27, డిసెంబర్ 2016, మంగళవారం

భగవద్ గీత - అర్జున విషాద యోగము (1)

భగవద్ గీత 

మొదటి అధ్యాయము

అర్జున విషాద యోగము (1)

భగవద్ గీత  శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినదేశ, కాల, మత, జాతులకు అతీతమైన, మహోత్కృష్టమైన జీవన విధానం

మనిషి జీవితానికి అర్థం, పరమార్థం, మనం చెయ్య వలసినవి, చెయ్యకూడనివి , ఏది చేస్తే ఏమవుతుందో, ఏది కాదో, ఏది చెయ్యకూడదో - అన్నీ సమగ్రంగా తెలిపిన ఏకైక, నభూతో నభవిష్యతి అయిన మహోపదేశం భగవద్ గీత

మహా భారత సంగ్రామానికి ముందుగా, అంత వరకు కర్తవ్యోన్ముఖుడైన, మహావీరుడైన అర్జునుడి మనసులో రేకెత్తిన అల్లకల్లోలానికి,కర్తవ్య విముఖతకు ఎన్నెన్ని కారణాలో, మనసు విప్పిశ్రీకృష్ణుడి  ముందు ఏకరువు పెడతాడు అర్జునుడు. ఇది భగవద్ గీతలో మొదటి అధ్యాయం

గీతలో కృష్ణుడి బోధ ముఖ్యం గానీ ,అర్జునుడి గోల మనకెందుకు - అనుకుంటారు చాలా మంది. నిజానికి మనమంతా, జీవితము అనే రణరంగం లో ఎప్పుడూ కర్తవ్యోన్ముఖులుగా కాక, ఎదుట పోరాడ వలసి వున్న రణరంగం నుండి పారిపోయే దానికి  సిద్ధంగా, కారణాలు, సాకులు  వెదుకుతున్న వాళ్ళమే.మనం అందరూ మహావీరుడైన అర్జునుడి లాంటి వాళ్ళమే కానీ, ఎప్పుడూ కర్తవ్యము నుండి పారిపోవడానికి సాకులు వెదుకుతున్న వాళ్ళమే - అని చెప్పొచ్చు

మనలో ఎంత మంది, మేం చెయ్య గలిగిన వన్నీ చేసేశాం, యిప్పుడూ చేస్తూనే వున్నాం - అని  చెప్పగలం? మనం చెయ్యక పోవడానికి అనేక కారణాలు, సాకులు వుంటాయి; వున్నాయి. మన సందేహాలు, కారణాలు, సాకులు, యివన్నీ శ్రీకృష్ణుడికి చెప్పడం, సమాధానం చెప్పమని అడగడం, లేదా జీవితం నాకిక చాలు యింకొద్దు అని చెప్పడం మన విషాద యోగం అవుతుంది - మన భగవద్ గీతలో.

తన మనసుల్లో వున్న ప్రశ్నలన్నీ, అర్జునుడు కూడా కృష్ణుడిని అడిగేశాడు. కృష్ణుడిని కడపట - నీవే తప్ప యితః పరంబెరుగ, నీవు ఎలా చెబితే అలా చేస్తానని - శరణు జొచ్చాడు . ఇదే అర్జున విషాద యోగం

ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం చూద్దాం. మొట్టమొదటి శ్లోకం అంధుడైన ధృతరాష్ట్రుడు , దివ్యదృష్టి కలవాడైన సంజయుడిని వేసిన ప్రశ్న. తరువాత ధృత రాష్ట్రుడు భగవద్ గీత కడపటి వరకు మౌనం గానే వుంటాడు.

"
ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో , యుద్ధోత్సాహంతో వున్న  నా వాళ్ళు (అయిన కౌరవులు), పాండవులు ఇప్పటి వరకు ఏం చేశారు?" అని శ్లోకంలో అడుగుతాడు అంధుడైన ధృతరాష్ట్రుడు

ధృతరాష్ట్ర  వువాచ (శ్లోకం):

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః  పాండవాశ్చైవ  కిమకుర్వత సంజయ || (1. 1)

ఎంత అధర్మ పరులైనా కౌరవులు నా వాళ్ళు - అనడంలో దృతరాష్ట్రుడి మనసులో వున్న మరో అంధత్వం - మనకు మొదటి శ్లోకంలో కనిపిస్తుంది . యిదే దృతరాష్ట్రుడి నిజమైన అంధత్వం. నా వాళ్ళు అధర్మ పరులేనాకూ తెలుసు. అయినా వాళ్ళే గెలవాలి. వాళ్ళే రాజ్యమేలాలి - అన్న భావన ఇతనిలో జీవితమంతా మనకు కనిపిస్తుంది ; అదే శ్లోకంలోనూ వుంది

పాండవులు ధర్మపరులే. అయినా వాళ్ళే ఓడిపోవాలి. అడవుల్లోనే  వుండాలి - అన్న భావన కూడా ఇతనిలో అడుగడుగునా కనిపిస్తుంది.

కానీ , కురుక్షేత్రం ధర్మక్షేత్రం గా పేరుమోసింది. ధర్మక్షత్రంలో అధర్మ పరులైన నా వాళ్ళు గెలుస్తారా - అన్న సందేహం కూడా ఇందులో కనిపిస్తుంది

నేను, నా వాళ్ళు, నా జాతి వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు  మాత్రమే బాగుండాలి, పక్క వాడు, యెంత మంచోడైనా, వాడు ఎలా పోయినా పర్వాలేదు - అన్న భావన యిప్పటికీ మన మనస్సులో బాగా వేర్లూని, బలంగా నాటుకుని వుంది. ఇది మనలోని ధృతరాష్ట్ర అంధత్వం. మనలో వున్న అంధత్వం పొతే గానీ, మనమూ సుఖంగా వుండలేము; మన పొరుగువాడినీ సుఖంగా వుంచలేము. ఒక వేళ  వాడు సుఖంగా వుంటేచూసి ఓర్వలేము.   

ప్రస్తుత కాలం లో - నేను బాగుండాలి. నా పెళ్ళాం ఏమైనా పరవాలేదు - అనే మూర్ఖులూ చాలా  మంది వున్నారు. వీళ్ళలో సగం మంది త్రాగుబోతులు, తిరుగుబోతులు. నేను బాగుండాలి, మా అమ్మా, నాన్నా ఎలా పోయినా పర్వాలేదు - అనే మూర్ఖులూ చాలా మందే వున్నారు

కానీ, నా వాళ్ళు, వేరే వాళ్ళు అన్న  భేదం లేకుండా ఎంతో  మంది ఆర్తులకు, అనాథలకు, వృద్ధులకు, స్త్రీలకు  చేయూత నిచ్చి ఆదుకుంటున్న మహానుభావులూ   కొంత మంది మన మధ్య  వుండనే వున్నారు. మనమంతా, గీతోపదేశం  సహాయంతో వీరిలా మారాలని ఆశిస్తూ, గీతా విశ్లేషణను  ఆరంభిస్తున్నాను. ఇందులో, అతి ముఖ్యమైన వాటిని మాత్రం పూర్తి విశ్లేషణతో యివ్వగల వాడను

మీ అభిప్రాయాలను , విమర్శలను , అనుభవాలను కూడా తెలియ  జేస్తే  చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

ఉప్పలధడియం   విజయమోహన్ 



 

 

5, డిసెంబర్ 2016, సోమవారం

మీకే సమస్యలు , కష్టాలు వున్నాయా ? పరిష్కారాలు లేవా ? వున్నాయి సార్ ! చదవండి మరి


సమస్యలు - పరిష్కారాలు



పుట్టిన ప్రతి మనిషికీ సమస్యలు వున్నాయి. పక్కింటివాడికి సమస్యలు లేవు, ఎదురింటి వాడికి లేవు , అన్నీ నాకే వున్నాయి -  అని అనుకోలేము. ప్రతి ఒక్కరికీ సమస్యలు వున్నాయి. ఇక ముందు కూడా, అంటే భవిష్యత్తులో కూడా, యేవో సమస్యలు, కష్టాలు వస్తూనే వుంటాయి. నరేంద్ర మోడీ గారికీ, డోనాల్డ్ ట్రంప్ గారికీ , చంద్ర బాబు నాయుడు గారికీ మీకున్న సమస్యలు  వుండొచ్చు , వేరే సమస్యలు వుండొచ్చు . కానీ సమస్యలు లేకపోవడం అంటూ వుండదు .

సమస్యలను ఎదుర్కొనే విధానం లో మాత్రం మనిషికీ , మనిషికీ మధ్య చాలా  వ్యత్యాసం వుంటుంది. సమస్య వచ్చే సంవత్సరం వస్తుందంటేనే , యిప్పటినుండి భయపడుతూ వుండే వాళ్ళు కొందరు, సమస్యను సమర్థ వంతంగా పరిష్కరించుకునే మార్గాలు వెదికి ధైర్యంగా ముందుకు వెళ్లే వాళ్ళు కొందరు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే వారు కొందరు, నాకు మాత్రం రాదు అని నిర్లక్ష్యంగా వుండేవారు కొందరు - యిలా మనలో ఎన్నో రకాలు. 

సమస్యలే కష్టాలు అని చెప్పలేం. అవి కొంత మందికి కష్టాలుగా  కనిపించ వచ్చు. మరి కొంత మందికి, వారి  జీవితం  అభివృద్ధికి అతి ముఖ్య సాధనాలుగా కనిపించ వచ్చు. అది వారి వారి దృక్పథం  పైన ఆధార  పడి వుంటుంది. కానీ సమస్యలు మాత్రము అందరికీ వస్తాయి. 

జయలలిత గారు ఏకచ్ఛత్రం గా పరిపాలించే, ప్రజాభిమానం పొందిన  ముఖ్య  మంత్రి అయినా - ఆమెకూ అపోలో హాస్పిటల్ వాసం తప్ప లేదు.  వారి ప్రత్యర్థి అయిన  కరుణానిధి కీ హాస్పిటల్  వాసం తప్ప లేదు.

గుజరాత్ లో ఆయనెవరో గొప్ప ధనవంతుడు 13000 వేల కోట్ల రూపాయల నల్ల ధనం తన వద్ద వుండడం ప్రభుత్వానికి చెప్పేశారు. ఇక  ఆయన తిప్పలు ఆయనవి. మనమంతా ఏదో కొన్ని పాత నోట్లు పుచ్చుకుని బ్యాంకుల ముందు నిలబడ్డాము. మనలో కొంత మంది మోడీ గారి సమర్థకులు , కొంత మంది విమర్శకులు , కొంత మంది ఏకంగా ప్రత్యర్థులు. ఎవరు ఎవరో మోడీ గారికి తెలీదు. మీ గోల మీది. ఆయన గోల ఆయనది. 

