నవ రసాలకూ  ప్రతీకగా  నిలుస్తుంది .

అన్నిటినీ 

 స్థిత ప్రజ్ఞత తో స్వీకరించే తెలుగు మనసులకు 

 మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు 

నా హార్దిక శుభాకాంక్షలు 

ఈ సంవత్సరంలో -

మీ జీవితాల్లో 

సంతోషం , ఆరోగ్యం 

ప్రేమ , కరుణ 

ఐశ్వర్యం , ఆర్ద్రత 

నిండాలని -

మీ చుట్టూ వున్న వారిలో, మీ పట్ల 

మీ చుట్టూ వున్న వారి పట్ల , మీలో 

 స్నేహం, ప్రేమ పండాలనీ 
 
ఈ సంవత్సరం , మీ జీవితంలో 

ఒక నవ వసంతం కావాలనీ

మీకు నా శుభాకాంక్షలు , శుభాభినందనలు  తెలియజేస్తున్నాను . 


ఈ సంవత్సరంలో 

మనలో ప్రతి వొక్కరూ 

మనకంటే తక్కువ స్థితిలో వున్న 

మరొక్కరి జీవితాన్ని 

ఆదుకోవాలని , వుద్ధరించాలనీ 

ఆశిస్తున్నాను ; ఆ శక్తి , మానసికత మనలో 

అ దేవుడు నింపాలనీ 

ప్రార్థిస్తున్నాను . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 


PS :- పతంజలి యోగ సూత్రాల పై వ్యాఖ్యానంగా వొక పుస్తకం రాస్తూ వుండడం వలన  - ఈ మధ్య కాలం లో బ్లాగులో ఎక్కువగా రాయడం జరగలేదు . మరో నెలలోపు అది పూర్తి అయి పోతుందని నా నమ్మకం .  ఆ తరువాత , ఈ బ్లాగులో , మరింత విస్తృతంగా రాయడం జరుగుతుంది