8, మార్చి 2017, బుధవారం

భగవద్ గీత (13) - సాంఖ్య యోగము - 2.26,27 - జాతస్య హి ధృవో మృత్యుహ్- నిన్ను గురించి దుఃఖపడడానికి నీకు ఏ కారణమూ లేదు





 

భగవద్ గీత (13)


  

 రెండవ అధ్యాయము  

 సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం.    


అయిదు నుండి పండ్రెండవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ) యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. సాంఖ్య యోగపు 26, 27 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం  చెప్పబోతున్నాడో చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం
  తథాపి త్వం మహాబాహో నైనం  శోచితుమర్హసి ||  (2. 26)


అథ  = యిప్పుడు ; చ = మరియు ; ఏనం = యీ (ఆత్మ); నిత్యజాతం    = ఎల్లప్పుడూ పుట్టునది ; నిత్యం = ఎల్లప్పుడూ ; వా = అది కాకుంటే ; మన్యసే  = ఆలోచించి చూడు ; మృతం = చనిపోయినది ; తథా అపి = అప్పుడు కూడా, అయినా కూడా త్వం   = నీవు  ; మహాబాహో   = గొప్ప బాహు బలము కలిగిన ఓ అర్జునా ; న    =   కాదు   ; ఏనం    = యీ (ఆత్మ)   ; శోచితుమ్   = దుఃఖించుటకు ; అర్హసి  = అర్హత లేనిది ;

  
"గొప్ప బాహుబలము కలిగిన ఓ అర్జునా !  యోచన చేసి చూడు. ఒక  వేళ  యిది (ఆత్మ ), ఎప్పుడూ పుడుతూ, చస్తూ వుండేదే అని నీకు అనిపిస్తే , అప్పుడు కూడా, దీనిని గురించి నీవు విచారపడడానికి  దీనికి అర్హతే లేదు కదా.  "


25 వ శ్లోకం వరకు చెప్పినవన్నీ శ్రీకృష్ణుడి స్వంత మాటలు, తనకు బాగా తెలిసిన విషయాలు చెప్పాడు. యిప్పుడేమంటున్నాడు? అర్జునా! నా మాటల పైన నీకు ఇంకా నమ్మకం కుదరలేదు, అనుకుందాం . యిది (అంటే ఆత్మ) ఎల్లప్పుడూ చస్తూ, పుడుతూ వుండేటట్లుగానే, నీ కళ్ళకు, నీ మనస్సుకు అనిపిస్తూ వుందనుకుందాం . అప్పుడు కూడా దీన్ని గురించి నువ్వు దుఃఖించడానికి, అర్హత వుందా? లేదు కదా .


అర్జునుడికి యింకా దేహం, దేహి ల మధ్య గల తారతమ్యం అర్థం అయివుండక పోవచ్చు. దేహం కనిపిస్తున్నది. తన అనుభవం లో వున్నది. ఈ దేహి  అనుభవం లో లేనిది. కృష్ణుడు దాన్ని గురించి ఏదేదో చెబుతున్నాడు. దానికి చావు, పుట్టుకలు లేవు - అంటున్నాడు. మార్పే లేదు అంటున్నాడు. దేహం పడిపోతే, అది క్రొత్త దేహం వెదుక్కుంటూ పోతుందట. మరి దానికి ఆకార,వికారాలేవీ లేవట. ఇదెలా సాధ్యం?  


మనం చస్తున్నాము, పుడుతున్నాము. అంత మాత్రమే నాకు తెలుసు. అంత  మాత్రమే నా అనుభవం లో వుంది - అని అర్జునుడి మనస్సులో అనిపిస్తూ వుండవచ్చు. కృష్ణుడు ఆత్మ గురించి చెప్పిన చాలా విషయాలకు  ప్రత్యక్ష ప్రమాణం లేదు. పరోక్ష ప్రమాణమూ  కనిపించడం లేదు. ఎలా విశ్వసించడం?  ఇటువంటి భావనలు అర్జునుడి మనస్సులో తలెత్తి వుండవచ్చు. 

ఈ సందేహాలను సైతం పారద్రోలడానికే కృష్ణుడు, యీ  మాటలు  చెప్పాడు. ఈ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుతూ, చస్తూ వుండేదని నీవనుకుంటున్నట్లయితే, అప్పుడు కూడా, దానిని గురించి దుఃఖపడనవసరం లేదు కదా -  అని అంటున్నాడు .    