ఆర్ధిక సమస్యలు , ఆరోగ్య సమస్యలు, సామాజిక సమస్యలు, పెళ్ళాంతో మొగుడికి,మొగుడితో పెళ్ళాంకు సమస్యలు, పిల్లలతో సమస్యలు, పిల్లలు లేక సమస్యలు, అత్తలతోను కోడళ్లతోను సమస్యలు, పక్కింటోళ్లతో సమస్యలు, ఈవ్ టీజింగ్  వారితో సమస్యలు, దొంగలు పోలీసులు యిద్దరితోనూ సమస్యలు , లంచగొండ్లతో సమస్యలు, కల్తీ  వ్యాపారులతో సమస్యలు, లైంగిక సమస్యలు, త్రాగుడు రాయళ్లతో సమస్యలు, రౌడీలతో సమస్యలు,  రాజకీయ వాదులతో సమస్యలు, యిలా మనం రాసుకుంటూ పొతే , మనకు బోలెడన్ని  సమస్యలు వున్నాయని   మనం తప్పకుండా వొప్పుకుంటాము.

యివి కాక,  రోడ్ల మీద   పిచ్చి కుక్కలు, పాములు వస్తాయి. ఎవరినో  కరుస్తాయి. కరిచిన కుక్కను, పామును బ్లూ క్రాస్ వాళ్ళు  అయ్యో పాపం అంటారు, చంప కూడదంటారు. కరవబడిన వాడికి  ఆ సింపతీ లేదు. నిముషాల్లో వాడికి వైద్యం యివ్వడానికి మన దేశంలో ఎక్కడా సరైన సదుపాయం మాత్రం లేదు. బ్లూ క్రాస్ వాళ్లకి సంబంధం లేని విషయం అది. పిచ్చి కుక్క ఎందుకు కరిచింది? దాని సమస్య దానిది?  పామెందుకు కరిచింది? దాని సమస్య దానిది? ఫలానా వాడినే ఎందుకు కరిచింది ?  తప్పు వాడిదా , పాముదా, సమాజందా? ఇక ముందు కరవకుండా వుండాలంటే మనం ఏం చెయ్యాలి? ఇది మన సమస్య . 

అలాగే, ఒక్కో సారి, ఎక్కడో ఆకాశంలో పోయే కాకి మీపైన వాలి , మొత్తేసి , తన్నేసి, ముక్కుతో కుచ్చేసి లేదా రెట్ట వేసేసి పొయ్యే అవకాశం ఉంది. చిన్న గువ్వలు, చిలుకలు, పావురాలు మన సెల్ ఫోన్ టవర్ ల వలన మాయమై పోతున్నాయి . కాకులు చిరంజీవులు లాగా వున్నాయి. వాటికీ   చిర్రెత్తి , అప్పుడప్పుడూ , ఎవరో వొకరిని తన్నేసి పోతూ వుంటుంది. కాకి తంతే అపశకునం అని కొందరు మంచం పడతారు. బల్లి మనపై ఎక్కడ పడితే ఏం జరుగుతుందో పెద్ద శాస్త్రం వుంది మన దేశంలో. ఈ శకునాల శాస్త్రాలు బ్యాన్ చెయ్యవలసిన అవసరం చాలా వుంది. 

మీ పెంపుడు కుక్క ఎదురింటి వాడిని కరిస్తే మీకు ఎవరు ముఖ్యం? తప్పు  మీ కుక్కదా, ఎదురింటి వాడిదా? ఎదురింటి వాడు మంచోడు  కాదు, కోతి మొహమూ, వాడూను. అందుకే మా టామీ వాడిని కరిచింది - అనే వాళ్ళు కోకొల్లలు. 

ఇవి కాక దోమలు, ఈగలు , వైరస్  లు, బాక్టీరియాలు -  వీటి వలన వచ్చే సమస్యలు . ఇవన్నీ మీ, నా , మన సమస్యలు - జీవితాంతం వుండేవి.

ఇలా భూప్రపంచంలో లక్షన్నర సమస్యలు వున్నాయి.  వ్యక్తిగత సమస్యలు కొన్ని. మత పరమైన సమస్యలు కొన్ని. సామాజిక సమస్యలు కొన్ని. అందరికీ అన్ని సమస్యలూ వుంటాయా? వుండవు.  ఏదో కొన్ని వుంటాయి. అన్ని రోగాలూ మీకు లేవు కదా. ఎవరికీ లేవు. కొన్ని మీకు. కొన్ని పక్కింటోడికి. కొన్ని పోలీసోడికి. కొన్ని  దొంగకు. కొన్ని ముఖ్య మంత్రికి, యిలా దేవుడు బట్వాడా చేస్తూ వుంటాడు. 

వీటన్నిటితో బాటు మీరు ఎన్నేళ్లు బ్రతుకుతారో, యెంత కష్టాలతో బ్రతుకుతారో, యెంత సుఖాలతో బ్రతుకుతారో - మీ మీ తలరాత పైన,  గ్రహాలూ , నక్షత్రాలూ , జాతకాలూ, చేతి గీతలు,  మీ పేరులో వున్న లక్షణం అవలక్షణం - వీటిలో దేని పైన  ఆధార పడి వుందో ,  కొందరు చెబుతారు.  వారి రాతలు సరి చేసుకున్నట్టు పెద్దగా దాఖలాలు లేవు. ఏలినాటి శని హిందువులకు మాత్రమే వుంది. మిగతా వాళ్లకు శాతాన్, మరేదో వుంది.  మనకు తెలీని శక్తీ ఏదో  మనల్ని చూస్తూ, కావాలనే మనకు సమస్యలు , కష్టాలు సృష్టిస్తూ వుంది . అవునా ? కావచ్చు. 

సమస్యలు మన అందరికీ వున్నాయి. మీకే కాదు, వూర్లో అందరికీ 'యేవో కొన్ని' సమస్యలు ఉండనే వున్నాయి. 'మనకే కాదు అందరికీ వున్నది' -  అన్న విషయం సంతోష కరమైన విషయం కదా. కాబట్టి ఎంతో కొంత సంతోషించండి.

99 శాతం సమస్యలకు కాల పరిమితి అంటూ వుంటుంది. వారం పాటు మాత్రమే వుండే రోగాలు, రోగాల లాంటి అతిథులు, అలాంటివే మిగతా తక్కువ కాలపు సమస్యలు, నెలలు, సంవత్సరాల తరబడి వుండే సమస్యలు, జీవితాంతం వుండే సమస్యలు, ఆ తరువాత కూడా, అంటే  పునర్జన్మ వుంటే అక్కడికి కూడా మనతో వచ్చే సమస్యలు - యిలా రకరకాల కాల పరిమితి తో వుంటాయి సమస్యలన్నీ.

సరైన సమాధానం వెదికే వారికి  చాలా సమస్యలు శీఘ్రంగా పోతుంది; వెదకని  వారికి ఎక్కువ కాలం వుంటుంది . మరీ జటిలం కావచ్చు . వున్నా సమస్యలే, క్రొత్త సమస్యలూ సృష్టించ వచ్చు.

కొన్ని సమస్యలే కాక పోవచ్చు ;సాధారణంగా, సీదా సాదాగా  కనిపించే పెళ్ళామో, మొగుడో  సమస్య కాదు.  అనేక సమస్యలకు పరిష్కారంగా కూడా వుండొచ్చు. అయినా కొందరికి వాళ్ళు సమస్యల లాగా కనిపించవచ్చు.

అలాగే పొగ త్రాగడం, మందు కొట్టడం, మత్తు పదార్థాలకు అలవాటు పడడం నిజమైన సమస్యలే అయినా, వాటికి బానిసలైన వారికి అవి సమస్యల లాగా కనిపించవు . ప్రపంచం లోని అన్ని సమస్యలకు సమాధానాలుగా కనిపించ వచ్చు. 

సమస్యలు వస్తే , నాకెందుకు  వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది. నేనేం పాపం చేశాను. పక్కింటి వాడికి ఎందుకు రాలేదు? ఎవడో నాకు ఏదో చేశాడు , అందుకే  యిలా అయిందేమో ! ఇలా యోచన చేసే వారు కొంత మంది?

నాకొచ్చింది సరే . ఎలా త్వరగా పోతుంది ? నేనేం చెయ్యాలి ? ఎవరి సహాయం తీసుకోవాలి ? యిలా సమస్యకు సరైన సమాధానం వెదికేవారు కొందరు .  

పాత కాలంలో ఆడాళ్ళు మంచి మొగుడు కావాలని దేవుడిని  వేడుకునే వారు. మంచి మొగుడు అంటేనే , అందులో మంచి అత్తా మామలు కూడా వచ్చేస్తారు. ఆడ పిల్లల తల్లిదండ్రులూ అలాగే వెదికే వారు. ఆ  పధ్ధతి మంచి  తెలివైన పధ్ధతి అని నాకు అనిపిస్తుంది.

అలాగే  మంచి పెళ్ళాం దేవుడిచ్చే వరం అని ఆ కాలంలో అన్నారు. తమిళం లో యిలాంటి పాట కూడా ఒకటి వుంది . మనైవి అమైవదెల్లామ్ యిరైవన్ కొడుత్త వరం - అని , అంటే , మంచి పెళ్ళాం దేవుడిచ్చే వరం అని.ఇంటికి దీపం  యిల్లాలే అనేవారు, అనుకునే వారు.  అది నిజమే. 

మంచి జంట - అంటే మంచి మొగుడికి మంచి పెళ్ళాం - ప్రేమ, అభిమానం వున్న జంట , మనసున మనసై బ్రదుకున  బ్రదుకై ఒకరికొకరు తోడుగా  వుండే జంట - ఒకరి సమస్యలకు మరొకరు పరిష్కారంగా వుంటారు . అలాంటి జంటలు  మన దేశంలో యిప్పటికీ చాలా మంది వున్నారు. 

గయ్యాళి పెళ్ళాలు , దుర్మార్గపు మొగుళ్ళు పాత  కాలం లోనూ వుండేవాళ్ళు . కానీ వారి సంఖ్య యిప్పటితో పోలిస్తే చాలా తక్కువే . వారిపైన కూడా సమాజపు సత్ప్రభావం వుండేది . వాళ్ళ దుర్మార్గం ఎక్కువగా సాగనిచ్చే వారు కాదు. 



