19, నవంబర్ 2012, సోమవారం

PSORIASIS - GREAT WAYS TO GET RID OF - గొప్ప చిట్కాలు - సోరియాసిస్-యితర చర్మ సమస్యలు


skin Problems- Psoriasis - Good way to get rid of

చిన్న రోగాలు- పెద్ద సమస్యలు - గొప్ప చిట్కాలు 

సోరియాసిస్-యితర చర్మ సమస్యలు 


గత వొక దశాబ్దం గా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి.

హృద్రోగ సమస్యలు, ఊపిరి తిత్తుల వ్యాధులు , చక్కెర వ్యాధి, రక్త పోటు లాంటివి ఎన్నో - యిప్పుడు చాలా సాధారణమై పోయాయి.

వీటిలో దేనికీ - అల్లోపతీ వైద్యంలో - సరైన . పూర్తి నయం చేసే మందులే లేవు. పోగొట్టడం కాదు - ఎక్కువ బాధ పెట్టకుండా చేయడం వుండటం మాత్రమే వారు  చేయ గలుగుతున్నారు . దీన్ని వారు రోగాల మేనేజ్మెంట్ -అంటున్నారు 

యివి నయమైతే - వారి మందులకు విక్రయం వుండదు  గనుక వారు - యిదే మంచిది అనుకున్నట్టు    - వొక్కో సారి అనిపిస్తుంది .

హృద్రోగాలు రాకుండా కాపాడే మందులు ఆయుర్వేదంలో ఎన్నో వున్నాయి. అందులో - ప్రశస్తమైనవి "అర్జున" చెట్టు నుండి వచ్చే మందులు. అలాగే ఆశ్వ గంధ ; ఇలాంటి ప్రశ స్తమైన మందులు  చాలా రోగాలు రాకుండా కాపాడతాయి. వచ్చిన రోగాలనూ, క్రమంగా, తగ్గించేస్తాయి.

చదివే వారికి నా విన్నపం ఏమంటే - వీటిని గురించి - మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

సరే.  కొన్ని వ్యాధులు ప్రాణ హాని చేయవు కానీ. మానసికంగా చాలా బాధ పెడతాయి. అటువంటి వాటిలో - చర్మ రోగాలు ముఖ్యమైనవి. అందులో వొకటి సొరియాసిస్. యిది ఎందుకు వస్తుందో - యిదిమిత్థంగా  ఎవరికీ తెలీదు.

కానీ, మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో వొక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే - డ్రై స్కిన్ -వుంటే  యిది రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే - చలి కాలం ; ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే .

తెల్లవారి 5 గంటల కాలంలో - సూర్యుడి కిరణాల్లో - విటమిన్-డీ. ఎక్కువగా వుంటుంది.అది తగులుతూ వుంటే - చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు రావు.

అలాగే చర్మం పొడి గా కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే - అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వలన చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. అవి చాలా మంచివి.

యివన్నిటితోబాటు - మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే - పసుపు కలసిన మంచి  ఆయింట్మెంట్లు -ఎన్నో మార్కెట్ లో వున్నాయి. ఉదాహరణకు, వీకో టర్మేరిక్ లాంటివి.  అవి - చర్మ సౌందర్యానికి అని చెబుతున్నారు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం  నేను చూసాను.. సోరియాసిస్ వున్న వారు, యివి అన్నీ వొకే సారి వాడినా తప్పు లేదు. వాడి చూడండి. మీకు చక్కటి ఫలితం కనిపిస్తుంది.

యివి కాక, ఆయుర్వేదాలోనూ ,సిద్ధ వైద్యం లోనూ - చాలా మంచి మందులే వున్నాయి. ఉదాహరణకు - స్వామీ రాందేవ్ గారి వద్ద దొరికే మందులు , తై లాలూ బాగా పని చేస్తాయి. (కాయకల్పవటి తైలము, టాబ్లెట్లు , మహామంజుష్ట టాబ్లెట్లు లాంటివి). వీటన్నిటితో బాటు - టర్మరిక్, ఆలోవేరా  ఆయింట్మెంట్లు (విటమిన్.డీ కలసినవి ) తప్పక వాడండి. 

సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము - వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా - అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి  - చర్మం లోని రెండో  పొరని కూడా అది బాధించదు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

వీటిలో - మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని - అవి రెండూ వదిలేస్తే - నిజమైన రోగం ఏమీ బాధించదు -అనేది గుర్తుంచుకోవాలి.

నిజానికి - చాలా రోగాలకు మనలోని భయము, సిగ్గు - మిగతా వారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో వొక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన  బాధ ఏమీ వుండదు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యండి.  మీకు తప్పకుండా తగ్గుతుంది. తగ్గుతుందన్న  నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి. 

చాలా రోగాలు మనో జనితమైనవి. మనసుతోనే తగ్గించుకోగలిగేవి.

మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే వుందన్న నమ్మకంతో చెయ్యండి. గెలుపు మీదే .

ఈ రోగాలున్న వారికి ప్రక్క నున్న వారు -వీరికి అన్ని రకాలుగా ప్రోత్శాహం యివ్వాలి. ఈ చర్మరోగాలు, ప్రక్క నున్న  వారికి ఎవరికీ రావు. వీలైతే వారికి ఆయింట్మెంట్లు మీరే పుయ్యవచ్చు. అది చాలా మంచిది.

మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. యిది గొప్ప సూత్రం. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే  వుంది. దాంతోనే పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది. 

ధైర్యే , సాహసే, ఆరోగ్య లక్ష్మి. (అధైర్యే, భయే, అనారోగ్య ప్రాప్తి).


= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 





18, నవంబర్ 2012, ఆదివారం

సేవాలయ - శివాలయ - దేవాలయ - ఎందరో మహానుభావులు - వారికి, నా అభివందనాలు


సేవాలయ -  శివాలయ  - దేవాలయ 

సేవాలయా టీం  లోని వారు -మధ్యలో మురళి -వ్యవస్థాపకుడు 



ఇప్పుడు - నేను వుండే వూరి  పేరు తిరునిన్రవూరు . ఇది తమిళనాడులో చెన్నై - తిరుపతి  జాతీయ రహదారిలో, చెన్నై లో- చిట్టచివర వుంది.

మా వూళ్ళో , వొక బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల శివాలయము, మరొక   బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల విష్ణు ఆలయము వున్నాయి.

శివాలయానికి హృదయాలయ ఈశ్వర ఆలయమని పేరు. యిది  వొక గొప్ప యోగి తన హృదయంలో తన  కల్పన ద్వారా     మొదట నిర్మించాడట. ఆ తరువాత, వొక రాజు దీనిని  కట్టాడు. అదొక అందమైన కథ. విష్ణు ఆలయం  కూడా చాలా పురాతన ఆలయం. రెండూ - వేల సంవత్సరాల క్రితం కట్టినవే 

అవి రెండూ, ప్రసిద్ధ ఆలయాలే .

చాలా గొప్పవే.

కానీ మా వూళ్ళో - మరో గొప్ప ఆలయం వుంది. దాని పేరు సేవాలయ. 

అది వొక అనాథ శరణాలయం - అనాథలకోసం వొక మంచి పాఠశాల - వొక మంచి వృద్ధాశ్రమం - వొక గోశాల -  యిలా ఎన్నిటికో రూప కల్పన జరిగి, చాలా బాగా నడుస్తున్న దేవాలయమని చెప్పొచ్చు.  

17-నవంబరు -మా 34-వ పెళ్లిరోజు.

క్రిందటి రెండు సంవత్సరాలూ - మేం అక్కడికి వెళ్లి మాకు తోచిన డొనేషన్ యిచ్చేసి వచ్చాము.     మళ్ళీ , అప్పుడప్పుడు, డొనేషన్ ( పుట్టిన రోజు  లాంటి వాటికి)   యిస్తూ వుంటాను.

కానీ ఈ సారి, కాస్త మార్పు వుండాలని - అక్కడి పిల్లల తో కాస్సేపు గడపాలని అనుకున్నాము.

16 నాడు  డొనేషన్ యిచ్చేసి - 17 న  మేం  వస్తామని  చెప్పాము. చెప్పినట్లే, నేను, నా శ్రీమతి  12.20 మధ్యాహ్న సమయంలో - అక్కడికి వెళ్ళాము.

మొదట వృద్ధాశ్రమంలో - అక్కడి వయోవృద్ధులు, దాదాపు డెబ్భై మంది  భోజనం చేస్తూ వుంటే -వారితో  అక్కడ,  వారి జీవితాన్ని గురించి  ముచ్చటించాము. వారు - బయటి ప్రపంచంలో -దాదాపు ఎవరూ లేని వారు. ఏమీ లేని వారు. కానీ అక్కడ సంతోషం గా గడుపుతున్నారు. 

వారందరూ మమ్మల్ని ఆశీర్వదించితే - చాలా సంతోషమనిపించింది. 

వారి ఆశీర్వాదంలో - అది వారి హృదయాంతరాళం నుండి వస్తూ ఉందన్నది చాలా బాగా, స్పష్టంగా,  మాకు కనిపించింది. కొంత మంది అన్నం తింటూ వున్న చేతితో , లేచి, కొద్దిగా, ఆనందంతో వచ్చే కన్నీళ్ళతో, రెండు చేతులతో ఆశీర్వదించడం - ఎంతో హృదయాన్ని తాకే విధంగా వుంది.    

- గోశాలలో 70 ఆవులకు  పైగా వున్నాయి. వాటిల్లో - పాతిక భాగం పాలిచ్చే ఆవులైతే, ముప్పాతిక భాగం వట్టిపోయిన వృద్ధ ఆవులు. వాటినీ  బాగా చూసుకుంటున్నారు వాళ్ళు . సంతోషం అనిపించింది. ఆ ఆవులూ సంతోషంగా  కనిపించాయి .

సరే. అక్కడినుండి, పిల్లలను చూసేందుకు వెళ్ళాము. అది వారి భోజన సమయం. మేమూ వారితో పాటు కూర్చుని భోంచేశాము. నేను వారికి వడలు వడ్డిస్తూ, వారితో మాట్లాడాను. వారి పేర్లు, చదువుతున్న క్లాసు, ఎలా చదువుతున్నారో అని - అన్నీ అడిగాను. అందరినీ అడిగాను.