శ్రీకృష్ణుడికి  తెలుసు -  ఆత్మజ్ఞానం రావడం ఎవరికైనా అంత సులభం కాదు. పంచేంద్రియాలకు, మనసుకు కూడా అతీతమైంది, అంటే, మానవులకు పూర్తిగా అనుభవాతీతమైనది ఆత్మ. దాన్ని గురించి తెలుసుకోవాలంటే, అది అనుభవం లోకి రావాలంటే, ఎంతో సాధన అవసరం. కొన్ని మాటలతో , అది శ్రీకృష్ణుడే చెప్పినా సరే , అనుభవం లోకి రాదు.  అందుకనే , శ్రీకృష్ణుడు అన్ని రకాల తర్కాలతో, అర్జునుడిని మొదట కర్తవ్యోన్ముఖుడుగా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.   


ఆత్మ శాశ్వతము అనుకుంటే దాన్ని గురించి దుఃఖించనవసరం లేనే లేదు. అది ఎల్లప్పుడూ పుడుతూ, చస్తూ ఉండేది అనుకున్నా దానికోసం దుఃఖించనవసరం లేదు. దేహం సంగతి తెలిసే వుంది. అది చావడం తథ్యం. మరి నువ్వు దేనికోసం దుఃఖిస్తున్నావు అర్జునా - అంటున్నాడు, శ్రీకృష్ణుడు. 


దేహాన్ని గురించి యింతకు ముందూ చెప్పాను. మళ్లీ చెబుతాను విను, అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు తరువాతి శ్లోకంలో.     


శ్రీకృష్ణుడి మాట : 

 "జాతస్య హి ధృవో మృత్యుహ్ ధృవం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే  న త్వం శోచితుమర్హసి         || (2. 27) 


జాతస్య = పుట్టిన అందరికీ ;  హి = నిజముగా ; ధ్రువః = నిశ్చయముగా ; మృత్యుహ్ = మరణము  ; ధృవం  = నిశ్చయము ; జన్మ = పుట్టుక, జననము ; మృతస్య  = మరణించిన ప్రతి ఒక్కరికీ ; చ = మరియు  ;తస్మాద్ = అందువలన  ; అపరిహార్యే   = తప్పకుండా జరుగునది, తప్పించలేనిది  ; అర్థే  = ఈ విషయంలో ; న = కాదు ; త్వం = నీవు;  శోచితుం = దుఃఖపడడానికి ; అర్హసి =  అర్హత కలిగిన వాడవు. 


"చావు అనునది పుట్టిన ప్రతి ఒక్కరికి నిశ్చయముగా సంభవించునది.  అదే విధంగా, పుట్టుక అనునది మరణించిన ప్రతి ప్రాణికి నిశ్చయముగా సంభవించునది. ఈ  రెండూ ఎవరూ తప్పించలేనివి. కాబట్టి ఈ రెండింటి విషయంలో దుఃఖపడడానికి నీకు (గానీ , మరెవరికి గానీ) ఏ రకమైన  అర్హతా లేదు (కారణమూ లేదు). "  


ఈ శ్లోకం కూడా, మన నిత్య పారాయణ గీతలో వుండవలసిన ముఖ్యమైన శ్లోకం. యిది సాక్షాత్తూ, శ్రీకృష్ణుడి నోటి వెంట, సందేహాలకు తావు లేకుండా, నిర్దిష్టంగా మనం వింటున్న ముఖ్యమైన విషయం. మనం పుట్టామా? పుట్టాము కాబట్టి ఎప్పుడో వొకప్పుడు తప్పక మరణిస్తాం. మన   మరణాన్ని ఎవరూ ఆపలేరు.    అలాగే, మనం మరణించిన తర్వాత తప్పక పుడతాం . అది కూడా ఎవరూ ఆపలేరు. ఈ  జనన, మరణాల గురించి దుఃఖపడడం  మూర్ఖత్వమే  గాని, సకారణమైనది ఏ మాత్రమూ కాదు - అంటున్నాడు, శ్రీకృష్ణుడు.