ఇప్పుడు మంచి పెళ్లాం , మంచి మొగుడు కావాలని పిల్లలు పెద్దగా అనుకోవడం లేదని నా అభిప్రాయం. అసలు నేను మంచి పెళ్ళాం గా వుండను కదా, అత్తా మామలను తరిమేస్తాను, మొగుడిని నా  చుట్టూ  తిప్పుకుంటాను, నేను వంటెందుకు చేస్తాను, నేనేం వంట మనిషా అనే మూర్ఖపుటమ్మాయిలు చాలా మందే వున్నారు. అలాగే అబ్బాయిలు - వారికేం కావాలో తెలీదు, రకరకాల దురలవాట్లకు కూడా లోబడుతున్నారు.  దానికి తోడు మన టీవీ సీరియల్సు మరీ ఘోరంగా వున్నాయి.  మొగుళ్ళ పాత్రలు, పెళ్ళాల పాత్రలు , అత్తల పాత్రలు చాలా అధ్వాన్నం గా, సమాజాన్ని అధః పాతాళానికి   తీసుకు పోయేలా వుంది. ఈ సీరియల్స్  మార్చ లేమా? మనకు మరీ ఘోరంగా కనిపించిన సీరియల్స్ గురించి ఆ టీవీ చానెళ్లకు రాయాలి. సమాజపు ఒత్తిడి వుంటే వాళ్ళూ సులభంగా మారుతారు. 

కొన్ని సమస్యలా , సమాధానాలా - చెప్పడం కష్టం. విడాకులు తీసుకోవడం మంచిదా, కాదా? ఈ మొగుడు సర్లేదు, ఈ పెళ్ళాం సర్లేదు - విడాకులే బెటర్. అనుకుంటారు. సరే . రెండో మొగుడు, రెండో పెళ్ళాం బాగుంటారా? యిలా పర్ఫెక్ట్  మొగుళ్లను, పర్ఫెక్ట్  పెళ్లాలను జీవితాంతం వెదుక్కునే పధ్ధతి అమెరికా నుండి మనం  దిగుమతి చేసుకుంటున్నాము. నేను పర్ఫెక్ట్ గా వున్నానా అన్న ఆత్మ విమర్శ చాలా కష్టంగా వుంటుంది . కానీ, సమస్యకు సరైన సమాధానం అదే కదా .

 మీరెలా వున్నా , ఏదో ఒక సమస్య రానే వస్తుంది; వచ్చిన సమస్య పోతుంది. దాని స్థానంలో మరోటి వస్తుంది. యిలా జీవితాంతం సమస్యలు ఉండనే వుంటాయి. వచ్చినవన్నీ  పోతాయని చెప్పలేం. బీపీ, షుగర్ లాంటివి నువ్వూ నేనూ  కలిసే వుందాం, కలిసే పోదాం అన్నట్టుగా వుంటాయి. గయ్యాళి పెళ్ళాం ,  దుర్మార్గపు మొగుడూ అంతే , విడాకుల పరిష్కారం లేకపోతే. 

కొన్ని సమస్యల లాగా కనిపిస్తాయి ; కానీ అవి దేవుడిచ్చిన అవకాశాలు. మీ జీవితానికి రాజ మార్గాలు  తెరవ గలిగే బంగారు ద్వారాలు. మీరు రాయవలసిన ముఖ్యమైన పరీక్ష లేదా ఇంటర్వ్యూ అలాంటిదే. పది మంది  అభ్యర్థులు వున్నారు ; వారిలో  మీరూ ఒకరు. యిప్పుడు మీరేం చేస్తారు. ఇది ఎప్పుడో ఎవరికో ఫిక్స్ అయిపోయుంటుంది , నా  ప్రయత్నం దండుగ అనుకుంటారా, ఈ వుద్యోగం ఖచ్చితంగా నాకే రావాలని పూర్తి ప్రయత్నం చేస్తారా? ప్రతి పెద్ద పరీక్ష లోనూ నెగ్గే వారిని చూడండి. రిక్షా తొక్కే వాడి కూతురు, మూటలు మోసే వాడి కూతురు యిలా మంది ఐఏఎస్ పరీక్షలలో, ఐఐటీ పరీక్షలలో నెగ్గారు. ఎంతో మంది తమ సమస్యలను  అవకాశాలుగా తీసుకుని , జీవితానికి రాజ మార్గం  వేసుకున్నారు. 

అవకాశాలను సమస్యలుగా భ్రమ పడి , భయంతో , సోమరితనం తో విడిచి పెట్టే వాళ్ళే ఎక్కువ మంది వున్నారు మన దేశంలో. 

మీరు ధైర్యంతో ఎదుర్కొన్న ప్రతి సమస్యా - మిమ్మల్ని మరింత సమర్థవంతులు గా చేస్తుంది, మీరు గెలిచినా సరే, ఓడినా సరే.  మీకు దేవుడు సమస్యలను యివ్వడానికి అసలు సిసలైన కారణం మిమ్మల్ని సమర్థులు గా చెయ్యడానికే. పసి పాప పడిపోతానని తెలిసీ మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, లేచి నడవ గలిగే వరకూ చేస్తూనే వుంటుంది. ఇదే మనకు పుట్టుకతో వచ్చిన అసలు గుణం. పడడానికి భయపడడం మనకు పుట్టుకతో వచ్చిన గుణం కాదు. క్షత్రియ వంశంలో పుడితే యుద్ధాలకు, దెబ్బలకు, గెలుపోటములకు అన్నిటికీ సిద్ధంగా పెంచేవారు ఆ కాలంలో. ఏ వంశంలో  పుట్టినా , మనకు  పుట్టుకతో వచ్చిన గుణం అదే . 

ఇప్పుడూ అలాగే పెంచాలి; అలాగే పెరగాలి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని, పోరాడి  గెలుపొందాలి. సమాధానం లేని సమస్యంటూ లేదు. ఒక వుదాహరణ : స్టేజి 4 కాన్సర్ లో - 6 సముద్రపాల ఆకుల  రసం (తెల్లవారి పరకడుపుతో) , 1 గచ్చకాయ  పప్పు+4 మిరియాల పొడి (10 గంటలకు), కారట్ జ్యూస్ (మధ్యాహ్నం ), వీట్ గ్రాస్ జ్యూస్(రాత్రి)  యిస్తూ వున్న వారికి , యిద్దరు పేషెంట్స్ కు చక్కగా నయమవుతూ వుండడం మేము చూస్తున్నాము. వీరి విషయంలో అల్లోపతీ డాక్టర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆ తరువాత ఈ వైద్యం.  వీటి విషయంలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో పరిశోధనలు జరగాలి. అన్ని కాన్సర్ లకు, దేశీయ పద్ధతిలో చక్కని సమాధానాలు వుందనేది నిస్సందేహం.అలాగే అన్ని రోగాలకూ. కానీ 70 ఏళ్ళ పాలనలో మన దేశం మన వైద్యాలను ప్రోత్సహించ లేదన్నది విచార కరమైన వాస్తవం .

జనగణమన సినిమాల్లో మళ్ళీ పెట్టాలి అన్నది సుప్రీమ్ కోర్ట్ చెప్పే వరకు మనం చెయ్య లేదు. ఎక్కడో , ఎవరో , ఏదో కొన్ని సమస్యలకు సమాధానాలవుతున్నారు. సంతోషం. 

మన దేశంలో నల్ల ధనం సమస్య 70 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో వచ్చిందే కదా. మన రాజకీయ నాయకులు , మన ధనికులు మాత్రమే కాదు ఈ సమస్యకు కారకులు. పాకిస్తాన్ లో మన నోట్లను ప్రింట్ చేసే పెద్ద ప్రెస్  వుంది. వేల కోట్ల రూపాయల నోట్లు పాకిస్తాన్ మన దేశంలోని వాళ్ళ తొత్తులకు యిచ్చి  అరాచకం, టెర్రరిజం సృష్టిస్తున్నారు. నక్సలైట్లు, మావోయిస్టులు వీళ్ళందరూ ప్రజల వద్ద బలవంతంగా లాక్కుంటున్న నల్ల దానం కూడా మితి మీరు వుంది. దానితో వాళ్ళేమీ ప్రజోపయోగ కార్యాలు  చెయ్యడం లేదు. తుపాకులు కొని భీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజల సమస్యలు నిజమైన సమస్యలు. టెర్రరిస్టులు, మావోయిస్టుల సమస్యలు వారి బుర్రల్లో పుట్టిన కల్పిత సమస్యలు.  ఈ రోజు  మోడీ గారు ఏదో చేస్తున్నారు. ఆయన చేసింది కనీసం పాకిస్తాన్ వారికి , టెర్రరిస్టులకు , నక్సలైట్లకు చాలా పెద్ద దెబ్బే. మన దేశంలోని నల్లధనం రాజులకు కూడా పెద్ద దెబ్బే . 

అయితే, సామాన్య ప్రజలైన మనకు కూడా  రెండు నెలల పాటు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఒక పెద్ద జటిలమైన సమస్యకు గట్టి సమాధానం కొంత యిలా వుంటుంది. తప్పదు. కానీ, భారత దేశంలో ఎంతో  కొంత నిజాయితీ పెరుగుతుంది. మన జీవితాలు మెరుగు పడతాయి. 

మన వ్యక్తిగత జీవితాల్లోనూ యింతే. దారిద్య్రం ఒక సమస్య. చదువు లేమి ఒక సమస్య. ఉద్యోగాలు సృష్టించక పోవడం పెద్ద సమస్య.  కనీసావసరాలు తీర్చని ప్రభుత్వాలు   పెద్ద సమస్య. లంచగొండితనం పెద్ద సమస్య.

కానీ వీటన్నిటికీ సమాధానాలున్నాయి. సరైన పరిష్కారాలున్నాయి. కష్టాలలో వుండే వాళ్లకు చదువులు రాదని రూలేమీ లేదు. కష్టాలలో వుండే వాళ్లకు చదువులు చాలా బాగా వస్తుందని  ఎంతో మంది  మన దేశంలో చేసి చూపించారు. ప్రతి సంవత్సరమూ ఐఏఎస్ , ఐఐటీ  లాంటి  ప్రతిష్టా కర పరీక్షల్లో ఎంతో మంది అట్టడుగు వర్గాల వారు విజయం సాధిస్తున్నారు. 

అంటే - సమస్యల పట్ల మీ దృక్పథం ఏమిటి అన్నదే ముఖ్యం. ధైర్యంగా నిలిచి పోరాడుతారా , వెనుకంజ వేసి , పిరికితనం తో పారిపోతారా - అన్నదే ముఖ్యం.  భారత దేశంలో మరో ముఖ్య సమస్య - మనలో ఐక్యత లేక పోవడం. ఇది మన దేశంలో ఒక ప్రధాన సమస్యే.

