11, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు - మీ రాశి ఫలాలు

తెలుగు వారందరికీ 

శ్రీ విజయ నామ సంవత్సర 

ఉగాది 

శుభాకాంక్షలు 

మీ రాశి  ఫలాలు 

మేషం :

ఈ సంవత్సరం మీరు చేసే పనిని బట్టి మీకు సరైన ఫలితం లభిస్తుంది. నందన నామ సంవత్సరంలో జరిగిన మంచి, చెడు అన్నీ తలుచుకుని సంతోష పడండి.  మీరు బాగా చదివితే - మంచి మార్కులతో మిమ్మల్ని పాసు చేయడానికి   గురువు సిద్ధంగా వున్నాడు. పౌర్ణమి నాడు చంద్రుడిని చూసిన వారికి మంచి సంతోషం లభించ గలదు.  ప్రతి పౌర్ణమికీ మీ చంద్రుడు, సుస్థానంలో వుంటాడు. ఆ రోజు చంద్ర గ్రహాన్ని చూడడం మర్చి పోకండి.  

వృషభం 


గంట పైన వొకే చోట కూర్చోకండి . రాహు కేతువులు మీ రక్త నాళాల్ని  గట్టిగా పట్టేసు కుంటారు. మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తారు.  ప్రతి దినం,  తెల్లవారి, సాయంకాలం సూర్యునికి నమస్కారాలు చేయండి. ఈ వ్రత ఫలితంగా మీకు సూర్య గ్రహ ఆశీర్వాదం తప్పక లభిస్తుంది  ఆయన ఆశీర్వాద  ఫలితంగా - మీకున్న జబ్బులన్నీ - చాలా వరకు ఈ విజయనామ సంవత్సరాంతం లోగానే  - తగ్గి పోయే సూచనలు కనిపిస్తున్నాయి.

మీరు ప్రేమించే వారి పట్ల - మీ శ్రద్ధ ఎంత మాత్రం వుందో - కాస్త పరిశీలించి చూసుకోండి. వారు మీకు చేయాలని కాదు - మీరు వారికేం చేస్తున్నారని చూసుకుంటే - మీ ఆనందం సంవత్సరమంతా వుంటుంది  

మిథునం 


ఈ సంవత్సరం - ఏమైనా సరే - మీ భార్యతో గానీ, భర్త తో గానీ కొట్లాడ కండి.  వారు ఏ మన్నా మీరు ప్రేమతో జవాబివ్వండి.

కొద్దిగా పొగడడం కూడా అప్పుడప్పుడూ - హృదయ పూర్వకంగా  చేస్తే, చాలా మంచిది. ఈ వ్రతం మంగళ గౌరీ నోము వంటి ఫలితాన్నిస్తుంది. మే-జూన్  నెలల లోగా - వారు పూర్తిగా మీ వైపు  ఆకర్షితులై వచ్చే అవకాశాలు కనపిస్తున్నాయి. అలా జరక్కుంటే - పై వ్రతం మరి కొన్నాళ్ళు పొడిగించండి . మీరే విజయ వంతులవుతారు.  సంవత్సరంలోపు మీరు - గృహమే కదా స్వర్గ సీమ అనగలరు.

మీరు చేసే ప్రామిస్ ల పట్ల శ్రద్ధ వహించండి . మీరు నెరవేర్చలేని ప్రామిస్ లు అసలు చెయ్య కండి. చేసిన ప్రామిస్ లు తప్పకుండా నెరవేర్చండి.    

కర్కాటకం 


మీ భర్త / భార్య - ఆఫీసుకు వెళ్ళేటప్పుడు;మరియు వచ్చిన వెంటనే - మీరు మాట్లాడే మాటలు వారికి సంతోషం కలిగించే విధంగా చూడండి.  వారికి సూర్య చంద్ర గ్రహాలు రెండూ చాలా బాగుంటాయి . మీ వారికి దీర్ఘాయుస్సు  కలిగిస్తాయి.  మరో విజయ నామ సంవత్సరం  ఉగాది నాటి వరకూ సంతోషంగా, ఆరోగ్యంగా  వుంటారు.

పిజ్జాలు, బర్గర్ లు, సమోసాలు లాంటి జంక్ ఫుడ్ ల జోలికి వెళ్ళ కండి . వెడితే మాత్రం , మళ్ళీ - మీ ఆరోగ్యం ఏ గ్రహం  వల్ల  చెడిందో చెప్ప లేము.  

 సింహం 


 మీరు రాజకీయాల్లో వుంటే - వోటర్లకు - ఏ వొక్కటో , రెండో  మంచి పనులు - కనీసం యిప్పుడైనా చేస్తే - మీరు వచ్చే యెలెక్షన్లలొ - గెలిచే ప్రమాదం - ప్రజలకు వుండనే వుంది. 

ప్రజలు ఎప్పటి లాగే, తమ కులం వాడికి, తమ మతం వాడికి వోటు వేసే ప్రమాదం వుంది.  నాయకుల ప్రోద్బలంతో, మీ మూర్ఖత్వంతో, ప్రక్కింటి వాడితో, యెదురింటి  వాడితో, బెంగాల్ లో లాగా,  పోట్లాటలకు దిగే అవకాశం  వుంది. రాహు కేతువుల ప్రభావం మన రాజకీయాల పై పూర్తిగా వుంది.  కొంత మంది రాజకీయ వాదులు, ఎంత లంచ గొండులుగా నిర్ధారితులైనా - మీరు మాత్రం మారరు. వారికే వోటు వేస్తారు. అయితే -  వొకరిద్దరు  మంచి నాయకులు తెర  మీదకు రావచ్చు. తత్కారణం గా - మీ రాజకీయ జీవితం ముగిసి పోయే ప్రమాదం వుంది. ముందుగా మేల్కొని అలాంటి మంచి నాయకులతో చేరితే - మీకు మంచి భవిష్యత్తు వుంటుంది.

యిక విద్యార్థుల ఉద్యోగుల సంగతి - మీ జీవితానికి. మీ ఆరోగ్యానికి, మీ పురోగతికి ముఖ్యం మీ చదువులు, మీ పరిశ్రమ, మీకున్న చాకచక్యాన్ని  బాగా వినియోగించుకోవడం.  దీన్నే - ఆంగ్లంలో - ది మెయిన్ థింగ్ ఇన్ లైఫ్ - ఈజ్ - టు  కీప్  ది మెయిన్ థింగ్ - ఆజ్ ది మెయిన్ థింగ్ - అంటారు .

క్రికెట్టు, సినిమాలు ఎప్పుడో వొకప్పుడు కావాల్సినవే గాని - ప్రతి రోజూ కాదు. దినమంతా కాదు . యిది తెలియని వారి లగ్నంలో - శని గ్రహం కూర్చుని ఆడిస్తున్నట్టు - తెలుస్తుంది - ఎప్పుడో . 

కన్య 


ఈ మధ్య వస్తున్న గ్రహ ఫలితాలు చూస్తుంటే - గ్రహాలూ యింత  త్వరగా తమ ఫలితాలు  యిస్తాయా - అని ఆశ్చర్యం వేయక మానదు. 

గత పదేళ్ళలో - మగ వాళ్ళలో సెక్సు సామర్థ్యం 30 శాతానికి - పడి పోయిందట. ఏ. సి గదుల్లో - గంటల కొద్దీ కూర్చుని - కంప్యూటరే దేవుడు - పిజ్జా లే ప్రసాదం - అనుకుంటే - ఈ ప్రమాదం వుండనే వుంది . ముందు చెప్పినట్లు - ప్రతి రోజూ సూర్యగ్రహానికి నమస్కారాలు చేస్తే - మీ పరిస్థితి మారుతుంది.  మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది.  

అలాగే - ఆయా రంగాల్లో వున్న ఆడవాళ్ళకు కూడా ఇలాంటి శుభ వార్తే  - వొక ప్రముఖ పత్రిక ప్రచురించింది . వారికి 29 నుండీ 35 ఏళ్ళ వయసు లో - మెనోపాస్ వచ్చేస్తో వుందట. కన్యగా వుండేటప్పుడే - మేనోపాస్. చంద్రుడి ముఖమూ, సూర్యుడి ముఖమూ చూడక పొతే - ఆ గ్రహాల ప్రభావం అలా వచ్చేస్తూ వుంది.  అది కాకుండా - శని ప్రభావం పెరుగుతుంది. మనలో పెరిగే సోమరి తనము శని గ్రహ ప్రభావమే . వాటి ఫలితాలు జీవితం లోని అన్ని రంగాల్లో కనిపిస్తూ వుంటుంది . 

అయితే - భర్త పిల్లల పట్ల ప్రేమ వున్న ఆడ పిల్లలకు విజయ నామ సంవత్సరం - బాగానే వుంటుంది . అదే విధంగా, తాగుడు, ధూమ పానం లాంటి అలవాట్లు లేక , భార్యను, పిల్లలను బాగా చూసుకునే మగ వారికి కూడా -  ఈ సంవత్సరం మంచిదిగానే వుంటుంది . 

తుల 


తులా రాసి వారు ఆచి తూచి, అందంగా  వ్యవహరిస్తే - వారి జీవితం రాహు కేతువుల బారిన పడ కుండా బాగానే వుంటుంది.  రేపటిని గురించి   శ్రద్ధ తీసుకునే వారికి - ఈ రోజూ బాగానే వుంటుంది. రేపూ బాగానే వుంటుంది . విద్యార్థులు కష్ట పడి చదవాలి . మార్కులు దానికి తులనాత్మకంగా వస్తాయి.

చాలా మంది రాజకీయ వాదులు, కొంత మంది ప్రభుత్వోద్యోగులు  - తమ పనికి వచ్చే లబ్ధి, లంచం - తులలో వేసి తూచి మరీ పని చేస్తారు - ఎప్పటి లాగే.  విద్యుత్తు, బొగ్గు, రహదార్ల నిర్మాణం వంటి రంగాలు ఎప్పుడూ అలాగే వుంటాయి. మనం వోటు వేసే విధానం మారితే తప్ప.

అయితే సంవత్సరాంతంలో - ప్రజలు , ప్రభుత్వంలో, మోడీ-ఫికేషన్  వస్తేనే మనకు మేలు అనుకునే సూచనలు కనిపిస్తున్నాయి .    యివన్నీ, తులా రాశిలో, తులనాత్మకంగా జరగా గలిగే పనులు.

ప్రతి వొక్కరికి - మీ పైన నమ్మకం వుండేట్లు ప్రవర్తించండి. నమ్మ దాగిన వారినే మీరు నమ్మండి. మీ జీవితం నమ్మకం గా మంచి దారిలో నడుస్తుంది.


వృశ్చికం 


కొండెతో కుట్టితే దెబ్బలు పడవా?  కాబట్టి - మన కొండే  మనకు శత్రువు. మన దురుసు మాటే , మన దురుసు చేతే  మనకు కొండె లాంటి  శత్రువు .  యిది జ్ఞాపకం వుంటే - జీవితంలో చాలా తప్పులు అసలు జరుగవు.

"అని అనిపించుకో  అత్తగారా" అన్నది పాత సామెత . అత్త గారు మంచి మాట అంటే -   కోడలు, మా అత్త మంచిది అని పది యిళ్ళలో చెబుతుందట . అత్త గారు వొక్క తిట్టు తిడితే, చీది, ఏడిచి, నానా రభసా చేసి, మొగుడి దగ్గర, మామ గారి దగ్గర, పది మంది దగ్గర - అత్త గారికి చీవాట్లు పడే లాగు చేస్తుందట.

విజయ నామ సంవత్సరం లో బృహస్పతి ఆశీర్వాదం మీకు కావాలి. మంచి వాళ్ళ మాట, బుద్ధి మంతుల మాట వింటే - మీరూ బాగుంటారు. మాచుట్టూ వున్న వారూ   బాగుంటారు.  గురు పూజ చేస్తే మేలు


ధనుస్సు 



వ్యాపారస్తులకు  - కొనే వాడికి - నాణ్యంగా వుండే సరుకు, సరసమైన ధరలలో అమ్మే వాడికి - ఎప్పుడూ - ధన లాభం వుండనే వుంటుంది. ప్రతి వస్తువులో - మరేదో కలిపి అమ్మే వాడు - నరకానికే వెడతాడు. వాడిని శనిగ్రహం వెంటాడుతూనే  వుంటుంది.


ఉద్యోగులకు , విద్యార్థులకు - మనసులో నిరుత్సాహం వీడండి . ధైర్యంగా - మీ అభివృద్ధికి , మీ చుట్టూ వున్న వారి అభివృద్ధికి, కృషి ప్రారంభించండి.    మీరు ధనుస్సు పట్టాలి.  విజయ నామ సంవత్సరంలో - యిలా చేసే మీ వారందిరికీ - విజయం  లభిస్తుంది.

భార్యా భర్తలకు  - మీ జీవితంలో కనీసం వొక్కరి పూర్తి  బాధ్యత మీరు వహిస్తే -   మీ  జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి అయి వుంటే - ఆ వొక్కరూ   మీ భార్య / భర్త గా వుండాలి .  అలాగే, మీరు మగ వారైతే - మీ తల్లి దండ్రుల బాధ్యతా కూడా మీదే.  ఆడ వారైతే - మీ అత్తా మామల బాధ్యత . ఆ. అదేమిటి పక్షపాతం అనకండి.  

భార్యలకు - మీ యింటి ఆడ బిడ్డ  మీ అత్తా మామ (అంటే తన తల్లీ దండ్రీ ) బాధ్యత  తాను వహిస్తానంటూ  పూనుకుంటే - మీ కొంప కూల్చేస్తుంది. మీకు, మీ అత్తగారికి, భర్త గారికి మధ్య అగ్గి రాజేస్తుంది.  తెలిసా తెలియకా అన్నది కాదు ప్రశ్న - అలా చాలా చోట్ల జరుగుతూ వుంది.    మీరు మీ పుట్టింటికి 'మరీ ఎక్కువగా వెళ్లి'  చొరవ చేసుకుంటే - అక్కడి కోడలి అవస్థ కూడా అలా కావచ్చు. ఈ కాలం లో హక్కుల కోసం పోరాటం యెక్కువ.  బాధ్యతల పట్ల దృష్టి  తక్కువ -ఆడవారైనా సరే . మగ వారైనా సరే.  అందరూ యిలా వుంటారని కాదు. కానీ చాలా చోట్ల యిది జరుగుతూ వుంది.  

మకరం 


వొక మకరం  వొక ఏనుగు కాలు పట్టుకుని వేల ఏళ్ళు  పోరాడిందట. చివరకు దానికి ముక్తి లభించింది . కష్టే ఫలీ -అన్నారు. ఈ సంవత్సరంలో - మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు  విజయం లభిస్తుంది.

విజయం వచ్చే వరకు, నమ్మకంతో, ప్రయత్నం చెయ్యాలి. యిదే మీరు చెయ్యాల్సింది . అన్ని గ్రహాలూ - మీకు అనుకూలిస్తాయి .

మీరు పెళ్లి కావలసిన అమ్మాయైతే - నా సలహా వొక్కటే . తాగుబోతు వాడిని  మాత్రం  పెళ్లి చేసుకోను - అని మీరందరూ పట్టుదలతో వుంటే - మగ వారందరూ - బాగు పడే సూచనలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రేపు  లు లాంటివి కూడా బాగా తగ్గి పోతాయి. మీ జీవితం కూడా  ఆనందంగా వుంటుంది.
  

    

 కుంభం 


యుక్తాహార, విహారస్య , యిక్త చేష్టస్య కర్మణి -   అని - గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు . ఏది తినాలో ఎంత, ఎప్పుడు  తినాలో - అదే, అంతే తింటే - ఆరోగ్యం.

ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత సేపు తిరగాలో - అలా తిరిగితే , ఆరోగ్యమూ . సంతోషమూ.

ఏ పని చేస్తే మంచిదో - మనకూ ,అందరికీ - అదే చెయ్యాలి.  బృహస్పతి, బుధ గ్రహాలు మీకు  అనుకూలిస్తాయి.

ఏ పని చేసినా - దాని ఫలితాలు - మీకు రానే వస్తాయి. కోట్లు ఈ రోజు - జైలు రేపు వచ్చే పనులు చెయ్యకండి .

ప్రతి వొక్క రోజూ - కనీసం వొక పేద వాడి ముఖం లో సంతోషం  చూడగలిగితే - అటువంటి పనులు చేస్తే - శని గ్రహం కూడా, మిమ్మల్ని కాపాడతాడు.

అలాగే - ప్రతి బుధ వారం - ఈ రోజు , నేను, ఏ  వొక్కరినీ - మనసా వాచా కర్మణా - దూషించను, విమర్శించను, అనే వ్రతం పాటించండి. బుధ గ్రహం మీకు, అనుగ్రహిస్తుంది. మీ సంతోషం  పెరుగుతుంది     


మీనం

సముద్రం లోని చేప - సముద్రం ఎక్కడుందా - అని వెదికిందట .

అలా - మీ ఆరోగ్యం, మీ సౌభాగ్యం, మీ ఐశ్వర్యం - మీలోనే వుంచుకుని - ఎక్కడెక్కడో - వెదుకుతారు . ఎప్పుడో తెలుస్తుంది, మీలోనే వుందని.

అది విజయ నామ సంవత్సరంలో - తెలిసే అవకాశాలు పూర్తిగా వుంది.

అన్ని గ్రహాల ఆశీర్వాదం అన్ని రాసుల వారికీ - అందులో మంచిగా వుంటూ . మంచి పనులు చేసే వారికీ , బాగా, తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించే వారికి - పుష్కలంగా వుంది.