పుట్టుక గురించి కాదు మన దుఃఖం, మన భయం. చావును గురించే, అవునా.  మనం ఎలాగో పుట్టేశాం. ఇక దాన్ని గురించి దుఃఖము, భయము అవసరం లేదు. కానీ,  చావడానికి దుఃఖము, భయము - రెండూ వున్నాయి  చాలా మందికి . అవి రెండూ అక్కర్లేదు. అవి రెండూనిరర్థకమైనవి, నిర్హేతుకమైనవి. ఎలాగూ పోనే పోతావు. భయపడితే పోవా? దుఃఖపడితే పోవా ?  అంటున్నాడు, శ్రీకృష్ణుడు.  


భయపడితే, దుఃఖపడితే, చావు రాకుండా ఆపగలమా? అది ఎలాగూ వస్తుంది ; అది యింకాస్తా ముందుగా, అకాలమృత్యువుగా కూడా రావచ్చు. ఈ క్షణం నుండే, మనం సంతోషంగా వుండడం  ఆపేస్తాం. చెయ్యవలసిన ముఖ్యమైన పనులు ఆపేస్తాం. మనకూ, మనవారికీ, లోకమంతటికీ    భారంగా మారిపోతాం.  అదే విధంగా, మన  వాళ్ళు కానీ, మరెవరైనా కానీ, చావకుండా, ఏ వైద్యుడైనా ఆపగలడా ? నిశ్చయంగా  ఆపలేడు. 


మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మరొకరు మమ్మల్ని కాపాడుతారు - అనే మాటలన్నీ హాస్యాస్పదాలు. చావు నుండీ నేను మిమ్మల్ని కాపాడుతాను - అని ఎవరూ అనలేరు. నేను కాపాడుతాను అని ఎవరైనా అని ఉంటే - వాళ్ళే చనిపోయారు కదా.  వారు మరొకరిని  ఎలా కాపాడుతారు. శ్రీకృష్ణుడు కూడా చనిపోయాడు కదా. 


ఇవన్నీ శ్రీకృష్ణుడు, అర్జునుడి దేహానికి, మనస్సుకే గా చెప్పగలుగుతున్నాడు. అర్జునుడి ఆత్మ స్వరూపుడికి కాదు కదా. అర్జునుడి మనస్సుకు యిది అర్థమైతే చాలా? 


జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ  ఎవరికి కావాలి, ఎవరికి వుంది? దేహికా, మనస్సుకా, దేహానికా? దేహానికి, మనస్సుకు జ్ఞానం బోధిస్తే, దేహికి జ్ఞానం ఎలా వస్తుంది? మన ఆలోచనకు, చింతనకు ఆత్మ అందదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? చింతనకు అందదు అన్నదానిపై మనం చింతిస్తున్నాము. ఇన్నీ కూడా, మనకు అర్థం అయ్యేటట్లు, శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. 


మీకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ  వున్నాయి. ఈ దేహి, దేహము అనే వాటిని గురించి మనకు మరింత, మరింత  స్పష్టత  కావాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ స్పష్టత మనలో వస్తే, తప్పకుండా, నిస్సందేహంగా మన సంతోషం చాలా, చాలా పెరుగుతుంది. మన భయాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ పోతాయి. 
 

ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం

4, మార్చి 2017, శనివారం

భగవద్ గీత (12) - సాంఖ్య యోగము - 2.24,25 -పంచ భూతాలకు మన చింతనకు అందనిది ఆత్మ(దేహి) . ఎలా అర్థమవుతుంది అది ?



 

భగవద్ గీత (12)


  

 రెండవ అధ్యాయము  

 సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం.    


అయిదు నుండి పదవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి, దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ) యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము. పదకొండవ వ్యాసంలో - 'ఆత్మను ఆయుధాలు, అగ్ని, నీరు, గాలి, లాంటి పంచ భూతాలు ఏమీ చెయ్యలేవు కానీ, శరీరాన్ని ధరించిన ఆత్మ, ఆ శరీరం జీర్ణించి, పనికిరాక పోయినపుడు, చిరిగిపోయిన వస్త్రాలను పారవేసి క్రొత్త వస్త్రాలను మనం ధరించినట్లు, మరో శరీరాన్ని ధరించడానికి వెళ్ళిపోతుంది' అని తెలుసుకున్నాము.  సాంఖ్య యోగపు 24, 25 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం  చెప్పబోతున్నాడో చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"చ్చే ద్యోయమదాహ్యోయం అక్లే ద్యోశోష్య  ఏవ చ
నిత్యహ్ సర్వగతః  స్థాణుహ్ అచలేయం సనాతనః ||  (2. 24)