యల్  కే  జీ  నుండి 12 వరకు - అన్ని క్లాసుల పిల్లలూ వున్నారు.

మామూలు పిల్లలలో  వుండే డిసిప్లిన్ - కంటే అక్కడ చాలా ఎక్కువ - అని చెప్పొచ్చు. అక్కడే వుండి  చదువుకునే పిల్లలంతా   - తల్లీ-తండ్రీ  లేని వారే .దాదాపు 200 మంది.

బయటి నుండీ వచ్చే పిల్లలూ చాలా బీద కుటుంబాల నుండీ వచ్చిన వారే.  వారు దాదాపు వెయ్యి మంది.

హాస్టలు పిల్లలు అందరితో మాట్లాడాను. వారంతా - థాంక్సు చెబుతుంటే - తమాషాగా వుంది. 

యల్ కే జీ పిల్లలు, వారి అమాయకపు కన్నులతో మిమ్మల్ని చూస్తూ, ఉత్సాహంగా, మీకు థాంక్స్ చెబితే ఎలా  వుంటుంది? 12 వ క్లాసు పిల్లలలో వారి భవిషత్తు గురించి  కలలు కొంత మనం స్పష్టంగా చూడొచ్చు. సేవాలయ వారు - వారి కాలేజీ చదువుకూ సహాయం చేస్తారట. వుద్యోగం దొరికే వరకు రక రకాల సహాయం చేస్తారట.

మాకు  చాలా బాగా అనిపించింది.

తల్లీ-తండ్రీ  లేని పిల్లలు - అక్కడ సంతోషంగా వుండి - బాగా చదువుతున్నారు; నూటికి నూరు శాతం వుత్తీ ర్ణులవుతున్నారు - అంటే  సేవాలయ యాజమాన్యం బాగా పని చేస్తున్నట్టే కదా . ఎందరో  మహానుభావులు . నేను చేయని (లేని) పని అంత సమర్థంగా నిర్వహిస్తున్న -  వారికి, నా  హృదయ పూర్వక అభివందనాలు.  

పిల్లల శుభాకాంక్షలు , వృద్ధుల ఆశీర్వాదాలు అందుకోవడం - దేవుడు నేరుగా వచ్చి ఆశీర్వాదం యిచ్చినట్టే వుంది.

మరి దేవాలయంలో అయితే - దేవుడి ఆశీర్వాదం - అలా మన అనుభవంలోకి రాదు కదా.

దేశంలో -  ఏ వొక్కరూ భోజనం లేకుండా వుండకూడదు; చదువు లేకుండా వుండకూడదు . ఏ వొక్కరూ - అనాథలుగా  వుండాల్సిన అవసరం వుండకూడదు - అని నాకు మాత్రం స్పష్టంగా అనిపించింది.

మీరూ - నేనూ అనుకుంటే - యిది మనం చేయ గలం.

మరి చేద్దామా? 

సేవాలయా  ను గురించి  వొక విడియో ను మీరు క్రింద యిచ్చిన యు ఆర్ యల్  ను కాపీ చేసి  మీ ఇంటర్నెట్  ద్వారా చూడొచ్చు. వినొచ్చు .

http://www.youtube.com/watch?v=CuZeSQSZ2bc&feature=youtu.be

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 





 


1, నవంబర్ 2012, గురువారం

కొత్త రోగాలకు పాత మందులు - డెంగ్యూ వ్యాధి కి బొప్పాయ చెట్టు ఆకుల రసం - హృద్రోగాలకు అర్జున - ఎన్నో రోగాలకు, బలహీనతలకు ఆశ్వ గంధ


కొత్త రోగాలకు పాత మందులు 


ఈ మధ్య ఎన్నో కొత్త కొత్త రోగాలూ వస్తున్నాయి. కొత్త కొత్త మందులూ వస్తున్నాయి.

మనకు తెలిసిన వాటిలో  ప్రముఖం గా వుండే వైద్య విధానాలు - (1) అల్లోపతి (2) హోమియోపతి (3) ఆయుర్వేదం. 

యింకా ఎన్నో వున్నాయి. యునాని, చైనీస్  ఆకుపంక్చర్ లాంటివి. కానీ మన దేశంలో, బాగా ఉపయోగంలో వుండేవి పై మూడూ.

నేను - అన్ని విధానాలనూ , ఎంతో, కొంత ఉపయోగించే  వాడిని.

మూడూ కొన్ని, కొన్ని రోగాలకు ప్రత్యేక తరహాలలో ఉపయోగ పడతాయని నాకు అనిపిస్తుంది.

సర్జరీ కావాల్సిన పరిస్థితులలో, అల్లోపతి తప్పనిసరి.  అలాగే మరికొన్ని రోగాలకూ అల్లోపతి బాగా పనికొస్తుంది. ఉదాహరణకి, కుక్క కాటు, పాము కాటు, కొన్ని జ్వరాలు, టీబీ లాంటి వాటికి అల్లోపతి మంచిది.

కానీ - చాలా రోగాలకు, అల్లోపతిలో సరి అయిన మందులు లేవు.

 వాటిలో చాలా వాటికి ఆయుర్వేదంలో - చాలా మంచి మందులు వున్నాయి. కొన్నిటికి హోమియోపతి లో మంచి మందులు వున్నాయి.

ఆయుర్వేదం లక్షల ఏండ్ల అనుభవంతో వచ్చిన శాస్త్రం. మన దేశంలో పుట్టినది పెరిగినది. నా ఉద్దేశంలో తురుష్కుల , ఆంగ్లేయుల పాలన లేకుండా వుంటే   యిప్పటికి ఆయుర్వేదంలో, ఎన్నో పరిశోధనలు జరిగేవే. ఎన్నో రకాల ప్రక్రియలు వచ్చేవే .


యిప్పుడైనా - భారత ప్రభుత్వం వారు - ఈ శాస్త్రానికి బహుళ  ప్రాధాన్యత యిచ్చి, పరిశోధనలను ప్రోత్సహించ వలసిన అవసరం  ఎంతైనా వుంది.

ఈ మధ్య - నాకు వచ్చిన సమాచారాల ప్రకారం - డెంగ్యూ వ్యాధి కి అల్లోపతి లో పెద్దగా మందులు లేవు. కానీ, ఆయుర్వేదం ప్రకారం - బొప్పాయ చెట్టు ఆకుల రసం -రోజుకు రెండు ఆకుల రసం యిస్తే చాలు, వెంటనే - రక్తం లోని ప్లేట్లెట్ల సంఖ్య గణ నీయంగా పెరిగి, జ్వరం కూడా తొందరాగా వుపశమిస్తుంది.  

  నాకు వచ్చిన ఈ సమాచారాన్ని నేను నాకు తెలిసిన వారందిరికీ పంపించాను. వారిలో నాకు బాగా తెలిసిన వారింట్లో దీన్ని అమలు   చెయ్యడము  జరిగింది . చాలా సత్ఫలితాలు వచ్చినట్టు  వారి నాకు చెప్పడమూ జరిగింది. 

బొప్పాయ ఆకులు, పండ్లు 



అందు వలన నాకు తెలిసిన ఈ వైద్యాన్ని పాఠకులందరికీ  అంద  జేస్తున్నాను. అల్లో పతి  వైద్యం వద్దని అనడం లేదు. డాక్టర్ దగ్గరికి పోవద్దని చెప్పడం లేదు. తప్పకుండా వెళ్ళండి. కానీ, వొక ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడైన యాష్ చోప్రా గారిని కూడా అల్లోపతి మందులు రక్షింప లేకపోయాయి . కనుక  మన  దేశీయ వైద్యం, మన ప్రక్కనే దొరికే బొప్పాయి ఆకుల రసం త్రాగడం, మనల్ని రక్షిస్తే మంచిదే కదా. అందుకని రాస్తున్నాను.

అలాగే - వొక ఉపన్యాసంలో, స్వామీ రాందేవ్ గారు తిప్పతీగ రసం, డెంగ్యూ కు బాగా ఉపయోగపడుతుంది - అన్నారు. దీన్ని అమృతారిష్టము అని- టాబ్లెట్ల రూపంలో కూడా అమ్ముతారు.  యిది జ్వరం వున్న వారు తీసుకుంటే - మంచిది. అసలు, ముందుగా తీసుకునే వారికి  వ్యాధులు రాకుండా చేయగల సామర్థ్యం వుంది తిప్ప తీగకు. 

ఈ వైద్యాలు మీకు తెలిసిన అందరికీ చెప్పండి.

అలాగే - ఆయుర్వేదంలో - మరెన్నో అద్భుతమైన మందులు వున్నాయి. నాకు తెలిసిన వాటిలో " అర్జున" అన్న మందు వొకటి. హృదయానికి, అనేక రకాలుగా శక్తి  నిచ్చి, అనేక  హృద్రోగాలనుండి - కాపాడగల సామర్థ్యం వుంది "అర్జున" కు. 

హృద్రోగాలు వున్న వారైనా సరే , భవిష్యత్తులో - రావచ్చునేమో అన్న శంక వున్నా వారైనా సరే -  అలాంటి ఏ శంకా  లేని వారైనా సరే - "అర్జున" వాడడం చాలా మంచిది. 

నేను వాడుతున్నాను. నాకు తెలిసిన వారు చాలా మంది వాడుతున్నారు.  


అర్జున ఆకులు, పండ్లు, చెట్టు బెరడు 


యింటర్ నెట్ లో దీన్ని గురించి విస్త్మృత  సమాచారం వుంది. 

ఉదాహరణకు :



ఈ లింక్ క్లిక్ చేసి చూడండి ఇలాంటి మరిన్ని వున్నాయి. మీరు ఏ ఆయుర్వేద వైద్యుడిని అడిగినా చెబుతారు దీన్ని గురించి. - అయితే యిప్పుడు , దీని పై మరిన్ని పరిశోధనలు జరగడము, మరిన్ని సత్ఫలితాలు కనుగొనడమూ జరుగుతోంది. 

అలాంటిదే - మరొక దివ్యౌషధము -ఆశ్వ గంధ - అన్నది . యిది కూడా ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి ఉపకరించే  ఔషధం.  యిది, ఎన్నో, ఎన్నో రోగాలకు, బలహీనతలకు చాలా, చాలా బాగా ఉపయోగ పడే ఔషధం. యిదీ నేను వాడుతున్నాను. చాలా మంది వాడుతున్నారు.