ఇప్పుడు  సమస్యల  స్థూల స్వరూపాన్ని మరొక్క సారి ఆకళింపు  చేసుకుందాం :

1. సమస్యలు  అందరికీ వున్నాయి. సమస్యలు లేని వాళ్ళు లేరు.
2. జీవితాంతం  ఏదో ఒక సమస్య , చిన్నదో, పెద్దదో  వుండనే వుంటుంది.
3. చాలా సమస్యలు ఒక కాల పరిమితితో  వుంటాయి. తరువాత  వెళ్లి పోతాయి, సరైన పరిష్కారం  చూసుకుంటే.
4. సరైన  పరిష్కారం చూసుకోక పోతే , జటిలమవుతాయి.
5. సమస్యలన్నీ కష్టాలు కావు . భవిష్యత్తు ను మనం మలుచుకోవడానికి మంచి మార్గాలు .
6. ప్రతి సమస్య లోనూ, మిమ్మల్ని మానసికంగానూ, శారీరకంగానూ  యిప్పటికంటే బలవంతులు, ఆరోగ్యవంతులు గా చెయ్యగలిగే  అంశాలు  చాలా వుంటాయి. అవి మీరు వెదకాలి. 
7. రాబోయే ఎన్నో సమస్యలకు , యిప్పుడే అడ్డుకట్ట వెయ్యవచ్చు.
8. ముందు చూపుతో , ధైర్యంతో , సాహసంతో , తెలివితేటలతో ముందుకు సాగిపోయే వారికి సమస్యలు గొప్ప ఆయుధాలు.
9. పిరికితనంతో, భయంతో, సమస్యల నుండి పారిపోయే వారికి సమస్యలు కష్టాలుగా మారుతాయి, సుడిగుండాలుగా కనిపిస్తాయి.
10. మన వ్యక్తిగత, సామాజిక, దేశీయ సమస్యలకన్నిటికీ పరిష్కార మార్గాలు యెవరు కనుగొనాలి ? మనమే.

ఈ బాటలో మనం మళ్ళీ కలుద్దాం.

శుభం భూయాత్

సర్వే జనాః సుఖినోభవంతు

=మీ

ఉప్పలధడియం విజయమోహన్
నా మొదటి రచన-736 పేజీలు-amazon.in లో వుంది

 



30, నవంబర్ 2016, బుధవారం

ప్రపంచ చరిత్రలో అతి గొప్ప గ్రంథం ఏది ?

 

ప్రపంచ చరిత్రలో అతి గొప్ప గ్రంథం ఏది ?


ప్రపంచ చరిత్రలో అతి గొప్ప గ్రంథం ఏది ? ప్రపంచంలో చాలా ఎక్కువ మంది చేత చదవ బడే పుస్తకమా ? చాలా, చాలా పురాతనమైన పుస్తకమా ? చాలా, చాలా అమూల్యమైన అత్యంత మానవోపయోగకర విషయాలు తెలియ జేసే పుస్తకమా?  ఏది?

మీరు క్రైస్తవ మతం లో చేరితే వెంటనే మీ చేతిలో  బైబిల్ పుస్తకం పెట్టేస్తారు. కొన్ని రైల్వే స్టేషన్ల ముందు నుంచుంటే చాలు , మీకు ఒక కాపీ యిచ్చేస్తారు. మీయింటికొచ్చి కూడా ఒక కాపీ మీ చేతిలో  పెట్టేస్తారు.  యిది మత  ప్రచారం. యిది కాస్త తలనొప్పి మిగతా మతాల వారికి. 

చర్చిలో బైబిల్ గూర్చి చెబుతారు; చర్చిస్తారు. యిది మంచి పద్ధతే.  బైబిల్  లో ముఖ్యంగా  క్రీస్తు చెప్పిన విషయాలు చాలా బాగుంటాయి. బైబిల్  గొప్ప గ్రంధమే.  నాకు సందేహం లేదు. మంచి జీవితానికి కావలసిన  ఎన్నో సూక్తులు యిందులొ  వున్నాయి.

ఒక ధనవంతుడు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టడం కంటే , ఒక  ఒంటె సూది సందులో  దూరి పోగలగడం  తేలిక అని బైబిల్  అంటుంది. నిజమేనా ! అయితే వారిలో ఎంత మంది దేవుడి రాజ్యం లోకి సులభంగా అడుగు పెట్టగలరు? ధనవంతుడు కాకూడదనే క్రైస్తవులు ఎంత మంది ? చర్చిలు ఎన్ని ? యిది విమర్శ అని కాదు. చెప్పడం ఒకటి చెయ్యడం ఒకటి గా వుంది , దాదాపు అన్ని మతాల లోనూ. వ్యక్తిగతంగా నాకు క్రీస్తు చాలా యిష్టమే . ఆయన చెప్పినవి యిష్టమే. క్రిస్టియానిటీ అంటే కూడా గౌరవమే. అలా అని బైబిల్ మాత్రమే అన్నిటి కంటే అతి గొప్ప గ్రంథం అని నేను అనుకోను.

మన దేశం లో చాలా మంది ముస్లిములు, ఎంతో మంది యితరుల కంటే చాలా మంచి  వాళ్ళుగా వుండడం  నా అనుభవం. అయితే పడమటి ఆసియా దేశాల్లో జరుగుతున్న ఎన్నో అమానుషాలు, ఇతర మతాల పట్ల , తమ లోనే యితర  వర్గీయుల పట్ల , అసహాయ స్త్రీల పట్ల  ఎంతో మంది చేస్తున్న క్రూర చర్యలు యివన్నీ మనలో ఎన్నో సందేహాలు రేకెత్తించక మానవు . అలాగే పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇతర మతాల  వారి పట్ల ప్రవర్తించే తీరు అస్సలు ఏమీ బాగా లేదు. మతోన్మాదం ముస్లిం దేశాల్లో  చాలా ఎక్కువ అన్నది విచారకరమైన విషయం . కానీ , అక్కడా ఎంతో మంది మానవతా వాదులు మనకు కనిపిస్తున్నారు. ఆ దేశాల్లో  ప్రశాంతత, మత సామరస్యం ఎప్పుడొస్తుందో , ఏమో అర్థం కావడం  లేదు.  రావాలనేది మన ఆకాంక్ష. 

ఖొరాన్ లో ఏముందో నాకు బాగా తెలీదు. కానీ , సంఖ్యాపరంగా ఖొరాన్ ప్రతులే ఎక్కువ వుండొచ్చు ప్రపంచంలో. ప్రపంచం లోనే  అతి గొప్ప గ్రంథం  ఖొరాన్  అని  వారు అనుకోవచ్చు. పడమటి ఆసియా దేశాల్లో జరుగుతున్న  అమానుషాలు తగ్గి ప్రశాంతత వచ్చే వరకు నేను అలా అనుకోలేను. అదికాక , ఆ గ్రంధాన్ని అసలు ఎవరూ విమర్శించరాదు - విమర్శించే వాళ్ళను ఏమైనా చెయ్యొచ్చు అనడం ఒక పెద్ద నెగటివ్ పాయింట్ గా వుంది . అయితే , అది గొప్ప గ్రంథాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు. 

త్రిపిటికాలు అనే బౌధ్ధ గ్రంధాలు, గురు గ్రంథ సాహెబ్ అనే సిక్కు మత గ్రంధము, యిలాంటి మత గ్రంధాలు  కూడా ఆయా మతస్థుల మధ్య బాగా ప్రాచుర్యంలో  వున్నాయి . అంతే కాదు. వాటిని, ఆ మతస్తులు ఎంతో కొంత పాటిస్తూనే వున్నారు కూడా. అది మనకు తెలుస్తూనే  ఉంది . ఆ గంధాల మానవతా విలువలు కొంతైనా వారి మధ్య వుండడం గమనార్హం .  అవి కూడా గొప్ప గ్రంధాలే.


మన దేశంలో , హిందూ మతం అని మనం పిలిచే మన మతానికి మత  గ్రంథమని చెప్పడానికి  ఒక గ్రంధం గా లేదు. వేదాలు అని చెప్పొచ్చు. అవీ  నాలుగు వున్నాయి. అవి అన్నీ చదివిన వారు మన చేతి వ్రేళ్ళ లోపే లెక్క పెట్ట వచ్చు - అని నా గాఢ విశ్వాసం. ఆ తరువాత - ఉపనిషత్తులున్నాయి. అందులో కొన్ని  (10) నేనూ  చదివాను. వేదాలు, వుపనిషత్తులు ఎప్పటివో మనకు  తెలీదు. ఎన్నో వేల ఏండ్ల నాటివి కావచ్చు; లక్షల  ఏండ్ల నాటివీ కావచ్చు. అన్నిటి కంటే పురాతన గ్రంథాలు అంటే - యివే అనడంలో నాకు ఏ మాత్రమూ సందేహం  లేదు. ఎవ్వరికీ తెలియని ఈ గ్రంధాలే ప్రపంచంలోనే  అతి గొప్ప గ్రంథాలు అని ఎలా చెప్పగలం ? అంతే కాదు. యివి చదవడానికే, అర్థం చేసుకోవడానికే ఒక జీవిత కాలం సరిపోదు. కృత యుగంలో - వేల , లక్షల యేళ్లు  బ్రదికే వారట. వారికోసం చెప్పబడిన గ్రంధాలివి అనిపిస్తుంది. "రాయ బడినవి" అనలేం. యివి ఏవీ రాయ బడలేదు. గురు శిష్య పరంపర లో గురువుల ద్వారా శిష్యులకు క్రమానుగతంగా  'చెప్ప బడ్డాయి.' యివి అర్హులకు మాత్రమే చెప్పబడ్డాయి. అందరికీ కాదు. అందరూ నేర్చుకోనూ లేరు. అందరికీ అక్కరా లేదు. యివి అన్నీ చాలా గొప్పవే. కానీ మనం చదవ లేనివి కదా .


మత గ్రంధాలు కాక , తిరుక్కురళ్ అనే  తమిళ గ్రంథం తమిళుల  మధ్య బాగా ప్రాచుర్యంలో  వుంది . యిందులో వున్న విషయాలు కూడా చాలా అందమైన జీవిత సత్యాలు. చదవడం వరకు బాగానే ఉంది ; కానీ , ఎంత మంది, యివి పాటిస్తున్నారు - అంటే సందేహాస్పదమే. అయితే , తిరుక్కురళ్ కూడా గొప్ప గ్రంధమే అనడం లో సందేహం లేదు. అంతే . అంతకు మించి లేదు. 