అచ్చేద్యః  = ఛేదింపలేనిది, వించబడనిది ; అయం = యీ (ఆత్మ); అదాహ్య   = కాల్చలేనిది ; అయం   = యీ (ఆత్మ) ; అక్లేద్యః  = తడుపలేనిది ; అశోష్యహ్    = ఆరబెట్టలేనిది ; ఏవ    = మరియు ; = మరియు నిత్యహ్  = ఎల్లప్పుడూ వుండు ; సర్వగతః   = అన్నిచోట్లా వుండునది ; స్థాణుహ్   = స్థిరమైనది  ; ఆచలః   = చలించనిది, కదలకుండా వుండునది   ; అయం  = ఈ ఆత్మ ; సనాతనః = ఆత్యంత పురాతనమైనది; 'ఆది' అంటూ లేనిది ;

  
"ఈ ఆత్మ ఎవరూ వించలేనిది, గాయపరచలేనిది మాత్రమే కాక, నీటిచే తడుపబడదు, గాలిచే ఆర్పబడదు, అత్యంత పురాతనమైనది, ఆద్యంతాలు లేనిది, ఎల్లెడలా(అన్నిచోట్లా)ఉండునది, కదలిక లేకుండా, స్థిరంగా వుండునది. "


23 వ శ్లోకంలో చెప్పిన విషయాన్నే, యిక్కడ  మరొక మాటు, మరో రకంగా చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు? దేహం యొక్క అనిత్యత్వం, దేహి యొక్క నిత్యత్వం అర్జునుడికి, మనకు క్షుణ్ణంగా అర్థం కావాలి.  

దేహం పంచభూతాలనుండి వచ్చినది, వాటికే చెందినది, ప్రతి క్షణమూ, దేహానికి, పంచభూతాలకు మధ్య యిచ్చి, పుచ్చుకోవడం జరుగుతూనే వు న్నది,  దేహం యొక్క పుట్టుక, పెరుగుదల, తరుగుదల, మరణమూ అన్నీ పంచ భూతాల ప్రభావం వలన  జరుగుతున్నవి, ఒక దేహం మరణిస్తే, అది వదిలేసి, దేహి మరో క్రొత్త  శరీరం ధరించడానికి వెళ్లి పోతున్నది - యివన్నీ దేహము యొక్క లక్షణాలు.  

దేహి (ఆత్మ) - దేహం కంటే  ఎంతో విలక్షణమైనది.  అది ఆద్యంతాలు లేనిది, సర్వత్రా వ్యాపించి వున్నది, అచలమైనది, స్థిరమైనది, అత్యంత పురాతనమైనది.    

అయినా - దేహి దేహాన్ని ఆశ్రయించుకుని వుండడంతో పరమార్థం యేమిటి?  దేహి, దేహం ద్వారానే - ప్రపంచాన్ని తెలుసుకోగలడు, అనుభవించగలడు, చివరికి, దేహం ద్వారానే మోక్షాన్ని కూడా పొందగలడు. దేహం అశాశ్వతం అయినా దేహం ద్వారానే, దేహి సకల కార్యాలనూ, లక్ష్యాలనూ సాధించ గలడు.    జ్ఞాన సముపార్జనకు, కర్తవ్య సాధనకు దేహికి దేహం ఒక ఆయుధం, ఒక పనిముట్టు.  యివన్నీ దేహం ద్వారా తానే చేసినా, దేహిలో ఏ మార్పులూ రావు,  తాను  అచంచలంగా, స్థిరంగా వుంటాడు. 

క్కడ మరో సందేహానికి కూడా, శ్రీకృష్ణుడు సమాధానమిస్తున్నాడు. దేహి, యీ ఒక్క దేహంలోనే  వున్నాడా? మరెక్కడైనా కూడా వున్నాడా? దేహి ఆయుర్దాయం ఎంత? మోక్షం అంటున్నాము కదా. ఆ తరువాత దేహి ఏమౌతాడు?

దేహి మార్పులే లేనివాడు. మోక్షం అంటే - దేహాన్ని గురించి, తనను గురించి సరైన అవగాహన తెచ్చుకోవడం, ప్రకృతిని, ప్రపంచాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవడం, ప్రకృతి  ప్రభావం నుండి, దాని మాయ నుండి బయటపడడం - అంతే.    