ఆశ్వ గంధ చెట్టు బెరడు, ఆకులు, పండ్లు 


దీన్ని గురించి కూడా  యింటర్ నెట్ లో విస్త్మృత  సమాచారం వుంది. ఉదాహరణకు :



యిలా ఎన్నో దివ్యౌషధాలు ఆయుర్వేదంలో వున్నాయి. రోగాలు రాకుండా కాపాడేవి కొన్ని. దీర్ఘ రోగాలను కూడా పోగొట్టేవి కొన్ని. వీటికి - అల్లోపతి  మందులకున్న -సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. నిజానికి వొక రోగానికి తీసుకున్న మందు, మరెన్నో రోగాలకు కూడా పనికొస్తుంది. అయితే - -ఏదైనా  మోతాదు మించి తీసుకోవడం పనికి రాదు. మితంగా తీసుకుంటే - అమృతం. 

అమితంగా తీసుకునేది ఏదైనా   తప్పే కదా.

నాకు తెలిసిన వాటిలో, చాలా మంచివి అని నేను నమ్మే వాటిని - కొన్నిటిని యిక్కడ చెప్పాను.

యివన్నీ మనకు దొరికేవే. మంచి ఆయుర్వేద తయారీ కంపెనీలు తయారు చేస్తున్నవే. యింట్లోనూ - చేసుకో గలిగేవే.

ఆరోగ్యమే మహా భాగ్యం కదా.  

మీకు తెలిసిన వారికి చెప్పండి. ఎంత మంది ఆరోగ్యం బాగు పడితే  అంత మంచిది.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 








    

17, సెప్టెంబర్ 2012, సోమవారం

మతమూ - మానవత్వమూ

మతమూ - మానవత్వమూ 


మానవత్వం తెలియడానికి మతం అవసరమే లేదనిపిస్తుంది. మన సమకాలీన గురువు వొకాయన అంటారు - మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...

ఈ పనులు మీరు చేస్తారా? చెయ్యరు గాక  చెయ్యరు. ఎందుకు? అది మీ వేలు గనుక. అందులో మీరు వున్నారు గనుక. అది గాయపడితే మీరు గాయ పడ్డట్టు.అది బాధ పడితే మీరు బాధ పడ్డట్టు. అది  మీది. అది మీరు - అన్న భావన మీలో వుంది గనుక.

అదే మరొకరి వేలును గాయ పరచమంటే - మనలో - వొక్కొక్కరి స్పందన వొక్కొక్క రకంగా వుంటుంది. వొకరు ససేమిరా -నేను చెయ్యను; చెయ్యలేను.అంటారు. మరొకరిని శారీరకంగానో, మానసికంగానో, హింసించలేని  సున్నిత మనస్కులు యిప్పుడూ మన దేశంలోనూ, చాలా దేశాల్లోనూ - వున్నారు. అంటే - మానవత్వం వున్న వారు ఎంతో మంది వున్నారు.

సరే.  మరో రకం వారు - తమ మిత్రులనైతే , తమ వారినైతే హింసించలేరు గానీ - తమ శత్రువులనో, తమ వారు కాని వారినో  హింసించడానికి   ముందుకొస్తారు. వారిలోనూ, రక రకాల మనుషులున్నారు. కొంత మంది ఉత్త మాటలతో అయితే  హింసిస్తారు గాని - చేతల ద్వారా  హింసించలేరు.

కొంత మంది - ఎవరైనా మరొకరిని పంచ్ బాగ్ లాగా కొడుతూ వుంటే - చూసి ఆనందిస్తారు. సినిమాల్లో నైతే - విలన్లు అలాంటి పంచ్ బాగ్ లు గా మారి - హీరో చేతిలో దెబ్బలు తింటూ వుంటే - వాడిని యింకా కొట్టు, యింకా కొట్టు అనుకుంటూ వుంటాము. ఇక్కడ, మనకు తెలియకుండానే, మనలో - హింసను ఆనందించే ప్రవృత్తి ఏర్పడుతూ వుంటుంది. అదే - హీరోను కొడుతూ వుంటే - సహించలేము.

మన వారికి ఏదైనా ఆపద వస్తే - విలవిల్లాడి పోతాం. కాని - ఆపద వచ్చింది మన వారికి కాదు - అనిపిస్తే - నిశ్చింత వచ్చేస్తుంది మనలో. మన వారికి గోరు కాస్త తగిలితే - మనసులో - విల విల. కానీ పరాయివాడి ప్రాణం పోయినా - మన మనసులో ఏమీ లేదు.

నిజమా, కాదా?

కానీ,  మనలోనే కొందరు, ఎక్కడ, ఏ ఆపదదొచ్చినా - మూటా, ముల్లె సర్దుకుని అక్కడికెళ్ళి - అందరికీ సహాయ పడుతూ వుంటారు. అలాంటి ఎన్నో సంస్థలు వున్నాయి.

అటువంటి - మనస్తత్వం అందరికీ వుంటే - దేశం నందన వనం అయిపోదా? స్వర్గం గా మారిపోదా? మరి అటువంటి మనస్తత్వం మనలో ఎలా వస్తుంది? మన విద్యా విధానం ద్వారా వస్తుంది. గొప్ప గురువుల సాన్నిధ్యంలో వస్తుంది.

నాకు తెలిసి అటువంటి గురువులు మన దేశంలో చాలా మంది వున్నారు. కానీ, కొంత మంది - వారి దగ్గరకు వెళ్ళకుండానే, వారి ప్రబోధాలు వినకుండానే, వారు చేసే ప్రతి పనీ గమనించకుండానే   - వారిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ వుంటారు.

తాము చేయలేని పని వారు చేస్తున్నారు. అదెలా సాధ్యం. యిందులో, వారి స్వార్థం వుండనే వుంటుంది - వారు తమకంటే - ఏ విధంగానూ గొప్ప వారు అవడానికి వీలే లేదు -అనే భావన వుంటుంది. కానీ అటువంటి గురువుల సాన్నిధ్యానికి వొక సారి వెడితే - యిటువంటి వారు మారడానికి - అవకాశం వుంటుంది.

సరే. ఇలాంటి వారు రక రకాలుగా వున్నారు. 

జీవితంలో, మనిషి - వికాసాత్మకం గానూ, నిర్మాణాత్మకం గానూ వుండొచ్చు . లేదా, విమర్శకుడిగా మిగిలి పోవచ్చు. అందులోనూ  - వికాసాత్మక విమర్సకుడి గానూ వుండొచ్చు. లేదా, వినాశాత్మక విమర్శకుడిగానూ  వుండి  పోవచ్చు.

మన దేశంలో ముఖ్యంగా - నిర్మాణాత్మకతను  మనలో పెంచే విద్యా విధానం రావాలి . ఇప్పుడున్న విద్యావిధానం - అటువంటిది కాదని నిశ్చయంగా చెప్పొచ్చు.అలాగే - సహృదయంతో, వికాసాత్మకంగా చూడగలిగే విమర్శనా దృష్టి కూడా కావాలి.మన ఆలోచనా విధానమే మారాలి.

మరి -నకారాత్మక దృష్టి , నకారాత్మక స్వభావం కొందరిలో - మరీ మితి మీరి పోతుండడం  కూడా మన దేశంలో వుంది. మనం చూస్తూనే వున్నాం. కావాలని, రైళ్ళు  పడగొట్టడం, బస్సులు కాల్చడం, మనుషులను హింసించడం, చంపడం, ఆడవాళ్లనైతే ,అత్యాచారాలకు, సామూహిక అత్యాచారాలకు గురి చెయ్యడం - ఈ మధ్య ఎక్కువై పోతూ వుంది. నా వుద్దేశంలో యిందుకు ప్రధాన కారణం విద్యా విధానం లోని లోపాలే.

మరో కారణం సినిమా , టీ.వీ ల ద్వారా యిటువంటి హింసను -ముఖ్యంగా హీరో ద్వారా హింసను -ఎక్కువగా ప్రోత్సహించడం.  అశ్లీలత కూడా ఈ రోజుల్లో చాలా సరిహద్దులు దాటింది.

కాకపోతే - మన దేశం - మరి కొన్ని యితర దేశాలతో పోల్చి చూసుకుంటే -  కొంత మెరుగేనని చెప్పొచ్చు.

మనం చూస్తున్నాం కదా - మగ వాళ్ళు చేసే నేరాలకు ఆడ వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపుతూ దాన్ని ఆనందించే ప్రవృత్తి యింకా కొన్ని దేశాలలో వుంది. మతం పేరిట మన దేశంలో కొంత అంటరానితనం మాత్రం వుంది - కానీ - కొన్ని దేశాలలో - క్రూర మృగాల లాగా, మిగతా మతాల వారిని - హింసించడం, తమ మతంలో చేర్చుకోవడానికి బలాత్కారం చెయ్యడం - తత్ ఫలితంగా వారు దేశాంతరాలకు పోవడం జరుగుతూనే వుంది.

మతం పేరిట ఏదేదో జరుగుతూ వుంది. ఎన్నెన్నో జరుగుతూ వుంది. చాలా మందిలో  - రావాల్సిన మంచి మార్పు  రావడం లేదు.

అన్ని మతాల లోనూ - కొంత మంది మంచి వారూ వున్నారు. కొంత మంది చాందస వాదులూ వున్నారు.మంచి వారి వొక్కటిగా చేరితే - అన్ని దేశాల వారూ, అన్ని మతాల వారూ హాయిగా వుండొచ్చు.

అది జరగక పోతే - ఛాందస వాదుల ద్వారా - మానవత్వం మంట గలిసి, రాక్షసత్వం పెరగడం ఖాయం.

చాందస వాదులు మారాలంటే - ఎలా? ఆయా మతాల లోని మంచివారిద్వారానే - అది జరగాలి.  చెడును ప్రోత్సహించకపోయినా - చెడుని చూసీ చూడనట్లు వుంటే - చెడు పెరగడం ఖాయం. మన పొరుగు దేశాలలో అది జరుగుతుందో, లేదోచెప్పలేం . కానీ, మన దేశంలో - ఈ మార్పు రావాలి. రావచ్చు.వస్తుందనే నమ్మకం కలుగుతూ వుంది.