వోటు వేసేటప్పుడు - మన వాడికి కాదు - మంచి వాడికి అనేది గుర్తుంది చస్తే - మనమూ , దేశమూ బాగు పడతాము . 66 ఏళ్ళుగా యిది జరగడం లేదు . విజయ నామ సంవత్సరంలో - జరగ వచ్చు . 

శుభం భూయాత్  

= మీ

వుప్పలధడియం విజయమోహన్
  


    
    

    

5, మార్చి 2013, మంగళవారం

16 సంవత్సరాల వారికి - విశ్రుంఖల సెక్సు హక్కు- అసలు సమస్య ఏమిటి ?



ప్రపంచం  లో  మార్పు  వొక్కటే ప్రతి క్షణం జరిగేది.ప్రతి అణువు లోనూ జరిగేది.  

మార్పు ఆగదు. ఆపలేము. 

ప్రతి ప్రాణి పుట్టుక, పెరుగుదల, అరుగుదల, చావు అన్నీ మార్పులో అంతర్భాగమే.

ప్రాణిగా - మనిషికీ ఇవేవీ తప్పదు.

అయితే చాలా మార్పులు - మనమే ఆలోచించి తీసుకు వచ్చేవి. అవి మంచా, కాదా, చూడాల్సిన అవసరం తప్పకుండా  మనపై వుంది . ఎందుకంటే,  మన కర్తృత్వం లో, మనం తీసుకువచ్చే మార్పులు విషయంలో - మనకు, ఎంతో కొంత స్వతంత్రం వుంది; కొన్ని పరిధులలో యిదా, అదా, మరోటా - అని ఆలోచించి - ఏది మంచిదో  అది - చెయ్యగలిగే వెసులుబాటు వుంది. అందుకనే శ్రీ కృష్ణుడు "కర్మణ్యేవ అధికారస్తే - మా ఫలేషు కదాచన" అన్నాడు.

నువ్వు చేసే  పనుల విషయం లో  - నీకు పూర్తి  అధికారం వుంది . కానీ వాటికి ఏ ఫలితం వస్తుందో - అది మాత్రం పూర్తిగా నీ అధీనంలో లేదు. నీ పనిని బట్టి, ప్రకృతి  నియమాల బట్టి , నీకు ఏ ఫలితం రావాలో - అదే వస్తుంది గాని  నువ్వు అనుకున్న ఫలితం రాక పోవచ్చు .

ఎందుకు నేను అనుకున్న ఫలితం రాలేదు? అంతా తారుమారు ఎందుకు అయ్యింది? ఈ ప్రశ్నలు అసంబద్ధమైనవి.  ప్రకృతి  నియమాలకు అనుగుణం గా చేసేపనికి ఆ నియమాలకు అనుగుణం గానే ఫలితాలు వస్తాయి. మనం అనుకున్నట్టు రావు.   అయితే - ప్రకృతిలో  ఎన్నో మార్గాలు వున్నాయి. ఆ మార్గాలలో ఉత్తమ మార్గాలు వున్నాయి. మధ్యమ మార్గాలు వున్నాయి. అధమ మార్గాలు వున్నాయి.  వాటి వాటి ఫలితాలు వాటి వాటికి వున్నాయి.

స్థూలంగా చెప్పాలంటే - బుద్ధితో సంప్రతించి బుద్ధి మార్గంలో - వెళితే అది ఉత్తమ మార్గం. మనసుతో మాత్రం సంప్రతించి ఆ మార్గంలో, వెడితే  అది అధమ మార్గము. బుద్ధికీ మనసుకూ - కూడా సబబైన మూడో మార్గం మధ్యే మార్గం.

ఈ రోజు వార్తలలో - వొక చిన్న వార్త.  తమకు తాముగా - సెక్సు లో పాల్గొనడానికి   16 సంవత్సరాల వారికి కూడా హక్కు కల్పిస్తున్నారు(ట) - ప్రభుత్వం వారు.

కానీ, పెళ్ళికి మాత్రం 18-21 సంవత్సరాలు  వయో పరిమితి అలాగే వుంటుంది. యిది మీకేమైనా అర్థం అయ్యిందా?

యిది, పెళ్ళికి ముందే - విశ్రుంఖల సెక్సు కు అనుమతినిచ్చినట్టు కాదా?

యిది - వస్తే మనం ఎవరినీ ఆపలేము. అమెరికాలో ఇప్పుడున్న వొక ప్రధాన సమస్య - చిన్న పిల్లల గర్భ ధారణ. ఏ వయసులో, ఎవరు, ఎప్పుడు పిల్లలను కంటారో, వారికి తండ్రి ఎవరో,  ఎవరికీ తెలియటం లేదు.

యిక మన దేశంలోనూ - అటువంటి పరిస్థితి  త్వరలో వచ్చేస్తుంది.

మనం యిక్కడ గమనించాల్సింది - ఈ స్వేచ్చా సెక్సుకూ - ప్రేమలకూ - ఏమీ సంబంధం లేదు.

యిది కేవలం శారీరక సంబంధమైన, హర్మోనుల్లో పుట్టిన  వికారమే తప్ప - ప్రేమా కాదు, దోమా కాదు.

పిల్లలకు అర్థం కాక పోవచ్చు కాక. పెద్దలకైనా అర్థం అయ్యి చస్తే బాగుంటుంది.

ఎవరు పెద్దలు ? తమ స్వార్థం తప్ప ప్రజల క్షేమం గురించి ఏమీ పట్టని వారంతా - పెద్దలయి కూర్చుంటున్నారు .

 అసలు సమస్య ఏమిటో అర్థం కాని వారు పెద్దలు గా వుంటున్నారు.

ఆడ మగ - అందరికీ  15 ఏళ్ళ వయస్సులో -  వయో సంబంధమైన హార్మోనుల అలజడి ఎక్కువగా ఉంటుందనేది -అందరికీ తెలిసిన సత్యమే.

అయితే - ఆ వయసు నుండీ ప్రతి వొక్కరితో - సెక్సు లో, పాల్గొనచ్చు ,అని - పర్మిషన్ యివ్వడం, ఈ సమస్యకు అతి దారుణమైన, ప్రమాద కరమైన  - సమాధానము

యివన్నీ లక్షలాది సంవత్సరాల నుండీ వున్న సమస్యలే.   14-15 సంవత్సరాలలో -ఈ హర్మోనుల అలజడి రావడం మనిషి పుట్టిన నాటి నుండీ వుంది.

కాకపోతే , ఆ రోజుల్లో, యిటువంటి సమస్యలకు - సంఘానికీ,  ప్రతి  మనిషికీ,  ఎంతో కొంత, మేలు జరగ గల సమాధానాలు  వెదికారు.

ఆ రోజుల్లో - బాల్య వివాహాలన్నారు. మంచి వాడిగా, వున్న వరుడిని చూసి, మంచి పిల్ల గా వున్న వధువును చూసి పెద్దలు చేసే వారు.

ఆహా. అది తప్పు. 18 - 21 ఏళ్ళ తరువాతే - పూర్తి పరిణితి  వచ్చిన తర్వాతే, పెళ్లి జరగాలన్నారు మధ్యలో.

మాకు యిష్టం వచ్చిన వారిని ప్రేమించి పెళ్లి  చేసుకుంటాం అన్నారు తరువాత.

ఆ యిష్టం ఎలా వస్తుంది?

ఎలా వస్తుందంటే - 16 ఏళ్ళ వయసు నుండీ - పది మందితో తిరిగి-  ఆ తిరగడమంటే ఏమిటో, యిప్పుడు అర్థం మారుతోంది  - అలా తిరిగిన  వారిలో తమకు నచ్చిన వాడిని / దానిని  చేసుకోవడమే.

యిది మంచికంటారా?  మంచి అని - ఎవరంటారో నాకు తెలీదు కాని - నేను మాత్రం మంచి కాదనే అంటాను.

మొదట కో-ఎజుకేషన్ కావాలన్నారు. తరువాత, సెక్సు-ఎజుకేషన్ కావాలన్నారు.   యిప్పుడు అసలు సిసలు సెక్సు కావాలంటున్నారు, 16 ఏళ్ళ వయస్సులో. దీని తరువాత ఏమిటి?

ఏమీ లేదు. దీని తరువాత అమెరికాలో - గే-యిజం, లెస్బియనిజమ్  వచ్చాయి. స్కూళ్ళలో, మించితే కాలేజీల వరకు - మామూలు సెక్సు. ఆ తర్వాత, అవతలి వారెవరూ నచ్చక పోవడమూ -స్వలింగ సంపర్కానికి అలవాటు పడడమూ ; ఆ తరువాత ? మగవారికి, మగ వారితో పెళ్లి. ఆడవారికి ఆడవారితో పెళ్లి. ఎందుకు? ఏమో? యిది అమెరికాలో చాలా రాష్ట్రాలలో చట్ట బద్ధం చేసేసారు. 

ఆ తరువాత ?? ఆ తరువాత ఎలా మారుతుందో మన ప్రవర్తన !! అది దేవుడికి కూడా తెలీదు.

మన దేశంలో , పూర్వకాలం లో - మగ వాడికి - చదువు పూర్తయ్యే వరకు వరకు బ్రహ్మచర్యము అలవాటు చేసే వారు. తనపై తనకు కొంత కంట్రోల్ వచ్చిన తర్వాత - పెళ్లి చేసే వారు. అది కూడా, 16 ఏళ్ళ వయస్సులో చేసేసే వారు. ఏ ఆటలాడినా - పెళ్లి అనే బంధంలో - వొకరితో వొకరు ఆడుకోండని  విడిచే వారు.

ఈ రోజు కంట్రోల్ కాదు. విచ్చల విడి తత్త్వం అలవాటు చేస్తున్నారు .

ఈ భాగ్యానికి,  16 ఏళ్ళకే - పెళ్లి కీ అనుమతి ఇచ్చేస్తే పోలా ?

ఎవరో వొకరితో సెక్సు సంబంధం అలవాటవుతుంది. అదే ప్రేమగానూ మారుతుంది. అదేదో కాస్త ఆరోగ్య ప్రదం గానూ వుంటుంది.

 వెయ్యి కాళ్ళ మంటపం లాంటిది మన సంస్కృతి. యిది బాగాలేదు, అది బాగా లేదు - అని వొక్కొక్క కాలూ  పీకేస్తే - మంటపం కూలిపోతుంది. అదే జరిగింది అమెరికాలో . అదే జరుగుతూ వుంది మన దేశంలోనూ.

ఈ కలికాలాన్ని ఆప గలమా? ఊహూ. ఆపలేము. రేపటి నుండి - మాకు స్వేచ్చా సెక్సు కావాలి, కావాలి అంటూ, కేకలు వేసుకుంటూ కుర్రకారు ప్రదర్శనలు జరిపినా ఆశ్చర్య పోనక్కర లేదు. 16 కాదు - 14 నుండి కావాలి అన్నా - ఆశ్చర్యం అక్కర లేదు.

అడిగే వాడికీ తెలీదు, యిచ్చే వాడికీ తెలీదు - మనం ఎక్కడికి పోతున్నామో ?   

కొస మెరుపు. ఎవరో వొకావిడ - తీరా తాళి కట్టే సమయంలో - హాల్ట్! అనింది. ఎందుకు, అంటే - నాకు , మరొకరితో,  మరో మతం వాడితో ప్రేమ. వాడినే పెళ్లి చేసుకుంటా - అనింది.   మరి, అంత వరకు నోరు మూసుకుని వుండి, మరో మగవాడి ప్రాణం తియ్యడం ఎందుకు? ఎంత ఖర్చు? ఎంత టైం , డబ్బు, గౌరవం, ఆఫీసు లో లీవూ వేస్టు?  సరే. కోపాలు రావడం సహజం.  వాళ్ళూ, వీళ్ళూ కొట్టుకున్నారట - అసలు దోషిని విడిచేసి.

ఈవిడ - అక్కడికెళ్ళి, ఏ నాలుగో పెళ్ళాం గానో, రాజ్యం చెయ్యొచ్చు.  యిదొక ప్రేమా? కంపు కొట్టడం లేదా ? ఎవరన్నా గౌరవం లేదు. తమ హార్మోనుల గొడవ తప్ప మరొక ధ్యాస  లేదు.  మరొకరి కష్టం గురించి అసలు యోచన లేదు. పోనీ - తమ భవిష్యత్తు గురించి ఆలోచన వుందా అంటే - అదీ లేదు.

దేవుడెలాగూ శిక్ష  వెయ్యనే వేస్తాడు. పోతే పొనీ.

16 ఏళ్ళలో - స్వేచ్చా సెక్సు - కనీసం వొక్క సంవత్సరమైనా, వొక్కరితోనే వుండాలి -  అంటే ఎలా వుంటుంది? స్వేచ్చా సెక్సు ఎవరితోనో , పెళ్ళీ వాళ్ళతోనే - అంటే - ఎలా వుంటుంది?

పోనీ ఏకంగా, వొక్క సారి స్వెచ్ఛా సెక్సు జరిగితే - వెంటనే పెళ్లి చేసేసుకోవాలి - అంటే ఎలా వుంటుంది? అసలు స్వేచ్చా సెక్సు పెళ్లి కాని వాళ్ళతోనే - అంటే?  అప్పుడు, నాయకులు, వినాయకులు,  గూండాలు, టీనేజ్  బాలికలతో ఆడుకోవడం కాస్త తగ్గొచ్చు కదా.  ప్రభుత్వం వారికి, ఇవేవీ పట్టడం లేదు. స్వేచ్చా సెక్సు కు, వయస్సు తగ్గించాలి - అదీ 16 ఏళ్ళకు - అంతే వారి ఆలోచన.  


= మీ

వుప్పలధడియం  విజయమోహన్






 

21, ఫిబ్రవరి 2013, గురువారం

వేమన ఏమన్నాడు? = మనం బాగు పడాలంటే = ఈ చిన్ని వ్రతం ( వొక వారం రోజుల పాటు) చేద్దామా ?



జ్ఞాని వేమన ఏమన్నాడు?

తప్పులెన్ను వారు తండోపతండంబు  
లుర్వి జనులకెల్ల నుండు తప్పు 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు 
విశ్వ దాభిరామ వినుర వేమ !

వేమన తెలుగు వారి కొక మకుటం లాగా, గుర్తింపు  తెచ్చాడు.

ఆయన గురువులకందరికీ  గురువు. ఏ గురువు గారైనా మనకు జీవితం  గురించి  విడమరిచి చెప్పాలంటే ,  వేమన పద్యాలు వివరించి చెబితే చాలు. జీవిత సారాంశం  చాలా వరకు అర్థమై పోతుంది. 

ఈ పద్యాలు నేను ఎప్పుడో, నాలుగేళ్ల వయసులో , మా అమ్మమ్మ గారు నేర్పిస్తే నేర్చుకున్నవి.    అరవై మూడేళ్ళ వయసులో - యిప్పటికీ చాలా వరకు జ్ఞాపకం  వున్నాయి.

మచ్చుకు వొక పద్యం యిక్కడ ఉదాహరించాను.

ఈ నాలుగు చిన్ని చిన్ని వాక్యాలలో - ఎంత అర్థం వుందో - చూడండి.

తప్పులెన్నువారు    తండోపతండంబులు - నిజమే కదా.

ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో  అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే.  విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే  తప్పు  - కనీసం మనం చెయ్యకుండా వున్నామా?  వూ. అదీలేదు. ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు -    తప్పులెన్నువారు    తండోపతండంబులు. నిజమే కదా!

సరే . రెండో వాక్యం చూడండి.      "ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు"

తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి.

దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు. పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ  జీవిత సూత్రాలు.

 మరి మూడో వాక్యం చూద్దాం : " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు "

యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు.

నాలుగో వాక్యం అంత కంటే ముఖ్యం - "వినుర వేమా!"

యివన్నీ - ఆయన తనకోసమే చెప్పుకుంటున్నట్టు రాశాడు. అంటే, వేమన గారు - మనిషికి , ఈ విషయాల్లో,  అంతర్మథనం - చాలా ముఖ్యమైనట్టు చెబుతున్నారు.

ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం.

సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు .

మారితే వారు బాగుపడ్డారు.  మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది?  మనం ఎవరు చెబితే వింటాం? "తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు.

"నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు.   మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది. ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో  ప్రణాళిక  వేసుకొవాలి.  దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన.

మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం.  నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తామ్. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది.

మన పూజలలో, ప్రార్థనలో - పక్క వాడి తప్పుల గురించి లేదు. వాడి పాపాల గురించి లేదు. మన తప్పులు, మన పాపాల గురించే వుంది.

పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే.

సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ?

మాట్లాడొచ్చు .  మొదట - వారి తప్పులు, మనలో  లేకుండా చూసుకోవాలి.  తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి.

సంస్కృతంలో వొక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం".

సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది.

కొంత మంది అంటూ వుంటారు - నాకు కర్ర విరిచినట్టు మాట్లాడడమే అలవాటు అని. అదేదో  గొప్ప అయినట్టు చెబుతూ వుంటారు. వారు, అసలు మాట్లాడడమే తెలీని వారు - అన్న విషయం వారికి తెలీదు.  అంటే - మనం తెలుసుకోవాల్సిన విషయం - మనం అలా వుండకూడదని.

సరే . నాయకుల విషయంలో - వారి తప్పులు వారికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా వుంది. అదే - ప్రజాస్వామ్యం.

శ్రీ రాముడు - గూఢ చారుల వద్ద ముఖ్యంగా అడిగేది యిదే.