ఇవన్నీ కాక , రామాయణం  మన దేశం లో పుట్టిన  అతి పురాతనమైన,అత్యద్భుతమైన గ్రంధం. ప్రపంచం లోనే మొట్ట మొదటి మహా కావ్యం. మన దేశంలో, మనకు చాలా,చాలా  బాగా తెలిసినది. వాల్మీకి ఆది కవి. అంత వరకు చదువుకు నోచుకోని వాడు. రామాయణం రాయడానికి ప్రత్యేకంగా నియమింప బడ్డవాడు , ఆశీర్వదింప బద్ద వాడు.  రామాయణం రాముడి కథ ; రావణుడి కథ; హనుమంతుడి కథ ; సీత కథ; ధర్మాధర్మాల కథ; రాజు ఎలా వుండాలో , బంటు ఎలా వుండాలో, భర్త ఎలా వుండాలో , భార్య ఎలా వుండాలో , సోదరులు ఎలా వుండాలో, ప్రజలు ఎలా వుండాలో, వీళ్ళందరూ ఎలా వుండకూడదో  - ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి మనకు తెలిపిన కథ . నిజానికి యిది కథ కాదు. ఒక యుగపు చరిత్ర. ఆ యుగపు మహా పురుషుల గురించి తెలిపిన చారిత్రక కావ్యము. ఇందులో అంతర్భాగంగా యోగ వాసిష్ఠం అనే  గొప్ప యోగా ప్రసంగం వుంది. అనేక, అమూల్య రహస్య మూలికల ప్రస్తావం ఉంది. అద్భుతమైన ఆనకట్టల నిర్మాణం ఉంది. విమానాల ప్రస్తావన ఉంది. మానవ, రాక్షస, వానర, భల్లూక, విహంగాలతో కూడిన అత్యద్భుత యుద్ధాల వర్ణన వుంది. అంతకు ముందు కానీ , అప్పటి నుండి యీ రోజు  వరకు కానీ,  ప్రపంచంలో మరెక్కడా, ఇటువంటి అద్భుత గ్రంధం  రాయబడలేదన్నది నిర్వివాదాంశం. ఇది కూడా, 15 వేల  ఏళ్ళ నాటిదని కొందరు,లేదు,6 వేల  ఏళ్ల  నాటిదని కొందరు పాశ్చాత్య చరిత్రకారులు చెప్పొచ్చు ; తర్కించవచ్చు . కొన్ని లక్షల ఏళ్ల నాటిదైనా - ఆశ్చర్యం లేదు.  నా వ్యక్తిగత అభిప్రాయంలో -  పైన చెప్పబడిన  వాటితో  పోలిస్తే - రామాయణం  చాలా గొప్పది అనిపిస్తుంది . మత గ్రంధాలతో  పోల్చడం సరి కాదేమో కానీ  అతి గొప్ప గ్రంధం అంటే రామాయణం అనిపిస్తుంది.

రామాయణం తరువాత వచ్చింది మహా భారతం. ప్రపంచంలోనే  అతి పెద్ద గ్రంథం; రామాయణం తర్వాత అతి పురాతనమైనది; రామాయణం లో అంతర్భాగం యోగ వాసిష్ఠం అయితే , మహా భారతంలో అంతర్భాగం  భగవద్ గీత. మహా భారతం రామాయణం కంటే కొన్ని విషయాలలో విలక్షణమైనది. మహాభారతం - కృష్ణుడి కథ, భీష్ముడి కథ,  పాండవుల కథ , కౌరవుల కథ , ప్రపంచ చరిత్ర లోనే అత్యద్భుత  మహా సంగ్రామం కథ. యుద్ధ నీతి అనీతిల కథ. రాజ నీతి కథ. ధర్మాధర్మాల కథ. ఈ  రెండు గ్రంధాలు చదివిన వాడికి ఎంత జ్ఞానం వస్తుందో - చెప్పలేం. మన దేశంలో ఎన్ని మతాల గొడవలున్నా, మత సామరస్యము వుండడానికి  కారణం , ఈ రెండు గ్రంధాలే. స్త్రీలను దేవుడిగా చూసుకున్న ఒకే ఒక సంస్కృతి మనది. స్త్రీలను నిన్న మొన్నటి  వరకు అమ్మా అనే పిలిచి , గౌరవించిన ఈ సంస్కృతి కి ముఖ్య కారణం ఈ రెండు గ్రంధాలే . స్త్రీలను అవమానించిన వారికి ఎలాంటి శిక్ష వెయ్యాలో - రావణుడు , దుర్యోధనుడు ల కథ తెలుపుతుంది. ఏ దేశంలో  ఉంది , ఇలాంటి గంధాలు?

భగవద్ గీత - వీటన్నింటినీ మించిన గ్రంధం. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పిన సందేశం. ఇందులో ఒక్కొక్క భాగం , ఒక్కొక్క యోగం గా చెప్పాడు. ఒక్కొక్క యోగంలో శ్రీకృష్ణుడు ఒక సైన్స్ ను చెప్పాడు. భగవద్ గీత శ్రీకృష్ణుడు  చెప్పాడు కాబట్టి భగవద్ గీత మన మత గ్రంథం అనుకుంటే  చాలా పొరబాటు. అది అంతా సైన్స్ మయమే. అర్థం కావాలి. అంతే. మీరు పి.హెచ్.డి. సైన్స్  అయినా - భగవద్ గీత చదవలేదంటే మీకు అసలయిన సైన్స్ ఏదీ తెలీదనే చెప్పాలి. జీవితం గురించి కూడా తెలీదనే చెప్పాలి. మీరు జీవితంలో అతి ముఖ్యమైన దాన్ని ,  అసలు మిస్ కాకూడని దాన్ని మిస్సవుతున్నారు . ప్రపంచం లో  7 వండర్స్ లేదు. ఒకటే వుంది. అది భగవద్ గీత. ఇది 5000 సంవత్సరాలకు ముందటిదని , బైబిల్ , కొరాన్ , త్రిపిటికాలు , గురు గ్రంథసాహెబ్ , తిరుక్కురళ్  లాంటి అన్ని పుస్తకాల కంటే అతి పురాతనమైనది అని - అందరు చరిత్రకారులు వొప్పుకోవలసిన, ఒప్పుకున్న గ్రంధం యిది.

మన దురదృష్టం ఏమంటే - సెక్యూలరిజం పేరిట , గత 70 ఏళ్లుగా , యిందులోని సైన్స్ అంతా , మనకు  దూరంగా  పెట్టింది , మన ప్రభుత్వాలు. ఇప్పుడైనా  మనం ఈ సైన్స్ ను చదవాల్సిన , నేర్చుకోవాల్సిన, మన జీవితాలలో పాటించాల్సిన అవసరం ఎంతైనా  వుంది. 

నేను భగవద్ గీత చదివాను. అంతా అర్థమయ్యిందని చెప్పను. కానీ అందులోని చాలా విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. నా మొదటి ఆంగ్ల పుస్తకం - కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్ పతంజలి యోగసూత్రాస్ - లో చాలా విషయాలు  భగవద్ గీత నుండి వివరంగా  చెప్పాను. నాకు తెలిసినంత వరకు, నా అభిప్రాయంలో , ప్రపంచం లో అతి గొప్ప గ్రంధం అంటే - భగవద్ గీత - అనే అంటాను.



ఇక మీదట , అప్పుడప్పుడు,  గీత నుండి , అందులో వున్న శాస్త్ర జ్ఞానంతో సహా , ఎన్నో ఆసక్తి కరమైన వివరాలు  మీ ముందుంచడానికి ప్రయత్నం  చేస్తాను.

శుభం  భూయాత్

సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

ఉప్పలధడియం  విజయమోహన్





19, నవంబర్ 2016, శనివారం

మా వివాహ వార్షికోత్సవం - సేవలయా లో - వందలాది పిల్లలతో -

మా  వివాహ వార్షికోత్సవం

అపర్ణ,అభినయ,ధనుషా లతో మేము

సేవలయా లో



ఈ  నెల 17 వ తేదీ మా 38 వ వివాహ వార్షికోత్సవం. చాలా ఏళ్లుగా మేము జన్మ దినాలు, వివాహ వార్షికోత్సవాలు, మావీ, మా  పిల్లలవీ కూడా, సేవాలయా అనే అనాథ శరణాలయము, అందులోనే వున్న పాఠ శాల , వృద్ధాశ్రమాలలో ,అన్నదానం చేసి, ఆ పిల్లల మధ్యే , వారితో బాటే భోజనం చేసి జరుపు కుంటాము. 

ఈ సంవత్సరమూ అంతే. ఈ సారి అన్నదానానికి 10,000  రూపాయలు. సాధారణంగా, ఈ దినం ఒక అనాథ బాలిక పూర్తి చదువు ఖర్చు,1 నుండి ప్లస్ 2 వరకు, 1,00,000 రూపాయలు (ఎండోమెంట్ గా) ప్లస్ అన్నదానం ఖర్చు 10,000 యివ్వడం చేసే వాడిని. ఈ సారి స్టాక్ మార్కెట్ చాలా దెబ్బ  తిన్నందు వలన 1,00,000 విరాళం వాయిదా వేసాను. అది మరెప్పుడో చేస్తాను. 

ఇప్పటివరకు నలుగురు అనాథ బాలికలకు ఈ ఎండోమెంట్ ఏర్పాటు చేశాను. ధనుష ,అపర్ణ ,అభినయ, సుమిత్ర  వాళ్ళ పేర్లు. సేవాలయ కు వెళ్ళినప్పుడు ఈ నలుగురితో ఒక గంట సేపైనా మాట్లాడి, వారి చదువులు, ఇతర  కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాకోలెట్ ప్యాకెట్  యిచ్చి  వాళ్ళ  సహవిద్యార్థులకు, ఫ్రెండ్స్ కు, అధ్యాపకులకు పంచమంటాను.  ఈ సారీ, నేను , నా భార్య అదే చేశాము . 

అపర్ణ తాను నేర్చుకున్న భరత నాట్యం  చేసి చూపింది. మిగతా పిల్లలు మంచి పాటలు చాలా చక్కగా పాడారు. వాళ్ళ చదువుల గురించి విశదంగా చెప్పారు. వాళ్ళతో మాట్లాడ్డం ఒక  గొప్ప అనుభవం. ఆ పిల్లల మొహాల్లో ఎంతో సంతోషం. అది చూస్తే మాకూ ఎంతో సంతోషం. ఆ పిల్లల చేత తాను  ముద్దు పెట్టించుకుని, వారికి  తాను ముద్దు పెట్టి సంతోష పడడం నా భార్యకు ఒక అరుదైన అనుభవం . 

 ఆ తరువాత వందల కొద్దీ పిల్లలందరితో బాటు వాళ్ళ డైనింగ్ హాల్ లో కూర్చుని , వాళ్ళతో బాటే భోజనం . 