మతాలలో కూడా -గణనీయమైన మార్పులు రావాలి. మతంలో ఎంతో మంచి వుంది. కానీ- కొంత చెడూ వుంది. కొన్ని అమానుషమైన అలవాట్లూ ఉనాయి. 

మా మతమే గొప్ప - మా నాయకుడే గొప్ప -మా గ్రంధమే గొప్ప అనుకుంటే - మార్పు ఎప్పుడూ రాదు.

ఈ గంధాలన్నీ - వొక కాలంలో - ఆ కాలానికి తగినట్టు చెప్పబడ్డవి; రాయ బడ్డవి. -అందులోనూ  కొన్ని మాత్రం నిత్య సత్యాలే. వొప్పు కుంటాను. కొన్ని - కాలానుగుణంగా  మారాలి.

అందులో వొకటి - హిందు మతానికి -సంబంధించినది  - జాతి వివక్షత, అస్పృశ్యత. యిది మారుతూ వుంది కానీ - యింకా ఎంతో వేగంగా - అందరికీ నచ్చేటట్టుగా  మారాలి. 

మరొకటి మిగతా మతాలకు -మనకూ మధ్య వున్న సంబంధాలకు సంబంధించినది. మిగతా వారి వారి మతాలకు సంబంధించిన  విషయాలను నేను ప్రస్తావించను.

వొకటా మా మతంలో చేరండి - లేదా - మీరు నరకానికి వెళ్లి పోతారు - అన్నది హాస్యాస్పదమైన వాదం.యిందులో పెద్దగా వాదించి తెలుసుకోవలసిన సత్యం ఏమీ లేదు. కొద్దిగా, కళ్ళూ మనసూ తెరిచి చూస్తేనే చాలు - యిట్టే - అర్థమై పోతుంది.  

ఈ మతాలు వచ్చిందే 2000 ఏళ్ళ క్రితం. అంతకు క్రితం మంచి వాళ్ళు ఎంతో మంది వున్నారు కదా. వాళ్ళు ఎవరూ స్వర్గానికి వెళ్ళ లేదా? 

అలాగే - భారత దేశంలో కూడా, కృష్ణుడు లాంటి దేవుడి అవతారాలు 5000-6000 క్రితం వచ్చారంటే - గీత లాంటి   - గొప్ప సందేశాలు - అందించారంటే   -  ఎందుకు నమ్మక పోవడం? అందులో అంతగా నమ్మక పోవడానికి ఏముంది?

అలాగే - విగ్రహారాధన అంటే - ఏమిటో - అసలు తెలుసుకోకుండా - దీన్ని విమర్శించే  వాళ్ళు చాలా మంది  వున్నారు. విగ్రహారాధన చేసే వారిని తెగ కోసి  చంపితే మాకు స్వర్గం వస్తుందనే వారూ వున్నారు.

హిందు తత్వంలో కూడా - దేవుడు నిరాకారుడే అని ఎన్ని సార్లు చెప్పలేదు? కానీ - తన భక్తుల కోసం - దేవుడు - వారు కోరుకున్న రూపాల్లో వస్తాడని చెప్పడమే యిది .  అంతే కాక - పరి పరి విధాలుగా పోయే  మనస్సును మొదట వొక చోటికి చేర్చడమే  యిష్ట దేవతా విగ్రహాల లక్ష్యం.

ఆ తరువాత  నిరాకారుడైన దేవుడు. ఆ దేవుడి ఆరాధన.

ఆ తరువాత వుపనిషద్ వాక్యాల ప్రకారం  -అహం బ్రహాస్మి - నేనే బ్రహ్మమును - అనేదే నిత్య సత్యము. యివన్నీ తెలుసుకోకుండా -  పర మతాల్ని విమర్శిస్తే - సఖ్యత ఎలా కుదురుతుంది. విశ్వ శాంతి ఎలా వస్తుంది?

యిదైనా - ఎందుకు చెప్పాల్సి వస్తూ వుంది? నన్ను ఏం చేసినా తమకు పరవాలేదు - అంతకు మించి స్వర్గం కూడా వస్తుంది - అని కొంత మంది చాందస వాదులు అనుకోవడం - నేను వొప్పుకోలేను కదా. అందుకే. 

ఈ చాందస వాదాన్ని ఎవరు అరికట్టాలి . ఆయా మతాల లోని మంచి వాళ్ళే అరికట్టాలి. వారు అందుకు - ముందుకు వచ్చిన నాడు - చాందస వాదులు అణిగి పోతారు.

హిందూ  సంస్కృతి ప్రకారం - సర్వే జనాః సుఖినో భవంతు . మనమందరూ బాగుండాలి. అంతే 

మొదట చెప్పిన వాక్యాన్ని మరో సారి గుర్తు చేసుకుందాం....మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...మీరు చేస్తారా? చెయ్యరు కదా?  అలాగే. మిగతా వారినీ చూడండి. అందరూ దేవుడి బిడ్డలే. అందరి దేవుడూ వొకడే.  దేవుడి పేర్లు మనం పెట్టుకొన్నవి. ఆయన నా పేరు యిదీ - అని చెప్పిన దాఖలాలు ఏమీ లేవు.

ముందు చెప్పినట్టు - ప్రతి మతం లోనూ - కొంత మంచి, కొంత చెడూ - రెండూ వుంది. 

ప్రతి మతం లోని మంచి స్వీకరిద్దాం. ప్రతి మతం లోని చెడును గుర్తించి వదిలేద్దాం.


 =మీ 

 ఉప్పల దడియం విజయామోహన్  
 





29, ఆగస్టు 2012, బుధవారం

చీకటి వెలుగుల ఆట - అహంకారం, మమకారాల పై మన పోరాటం - శ్రీరాముడు శ్రీకృష్ణుడు తమ జీవితాల్లో నిజంగా చేసింది ఏమిటి?-



మన నిజమైన పోరాటం  ఎవరిపై ?

మన సంస్కృతి  లక్షల సంవత్సరాల నుండి వస్తున్న సంస్కృతి.  


వేదాలు ఎప్పుడు వచ్చాయో, ఎలా వచ్చాయో, ఎవరికీ తెలీదు.



ఆందులోని ఉపనిషత్తులు, ఆరణ్యకాలు లాంటివి  వొక్కటొక్కటి ఎప్పుడు వచ్చాయో - వాటి కర్త ఎవరో - ఎవరికీ తెలీదు . 



నా వరకు నేను - శంకరాచార్యుల రచనలు, ఉపనిషత్తుల సారము - కొంత వరకు  చదవడం వినడం చేసాను - గత నాలుగు సంవత్సరాలలో .




మహానుభావులయిన  గురువుల సమ్ముఖంలో వాటి లోతుపాతులను గురించి వినడం జరిగింది. 


మన సంస్కృతి - చాలా శాస్త్రీయమైన - సైంటిఫిక్ అయిన - సంస్కృతి అని  మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. అసలు లోపాలే లేవని నేను చెప్పను. ఏదైనా - కాలం మారే కొద్దీ, కొంత మార్పు చెందాలి. మన సంస్కృతి కూడా, శ్రీకృష్ణుడి కాలం వరకు మార్పులు, చేర్పులు, కాలానుగుణంగా, పొందుతూనే వుంది. శ్రీకృష్ణుడి భగవద్ గీత - ఈ మార్పులు, కూర్పులలో - వొక అంతర్గత భాగమే. 

భారత కాలంలోనే వ్యాసుల వారు - వేదాలను, పురాణాలను - ఎంతో సంస్కరించడము  జరిగింది. వ్యాసుల వారి తల్లి - సత్యవతి అనబడే యోజనగంధి. ఆమె పూర్వపు పేరు, మత్స్య గంధి . మత్స్య కారుల వంశస్తురాలు.  కానీ- ఆమె వొక వైపు మహా గొప్ప వాడై న వ్యాస మహర్షి పుట్టుకకు, మరొక వైపు, పాండవకౌరవ -వంశాలకు  మూల కారణం అయింది. అది ఆ కాలం.


మనిషికి వుండవలసిన గుణాలేవి; వుండకూడని గుణాలేవి - మనిషికి నిజంగా కావలసినది ఏది; వద్దన్నది ఏది - లాంటి విషయాలపైన - ఎంత సుదీర్ఘ  చర్చ జరిగిందో - అది మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్ గీత లాంటివి  చదివి అర్థం చేసుకుంటే - తెలుస్తుంది.

ఉదాహరణకు - ముఖ్యంగా వుండ కూడని రెండు గుణాలు - అహం; మమ - అంటారు. అంటే అహంకారం; మమకారం. ప్రస్తుతానికి - ఈ రెండింటిని గురించి కొద్దిగా విశ్లేషణ చేద్దాం. 

అహంకారం - అంటే, నేను,నావి,  నాకే -అనే భావం. 

నేను గొప్ప -అనే భావం లో, నేను కాని వారు, నాకంటే  తక్కువ - అనే భావం -మిళితమై వుండనే వుంటుంది.అది - తననూ నాశనం చేస్తుంది. చుట్టూ వున్న వారినీ నాశనం  చేస్తుంది. ఆంగ్లం లో దీన్ని - ఈగో -అని చెప్ప వచ్చు.   

వొక సారి, స్వామి సుఖ బోధానంద గారు -  "ఈగో" అనే పదానికి - ఎడ్జింగ్ గాడ్ అవుట్ -అంటే - లోనున్న దేవుడిని బయటకు గెంటేయడం -అని అర్థం - అని చాలా అందమైన నిర్వచనం చెప్పారు.

మీ లోపల అప్పుడు మీరు మాత్రమే వుంటారు.మరెవరికీ చోటు లేదు. దేవుడికి కూడా లేదు. మీలో ఎవరి ఆలోచనైనా వస్తే - దేవుడి ఆలోచన వచ్చినా సరే - వారు. మీ స్వార్థానికి ఎలా ఉపయోగ పడతారనే విషయానికోసమే అయి వుంటుంది . మీరు మాత్రమే బాగుండాలి;మిగతా వారు - ఎలా పోయినా ఫరవా లేదు -అనే భావన పెరిగి పోతుంది. 