అజ్ఞానం  అనేది ప్రకృతి ప్రభావానికి లోనవడం జ్ఞానం అనేది ప్రకృతి ప్రభావానికి లోనుండి బయటపడడం - అంతే. జ్ఞానమే మోక్షం. జ్ఞానం తర్వాత మనమెక్కడికీ పోము, యిక్కడే వుంటాము. ఆ తరువాత మనం ప్రకృతి మాయతో ఆడే ఆట మరో రకంగా వుంటుంది. మనకు కావాలంటే -  పెట్టుకోవచ్చు. లేదంటే, విడిచెయ్యవచ్చు.    

దేహి సర్వగతుడన్నాడు శ్రీకృష్ణుడు. అది అన్ని చోట్లా వుంది. విశ్వమంతటా వుంది. అంటే - ప్రపంచమంతటా వుండేది వొకే ఆత్మనా? అనేక ఆత్మలా? కే ఆత్మ అయితే మీరూ, నేనూ ఒకటేనా, వేరు వేరా? అనేక ఆత్మలైతే, అన్నీ ప్రపంచమంతటా ఎలా వుంటాయి? యివన్నీ సందేహాలే కదా. చూద్దాం, శ్రీకృష్ణుడేమంటాడో?  


శ్రీకృష్ణుడు జ్ఞాని. ప్రకృతి మాయనుండి బయట పడిన వాడు. అయినా, ప్రకృతితో ఆడుకుంటున్న వాడు.  ఆయన ఆట వేరు. అర్జునుడు యింకా జ్ఞానం రాని వాడు. ప్రకృతి మాయలో అమితంగా బాధ పడుతూ వున్న వాడు.  రాగ ద్వేషాల మధ్య నలిగి పోతున్న వాడు. అర్జునుడు తన దేహము తో పూర్తిగా తనను సంబంధించుకున్న వాడు,అన్వయించుకున్న వాడు. భీష్మ, ద్రోణుల లాంటివారిని కూడా పూర్తిగా దేహపరంగా చూస్తున్న వాడు. దేహాన్ని గురించి కానీ, దేహిని గురించి కానీ  సరైన జ్ఞానం లేని వాడు. 

శ్రీకృష్ణుడు మహా జ్ఞాని, విశ్వానికంతటికీ, ప్రకృతి కంతటికీ అధిపతి. అటువైపున్న, భీష్ముడు కూడా జ్ఞాని, భక్తుడు. శ్రీ కృష్ణుడు పరమాత్ముడి అవతార మని తెలిసిన వాడు. వీరిరువురికి - ఈ యుద్ధం ఎలా పోతుందో తెలుసు. అర్జునుడు  భక్తుడు, ప్రేమాస్పదుడే కాని  జ్ఞాని కాదు. ఈ జ్ఞానం అతనికీ బోధించాలి. రాబోయే కలియుగంలో, మన లాంటి వారికి సులభంగా అర్థం అయ్యేలాగా కూడా చెప్పాలి.  


ఇంత  చెప్పినా, మనకు పూర్తిగా అర్థం కావడం కష్టం. అందుకనే శ్రీకృష్ణుడు యింకా వివరంగా ఆత్మ స్వరూపాన్ని బోధిస్తున్నాడు 25 వ శ్లోకంలో .



శ్రీకృష్ణుడి మాట : 

 "అవ్యక్తోయమచిన్త్యోయం అవికార్యోయముచ్యతే   | 
తస్మాదేవం విదిత్యైనం నానుశోచితుమర్హసి         || (2. 25) 


అవ్యక్తం = వ్యక్తము కానిది , పంచేద్రియాలకు తెలియనిది ;  అయం = యిది (యీ ఆత్మ) ; అచింత్యం  = చింతనకు, ఆలోచనకు అందనిది ; అయం = యిది (యీ ఆత్మ) ; అవికార్యహ్ = వికారాలు, మార్పులు లేనిది ; అయం = యిది (యీ ఆత్మ) ; ఉచ్యతే = అని చెప్పబడినది ; తస్మాద్ = అందువలన ; ఏవం  = ఈ విధంగా ; విదిత్వా  = తెలుసుకున్న తరువాత ; ఏనం = యిది ; న = కాదు ; అనుశోచితుం = దుఃఖపడడానికి ; అర్హసి =  అర్హత కలిగినది. 