భోజనానికి  ముందు ఆ  పిల్లలు మా కోసం ఏదో ప్రార్థన చేస్తారు. అందరూ ఏక కంఠంతో మమ్మల్ను అభినందిస్తారు. పిల్లలు చేసే ఈ తంతు చాలా ముచ్చటగా వుంటుంది. 

నా భార్య కొంత మంది పిల్లలకు తానే స్వీట్స్ వడ్ఢన చేసింది. నేను వృద్ధాశ్రమపు వృద్ధులకు స్వీట్స్ వడ్డన చేశాను. వాళ్ళ మొహాల్లో ఎంతో సంతోషం. వాళ్ళు చేసే అభినందనలు , ఆశీర్వాదాలు. అదొక  మంచి అనుభవం. 

తిరిగి వచ్చే దారిలో వందలాది పిల్లలు థాంక్యూ సర్ అంటూ, తమకు తామే, మమ్మల్ని   చూస్తూ చేతులు ఊపుతూ వుంటే , వాళ్ళ మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే సంతోషం చూస్తూ వుంటే, చాలా ఆనందం అనిపించింది. దేవుడు దేవాలయం లో మాత్రమే కాదు ; ఈ సేవాలయా లో కూడా, ఈ పిల్లల హృదయాల్లో కూడా తప్పక వున్నాడనిపించింది . 

ఆ పిల్లల అభినందనే, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం మాకు. 

అక్కడికి వెళ్లే ముందు 95 ఏళ్ళు దాటిన మా మామగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాము. వెళ్లే దారిలో  షిర్డీ సాయి ఆలయ దర్శనం . తిరిగి వచ్చేటప్పుడు మా అన్నను చూసి రావడం. 

మా యిద్దరు కొడుకులలో ఒకరు బెంగుళూరు , ఒకరు కోయంబత్తూర్ లలో వున్నారు. వాళ్ళతో టెలిఫోన్  సంభాషణే.  వాళ్ళూ సంతోషంగా వున్నారు. కాస్త దూరం , అంతే.   వాళ్లకూ మేము యిలా చెయ్యడం  బాగా నచ్చింది. 

అయితేనేం , వందలాది పిల్లలు సేవాలయాలో దగ్గరే వున్నారు కదా . 

సర్వే జనాః సుఖినో భవంతు 
=మీ 
 ఉప్పలదడియం  విజయమోహన్
95 ఏళ్ళ మామ గారి ఆశీర్వాదం
 





సేవలయ స్కూల్


సేవలయా పిల్లలు


 




 

22, అక్టోబర్ 2016, శనివారం

క్యాన్సర్ వ్యాధి - సూచనలు - చికిత్స - కాన్సర్ రాకుండా కాపాడే దివ్య ఔషధాలు - మీరు చెయ్యగలిగింది

క్యాన్సర్ మహమ్మారి పట్ల 

మన కర్తవ్యం  ఏమిటి ?


ఈ మధ్య, కాన్సర్ వ్యాధి  చాలా ఎక్కువై పోతోంది  ఎవరికి వస్తుందో , ఎప్పుడు వస్తుందో , ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. చిన్న పాపల నుండి ముసలి వారి వరకు - ఎవరికైనా , ఎప్పుడైనా రావచ్చు . వచ్చిన వారి కుటుంబాలలో అనంతమైన భయం , నిరాశ చోటు చేసుకుంటూ వున్నాయి.

ఆలోపతీ చికిత్స మహా  నగరాల్లోనే ఉంది. గ్రామాల్లోని వారు , చిన్న ఊర్లలో వున్న  వారు ఈ ఖరీదైన అలోపతీ చికిత్స పొందడం చాలా కష్టంగా వుంది. ఎన్ని లక్షలు ఖర్చు  అవుతుందో తెలియదు . ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. చివరికి  పూర్తిగా నయమయినట్టా , కాదా అని కూడా తెలియదు. మళ్ళీ తిరగబెడుతుందా అన్న సంగతీ తెలియదు.

కాన్సర్ వ్యాధిని నయం చెయ్యడానికి ఆపరేషన్,  కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్మ్యూనోథెరపీ, టార్గెట్టెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, ప్రెసిషన్ మెడిసిన్ లు ఆలోపతీ వైద్యంలో ప్రధానంగా వుంటున్నాయి. యివన్నీ కాన్సర్ కాస్త తక్కువ స్టేజి లో వుంటే బాగా పనిచేస్తాయి. ముదిరిన తర్వాత వీటి ప్రయోజనం ఎలా వుంటుందో చెప్పలేం .


ప్రధానంగా ,కాన్సర్ ను TNM సిస్టం  ప్రకారం, సైజు ను బట్టి మొదట (T సిస్టం) 4 స్టేజి లుగా గుర్తు పడతారు. 1 అంటే కాన్సర్ గడ్డ చిన్నది, 4 అంటే బాగా  పెద్దది అని అర్థం.  తరువాత , ఎన్ని లింఫ్ నోడ్స్ కు ప్రాకింది తెలుసుకుని (N  సిస్టం ), 0 నుండి 3 వరకు నంబర్స్  యిస్తారు. M సిస్టం ప్రకారం - ఒక చోటి నుండి మరోచోటికి  కాన్సర్ ప్రాకిందా  అని నిర్ణయిస్తారు . 0 అంటే ఒకే చోట ఉంది . 1 అంటే మరో చోటికి కూడా ప్రాకింది అని అర్థం . ఇవన్నీ రక రకాల టెస్టులు , స్కాన్ ల ద్వారా తెలుసుకుంటారు.

ఆ తరువాత , వైద్య పధ్ధతి  కాన్సర్ స్పెషలిస్ట్స్  నిర్ణయిస్తారు . కాన్సర్ ను మొదట్లోనే గుర్తు పట్టడానికి కొన్ని వైద్య విధానాలు వున్నాయి . ఫెకెల్ ఆకల్ట్ టెస్ట్ , కాలోనోస్కోపీ లాంటివి 50 ఏళ్ళ  పైబడ్డ వారు చేయించుకోవాలి. ఆడవాళ్లు మామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవాలి . ఇలాంటి టెస్టులు అన్ని వూళ్ళలో వున్నాయో లేదో తెలీదు.

 సరే . మనమేం చెయ్యవచ్చు - అది చూద్దాం.   

కాన్సర్ వ్యాధి ని కనిబెట్టడానికి C.A.U.T.I.O.N. అన్న పదం ద్వారా మనం చెయ్యదగిన సూచనలు చెబుతారు. 

C – Colorectal cancer.మన మల మూత్ర విసర్జన లలో  ముఖ్యమైన మార్పులు మనం గమనించాలి . దీని ద్వారా కాన్సర్ రావడాన్ని ముందుగా తెలుసుకోవచ్చు . ఈ మార్పులు   కొలెరెక్టల్  కాన్సర్ కు గుర్తు కావచ్చు . కాన్సర్ మాత్రమే కాదు. jaandice లాంటి వ్యాధులు కూడా  మనం సులభంగా చెయ్య గలిగే మల మూత్ర పరిశీలన ద్వారా కనిబెట్ట వచ్చు. కలర్  మారినా , రక్తం పడుతున్నా , మరే మార్పు వున్నా మనం చూడాలి . డాక్టర్ ను అడగాలి. 4 నెలలకు ఒక సారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకోవాలి. 
A – A sore that does not heal in a normal amount of time. చర్మము , నోరు లాంటి ప్రదేశాల్లో వచ్చి , ఎన్నాళ్లయినా ఆరని పుండ్లు వుంటే అక్కడ కాన్సర్ రావచ్చు అనడానికి అవి సంకేతం .వీటిని మాన్పుకోవాలి. డాక్టర్ ను శ్రద్ధగా ముందస్తుగా అడగాలి . 
U – Unusual bleeding or discharge. మల,మూత్ర , వెజైనా లాంటి  ద్వారాల గుండా వచ్చే అధిక రక్త స్రావము , మరేదైనా స్రావము - వాటికి సంబంధించిన ఏ  బాహ్య లేదా అంతర్ అంగాలలో వచ్చే క్యాన్సర్లకు సంకేతం .వీటిని గురించి కూడా జాగ్రత్త పడాలి. 
T – Thickening of breast tissue or a lump. స్త్రీలలో రొమ్ముల్లో పెరిగే టిష్యూ లు,గడ్డలు అక్కడ కాన్సర్ రావడానికి సంకేతం కావచ్చు. అలాగే మగవారిలో టెస్టికల్స్ లో గడ్డలు పెరగడం కూడా.యివి మనమే అప్పుడప్పుడూ చూసి, గడ్డలు వుంటే , డాక్టర్ ను కన్సల్ట్ చెయ్యాలి . యివి కాన్సర్ గడ్డలే  కానవసరం  లేదు . మామూలు క్రొవ్వు లాంటి గడ్డలు కూడా కావచ్చు. 
I – Indigestion and/or difficulty IN swallowing. అజీర్తి కానీ, ఆహారం మింగ లేక పోవడం  తరచుగా ఉంటే - గొంతునుండి ప్రేవుల వరకు ఎక్కడైనా కాన్సర్ రావడానికి సంకేతం కావచ్చు.యివి కూడా మనం మందుల ద్వారా  మొదటనే పోగొట్టుకుంటే మంచిది. 
O – Obvious changes to moles or warts. చర్మము పైన  మచ్చలు , పులి పురులు లాంటివి పెరగడం కూడా చర్మపు కాన్సర్ కు సంకేతం కావచ్చు .ఇలాంటివి వుంటే , స్కిన్ స్పెషలిస్ట్స్ ద్వారా సులభంగా , బాధ లేకుండా, మొదటనే  తీసేసుకోవచ్చు. అశ్రద్ధ మంచిది కాదు. 
N – Nagging cough. 4 వారాల మించి  తగ్గని దగ్, గు గొంతు మరియు ఊపిరి తిత్తుల  కాన్సర్ కు సంకేతం కావచ్చు.దగ్గుకు మంచి మందులు వున్నాయి .  వెంటనే  పోగొట్టుకొండి. వారం దాటితే డాక్టర్ ను తప్పకుండా చూడండి. 

యివన్నీ తప్పకుండా కాన్సర్ ఉందని చెప్పడానికి ఆధారాలు ,  నిదర్శనాలు కావు .  కానీ , యివన్నీ , మనం ఆరంభ దశలోనే పోగొట్టుకోవడానికి వుపకరించే మంచి సంకేతాలు .

ఇక , కాన్సర్ రాకుండా వుండాలంటే  ఏం చెయ్యాలో  తెలుసుకుందాం .

దీనికి సాధారణంగా 10 ముఖ్య సూత్రాలు చెబుతారు .


1. పొగాకు, పొగాకు పొగ  విడిచి పెట్టండి. యివి  త్రాగే వారి నుండి మనకు వచ్చే పొగ మరీ అనర్థ దాయకం . మనదేశంలో మనషులు తిరిగే ప్రాంతాలలో పొగ త్రాగడం నిషేధించారు . మీరు మనుషులే గనుక  పొగ త్రాగడం మానండి . మీకు, మీ  వారికీ, చుట్టూ వున్న వారికీ  ప్రమాదం తప్పించండి.  
2. మీ భోజన పద్ధతులు బాగుండాలి. saturated fat, red meat లాంటివి విడిచి పెట్టండి. పండ్లు   కూరగాయలు, ధాన్యాలు ఎక్కువ చేయండి. నూనెలో వేయించినవి, కాల్చిన ఆహారాలు బాగా  తగ్గించండి. 
3. శారీరక పరిశ్రమ , వ్యాయామము తగినంతగా  వుండాలి. యోగా చాలా మంచిది. 
4. శరీరం బలంగానూ, సన్నగానూ వుండేలాగా చూసుకొండి.  Obesity -  అంటే శరీరంలో  భాగాల్లో కొవ్వు పేరుకు పోవడం కాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది.
5. మద్యపానం వదిలేయండి . లేదా , బాగా తగ్గించండి.
6. రేడియేషన్ - సెల్ ఫోన్లు , సెల్ టవర్స్ , స్కేన్ టెస్టులు యివన్నీ రేడియేషన్ కలిగించేవి. వీటికి దగ్గరుండడం బాగా తగ్గించండి. రాత్రి పూట సెల్ ఫోన్లను మీకు తప్పకుండా దూరంగానే  వుంచండి.పిల్లలకు సెల్ ఫోన్లు ఆట వస్తువులు కాకూడదు. వారి బలహీనమైన చెవి నరాల పైన ,  మెదడు పైన రేడియేషన్ ప్రభావం చాలా  ఎక్కువగా వుంటుంది . దయ చేసి సెల్ ఫోన్లు పిల్లలకు ఇవ్వకండి. యిచ్చి వాళ్ళను అల్పాయుష్కులు , రోగ  గ్రస్తులు  చెయ్యకండి 
7. కొన్ని పారిశ్రామిక విషాలు మన  చుట్టూ వున్నాయి. ఆస్బెస్టాస్,బెంజీన్, లాంటివి . వాటిని దూరంగా వుంచండి. 
8. వైరస్ ఇన్ఫెక్షన్ లు రాకుండా చూసుకోండి.
9. చిన్న, చిన్న డోసు లలో, ఆస్పిరిన్  అప్పుడప్పుడూ తీసుకోవడం కాన్సర్  రాకుండా చూస్తోంది - అంటారు.
10. విటమిన్ డ్, ఏ, బి 17 లు కాన్సర్ రాకుండా కాపాడతాయని  అంటారు .

యివి కాక , ఈ మధ్య తెలిసొస్తున్న మన నాటు వైద్యాలు కొన్ని చాలా మంచివని తెలుస్తున్నాయి . యివి కాన్సర్ వున్నా . లేకున్నా , రాకుండా వుండడానికి , వస్తే  నయం కావడానికి మనం పాటించ గలిగేవి .

1. గచ్ఛ కాయ  పప్పు ఒకటి , దానితో 4 మిరియాల గింజలు పొడి చేసి - రోజుకు రెండు సార్లు చొప్పున  తీసుకుంటూ ఉంటే - కాన్సర్ గడ్డలు,  ఇతరమైన  ఏ గడ్డలు శరీరంలో వున్నా , కరిగిపోతాయని, ఒక  వైద్య నిపుణుడు , యిప్పటికి  వంద సార్లయినా చెప్పాడు. యిది చెయ్యడం చాలా మంచిదని నా అభిప్రాయం .

2. సముద్ర పాల ఆకు రసం రోజుకు రెండు సార్లు తీసుకుంటూ ఉంటే - కొన్ని నెలలలో కాన్సర్  నయమవుతుందని  ఎంతో మంది చెబుతున్నారు. యిప్పుడు వీటి చూర్ణము , ట్యాబ్లేట్ల్ ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకోవచ్చు .

3. ఒకటిన్నర కిలోల కారట్లు , రసం తీసి, ఒక రోజులో  త్రాగాలి .  యిలా ప్రతి రోజూ చేస్తూ వుంటే కొన్ని నెలలలో కాన్సర్ పూర్తిగా నయమవుతుందని చాలా మంది చెబుతున్నారు.

4.  గో మూత్రము  పరిశుద్ధి చేసి  తీసుకుంటే కాన్సర్ నయమవుతుంది -అని చాలా మంది చెబుతున్నారు .

5.  పసుపు, పుదీనా రసము, గార్లిక్ , జింసెంగ్ , అల్లము, వెల్లుల్లి -యివన్నీ కాన్సర్ రాకుండా కాపాడే దివ్య  ఔషధాలే . యివి మనం వాడాలి . కాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలి. 

5. యివన్నిటినీ మించి మీ యిళ్ళలో  మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం , ధైర్యం  పెంచుకోవడం , ఆరోగ్యకరమైన , ఆహ్లాద కరమైన కుటుంబంగా  వుండడం  - చాలా ముఖ్యం .

 సర్వే జనాః సుఖినో భవంతు

ఆరోగ్య ప్రాప్తి రస్తు

= మీ

ఉప్పలధడియం  విజయమోహన్



5, అక్టోబర్ 2016, బుధవారం

నా పుస్తకావిష్కరణ - కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్ పతంజలి యోగ సూత్రాస్ - ఆర్గాన్ డొనేషన్ - దసరా శుభాకాంక్షలు

పుస్తకావిష్కరణ 

 


2016, సెప్టెంబర్, 29 వ తేదీ, ప్రజాశక్తి దిన పత్రిక వారు పుంగనూరు (చిత్తూర్ జిల్లా) లో, తమ 36 వ వార్షికోత్సవం బసవరాజా గవర్నమెంట్ హై స్కూల్ లో జరిపారు. ఆ  సందర్భంగా  నన్ను పిలవడం, నా పుస్తకాన్ని (కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్  పతంజలి  యోగ సూత్రాస్), స్థానిక మునిసిపల్ కమీషనర్ , శ్రీ లోకేశ్వర్ వర్మ గారి చేత, పలువురు స్థానిక ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరింప జేయడం జరిగింది. 

 ఆంగ్లం లో రాయ బడిన 760 పేజీలున్న పుస్తకం యిది. పెద్దదే. అందుకే యిది కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ అన్నాను. ఈ పుస్తకాన్ని యిది వరకే అన్ని పెద్ద లైబ్రరీ లకు , యోగా ప్రముఖులకు పంపించడం జరిగింది. వారిలో చాలా మంది యోగా ప్రముఖులు స్వయంగా నాకు టెలిఫోన్ చేసి నా పుస్తకాన్ని ఎన్నో విధాలుగా ప్రశంసించడం జరిగింది.  అలాగే, చాలా మంది  లిఖిత  పూర్వకంగా కూడా ప్రశంసించడం జరిగింది. ముఖ్యంగా , రామకృష్ణ  మిషన్ స్వామీజీలు భారత దేశపు పలు మిషన్లనుండి ఈ పుస్తకాన్ని రక రకాలుగా ప్రశంసించారు. వారందరికీ నా కృతజ్ఞతా పూర్వక పాదాభివందనాలు. 

ఈ  పుస్తకం లో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. పతంజలి మహర్షి రాసిన అన్ని సూత్రాలను, వాటికి ప్రతిపదార్థము, సంక్షిప్త అర్థము , సమగ్ర వివరణ, ఉదాహరణలు , భగవద్ గీత , ఉపనిషత్తులు దీన్ని గురించి ఏం చెప్పాయి , వాటికి వివరణ , ప్రాక్టికల్ ఎక్సరసైజ్స్ , యిలా యిన్నో వివరణలు యిందులో సమగ్రంగా రాయ బడింది. 

చివర 4 అనుబంధాలు (Annexures); అందులో, ఒక సాధకుడు  ఏం   చెయ్యాలి, ఎలా చెయ్యాలి , అతని దైనిక యోగా కార్య క్రమం ఎలా వుండాలి అన్నవంతా సమగ్రంగా యివ్వబడింది. 

భారత దేశపు పలు ప్రాంతాల నుండి, ఎంతో మంది  ఈ పుస్తకాన్ని తమ స్థానిక లైబ్రరీ లలో చదివి నాకు ఫోన్ మూలకంగా తమ అభినందనలు తెలియ జేస్తున్నారు. కాపీలు కొనడానికి ఉత్సాహంగా వున్నారు.

యిప్పుడు నా ఈ పుస్తకం, నేను చదివిన స్కూల్ లో ,  నేను చదివిన క్లాస్ రూమ్ (పెద్ద హాల్) లో, నేను ప్రప్రథమంగా యోగా నేర్చుకున్న హాల్ లో, మా వూరి  స్థానిక ప్రముఖుల ముందు ఆవిష్కరింప బడడం చాలా ఆనందం గా  వుండింది . 

 నేను ఈ పుస్తకాన్ని అంతర్జాతీయంగా అమెజాన్ లాంటి కంపెనీల మూలంగా విక్రయానికి సన్నద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే సఫలం అవుతుందని ఆశిస్తున్నాను. అందుకే దేశీయ సంస్థల వారికి  యివ్వ లేదు. 

మా కుటుంబం లో - అంటే ఉప్పలధడియం వంశంలో , మరో యిద్దరు తెలుగు రచయితలూ  వున్నారు. 

మా చిన్నాన్న , ఉప్పలదడియం రామమూర్తి , వయసు 76 ఏళ్ళు , ఆయన గత 8 ఏళ్లలో మూడు మంచి పుస్తకాలు రాశారు. 

అవి - మహా భారత  నామ కోశము , భాగవత నామకోశము, రామాయణ నామ కోశము. సంస్కృత గ్రంధాల లోని అన్ని పాత్రల వివరణ ఈ తెలుగు పుస్తకాలలో ఆయన చాలా బాగా యిచ్చారు. యివి మూడూ మూడు రీసెర్చ్ గ్రంధాలే. అలాగే , రీసెర్చ్ కు ఉపయోగ పడే గ్రంధాలే. యింకా, యింకా, ఆయన ఇటువంటి ఉత్తమ గ్రంధాలు  రాయాలని కోరుకుంటున్నాము. 

ఆయన పెద్ద కొడుకు, డాక్టర్ వెంకటేశ్వర తెలుగులో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. కవితలు , పద్యాలు, వ్యాసాలు, కథలు లాంటి అన్ని రకాల తెలుగు సాహిత్య రీతులను ఒక పట్టు పట్టి చూస్తున్నారు. అనేక సత్కారాలనూ అందుకున్నారు. యింకా, యింకా రాస్తూనే వున్నారు.  చాలా  మంచి  రచయిత , వుజ్వల భవిష్యత్తు వున్న వాడు. 

మా అన్న వుప్పలధడియం  నాగరాజ పుస్తకాలు రాయలేదు కానీ అద్వైత సిద్దాంతంలో ఎంతో జ్ఞాని అని చెప్ప వచ్చు. స్వామి దయానంద గారి గొప్ప శిష్యుడైన స్వామి పరమార్థానంద గారి వద్ద ఒక దశాబ్దం పైగా శ్రవణము, మననము, నిదిధ్యాసనము చేసినవాడు. మా 6 మంది అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెళ్లను  ఒక తండ్రిగా ముందుకు  తీసుకు వచ్చిన వాడు. 

మా నలుగురు చేసిన, సాధించిన  పై విషయాలను గురుతుంచుకుని, ఒక "ఉప్పలధడియం  సాధకుల సభ"  మా అన్న గారింట్లో, ఈ నెల 2 వ తేదీ నాడు  జరిగింది. మా బంధువర్గమంతా ఒక చోట చేరడం, మా సాధనలను సమీక్షించడం , సత్కరించడం  జరిగింది. మాకు యిది చాలా ఆనంద దాయకమైన విషయం. 




యిది ఆ సందర్భంగా తీసిన ఫోటో. యిందులోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత, సృజనాత్మకత ఉండనే వుంది. ఈ సభలో  ఆర్గాన్ డొనేషన్ అన్న అంశం పైన కూడా చిన్న చర్చ జరిగింది. అందరూ కలిసి , ఆర్గాన్ డొనేషన్  కు సరైన సంస్థలకు, లిఖిత పూర్వకంగా అథారిటీ లెటర్లు  ఓకే సారి యివ్వాలని  ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము.  ఇదొక మంచి నిర్ణయం. ఇది ప్రతి కుటుంబం లోనూ, చెయ్య గలిగితే  బాగుంటుంది. నా వుద్దేశంతో , యిది ఒక జాతీయ  వుద్యమం లాగా జరుప గలిగితే చాలా బాగుంటుంది. 

యిలా, జీవితం లో ఎన్నో జరుగుతూ వుంది . మలుపులూ, మార్సులూ , పురోగతి , కొంత తిరోగతి ఉంటూనే వున్నాయి. యిప్పుడు దసరా కదా.  మాయింట్లోనూ బొమ్మల కొలువు పెట్టాము. ఇదో చూడండి. 
  





పాఠకులందరికీ నా (మా) దసరా శుభాకాంక్షలు.


 సర్వే జనాః సుఖినో భవంతు 

= మీ 

ఉప్పలధడియం  విజయామోహన్







28, సెప్టెంబర్ 2016, బుధవారం

నిత్య జీవితం లో యోగా


నిత్య  జీవితం లో యోగా 
 ఒక  విశేష యోగా ప్రక్రియ 

చిన్నపిల్లల నుండి పెద్దవాళ్లవరకు మనం అందరూ నిత్యజీవితంలో యోగ ప్రక్రియలు ఎన్నో వాడుతూ వున్నాము. 
ఉదాహరణకు -
గోపీ 10 వ తరగతి విద్యార్థి. బాగా చదువుతాడు. గోపీ సెక్షన్ లో, 30  మంది విద్యార్థులున్నారు. గోపీకి  రాము బెస్ట్ ఫ్రెండ్. చదువులోనూ, ఆటలలోనూ, మాటల లోనూ, అన్నింట్లో గోపీ, రామూతో బాటే వుండాలని ఇష్టపడతాడు. తెల్లవారి లేస్తే గోపీకి మొదట జ్ఞాపకం వచ్చేది రామూ. 

యిప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ ను దాటి కాస్త ముందుకు వెడదాం. 

ఒకవేళ, గోపీకి, రామూ మాత్రమే కాక , తన క్లాసులోని వారందరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా అయ్యారనుకొండి . ఒక్కో సారి అలా జరుగుతుంది . గోపీని వాళ్ళ  మేష్టారు క్లాస్ లీడరుగా పెట్టారనుకొండి.  అందరు  విద్యార్థులను సమానంగా చూడవలసిన అవసరాలు వస్తుంటాయి. అప్పుడు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు కూడా . 

అప్పుడు గోపీ మనస్థితి ఎలావుంటుంది ? 
అప్పుడు తెల్లవారి లేస్తే గోపీకి ఎవరు జ్ఞాపకం వస్తారు ?
30 మంది పేర్లు చెప్పు కోకున్నా , గోపీ, నా ఫ్రెండ్స్ అందరూ  సుఖంగా వుండాలనుకుంటాడా? 
నా  ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా, రోగాలు లేకుండా - అందరూ క్లాస్ కు రావాలని అనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ ఆపదలూ  లేకుండా  భద్రంగా ఉండాలనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ శోకాలూ , దుఃఖాలూ లేకండా  వుండాలనుకుంటాడా ?
యిలా గోపీ కాస్త స్ట్రాంగ్ గా మనస్సులో అనుకుంటే , గోపీ యోగా లో ప్రవేశించినట్టే. 

యిదే, గోపీ సంస్కృతం లో చెప్పాలనుకుంటే ఈ శ్లోకం చెబుతాడు :
సర్వే  భవంతు సుఖినః  (లేదా సర్వే  మిత్రాహ్ సుఖినో భవంతు )
సర్వే  సంతు నిరామయాహ్ 
 సర్వే భద్రాణి పశ్యంతు 
మా కశ్చిత్  దుఃఖ భాగ్ భవేత్ 

యిది దేవుడికి  చేసే  ప్రార్థన కాదు . గోపీ మనసులో రేగిన బలమైన, నిస్స్వార్ధమైన కోరిక
యిలా హృదయపూర్వకంగా అనుకున్నప్పుడు గోపీ కొంత యోగిగా మారిపోతాడు.   అందరికీ లీడరు గదా  మరి . 
మానసికంగా అందరూ నాలో వున్నారు , అందరి శ్రేయస్సూ నేను కోరుకుంటున్నాను - అనే భావనే యోగా లో ఒక ముఖ్యమైన  భావన. 
యిప్పుడు ఒక  గొప్ప అద్భుతం జరుగుతుంది . 
గోపీ మనసులోని ఈ బలమైన, నిస్స్వార్ధమైన కోరికను చుట్టూ వున్న ప్రకృతి  కూడా వింటుంది .
మనసులో అనుకున్నాసరే. 
ప్రకృతి ఈ నిస్స్వార్ధమైన, న్యాయమైన కోరికను తప్పకుండా వింటుంది. ప్రకృతికి ఆ శక్తి  ఉంది. ప్రకృతికి అనేక రకాల శక్తులున్నాయి 
సరే . ఎంతైనా కొంత, ఈ గోపీ కోరికను నిజం చేద్దామని ప్రయత్నం చేస్తుంది. 
దీన్ని యిప్పుడు పాశ్చాత్య దేశాల్లో   లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు పెట్టుకున్నారు.
యిప్పుడు యితని బలమైన కోరికకు ప్రకృతి బలం కూడా కొంత తోడవుతుంది . 
ప్రకృతి  ఇతన్ని చూసి 'శభాష్ ' అంటుంది . తన చెయ్యి చాస్తుంది , యితని చేతిలో చెయ్యి కలపడానికి . 

యిది మనకు అనుభవం కావాలి . ప్రకృతి తో చెయ్యి కలపడం మనకు రకరకాలుగా అనుభవం కావచ్చు . 

దీనిపై - ఇప్పుడొక ఎక్స్పరిమెంట్ చెయ్యొచ్చు . 

సర్వే భవంతు సుఖినః - అందరూ సుఖంగా ఉండాలి - అని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా  ఒక్కసారి అనండి . అన్నారా ?

యిప్పుడు కళ్ళు మూసుకునే ,మీ చెయ్య చాచండి . మీ ముందు విశ్వమంతా వ్యాపించి యున్న ప్రకృతి మాత
అతి సుందరంగా చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉంది. మీ చెయ్యి వైపు తన చెయ్యి చాచింది. మీ చేతిని అందుకుంది - ఒక తల్లి తన బిడ్డ చేతిని పట్టుకున్నట్టు . ప్రకృతి మాత అదృశ్య హస్తం మీచేతిని తాకుతున్న అనుభూతిని మీరు పొందాలి. 

యిది ఒక గొప్ప అనుభూతి . యిది మీరు పొందే వరకు మీరు ఈ ఎక్సపెరిమెంట్  చెయ్యొచ్చు . 

మరొక సింపుల్ ఎక్స్పరిమెంట్ చేద్దాం. 

మీచుట్టూ వున్న ప్రకృతి లో మహా గొప్ప చైతన్యము ఉంది . మీకున్న పంచేంద్రియాల శక్తి కంటే ఎన్నో కోట్ల రేట్లు అధికమైన శక్తి ఆమెకు ఉంది . 

మీరు ఎక్కడ వున్నా ఆమె మీ చుట్టూ వుంది. మిమ్మల్ని చూస్తూనే వుంది. 

మీరు మీ స్వార్థాని  కోసం ఏ  పని చేసినా దానితో ఆమెకు సంబంధం లేదు. 

కానీ, మీరు సర్వే జనః సుఖినో భవంతు అన్నప్పుడు, దాని కోసం పనిచేసినప్పుడు - ఆమె శభాష్ అంటుంది . మీతో చేతులు కలుపుతాను- అంటుంది. ఆ అనుభూతిని మీరు పొందాలి . 

ప్రయత్నించండి. ప్రకృతిమాత మా చుట్టూ వున్న అనుభూతిని మీరు పొందండి. 
 
 ఒంటి చేత్తో చప్పట్లు కొట్టగలరా? కొట్ట లేరు . కానీ ప్రకృతి తో కలిసి కొట్టగలరా ? కొట్ట గలరు.  ప్రయత్నించి  చూడండి . ఒక వైపు మీ చేయి. మరో వైపు ప్రకృతి తన చేయి కలపడం . ఆ అనుభూతి వచ్చే వరకు చెయ్యండి . 

యిలా చేస్తూ ఉంటే - మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రకృతి శక్తి కూడా మీకు తోడవుతుంది 

=సర్వే  జనాః  సుఖినో భవంతు 

మీ 

 విజయమోహన్