అహంకారానికి - వొక గొప్ప ఉదాహరణం -రావణాసురుడు.   రావణుడికి  తానూ, తన సుఖం తప్ప - మిగతా ఏదీ గొప్ప కాదు. అందులో వొక భాగంగానే - సీతను ఎత్తుకు పోవడం. 

వొక్క సీతపై మాత్రం కామం రాలేదు రావణుడికి.  మహా కవులు  అంటారు - పార్వతీ దేవి పై కామం తో శివుడినే నువ్వెంత అన్నవాడు  రావణుడు. అందుకు ఫలితం అనుభవించాడు. కానీ అహంకారం నిండిన రావణుడు వూరికే  వుండలేడు కదా. నన్ను మించిన వాడు లేడని గర్వం. వొక సారి తన అన్న గారైన కుబేరుడి కోడలు, రంభనే-   బలవంతంగా చెరిచాడు.  నువ్వు నాక మామ గారు, తండ్రి లాంటి వాడు అని ఎంత మొత్తుకున్నా వినలేదు రావణుడు .అందుకు, కోపంతో, ఆమె భర్త నలకూబరుడు - శాపం పెట్టాడు. అలాగే - వేదవతి అనే - తపస్సు చేసుకుంటున్న కన్యను చెరచ బోయి - ఆమె శాపానికీ గురి అయ్యా డు. అయినా, అహంకారం పోలేదు.

ఎంతోమంది ఆడవారిని యిలా బలవంతంగా ఎత్తుకొచ్చిన వాడు రావణుడు. ఎంతో మంది ఋషులకు, రాజులకు, దేవతలకు, ప్రజలకు - ఎన్నో కష్టాలను తెచ్చి పెట్టిన వాడు రావణుడు. తాను సీతను అనుభవించడానికి - తన వాడై న మారీచుడి ప్రాణాలను కూడా పణం గా పెట్టిన వాడు రావణుడు. మారీచుడు వద్దు మొర్రో అంటున్నా, వినక - రాముడి చేతుల్లో చస్తావో లేదో కాని - నా పని చేయక పోతే, నా చేతుల్లో చస్తావు, అని బెదిరించిన వాడు.

సీత కోసం విభీషణుడిని కూడా ఫో అన్న వాడు. కుంభకర్ణుడిని, తన కొడుకులను, తన వంశంలోని అందరినీ  పణం గా పెట్టి - ఏ  మాత్రం బాధ పడని వాడు. సీత దక్క లేదే అన్న బాధ, రాముడిని జయించ లేదే -అన్న బాధ పెద్దది  కాని - యింత  మందిని  పోగొట్టుకున్నామే అన్న బాధ పెద్దది కాదు  రావణుడికి.

ఏదో సినిమాల్లో -చూసి రావణుడు మహా మంచి వాడు అనుకుంటే - చాలా తప్పు . అంటే - రావణుడిలో మంచి గుణాలే  లేవని  కాదు

గొప్ప  శివ భక్తుడు. కానీ శివుడి భార్యనే - లోక మాతనే, కామదృష్టితో చూసిన వాడు.

వేదాలన్నీ చదివిన వాడు. కానీ - వేదాలలోని మంచి నంతా  వదిలేసి - అవి, వద్దు, వద్దు అనే - కామక్రోధాదులనే  అంతః శతృవులకు - పూర్తిగా లోబడిన వాడు. వర గర్వితుడు. నన్ను మించిన వాడు లేదని విర్ర వీగిన వాడు. మొత్తానికి ప్రపంచంలో మహా అహంకారిగా పేరు పొందిన వాడు. కులము లో - వొక అహంకారి -వుంటే  కులమంతా నాశనమవుతుందని -చెప్పడానికి, వొక గొప్ప ఉదాహరణం,  రామాయణం లోని రావణుడు.

అహంకారం లేని, పరోపకారిగా, వొక వైపు రాముడు; మహా అహంకారిగా, మరోవైపు రావణుడు. వీరి మధ్య కాదు -యుద్ధం  ; ఈ గుణాల మధ్య యుద్ధం. అదీ రామాయణం. అహంకారం ఎంత చెడుపు చేస్తుందో , అది - చెప్పడమే రావణుడి పాత్ర లక్ష్యం. అహంకారం లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలి మనలో అహంకారం వుందో, లేదో ఎలా తెలుసు కోవడం అన్న దానికి నిదర్శనం రాముడు .  

సరే. మన విషయానికొస్తే - అహంకారం మనలో  వుందో లేదో ఎలా తెలుసు కోవడం?

1. మీరు  మగ వారైతే - మీ తల్లితండ్రులను ఎంత మాత్రం గౌరవిస్తున్నారో - మీరే తరచి చూడండి. మీరు వారికేం చేస్తున్నారు.  వారు మీ పట్ల ఎంత సంతోషంతో వున్నారు - అన్నది మొదటి అంశం. మీరు ఎప్పుడైనా - వారికి నమస్కారం చేసి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రయత్నం చేసారా? మీకు - చేయాలని అనిపించలేదంటే - మీలో అహంకారం దాగి ఉన్నట్టే .

2. మీరు ఆడ వారైతే -  పెళ్ళైన వారైతే - యిదే విషయం - మీ అత్త మామల పట్ల వర్తించుకోవాల్సి వుంటుంది. అదేమిటి. మేమూ మా తల్లి తండ్రుల పట్లే - విధేయంగా - వుంటాము అంటే - నేను చెప్పేదేమీ లేదు.సహ ధర్మ చారిణి, బెటర్ హాఫ్ , గృహ లక్ష్మి -అన్న పదాలు - మీరు ఎంతగా భర్త కుటుంబంలో కలిసిపోతారో -  దానిని బట్టే వుంటుంది.  నిజానికి  భార్యాభర్త లిద్దరూ -అత్తమామలను, తల్లితండ్రులను కూడా  గౌరవించవలసిన వారే. కానీ భార్య ఎంతగా, భర్త కుటుంబంలో కలిసి పోతుందో - అంతగా , ఆమె - రెండు కుటుంబాలకూ  గౌరవ కారణం అవుతుంది. యిది జరగని చోట  -ఆమెలో  అహంకారం వున్నట్టు లెక్క 

3. మీ భార్యకు - కాలో, చెయ్యో తగిలింది , లేదా బెణికింది - అనుకోండి. - నేనేమిటి, తన కాలును తాకడం ఏమిటి - అని మీరు (మగ వారు) -అనుకుంటే, మీలో బాగా అహంకారం ఉన్నట్టే లెక్క.   ధర్మేచ, అర్థేచ, కామేచ - అన్నిటిలో సహధర్మ చారిణి అయిన భార్యను, అన్ని రకాలుగా కాపాడ వలసిన, సంతోష పరచ వలసిన కర్తవ్యం పురుషుడికి తప్పకుండా వుంది. అది చెయ్యని నాడు - అది అహంకారానికి గుర్తే. అలాగే భార్య కూడా - భర్తకు, ఏదైనా సరే -  చెయ్యాలి. నా భర్త (లేదా నా భార్య)  ఆరోగ్యం, సంతోషం, నా పూర్తి బాధ్యత - అని యిద్దరూ - అనుకుంటేనే -వారిలో  అహంకారం లేనట్టు లెక్క. నేనెందుకు చెయ్యాలి - అనుకునే వారిలో అహంకారం వున్నట్టు లెక్క.

4. గురువుల పట్ల, వయోవృద్ధుల పట్ల, జ్ఞాన వృద్ధుల పట్ల- గౌరవం వుండాలి. మనిషికి, ఏ వయసులో నైనా - వొక గురువు వుండాలి. ఎవరినో వొకరిని గురువుగా అంగీకరించి - వారి మాటే వినే వారికి - అహంకారం కాస్త దూరంగా వుంటుంది.

5. నాకు తెలుసు - నాకే తెలుసు - నాకు అన్నీ తెలుసు - అనే భావనలు వస్తూ వుంటే - అహంకారం పెరుగుతూ పోతుంది. నాకు తెలియనిది ఏది, అది నేను  ఎలా తెలుసుకోవాలి  అనుకునే వారికి; తనకు తెలియదు అనే విషయాల్ని -సంకోచం లేకుండా, అంగీకరించే వారికి, అహంకారం దూరంగా వుంటుంది. మన దేశంలో కొంత మంది సినిమా హీరోలు, రాజకీయ వేత్తలు, ఇలాంటి వారు - అన్నీ తమకు తెలిసినట్టు,  ఏ విషయం పైన ప్రశ్నలు అడిగినా - టక్కు టక్కు మంటూ  జవాబులు చెప్పడం  మనం చూడవచ్చు. తెలియనివి, తెలియదని చెప్పడానికి నామోషీ . అ నామోషీ వెనుక అహంకారం తప్పకుండా వుంటుంది.

6. నాకు తెలియదు - అని నేను అంగీకరించనంత వరకు -  మరింత తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యను. ఆ అవకాశం నాకు పోతుంది. నిజంగా తెలిసిన వారు, నాకు దూరంగావెళ్ళుతూ  వుంటారు.  యిది, మన జీవితంలో -జరుగుతూ వుంటుంది . కానీ, మనకు తెలియదు. అర్థమూ కాదు. అహంకారం మహిమ అలా వుంటుంది. మన శ్రేయోభిలాషులను మనకు దూరం చేస్తుంది. మూర్ఖులను, స్వార్థ పరులను చుట్టూ చేరుస్తుంది.

యిలా యెన్నైనా  చెబుతూ పోవచ్చు. ప్రయత్నం చేస్తే , మనలో  అహంకారం వుందా, లేదా అనేది - యిట్టే తెలిసి పోతుంది.

సరే. అహంకారానికి విరుగుడు ఏమిటి? ఏది వుంటే అహంకారం వుండదు?

చాలా, చాలా సులభమైన  ప్రశ్న యిది.

ప్రేమ వున్న చోట స్వార్థమూ వుండదు; అహంకారమూ వుండదు.

అహంకారం స్వార్థాన్ని మాత్రమే కోరుకుంటుంది. ప్రేమనిస్స్వార్థమైనది. ప్రేమకు యివ్వడమే తెలుసు కానీ - అడగడము, దాచడము,  స్వార్థం - ఇలాంటివి తెలీదు.

నాదీ నీదే, నీదే నీదే - అనేది ప్రేమ. నీదీ నాదే.నాదీ నాదే  - అనేది అహంకారము,స్వార్థము. 