"ఈ ఆత్మ అవ్యక్తమైనది, ప్రకృతి చేత, పంచేంద్రియాల చేత మన అనుభవం లోనికి రానిది, మన చింతన చేత, ఆలోచన చేత మనకు అందనిది - అని మొదటి నుండి  జ్ఞానుల చేత చెప్ప బడినది. ఆత్మను యిలా క్షుణ్ణంగా తెలుసుకున్న వారికి ఈ ఆత్మ ను గురించి దుఃఖ పడడానికి ఏ కారణమూ లేదు. ఆత్మను గురించి దుఃఖపడ్డానికి ఏ అర్హతా ఎవరికీ లేదు "


ఆత్మ నిత్యత్వాన్ని, పంచ భూతాలకు ఆత్మకు వున్న  సంబంధము, భిన్నత్వము రెండింటినీ  మళ్ళీ, మరో రకంగా చెబుతున్నాడు యీ  25 వ శ్లోకంలో. ఆత్మ అవ్యక్తమైనది - అంటే మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తమైనది - అంటే, మన పంచేద్రియాలలో ఏదో ఒకటితో మనం దాని ఉనికిని తెలుసుకోగలం. అది ఎప్పుడో వ్యక్తమైనది, అంటే, ఎప్పుడో పుట్టినది, అని చెప్పుకోవచ్చు. పుట్టేదేదైనా, మన ఇంద్రియాలకు  ఎంతో  కొంత, ఏదో రకంగా తెలుస్తుంది.  కంటికి తెలీని బాక్టీరియా, వైరస్ లు కూడా, దేహంలో  రోగాలు కలిగించేటప్పుడు వాటి ఉనికి మనకు తెలుస్తుంది.   




ఆత్మ పంచ భూతాలకు గానీ, వాటి వలన చేయబడిన పంచేంద్రియాలకు గానీ అందదు. సూక్ష్మ శరీరమైన మనసుకు గానీ, అందులో పుట్టే ఆలోచనలకు గానీ అందదు. ఆత్మలో ఎటువంటి మార్పులూ, ఎప్పుడూ జరగవు.


ఇప్పుడు ప్రశ్న - నేను దేహమా, దేహినా. నన్ను నేను దేహితో అన్వయించుకుంటే - నాకు ఎటువంటి ఆపదా ఎప్పుడూ లేదు.  ఎటువంటి మార్పూ ఎప్పుడూ వుండదు. మరి నేను నన్ను (ఆత్మ స్వరూపుడిని) గురించి చింత పడవలసిన అవసరం ఏముంది ?    

మనం, మనల్ని దేహంతో అన్వయించుకుంటే - అదే సాధారణంగా మనం చేస్తున్న పని. ఈ అన్వయమే అజ్ఞానం వలన  చేసే అన్వయం. అయినా, దేహం తో అన్వయించుకుంటే  కూడా, దుఃఖ పడాల్సిన అవసరం లేదంటున్నాడు శ్రీకృష్ణుడు , ముందు ముందు వచ్చే శ్లోకాలలో. 

యివన్నీ శ్రీకృష్ణుడు, అర్జునుడి దేహానికి, మనస్సుకే గా చెప్పగలుగుతున్నాడు. అర్జునుడి ఆత్మ స్వరూపుడికి కాదు కదా. అర్జునుడి మనస్సుకు యిది అర్థమైతే చాలా? 


జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ  ఎవరికి కావాలి, ఎవరికి వుంది? దేహికా, మనస్సుకా, దేహానికా? దేహానికి, మనస్సుకు జ్ఞానం బోధిస్తే, దేహికి జ్ఞానం ఎలా వస్తుంది? మన ఆలోచనకు, చింతనకు ఆత్మ అందదు అన్నాడు. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? చింతనకు అందదు అన్నదానిపై మనం చింతిస్తున్నాము. ఇన్నీ కూడా, మనకు అర్థం అయ్యేటట్లు, శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. 



మీకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ  వున్నాయి. ఈ దేహి, దేహము అనే వాటిని గురించి మనకు మరింత, మరింత  స్పష్టత  కావాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ స్పష్టత మనలో వస్తే, తప్పకుండా, నిస్సందేహంగా మన సంతోషం చాలా, చాలా పెరుగుతుంది. మన భయాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ పోతాయి. 
 

ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం