27, ఆగస్టు 2012, సోమవారం

మారుతున్న కాలం - ఎటు వైపు మన ప్రయాణం ? - ఏం చెయ్యాలి మనం ?

కిం కర్తవ్యం ?


ప్రపంచం లో  ఎన్నో మార్పులు జరిగి పోతున్నాయి.

మనం వూహించ  గలిగేవి, వూహించ లేనివి  - ఎన్నో, ఎన్నో జరిగి పోతున్నాయి.

వొక్క భారత దేశంలోనే - మనుషులలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెరిసేదంతా బంగారం  కాదు - అన్న పాత కాలం సామెత లోని నిజం తెలిసి వచ్చేటట్టుగా వుంది.

మచ్చుకు వొక్క విషయం చూద్దాం.

మన ఆరోగ్య -మంత్రి  ఘులాం నబి ఆజాద్ గారు అన్నారు - భారత దేశం లోని   మగ వాళ్ళలో - యిన్ ఫెర్టిలిటీ (పిల్లలు పుట్టలేని స్థితి) -చాలా ఎక్కువవుతున్నదట. దీనికి కారణం - మన దేశంలోని రసాయనిక కర్మాగారాల్లో నుండి వెలువడే - క్సెనో బయోటిక్స్ -అని అన్నారు. వీటి వల్ల - స్పెరం క్రిముల సంఖ్య , వాటి  ఆరోగ్యము , నాణ్యత,సామర్థ్యము  గణనీయంగా తగ్గిపోతున్నవట.
    
సరే . డిల్లీ  లోని అఖిల భారత మెడికల్ సైన్సస్ ఇంస్టి ట్యూట్  వారు ఈ విషయం పై చాలా పరిశోధనలు  నిర్వహించి  క్రింది విషయాలు తేల్చారు :

వొక సాధారణ భారత యువకుడిలో (ఆ పై వయసు వారి లో కూడా) - 3 దశాబ్దాల క్రితం స్పెరం సంఖ్య  60 మిల్లియన్లు (వొక మిల్లీ లీటరుకు) వుండేవట . ఆ సంఖ్య యిప్పుడు 20 మి .న్ల కు పడి  పోయిందట.

దీనికి వొక ప్రముఖ కారణం - వారు పని చేసే చోట వుండే - అధిక ఉష్ణత  అన్నారు. అంటే - ఉష్ణోగ్రత  ఎక్కువగా వున్న  కర్మాగారాలు లాంటివి.

యిది కాక, అనేక కారణాల వల్ల ,  మగ వారి స్పెరం నాణ్యత - ప్రతి సంవత్సరమూ - దాదాపు 2% తగ్గిపోతున్నదట .

దాదాపు 40 శాతం మగ వారిలో -  స్పెరం సంఖ్య , నాణ్యత గణనీయంగా తగ్గిపోతున్నదట . సెమన్ ఉత్పతి కూడా  కూడా తగ్గి పోతున్నదట.

ఆరోగ్యముగా పుట్టే స్పెరం సంఖ్య చూస్తే   - వొక్క దశాబ్దంలో  26 శాతం  స్పెర్మ్స్ లో 60 శాతం ఆరోగ్యంగా వుండేవి - యిప్పుడు 7 శాతానికి పడిపోయాయట. అంతకు  ముందు - అంత కంటే మరింత ఆరోగ్యంగా వుండే వుంటాయి. ఇలాంటి మరెన్నో విషయాలు -పరి శోధనల్లో  తెలిశాయిట.  

కోపెన్ హాగెన్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో  కూడా - వారి దేశంలో - యిటువంటి మార్పులు వస్తున్నట్టు తెలిసిందట. 

న్యూ యార్క్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో - లాప్ టాప్  కంప్యూటర్లను తమ కాళ్ళపై పెట్టుకొని పనిచేసే  వారిలో - ఈ సమస్య చాలా ఎక్కువగా , చాలా త్వరగా వస్తున్నట్టు తేల్చారు. 

ముఖ్యంగా - పురుషుల మర్మా వయవాలకు -వేడి కాస్త ఎక్కువగా తగిలితే కూడా - ఈ సమస్య త్వరగా వస్తుందని -తెలుస్తోంది . 

సాధారణంగా  ఈ భాగం శరీరానికి వెలుపల, మూడు డిగ్రీలు తక్కువ వేడితో వుంటుందిట. అప్పుడే దాని ఆరోగ్యం, సామర్థ్యం సరిగ్గా వుంటుందట 

అలాగే - క్రిమి సంహారక మందులు వాడబడే తోటల్లో ఎక్కువగా పనిచేసే మగ వారికి కూడా  -యిలా జరుగుతున్న ట్టు, గమనించారు.

సరే.  ఈ కాలం లో శారీరక పరిశ్రమ లేని ఉద్యోగాల్లో వుండే వారికి ఈ సమస్య బాగా  వస్తున్నది. శారీరకంగా క్రొవ్వు ఎక్కువ వుండే వారికి కూడా - యిలా జరుగుతున్నది.

ఎక్కువగా స్మోకింగ్ , త్రాగే అలవాటు వున్న  వారిలో కూడా - ఈ సమస్య ఎక్కువవుతున్నది.

సెల్ ఫోన్లు -శరీరానికి కాస్త దూరం వుంచితే మేలు అంటారు.అలాగే, సైక్లింగ్, బైక్ రైడింగ్  చేసే వారు - సీటింగ్ బాగా సుఖంగా వుందా అని గమనించితే మేలు-అంటారు .

శరీరానికి మరీ బిగుతుగా వుండే దుస్తులు వేసుకుంటే - కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి - అదీ మర్మావయవాల దగ్గర వేడి కొద్దిగా ఎక్కువ కావడం వల్ల .  

నేను చదివిన - ఈ కొన్ని విషయాలు -పాఠకులతో  పంచుకోవాలనిపించింది. ఎందుకంటే -ఈ మార్పులు -మనకు తెలియకుండా , చాలా త్వరగా ,మన అందరి  శరీరాలలో వస్తున్నట్టు  స్పష్టంగా , పరిశోధనా పూర్వకంగా  తెలుస్తూ వుంది. దీనిని కొంతైనా  అరికట్ట వచ్చు - అని, నేను అనుకుంటున్నాను.  

మన శరీరాల్లో, మనస్సులో - జరుగుతున్న తీవ్రమైన మార్పులను - అరికట్టాలంటే , మగ వారు, ఆడ వారు అందరూ జరుగుతున్న మార్పులను, వాటి - కారణాలను అర్థం చేసుకుంటే -  కొంతైనా తగ్గించుకోవచ్చు.

వొక కాలంలో అనే వారు - మగవాడు చలికి భయపడ కూడదు. ఆడది, వేడికి భయపడకూడదు -అని. దాని వెనుక - యిటువంటి కారణాలు - ఏమైనా వున్నాయేమో! వుండినా  వుండొచ్చు . మనకు తెలీదు. 

ఇలాగే ఆడవారిలో కూడా - అనేక రకాలైన మార్పులు వస్తుండడం మనం గమనించ వచ్చు.- వాటికీ  ఎన్నో కారణాలు వుంటాయి. సాధారణ ప్రసవాలు చాలా, చాలా, తగ్గిపోతూ వుండడం చూస్తూనే ఉన్నాము. అదైనా వొకటి లేదా రెండు అని ప్రభుత్వం అనడం మానేసినా - యిప్పుడు చాలా మంది జంటలకు, వొక్క సంతానం  మాత్రమే వుండడం మనం చూస్తున్నాము.వీటికి మనం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే  కారణం కాక పోవచ్చు. మనలో వస్తున్న అంతర్గత మార్పులు కూడా కారణం కావచ్చు. వీటిని గురించి మరో సారి మరింతగా చూద్దాం .

పశ్చిమ దేశాలలో చాలా ఎక్కువగా వస్తున్న గే-యిజం, లెస్బియన్-యిజం, లాంటి వాటికి కూడా - వారు స్వచ్చందంగా తీసుకునే నిర్ణయాల కంటే - శారీరక, మానసిక,జన్యు సంబంధ మార్పులే ఎక్కువ కారణం కావచ్చు. యివి యిప్పుడు, మన దేశంలో కూడా - ఎక్కువవుతున్నాయి.

మొత్తానికి - ఆరోగ్య కరమైన -  స్త్రీ పురుష సంబంధాలలో - పరస్పర  స్నేహము, సహానుభూతి ,ఆకర్షణ వుండాలి. ఎప్పుడూ తగవులాడే జంటలలో - నేనా,నువ్వా,అని ప్రతి దానికీ  పోటీ పడే వారి మధ్య-  ఈ  సమస్యలు  ఎక్కువవడం తప్పవు.

మారుతున్న కాలం - మనం పూర్తిగా ఆపలేం - కానీ ఎటు వైపు మన ప్రయాణం - అనేది తెలుసుకుంటే - -మనలో  ఆలోచన పెరుగుతుంది.  

అన్ని కారణాలూ - మనకు తెలియక పోయినా - తెలిసిన కారణాలు కొంత  తగ్గించుకుంటే - మంచిది  కదా .

మనకున్నది వొక్క జీవితం. అది అందంగా మలుచుకోవాలంటే - సంతోషంగా గడపాలంటే - నూరేళ్ళు నిండుగా  వుండాలంటే - ధర్మేచ అర్థేచ కామేచ అనే సూత్రం ప్రకారం  - స్త్రీ పురుషులిద్దరూ  - కలిసి - ఎలా ఉండాలో - ఎలా వుంటే -యిద్దరికీ మేలో -   తెలుసుకుంటే - మేలు కదా.



= మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 




7, ఆగస్టు 2012, మంగళవారం

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు = మనం ఏం చెయ్యాలి ?

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు 


ఈ రోజు టీవీ 9 ఛానల్ లో స్వామీ పరిపూర్నానంద గారి ఆవేదన,దానికి విరుద్ధంగా కొంత, సపోర్ట్ గా కొంత,  రాజకీయ వాదులు మాట్లాడడం, వినడం జరిగింది. 

రాజకీయాలు ప్రక్కన బెడితే  - మనం చాలా సులభంగా చూడగలిగే విషయం -ప్రతి మతం లోనూ - ఈ రోజు కొన్ని రుగ్మతలు, కొన్ని లోటుపాట్లు చోటు చేసుకున్నాయన్న విషయం.

ఏదో హిందూ మతం లోనే అన్ని లోటుపాట్లు వున్నాయనుకోవడం-  ప్రపంచాన్ని , అందులో వివిధ దేశాల్లో జరుగుతున్న విషయాల్ని పూర్తిగా విస్మరించడమే అవుతుంది. ఈ రోజు ప్రపంచంలో - యుద్దాలు జరిగితే -    అది హిందూ మతం వలన మాత్రం కాదు. ఇండియా లో పుట్టిన ఏ మతం వలనా కాదు.

మొదటి ప్రపంచ యుద్ధం కానీ , రెండవ ప్రపంచ యుద్ధం గానీ - ఆ తరువాత - ఈ రోజు వరకు జరుగుతున్న అనేక యుద్ధాల్లో - పాల్గొంటున్న మతాల వారెవరు? మనం కాదు

వొక మతం వాళ్ళే తమలో తాము - మత ప్రాతిపదికపై -  కొట్టు కుంటున్న  దేశాలు ఎన్నో వున్నాయి. మా మతంలో - అంతా బాగుంది - ఎవరిపై విద్వేషం లేదు - ఏ రకమైన భేద భావాలు లేవు -    అని చెప్పడం - నిజానికి  చాలా దూరం.  

అయితే - యివి - మొదట - దేవుడే చెప్పాడా ప్రవక్త చెప్పాడా - ఆ తరువాత మతంలో చోటు చేసుకున్నాయా -అన్నది - వివాదాంశం . 

సరే. హిందూ మతంలో - రాముడు కానీ కృష్ణుడు కానీ - అట్టడుగు వాళ్ళకే ప్రాధాన్యత యిచ్చినట్టు - మనకు తేట తెల్లంగా తెలుస్తూనే వుంది.  

శంకరాచార్యుల వారు -అంటరానితనం పాటించ రాదని -    తననే వొక ఉదాహరణగా - తనకు మహా శివుడే  చెప్పినట్టు - గొంతెత్తి చెప్పారు.   

అప్పుడు కూడా - మనం మారక - పోతే - తప్పు మనదా ?  మతానిదా?  

హిందూయిజం - ఎన్నో రకాలుగా మొదటి నుండీ - మారుతున్న మతమే కానీ , మారని మతం కాదు. మొన్న మొన్న ద్వాపరయుగంలో కూడా -  శ్రీకృష్ణుడు - గీతోపదేశం చేసాడు. అది పాటిస్తున్నామా లేదా ?  

శంకరాచార్యుల వారు ఎన్నెన్ని చెప్పారు ? రామానుజుల వారు ఎన్నెన్ని చెప్పారు ? 

అందరిలో నిన్ను; నీలో  అందరినీ; చూడకపోతే - నీకు జ్ఞానం లేదనే నిర్దిష్టంగా  చెప్పారు.

అది వొక ప్రక్కన  వుండనియ్యండి. దాన్ని గురించి మరింత విశదంగా మరో సారి చూద్దాం.

యిప్పుడు ముఖ్యంగా - మనం చూసే లోటుపాట్లు కొన్ని చూద్దాం.

వొకటి ఆలయ ప్రవేశం.దేవుడి దగ్గర కు  వెళ్ళడానికి - ప్రతి  వొక్కరికీ హక్కు దేవుడే యిచ్చాడు . భక్త కన్నప్ప వెల్ల లేదా? తిన్నడు వెల్ల లేదా? శివుడు వద్దన్నాడా?

ఎక్కడైనా , హిందువులైన వారికి ఎవరికైనా - ఆలయ ప్రవేశం లేదంటే - అది సరి చేయడానికి - 66 సంవత్సరాలు అక్కర లేదు వొక్క రోజు  చాలు. కాకపోతే - నేను తాగేసి వెడతాను బూతులు మాట్లాడుతాను - అని అనే వారికి; దేవుడి విగ్రహం పై ఏ నమ్మకం లేని వారికి,  దేవుడి విగ్రహాలు పగుల గొట్టాలి - అనే వారికి - ఆలయ ప్రవేశం - మిగతా వారికి మంచిది కాదు.

సర్దార్ వల్లభాయి పటేల్ గారు చేసినట్టు - నమ్మకం వుండి, రావాలనుకున్న -వారినందిర్నీ- గుడి లోపలికి    పోలీసో  ,  మిలటరీనో - సహాయం తీసుకుని - తీసుకెళ్ళి పోవడమే.అంతే.  అన్ని కులాల్లో - సమానత్వం వుండాలన్న భావన         వున్న వారు చాలామంది వున్నారు. వారి సహాయమూ - తోడూ తీసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు మిగతా వారు మారడం చాలా సులభంగా జరిగి పోతుంది.     

ఎవడెవడు  వద్దని అంటాడో  - అడ్డు కుంటాడో -   వారిని ఆ గుడి నుండీ - వొక సంవత్సరం నాళ్ళు - బహిష్కరించండి. తప్పే లేదు. మరొకరి హక్కులకు  అడ్డం నిలిచే వాళ్లకు అలాంటి  శిక్ష తగినదే.  ఈ ఆలయ ప్రవేశం - అనే వొక సమస్య  - వొక్క రోజులో పరిష్కరించ వచ్చు .   

అలాగే - టీ అంగళ్లు ,హోటళ్ళలో -   వివక్షత వుంటే - ఆ హోటల్లు మూసేయండి . తప్పే లేదు. ఎవరి హక్కుకూ -ఎవరూ  అడ్డు నిలవడం సరి కాదు. కాకపోతే - శుభ్రత లాంటి విషయాలు - చూడాల్సిందే . ఏ కులం ఏ మతం వారైనా - తాగేసి రావడమో, శుభ్రత లేకుండా రావడమో, బూతులు, మాట్లా మో -  చెయ్య రాదు. యివి -  వొక్కరని కాదు - చాలా కులాల వారు చేస్తున్నారు . అగ్ర వర్ణాల / వర్గాల వాళ్ళు కూడా చేస్తున్నారు  .ఏ సమాజం లో నైనా - యివి పనికి రావు.  

మాట్లాడుతూ వుంటే - సమస్యలు పరిస్ద్ష్కారం కావు. శ్రీకృష్ణుడు ఎన్నో చేసాడు.శంకరాచార్యులు  చేసారు. రామానుజులూ చేసారు. మనం చెయ్యడం లేదు.వూరికే మాట్లాడుతూ ఉన్నాము.  

గోటి తో పోయేదానికి - గోరూ ఉపయోగించడం లేదు . గొడ్డలీ ఉపయోగించడం లేదు. అసలేమీ చెయ్యడం లేదు. సంవత్సరాల తరబడీ - వూరికే  మాట్లాడుతూ  ఉన్నాము. 

మతోద్దారకులూ, సమాజోద్దారుకులూ - అయిన హిందువులందరూ - రంగం లోకి దిగి - సమస్యను - పరిష్కరించండి. వొక్క రోజు కాకున్నా వొక-నెలలో - కనీసం - ఆంధ్ర ప్రదేశ్ లో - ఈ సమస్యలు రూపు మాపండి . అదే విధంగా - వారికి సహాయంగా -ప్రభుత్వం నిలవాలి . చట్ట పరంగా ప్రభుత్వం అందరి హక్కులనూ కాపాడాలి కదా.

యివన్నీ ఏదో విప్లవం లాగా చేయాల్సిన పనేం లేదు. చాలా శాంతి యుతంగా, చెయ్యగల పనే. సులభమైన పనే. చెయ్యాలి - తప్పదు.     

చేసి - అందరికీ మార్గ దర్శకులుగా నిలవండి.  


స ర్వే జనాః సుఖినో భవంతు .  

=మీ

ఉప్పల దడియం  విజయ మోహన్   
       

11, జూన్ 2012, సోమవారం

పాడుతా , తీయగా (ఫైనల్సు ) = యిక్కడి నుండి - మరెక్కడికి?= భారత దేశానికి మరో బాలు, మరో సుశీల - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

పాడుతా , తీయగా  (ఫైనల్సు )


కాశీ మజిలీ కథల్లో - వొక్కో మజిలీకి వొక్కో కథ వుంటుంది . ఆ కథ ఎంత  బాగున్నా- కథ తరువాత మరో మజిలీకి వెళ్ళక తప్పదు. 


జీవితమంతా అంతే . జీవితంలోని - ప్రతి భాగమూ అంతే .

ప్రతిదీ ధారా వాహికమే. ఎంత బాగున్నా - అది ఎక్కడో ముగియక తప్పదు.  

పాడుతా, తీయగా ధారా  వాహికంలో - ఈ రోజు  ఫైనల్సు  ముగిసింది.

ఎలా వుంది?

ఉగాది పచ్చడిలా వుంది.

పాటలు అద్భుతంగా వున్నాయి. నలుగురూ "చాలా, చాలా, చాలా, చాలా " బాగా పాడారు.

ఎవరికో వొకరికి ఈ ప్రైజులు  యివ్వక తప్పదు .

ఈ మార్కులు వేసే తతంగం అనివార్యం.వాటిని బట్టి ప్రైజులు యివ్వడమూ అనివార్యమే.

అయితే - ఆంధ్ర దేశంలో - యిప్పుడు ఈ నలుగురు పిల్లలూ - చాలా మందికి గొప్ప గాయకులుగా  పరిచయమయ్యారు. అది ముఖ్యం.

అంత కంటే ముఖ్యం - పాట , సంగీతం - అంటే - యిదీ - అని జన బాహుళ్యానికి - బాలు గారి ద్వారా - యింత నిశితంగా , నిర్దిష్టంగా తెలియరావడం.

హరిణి, తేజస్విని, రోహిత్, సాయి చరణ్ -నలుగురూ - వొకరికొకరు ఏ రకంగానూ - తీసి పోని వాళ్ళు. 

వొక్క రోజు రోహిత్ పాట వొకటి మహాద్భుతం అనిపిస్తే - రెండో రోజు తేజస్విని పాట  ఏదో వొకటి అలా అనిపిస్తుంది.  మరో రోజు హరిణి పాట , మరో రోజు సాయి చరణ్ పాట .

సంగీతం కూడా వొక స్థాయికి మించిన తరువాత - క్రికెట్  లాంటి గేము లాగా వుంటుంది. వొకరు ఎంత బాగా పాడినా- మరొకరు ఆరోజు వారి కంటే - బాగా పాడేస్తారు.

ఎంపిక చేసుకున్న పాట - దాన్ని ప్రాక్టీసు చేసుకున్న తీరు, వేదిక పైన ఆరోజున్న మనో భావన - అన్నీ పాడే విధానం పై తమ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, వొక మార్కు, రెండు మార్కులు తగ్గడమో, ఎక్కువ కావడమో - పెద్ద విషయం కాదు.

చివరి ఎపిసోడ్లకు - మోహన్ బాబు గారు రావడం మరింత రమ్యంగా వుంది. మోహన్ బాబు గారు కష్టమంటే - ఏమిటో తెలిసిన వారు. తాను  కష్ట పడి  సాధించిన వారు. తన విద్యాలయాల్లో - తన విద్యార్థులలో - వొక వున్నత స్థాయికై  పాటు పడుతున్న వారు. వారు రావడం చాలా బాగుంది. 

నవ్వండి. నవ్వుతూ వుండండి - నవ్వుతూ పాడండి - అని ఆయన పిల్లలకు చెప్పడం - నాకు బాగా నచ్చింది.  మనం నవ్వుతూ, చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ వుండడమే - నిజంగా సఫలీకృతమైన   జీవితం .జీవితంలో - విజయానికి వొకే మెట్టు చెప్పాలంటే - అది యిదే.

మోహన్ బాబు గారూ - మీరు పిల్లలకు, వారి ద్వారా అందరికీ  యిచ్చిన - యీ  అమూల్యమైన సలహాకు - మీకు చాలా ధన్య వాదాలు.

అలా నవ్వుతూ గడపాలంటే - ముఖ్యంగా- ఎవరినైనా సరే - క్షమించేసేయడం  చాలాముఖ్యం. మనల్ని కూడా. తప్పులు చేస్తాం. దాన్ని సరిదిద్దుకుంటూ - మనల్ని కూడా క్షమించేసుకుంటూ -ముందుకు వెళ్లిపోవాలి.

క్షమించ లేని వాడికి - జీవితం నరకంగా తయారవుతుంది. ఎందుకంటే - వాడినీ- ఎవరూ - క్షమించ లేరు గనుక. ఎంత  సేపట్లో క్షమించాలి? 5 నిమిషాలు చాలా ఎక్కువ. వొకటి రెండు నిముషాలలో - ఆ భావన  వొచ్చేయాలి. మళ్ళీ - మనం  నవ్వాలి.


ఈ నలుగురు పిల్లల ప్రజ్ఞా పాటవాల్ని - బాలు గారు - వొక గొప్ప స్థాయికి తీసుకొచ్చి - వాళ్ళను తెలుగు సంగీత ప్రపంచానికి  పరిచయం చేసి వదిలారు.వీరే కాదు. సెమి ఫైనల్సు లో పాడిన వారు కూడా బాగా పాడారు.

యిక్కడి నుండి - మరెక్కడికి?

అప్పుడే చెప్పినట్టు - ఈ ఫైనల్సు ఉగాది పచ్చడిలా  వుంది. అయ్యో అయిపోయిందే - అనుకుంటే - చేదుగా అనిపిస్తుంది.  ఎందుకు తేజస్వినికి  మొదటి ప్రైజు రాలేదు? ఎందుకు రోహిత్ కు రాలేదు? ఎందుకు సాయి చరణ్ కు రాలేదు ? అనుకుంటే - కొంచం  కారం అనిపించొచ్చు. కాని అందరూ హాయిగా, తీయగా పాడారు.

అందరూ - మనకు - మొదటి బహుమతే.  అలా అనుకుంటే - అది తియ్యగా వుంది.

సరే. మొదట చెప్పినట్టు - యిక్కడి నుండి - మరెక్కడికి?

భారత దేశానికి మరో బాలు, మరో సుశీల  - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

ఎన్నో చెయ్యాలి.  ఈ  గాయనీ గాయకులు - మరో నాలుగు భాషలను నేర్చేసుకోవాలి. ఆ  భాషల వాళ్ళ కంటే  బాగా!

ఏం. బాలూ గారూ, సుశీల గారూ నేర్చుకోలేదా?

ఆ భాషలలో - యింత కంటే - బాగా పాడ  గలగాలి. పాడ గలరు. మాకు తెలుసు. 

సరే. కర్నాటక సంగీతమూ, హిందుస్తానీ సంగీతమూ కూడా - బాగా నేర్చుకోవాలి - నేర్చుకో గలరు. మాకు తెలుసు.

నక్షత్రాలను అందుకోవాలని  ప్రయత్నిస్తే - చంద్రుడిని సులభంగా పట్టుకోగలము.

మీరు సంగీతాన్ని వొక యజ్ఞం లా - సాధన చెయ్యాలి.

వొక పెద్ద ఆడిటోరియం లో వేల మంది శ్రోతల ముందు పాడటం వొక ఎత్తు. యింట్లోనో, తోటలోనో   వొంటరిగా కూర్చుని సాధన  చేయడం మరో ఎత్తు.

ఆ సాధన లోనే - ఉన్నతమైన ఎత్తులకు ఎదగడం చాలా గొప్ప విషయం.

మనం విజయానికి ఎంత దగ్గరలో - ఉన్నామో - వొక్కొక్క సారి మనకు అర్థం కాదు. ఏదో - అందరిలా - కొంత ప్రయత్నం చేసి - వచ్చిన దానితో తృప్తి పడతాం.

దాన్ని  ఆంగ్లంలో  " కంఫర్ట్ జోన్ " లో వుండిపోవడం అంటారు. ఆ కంఫర్ట్  జోన్ దాటితే - అక్కడో అద్భుత ప్రపంచం వుంటుంది.  యింకా ఎన్నెన్ని చేయ గలమో - తెలుస్తుంది. 

అది దాటిన వారికి - వారి  చుట్టూ వున్న ప్రకృతి శక్తులు - ఎంతగానో - సహకరిస్తాయి. మరెన్నో విజయ శిఖరాల వైపు  తీసుకు వెడతాయి.

మరి  ఆ కంఫర్ట్ జోన్ ఎలా దాటుతారో  యోచన  చేయండి ?

అందరికీ -అభినందనలతో 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 











4, జూన్ 2012, సోమవారం

రాజు గారి గుఱ్ఱం గాడిదయ్యిందట = గాంధీ గారు, నెహ్రూ గారు వోటు అడిగితే -మనం వోటు వెయ్యం = దేవుడిని నమ్మలేం = ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో చెప్పలేం.


రాను రాను రాజు గారి గుఱ్ఱం  గాడిదయ్యిందట. ఇలాంటి మార్పులు - తప్పనిసరి.

 ప్రపంచం లో యేదీ శాశ్వతం కాదు. నిరంతరం కాదు. అన్నీ పుట్టేవే. అన్నీ పొయ్యేవే.

ప్రతి క్షణం, ప్రతిచోటా,  ప్రతి అణువు  లోనూ, ప్రతి జీవకణం  లోనూ,  జరిగే "మార్పు" మాత్రం తప్పనిసరి.

శాశ్వతమైనది  ఈ  ప్రపంచమంతటా  ఎల్లప్పుడూ , జరిగే  మార్పు వొక్కటే !
మార్పు లేనిదేదైనా వుందా - అంటే - వుందని  యోగులు, జ్ఞానులు  చెబుతారు.

అదేమిటి?.... అది నీవే?

కనిపించే , వినిపించే  నీవు కాదు. వాటికి అతీతమైన నీవు  మాత్రమే శాశ్వతం .
అది వొక్కటి పక్కన బెడితే - - మిగతా, వాటిన్నింటిలో - అంటే, కనిపించే , వినిపించే -అన్నింటిలోనూ మార్పు సహజం గా జరుగుతూ  వుంటుంది.
నిన్నటి మీరు - ఈ రోజు లేరు . ఈ రోజు మీరు-  రేపు మరో మీరుగా మారిపోతారు మీ భర్త(భార్య) కూడా అంతే  మీ పిల్లలూ అంతే. దేశమంతా అంతే. సర్వ సాక్షి అయిన సూర్యుడిలో  కూడా ఎన్నెన్నో మార్పులు  జరిగిపోతూ  వున్నాయి.

భూమిపైన  కూడా - సాక్షులు మారడం  సహజమే.
న్యాయవాదులలో  కూడా,  వొకరు - న్యాయం వైపు వాదిస్తే - మరొకరు (ఎవరో వొకరు) అన్యాయం వైపు  వాదించి తీరాలని  వొక  నియమం పెట్టేసుకున్నారు. ఎవరి ప్రక్క నిజంగా న్యాయం వుందో - వాదించే న్యాయ వాదులకిద్దరికీ  నిజంగా తెలీదా?  అయినా-  మా బాధ్యత  కనుక వాదిస్తున్నాం - అంటారు. అన్యాయం ప్రక్కన కూడా - ఎవరో వొకరు వాదించాలనేది - కలియుగ న్యాయం.అలా లేక పోతే న్యాయం జరుగదని మన  వాదన.

మరి వాదించే వారు, గెలవడానికని వాదిస్తారా? వోడడానికనా?   గెలవడానికేగా? అప్పుడు, న్యాయ వాదులలో  ఎవరో వొకరు గెలుస్తారు? సరే. న్యాయం గెలుస్తుందా ?

అలాంటి దైన మన వ్యవస్థలో - గెలిచేదంతా   న్యాయమేనా?
న్యాయ వాదుల సంగతి  పక్కన వుంచితే - న్యాయ మూర్తులు ఎలా వుండాలి?

 అలనాటి పట్టాభి రాముడిలా వుండాలి. న్యాయమంటే రాముడు. ధర్మమంటే - పటాభిరాముడు. 

రాముడిని చూసి తెలుసుకోవాలి  న్యాయమేమిటో ; ధర్మమేమిటో.

అలాంటి పట్టాభి రాముడేగాలి కా వాటంగా తెరచాప ఎత్తితే, న్యాయము  గాలి వాటం కాదా?

అదెలా న్యాయమవుతుంది?

సరే. న్యాయమూర్తి పట్టాభిరామారావు గారిని - కొన్నారని అభియోగం.   అందుకే  ఆయన లో - గాలి గారి పైన చాలా ప్రేమ పుట్టుకొచ్చింది -అనడానికి - సి.బీ.ఐ. వారికి  - వారి వారి బ్యాంకు అకౌంట్ లలో - చాలా చాలా - ఆధారాలు కనిపించాయి.

రౌడీ  కొడితే - పోలీసు వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. పోలీసు వాడు కొడితే - న్యాయ స్థానానికి వెళ్ళొచ్చు. న్యాయ మూర్తి కొడితే?

గాలి గారికి, జగన్ గారికి - మధ్య చాలా, సన్నిహిత , ఆర్ధిక సంబంధాలు కనిపించాయి.

జగమే - మాయలా వుంది .

పోయినోళ్ళు -అందరూ మంచి వారే అయితే - ఎంత బాగుండేది. వున్న వాళ్ళు  కూడా కాస్త బాగుండే వారు.

-కానీ  వున్న వాళ్ళ సంగతి లోడితే - పోయిన వాళ్ళ కంపు బయట కొస్తున్నది.

వున్న వాళ్ళు - అంటే మీరూ నేనూ కాదు.

బాగా వున్న వాళ్ళు . కొన్ని వేల ఎకరాల భూమి వున్న వాళ్ళు ;లేదా, రాసివ్వ గలిగిన వాళ్ళు. మీకు లేక పోతే ఎలా రాసిస్తారు?  కొందరు రాసివ్వొచ్చు.

ప్రభుత్వమంటే ఎవరిది? మీది. మరి ప్రభుత్వ భూమి మీరు రాసిస్తే చెల్లదా ? చెల్లుతుంది. అలా రాసిచ్చినప్పుడు - వాళ్ళేదో, కానుకలిస్తారాయె. అది మన దేశంలో ఆనవాయితీ కదా. 

కట్నాలూ, కానుకలూ  మేం పుచ్చుకోం. కానీ  మీ  అమ్మాయికి, మీరు వొక కారు, బంగాళా, కోటి రూపాయల నగలూ  -లాంటివి - లేకుండా పంపించడం బాగుండదు కదా -అలాగే చెయ్యండి మరి. మాకేం అభ్యంతరం లేదు.

యిలా చెప్పడం - మర్యాద.

అలాగే, పరిశ్రమలకు మేం భూములిస్తాం. మీరు నాకుగా ఏమీ యివ్వ వలసిన పని లేదు. నా కొడుకు వృద్ధిలోకి రావలసిన వాడంటారా? అది మీ అభిప్రాయం; మీ యిష్టమండి.  నాకు సంబంధం లేదు.

యిదొక మర్యాద.

యిప్పుడే - ఏ.రాజా  గారు  - బయలులో-బెయిలుతో,  స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారు. గాలి గారు కూడా - పట్టాభి రాముల కృప వలన  స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారు.

కానీ ఏ సహాయమూ - గాలి గారు వూరికే తీసుకోరు. తగిన ప్రతిఫలం యిచ్చేస్తారు. వారివ్వక పోతే వారి వారెవరో యిచ్చేస్తారు. అది న్యాయం. న్యాయ మూర్తికైనా సరే . 

గాలి గారి యీ న్యాయం వలన - యిప్పుడు, ఆయనా , న్యాయమూర్తి  గారూ కలిసి  లోపల వుండే ప్రమాదం వచ్చి పడింది .

యిలా - గాలి గారూ - వారికి సంబంధించిన  వారందరూ - వొక్క చోట వుంటే -  అదొక గొప్ప న్యాయం. అది లోపలైనా సరే.  ఏదైనా కొన్నాళ్ళే .ఎన్నాళ్ళని జైలులో పెడతారు?

ఏ.రాజా గారు - లోపల వున్నప్పుడు -ఏదో ఆటలంతా అడే వారట. టెన్నిస్ లాంటివి. కనిమొళి గారు కూడా కొన్నాళ్ళు లోపల వున్నారు. అంతా బాగుందనుకుంటుంటే - మళ్ళీ బెయిలు. యిప్పుడు - ఆడటానికి మిత్రులు ఎవరూ లేరు. నిజమే. బయట, నిజమైన మిత్రులు దొరకడం కష్టం. 

యివన్నీ పత్రికలలో చదువుతున్నాం.కానీ - యిందులో - నిజమెంతో మనం చూసొచ్చామా?  ఈ విషయాలలో - పూర్తి న్యాయమెంతో -తెలియడానికి యిరవై ఏళ్ళు  పట్టొచ్చు.  భారత దేశం కదా.

వీటన్నిటికీ, సాక్షులు  వున్నారా? మన న్యాయ వ్యవస్థ అంతా - సాక్షులపై  ఆధారపడి వుంది కదా. వారు దినదినమూ, గాలి వాటానికి  మారుతూ వుంటారు కదా.  కాబట్టి, అసలు సిసలైన న్యాయం ఏమిటో తెలియడానికి - ఎన్నో యుగాలు పట్టొచ్చు .

అయితే - ఈ కేసులలో - నిజమైన - అన్నీ  తెలిసిన - " సాక్షి"  ఎవరు?

సాక్షుల కోసం వెదకడం - మన పని కాదు. అది ఘనత వహించిన న్యాయ వాదుల పని. హేమాహేమీలున్నారు.

జగన్ గారు తలుచుకుంటే - చిన్న కోర్టు కైనా- అమెరికా లాయర్లైనా వచ్చేస్తారు. వారిపై ఆ లాయర్లకు - అంత ప్రేమ.

వీళ్ళందరూ - ఎప్పుడో ఆత్మ కథలు రాసేస్తారు. జైలు కెళ్ళిన వారందరూ - రాసేస్తున్నారు. గాంధీ గారితో - మొదలయింది ఈ పద్ధతి. యివి రాసేటప్పుడు - వీళ్ళంతా మళ్ళీ, మినిస్టర్లు , చీఫ్ మినిస్టర్లు లాంటి  పదవులలో వుండే ఛాన్సు  వుండనే  వుంది. మనం వుండే వరకు వారికి డోకా లేదు గాక లేదు .


పొరుగు రాష్ట్రం కేరళలో - మణి అన్న వొక గొప్ప పార్టీ నాయకుడు - ఏదో గొప్పలు చెప్పుకున్నాడు . మా  - ప్రత్యర్థుల నెవరినైనా లేపేసే ఆనవాయితీ మాకు వుంది -అన్నారు. మరి, ఎంత మందిని యిప్పటి వరకు లేపేసారో - యిప్పుడు తెలుసుకోవాలి. యిదీ, కేరళ ప్రభుత్వం వారి తలనొప్పి యిప్పుడు.

కేరళలో - మర్డర్ చేయబడిన వారి లిస్టు తీసుకోవాలి. అందులో - పాలిటిక్స్ లో వున్న వాళ్ళ   లిస్టు తీసుకోవాలి. ఆ కేసులన్నీ తిరగదోడాలి. యివన్నీ యిక 20 ఏళ్ళు అందరికీ పూర్తి పని.

బెంగాల్  లో మమతా గారి వ్యవహారం మరో రకం. కనిపించిన వాళ్ళంతా - నక్స లైట్లు  గానో, సి.పీ .యం . వారి లాగానో కనిపిస్తున్నారు ఆమెకు.


వొక చీఫ్ మినిస్టర్  గారు సామాన్య ప్రజలలో - యింత సులభంగా నక్స లైట్లను కనిబెట్ట గలగడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

బెంగాల్ లో  వున్న వారు  పెనం మీద నుండి, పొయ్యిలోకి దూకినంత సంతోషంగా వుండొచ్చు. ముందు చెప్పినట్టు - మార్పు  తప్పదు . ఇలాంటి మార్పు వారుగా వోటు వేసి తెచ్చుకున్నారు. మరి, వేరే ఎవరికి వోటు వెయ్యగలం? వుండేది - పొయ్యి, పెనం రెండే . నిజమే. పాలిటిక్స్ లో  ఆరోగ్యకరమైన మార్పు రావాలంటే - చాలా కష్టం.

యూ.పీ. లో మాయావతి  గారు వెళ్ళారు ములాయం గారు మళ్ళీ వచ్చారు.కొడుకును గద్దె ఎక్కించారు. అఖిలేష్ గారు  -మాయావతి గారిని - వీధుల్లోనూ, అసెంబ్లీ లోను కూడా ఎదుర్కొన గలరు. కానీ - మాయావతి గారు చాలా ముందు జాగ్రత్త మనిషి. ఆస్తిపాస్తులతో బాటు - తన శిలావిగ్రహాలు కూడా - రాష్ట్రమంతా తానే  పెట్టించేసారట. మళ్ళీ -దళిత  (అంటే, తన ) విగ్రహాలను ఎవరైనా తాకితే - ఖబడ్దార్ , అని సవాల్ కూడా చేసేసారు.యిప్పుడు అఖిలేష్ గారు ఏం చేస్తారో తెలీదు. వో  పని చెయ్యొచ్చు. ములాయం గారి విగ్రహాలను, తన విగ్రహాలను కూడా - మాయావతి  గారి విగ్రహాల ప్రక్కనే పెట్టేసేయ్యచ్చు. యింకా కావాలంటే వూరిలోని  యం.యల్.ఏ ల విగ్రహాలను కూడా పెట్టచ్చు. యూ.పీ. అంతటా - అందమైన శిలా విగ్రహాలు పెట్టిన కీర్తి మాయావతి గారితో  బాటు వీరిద్దరికీ దక్కుతుంది.

అన్ని రాష్ట్రాల గాధలూ యిలాగే  వున్నాయి. మనం వీళ్ళ నెవ్వరినీ తిట్టడం లేదు.తప్పు బట్టడం లేదు. వీరు వొక ప్రవాహంలో  కొట్టుకు పోతున్నారు. అంతే.  అధికారం, ధనం - ఈ రెండింటి కోసం తపన. యిదీ ఆ ప్రవాహం.

వొకప్పుడు - పదవికోసం పోటీ లేదు. సేవ చేయడానికి పోటీ వుండేది. పదవంటే  -  ప్రజలకు సేవ -అనే వారు. యిప్పుడూ ఆ మాట 5 సంవత్సరాలకొక సారి చెప్పాలి; చెబుతారు. ఆ తరువాత - అది వేరే లోకం.

యిప్పుడు - గాంధీ గారి విగ్రహాలు, నెహ్రూ గారి విగ్రహాలు ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి - ఈ రోజు గాంధీ గారు వచ్చి వోటు అడిగితే -మనం వోటు వెయ్యం.

ఆయన - భారత ప్రజలలో - ఎవ్వరికీ విరోధిగా, కఠోరంగా మాట్లాడరు. ప్రజలను, జాతి, మత ప్రాంత, భాషా బేధాలతో విడదీయరు. అలా విడదీసి మాట్లాడే వారే - మనకు ఈ రోజు నచ్చుతారు. కాబట్టి గాంధీ గారు వోటడిగితే - రైట్ టు రిజెక్ట్  క్రింద ఆయనకు వొక్క వోటు కూడా పడదు.

అలాగే, నెహ్రూ గారు కూడా. ఆయనా అంతే. ఆయన ప్రసంగాలలో కూడా - ఉప్పూ కారం  గానీ, కారాలూ , మిరియాలూ కానీ వుండదు.అరె. అసలు, మన విరోధి ఎవడో చెప్పడు. వాడిపై పోరాటం చెయ్యాలన్న మాట అస్సలు లేదు.

దేశమంతా వొక్కటే - అంటాడు. యింకాస్సేపు మాట్లాడితే - ప్రపంచ ప్రజలంతా - వొక్కటవ్వాలంటాడు. అప్పుడప్పుడూ జై హింద్ అంటాడు.ప్రసంగం కడపట, జనగణమన పాడాలంటాడు.

మనం వేసే వోట్లన్నీ - విరోధి పై అసహ్యంతో, కోపంతో, భయంతో  వేసే వోట్లే కదా. అసలు విరోధి ఎవరో చెప్పక పోతే ఎలా? అదీ కాకపోతే - మన కులం వాడనో, మతం వాడనో, సారా బాటిల్ యిచ్చాడనో, మరేదో  యిచ్చాడనో -  వోటు వెయ్యచ్చు.

 నెహ్రు గారికీ, గాంధీ గారికీ - ఇవేవీ కూడా లేదు. మరెలా వోటు వెయ్యడం?

రాజకీయాల్లో - రాజు గారి గుర్రం కాల క్రమంలో - కంచర గాడిదగా - తయారయ్యింది.


ఎండలు మండిపోతున్నాయ్. సంవత్సరానికి రెండు డిగ్రీలు పెరుగుతూ వుంది. రేపు చెట్లు పెడితే మేలేమో - అన్న ఆలోచన మనకు వచ్చినా రావచ్చు. జగన్ గారికీ, కిరణ్ గారికీ,బాబు గారికీ రాక పోవచ్చు. వారి గోల వారిది.

రాయల సీమలో - చాలా మందికి , నీళ్ళ టాంకుల్లో అప్పుడప్పుడూ - వచ్చే నీళ్ళు ఎక్కడినుండి వస్తూ వుందో  తెలీదు. వొక వేళ  అవి రేపటి నుండీ రాక పోతే ఏమవుతుందో తెలీదు. రేపటిని గురించి అనుకునే నాథుడే లేదు. అది ఈ రోజు.

కానీ మార్పు సహజం. కంచర గాడిద మళ్ళీ గుర్రంగా మారినా మారొచ్చు.రేపు ఏమైనా జరగవచ్చు. 

రాజకీయ వాదుల్ని నమ్మొచ్చు. వాళ్ళు ఎప్పటి లాగే - తమ తమ ఆస్తుల్ని ,పదవుల్ని సర్దుకుంటూ వుంటారు.

కానీ దేవుడిని నమ్మలేం. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో చెప్పలేం.

సిరికిం  జెప్పడు..అంటూ..బయలుదేరి..ఎక్కడికక్కడ వొక తుఫాను కురిపించినా - ఆశ్చర్యం లేదు.

దేవుడిని నమ్మండి. మంచే జరుగుతుంది.

మళ్ళీ - మా దేవుడిని మాత్రమే  నమ్మండి అంటారా? కంచర గాడిద వంకర గాడిదగా తయారవుతుంది.


=మీ

వుప్పలధడియం విజయమోహన్






28, మే 2012, సోమవారం

మనం మారితే - పాలకుల్లో - మార్పు వస్తుంది. కానీ- మనం మారే ఛాన్సు, ఎంత వుందంటారు ? - జగన్ గారి కేసు ఏమవుతుందో ఎవరికి తెలుసు?


కర్నాటక లో గాలి జనార్దన రెడ్డి గారు అరెస్ట్  అయినప్పుడు - వారికీ, ఆంధ్ర లో జగన్ మోహన్   రెడ్డి గారికి వున్న సంబంధాల గురించి  దుమారం రేగింది. అబ్బే.మాకస్సలు అలాంటి సంబంధమేమీ లేదు గాక, లేదని, వీరు కొట్టి పారేసారు.

గాలి గురించి అంతా తెలిసినా - అక్కడి ప్రభుత్వం వారు - వారిని బాగా వెనకేసుకు వచ్చారు. ఆఖరికి సుప్రీం  కోర్టు వారు కన్నెర్ర చేస్తే - వారిపై చట్టం ముందుకు కదిలింది.

మరి ఆంధ్ర ప్రదేష్  రాష్ట్రం వారు జగన్ పై  ఎలాంటి చర్య తీసుకోవడానికీ - ముందుకు రాలేక పోయ్యారు -వారి ఆస్తుల విషయం కర్ణాకర్ణిగా- రాష్ట్రమంతా కొంత తెలుసు. పక్క రాష్ట్రంలో వారికి కూడా తెలుసు. అయినా -  తనకు తానుగా, రాష్ట్రం ముందుకు కదల లేదు.

వారికి తెలుసు - తీగ కదిపితే - డొంకంతా కదులుతుందని.

కాని- కేసు సుప్రీం కు వెళ్లిందంటే - ఏదో కొంత ముందుకు వెళ్ళక తప్పదు. అదే జరిగిందిప్పుడు.

కేసు సి.బీ.ఐ కి వెళ్ళడము ,  సి.బీ.ఐ  వారికి  కొంత  ఆధారాలు  దొరకడము,  ముందుకు  వెళ్ళే  కొద్ది,  మరిన్ని  ఆధారాలు  దొరకడము, యివి జరిగిన తరువాత,  కేసు తప్పక కోర్టుకు వెళ్ళుతుందనడంలో - సందేహం    లేక పోయింది.

కానీ - వారి పార్టీలో, వారి వెనుకే వున్న వారికి, యిదేదో గొప్ప అవకాశం  లభించినట్టుగా -అంటే , జగన్ గారికి, తమ పూర్తి లాయల్టీ  - మద్దతు - తెలపడానికి - వొక మహదావకాశం  గా మురిసిపోయేటట్టు  కనిపిస్తుంది.

దీని వెనుక  పెద్ద రాజకీయ కుట్ర  వున్నట్టు - జగన్ గారు తప్పక బయటకు వస్తారు, గెలుస్తారు, సి.యం  అవుతారు - అన్నంత  ధీమా తో మాట్లాడుతున్నారు. అయితే - ఈ అక్రమాస్తుల విషయం గురించి వారు మాట్లాడరు. జగన్ గారు త్వరగా బయటకు రావాలి, సి.యం  కావాలి - తాము మరేదో కావాలి - ఈ  ఆరాటం  మనకు  బాగా  కనిపిస్తుంది.

మిగతా పార్టీలు - వారి వారి సమస్యలలో - వారున్నారు -కాంగ్రెసుతో సహా.

కిరణ్ కుమార్ రెడ్డి గారు - జగన్ గారి విషయంలో నిర్దోషి . పాపం - ఆయన ఏమీ చెయ్యలేదు. చెయ్యాల్సిన పనులు ఎన్నో వున్నా - అవేవీ ఆయన చెయ్య లేదు. ఆయనను ఈ విషయంలో - పొగడడమో, తిట్టడమో, రెండూ - అనుచితమే.

బాబు గారు కూడా అంతే. వొక ప్రతి పక్ష నాయకుడిగా - ఈ విషయంలో - ఆయన ఏమీ చెయ్యలేక పొయ్యారు. వారిని కూడా - ఈ విషయంలో - పొగడడమో, తిట్టడమో, రెండూ - అనుచితమే.

కే.సి.ఆర్.  గారు - తిట్ట గలరు ఎవరినైనా. ఆయనకు పొగడడం అస్సలు రాదు. తమ పార్టీ వారినైనా. 

కనీసం తెలంగాణా లోనైనా - ఏ వొక్కరినైనా - ఆయన పొగడగా మీరెవరైనా విన్నారా? జగన్ ను ఆయన తిట్టి వుండే వుండొచ్చు - ఎప్పుడైనా.  తెలంగాణా వచ్చేసినా - వారి పధ్ధతి  వారిది గానే వుంటుంది.

కానీ - జగన్ గారి ప్రస్తుత పరిస్తితికి  ఆయన కారణం కానే కాదు. ఆయన తిట్టుకు అంత శక్తి  లేదు.  శ్రీకృష్ణుడే అన్నాడు - ఎప్పుడూ అలగని వాడు, తిట్టని వాడు, అలిగితే,తిడితే, అది ప్రమాదం; కానీ, ఎప్పుడూ అలిగే వాడు, తిట్టే వాడు, అలిగితే, తిడితే - ఏం భయపడాల్సిన పని లేదు.

కాబట్టి,  జగన్ గారి విషయంలో - అదంతా కారణం  ఏమీ కాదు.  

కాగల కార్యం గంధర్వులు (సి.బీ.ఐ) చేస్తున్నారు. అంతే. ఏం జరగబోతోందో - పై వాడికి  (ఘనత  వహించిన కోర్టు వారికి)  మాత్రమే  తెలుసు. అదీ యిప్పుడు కాదు. ఎప్పుడో తెలుస్తుంది  వారికి ! 

కాకపోతే - వొక్క విషయం మాత్రం సందేహం గా వుంది. కొంత  మంది విద్యార్థులు (నేను కూడా చేసాను అలాంటివి ) పరీక్షల్లో  కూర్చుంటే - అరవై మార్కులు వచ్చే వరకు రాసామనుకుంటే -  యిక చాలు, పదండి పోదాం క్రికెట్ చూడ్డానికి - అను పేపర్ యిచ్చేసి, వెళ్లి పోతారు.  

కొన్ని కొన్ని కేసులలో - సి.బీ.ఐ - అలా, అల్ప సంతోషంతో పొంగి పోతోందో -అని అనిపిస్తోంది. చేసింది చాలు. కనిపెట్టింది చాలు -యిక పోదాం మరో కేసుకు -అని - అలా మీకేమైనా అనిపిస్తోందా ? 

యిప్పుడు దేశమంతా  - మిమ్మల్నే నమ్ముకుంది, దేశంలోని, ప్రతి రాష్ట్రం లోని ప్రతి కేసుకూ. మీరు తప్ప మరొకరు ఇవేవీ చెయ్య లేరు. -అని చెప్పాలనిపిస్తుంది.

అది సరే. మళ్ళీ జగన్ కేసు విషయానికి వద్దాం. మీకు జరిగేవన్నీ , మీకు జరగవలసినవే కానీ - మీకు జరగ కూడనివి కాదు - అంటుంది గీత. 

రేపు ఆయన బయటకు వచ్చి సి.యం  అయినా అంతే . లేక ,  శిక్ష తప్పించుకోలేక పోయినా అంతే .

ఎన్ని కుల రాజకీయాలు , మత రాజకీయాలు నడిపినా - ప్రతి దానికి - వొక మూల్యం వుంటుంది. జగన్ కూ  అంతే . ఎవరికైనా అంతే . ప్రజలకూ అంతే . 

మన కులం వాడికి వోటు వేద్దాం ; మన మతం వాడికి వేద్దాం అని ప్రజలు అనుకుంటే - అందుకు , రాష్ట్రమంతా - తగిన మూల్యం చెల్లించక తప్పదు .

యిప్పుడే - రాష్ట్రంలోని, ఎన్నో వూర్లలో, ఎన్నో జిల్లాల్లో, కనీసం "మంచి" నీటి సౌకర్యం లేదు. అసలు నీటి సౌకర్యమే లేని వూళ్ళు చాలా వున్నాయి. విద్యుత్తు  కొరత ఎప్పుడూ వుంది. ఉద్యోగావకాశాలు మన రాష్ట్రంలో చాలా తక్కువ. మన రాష్ట్రంలో పుష్కలం గా దొరికేది - మన కొంప ముంచే మద్యం వొక్కటే.

65 ఏళ్ళుగా - మన - కులం వాళ్లకు వోటు వేసి   మనం సాధించింది యిదే.

ఈ కుల,  మత ప్రాతి పదికలు  పక్కన పెట్టి -  ఏ జయప్రకాష్ నారాయణ్ లాంటి వారికో - వొక్క సారి - మూకుమ్మడిగా వోటు వేసి చూడండి. అయిదు సంవత్సరాలు - ఈ కుల రాజకీయాల వాళ్ళు, మత రాజకీయాల వాళ్ళు - చెప్పే మాటలు పక్కన పెట్టి - ఇప్పుడున్నంత తెలివితోనే - వొక్క సారి - వారికి, మద్దతు యిచ్చి చూడండి.

మనకు పోయేదేమీ లేదు. మరి ఎన్నికలు లేవుగా - అంటారేమో. ఏదో వొకటి వస్తూనే వుంది. అందులో చూపండి మీ విజ్ఞత .

ఈ మధ్యలో  జగన్ గారు ,ఆయన ఆస్తులు, కేసులు, వొక కొలిక్కి రావచ్చు. ఆయన కూడా బాగా మారొచ్చు.

బాబు గారు,  కే.సి.ఆర్. గారు, చిరంజీవి గారు,ఏదేదో ప్రణాళికలు వెయ్యొచ్చు.తమ తమ రాజకీయాల  ధోరణి మార్చుకోవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎన్నెన్నో చెయ్యొచ్చు. యిప్పట్లో - ఆయనకు రాజకీయాలు అంతు  బట్టడం లేదు కాబట్టి - కొన్ని నిజమైన ప్రజోపయోగ కార్యాలు చేసినా చెయ్యొచ్చు.

తెలంగాణా వొక వేళ  వస్తే - తమ పాలకుల ధోరణికి, తెలంగాణా ప్రజల మొహం మొత్తచ్చు. ఏ జాతి చరిత్ర చూసినా - ఏమున్నది గర్వ కారణం -అని తెలిసి పోవచ్చు.

మనం మారితే - పాలకుల్లో - ఎన్నో మార్పులు వస్తుంది..... కానీ..... మనం మారే ఛాన్సు, ఎంత వుందంటారు ?


=మీ 

వుప్పలధడియం విజయమోహన్  



27, మే 2012, ఆదివారం

స్టీఫెన్ ఆర్ కవీ = "సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్" = గమ్యానికి బంగారు బాట


స్టీఫెన్ ఆర్ కవీ గారు ప్రముఖ రచయిత, వక్త, వ్యక్తిత్వ వికాస శాస్త్రంలో  మహా దిట్ట, ఆయన రాసిన "సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్" ప్రపంచంలో చాలా ప్రసిద్ధి పొందింది.

అది నేనూ చదివాను. దానిపై - నేను ఎన్నో ప్రసంగాలు కూడా చేసాను.

ఆయన రాసిన  ఆ ఏడు పద్ధతులు నిజంగా, మనిషి విజయానికి దారి తీస్తాయనడంలో సందేహము ఏమాత్రమూ లేదు. అంతే కాదు - ఎంతో సంతోషాన్నీ, సంతృప్తినీ కూడా యిస్తాయి. అంటే - నిజమైన   విజయం యిదే అని మనకూ తెలుస్తుంది.

ఆయన మొదట చెప్పేది అదే. మీరు జీవితంలో - ఏదేదో చేసేస్తూ వుంటారు. మీరు వెళ్ళే మార్గం, మీరు వెళ్ళాల్సిన గమ్యానికే వెళ్ళుతుందో, లేదో -  అప్పుడప్పుడూ చూసుకుంటూ వుండాలి. గోడ ఎక్కాలని నిచ్చెన వేసే ముందు - ఎక్కాల్సిన గోడ అదేనా అని చూసుకుని మరీ - ఆ గోడకు నిచ్చెన వెయ్యాలి.

లేదంటే - ఏడెన్ గార్డెన్ (నందన వనం)వెళ్ళాలనుకుని -  నడుస్తూ, నడుస్తూ - సహారా ఎడారి చేరుతారు.

మీకు కావాల్సింది - సంతోషమో, ప్రేమో వుండొచ్చు - నిజానికి.  కానీ - మీరు డబ్బు సంపాదించడం లోనో, పదవులపై వ్యామోహంలోనో - జీవితమంతా గడిపేస్తారు. అంటే - మీకు నిజంగా - ఏమి కావాలో - మీకు తెలియలేదన్న మాట.

మొట్టమొదట, మీరు - మీ గమ్యం  యిదీ అని నిర్దిష్టంగా నిర్ధారించుకోవాలి. తరువాతనే - మీ ప్రయాణం మొదలు పెట్టాలి.  గమ్యం తెలియని వానికి - ఏ దారైనా వొకటే.

గమ్యం  వుండాలి. ఎందుకు - ఆ గమ్యం మనం ఎన్నుకున్నామో కూడా మనకు నిశ్చయంగా తెలియాలి.

మీకు ఏం కావాలో మీకు అర్థమయ్యిందా ? మీరు  కోరుకునేది లభిస్తే - మీరు నిజంగా సంతోషంగా వుంటారా? ఈ రెండు ప్రశ్నలకు జవాబులూ - మనకు తెలియాలి.

మనం సినిమాల్లో చూస్తాము - హీరో గారు ఎంతో మందిని, ఏదో చిన్న నాటి పగతో చంపేస్తారు. తరువాత - హీరోయిన్ గారిని పెళ్లి చేసుకుంటారు - ఆ తరువాత సుఖంగా వుంటారు - అని అంటారు. కానీ - పగ చల్లారదు. యిక్కడ తగ్గితే అక్కడ రగులుతుంది.

ఏ జాతి చరిత్ర చూసినా - యిదే జరుగుతోంది. పశ్చిమ ఆసియా దేశాల్లో చూడండి. ఎప్పుడూ యుద్ధాలే. చైనా చరిత్ర అంతా - రక్త పాతంతో నిండినదే. బ్రూస్ లీ వంటి - కుంగ్-ఫూ ,కరాటే మాస్టర్ల జీవితమంతా రక్త పాతమే కానీ - శాంతి అన్నది లేదు.   చైనా - అంటే - కుంగ్-ఫూ - షావోలిన్ దేవాలయాలు యివే అంటాయి - వారి సినిమాలు. కానీ, షావోలిన్ లో అందరూ సాధువులే    అయినా - ముఖ్యంగా నేర్చుకునేది - కుంగ్-ఫూ. టిబెట్టు లో కుంగ్ ఫూ లేదు. శాంతి వుంది. సహనం వుంది. సంతోషం వుంది.

మనకు నిజంగా శాంతి, సంతోషమూ కావాలంటే - శాంతి మార్గంలోనే వెళ్ళాలి. గమ్యం శాంతి. మార్గం యుద్ధం - అనేది సాధారణంగా కుదరదు. శాంతి కావాలంటే - శాంతి కోసం ప్రయత్నించాలి. మార్గమూ అదే. గమ్యమూ అదే. చిన్న , చిన్న అడ్డంకులు వస్తాయి. కాదనను. జీవితంలో ఎప్పుడో వొక సారి - ఏ రౌడీలతోనో -   కొట్లాడాల్సిన పరిస్థితి రావొచ్చు. కానీ - జీవితమంతా అదే కాకూడదు.

అలాగే - మీకు ప్రేమ కావాలంటే - మొదట - మీరు , ప్రేమ యివ్వడం నేర్చుకోవాలి. ప్రేమ గమ్యం అయితే,ప్రేమే మీ మార్గం కూడా కావాలి. ప్రేమ ఇవ్వలేని వారికి - ప్రేమ దొరకదు. దొరికినా - తొందరగా - దాన్ని, దారపోసుకుంటారు.

జీవితంలో - మిమ్మల్ని అందరూ నమ్మాలంటే - మీరు అందరికీ నమ్మకస్తులుగా వుండాలి. మీతో అందరూ అబద్ధాలు చెప్పకూడదనుకుంటే - మీతో  అందరూ  నిజాలే చెప్పాలనుకుంటే - మీరు మొదట అబద్ధాలు చెప్పడం మానెయ్యాలి.

మీకు మంచి స్నేహితుడు కావాలనుకుంటే - మొదట, మీరు మంచి స్నేహితుడుగా మారాలి.

మీకు మంచి భార్య (లేదా భర్త) కావాలనుకుంటే, మీరు వారికి మంచి  భర్త (లేదా భార్య) గా మొదట మారాలి.

ఇలాంటి మార్పు - మీరు వారి వైపు నుండి ఎదురు చూస్తూ వుంటే - పుణ్య కాలం గడిచిపోతుంది. జీవితం అయిపోతుంది. మార్పు (మొట్ట మొదట) మీలో రావడం సులభం.

మీలో వచ్చిన మార్పు , 45  నుండి  90 రోజుల లోగా - ఎదుటి వారిలో పరివర్తన తీసుకువస్తుంది.  అందుకే, భారత దేశంలో, ఏ వ్రతమైనా, వొక మండలం రోజులు కనీసం చెయ్యండి అంటారు. యిది మనలో మంచి మార్పు రావడానికి. ఎదుటి వారిలో కూడా రావాలంటే - మరి కొన్ని రోజులు ఈ వ్రతం అవలంబించాలి. అందుకే - 90  రోజులు అన్నాము. నిజానికి - చాలా మందిలో, అంటే, మీ ఎదుటి వారిలో- మీలో వచ్చిన పరివర్తన , మీతో బాటే -45 రోజులలో నే వచ్చేస్తుంది. కొందరిలో, కాస్త సమయం అవుతుంది. యిది భారత దేశంలో మనకు తెలిసినంతగా - కవీ గారికి కూడా తెలీదు.

అయితే - ఆయన అన్నారు - మీ అన్ని సంబంధాల లోనూ - నమ్మకం పెంచాల్సిన బాధ్యత మీదే - అని.

మీరు  సంతోషం గా వుండాల్సిన బాధ్యత మీదే. మీ చుట్టూ - సుహృత్  సంబంధాలను , వాతావరణాన్ని సృష్టించాల్సిన     బాధ్యత మీదే.

జీవితంలో - విజయం సాధించే వారి అతి ముఖ్యమైన  ఏడు ముఖ్య లక్షణాలను - యిలా చెబుతారు, ఆయన :-

1  వారు సాధనను తమ చేతుల్లోకి తీసుకుంటారు.చెయ్యాల్సిన పనులు తాము నిర్ణయించి చేస్తూ వెడతారు. 
దీన్ని "ప్రో-యాక్టివ్ " గా వుండడం అంటారు ఆయన. విజయం - మీ సాధన పై ఆధార పడి  వుంది. అదృష్టం  పై కాదు.

2  వారు గమ్యాన్ని తాము నిర్ణయించి, మార్గాన్ని తాము నిర్ణయించి -పని మొదలు పెడతారు. 

గమ్యం - అంటే - మీకు ఏం కావాలో మీకు బాగా తెలిసి వుండడం. ఉదాహరణకు - అయిదేళ్ళ తరువాత - మీరు ఎలా వుండాలని కోరుకుంటున్నారు?అలా కావడానికి, యేమేం  చెయ్యాలో  మీకు తెలుసా? అలా చెయ్యడం, మీకు యిష్టమేనా? మీ గమ్యం - మీకు నిజంగా ఆనందం  యిస్తుందని - మీకు స్పష్టంగా తెలుసా?నిజానికి, మీ గమ్యాన్ని గురించి - మీరు కనీసం పది పేజీలైనా రాస్తే గానీ - అందులోని సాధక బాధకాలు కొంత కూడా తెలిసి రావు. గమ్యమంటే - అలా  బాగా  యోచన  చేసి  తీసుకునే  నిర్ణయాలు.

3  చెయ్యాల్సిన పనుల్లో - అతి ముఖ్య మైనవి ఏవి,  ఏది చేస్తే - మనం గమ్యం వైపు సులభంగా వెళ్ళగలం - అని ప్రతి రోజూ,   యోచన చేసి నిర్ణయించి మరీ చేస్తారు. దీన్నే  ఆంగ్లంలో కవీ గారు   ఫస్ట్ థింగ్స్  ఫస్ట్  అన్నాడు. ఈ  వొక్క  విషయం  పైన కవీ గారు మరో అందమైన పుస్తకం కూడా రాసారు. 

మన జీవితంలో - అతి ముఖ్యమైన విషయాలు - యేవో మనకు తెలిసి వుండాలి. ప్రతి రోజూ -ఆ ముఖ్యమైన  విషయాలపై ఏదో  కొంత పరిశ్రమించాలి  ముందుకు పోవాలి. లేదంటే - మీరు గమ్యం - అనుకునే విషయాలు - మీ ఆశలు గానూ, మీ కలలు గానూ - జీవితాంతం  మిగిలి పోతాయి. జీవితంలో - కొందరు విజయం సాదించడానికి, మరి  కొందరు ఏదీ చెయ్య లేక పోవడానికి - యిదే ముఖ్య కారణం. "ఫస్ట్ థింగ్స్" యేవో తెలీదు. తెలిసినా - రేపు చూద్దాం, మరో రోజు చూద్దాం -అని జాప్యం చెయ్యడం - జీవితాంతం జరుగుతూ వుంటుంది - కొందరికి 

4 . మీరూ, మీ తోటి వారు - అందరూ గెలవాలని ఆశించండి.  దీన్ని - ఆంగ్లంలో - "థింక్ విన్ విన్ " అన్నారి కవీ గారు.

 వెళ్ళే మార్గంలో - ఎప్పుడూ, మనకు తోడూ ఎవరో వొకరు వుండనే వుంటారు.వొక్కో సారి వుండక పోవచ్చు. సాధారణంగా - మనతో రాగలిగే వారిని, యిష్టమున్న వారిని - మనతో తీసుకెడుతూ - వారూ, మీరూ కూడా, విజయం  సాధించే లాగా ప్రయత్నం చెయ్యాలి. 

ఉదాహరణకు, జీవితంలో సమ భాగస్వామ్యులైన  భార్యాభర్తలిద్దరూ - సంతోషంగా జీవితంలో పాల్గొన గలగాలి. అంటే- భార్య చేసే పనులన్నీ భర్త చెయ్యాలనో, భర్త చేసే పనులన్నీ భార్య చెయ్యాలనో లేదు. అది కుదరదు కూడా. - కానీ జీవితంలో గెలుపు అన్న దానికి యిద్దరూ ప్రతీక కావాలి. వొకరి గెలుపు, మరొకరి వోటమికి  కారణం కాకూడదు. అలాగే యిద్దరి మధ్యా సుహృద్భావము లేక పోవడం, జీవితంలో యిద్దరూ వోడి పోవడం జరుగకూడదు.

చాలా సార్లు భార్య భర్త గురించో,  భర్త భార్య గురించో - మరొకరితో - పక్కనింటి వారితో  కూడా  పితూరీలు  చెప్పడం చూస్తూనే వుంటాం. దీన్ని - "లూజ్ -లూజ్" మనస్తత్వం అంటారు. యిద్దరూ వోడి పోతున్నారు  యిక్కడ.

నేనూ గెలవాలి. నువ్వూ గెలవాలి - నీ గెలుపుకు నేను తోడుంటాను - అన్న మనస్తత్వం  మనకు కావాలి.

5. మీ చుట్టూ  వున్న వారిని  మొదట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత - వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ  సహాయం చెయ్యండి.

నిజానికి  యిది వొక  గొప్ప ప్రయత్నం. చాలా కష్టమైన విషయమే. అయితే, యిలా చుట్టూ వున్న వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో - మీకు చాలా విషయాలు తెలుస్తాయి.  మిమ్మల్ని - మీ చుట్టూ వున్న వారు - ఎందుకు అర్థం చేసుకోవడం లేదో  మీకు తెలుస్తుంది. అంతే కాదు, మీ చుట్టూ వున్న వారికి  మీరంటే  బాగా అభిమానం ఏర్పడుతుంది. మీలో సహనం పెరుగుతుంది. మీలో జీవితాన్ని అనుభవించే , ఆనందించే  శక్తి  పెరుగుతుంది. 

సిగ్మండ్ ఫ్రాయడ్  గారు అంటారు - ఈ రోజు వరకూ, ఎవరికీ సమాధానం దొరకని వొక గొప్ప ప్రశ్న , నా ముప్ఫై సంవత్సరాల రీసెర్చిలో, నాకు సమాధానం దొరకని ప్రశ్న - " స్త్రీ అసలు, ఏమి కోరుకుంటుంది? "

 అయితే - యిది వొక మగవాడు చెప్పిన విషయం. యిదే - వొక ఆడ సైకాలజిస్టు చెబితే  - ఏం చెబుతుందో? మీరు చూసే వుంటారు - చాలా మంది ఆడవాళ్ళు, ఆ ...మాకు  మగవాళ్ళ  గురించి   పూర్తిగా  అర్థమయ్యింది లే...అనుకుంటూ వుంటారు. ఎవరిని గురించీ వారికే సరిగ్గా అర్థం కాదు. మరొకరి గురించి అర్థం కావాలంటే - చాలా పరిపూర్ణత, సహనం, అభిమానం అన్నీ వుండాలి. 

తెలుగులో - అంటాం కదా - ఆడవారి మాటలకూ  అర్థాలే  వేరులే - అని.  అది  కొంత  వరకు  నిజమే. స్వరంలో,  అసలైన  అర్థం ధ్వనిస్తుంది. కానీ మాటలు ఎన్నో రకాలు గా వుండచ్చు . చెప్పే మాటకు, ఎదురు చూసే సమాదానానికీ  సంబంధం  వుండక  పోవచ్చు. మీరు స్వరాన్ని గమనించక, మాట మాత్రమే గమనిస్తే - మీకు ఏదీ అర్థం కాదు.

యిది వొక ఉదాహరణ మాత్రమే.మగ వారూ, యిలా చేసే సందర్భాలున్నాయి. 

బిచ్చగాడు అలా ఎందుకున్నాడు? దొంగ  దొంగలా ఎందుకున్నాడు? కోపిష్టి వాడికి కోపం ఎందుకు ? దేవాలయం బయట చెప్పుల దొంగతనం ఎందుకు? లంచగొండి వాడికి ఆ బుద్ధి ఎందుకు?  యివన్నీ మనకు అర్థమవుతుందా ?  అర్థం కావాలంటే - ఎంతో యోచన , సహనం కావాలి.

తల్లిగా వున్న స్త్రీలో - తన సంతానం పట్ల అంత ప్రేమ ఎలా వస్తుంది? దేవత లాంటి ఆ తల్లే అత్త గారుగా కోడలిపై - ఆ అభిమానం చూపలేక పోవడానికి కారణం ఏమిటి? కోడలికి, అత్త గారిపై విముఖత ఎందుకు?  వీరి మధ్యలో - వున్నఆ మగవాడు  ఏం చేస్తే - అందరూ బాగుంటారు? యివి అర్థం చేసుకుంటే - చక్కటి సమాధానాలు దొరుకుతాయి. అందరూ హాయిగా వుండచ్చు .అర్థం కాకపోతే - అత్తగారు, కోడలిని హింసించడమో ,కోడలు, ఏ కారణమూ లేకుండా అత్త గారి కుటుంబాన్ని జైలుకే  పంపించడమూ,  తద్వారా, వారి జీవితాలూ, తన జీవితమూ, పూర్తిగా నాశనం చేసుకోవడమూ జరుగుతూనే వుంది. మనం చేసుకున్న చట్టాలు  ఎవరికీ మంచి చేయని చట్టాలుగా వున్నాయి. ఎందుకు? ఎవరికి ఎవరూ అర్థం కాలేదు గనుక. 

యిదే కవీ గారు చెప్పడం. మొదట ఎదుటివారిని అర్థం  చేసుకోండి.సహనంతో, అభిమానంతో, దయతో.  తరువాత  వారు మిమ్మల్ని  అర్థం చేసుకోవడానికి అవకాశం   యివ్వండి. 

6. మీ అన్ని  ప్రయత్నాలను  వొకదానికొకటి సహకరించేలా వుండేటట్టు చూసుకోండి. అలాగే, మీ ప్రయత్నాలకు, మీచుట్టూ వున్న వారి సహకారాన్ని కూడా తీసుకోండి. మనకు నాలుగెద్దులూ , సింహమూ కథ తెలుసు కదా. నాలుగెద్దులు  కలిస్తే - సింహం పై కూడా విజయం సాధించడం కష్టం కాదు. ఎంత గొప్ప పనైనా - పది మంది కలిస్తే - సుసాధ్యమవుతుంది.   కలవక పోతే అసాధ్యమవుతుంది. 

అలాగే - మనలోనే - పది  మంది  మనుషులున్నారు  తెలుసా. మీరు రాత్రి అనుకుంటారు  - వుదయం శీఘ్రంగా లేచి, ఏదేదో చేసెయ్యాలని. కానీ, ఉదయం  లేవాలనిపించదు. ఏదీ చెయ్యం. రాత్రి అనుకున్న మీరు వేరే. తెల్లవారి లెయ్యని మీరు వేరే. మీలోని వీరందరినీ వొక్క త్రాటి పైకి తెస్తే   - మీరు చెయ్య లేని పని లేదు. అందుకే మన వారు - మనసా, వాచా ,కర్మణా, అన్నారు. అంటే - మనస్సులో అనుకునేదే చెప్పాలి. చెప్పిందే చెయ్యాలి. మనసూ, మాట, పనీ అన్నీ వొకటైతే  - మీరు ఎన్నెన్నో మహాత్కార్యాలను - సాధించ గలరు. ఆంగ్లంలో - దీన్ని సైనెర్జీ అంటారు.

దీనికి కావలసిందల్లా - తెల్లవారి కాస్సేపు ,రాత్రి కాస్సేపు ధ్యానం చెయ్యడమే.ధ్యానము అంటే -ఏకాగ్రతా భావం తీసుకు రావడమే.దానితో బాటు, ప్రశాంతత,సహనం, ఆనందం  కూడా వస్తాయి.

7.మీ లోని శక్తులను, మేధస్సును, అప్పుడప్పుడూ సాన పెట్టాలి. బల పరుచు  కోవాలి.  శారీరకంగా,  మానసికంగా,  మరింత ఎదగాలి.  మనం చేసే  పనులు నిన్నటి కంటే - ఈ రోజు  మరెంత బాగా చెయ్య గలమో - తొందరగా చెయ్య గలమో -యోచన చెయ్యాలి. మీరు చేసే పనులన్నీ - నిన్నటి లాగే చేస్తే - మీ నిన్నటికీ - మీ ఈ రోజుకీ ఏ తేడా వుండదు  కదా. 

జీవితం గానుగెద్దు తరహాగా తయారవుతుంది. 

మార్పు ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. గానుగెద్దు జీవితంలో కూడా, కాడె విరిగి పోవడమో, కాలు విరగడమో -ఏదో జరిగి పోతూ వుంటుం ది. 

మీరు యోచన చేసి, ప్రయత్న పూర్వకంగా, మార్పు తెస్తే - అది మీరు ముందుకు పోవడానికి సహకరిస్తుంది . లేదంటే - వచ్చే మార్పు, మిమ్మల్ని, వెనక్కు నెట్టేస్తుంది. 

ఉదాహరణకు - మీకు ఏదో వొక రోజు అరవై ఏళ్ళు వస్తాయి. ఎనభై ఏళ్ళూ  వస్తాయి. నూరేళ్ళూ వస్తాయి. మీరు, ఆరోగ్యంగా వుండటానికి, సంతోషంగా వుండటానికి ప్రయత్నం చేస్తే. అలాగే, మీ భర్త (భార్య) ఆరోగ్యంగా వుండటానికి,సంతోషంగా  వుండటానికి మీ వంతు ప్రయత్నం మీరు, వారి వంతు ప్రయత్నం వారూ  చేస్తే.

అలా చెయ్యక పోతే - వొక నలభై ఏళ్ళు ముందుగా పోవచ్చు. వున్నన్నాళ్ళు  అనారోగ్యంతోనో, సంతోషం  లేకుండానో వుండొచ్చు. కొంత మంది - తొంభై ఏళ్ళ వయస్సులో - ఏ డిగ్రీలో, పీ.హెచ్ డీ లో చదివే వాళ్ళున్నారు. లేదా- ఎన్నో చదివి పుస్తకాలు రాసే వాళ్ళున్నారు.మరేదేదో  నేర్చుకునే వారున్నారు.దీన్ని, కవీ గారు - ఆంగ్లంలో, "షార్పెనింగ్   ది  సా"    అన్నారు. నాకు తెలిసిన వారిలో - శ్రీమతి కె . రామలక్ష్మి గారు, తమ వయస్సు  ఎంతయినా- ఎన్ని చిన్న, పెద్ద కుటుంబ కష్టాలు వచ్చినా - తమ రచనా వ్యాసంగం  విడవకుండా  వుండడం నాకు నచ్చింది. యిలా ఎంతో మంది - 85 దాటినా, ఎన్నో రకాల ప్రజోపయోగ కార్యాలు చెయ్యడం, ఎన్నో రకాల రచనలు చెయ్యడం నాకు తెలుసు.

ఈ యేడు అలవాట్ల గురించి  - ఎంతో చెప్పుకోవచ్చు .  చెప్పుకుందాం.

యివన్నీ - మీరూ,నేనూ చెయ్య గలిగేవే .

యివి చేస్తూ - మనం, సంతోషంగా, ఆరోగ్యంగా, అందరితో, ముందుకెడదాం.   

=మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 




30, ఏప్రిల్ 2012, సోమవారం

పాడుతా తియ్యగా - 2012 - యిదొక సంగీత యజ్ఞం - యింత కంటే ఎక్కువ ప్రజా సేవ ఏముంటుంది?

పాడుతా తియ్యగా - ఈ రోజు సెమి ఫైనల్సు - ఎలా వుంది?

2011 అక్టోబర్ నెలలో - బాలు గారు  నిర్వహించిన - పాడుతా తియ్యగా - కార్యక్రమం - ఫైనల్సు చాలా, చాలా బాగుందని -అప్పుడు చెప్పుకున్నాం. 

యిప్పుడు మరోసారి, అలాంటి అనుభవం - అనుభవిస్తూ వున్నాం.

ఈ రోజు సెమి  ఫైనల్సు జరిగింది.వూరికే బాగుందంటే - సరిపోదు. చాలా....చాలా...చాలా...చాలా..బాగుంది.

బాలు గారు అద్భుతమైన గాయకుడనేది - భారత దేశమంతా అంగీకరిస్తుంది. ఆయన, ముఖ్యమైన అన్ని భాషలలోనూ - పాడారు. అన్ని భాషలలోనూ - ఆయన పాడిన పాటలు ప్రజలనందరినీ - ఆకట్టుకున్నాయి.

శంకరాభరణం, అన్నమయ్య లాంటి ఎన్నో సినిమాలలోని - ఎన్నో మధురమైన పాటలు - తెలుగులో మళ్ళీ వస్తాయా ? -  చాలా, చాలా కష్టం.

నాకు వొక్కో సారి అనిపిస్తుంది - అన్నమయ్య వల్ల బాలు గారికి (ఆ సినిమాలో) అంత మంచి పేరు వచ్చిందా; లేక బాలు గారి వల్ల అన్నమయ్య కు అంత మంచి పేరు వచ్చిందా - అని. యిద్దరూ  మహానుభావులే. వొకరిది గీతం; మరొకరిది గాత్రం. సరే. సినిమా అంటే - అందరి సమిష్టి కృషి ఫలితం అని చెప్పక తప్పదు. 

పాడుతా తియ్యగా - లాంటి కార్యక్రమం మాత్రం - యింత బాగా, అద్భుతంగా జరపడం - వొక్క బాలు గారు మాత్రమే చెయ్యగలరు. 

నేను, ఇలాంటి కార్యక్రమాలు దాదాపు అన్ని భాషలలోనూ చూస్తాను.

మంచి గాయకులు ప్రతి భాషలోనూ - వస్తున్నారు. మన భాష లోనూ వస్తున్నారు. 

కానీ - ఈ రోజు అతిథి గారు - అన్నట్టు - ఎన్నో రియాలిటీ షోలు ఈ రోజు మనం చూస్తున్నాము. కానీ - నిజమైన, నూటికి నూరు శాతం, రియాలిటీ అనిపించే షో - నాకు(కూడా) ఇదొక్కటే - అనిపిస్తుంది. 

బాలు గారు - 'మా పిల్లలు' - అని ఆ నలుగురు గాయకులను - అనడంలో - అది ఆయన గుండెల లోతుల్లో, ఎక్కడినుండో, వస్తున్నట్టు, మనకు బాగా అర్థమవుతుంది. అదే - నిజమైన రియాలిటీ. పిల్లలకు అంతకు మించి ప్రోత్సాహము యివ్వడం, మరెవ్వరికీ తరం కాదు.

పాటకు - భావం ముఖ్యం అని బాలు గారు  చెబుతూనే వుంటారు. భావం లేని పాటను, వొక సారి అనుభవిం చొచ్చు. కానీ - ఆ పాటకు ప్రాణం, లైఫ్ అంతే.  మళ్ళీ మళ్ళీ మనం పాడాలంటేనో, వినాలంటేనో -  భావం, మన మనసులోతుల్లోకెళ్ళాలి.  మనసును అది తాకాలి. అక్కడ నిలిచిపోవాలి. అటువంటి పాటలకు మరో యుగంలో కూడా ప్రాణం వుంటుంది.

చాలా మందికి తెలీక పోవచ్చు. కానీ, భగవద్ గీతలో కూడా, యుగ,యుగాలకూ నిలిచిపోయే పాటల లాంటి శ్లోకాలు ఎన్నో వున్నాయి. అవి, జీవిత సత్యాలు. (మతాలతో సంబంధమే లేని సత్యాలు).

మనకు, భావ ప్రధానమైన, సంగీత ప్రధానమైన, పాటలు రాయగలిగే వారు వున్నారు. అవి, మధురాతి మధురంగా స్వరపరచ గలిగే సంగీతజ్ఞులూ వున్నారు. 

అంత కంటే మధురంగా పాడగలిగే గాయకులూ వున్నారని, బాలు గారు మళ్ళీ, మళ్ళీ, పాడుతా తీయగా కార్యక్రమం  ద్వారా -  రుజువు చేస్తూనే వున్నారు.

కానీ - సంగీతం లాంటి మహోన్నతమైన కళను, మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళాలనే తపన వున్న నిర్మాతలు -యింకా ఎక్కువగా రావాలి - అనిపిస్తుంది.

సంగీతం ప్రజల స్థాయికి తీసుకు వెడుతున్నాం - ప్రజల మధ్యకు తీసుకు వెడుతున్నాం - అని కొందరంటారు - కానీ - ఆ ప్రజలు - ఏ స్థాయి వారైనా, ఈ రోజుకూ, సాహిత్యం బాగున్న సంగీతమే పాడుకుంటున్నారు - తప్ప - సాహిత్యం, అసలు లేని సంగీతం కాదు.

ప్రజలకోసం - అని - స్థాయి దించడం   కన్నా - ప్రజల స్థాయి పెరిగేలాగా, సంగీతం మలచాలి. శంకరాభరణం ఎన్ని భాషలలో చూశారు? అన్నమయ్య పాటలు - ప్రజల మన్నన ఎంతగా పొందింది? ప్రజల స్థాయి బాగానే వుందని ప్రజలు రుజువు చేసారు. అది జానపదమైనా, భక్తి ప్రధానమైనా, శృంగార ప్రధానమైనా, సంగీతం మళ్ళీ, మళ్ళీ విన గలిగే లాగా, పాడుకోగలిగే లాగా వుండాలని - ప్రతి వొక్కరూ కోరుకుంటారు. అది సినిమాలు తీసే వాళ్లకు తెలియాలి.

సరే. మళ్ళీ, పాడుతా  తీయగా కు వచ్చేద్దాం. నలుగురు గాయకులనూ - సెమీస్ నుండి , ఫైనల్సుకు తీసుకెళ్లడం బాగుంది. మళ్ళీ వచ్చే సోమవారం -   ఫైనల్సు ఎలా వుంటుందో చూద్దాం.

ఈ కార్యక్రమంలో వచ్చే వాళ్ళు ఎంతో మంది - సినిమా గాయకులుగా కూడా మారడం, ఎన్నో ఆవార్డులు సంపాదించడం మనం చూస్తూనే ఉన్నాము. యింకా ఎన్నో అవార్డులు రాగలిగేవే. సాహిత్యం బాగున్న పాటలతో, మంచి సంగీతం అందించ గలిగితే. 

నా ఉద్దేశంలో - మనం, మన సంగీతానికి - ఆస్కార్లు లాంటి ఆవార్డులకోసం ఎదురు చూడకూడదు. మన సంగీతం దాని కంటే - ఎంతో మెరుగైనది . వారికి అర్థం కాక పోవచ్చు గాక. అలా అని - వారి సంగీతం లో వున్న, మెరుగైన అంశాలను మనం వదిలి పెట్టాల్సిన అవసరం లేదు.  

హిందీ లో, చౌదవీ కి చాంద్, కభీ కభీ, ఆరాధనా లాంటి సినిమాల సంగీతాలు - యిప్పటికీ, క్రొత్త పాటల కంటే - ఎంతో ఎక్కువగా పాడుకుంటారు. తెలుగులో, ఘంటసాల పాటలు, బాలు పాటలు (శంకరాభరణం, అన్నమయ్య మాత్రమే కాదు), యివి - యిప్పటికీ ఎంతో బాగున్నాయి. తమిళంలోనూ అంతే. రెహమాన్ గారు కానీ, మిగతా గొప్ప సంగీత దర్శకులు కానీ - అలాంటి, అమర గీతాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటాను. వారికి, నిర్మాతల ప్రోత్సాహం యిలా వుండాలని -ఆశిస్తాను.

ప్రతి వారం - కొంత మంది గాయకులను ప్రోత్సాహపరచడమే కాక - సంగీతమంటే ఏమిటి - అని తెలుగు ప్రజలకు మళ్ళీ, మళ్ళీ, తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ, ప్రజలలో, సంగీతం పట్ల, అమితమైన ఆసక్తి పెంచుతూ,  పిల్లలలో, సంగీతం పట్ల, ఆరోగ్యకరమైన ఆసక్తిని పెంచుతూ - యిదేదో గొప్ప సంగీత యజ్ఞం లాగా - జరుపుతూ వున్న బాలు గారికి - మన కృతజ్ఞతలను తప్పకుండా చెప్పాలి. 

రాజ పోషణ లేని కళలు సన్నగిల్లి పోతాయి. చిక్కి పోతాయి. 

మన రాష్ట్ర ప్రభుత్వం వారు - బాలు గారిలో వున్న గొప్ప కళా కారుడిని మాత్రమే కాదు, అత్యుత్తమమైన వొక ప్రజా సేవకుడిని కూడా గుర్తించి -   వారి గౌరవం పెంచాలని, వారికి మరింత ఉత్సాహం కలిగించాలని -  వారికి భారత స్థాయిలో సరైన గుర్తింపు తేవాలని ఆశిస్తాను. బాలు గారు చేస్తున్న దాని కంటే ఎక్కువ ప్రజా సేవ ఏముంటుంది?

యిది, ఏ పక్క రాష్ట్రం వారో చేసే ముందు - మన రాష్ట్ర ప్రభుత్వం వారే - చేస్తే బాగుంటుంది. 

బాలు గారు తమ ఆరోగ్యం బాగా చూసుకోవాలని, దేవుడు ఆయన ఆరోగ్యం, ఆయన ఉత్సాహం , యింకా ఎన్నో దశాబ్దాలు బాగా వుంచాలని ప్రార్థిద్దాం. ఆశిద్దాం.

పైనల్స్ -వచ్చే సోమ వారం చూడడం - మరిచి పోకండి. 

=మీ 

వుప్పలధడియం విజయమోహన్