ఈ రెండింటి  మధ్య కొంత అహంకారము, కొంత ప్రేమ, కొంత సంశయము - వీటితో కొట్టుకులాడుతుంటారు - చాలా మంది.  ప్రేమంటే ఏమిటో  తెలిసి ; నిజంగా దాన్ని అనుభవించిన నాడు - అహంకారం  పూర్తిగా పోతుంది.



జ్ఞానము రెండవది . జ్ఞానము వున్న చోట కూడా అహంకారం వుండదు.

వొక సారి చీకటి  దేవుడి దగ్గరకు వెళ్లి - వెలుగుపై  ఫిర్యాదు చేసిందట. నేను ఎక్కడకు వెళ్ళినా, ఈ వెలుగు, నన్ను తరిమి కొడుతూ వుంది. దాన్ని కాస్త ఆపి, నన్ను కూడా దానికి సమంగా వుండ నివ్వండి, అని.  సరే, నేను కనుక్కుంటానులే, నువ్వు,వెళ్ళు అన్నాడు దేవుడు. వెలుగును పిలిచి అడిగాడు - చీకటి యిలా నీపై ఫిర్యాదు చేసింది - అని.

వెలుగు ఆశ్చర్య పోతూ అంది. నేనెప్పుడూ  చీకటిని తరమనేలేదు. కనీసం చూడనే లేదు. అయినా మీరు చెప్పారు కాబట్టి, చీకటి ఎక్కడుందో,చూసి, క్షమాపణ అడుగుతాను -అనింది. ఆ రోజు నుండి, ఈ రోజు వరకూ, వెలుగు, చీకటిని వెదుకుతూ వుంది. కానీ చీకటి, వెలుగుకు కనిపించడం లేదు. అలాగే. చీకటి మాత్రం, వెలుగును చూసి భయపడి పారిపోతూనే  వుంది కానీ -  ఎదుట పడటం లేదు.

జ్ఞానం కథ యింతే. జ్ఞానం వచ్చిన వెంటనే - అహంకారం మాయమవుతుంది. అది జ్ఞానం వున్న చోట వుండ  జాలదు. కాక పోతే - సగం తెలిసి,సగం తెలియకుండా వున్న వారిలో - వారి సగం తెలియని తనం లో దాక్కుని వుంటుంది. నాకు - యిది తెలియదు, నేను యిది తెలుసుకోవాలి  అన్న జ్ఞానం వస్తే చాలు - అహంకారం మరి వుండలేదు;  పారిపోతుంది.

జ్ఞానమూ అహంకారాన్ని పారద్రోలుతుంది. ప్రేమ కూడా అహంకారాన్ని పారద్రోలుతుంది.

నిజానికి - జ్ఞానమున్న చోట ప్రేమ వుండనే వుంటుంది. అలాగే - ప్రేమ వున్న చోట - జ్ఞానం కూడా - అంతర్గతంగా వుండనే వుంటుంది. - ప్రేమకు జ్ఞానం ఎవరూ చెప్పకుండానే - తెలిసి పోతుంది. ఈ రెండింటిలో  - ఏది మీలో (కాస్త ఎక్కువగా) వున్నా సరే  - మీలో అహంకారం వుండదు.

అహంకారానికి ప్రతీక రావణుడైతే - మమకారానికి ప్రతీక ధృత రాష్ట్రుడు. భారత యుద్ధానికి  ముఖ్య కారణం  ధృతరాష్ట్రుని  మమకారమే. దుర్యోధనుడు చిన్నతనం నుండీ చేసిన చెడ్డ పనులను - దేనినీ ధృతరాష్ట్రుడు  వారించ లేదు.

మమకారము అంటే - ప్రేమ అని మనం సాధారణంగా అనుకుంటూ వుంటాము. కాదు. రెండింటికీ అంతరం వుంది. ముందే అన్నాం - ప్రేమలో స్వార్థం వుండదని. ప్రేమ -ఎప్పుడూ  చెడును ప్రోత్సహించదు.

మమకారమంటే - నా  వారు మాత్రమే బాగుండాలి - అనే భావన.  మిగతా వారు ఎలా పోయినా ఫరవాలేదు.

భగవద్ గీత అంతటికీ -ధృతరాష్ట్రుడు మాట్లాడే మాట - వొక్క మొదటి శ్లోకం మాత్రమే. ఈ  శ్లోకం మమకారానికి ప్రతీకగా చెబుతారు.

 నా వాళ్లైన కౌరవులు, వారు (పాండవులు) ఏమేమి చేస్తున్నారో, చెప్పు సంజయా -అని అడుగుతాడు. కౌరవులేమో - నా వాళ్ళు.   పాండవులకు - నా వాళ్ళు అనే పదం వర్తింప జేయ లేదు ధృతరాష్ట్రుడు.  ధృతరాష్ట్రుడి అంధత్వం - కళ్ళది కాదు , మనసుది. మనసులోని మమకారానిది.  మమకారానికి  కళ్ళు  లేదు. అది గ్రుడ్డిది. తన వాళ్ళు - అనుకునే వాళ్ళకోసం -మిగతా వారికి ఎంత అన్యాయమైనా చేయడానికి - ప్రోత్సహిస్తుంది.  నిజమైన ప్రేమ వెనుక జ్ఞానం వుంటుంది. అది అన్యాయాన్ని ప్రోత్సహించదు.

దుర్యోధనుడిది అహంకారం. ధృతరాష్ట్రుడిది, గాంధారిది - మమకారమనే గ్రుడ్డి తనం. రెండూ వినాశనానికే  దారి తీస్తాయి. 

మనం  వొక కథ వినే వుంటాం. వొక కొడుకు ప్రక్క నింట్లోని చెట్లో - పళ్ళు కాజేస్తాడు. వాళ్ళమ్మ - ఎవరికీ చెప్పకు, అని  కొడుకును తినమంటుంది . కొడుకు మరో రోజు - కూరగాయలు తస్కరిస్తాడు. అప్పుడూ తల్లి ఏమీ అనదు. ఆ కూరగాయలను  వండి పెడుతుంది . స్కూల్లో - ప్రక్క పిల్లల వస్తువులు కాజేస్తాడు.అప్పుడూ అంతే .


యిలా, తల్లి మమకారంతో, ప్రోత్సాహంతో పెరిగిన కొడుకు గజదొంగ గా  తయారవుతాడు. ఎవరికీ చిక్కడు అప్పుడూ అంతే . తల్లికి కొడుకును ప్రోత్సహించడమే  పని. వొక సారి  హత్య చెయ్యాల్సి వస్తుంది. ఎప్పుడో వొక సారి పట్టు బడతాడు.  ఉరిశిక్ష పడుతుంది. తన కడపటి కోరిక ఏమిటని - అడుగుతారు. తన తల్లిని చూడాలని అంటాడు. తల్లి వస్తుంది. అప్పుడు - కొడుకు తిడతాడు. మొదటి సారి పండు కాజేసిన నాడే - నువ్వు నన్ను తిట్టి , చెయ్యొద్దని చెప్పి వుంటే , నేను బాగు పడే వాడిని కదా - అంటాడు. 

ఈ రోజుల్లో, ముఖ్యంగా - మన దేశ  రాజకీయాల్లో - అహంకారము, మమకారాల పాత్ర మనం చూస్తూనే వున్నాం. పట్టుబడితే దొంగ. లేదంటే - దొర. యిదీ కథ.  వీటి వలన - వారు మాత్రమే కాక, అందరం  రకరకాల బాధలు పడుతున్నాం.


యింట్లోని  వారు కానీ, పార్టీల నాయకులు కానీ - మరెవరైనా కానీ  - తప్పులు చేసే వారిని - తమకు లాభం వచ్చే వరకు - అస్సలు - అడగడం - లేదు. చివరికి - మతాలూ, మిగతా  రకాల సంస్థలూ  కూడా అలాగే  వుంటున్నాయి.

ఎప్పుడో లక్షల ఏండ్ల నాడు ఎవరో వొకాయన రాసిన మనుధర్మ శాస్త్రాన్ని - మనం తప్పు బడతాం.అయినా ,దాన్ని సంస్కరించుకోం. 


కానీ- దేశంలోఎక్కడైనా, కనీసం  వొక్క రోడ్డైనా-  సింగపూర్ లాగా, అమెరికా లాగా - వేయగలుగుతున్నామా - అంటే లేదు. కారణం - 'నా' స్వార్థం. 'నా వారి' స్వార్థం. అంటే - అహంకారం, మమకారం. బియ్యంలో కలపడం; పాలలో కలపడం; పప్పుల్లో కలపడం; మందుల్లో కలపడం; కలపడం లేని - వస్తువే మన దేశంలో దొరకడం లేదు. కారణం - అహం-మమ. ఈ రెండు కారాలే. బ్రిడ్జీలు -కట్టక ముందే -కూలిపోతున్నాయి.అడగ వలసిన వాడు అడగడు . మనం నోరు తెరిచి అడగ లేము. 

లంచ గొండి తనానికి  ముఖ్య కారణం - మనలో ప్రేమ శూన్యమై పోవడమే అంటారు శ్రీ శ్రీ రవిశంకర్ గారు. అందరూ నా వారే - అనుకుంటే - లంచ గొండి తనమూ వుండదు, కలపడమూ వుండదు.

సద్గురు  జగ్గి వాసుదేవ్ గారంటారు - మీ వేలు వొక్క సారి చూసుకోండి. దాన్ని,ఏదైనా రాయెత్తి  కొట్టండి చూద్దాం. మీరు చెయ్యరు. ఎవరూ చెయ్యరు. ఎందుకంటే - అది నాది అనే భావన. మీ కొడుకు దగ్గరో భార్య దగ్గరో లంచం అడుగుతారా? అడగరనే అనుకుంటున్నా . ఎందుకంటే , వీళ్ళు నా వాళ్ళు  అనే భావన మీలో వుంది గనుక. "నా వారు" అని అనుకోని వారి దగ్గరే - మీలో స్వార్థము, వారికేమైనా ఫరవాలేదు అనే భావన తలెత్తుతాయి.

మీరు హాస్పిటలుకు -వెళితే  వెయ్యి ఫారాలు రాసిన తర్వాత గానీ   అడ్మిషన్  యివ్వని డాక్టర్ గారు - తనకైతే ఏం చేస్తారు? మొదట ట్రీట్మెంటు -తరువాత ఫారాలు. మీ వారు రేపుకు గురైతే - పోలీసు వారు ఏంచేస్తారు? తమ వారు గురైతే ఏం చేస్తారు?

వీటన్నిటి వెనుక - అహంకారం వుంది. మమకారం వుంది.  యివే స్వార్థమనే రూపం లో వెయ్యి, వెర్రి తలలు వేస్తూ వుంది.

అసలైన జ్ఞానమూ లేదు. ప్రేమా లేదు.

యివి నశించి పోతూ వుంది మనలో.   "ఐ లవ్ యూ " అనే మాటల్లో కూడా - ఎక్కువగా అహంకారం, మమకారం మాత్రమే వున్నాయి. నువ్వు నాకు ఉపయోగ పడే వరకే  "ఐ లవ్ యూ ". లేదంటే - యిది మరో చోటికి వెళ్లి పోతుంది.

గీతా సారమంతా - వొక్క వాక్యంలో చెప్పాలంటే - "అహంకారం, మమకారం వున్నమీ మనస్సులో , జ్ఞానము, ప్రేమ నింపుకోండి."   శ్రీకృష్ణుడి ప్రబోధమంతా యింతే 

జ్ఞానమూ, ప్రేమా మీలో వున్నట్టు ఏం గుర్తు?

 మీరు మనసారా- "సర్వే జనాః సుఖినోభవంతు" అని అనుకోగాలరా . అలా ఉండగలరా.  అదే గుర్తు.

ఈ మధ్య స్వామి పరిపూర్ణానంద  గారు - దళిత వాడలలో పర్యటించి, వారితో మాట్లాడి, వారి మాటలను విన్న తరువాత - వొక్క మాట అన్నారట - నేను యిప్పుడే  నిజంగా పరిపూర్ణానంద అయ్యా ను. వూరికే ఉపన్యాసాలు, ప్రవచనాలు యిచ్చేటప్పుడు, ఏదో వెలితి వుండేది - అని. ఆ తర్వాతా ఆయన మాట్లాడే మాటలలో సర్వే జనాః సుఖినోభవంతు - అన్న భావన హృదయపు లోతుల నుండి వచ్చేటట్టు మనం గమనించ వచ్చు. 

అంతే . అంతకు మించి చెప్పేదేమీ  లేదు. తమ,తమ జీవితాల్లో, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు యిద్దరూ చేసింది యిదే.

సర్వే జనాః సుఖినో  భవంతు .


= మీ

వుప్పలధడియం విజయమోహన్







27, ఆగస్టు 2012, సోమవారం

మారుతున్న కాలం - ఎటు వైపు మన ప్రయాణం ? - ఏం చెయ్యాలి మనం ?

కిం కర్తవ్యం ?


ప్రపంచం లో  ఎన్నో మార్పులు జరిగి పోతున్నాయి.

మనం వూహించ  గలిగేవి, వూహించ లేనివి  - ఎన్నో, ఎన్నో జరిగి పోతున్నాయి.

వొక్క భారత దేశంలోనే - మనుషులలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెరిసేదంతా బంగారం  కాదు - అన్న పాత కాలం సామెత లోని నిజం తెలిసి వచ్చేటట్టుగా వుంది.

మచ్చుకు వొక్క విషయం చూద్దాం.

మన ఆరోగ్య -మంత్రి  ఘులాం నబి ఆజాద్ గారు అన్నారు - భారత దేశం లోని   మగ వాళ్ళలో - యిన్ ఫెర్టిలిటీ (పిల్లలు పుట్టలేని స్థితి) -చాలా ఎక్కువవుతున్నదట. దీనికి కారణం - మన దేశంలోని రసాయనిక కర్మాగారాల్లో నుండి వెలువడే - క్సెనో బయోటిక్స్ -అని అన్నారు. వీటి వల్ల - స్పెరం క్రిముల సంఖ్య , వాటి  ఆరోగ్యము , నాణ్యత,సామర్థ్యము  గణనీయంగా తగ్గిపోతున్నవట.
    
సరే . డిల్లీ  లోని అఖిల భారత మెడికల్ సైన్సస్ ఇంస్టి ట్యూట్  వారు ఈ విషయం పై చాలా పరిశోధనలు  నిర్వహించి  క్రింది విషయాలు తేల్చారు :

వొక సాధారణ భారత యువకుడిలో (ఆ పై వయసు వారి లో కూడా) - 3 దశాబ్దాల క్రితం స్పెరం సంఖ్య  60 మిల్లియన్లు (వొక మిల్లీ లీటరుకు) వుండేవట . ఆ సంఖ్య యిప్పుడు 20 మి .న్ల కు పడి  పోయిందట.

దీనికి వొక ప్రముఖ కారణం - వారు పని చేసే చోట వుండే - అధిక ఉష్ణత  అన్నారు. అంటే - ఉష్ణోగ్రత  ఎక్కువగా వున్న  కర్మాగారాలు లాంటివి.

యిది కాక, అనేక కారణాల వల్ల ,  మగ వారి స్పెరం నాణ్యత - ప్రతి సంవత్సరమూ - దాదాపు 2% తగ్గిపోతున్నదట .

దాదాపు 40 శాతం మగ వారిలో -  స్పెరం సంఖ్య , నాణ్యత గణనీయంగా తగ్గిపోతున్నదట . సెమన్ ఉత్పతి కూడా  కూడా తగ్గి పోతున్నదట.

ఆరోగ్యముగా పుట్టే స్పెరం సంఖ్య చూస్తే   - వొక్క దశాబ్దంలో  26 శాతం  స్పెర్మ్స్ లో 60 శాతం ఆరోగ్యంగా వుండేవి - యిప్పుడు 7 శాతానికి పడిపోయాయట. అంతకు  ముందు - అంత కంటే మరింత ఆరోగ్యంగా వుండే వుంటాయి. ఇలాంటి మరెన్నో విషయాలు -పరి శోధనల్లో  తెలిశాయిట.  

కోపెన్ హాగెన్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో  కూడా - వారి దేశంలో - యిటువంటి మార్పులు వస్తున్నట్టు తెలిసిందట. 

న్యూ యార్క్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో - లాప్ టాప్  కంప్యూటర్లను తమ కాళ్ళపై పెట్టుకొని పనిచేసే  వారిలో - ఈ సమస్య చాలా ఎక్కువగా , చాలా త్వరగా వస్తున్నట్టు తేల్చారు. 

ముఖ్యంగా - పురుషుల మర్మా వయవాలకు -వేడి కాస్త ఎక్కువగా తగిలితే కూడా - ఈ సమస్య త్వరగా వస్తుందని -తెలుస్తోంది . 

సాధారణంగా  ఈ భాగం శరీరానికి వెలుపల, మూడు డిగ్రీలు తక్కువ వేడితో వుంటుందిట. అప్పుడే దాని ఆరోగ్యం, సామర్థ్యం సరిగ్గా వుంటుందట 

అలాగే - క్రిమి సంహారక మందులు వాడబడే తోటల్లో ఎక్కువగా పనిచేసే మగ వారికి కూడా  -యిలా జరుగుతున్న ట్టు, గమనించారు.

సరే.  ఈ కాలం లో శారీరక పరిశ్రమ లేని ఉద్యోగాల్లో వుండే వారికి ఈ సమస్య బాగా  వస్తున్నది. శారీరకంగా క్రొవ్వు ఎక్కువ వుండే వారికి కూడా - యిలా జరుగుతున్నది.

ఎక్కువగా స్మోకింగ్ , త్రాగే అలవాటు వున్న  వారిలో కూడా - ఈ సమస్య ఎక్కువవుతున్నది.

సెల్ ఫోన్లు -శరీరానికి కాస్త దూరం వుంచితే మేలు అంటారు.అలాగే, సైక్లింగ్, బైక్ రైడింగ్  చేసే వారు - సీటింగ్ బాగా సుఖంగా వుందా అని గమనించితే మేలు-అంటారు .

శరీరానికి మరీ బిగుతుగా వుండే దుస్తులు వేసుకుంటే - కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి - అదీ మర్మావయవాల దగ్గర వేడి కొద్దిగా ఎక్కువ కావడం వల్ల .  

నేను చదివిన - ఈ కొన్ని విషయాలు -పాఠకులతో  పంచుకోవాలనిపించింది. ఎందుకంటే -ఈ మార్పులు -మనకు తెలియకుండా , చాలా త్వరగా ,మన అందరి  శరీరాలలో వస్తున్నట్టు  స్పష్టంగా , పరిశోధనా పూర్వకంగా  తెలుస్తూ వుంది. దీనిని కొంతైనా  అరికట్ట వచ్చు - అని, నేను అనుకుంటున్నాను.  

మన శరీరాల్లో, మనస్సులో - జరుగుతున్న తీవ్రమైన మార్పులను - అరికట్టాలంటే , మగ వారు, ఆడ వారు అందరూ జరుగుతున్న మార్పులను, వాటి - కారణాలను అర్థం చేసుకుంటే -  కొంతైనా తగ్గించుకోవచ్చు.

వొక కాలంలో అనే వారు - మగవాడు చలికి భయపడ కూడదు. ఆడది, వేడికి భయపడకూడదు -అని. దాని వెనుక - యిటువంటి కారణాలు - ఏమైనా వున్నాయేమో! వుండినా  వుండొచ్చు . మనకు తెలీదు. 

ఇలాగే ఆడవారిలో కూడా - అనేక రకాలైన మార్పులు వస్తుండడం మనం గమనించ వచ్చు.- వాటికీ  ఎన్నో కారణాలు వుంటాయి. సాధారణ ప్రసవాలు చాలా, చాలా, తగ్గిపోతూ వుండడం చూస్తూనే ఉన్నాము. అదైనా వొకటి లేదా రెండు అని ప్రభుత్వం అనడం మానేసినా - యిప్పుడు చాలా మంది జంటలకు, వొక్క సంతానం  మాత్రమే వుండడం మనం చూస్తున్నాము.వీటికి మనం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే  కారణం కాక పోవచ్చు. మనలో వస్తున్న అంతర్గత మార్పులు కూడా కారణం కావచ్చు. వీటిని గురించి మరో సారి మరింతగా చూద్దాం .