నా పాలనలో వున్న తప్పుల గురించి ప్రజలేం మాట్లాడుతున్నారు - అని.   శ్రీ రాముడి పాలనలో - ప్రజలకు ఆ స్వతంత్రంవుంది. రాజు పాలన గురించి ప్రజలు -మాట్లాడాలి; మాట్లాడే వారు; అది రాముడు వినే వాడు.

కానీ, ఈ రోజు, మన నాయకులకు - తమను గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారో - అన్న బాధేం లేదు.

కొంత మంది నాయకు(లు / రాళ్ళు) - ప్రజలు తమను గురించి - వొక్క మాట - మాట్లాడితే -వారిని జెయిల్లో వేసేస్తున్నారు. వీరంతా - ప్రజాస్వామిక నాయకులనడం - సిగ్గు చేటు. "తప్పులే" చేస్తాననే నాయకులు - మన దేశం లో ఎంతో మంది . మరి మన తప్పేమిటి? వీరిని నాయకులుగా ఎన్నుకోవడం.

నాయకుడు లంచ గొండి  వాడైతే - దేశమంతా లంచ గొండి తనం ప్రాకి పోతుంది.  నాయకుడు స్వార్థ పరుడైతే -దేశమంతా అలాగే తయారవుతుంది. మనం మతం వాడని మన కులం వాడని మనం ఎన్నుకునే నాయకులు - ఎప్పుడూ న్యాయం చెయ్యలేరు, చెయ్యరు. మంచి వాడు, నిజాయితీ పరుడు నాయకుడైతే - అతడెన్ని తప్పులు చేసినా సరే - దేశం బాగు పడుతుంది. అతడు మనం చెబితే వింటాడు కూడా. అదే  రామ రాజ్యం .    అదే ప్రజా స్వామ్యం.

కుల రాజకీయాలు పక్కన బెడితే - మంచి నాయకులు మనకు కనిపిస్తారు.

సరే. దేశం బాగు పడాలంటే -మంచి నాయకులు కావాలి. మన తప్పులు మనం - గుర్తించి , మంచి వారిని మన నాయకులుగా ఎన్నుకోవాలి. 

మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట.  

ఈ రోజు నుండీ - వొక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని వొక వ్రతం పెట్టుకోండి. మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది . మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం  నిండుతుంది .  

శుభం భూయాత్

= మీ
 
వుప్పలధడియం విజయమోహన్

చివరి మాట : నేను చేసినవే , పాఠకులకూ చెబుతాను. చేయనివి, చెయ్య లేనివి - చెప్పను.     

  
 

4, జనవరి 2013, శుక్రవారం

ఏ వ్యాధైనా తప్పకుండా తగ్గుతుంది. ఎలా ? రోగాలు ఎలా రాకుండా జాగ్రత్త పడాలి? ఆరోగ్యానికి మూల సూత్రాలు ఏవి?

 

ఏ వ్యాధైనా తప్పకుండా తగ్గుతుంది. ఎలా ?

రోగాలు - ఎలా తగ్గుతాయి? - ఎలా రాకుండా వుంటాయి?

ఆరోగ్యానికి  మూల సూత్రాలు ఏవి?

  


రోగాలు మనిషికి ఎప్పుడైనా రావచ్చు. తల్లి కడుపులో ఉన్నప్పుడే రావచ్చు; పసి పాప గా వున్నప్పుడు  రావచ్చు; పెరిగేటప్పుడు రావచ్చు. యవ్వనంలోనూ రావచ్చు. మధ్య వయస్కులుగా ఉన్నప్పుడు, ముసలితనంలో- ఎప్పుడైనా రావచ్చు. చనిపోయే  వరకు ఏ క్షణంలో నైనా రావచ్చు.

రోగాలు వస్తూ వుంటాయి. ఏదైనా సరే - వొక కాలంలో వచ్చేది, మరో కాలంలో పోతుందని, తాత్త్వికులు చెబుతారు . కానీ- కొన్ని రోగాలు రావడమే గాని, పోవడం అంటూ వుండదు కొందరికి. మనం పోయేటప్పుడు, మనతో బాటే అవీ పోతాయి. అంత వరకు మనతో బాటే వుంటాయి.

కొన్ని మహా బాధ పెట్టేవి. మరి కొన్నిటిలో శారీరక బాధ తక్కువ. అటువంటి వాటిని మనం తరచూ పట్టించుకోక పోవడం  జరుగుతుంది, మన కొంప అవి ముంచే వరకూ .

మరి కొన్ని అసలు  రోగాలా, కాదా - అని చెప్పడం మహా కష్టం. పుట్టే టప్పుడు,  తలలోనో, వీపులోనో, మరెక్కడో అతకబడి పుట్టిన పిల్లలు వున్నారు. అది సరి చెయ్యకపోతే, జీవితాంతం వారికి ఎన్నో రకాల బాధలు తప్పవు. సరి చెయ్యాలంటే  ఎన్నో సమస్యలు.

అయిదారు ఏళ్ళ పాపకు మధుమేహం. కొందరికి పుట్టినప్పుడే గుండెలో ఏదో సమస్యలు. లేదా, కొందరికి ఎప్పుడూ  ఎడతెగని పడిశం, దగ్గు లాంటి చిన్న, చిన్న రోగాలు. పేరు చిన్న, కానీ అవి పెట్టే బాధ, పెద్ద రోగాలు కూడా పెట్టవు . ఏ రోగానికీ తట్టుకోలేని పిల్లలు ఎంతో మంది.

కొంత మందిని, పుట్టేనప్పుడే, అనారోగ్యంతో ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? ఆ..అది...వాళ్ళ నాన్నా, అమ్మలకో,  వా...రి నాన్నా అమ్మలకో... ఆ.. జబ్బులు వుంది కాబట్టి వీరికీ వచ్చింది - అంటుంది సైన్స్. పోయిన జన్మ లో చేసిన కర్మ ఫలితం నాయనా - అనుభవించక తప్పదు అంటుంది - కర్మ సిధ్ధాంతం . రెండూ కొంత నిజమే కావచ్చు.

మరి వచ్చినవి - ఎప్పుడు పోతుంది ,ఎలా పోతుంది? కొన్ని పోనే పోవు  అంటుంది సైన్స్. చేసిన కర్మ ఫలితం తీరిపోతే మంచైనా, చెడైనా , ఏదైనా పోతుంది - అంటుంది కర్మ సిద్దాంతం. - అయితే రోగాలకు వైద్యం వొద్దని కర్మ సిద్దాంతం  చెప్ప లేదు.  సమస్యలకు సమాధానాలు వెతకొద్దని ఎప్పుడూ చెప్ప లేదు.

వొక్కో సారి - కొన్ని ప్రాంతాలలో , మహా మారి లాగా కొన్ని రోగాలు లక్షల, కోట్ల మందిని పీడిస్తాయి. ఉదాహరణకు,ఆఫ్రికాలో, కొన్ని ప్రాంతాలలో, ఎయిడ్స్ వ్యాధి, ముప్ఫై శాతం మందికి వుందట. ఎయిడ్స్ వ్యాధి కి యిప్పటికీ మందు లేదు.యిప్పట్లో వచ్చే ఆస్కారం కూడా కనిపించడం లేదు. కానీ వ్యాధి రాకుండా కొంత జాగ్రత్త పడ వచ్చు.  వొక్క  దక్షిణ ఆఫ్రికాలో మాత్రం  2010 లో 2,80,000 మంది ఎయిడ్స్ వలన చని పోయారట చనిపోయే వారిలో  ఎయిడ్స్ తో పోయే వారి శాతం ఆ దేశంలో - చాలా ఎక్కువ .

మన దేశంలో - మధుమేహం, రక్త పోటు, ఆస్తమా, గుండె జబ్బులు -అన్నీ ఎక్కువగా వున్నాయి.-అయితే  భారతీయులంతా - వీటికి భయపడడం మానేశారు. మీకుందా, అంటే మీకుందా అని అడుగుతూ - మీరేం తీసుకుంటున్నారు అంటే, మీరేం తీసుకుంటున్నారు అని తెలుసుకుంటూ - వొకరికొకరు సలహాలిచ్చుకుంటూ - బ్రతికేస్తున్నారు.

అల్లోపతి లో కొన్ని నూతన పరిశోధనలు జరుగుతూ వున్నాయి. పాత రోగాలకు మందులు వస్తే - కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి. కలరా పోయిందా. డెంగ్యూ వచ్చింది. మలేరియా పోతే స్వైన్ ఫ్లూ  వచ్చింది. మరి కొన్ని వ్యాధులకు పేర్లే లేదు. రేపేం కొత్త వ్యాధి వస్తుందో ఎవరికీ తెలీదు.

కనీసం వొక్క నెలైనా -  ఏ  రోగంలేకుండా వున్న కుటుంబం ఎక్కడైనా వుంటే - దాన్ని చూడాలని ఆశ  పడుతున్నాను. కానీ ఈ రోజు వరకూ చూడలేక పోతున్నాను.

ఎవరో వొక మాట చెప్పారు ఈ మధ్య.  ప్రతి సగటు మనిషీ, ప్రతి రోజూ,  తెలిసో, తెలియకో, కనీసం నాలుగు అబద్ధాలాడతారట. అంటే - సంవత్సరానికి, దాదాపు 1,500 అబద్ధాలన్న మాట. 70 ఏళ్ళ జీవితంలో లక్షకు పైగా అబద్ధాలాడతారట.కొంత మంది పది లక్షల అబద్ధాలు చెప్పే వారూ వున్నారు. అంత కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పే వారూ వుండ వచ్చు.

చిత్రమేమంటే - దీన్లో  సగం భాగం అబద్ధాలు జీవితాంతమూ వొక్కటే అబద్ధమే. అదేమిటంటే - ఐ ఆమ్  ఫైన్  - తెలుగులో , "నేను బాగున్నాను" - అనడం.  కానీ - ఆ తరువాత పది మాటలు మాట్లాడిస్తే - తను ఎన్ని రకాలుగా బాగా లేదో నిజం చెప్పేస్తుంటారు.

నేను బాగున్నాను - అని నోటితో అనే  వారు వున్నారు కానీ, నేను బాగున్నాను అని తనలో తాను నిజంగా, మనస్ఫూర్తిగా  అనుకునే వారు, అనుకోగలిగే వారు - చాలా తగ్గి పోతున్నారు, ఈ రోజుల్లో .

శారీరక రుగ్మతలు మాత్రమే కాదు.  మనకు తెలిసినవి తెలీనివి - అనేక  రకాల మానసిక రుగ్మతలు కూడా మన సమాజంలో చాలా ఎక్కువ;   యింకా ఎక్కువ అవుతున్నాయి  అని - తెలుస్తూనే వుంది.

ఎందుకిలా? మనం బాగుండగలమా? బాగున్నామని మనస్ఫూర్తిగా అనుకోగలమా?ఎందుకు, ఎప్పుడూ బాగుండ  లేని పరిస్థితులలో చాలా మంది వుంటున్నాము?

రామ రాజ్యం అంటే ఏమిటి?  రోగాలు చాలా తక్కువగా వుండడం. అకాల మరణాలు లేకపోవడం. ప్రజలలో ధార్మిక జీవనం వలన - సుఖ సంతోషాలు ఎక్కువగా వుండడం - యివన్నీ  రాజుగా వున్న వారు  ముఖ్యంగా చూసుకోవలసిన విషయం.

భవిష్యత్తులో  వోటు వేసేటప్పుడు - "మన' వాడికి" కాదు - "మంచి వాడికి" వోటు వేద్దాం. ఆ వొక్క పని చేస్తే, మన రోగాలు సగం తగ్గుతాయి.

యిప్పుడు వున్న రోగాలు పోగొట్టుకోవడం ఎలాగో కాస్త చూద్దాం .


చాలా మంది వైద్యులు, మీరు జీవితాంతామూ మందులు తీసుకుంటూ వుండాల్సిందే, కష్ట పడాల్సిందే - అన్న వ్యాధుల గురించి - ముఖ్యంగా, కొంత మంది రోగులు, నన్ను సలహా అడుగుతూ వుంటారు.

నేను వైద్యుడు కాదు - కానీ - ఏ రోగాన్నైనా - పూర్తిగా నయం చేయగలిగే మందు వుందని - నేను విశ్వసించే వాడిని.  అలాగే, ఏ రోగాన్ని గురించి ఎవరు నన్నడిగినా - సరైన, వైద్య ప్రముఖులు ఎక్కడ వున్నారని ఇంటర్ నెట్ ద్వారా - కనిబెట్టి, వారికి చెప్పడం నా అలవాటు.అందులోనూ - అల్లోపతీ, ఆయుర్వేదాలు రెండింటినీ  వాడటం వలన అతి త్వరితంగా వ్యాధులు వుపశమిస్తాయని - నా నమ్మకం. అలాగే, కొన్నిటికి, హోమియోపతీ కూడా బాగా పని చేయడం నేను చూసాను. కానీ అల్లోపతీ, హోమియోపతీలు వొకే సారి వాడడం కుదరదని చాలామంది చెబుతారు. రెండూ వొకదానికొకటి, విరుద్ధమైన పద్ధతులు.

ఎక్కడో  వొక గొప్ప వైద్యుడు చెప్పాడని చదివాను - ఎక్కడ రోగం వస్తుందో, అక్కడే,  దానికి విరుగుడు కూడా వుండనే వుంటుంది -అని.  అంటే - చుట్టుపట్ల - మన రోగానికి తగిన వైద్యం వుండనే వుంటుంది - అనేది - సిద్దాంతం.

జీవకుడనే ప్రాచీన కాలపు  వైద్యుడు వొక సారి, శిష్యులతో అన్నాడట - ప్రపంచంలో ఏదైనా "మందు" కాని పదార్ధం  వుంటే కనుక్కుని తీసుకు రండి - అని. ఏతా, వాతా తేలిందేమిటంటే -వైద్యానికి పనికి రాని  పదార్థమంటూ ప్రపంచంలో లేదని.

మనిషి మాట మహా గొప్ప మందు. నమ్మకం కలిగించే ప్రతి మాటా మందే. మీ చుట్టూ వున్న రోగులలో - మీరు మొట్ట మొదట - రోగం పోతుందనే - నమ్మకం కలిగించాలి.

అలాగే, రోగం మనతో ఉన్నంత కాలం కూడా - మనం సంతోషం గా వుండగలం; వుండాలి - అనే విశ్వాసం మనలో వుండాలి. రమణ మహర్షి గారు కానీ, రామకృష్ణ పరమహంస గానీ, ఆది శంకరాచార్యులు గానీ, పెద్ద రోగాలతో బాటు, చాలా  సంతోషంగా - జీవితం గడిపిన వారే.

కాకపోతే - మనం మందులు కూడా తీసుకుంటూ, రోగాలు పోతాయనే నమ్మకంతో - సంతోషంగా వుండొచ్చు. వారు శరీరం పోతే పోనీ అని వదిలేసారు. అలా మనకు వద్దు. మనం సామాన్యులు కదా. శరీరం పైన కాస్తో , కూస్తో ప్రేమ వున్నవాళ్ళం కదా.

మనకోసం చెప్పబడిన వాక్యం - దేహో దేవాలయో ప్రోక్తః -అంటే మీ దేహం వొక దేవాలయం. దాన్ని శుభ్రంగా, రోగాలు రాకుండా, లేకుండా పెట్టుకొండి  - అని.

చిన్న, చిన్న విషయాలలో శ్రద్ధ వహిస్తే - చాలా రోగాలు రానే రావు.

మీకు తెలుసు - చాలా రోగాలకు ప్రధానమైన వాహకాలు - అంటే రోగాన్ని, అది వున్న చోటినుండి , మన శరీరం వరకు తీసుకొచ్చి, మనలోకి చేర్చేవి - దోమలు, ఈగలు.

మీ యింటి దగ్గర యివి లేకుండా చూసుకుంటే - చాలా రోగాలు రావు.  ఎలా? మీ యింటి దగ్గర మురుగు నీరు, కుళ్లి పోతున్న పదార్థాలు  లేకుండా చూసుకోవాలి. వుంటే, వాటిపై, బ్లీచింగ్ పౌడర్ లాంటివి - చల్లాలి. సరే. మీ పంచాయితీ వారి ముఖ్యమైన పని - వీటిపై వొక లాంటి గాస్ విడవడం. లేదా బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లడం.  వూళ్ళో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవలసిన అతి ముఖ్య బాధ్యత పంచాయితీ వాళ్ళదే. వాళ్ళు చెయ్యలేదంటే - కంప్లైంట్  యివ్వండి. వాళ్ళు చెయ్యాలి. లేదంటే - చేసేటట్టు మీరు చెయ్యాలి.

యింట్లో దోమలు, ఈగలు వుంటే - మీరు మరీ జాగ్రత్త పడాలి. అవి చావకుండా ఎగిరిపోయేటటువంటి పరికరాలు  వాడొచ్చు. కానీ - మీరు మరీ అంత  అహింసా వాదులైతే  కష్టం. ఈ రోజు వొక ఈగ, వొక దోమ వుంటే, రేపటికి అవి వొక వందగా మారుతాయి.  తరువాత వేలు, లక్షలుగా మారుతాయి. మీ పైన పండుగ చేసుకుంటూ వుంటాయి. మీకు, వాటి వల్ల,  ఎన్ని రకాల రోగాలు రావొచ్చో - చెబితే ఆశ్చర్యపోతారు. ఏనుగు కాలు నుండీ కలరా, మలేరియా,  మరి ఎన్నో వ్యాధులు  వాటి వల్ల వస్తాయి.- అవి తగ్గడం చాలా కష్టమైన వ్యాధులు కూడా. కాబట్టి మీ ఛాయిస్ వొకటే - మీరు బాగుండాలా?  దోమలు, ఈగలు బాగుండాలా?    మరో ఛాయిస్ లేదు. ఎవరో వొకరు బాగుండొచ్చు.యిద్దరూ కాదు.

ఏదో, ఈగ సినిమా చూసేసి, యీగలంటే  భయపడడమో, వాటిపై ప్రేమ పెంచుకోవడమో  లాంటివి చెయ్యకండి. యీగలకూ, దోమలకూ, మీరు విలన్లు కాకపోతే, అవి మాత్రం మీకు పుట్టడమే విలన్లు గానే పుట్టాయి - అన్నది జ్ఞాపకం పెట్టుకోండి.  బాగున్న సినిమాలు, కొందరు మనుషులపై పనికి రాని కొన్ని పెద్ద ముద్రలు వేస్తూ వుంటాయి.

సరే. నా సలహా - ఈగలు, దోమలు మీ యింటి పరిసరాలు, మీ యింటి లోపల - వుండకుండా చూసుకోండి.  వుంటే మాత్రం, కిటికీలకు, వాకిళ్ళకు దోమ తెరల లాంటివి దొరుకుతాయి - అవి కట్టండి.

ఆహార పదార్థాలు అన్నిటి పై మూతలు పెట్టడం ఎప్పుడూ మరిచి పోకండి.

వీలైనంత వరకు - ఆహార పదార్థాలు - అప్పటికప్పుడు చేసుకుని, వేడిగా తింటే - బాధ లేదు. చల్లటి పదార్థాలు, అంటే నిన్నటి రోజు, లేదా, యింకా అంతకు కూడా ముందు చేసినవి - వద్దే వద్దు. అవి తామస గుణ ప్రధానమైనవి. రోగాలతో బాటు, సోమరితనం, మరెన్నో తామస గుణాలు కలుగ జేస్తాయి.   యిది చెప్పింది - గీతలో శ్రీకృష్ణుల వారు. మరి మీ యిష్టం.

చల్లటి ఆహార పదార్ధం వేడి పెడితే చెడి పోతుందని, కొంత మది చల్లగా తినేస్తూ వుంటారు. దాని వాసన మీ ముక్కుకు తెలియక పోవచ్చు కానీ - అది అప్పటికే చెడి పోయినట్టే లెక్క. ఆరోగ్యం కావాలంటే - ఆ మాత్రం శ్రమ పడాలి మనం. లేకుంటే - అనారోగ్యం  మన వెనుకే వస్తుంది. ఎందుకొచ్చిందో తెలీకుండా వచ్చేస్తుంది.

యింట్లో, ఊడ్చిన చెత్త, ఆహారపదార్థాలు, ఆకులు, లాంటివి - వూడ్చి మన ఇంట్లోనే ఏదో మూలలో వున్న చెత్త కుండీ లో వెయ్యడం మన అలవాటు. అవి రోజుకు రెండు సార్లు - యింటి బయట వున్న పంచాయితీ వారి చెత్త కుండీలలో వేసెయ్యాలి.  చాలా వరకు, దోమలు మన  యింట్లోని చెత్త కుండీల్లోనే - నివాసం పెడతాయి. అక్కడి నుండీ, రాత్రి మనపైన స్వైర విహారం చేస్తాయి. అందుకని, రాత్రి పడుకునే ముందు, తప్పక  యింట్లోని చెత్త కుండీ ఖాళీ  చేసెయ్యండి. యిది ముఖ్యం. మీరు పడుకునే గదిలో - దోమలు, ఈగలు  లేకుండా చూసుకోవడం అతి ముఖ్యం.

ఎందుకింత ఉపోద్ఘాతం చెబుతున్నానంటే - వీటిపై చాలా మందికి అవగాహన లేదు గనుక.

నిజానికి - మంచి ఆహారము, మంచి నీరు, మంచి గాలి, మంచి, పరిశుద్ధమైన పరిసరాలు - ఇవీ మన ఆరోగ్యానికి ముఖ్యమైన అవసరాలు; ప్రాతిపదికగా నిలిచే అంశాలు. వీటన్నిటినీ మనం రకరకాలుగా పాడు చేస్తూ ఉన్నాము.

ఆహారంలో ఎన్ని రకాల కలపడాలు జరుగుతున్నాయో, చదువుతూ వుంటే ఆశ్చర్యం వేస్తుంది. దీన్ని అడిగే నాథుడే లేదు. అడగవలసిన వాడు, తనకు డబ్బొస్తే   చాలనుకుంటూ వున్నాడు. మన  ఉద్యోగుల, నాయకుల  లంచగొండి తనానికి హద్దే లేకుండా పోయింది. కాయలు పండ్లు కావడానికి, విష ప్రదమైన లోహాలను  వాడుతున్న వారు చాలా మంది వున్నారు. పాలలో, నీళ్ళు కలపడం కాదు; బోరిక్ పౌడర్ లాంటివి కలుపుతున్నారట. వడ్లలో, బియ్యంలో,  గోధుమల్లో, రాళ్ళు కలపడం పాత విషయం. మనం ఎప్పుడు మారుతాం? ఎవరికి రోగాలోచ్చినా ఎవరు చచ్చినా-నాకేం ఫరవాలేదు. నేను మాత్రం కలపడం చెయ్యకుండా వుండను - అనే వారు చాలామంది. నేను బంగారంలో కలపడం గురించి కాదు - మనం ప్రాణంతో వుండాలంటే కావలసిన శుభ్రమైన  ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాను.  ఈ కలపడం అనే వొక్క అలవాటు మాన్ప గలిగితే దేశంలో సగం రోగాలు రావు.

మొన్న వొక అంతర్జాతీయ వ్యాపార సంస్థ - మన దేశంలో  అమ్మే చికెన్ పదార్థాలలో, పురుగులుండడం చూసిన కొనుగోలుదారులు, వారిని పట్టి నిలదీశారు.లోపలి కెళ్ళి చూస్తే, ఎన్ని పదార్థాలలోనో పురుగులుండడం గమనించారు.    యిండియా కదా - యిక్కడ ఏమైనా చెయ్య వచ్చు అని వారూ అనుకొని వుంటారు. మనలో వున్న ఈ స్తబ్దత పోవాలి. తప్పు చేస్తున్న వాడిని, కలపడం చేస్తున్న వాడిని నిలదీసి అడిగే సామర్థ్యం, ధైర్యం రావాలి.  ప్రతి గ్రామం లోనూ - వొక కన్స్యూమర్ సంఘం రావాలి. అందులో అందరూ, సభ్యత్వం వుండాలి వారి ద్వారా విక్రయ దారులను నిలదీయాలి. 

మంచి ఆహారం వున్నా, చేతిలో డబ్బు కూడా వున్నా - ఆ డబ్బును, మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, పొగ త్రాగడానికి ఖర్చు చేసే,  తనకూ,యింట్లో వారికీ  సరైన తిండి లేకుండా చేసే  మహానుభావులెందరో వున్నారు.

మరి వారి ఆరోగ్యము, వారి కుటుంబం లోని వారి ఆరోగ్యము, చదువులు, యింట్లోని  సుఖ సంతోషాలు చెడి పోవడం తప్పక జరుగుతాయి కదా.   యిదంతా  దేని ప్రభావం?  వారు ఈ అలవాట్లు మానక పోతే - ఎవరేం సహాయం చేసినా ప్రయోజనం లేదు. ఈ మధ్య మనం చదువుతున్న రేపు కేసులు చాలా వాటిలో - మనకు కనపడుతున్న ముఖ్యాంశం - రేపు చేసిన వారు చాలా వరకు, తాగున్న వారే. మరి కొన్ని కేసులలో - మాదక ద్రవ్యాలు అలవాటున్న వారు.  ఏది తినాలో అది తినరు. ఏది త్రాగాలో అది త్రాగరు. ఏది తమ ఆరోగ్యానికి, సమాజ ఆరోగ్యానికి భంగం  కలిగిస్తుందో - అదే తింటామంటారు, త్రాగుతామంటారు.

 మనం త్రాగే నీరు మంచి, త్రాగు నీరు కాక పోతే, అనేక రోగాలు రానే వస్తాయి. పల్లెలలో కానీయండి పట్టణాలలో కానీయండి; యిప్పటికీ, శుభ్రమైన  త్రాగు నీటి సదుపాయం పూర్తిగా లేదు.  నీళ్ళలో అనేక రకాల ప్రమాద కరమైన రసాయనిక పదార్థాలు వున్న ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అక్కడ వున్న చాలా మంది లో - అనేక రకాల రోగాలు ప్రబలం గా వున్నాయి. ఈ మధ్య వచ్చిన వొక రిపోర్ట్ ప్రకారం గంగానది లో కూడా, ప్రమాదకరమైన ఆర్సెనిక్ లాంటి రసాయనాలు కలిపే పరిశ్రమలెన్నో వున్నాయట. తత్ ఫలితంగా -  కొన్ని గంగా తీరప్రాంతాలలో, రక రకాల కాన్సర్లు చాలా ఎక్కువగా వున్నాయట. నదులను కలుషితం చేస్తూ కొంత మంది ధనవంతులు కావడానికి, మనం ఎన్నో ప్రాణాలను పణంగా పెడుతున్నాము.

అలాగే - మనం పీల్చే గాలి శుభ్రంగా వుండాలి. దేవుడు శుభ్రమైన గాలినే యిచ్చాడు.  కానీ దాన్ని కూడా మనం కలుషితం చేస్తున్నాము - రకరకాలుగా .

రెండు నెలల క్రితం  మేము, కాశీ నుండి  చెన్నైకి వస్తున్నాము. మార్గంలో, మహారాష్ట్ర -ఆంధ్ర ల మధ్య , వొక చోట ఏదో వొక మిల్లు ప్రక్కన మా రైలు సిగ్నలు లేక పది నిముషాలకు పైగా ఆగింది.

ఆ మిల్లు నుండి వస్తున్న కలుషితమైన గాలితో, రైలంతా నిండి పోయింది. ఆ గాలి - దట్టమైన చెక్క రంగుతో, ఏదో దుర్గంధమైన వాసనతో నిండి వుంది.  రైలు లో వున్న ఎవరూ వొక్క నిముషం కూడా ఆ గాలిని భరించ లేక పోయారు. అందరూ తలుపులన్నీ  వేసేశాం. అయినా ఆ గాలి పీల్చిన ఫలితంగా - తిరిగి వచ్చిన తరువాత,  వొక వారం రోజులు, ప్రతి వొక్కరూ  ఏదో వొక అనారోగ్యం అనుభవించ వలసి వచ్చింది . మరి అక్కడే ఆ ఫాక్టరీ లో పని చేసే వారి సంగతి ఏమిటి?  చుట్టూ వున్న వారి   సంగతి ఏమిటి? వొక దేశం గా మనం ఏం చేస్తున్నాము?

తినే ఆహారాన్ని కలుషితం చేస్తున్నాం. త్రాగే నీటిని కలుషితం చేస్తున్నాము. పీల్చే గాలినీ కలుషితం చేస్తున్నాము.ఇవీ మనకు, మన శారీరక ఆరోగ్యానికీ కావలసిన అతి ముఖ్యమైన  సాధనాలు. మరి మన ఆరోగ్యం ఎలా బాగుంటుంది?  

మనం సెల్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నాము కదా. ఈ అధిక వాడకం యొక్క ఫలితాలు గవర్నమెంటు  వారే చెబుతున్నారు. ఈ మధ్య   టెలికాం  డిపార్ట్ మెంటు వారి వెబ్ సైటులో విస్త్మృతంగా  దీన్ని గురించి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో వేసారు. ముఖ్యంగా గుండె దగ్గర యిది పెట్టు కోకండి వీలైనంత, శరీరానికి దూరంగా పెట్టుకోండి. ముఖ్యంగా మీ దిండు క్రింద  సెల్ ఫోను పెట్టుకోకండి.   పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి. వీలైనంత వరకు  లాండ్ లైన్ ఫోన్లు వాడండి. సెల్  ఫోన్లో  - వొకే సారి ఎక్కువ సేపు మాట్లాడ కండి.  ఇలాంటివి ఎన్నో.


యిప్పుడు, వచ్చిన వ్యాధులు పోగొట్టుకోవడం, రాని  వ్యాధులు రాకుండా చేయడం కోసం కొన్ని వైద్యాలు చూద్దాం.

మన దేశంలో యిప్పుడు, చాలా ఎక్కువగా వున్న వ్యాదులలో వొకటి రక్త పోటు.  ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మందులు వున్నాయి. యిది వొక సారి వస్తే పోదని అలోపతి వైద్యులు అంటారు. కానీ, నాకే 6-7 ఏళ్ళ క్రితం బీపీ వచ్చింది - చికెన్ గునియా వచ్చినప్పుడు, దానితో బాటుగా చాలా ఎక్కువగానే వచ్చింది. అప్పుడు, నేను స్వామీ రాం దేవ్ గారి యోగా శిబీర్ వారం రోజులు వెళ్లాను. ఆ యోగ శిక్షణ శిబిరం నాలో చాలా మార్పు తీసుకు వచ్చింది.

ఆయన చెప్పినట్టు గానే, ప్రాణాయామాలు, ఆసనాలు, వాటిపై ఆయుర్వేదంలో వారు తయారు చేసే మందులు - ముఖ్యంగా ముక్తావటి అనే టాబ్లెట్లు - వాడాను. మూడు నెలలలో,  బీ.పీ మాటు మాయం. తరువాత యిప్పటి వరకు, ఆరు సంవత్సరాలుగా -  నేను ఏ మందు, బీ.పీ. కోసం, వాడడం లేదు.  అంటే - బీ.పీ, ఈ మందులతోనూ, కొద్ది పాటి ప్రాణాయామాలు, ఆసనాలు తో పూర్తిగా పోతుందని - నా విషయంలో నాకే తెలిసింది.

 కానీ, బీ.పీ. వచ్చినపుడు , అలోపతి వైద్యులు చెప్పిన మాటలు, యిచ్చిన మందులు - ఈ మందులు ఎన్నాళ్ళు తీసుకోవాలని అడిగితే, వారు, జీవితాంతం తీసుకోవాలని చెప్పారు. బీపీ వుండనే వుంటుంది. దాన్ని, మీరు కొంత నియంత్రణలో పెట్టుకోవాలి, ఈ మందులతో - అన్నారు . కానీ నా వరకు, నాకు బీ.పీ. సంపూర్తిగా పోయింది. 

ఎందుకు చెబుతున్నానంటే - కొద్ది పాటి ఆసనాలు, ప్రాణాయామాలు, ముక్తావటి లాంటి మందులతో - బీ.పీ వున్నవారు - అది పోగొట్టుకోవచ్చని   చెబుతున్నాను. మూడు నెలల పాటు అల్లోపతీ టాబ్లెట్ల తో బాటు, మక్తావటి కూడా వేసుకుంటూ, తరువాత, అల్లోపతీ తగ్గిస్తూ ,కొన్నాళ్ళకు అల్లోపతీ పూర్తిగా మానేసి, తరువాత కొన్నాళ్ళకు ముక్తావటి కూడా మానేయ వచ్చు. ఈ మధ్య కాలంలో మీకు బీ.పీ ఎంత  వుందో మాత్రం అప్పుడప్పుడూ చెక్ చేసుకుంటూ వుండడం ముఖ్యం. నా అభి ప్రాయంలో - వొక ఆరు నెలల లో - మీకు బీ.పీ. మరి లేదు - అన్న ఆరోగ్య స్థితికి వస్తారు.

యిలాగే ఎన్నో రోగాలు - పోవు, అనుకొన్నవి, చాలా మందికి  పోవడం నేను చూసాను. ఆయుర్వేదంలో యింకా ఎంతో పరిశోధనలు జరగాల్సి వుంది.

అలాగే, ఆయుర్వేదము, అల్లోపతీ కలిపి వైద్యం చెయ్య వలసిన అవసరం కూడా వుంది.

అంత కంటే - చాలా ముఖ్యం - మనం, మన చుట్టూ వున్న రోగాలను గురించి బాగా తెలుసుకుని , అవి రాకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

ముందు చెప్పినట్టు, దోమలు, ఈగలు లేకుండా చూసుకుంటే - ఎన్నో రోగాలు రావు. ఎప్పుడు చేసిన ఆహారమో తినడం మానేసి, కనీసం ఈ రోజే చేసిన ఆహారం, వేడి చేసుకుని - తింటే కొన్ని రోగాలు రావు.

కొంత ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు - చేస్తే యింకా ఎన్నో రోగాలు రాక పోవడమే కాక, మనసు కూడా, ప్రశాంతం గానూ ఆహ్లాదం గానూ వుంటుంది.యింట్లో వాళ్ళు వొకరితో  వొకరు, పొరుగువారితో కూడా - వీలైనంత వరకు, మంచి మాటలే  మాట్లాడాలని, నియమం పెట్టుకుంటే మీకూ, అవతలి వారికీ - చాలా రోగాలు రావు; వున్న రోగాలు కూడా తగ్గుతాయి.

ఏ రోగమొచ్చినా - నేను నా సంతోషం మాత్రం  కోల్పోను - అని నిర్ణయించుకుంటే - మన చివరి క్షణం వరకు - మనం సంతోషంగా , వుండగలం. మీకు తెలుసా - ప్రతి రోగంలోనూ, అసలు రోగం -"భయం, నిరాశ, నిస్పృహ" - యివే. యివి వదిలేసి చూడండి.  ఏ రోగమొచ్చినా మనకు దాదాపు రోగం లేనట్టే   వుంటాము.

ఆ పైన మందులు కూడా వాడాలి. కొన్ని రోగాలకు చాలా మంచి మందులే వున్నాయి. అయినా, ఆ రోగాలతో, విపరీతంగా అవస్థ పడుతున్న రోగులను ఎందరినో మనం చూస్తున్నాము.

ఉదాహరణకు - బోదకాలు ,లేదా, ఫైలేరియా వ్యాధితో అవస్థ పడే వారిని మనం చాలా మందిని చూస్తున్నాము. కానీ దీన్ని దాదాపు 95 శాతం వరకు నయం చేసే పద్ధతులు చాలా వున్నాయి. కేరళలో - కాసర్గోడ్ అన్న పట్టణంలో -ఇనస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ డెర్మటాలజీ లో - డాక్టర్ నరహరి -అనే డాక్టర్ ఆధ్వర్యంలో  - 2 వారాల ట్రీట్మెంట్  తో - ఎంతో బాగా నయమవుతూ   వున్నట్టు - మనకు తెలుస్తూ వుంది.

అలాగే - చర్మవ్యాధులు -సోరియాసిస్ లాంటివి -చెన్నై లో - డాక్టర్ జె.ఆర్ .కృష్ణమూర్తి  అనే   సిద్ధ డాక్టర్ గారు బాగా నయమయ్యే టట్లు చేస్తున్నారు.యిదే సోరియాసిస్ కు రాందేవ్ గారి మందులు కూడా బాగా పని చేస్తాయి.

హృద్రోగాలు రాకుండా చెయ్యడమే కాక, వచ్చిన వాటిని కూడా బాగా తగ్గించగల మందు - అర్జున , లేదా  అర్జునారిష్ట అంటారు. యివి, ఎవరైనా వాడవచ్చు. ఇటువంటిదే, రామ్ దేవ్ వారి హృదయామృత వాటి.

అలా - దాదాపు ప్రతి రోగానికీ - మందులు వున్నాయి.

అయితే - వీటన్నిటిలో చాలా ముఖ్యమైన అంశం - మనం మనసులో ఆరోగ్యంగా వుండాలని, వుండగలనని నమ్మకం వుండడం; వీటితో బాటు దినమూ, ఎంత సేపు వీలైతే అంత - ధ్యానము, ప్రాణాయామము, ఆసనాలు చెయ్యడం - యివి ఎంతో ముఖ్యంగా చెప్పబడుతోంది.

స్వామి రాందేవ్  గారి ట్రీట్మెంట్ చాలా వరకు  దీనిపైనే ఆధారపడి వుంది.ప్రాణాయామాలలో, వారు ముఖ్యంగా అనులోమ,విలోమ ప్రాణాయామం, మరియు, కపాల భాతి ప్రాణాయామం - లకు ప్రాముఖ్యం  యిస్తారు. యివి చాలా సులభం. ఆహారం తీసుకునే ముందు తెల్ల వారి 15 నిముషాలు, సాయంకాలం  15 నిముషాలు తప్పకుండా చెయ్యాల్సినవి.

అంటే - రోగాల వరకు - మనం  పాటించాల్సిన కొన్ని ముఖ్య సూత్రాలు యివి -

1.  రోగాలు రాకుండా జాగ్రత్త పడాలి. (దోమలు, ఈగలు లేకుండా చెయ్యడం; సరైన తిండి, నిద్ర, వ్యాయామం, యోగ, ప్రాణాయామాలు  పాటించడం)

2. రోగాలు వస్తే - అశ్రద్ధ చెయ్యకుండా, వెంటనే సరైన ట్రీట్మెంట్ ఆరంభించాలి.  ఎంత త్వరగా, సరైన ట్రీట్మెంట్ ఆరంభిస్తే - అంత త్వరగా, రోగాలు నయమౌతాయి. 

3. నా ఉద్దేశంలో - అల్లోపతి, ఆయుర్వేద వైద్యాలు రెండూ తీసుకోవడం - చాలా మంచిది.  యిప్పుడు ఆయుర్వేదం లోనే - సిద్ధ, యునాని అన్నీ చేరిపోతున్నాయి.


4. కొన్ని రోగాలకు హోమియోపతీ కూడా బాగా పనిచేస్తుంది - కానీ దానితో, అల్లోపతీ వైద్యాన్ని మాత్రం చేర్చకూడదని  చెబుతారు.

5. ముఖ్యంగా - దీర్ఘ రోగాలనబడే - ఆస్తమా, రక్త పోటు, మధుమేహం , చర్మవ్యాధులు, బోదకాలు - లాంటి వాటికి, రెండు రకాల వైద్యాలు వొకే సారి, త్వరగా ఆరంభించడం చాలా మంచిది.

6.  రోగంలో సగం రోగం - "భయం నిరాశ, నిస్పృహ". యివి పూర్తి వదిలేసేయ్యండి. మన  చివరి శ్వాస వరకు, మనం సంతోషం గానే  ఉంటామని -దృఢ నిశ్చయం తీసుకోవాలి. ఏదొచ్చినా - భయం, నిరాశ పనికి రాదు. యివి లేక పోతే, సంతోషం వుంటే - వచ్చే ఏ రోగమైనా - తొందరగా తగ్గి పోతుంది. సంతోషంగా వున్న వారికి - దీర్ఘ రోగాలు కూడా, మందే  లేకుండా తగ్గిన సందర్భాలు  చాలా వున్నాయి.

7. హిప్పోక్రేట్స్ , యిప్పటి అల్లోపతీ వైద్యానికి మూల పురుషుడు. ఆయన చెప్పడం - ప్రకృతి మాత్రమే  రోగాలకు నిజమైన వైద్యం.

8. వోల్టైర్  అనే విజ్ఞాని అంటాడు - అందరి కంటే గొప్ప వైద్యుడు  రోగాలు రాకుండా మందులు, జాగ్రత్తలు  ముందే చెప్పే వాడు.   అతని తరువాత లెవెల్ వైద్యుడు - కొద్ది రోజుల్లో రాబోయే రోగాన్ని కనిబెట్టి, అది రాకుండా మందులిచ్చే వాడు. చిట్ట చివరి వాడు, వచ్చిన రోగానికి మందు లిచ్చే వాడు.

9. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పడం - దేహానికి అన్నిటి కంటే గొప్ప మందు -  ప్రశాంతం గా వుండే   మనస్సు.

10. మదర్ తథెరెసా గారంటారు - టీ.బీ కంటే, లెప్రసీ కంటే - మరే యితర వ్యాధుల కంటే కూడా - పెద్ద వ్యాధి - నాకెవరూ లేరు, నేనెవరికీ వద్దు - అన్న మనో భావన.

11. మనపై మనకు నమ్మకం లేక పోవడమే - అతి పెద్ద వ్యాధి - అంటారు,  రాల్ఫ్  వాల్డో  ఎమర్సన్  గారు.

12.  మూసి పెట్టుకున్న రోగానికి మందు లేదు - మన దేశం సామెత 

మీరంతా ఆరోగ్యంగా వుండాలి.  మీ చుట్టూ వున్న వారి ఆరోగ్యం కూడా మీరు కాపాడాలని  ఆశిస్తూ 

=  మీ

వుప్పలధడియం విజయమోహన్



9, డిసెంబర్ 2012, ఆదివారం

బ్రహ్మమంటే ఏమిటి? - బ్రహ్మ జ్ఞానం మనకెందుకు? - బ్రహ్మానందం ఏమిటి? - ఏం చేస్తే మనకు బ్రహ్మానందం కలుగుతుంది?

బ్రహ్మమంటే  ఏమిటి?


నీరుల్లి (ఎర్రటి) గడ్డ - పొరలు పొరలు గా వుంటుంది కదా. అందులోని పొరలను వొకదాని తర్వాత వొకటి, పైనుండి లోపలికి  వలుస్తూ పోతే, చిట్ట చివర ఏం మిగుల్తుంది?

ఏమీ మిగలదు. అంతా పొరలే . కానీ - లోపల శూన్యమే.

 బ్రహ్మమంటే  కూడా - దాదాపు అంతే.

ప్రపంచమంతటా - బ్రహ్మం వుంది.  బ్రహ్మమే వుంది. బ్రహ్మం తప్ప మరేమీ లేదు. అయినా , అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు.   

ఈ బ్రహం యొక్క స్వరూపం ఏమిటి ?

బ్రహ్మం = సత్యం = జ్ఞానం = అనంతం

యిది ఉపనిషత్తులు యిచ్చిన  డెఫనిషన్.

బ్రహ్మం అంటే సత్యం. సత్యం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే అనంతం.

అంటే - ఇవేవీ వేర్వేరు  కాదు. అన్నీ వొకటే.

అదెలా? సత్యమంటే నిజం కదా. జ్ఞానమంటే తెలివి తో ఆర్జించే బుద్ధి సంపద కదా. అనంతం అంటే మరేదో ఆకాశ మంత పెద్దది అని కదా. యిలా, మన మనస్సులో చాలా సందేహాలు సాధారణంగా వస్తాయి.

మీకు తెలుసా - యిలా వచ్చే మన సందేహాలు -అన్నిటికీ  మన ఉపనిషత్తులలో సమాధానాలు వున్నాయి.

కాక పోతే - యిప్పుడు ఈ విజ్ఞానంపై చాలినంత ఆసక్తి వున్న వారు చాలా తక్కువ. సంస్కృతం తెలిసిన వారు చాలా తక్కువ.

వీటిని - జన సామాన్యానికి అందించాలన్న తపన వున్న వారు అంతకంటే తక్కువ.  అందువలన - యిదేదో - అంటరాని పదార్ధం అయి కూర్చుంది.

నిజానికి - కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో కూడా - ఈ వేదాంత సారం గ్రహించాలంటే - ఎక్కడో, అరణ్యాలలో, అది తెలిసిన ఋషుల దగ్గరికి వెళ్ళాలి.   ఆ ఋషులు, యివి చెప్పాలంటే - వెయ్యి షరతులు పెడతారు. ఆ షరతులకు వొప్పుకున్న వాడికే,  వేదాంత సారం, బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవడానికి అర్హత వస్తుంది.

కొన్ని ఉపనిషత్తులు చదివితే  - ఆ ఋషులు పెట్టే  షరతులు నిజంగా కావాల్సినవే - అని మనకూ తెలిసొస్తుంది. ఆ షరతులకు వొప్పుకునే వాడు - మనలో, కోటికి  వొక్కడున్నా  - చాలా, చాలా ఎక్కువే.

మనకు  లోకం లో  ఎన్నో కావాలి. అవన్నీ వద్దనిపిస్తే - అప్పుడు బ్రహ్మజ్ఞానం.

అప్పుడు బ్రహ్మ జ్ఞానం మాత్రం ఎందుకు ?

అన్ని రకాల అందాలు, ఆనందాలు, సుఖాలు వదిలేసి - బ్రహ్మ జ్ఞానం వద్దకు పరుగు తీయడం ఎందుకు?

సినిమాలు వద్దు. టీ .వీ లు వద్దు. సెల్ ఫోన్లు వద్దు. కాఫీలు, టిఫిన్లు  వద్దు. మంచి బట్టలు వద్దు, పెళ్ళీ పెటాకులు వద్దు - అసలేమీ వద్దు?  అటువంటి బ్రహ్మ జ్ఞానం మనకెందుకు?

అవును. ఎందుకు? ఏదో, ఈజీ గా వస్తే, అదికూడా ఓకే . కానీ అన్నీ వదిలేసి,  అది ఎందుకు?

 ఎందుకు?   ఎందుకు?    ఎందుకు?   

అదండీ ప్రశ్న .

దీనికి ఉపనిషత్తుల సమాధానం ఏమిటి?


తై త్తరీయంలో  వొక చిన్న వివరణ వుంది చూద్దాం.

బాగా బలవంతుడైన , ఆరోగ్య వంతుడైన , యౌవన వంతుడైన, అందగాడైన , సర్వ సంపదలతో కూడిన  వొక రాజ కుమారుడు ఉన్నాడనుకొందాం. ప్రపంచంలో అతనికి ఎక్కడా ఎదురు లేదు. అతడికి కావాల్సిన సర్వ సుఖాలు వున్నాయనుకొందాం.   అందమైన, ప్రేమించే  భార్య - యిలా అందరూ.

యిప్పుడు - ఈ రాజకుమారుని ఆనందానికి లోటు లేదు. అతడి ఆనందం - వొక యూనిట్ అనుకొందాం. యిది నేను చెప్పింది కాదుః   తై త్తరీయం చెప్పిందే.

యిట్లాటి  మనుష్యానందాలు నూరు రెట్లైతే - వొక మనుష్య గంధర్వుడి ఆనందానికి సమం. 

 వొక మనుష్య గంధర్వుడి  ఆనందం వంద రెట్లైతే  -    వొక దేవగంధర్వుడి ఆనందానికి సమం.

దేవ గంధర్వుడి ఆనందం వంద రెట్లైతే  -   చిరకాల (బ్రహ్మ) లోక వాసుడగు వొక్క పితృ దేవత ఆనందానికి సమం.

   
చిరకాల (బ్రహ్మ) లోక వాసుడగు వొక్క పితృ దేవత ఆనందం వంద రెట్లైతే - అజానజుడనే దేవత యొక్క ,  వొక్క ఆనందానికి సరి అవుతుంది   

వొక్క అజానజుడనే దేవత ఆనందం వంద రెట్లైతే - వొక్క కర్మ దేవత ఆనందానికి సమం.

అలాగే కర్మ దేవత  అనందం  వంద రెట్లైతే - వొక్క దేవత  ఆనందానికి సమం.

వొక్క దేవత అనందం  వంద రెట్లైతే - యింద్రుని  ఆనందానికి సమం.

యింద్రుని ఆనందం వంద రెట్లైతే - బృహస్పతి ఆనందానికి సమం.

బృహస్పతి ఆనందం వంద రెట్లైతే - ప్రజాపతి  ఆనందానికి సమం.

 ప్రజాపతి ఆనందం వంద రెట్లైతే - హిరణ్య గర్భుని ఆనందానికి సమం.

వొక  కామ రహితుడైన బ్రహ్మ జ్ఞాని  - అటువంటి గొప్ప  హిరణ్య గర్భుని ఆనందం కూడా సాధారణంగా, నిరంతరాయంగా  పొందుతాడు.

ఇక్కడేదో  వంద రెట్లు - అంటూ చెప్పారు కానీ - బ్రహ్మ జ్ఞాని ఆనందం, అనంతం - అసలు ఎల్ల లేనిది, అనే చెప్పారు.. 

సరే.  యిప్పుడు మనకు  అది కావాలా, వద్దా - అన్నది మనమే నిర్ణ యించుకోవాలి.

కావాలి. వూరికే యిస్తే కావాలి. కానీ- వూరికే యివ్వరు కదా .

మరి, అందుకేం  కావాలి మనకు?

గురువు కావాలి మనకు. గురువు మనకు యిది చెప్పాలంటే -  మనకు 4 అర్హతలు కావాలి.

1. వైరాగ్యము 2. వివేకము.  3. శమ,దమ, ఉపరతి, తితిక్ష ,శ్రద్ధ, సమాధానం  అనే ఆరు సంపదలు 4.ముముక్షత్వం . యివి ఏమిటి అన్నది పెద్ద చర్చనీయాంశం. అది మరో సారి చూద్దాం. 

యివి నాలుగూ మీలో ఉన్నాయా? - అని మీ గురువు మిమ్మల్ని పరీక్ష చేసి గానీ మీకు  బ్రహ్మ జ్ఞానం బోధించడు. 

వొకానొక బ్రహ్మజ్ఞాని అయిన గురువు, తన దగ్గరకు  వచ్చిన గొప్ప ఋషులను, సంవత్సరం పాటు  పరీక్ష చేసి గానీ, బ్రహ్మ జ్ఞానం బోధించ లేదు.

వరుణుడు తన కొడుకైన భ్రుగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి - బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.

మీరు షావోలిన్ లో కుంగ్ ఫూ నేర్చుకోవడానికంటే  - హార్వర్డ్  యునివర్సిటీ లో చేరడానికంటే -  ఈ బ్రహ్మ జ్ఞానం కాలేజీలో  చేరడానికి - అర్హతలు ఎక్కువ కావాలి. 

సరే. చేరితే - ఎన్ని ఏళ్ళు పడుతుంది - ఈ జ్ఞానం రావడానికి?

చెప్పలేం.

వొక్క క్షణం లో కూడా రావొచ్చు.  వొక్క రోజులో రావొచ్చు. వొక్క సంవత్సరంలో రావొచ్చు. వొక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలూ పట్టొచ్చు.

యిదేం అంత పెద్ద బ్రహ్మ విద్యా? అవును - యిదే బ్రహ్మ విద్య.

మీకు బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు. 

మారడమూ కాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మం గానే వున్నారు - అని తెలుసుకొంటారు.

కానీ - మీలో వున్న అజ్ఞానపు, మాయ పొరల వల్ల, మీరు ప్రకృతి మాయలో పడి,   ఈ మనుష్యానందాల్లో కొట్టు మిట్టాడుతున్నారు.

ఈ "మన " ఆనందాలు చాలా స్వల్పం; క్షణికం.  కానీ, బ్రహ్మానందం ఏ పొగడ్తకూ అందనంత  గొప్పది; నిరంతరం అయినది 

మన ఈ ఆనందాలు చాలా తక్కువ ఆనందం యిచ్చేవి;  తరువాత అవే - కష్టాలుగా కూడా మారిపోతాయి. బ్రహ్మానందంలో మరి కష్టాలు లేవు గాక లేవు.

మన ఆనందాలకన్నింటికి  మూడు (ఆవ)లక్షణాలు వున్నాయి.

(1) యివన్నీ వస్తాయి. మళ్ళీ వెళ్ళిపోతాయి. మీతో వుండవు. మీరుపోయే చోటికి అవి రావు. మీరు వాటిని,  మీవి అనుకోవచ్చు కానీ - అవేవీ - అవి మీవి అని అనుకోవు. మీ ఇల్లు మీతో బాటు రాదు; తను  మీది అని అనుకోదు. మీ భార్య కూడా - తను మీది అనుకోదు. మీరు తన వాడు అనుకుంటుంది. 

(2) యివి - పూర్తి ఆనందంగా ఎప్పుడూ వుండవు. వచ్చేటప్పుడు, కూడా, వొక దుహ్ఖపు సంచిని తమతో బాటు  తెచ్చుకుంటాయి. దుహ్ఖపు పాలు - పోను,పోను ఎక్కువవుతుంది. మీరు ఇల్లు కొన్నారు. ఆ రోజు బాగుంది. కొనడానికి కష్ట పడాలి. యింటిని శుభ్రంగా పెట్టుకోవడానికి కష్ట పడాలి. మీరు ఎంత కష్ట పడ్డా- అది మీరు వుం డమన్నట్టు గా మాత్రం వుండదు. ఎక్కడో, ఏదో, చెడిపోతూ వుంటుంది. కష్ట సుఖాలు కలిసే వస్తాయి. వొక్కో సారి వోక్కోటి  దర్శనమిస్తుంది. అంతే. అందమైన, ఆరోగ్యవంతమైన, యౌవన వతి అయిన  భార్య అలాగే వుండి  పోతుందా?  వుండదు. ఆవిడకూ రోగాలు వస్తాయి.అందమూ పోతుంది.   యౌవనమూ  పోతుంది.   వొక వేళ,  ఆవిడ  ఏమీ మారక - అలాగే వుందనుకోండి. కానీ మీరు మారుతారు. అప్పుడూ మీకు చాలా పెద్ద సమస్యే కదా.

(3) ఆనందం ఏది వచ్చినా - అది మీకు వొక "బంధం" గా కూడా మారుతుంది. ప్రతి వొక్కటీ మీలో వొక అలవాటు సృష్టిస్తుంది. మీరు తాగే కాఫీ వొక అలవాటు. మీ భార్య మీకు వొక అలవాటు. ఆమెకు మీరు వొక అలవాటు. సిగరెట్టూ, మత్తు పానీయాలూ -అయితే  మరీ ఘోరం. వాటిని వదిలించుకోవడం కష్టం.-అంటే  అవి మీకు అలవాటు మాత్రమే కాదు. వాటికి మీరూ అలవాటే. అవి మిమ్మల్ని వదిలిపెట్టవు.  

యిలా మూడు రకాల అవగుణాలున్నాయి ప్రతి ఆనందానికీ . 

మొదటిది -   వస్తాయి,పోతాయి. ఏదీ శాశ్వతం కాదు.

రెండోది    -   వచ్చేటప్పుడే , కష్టాన్నీ మూటగా కట్టుకునే వస్తాయి.అది లేకుండా వచ్చే సుఖమే లేదు. 

మూడోది  -   మిమ్మల్ని, తనకు బందీగా చేసుకుంటుంది. మీకు రకరకాల బంధాలు కలుగ చేస్తుంది.

ఎంత గొప్ప మనుష్యానందమైనా - ఏదీ, ఈ మూడు అవగుణాలు లేనిది ప్రపంచం లో లేదు.

బ్రహ్మానందానికి -ఏ అవగుణమూ లేదు. అందుకనే దాన్ని - సత్యం .జ్ఞానం, అనంతం అన్నారు.

సరే. దీన్ని నేర్పగలిగే గురువు ఎక్కడున్నాడో మనకు తెలీదాయె.  ఇప్పుడెలా?

మీరు కొన్ని పనులు చేస్తూ పోతే - మీ గురువే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా రావచ్చు.

ముఖ్యంగా - బ్రహ్మ జ్ఞానానికి - వొక అర్హత ఏదంటే  - ప్రతి వొక్కరి లోనూ - మిమ్మల్ని మీరు చూడగలరా.మీలో, ఆ ప్రతి వొక్కర్ని చూడగలరా.

అంటే - సర్వ మానవ సమానత్వం. 

చుట్టూ వున్న వారందరూ మీ వారే - నిజానికి మీరే అన్న భావన మీలో కలగాలి.

మీరు మీకు ఏమేం చేసుకుంటారో,  అవన్నీ మీ  చుట్టూ వున్న వారికి చెయ్య గలరా. 

యిది లేకుండా - బ్రహ్మ జ్ఞానం లేదు గాక లేదు.

కేవలం మానవులే కాదు - పశు,పక్ష్యాదులలో కూడా మిమ్మల్ని మీరు చూసుకోవాలి..

- అన్నిటినీ విడిచి పెట్టేసెయ్యడం వైరాగ్యం అనుకోవాల్సిన పని లేదు. అన్నిటినీ - నాలాగే చూసుకుంటాననడం  కూడా వైరాగ్యమే 

"అన్నీ -నాదే" అని  కాదు.

"అన్నీ నేనే".- అన్న మాట  

నిజానికి, మనలో ఎక్కడో ఈ భావన కదిలి - మన వారు కాని వారికి - మన జాతి వారు కాని వారికి, అసలెవరూ లేని వారికి - మనం సహాయం చేస్తే - మనలో - ఆ బ్రహ్మము - కొద్దిగా కదులుతుంది.

అలాంటి సందర్భాల్లో బ్రహ్మజ్ఞానం తాలూకు వాసనలు మనలో వెల్లి విరుస్తాయి.

మామూలు సుఖాలలో లేని - ఆ ఆనందం అనుభవించండి.  

నన్ను ముట్టుకోకు, నన్నుముట్టుకోకు - అనే వారికి - యిది ఎన్న జన్మలైనా కావొచ్చు.

యిదే ఆది శంకరాచార్యులూ చెప్పారు. అదీ మహా శివుడి సందేశంగా  చెప్పారు .

రమణ మహర్షి, రామకృష్ణులు, గాంధీ గారు - యిదే సందేశం తమ జీవితాల ద్వారా చెప్పారు. రమణుల వారి జీవితంలో - ఈ సర్వ మానవ సమానత్వం ఎంతగా పాటించారో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. రామ కృష్ణులూ అంతే. గాంధీ గారు కూడా అంతే.
మీ మొట్ట మొదటి ప్రయత్నంగా - నెలలో వొక రోజు, ఏదైనా అనాథ శరణాలయం వెళ్ళిపొండి. అక్కడున్న పిల్లలకు మీరు ఏమేం చెయ్య గలరో చెయ్యండి. అక్కడ వున్నప్పుడు, మిగతా ప్రపంచాన్ని మరచి పొండి. ఆ పిల్లలో, పెద్దలో వారే మీ వారుగా వుండండి .  మీ మొదటి -ప్రయత్నంలోనే  మీకు ఎంతో ఆనందం కలగొచ్చు.

రెండు, మూడు నెలలలో - మీలో బ్రహ్మానందపు తాలూకు చాయలు కలగక మానవు. ఆ ఆనందం మిగతా సుఖాలకంటే - ఎంతో గొప్ప అని మీరూ వొప్పుకుంటారు.

ఆ తరువాత అక్కడి నుండి ముందుకు వెళ్ళచ్చు.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

  

     










30, నవంబర్ 2012, శుక్రవారం

ఉపనిషత్తులలో - యింత గొప్ప సామాజిక న్యాయం మనం తీసుకు రాగలమా? - అన్నం న నింద్యాత్ - అతిథి దేవో భవ - ఆకలి లేని రాజ్యం -


ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం 



ఉపనిషత్తులు మన వేదవాంగ్మయం లోని అంతర్గత భాగాలు.అవి ఎప్పుడు రాయ బడ్డాయో ఎవరికీ తెలీదు. పది వేల సంవత్సరాలూ వుండొచ్చు. పది లక్షల సంవత్సరాలూ వుండొచ్చు. అవి ఎప్పటివో?

కృష్ణుడు పుట్టడానికి ముందటివి. రాముడు పుట్టడానికి ముందటివి. అంతకు ముందు ఎవరెవరు వున్నారో ఎలా వున్నారో - ఉపనిషత్తుల నుండి కొద్దిగా మనకు తెలుస్తుంది.  

ఉపనిషత్తుల పని - అప్పటి చరిత్ర , అప్పటి సమాజం గురించి చెప్పడం కానే కాదు.

 మనం చూస్తున్నది నిజమా, దీనిని మించిన నిజం మరేదైనా వుందా - అన్న దానిపై విస్త్మృతమైన  పరిశోధన  చేశారు అప్పటి ఋషులు. అప్పట్లో - వారు ఋషులు మాత్రం కాదు;మహా దూర దృష్టి  గల, సత్య వాక్పరిపాలకులైన వైజ్ఞానిక పరిశోధకులు  కూడా .

ఏది సత్యం, ఏది సత్యం - అని సత్య సాధనకై, సత్య శోధనకై , సత్య సాక్షాత్కారానికై తమ జీవితాలను,  ధారపోసిన మహానుభావులు.  

వారు చెప్పిన ఉపనిషత్తులు  మనం చదవక పోతే - మన జీవితాన్నే మనం వ్యర్థం చేసినట్టు - అన్న  విషయం - 60 ఏళ్ళ వయసు తర్వాతనే  నాకు తెలిసి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత - స్వామి పరమార్థానంద గారి క్లాసులకు వెళ్లాను. మరెంతో మంది ప్రవచనాలు వింటూ వచ్చాను.

అవి మొదట పెద్దగా రుచించలేదనే మాట వాస్తవం. కానీ వాట్లో వున్న గొప్ప గొప్ప వాస్తవాలు  అర్థమయ్యే కొద్దీ - నా  మెదడు -లోని అవాస్తవికత  మెల్ల మెల్ల గా దూరం అవుతూ వుంది.

వారి  ఆలోచనా పటుత్వం -    ఎన్ని వేల, లక్షల సంవత్సరాల నాటిదైనా - యిప్పటి కంటే  చాలా గొప్పది అనడంలో - నాకు మాత్రం సందేహం లేదు.

వాటిలో న్యాయం వుంది. ధర్మం వుంది. మనం ఈ నాడు మాట్లాడే సామాజిక న్యాయమూ వుంది. అవే, మరో లక్ష సంవత్సరాలైనా, మన పరిస్థితులు ఎలా మారినా - ఎప్పుడూ నిలకడగా నిలువ గలిగేవి.

యిప్పుడు మనం మాట్లాడే న్యాయాలు - చాలా, చాలా పేలవమైనవి;    కొన్ని - సంవత్సరాల్లోనే  ఈ నాటి న్యాయాలు - రేపటి అన్యాయాలుగా మారేవి. నిజానికి న్యాయానికై  మనం చేసుకున్న ఎన్నో చట్టాలు, ఇప్పటికే - అన్యాయాలకు  నిలయమై పోయాయి. చాలా చట్టాలలో - న్యాయం జరగడం లేదనేది వాస్తవమైన విషయం. 

అంతే కాదు. ఏ వొ క్కరికీ - నిజమైన సంతోషాన్ని, న్యాయాన్ని  చేకూర్చ లేనివి - మనం ఈ రోజు పెట్టుకుంటున్న ఈ నాటి న్యాయాలు, చట్టాలు .

వీటితో పోల్చి చూస్తే - ఉపనిషత్తుల నాటి న్యాయాలు - ఎంతో బాగున్నాయి.

అందుకు కొన్ని ఉదాహరణాలు మాత్రమే -యిక ముందు, కొన్ని వ్యాసాల్లో,  మీ ముందు వుంచుతున్నాను.

ఇవేవీ చట్టాలు కాదు. యివి,సరాసరి మనుషులైన మనం పాటించ వలసిన కనీస నియమాలు.

కొన్ని నియమాలు , మనిషి, మహా మనీషిగా మారాలంటే పనికొచ్చేవి. మరి కొన్ని మనమే దేవుడు గా మారాలంటే - పనికొచ్చేవి. 

యిప్పుడు మొదట తైత్తిరీయ ఉపనిషత్తు లోని కొన్ని సూత్రాలు నియమాలు, సందేహాలకు సమాధానాలు - యివి మీ ముందుంచుతున్నాను. 

1. అన్నం న నింద్యాత్  . తద్ వ్రతం. (తై .ఉ. 3.7). 


    మనం ఆహారాన్ని ఎప్పుడూ నిందించరాదు  - అనేది వొక వ్రతం. అన్నాన్ని నిందించని వాడే - బ్రహ్మజ్ఞానానికి    అర్హుడు. అటువంటి వాడికే - పుష్కలంగా - అన్నం కూడా యివ్వ బడుతుంది. అన్నాన్ని నిందించే వాడికి - సరైన ఆహారమూ దొరకదు. అది పుష్కలంగానూ యివ్వ బడదు యిచ్చినా, అతడు, ఆ ఆహారాన్ని తినలేని పరిస్థితుల్లో వుంటాడు - యిలా ఎన్నో చోట్ల ఉపనిషత్తులలో చెప్పబడింది.  యిక్కడ - అన్నము, లేదా ఆహారము అంటే - మనం అనుభవించే అన్నిటినీ - అని కలిపి చెప్పుకోవచ్చు.

నిందించడమంటే - తిట్టడం మాత్రమే  కాదు. తట్ట లోనో, ఆకులోనో వేసుకున్న ఆహారాన్ని, ఎవరిపైననో కోపం తో  విసిరి వేయడం, చేసిన వారినో, వండిన వారినో తిట్టడం కూడా యిందులోకే వస్తుంది. - మనలో కొంత మంది ఇలాంటివి ఎన్నో చేస్తాము. యిది బాగు లేదు, అది బాగు లేదు - అనడం కూడా పనికి రాదు. యివన్నీ చేయ రాదు. దీని తరువాత మరి కొన్ని వస్తాయి. అవీ చదవండి.

2.అన్నం పరిచక్షీత.   తద్ వ్రతం. (తై .ఉ. 3.8). 


అన్నాన్ని నిరసన  భావంతో ఎప్పుడూ, నిరాకరింప కూడదు. యిది కూడా వొక వ్రతం. వ్రతం అంటే ఏమిటి?  నమ్మకంతో, భక్తితో పాటించ వలసిన నియమం. అన్నం పట్ల పూర్తి సద్భావం వుండాలి  వీళ్లిచ్చారనో, వాళ్లిచ్చారనో -  బాగున్న అన్నాన్ని తృణీకరించ రాదు.


ఈ మొదటి రెండూ - తీసుకుని తినే అతిథికి చెప్ప బడింది. అంతే కాదు. యింట్లో సాధారణంగా గృహిణి  వండి వడ్డిస్తుంది. మిగతా వారు తింటారు ఆ తినే వాళ్లకు అందరికీ యిది తప్ప కుండా వర్తిస్తుంది. వండిన వాళ్లనో, వడ్డించే వాళ్లనో, తినే ఆహారాన్నో -తినే వారు తప్పు పట్ట కూడదు. కృతజ్ఞతా భావం వుండాలి. అది వుపనిషద్  వాక్యం. యిది జీవితాంతం పాటించ వలసిన వ్రతం.   

ఈ క్రింద వచ్చే సూత్రాలు - అన్నాన్ని  సంపాదించే వారికి, చేసే వారికి, వడ్డించే వారికి వర్తించే నియమాలు, వ్రతాలు.

3. అన్నం బహుకుర్వీత . తద్ వ్రతం .  (తై .ఉ. 3.9). 


అన్నాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా  సంపాదించాలి . యిది కూడా వొక వ్రతం. అన్నం - అంటే - మనం నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా - అని తెలుసుకోవాలి. అంటే- మనుషులకు ఉపయోగ పడే అన్ని వస్తువులు సంపాదించాలి. ఎందుకు మన అవసరాలకు మించి సంపాదించాలి?  ఈ ప్రశ్న  మన మనస్సులో తప్పక వస్తుంది .


ఎందుకు?

దీనికి సమాధానం, దీని తరువాత చాలా రకాలుగా నిర్దిష్టంగా  యివ్వ బడింది. పూర్తిగా చదవండి. మనం  గమనించ వలసిన  ముఖ్య విషయం ఏమిటంటే   -  "ఎక్కువ సంపాదించడం " - తప్పు  అని మన వారు అనలేదు. ధార్మికంగా  ఎంతైనా  సంపాదించండి. తప్పు లేదు.  

4. న కంచన వసతౌ ప్రత్యా చక్షీత . తద్ వ్రతం. తస్మాత్ యయాకయా చ విధయా - అన్నం - ప్రాప్నుయాత్ (తై .ఉ .3.10.)


ఆశ్రయాన్ని కోరి మీ యింటికి ఎవరైనా వస్తే - అటువంటి అతిథిని - ఎవరిని కానీ - లేదు, అని చెప్పి, తిప్పి పంప రాదు .  యిది కూడా వొక వ్రతం.    వారికి కావలసినవన్నీ - ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలు గా నైనా సంపాదించాలి . అంటే  అన్నీ ధర్మ బద్ధమైన మార్గాలలోనే. చూశారా ! అతిథుల కోసం, అవసరం ఉన్నవారి కోసం, అడిగే వారి కోసం, లేని వారి కోసం - మీరు (ఎంత ఎక్కువైనా)  సంపాదించాలనే  - ఉపనిషత్తు కూడా చెబుతోంది. 

యిది వ్రతం అన్నారు

 కానీ, నిజానికి,  అన్నం,ఆస్తి లాంటివి - సంపాదించడంలో నిజమైన ఆనందం లేదు. యివి, ఏ విధంగా, మనం ఉపయోగిస్తామో, ఎవరి కోసం ఉపయోగిస్తామో - అందులోనే ఆనందం వుంది. యిది తెలియనంత వరకు - - జీవితంలో తృప్తి  నివ్వని, సుఖాలు వుంటాయేమో కాని , తృప్తి నిచ్చే ఆనందం మాత్రం అనుభవం లోకి రాదు.    

తెలుగులో మనకు తెలిసిన పద్యం వొకటి వుంది :

దానము, భోగము, నాశము, పరగంగా మూడు గతులె  భువి ధనమునకున్, దానము, భోగము నెరుగని దీనుని ధనమునకు, గతి తృతీయమే సుమ్మీ.  

దానము మొదటి  ,ఉత్తమమైన ఉపయోగం. యిక్కడ ధనం అన్న మాట, అన్నిరకాల ధనానికీ, అంటే, అన్నంతో బాటు అన్నిటికీ చేర్చి  - వాడబడింది. కాబట్టి, ఆస్తి, ధనము, అన్నము అన్నీ అని చెప్పొచ్చు. వీటికి మొదటి, శ్రేష్టమైన ఉపయోగం - దానమే. దాని తరువాత, దాన్ని మనమూ  భోగించ వచ్చు. సంతోషం పొందచ్చు. తప్పు లేదు. యివి రెండూ లేని మనిషి ధనం - ఎందుకూ పనికి రానిదౌతుంది. యిది మనం జ్ఞాపకం పెట్టుకో వాల్సిన విషయం. అక్షర సత్యం.  

5.    అరాధ్యస్మా అన్నమిత్యా ( అస్మై అన్నం అరాథి యితి), ఆ చక్షతే  (తై .ఉ .3.10.)


అతిథి  వస్తే - ఆహారం సిద్ధం గా వుంది, రండి భోంచెయ్యండి  - అనాలి. అంతే గాని లేదు, పోండి అనరాదు


చూడండి. మన పూర్వీకులు, అతిథి, అభ్యాగతులకు మనం చేయ వలసిన మర్యాదల గురించి ఎంత వివరం గా చెబుతున్నారో.  లేదనే పద్ధతి - మన సంస్కృతిలో లేదు. యిది ఎప్పటిది? ఉపనిషత్తు పుట్టిన కాలం నాటిది. ఈ -సంస్కృతి నా మనం కించ పరిచేది?  ఈ పద్ధతుల నుండి మనం ఎప్పుడు మారామంటే  - తురుష్కుల దండయాత్రలతో  సగం పైగా మారాము. ఆంగ్లేయుల   దండయాత్రలతో పూర్తిగా మారాము. లార్డ్ మెకాలే  అనే ఆంగ్ల ప్రభువు ఆంగ్ల పరిపాలకులకు యిచ్చిన సలహా యిదే . వీరి సంస్కృతిని నాశనం చేస్తే తప్ప, వీరి దయాగుణాన్ని నాశనం చేస్తే తప్ప - మనం వీరిని పరిపాలించడం అసంభవం అన్నాడు .అదే చేశారు కూడా. వొకరిపై, మరొకరికి వున్న మర్యాదను , నమ్మకాన్ని పోగొట్టడానికి. అతిథి మర్యాదలను పూర్తిగా పోగొట్టడానికి - ఎన్నో రకాల  పన్నాగాలు పన్నారు మనమూ అందులో పడ్డాము.

6.ఏతత్ ద్వై ముఖతోన్నగుం రాద్ధం; ముఖతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడతాయి. దయా గుణం, దాన గుణం వున్న వానికి లోటు లేకుండా వచ్చి చేరుతుందని భావం.  

ఎవరిస్తారు  అతనికి ?  ప్రకృతిలోని సర్వ శక్తులూ, పరమాత్మా - అతని పట్ల కృతజ్ఞులై వుంటారు; వారు, ఎన్నో రకాలుగా అతనికి యివ్వడానికి ప్రయత్నిస్తారు అని - ఎన్నో శాస్త్రాలలో చెప్ప బడింది.  

ఈ మధ్య , యిదే విషయాన్ని - పాశ్చాత్య దేశాలలో  -లా ఆఫ్ అట్రాక్షన్ -అని అనేక రకాలుగా చెబుతున్నారు. మనం చేసే గొప్ప పనులకు, మంచి పనులకు, నిస్స్వార్థ  సేవలకు -  ప్రకృతి తోడుగా వుంటుందనేది  - యిప్పుడు వారు చెబుతున్న విషయం. అది తప్పు కాదు. నిజమే. అయితే  ఈ విషయం, మన వారికి, లక్షల సంవత్సరాలకు పూర్వమే బాగా తెలుసు. యిది, మన సంస్కృతి  లో ముఖ్యమైన భాగం. మనం పోగొట్టుకో కూడని భాగం.   యిక ముందు ఏం చెబుతుందో చూడండి.


7. ఏతద్వై మధ్యతోన్నగుం  రాద్ధం;  మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును రాజసిక భావం తోనూ కాస్త అశ్రద్ధ , ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడుతుంది. ప్రకృతి వారికీ వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది.

వొక్కో సారి - మన పూర్వజన్మ నుండి వచ్చిన సంచిత కర్మ కాస్త ఎక్కువగా వుంటే - యిప్పటి ఫలితం, అప్పటి సంచిత కర్మ ఫలంగా మొదట వచ్చేస్తుంది. ఆ తర్వాత , యిప్పటి కర్మ యొక్క ఫలితం మొదలవుతుంది. అందు వలన - యిప్పుడు అనుభవించే ఫలం, యిప్పటిదే అనుకునే ప్రమాదం వొక్కో సారి వుంటుంది. 

దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, చేసిన వారు, కొన్ని సంవత్సరాలు కేసు కూడా లేకుండా కులకడము యిందుకే. కానీ, యిప్పుడు చేస్తున్న పనికి ఫలితం - దాని తర్వాత తప్పక వచ్చేస్తుంది. అరె. యిదేమిటి. యింత అన్యాయాలు చేసే వారికే దేవుడు యిలా ఇస్తున్నాడే -అని  మనం వొక్కో సారి అనుకోవడము - ఆ, దేవుడేం చేస్తాడులే. అంతా నా చేతుల్లోనే వుంది - అని కొంత మంది లంచగొండులు, దోపిడీ గాళ్ళు అనుకోవడం   మనం చూస్తూనే వున్నాం కదా .

అటువంటి వారికి - కాస్త ఆలస్యంగా - శిక్ష పడి, న్యాయం జరగడమూ జరుగుతోంది కదా. యివన్నీ గీత లో కూడా రాయ బడింది.  యిది ఉపనిషత్తుల నాటి నుండి వుంది. మనిషి పుట్టిన నాటి నుండీ వుంది.


8. ఏతద్వై అంతతోన్నగుం  రాద్ధం;  అంతతోస్మా అన్నగుం రాధ్యతే. ఏ ఏవం వేదా .  (తై .ఉ .3.10.)


   
 ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును తామసిక భావం తోనూ, చాలా అశ్రద్ధ , చాలా ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) యివ్వ బడుతుంది . ప్రకృతి, తామసిక గుణం వున్న వారికీ, వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది. యిది మనం బాగా తెలుసుకొని, అర్థం చేసుకుని వ్యవహరించాలి.

సరే. అసలు అన్నం దానమే చెయ్యని వానికి ఎలాంటి ఫలితం లభిస్తుంది. దీనికి, రామాయణం లోనూ, మరెన్నో పురాణాలలోనూ,  ఎంతో వివరణ వుంది. వొక గొప్ప రాజు, ఏన్నో మంచి కార్యాలు చేసాడు గాని - అన్న దానం చెయ్య లేదట . అందుకని, ఆయన బ్రహ్మ లోకానికెళ్ళినా, ఆయన ఆకలి మాత్రం తీరలేదట. తరువాత ఎప్పుడో, అగస్త్య మహాముని దయ వలన ఆయన ఆకలి బాధ తీరుతుంది. ఇలాంటి కథలెన్నో వున్నాయి మన సంస్కృతిలో.

అన్ని దానాల లోకి - అన్న దానం గొప్ప అని అందుకే అన్నారు.

చేసుకున్న వాడికి చేసుకున్నంత -అన్న సామెత వుంది కదా. అలాగే అన్ని దానముల లోకి , అన్న దానం గొప్ప - అన్న సామెత కూడా వుంది.

యిక్కడ మరొక ముఖ్యమైన అంశం మనము మరిచి పోకూడదు. 

అతిథికి మనమేదో, గొప్ప దానం చేసేస్తున్నాం - మనం లేకుండా అతనికి ఆకలి కూడా తీరదు. మనపై అతడు ఆధారపడి - వున్నాడు అనే భావనతో చేసే దానం చాలా వరకు వ్యర్థం అయిపోతుంది.  మనపై అతడు ఆధారపడడం కాదు. అతడు, మనకు పరమాత్మ యిచ్చిన గొప్ప అవకాశం, గొప్ప వరం  అని భావించి , "అతిథి దేవో భవ " అన్న భావంతోనే - అతనికి అన్నం పెట్టడం, తదితర సత్కారాలు చెయ్యాలి .

ఇలాంటి సమాజంలో ఎవరికి ఆకలి దప్పులు వుంటాయి చెప్పండి. దేశంలో ఎవరికి ఆకలి తీరకున్నా - అక్కడి రాజు నిద్ర పొయ్యే వాడు కాదు. రామ రాజ్యం అంటే - ఎక్కడా ఆకలి అన్నది లేని రాజ్యం.  



కొన్ని ఉదాహరణలు చూద్దాం.


1. శబరి రాముడికి తాను  కాస్తా కొరికి, బాగుంది అనుకొన్న దానినే  తినడానికి యిచ్చింది. ఆ అమాయకురాలి అతిథి సత్కారం ఎలాంటిది?

2. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లి - ఎవరి ఆతిథ్యం స్వీకరించాడు? విదురుడు సంజయుడు యిండ్లకు వెళ్ళాడు. అహంకారంతో పిలిచిన ఏ పెద్ద కులాల వాళ్ళ యిండ్లకూ వెళ్ళలేదు. అలాగే దరిద్ర భక్తుడైన కుచేలుడి వద్ద వున్నసత్తు పిండిని బ్రహ్మానందం తో తిన్నాడు కదా. ఎవరు యిస్తారన్నది, ఏం యిస్తారన్నది కాదు,  ఏ  భావంతో యిస్తారన్నది చాలా, చాలా, ముఖ్యం.

3. శంకరాచార్యులు - భిక్షాం దేహి అన్నప్పుడు, అయ్యో , తన దగ్గర ఏమీ లేదే అని కుమిలిపోతున్న గృహిణి  వద్ద, వొక్క మెతుకు తిని, కనక ధారా స్తోత్రం ద్వారా దేవిని అర్చించి - ఆమె యింట కనక వర్షం కురిపించాడు కదా.

ఇలాంటి ఎన్నో సంఘటనలు మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు లో కోకొల్లలుగా వున్నాయి.

అదే - మన  ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం. పెట్టే వాడు అన్నం మాత్రం పెట్టడు. అతిథిని - దేవుడి లాగా సత్కరిస్తాడు.  అలాంటి - రాజ్యంలో అందరూ పెట్టే వాళ్ళే . తినే వాళ్ళ కోసం మీరు వెతకాలి. కుల, మత జాతి భేదాలు లేకుండా - అన్న దానం , అతిథి సత్కారం చెయ్యాలి. అదీ వుంది మన శాస్త్రాలలో.

నాకు తెలిసి, మా చిన్న  తనంలో, అప్పటి పెద్ద వారు చాలా మంది యిలా వుండడం నేను చూశాను.   


మనమందరూ - యిలా వుండాలి మరి. వుందామా?

=మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

 



26, నవంబర్ 2012, సోమవారం

సత్యమేవ జయతే - సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం - మూడు రకాల సత్యాలు - అబద్ధం - ఏమిటి? ఎక్కడుంది?

సత్యమేవ జయతే 



సత్యమేవ జయతే -అన్నది మన అశోక చిహ్నంలో రాసి పెట్టుకుని - మర్చిపోయాం. 

కళ్ళకు  అద్దాలు పెట్టుకుని కళ్ళద్దాలు వెదికే లాగ - యిప్పుడు సత్యం కోసం అందరూ వెదుకుతున్నారు.

మరి - ఘనత వహించిన కోర్టు వారు సాక్ష్యాధారాలు పరిశీలించి - వారికి తోచింది చెబితే అది సత్యం క్రింద చెలామణి అవుతుంది. దానిపై అప్పీలుకు వెళ్ళచ్చు. చాలా కోర్టులు పెట్టుకున్నాము మనం. ఏదో వొక చోట అసలు సత్యం యిదే - అని ఎవరో చెబుతారు. దానిపై యిక అప్పీలు వుండదు.

సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం.

మొన్నటి నాడు మాయింట్లో ఏం కూరలు వండారో నాకు గుర్తుండదు. కానీ కోర్టుల్లో -పదేళ్ళ నాడు - ఆరోజు - రాత్రి మీరు ఎన్ని గంటలా ఎన్ని నిముషాలకు అక్కడ వున్నారు, ఏం చూశారు, అసలేం జరిగింది -అని లాయర్లు అడగడమూ, చూశాము, అన్న వాళ్ళు గడగడా తడుముకోకుండా పూస గ్రుచ్చినట్టు, ఏదో చెప్పడము, దానిపై ఆధార పడి  జడ్జీ గారు తమ తీర్పు మరో అయిదేళ్ళలో చెప్పడమూ - అప్పుడు, యిదీ నిజం అని మనం అనుకోవడము - జరుగుతోంది.

అబ్బా, ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

నాకైతే - పది వాక్యాలు చదివి - వాటిని వొప్ప జెప్పాలంటే  - రోజూ పది సార్లు చదివితేనే - గానీ  చెప్పలేను. అయినా స్కూల్లో ఫస్టు , సెకండు వచ్చే వాణ్ని. అరవై మూడేళ్ళ వయసు తరువాత  ఈ మధ్య -నేషనల్ స్టాక్  ఎక్స్చేంజ్  వారు నిర్వహించే పరీక్షలు రాసి 11 పరీక్షల్లో 85 శాతం పైగా వచ్చి - యెన్.ఎస్.ఈ. సర్టిఫయ్డ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ -లెవల్.5. అని సర్టిఫికేట్ కూడా తీసుకున్నా. అయినా, అక్కడా అంతే. మళ్ళీ - మళ్ళీ -చదివేతేనే గానీ - ఏదీ పెద్దగా గుర్తుండి చావవు.    

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

ఏక సంథా గ్రాహులున్నారు. కానీ, వారు కూడా, నాకు తెలిసినంత వరకూ, విన్నది మాత్రం చెప్పగలరు. చూసినవన్నీ మాత్రం కాదు. మీరు వున్న గదిలో (లేదా యింట్లో) - మీరు పదేళ్లుగా వున్నారనుకోండి. యిప్పుడు, మిమ్మల్ని, ఎవరైనా - మీ గదిలో ఉన్నవన్నీ సరిగ్గా, పూస గ్రుచ్చినట్టు చెప్పమంటే - మీరు చెప్పలేరు. చాలా తప్పులు చెబుతారు. మీ గదే మీకు తెలీదు. వూర్లో జరిగే విషయాలు మీకెలా తెలుస్తాయి.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

అంత దూరం వద్దు. ఇప్పటికిప్పుడు, మీరు - కళ్ళు మూసుకుని - మీ శరీరంలో ఏమేమి ఎలా వుందో - బాగా చెప్పగలరా ? మీరు పడుకుని బాగా రిలాక్స్ అయి తరువాత - చెప్పమంటే మీకు నిజంగా రెండు కాళ్ళు వాటికి పది వేళ్ళు వున్నాయో కూడా -   మీకు తెలీదు.

మీ వెనుక (వీపు) భాగాన్ని మీరు ఎప్పుడు చూసారు? పదేళ్లకు ముందా ? అప్పుడూ చూడ లేదా? నేనూ అంతే.

కానీ, మీరు దారిలో వెళ్ళుతూ వుంటే, చీకట్లో, ఏ ఆక్సిడెంటో, దొంగతనమో జరిగితే - అందులో ఎవరికైనా, మీరు ఏ విధంగా నైనా, సహాయ పడితే -   అప్పుడు, మీరు అన్నీ చూడాలి. కనిపించక పోయినా సరే. అన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి.  అప్పుడెంత టైమో, సెకండ్ల వరకూ మీకు తెలియాలి. డిజిటల్ కెమీరా లో వీడియో తీసినట్టు, మీ మనస్సు అవన్నీ సరిగ్గా రికార్డు చేసుకోవాలి. ఆ కేమీరాలో కూడా - ఫోకస్ వున్న చోటు మాత్రమే వస్తుంది. మిగతావి రావు. కానీ, మీరు మాత్రం ఏదీ మిస్ కాకూడదు. నాకు ఇవేవీ చాత కాదు. కాబట్టి, నేను అటువంటి చోట్లలో వుండనే వుండను. అంటే నేను వున్న చోట - అటువంటివేవీ జరగనే జరగవు.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

యిదంతా మాయా మంత్రాల కథ లాగా వుంటుంది నాకు.

ఏది నిజం? ఏది అబద్ధం? ఏది సత్యం? ఏది అసత్యం ? ఎలా తెలుస్తుంది - మనలాంటి సామాన్యులకు.

మన ప్రాచీనులు, అంటే ఋషులు, సత్యం అన్న దాన్ని రకరకాలుగా తెలియజెప్పారు.

సత్యం - వొక్క భగవంతుడే తప్ప - మరేదీ కాదు అన్నారు. ఆ భగవంతుడికి మరో పేరు పెట్టారు - బ్రహ్మం అని. బ్రహ్మం వొకటే వుంది (లేదా వున్నాడు).మరోటి లేదు - అన్నారు.

మార్పు లేనిది, ఎల్ల వేళలా -వొకే రకంగా వుండేది సత్యం అన్నారు.

బ్రహ్మం అన్న దానికి వొక డెఫనిషన్ యిచ్చారు ;  బ్రహ్మం =  సత్యం = జ్ఞానం = అనంతం 

అంటే - ఇవేవీ వేరు వేరు విషయాలు కాదు, అన్నీ వొక్కటే అని అన్నారు. బ్రహ్మం  అంటే  సత్యం అంటే జ్ఞానం  అంటే అనంతం - అన్న మాట. యిది ఎలా - అని తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి. సరే.

బ్రహ్మాన్ని - పారమార్థిక సత్యం అన్నారు. మార్పే లేని సత్యం ఇదొక్కటే. యిది కాక, వేరే రెండు రకాల సత్యాలున్నాయి.

వొకటి - ప్రాతిభాసిక సత్యం. 

మెరిసేదల్లా బంగారం కాదు అంటాము. మెరిసేదాన్లో వొకటి బంగారం. మిగతావి మరేదైనా  కావచ్చు. కానీ, వొక్కో సారి, పసుపు పచ్చగా, రోడ్లో  దుమ్ములో మెరిసిపోతూ వుంటే మరో ఆలోచన లేకుండా తీసి జేబులో వేసుకుంటారు. అవసరంలో చూడరు.  ఎందుకు చూడరంటే  - మనం చేసే  పని మరెవరూ చూడకూడదని. అసలే చీకటి. అమావాస్య కూడా. మీకు అదృష్టమైన రోజు.

యింటికెళ్ళి మీ భార్యకో, భర్తకో చూపిస్తారు. వారి కళ్ళలో భయం కనిపిస్తుంది. అప్పుడు మీరూ చూస్తారు ఏమైందని.

యండమూరి బాణీలో - చెప్పాలంటే  - అప్పుడు తెలిసింది అది చిన్న పాము పిల్లని.

మీరు మీ భార్యని వదిలేసి, పామును పారేసి వీధి లోకి పరుగెత్తారు.

పాము పిల్ల బంగారం లా కనిపించడం ప్రాతిభాసిక సత్యం. మీరు మీ భార్యకు చూపే వరకు, అది సత్యమే. పాము పిల్ల జేబులో ఊగుతూ వుంటే - మీరు ఎంత సంతోషం తో నడిచారు. ఆ సంతోషం నిజం కాదా. అది పచ్చి నిజం.

కట్టెను పాము అనుకోవడం, భయ పడడం - ఈ ప్రాతిభాసిక సత్యానికి ఉదాహరణం గా వేదాంత గ్రంధాలలో చాలా సార్లు చెబుతారు. అది పరవాలేదు. దానికి రివర్స్ గా- పామును కట్టె  అనుకోవడం - దానిపై కాలు పెట్టడం, లేదా, దాని ప్రక్కనే నడవడం  చాలా సార్లు జరిగే విషయమే. అది ప్రమాద కరమైన - ప్రాతిభాసిక సత్యం.

ఏ భ్రమైనా - ప్రాతిభాసిక సత్యం క్రిందనే వస్తుంది. ఎండమావులలో నీళ్ళు వుందనే భ్రమ సహజం గా ఎడారుల్లో కలిగేది. 

మన దేశంలో, వొక పెద్ద భ్రమ వుంది.    నా కష్టాలకన్నిటికీ కారణం, వేరే ఎవరో - నేను మాత్రం కాదు - అనేది పెద్ద భ్రమ. యిది మనలో వున్న ప్రాతిభాసిక సత్యం.

మీ కష్టాలకు కారణం మీరు కాక పోతే - మీ సుఖాలకూ, మీరు కారణం కాలేరు. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. కష్టే ఫలీ -అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. చెడ్డ అలవాట్లు వదిలి పెట్టండి. మీ సుఖాలకు మీరు కారణం అవుతారు. అప్పుడు తెలుస్తుంది - మీ కష్టాలకూ మీరే కారణం అని. యిది  ప్రాతిభాసిక సత్యం కాదు దీన్ని వ్యావహారిక సత్యం అంటారు.

 అలాగే - పక్క వాడికేవీ కష్టాలు లేవు - అన్నీ నాకే - అనిపిస్తుంది కొందరికి. ఎందుకు నాకే యిలా? అంటూ వుంటారు.అనుకుంటూ వుంటారు. పక్కింటాయనా యిలాగే అనుకుంటూ వుంటాడు. యిది  ప్రాతిభాసిక సత్యం.

అయితే - మగవాళ్ళు మరొకర్ని, వాళ్ళ కష్టాల్ని గురించి పెద్దగా అడగరు.స్వంత గోడు చెప్పుకోరు. మగ వాళ్ళు - కలిస్తే  మన్ మోహన్ సింగును గురించి, ఒబామాను గురించి, తక్కువ లెవెల్ లో మాట్లాడితే - లోకల్ యం.యల్.ఏ. గురించి మాట్లాడుతారు. తమ విషయాల్లో నామోషీ . 

కానీ - ఆడవాళ్ళు చాలా మంది - తమ, తమ విషయాలన్నీ అడిగి, చెప్పి, ఆ తర్వాత  - తెలుసుకున్న దాన్ని , మరో యిద్దరికీ చెప్పి - వొకరి కన్నీళ్లు, మరొకరి కళ్ళలో తుడుస్తూ వుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ గొప్పా కాదు. 

ద్వాపర యుగంలో  ధర్మ రాజు శాపం పెట్టాడట - ఆడ వాళ్ళ నోట్లో ఏదీ దాగదని. సత్యమేవ జయతే - అక్కడి నుండే - వచ్చింది. అబద్ధం వుంటేనే సత్యం సత్యం 'జయిస్తుంది'.   లేకుంటే - దేనిపై జయిస్తుంది? 

కలల్లో వచ్చేవన్నీ - ఆ కలల వరకు నిజమే కదా. కలల్లో మీరు ఎంతో మందిని చంపుతారు. ఎంతో - మందితో ఏమేమో మాట్లాడుతారు, ఏడుస్తారు నవ్వుతారు. భయపడతారు. ఎన్నెన్నో మాజిక్కులు చేసుకుంటూ పోతారు.  అది మీ కల; మీ సృష్టి . మీరు ఏమైనా చెయ్యొచ్చు. చేస్తారు.  లేచిన తరువాత - అది నిజం కాదు , అప్పటి (కలలోని) ప్రాతిభాసిక సత్యం అని తెలుస్తుంది మీకు .

చాలా మందికి ప్రేమ అనేది, 'ప్రేమ కల' లో ఉన్నంత వరకు చాలా గొప్ప నిజంగా కనిపిస్తుంది. పెళ్ళి (లో నిద్ర లేచిన) తరువాత - అది "ప్రేమ కల" అన్న విషయం మెల్ల మెల్లగా తెలుస్తుంది. అమెరికాలో ప్రేమించి పెళ్లి చేసుకుని -మూడేళ్ళలో డైవర్స్ చేస్తూ వుంటారు. సత్యం తెలియడానికి మూడేళ్ళు కావాలి.   కొందరికి, మూడు రోజులు లేదా మూడు గంటలు కూడా సరిపోతుంది.

మరి ప్రేమ సత్యం కాదా? సత్యమే. ప్రాతిభాసిక సత్యమే. మీరు అందులో నుండి,  నిద్ర లేచే వరకు సత్యమే. మరి అమర ప్రేమలు, ఆజన్మాంత ప్రేమలు లేవా. వున్నాయి. అన్నమయ్య సినిమాలో అన్నట్టు - తెగవవి నీవు తెంచే వరకు .

ప్రాతిభాసిక సత్యం చచ్చే వరకు వుంటే - అది సత్యమా, కాదా. అది అప్పుడేమవుతుంది?

అదే - వ్యావహారిక సత్యం - అంటారు. అది వొక రకంగా జీవితాంతపు భ్రమ.

కోర్టుల్లో చెప్పే తీర్పు -   వ్యావహారిక సత్యం. 

పది మంది జరిగిందన్నారు. యిరవై మంది జరగలేదన్నారు. మరి తీర్పు ఎలా వుంటుంది? యిరవై మంది చెప్పేది సత్యం.

ఈ రోజు కూడా, పాకిస్తానీ లాయర్ గారు వొకరు - అసలు కసాబ్, మీ కాశ్మీరీ టెరరిస్టే  అయి వుంటాడు - మా వాడు కాదన్నాడు.మరి వారి కోర్టు ఏమంటుంది? ఏమీ అనదు. ముంబై లో చచ్చిన వాళ్ళంతా - వాళ్ళను వాళ్ళే -కాల్చుకున్నారు  అని చెప్పినా - మనమేం చెయ్యలేము. అంతా - ప్రాతిభాసిక సత్యమే. 

కానీ - అసలైన నిజం అనేది వొకటి వుంది. అది దేవుడికి తెలుసు. మనకు తెలియక పోవచ్చు.

వ్యావహారిక సత్యం అనేది - మనం మన పంచేంద్రియాలతో చూసి,విని,తాకి, మనసుతో (మెదడుతో) గ్రహించే విషయాలు. 

యిక్కడ చిక్కాల్లా - మనం కళ్ళద్దాలు వేసుకుంటే వొక రకంగా కన్పిస్తుంది. వేసుకోక పోతే మరో రకంగా కనిపిస్తుంది. వినేది రెండు,మూడు సార్లు వింటే కాని,జ్ఞాపకం వుండదు. మన, ఈ యింద్రియాలు  ఏవీ సరైనవి కావు. మన కంటే గ్రద్దకు, చూపు బాగుంది. కుక్కకు, చీమకు వాసనలు ఎక్కువగా తెలుస్తుంది.దోమ కూర్చుంటే తెలీదు. కుడితే తెలుస్తుంది. యిలా, మనకు తెలిసే వ్యావహారిక సత్యం వొక పరిధిలోనే తెలుస్తుంది.

అందుకే న్యాయ స్థానాలలో మనుషుల సాక్ష్యం కన్నా కుక్కల సాక్ష్యం విలువైనది. అవి దొంగలను సరిగ్గా గుర్తు పడతాయట. యివన్నీ వ్యావహారిక సత్యాలు. 

మీ భార్య వ్యావహారిక సత్యం. వొక్కో సారి ప్రాతిభాసిక సత్యంగా మారినా - ఆశ్చర్యం అక్కర లేదు. అలాగే, భర్త కూడా.

యిప్పుడు మనం మూడు రకాల సత్యాలను గురించి - కొద్దిగా చూసాం. 

- మొదటిది పారమార్థిక సత్యం. దాన్ని బ్రహ్మం అన్నాం.అదే నిజమైన సత్యం; నిజమైన జ్ఞానం; నిజమైన అనంతం. దాన్ని గురించి చెప్పాలంటే,వేదాంతం చెప్పాలి. అది మరో సారి, జీవితంలో బాగా విసిగిపోయినప్పుడు -  ఇహ నిజంగా జ్ఞానం వొచ్చేస్తే మేలు అన్నప్పుడు - చెప్పుకుందాం.

-రెండోది ప్రాతిభాసిక సత్యం. నిజంలా కనిపించే భ్రమ. కానీ భ్రమ కూడా అది ఉన్నంత వరకు నిజమే.భ్రమ పడి పోతే- అది నిజం కాదని వెంటనే తెలుస్తుంది.

-మూడోది వ్యావహారిక సత్యం. మీకు రెండు చేతులు వున్నాయి. అది వ్యావహారిక సత్యం. కానీ, అవి నిజానికి మీవి కావు అన్నది పారమార్థిక సత్యం.ఎక్కడినుండో వచ్చాయి. ఎప్పుడో వెళ్ళిపోతాయి.మీరు పుట్టడం పెరగడం, పెళ్లి చేసుకోవడం మీ అవస్థలు మీరు పడడం, సుఖం లో దుహ్ఖాన్ని, దుహ్ఖం లో సుఖాన్ని అనుభవించడం, యివన్నీ వ్యావహారిక సత్యాలే. 

మీ ప్రేమలు ప్రాతిభాసిక సత్యం కావచ్చు. వ్యావహారిక సత్యం కూడా కావచ్చు. మీ గుళ్ళో దేవుడు వ్యావహారిక సత్యం. కానీ పారమార్హ్తిక సత్యం కావాలంటే - మీ గుడి దేవుడు చాలా ఉపయోగ పడతాడు. యిది అర్థం కాని వారు, మీ విగ్రహారాధన తప్పు అంటారు. నిజానికి, మీ పూజలు పునస్కారాలు, వ్రతాలూ, అన్నీ పారమార్థిక సత్యం తెలుసుకోవడానికి గొప్ప మెట్లుగా ఉపయోగ పడతాయి.

నిజానికి స్వర్గం, నరకం రెండూ - వ్యావహారిక సత్యాలే. పారమార్థిక సత్యం కాదు.స్వర్గానికెళ్ళి - నిజంగా మీరు ఏం చేస్తారు, చెప్పండి ? గీత వొకరు, బైబిల్ వొకరు, కొరాన్ వొకరు చదువుతూ కూర్చుంటారా? అసలేం చేయాలని వుంది అక్కడ? అది యిక్కడే చేస్తే పోలా?

సరే.  యివన్నీ వదిలి పెట్టండి. అబద్ధం అంటే - ఏమిటి? అది ఎక్కడుంది?

సృష్టిలో ఎక్కడా అబద్ధం లేదు - వొక్క మనిషి నాలుకపై తప్ప.  సృష్టిలో మరే ప్రాణికీ - అబద్ధం ఆడడం తెలీదు. చెట్లూ పుట్టలూ పాములూ గ్రద్దలూ ఏవీ అబద్ధం ఆడ లేవు.మంచీ చెడూ, నాలుక నుండే వస్తూ వుంది. నాలుక కు మనిషి చిత్తం నుండీ వస్తూ వుంది.

నేను యింట్లో లేనని చెప్పరా - అంటే - నాన్న గారు యింట్లో లేరని చెబుతున్నారు - అని మనమూ పిల్లలూ, అబద్ధాలు చెబుతూ వుంటాము.  

మనం, రోజుకు కనీసం నాలుగు అబద్ధాలు చెబుతామట - సరాసరిగా. అందులో 50 శాతం చెప్పే అబద్ధం - "మేం బాగున్నామండీ" అని. అయితే - అది శుద్ధ అబద్ధం  అని ఆ తరువాత చెప్పే పది వాక్యాలలో - చెప్పేస్తాం.

రాసుకోవడం సత్యమేవ జయతే - కానీ, అది చేయాల్సింది మనం కాదు, ఏ దేవుడో వచ్చి చెయ్యాలి. అదీ మన పంథా.

యిక్కడే వుంది మన వేదాల సారాంశమంతా; వేదాంతపు సారాంశమంతా. 

మన చిత్తంలో, మన నాలుక పైన - అబద్ధం తగ్గే కొద్దీ - అక్కడ బ్రహ్మం సాక్షాత్కరిస్తూ వస్తుంది. మనలో, సత్యం పెరిగే  కొద్దీ, జ్ఞానం పెరుగుతూ పోతుంది. అప్పుడు, అనంతం ఏమిటో తెలుస్తూ వుంటుంది.  

అబద్ధం మనలో, పూర్తిగా పోయిన నాడు, మనకు మోక్షమే. జ్ఞానమే ఆనందమే. ఎక్కడో కాదు - యిక్కడే. బ్రతికి వున్నప్పుడే. 

అందుకే - చాలా మంది నిజమైన స్వాములు - ఎప్పుడూ చిరునవ్వుతో  కనిపిస్తారు. కానీ - మనకు దొంగ స్వాములపైనే వుంటుంది మనసు. మిమ్మలను ఎలెక్షన్ లో గెలిపిస్తాను. మీ శత్రువు వోడి పోయేలా చేస్తాను. మీకు వ్యాపారంలో  లాభం వచ్చేలా చేస్తాను - అనే వాళ్ళంతా - దొంగ స్వాములే. వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే . మీరు అడిగేవి అన్నీ అబద్ధాలు నిజాలు కావాలనే.  ఆ రూట్ లో ఆనందం ఎప్పుడూ వుండదు.

కానీ - రమణ మహర్షి కానీ, శ్రీ శ్రీ రవిశంకర్ కానీ, రామకృష్ణులు కానీ - గాంధీ గారు కానీ - - నవ్వితే అమాయకపు, నిజమైన, స్వచ్చమైన నవ్వులే నవ్వుతారు. వారు మీకు యిచ్చేది - వేరే రకపు ఆనందం. వారి సమక్షంలో - మీకు వచ్చేది - కోరికలే లేని, స్వచ్చమైన మనసు.  అందులో వుండేది అనిర్వచనీయమైన ఆనందం. 

-దాన్నే  బ్రహ్మానందం అంటారు. అంతకు మించిన ఆనందం  ప్రపంచం లో మరొకటి లేదు. 

నిజానికి, ఎప్పుడో వొక సారి, మనం, ఏదైనా వొక గొప్ప నిజం చెప్పిన నాడు, మన మనసులో ఎక్కడో, కాస్సేపు అది ప్రతిఫలిస్తుంది. ఆ ఆనందం - చాలా, చాలా గొప్పది - అనేది మనకు తెలుస్తుంది కూడా.

అది కావాలనుకున్న నాడు -అబద్దాలాడడం - నిలిపేసెయ్యండి.  

సత్యమేవ జయతే.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్