పశ్చిమ దేశాలలో చాలా ఎక్కువగా వస్తున్న గే-యిజం, లెస్బియన్-యిజం, లాంటి వాటికి కూడా - వారు స్వచ్చందంగా తీసుకునే నిర్ణయాల కంటే - శారీరక, మానసిక,జన్యు సంబంధ మార్పులే ఎక్కువ కారణం కావచ్చు. యివి యిప్పుడు, మన దేశంలో కూడా - ఎక్కువవుతున్నాయి.

మొత్తానికి - ఆరోగ్య కరమైన -  స్త్రీ పురుష సంబంధాలలో - పరస్పర  స్నేహము, సహానుభూతి ,ఆకర్షణ వుండాలి. ఎప్పుడూ తగవులాడే జంటలలో - నేనా,నువ్వా,అని ప్రతి దానికీ  పోటీ పడే వారి మధ్య-  ఈ  సమస్యలు  ఎక్కువవడం తప్పవు.

మారుతున్న కాలం - మనం పూర్తిగా ఆపలేం - కానీ ఎటు వైపు మన ప్రయాణం - అనేది తెలుసుకుంటే - -మనలో  ఆలోచన పెరుగుతుంది.  

అన్ని కారణాలూ - మనకు తెలియక పోయినా - తెలిసిన కారణాలు కొంత  తగ్గించుకుంటే - మంచిది  కదా .

మనకున్నది వొక్క జీవితం. అది అందంగా మలుచుకోవాలంటే - సంతోషంగా గడపాలంటే - నూరేళ్ళు నిండుగా  వుండాలంటే - ధర్మేచ అర్థేచ కామేచ అనే సూత్రం ప్రకారం  - స్త్రీ పురుషులిద్దరూ  - కలిసి - ఎలా ఉండాలో - ఎలా వుంటే -యిద్దరికీ మేలో -   తెలుసుకుంటే - మేలు కదా.



= మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 




7, ఆగస్టు 2012, మంగళవారం

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు = మనం ఏం చెయ్యాలి ?

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు 


ఈ రోజు టీవీ 9 ఛానల్ లో స్వామీ పరిపూర్నానంద గారి ఆవేదన,దానికి విరుద్ధంగా కొంత, సపోర్ట్ గా కొంత,  రాజకీయ వాదులు మాట్లాడడం, వినడం జరిగింది. 

రాజకీయాలు ప్రక్కన బెడితే  - మనం చాలా సులభంగా చూడగలిగే విషయం -ప్రతి మతం లోనూ - ఈ రోజు కొన్ని రుగ్మతలు, కొన్ని లోటుపాట్లు చోటు చేసుకున్నాయన్న విషయం.

ఏదో హిందూ మతం లోనే అన్ని లోటుపాట్లు వున్నాయనుకోవడం-  ప్రపంచాన్ని , అందులో వివిధ దేశాల్లో జరుగుతున్న విషయాల్ని పూర్తిగా విస్మరించడమే అవుతుంది. ఈ రోజు ప్రపంచంలో - యుద్దాలు జరిగితే -    అది హిందూ మతం వలన మాత్రం కాదు. ఇండియా లో పుట్టిన ఏ మతం వలనా కాదు.

మొదటి ప్రపంచ యుద్ధం కానీ , రెండవ ప్రపంచ యుద్ధం గానీ - ఆ తరువాత - ఈ రోజు వరకు జరుగుతున్న అనేక యుద్ధాల్లో - పాల్గొంటున్న మతాల వారెవరు? మనం కాదు

వొక మతం వాళ్ళే తమలో తాము - మత ప్రాతిపదికపై -  కొట్టు కుంటున్న  దేశాలు ఎన్నో వున్నాయి. మా మతంలో - అంతా బాగుంది - ఎవరిపై విద్వేషం లేదు - ఏ రకమైన భేద భావాలు లేవు -    అని చెప్పడం - నిజానికి  చాలా దూరం.  

అయితే - యివి - మొదట - దేవుడే చెప్పాడా ప్రవక్త చెప్పాడా - ఆ తరువాత మతంలో చోటు చేసుకున్నాయా -అన్నది - వివాదాంశం . 

సరే. హిందూ మతంలో - రాముడు కానీ కృష్ణుడు కానీ - అట్టడుగు వాళ్ళకే ప్రాధాన్యత యిచ్చినట్టు - మనకు తేట తెల్లంగా తెలుస్తూనే వుంది.  

శంకరాచార్యుల వారు -అంటరానితనం పాటించ రాదని -    తననే వొక ఉదాహరణగా - తనకు మహా శివుడే  చెప్పినట్టు - గొంతెత్తి చెప్పారు.   

అప్పుడు కూడా - మనం మారక - పోతే - తప్పు మనదా ?  మతానిదా?  

హిందూయిజం - ఎన్నో రకాలుగా మొదటి నుండీ - మారుతున్న మతమే కానీ , మారని మతం కాదు. మొన్న మొన్న ద్వాపరయుగంలో కూడా -  శ్రీకృష్ణుడు - గీతోపదేశం చేసాడు. అది పాటిస్తున్నామా లేదా ?  

శంకరాచార్యుల వారు ఎన్నెన్ని చెప్పారు ? రామానుజుల వారు ఎన్నెన్ని చెప్పారు ? 

అందరిలో నిన్ను; నీలో  అందరినీ; చూడకపోతే - నీకు జ్ఞానం లేదనే నిర్దిష్టంగా  చెప్పారు.

అది వొక ప్రక్కన  వుండనియ్యండి. దాన్ని గురించి మరింత విశదంగా మరో సారి చూద్దాం.

యిప్పుడు ముఖ్యంగా - మనం చూసే లోటుపాట్లు కొన్ని చూద్దాం.

వొకటి ఆలయ ప్రవేశం.దేవుడి దగ్గర కు  వెళ్ళడానికి - ప్రతి  వొక్కరికీ హక్కు దేవుడే యిచ్చాడు . భక్త కన్నప్ప వెల్ల లేదా? తిన్నడు వెల్ల లేదా? శివుడు వద్దన్నాడా?

ఎక్కడైనా , హిందువులైన వారికి ఎవరికైనా - ఆలయ ప్రవేశం లేదంటే - అది సరి చేయడానికి - 66 సంవత్సరాలు అక్కర లేదు వొక్క రోజు  చాలు. కాకపోతే - నేను తాగేసి వెడతాను బూతులు మాట్లాడుతాను - అని అనే వారికి; దేవుడి విగ్రహం పై ఏ నమ్మకం లేని వారికి,  దేవుడి విగ్రహాలు పగుల గొట్టాలి - అనే వారికి - ఆలయ ప్రవేశం - మిగతా వారికి మంచిది కాదు.

సర్దార్ వల్లభాయి పటేల్ గారు చేసినట్టు - నమ్మకం వుండి, రావాలనుకున్న -వారినందిర్నీ- గుడి లోపలికి    పోలీసో  ,  మిలటరీనో - సహాయం తీసుకుని - తీసుకెళ్ళి పోవడమే.అంతే.  అన్ని కులాల్లో - సమానత్వం వుండాలన్న భావన         వున్న వారు చాలామంది వున్నారు. వారి సహాయమూ - తోడూ తీసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు మిగతా వారు మారడం చాలా సులభంగా జరిగి పోతుంది.     

ఎవడెవడు  వద్దని అంటాడో  - అడ్డు కుంటాడో -   వారిని ఆ గుడి నుండీ - వొక సంవత్సరం నాళ్ళు - బహిష్కరించండి. తప్పే లేదు. మరొకరి హక్కులకు  అడ్డం నిలిచే వాళ్లకు అలాంటి  శిక్ష తగినదే.  ఈ ఆలయ ప్రవేశం - అనే వొక సమస్య  - వొక్క రోజులో పరిష్కరించ వచ్చు .   

అలాగే - టీ అంగళ్లు ,హోటళ్ళలో -   వివక్షత వుంటే - ఆ హోటల్లు మూసేయండి . తప్పే లేదు. ఎవరి హక్కుకూ -ఎవరూ  అడ్డు నిలవడం సరి కాదు. కాకపోతే - శుభ్రత లాంటి విషయాలు - చూడాల్సిందే . ఏ కులం ఏ మతం వారైనా - తాగేసి రావడమో, శుభ్రత లేకుండా రావడమో, బూతులు, మాట్లా మో -  చెయ్య రాదు. యివి -  వొక్కరని కాదు - చాలా కులాల వారు చేస్తున్నారు . అగ్ర వర్ణాల / వర్గాల వాళ్ళు కూడా చేస్తున్నారు  .ఏ సమాజం లో నైనా - యివి పనికి రావు.  

మాట్లాడుతూ వుంటే - సమస్యలు పరిస్ద్ష్కారం కావు. శ్రీకృష్ణుడు ఎన్నో చేసాడు.శంకరాచార్యులు  చేసారు. రామానుజులూ చేసారు. మనం చెయ్యడం లేదు.వూరికే మాట్లాడుతూ ఉన్నాము.  

గోటి తో పోయేదానికి - గోరూ ఉపయోగించడం లేదు . గొడ్డలీ ఉపయోగించడం లేదు. అసలేమీ చెయ్యడం లేదు. సంవత్సరాల తరబడీ - వూరికే  మాట్లాడుతూ  ఉన్నాము. 

మతోద్దారకులూ, సమాజోద్దారుకులూ - అయిన హిందువులందరూ - రంగం లోకి దిగి - సమస్యను - పరిష్కరించండి. వొక్క రోజు కాకున్నా వొక-నెలలో - కనీసం - ఆంధ్ర ప్రదేశ్ లో - ఈ సమస్యలు రూపు మాపండి . అదే విధంగా - వారికి సహాయంగా -ప్రభుత్వం నిలవాలి . చట్ట పరంగా ప్రభుత్వం అందరి హక్కులనూ కాపాడాలి కదా.

యివన్నీ ఏదో విప్లవం లాగా చేయాల్సిన పనేం లేదు. చాలా శాంతి యుతంగా, చెయ్యగల పనే. సులభమైన పనే. చెయ్యాలి - తప్పదు.     

చేసి - అందరికీ మార్గ దర్శకులుగా నిలవండి.  


స ర్వే జనాః సుఖినో భవంతు .  

=మీ

ఉప్పల దడియం  విజయ మోహన్