15, మే 2011, ఆదివారం

విజయానికి మార్గాలు = అంతా మీలో వుంది



మీ ఏ విజయానికైనా - మీరు, దానికి, తీసుకున్న బాధ్యతలే మఖ్య కారణం. 

బాధ్యత  తీసుకోకుండా ఏ విజయమూ రాదు.

మరి - మీ బాధ్యతలేమిటి?

విజయం మొదట మీ బుద్ధిలో పుడుతుంది.  పుట్టాలి.

మీకు ఏదో కావాలి. కావాలి అనిపించడం - అది బలంగా మనసులో నాటుకొవడం -   మీ మొదటి విజయం.


 
దీనికి కారణం - మీ "యిచ్చా శక్తి". 

కావలసిన వస్తువు, చేర వలసిన  గమ్యము - ఎలా పొందాలి, ఎలా చేరాలి, అన్న తీవ్ర ఆలోచన మీ మనసులో రావాలి.      ఇది మీ "జ్ఞాన శక్తి."  


మీకూ , మీ గమ్యానికీ మధ్య  - మార్గం - మీరు వేసేదే.

మరో మార్గం లేదు.  మీరు వేసేదే మార్గం.


మీ మనసులో వుండే భావ తీవ్రతకు - ప్రకృతి శక్తులూ, తలూపుతాయి. మీ గమ్యం - మరెవరికీ బాధాకరం కానిదయితే, అవీ మీకు  చేయూతనిస్తాయి. 

మీ గమ్యం, పదిమందికి   ఉపయోగ కరమైన దైతే - ప్రకృతి  శక్తులు కూడా -  మిమ్మల్ని  గమ్యం వైపు తీసుకెడతాయి; గమ్యాన్ని కూడా , మీవైపూ తీసుకొస్తాయి.

నిస్స్వార్థ గమ్యానికి - మీతో బాటు - అవీ రావడానికి, ఎంతో యిష్ట పడతాయి. 

అయితే  - బాధ్యత మీదే. గమ్యం చేరే వరకు - మీరు చేయవలసిన పనులు మీరు చేయాల్సిందే..
ఇది మీ  "క్రియా శక్తి". 

మీ ఇచ్చా శక్తి, మీ జ్ఞాన శక్తి, మీ క్రియా శక్తి - మీరు సరి ఐన గమ్యం కోసం వాడండి.

ప్రకృతి శక్తులు మీకు తోడుంటాయి.


గమ్యమే లేని వాడికి - ఎవరు తోడుండగలరు?  కాబట్టి - మీకు గమ్యం వుండాలి. గమ్యం చేరడమే విజయం. మీ మొట్ట మొదటి బాధ్యత, మీ  గమ్యం స్థిరపరచడమే.

స్వంత ఆలోచనే ఉపయోగించని వానికి - ఎవరు - ఆలోచన నీయ గలరు? కాబట్టి - మీ రెండవ బాధ్యత - మీ గమ్యానికి సరి ఐన బాట మీరు వేయాలి.

తన బాధ్యత తాను తీసుకొని వానికి - ఎవరు సహాయ పడ గలరు? మీ మూడవ  బాధ్యత - మీరు వేసిన బాటలో - మీరు ప్రయాణం చేయాలి - గమ్యం వరకూ.



మరో సారి చూడండి :


మీ విజయానికి మొదటి మెట్టు - మీ ఇచ్చా శక్తి. దీనితో - మీ గమ్యాన్ని స్థిరం చేయండి.

రెండవ మెట్టు - మీ జ్ఞాన శక్తి. దీనితో మీ మార్గాన్ని స్థిరం    చేయండి. 

మూడవ మెట్టు - మీ క్రియా శక్తి - మీ మార్గంలో, మీ గమ్యం వైపు, ప్రయాణం మొదలు పెట్టండి. మీరు గమ్యం వైపు, గమ్యం మీ వైపు రావడం గమనించండి.

గమ్యం వచ్చే వరకు నిలవకండి; నిలపకండి.

విజయం మీదే.

- మీ

వుప్పలధడియం విజయమోహన్

వొక్క క్షణం ఆగండి = ఆగి దారి మళ్లించండి



వొక్క క్షణం ఆగండి. మీకీ కథ చెప్పాలి. మీరిది వినాలి.
యిది ఎక్కడో  చదివాను - కానీ,  యిది కొంత వరకు  ప్రసిద్ధమైన  సంఘటనే.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో -యిద్దరు పాపలు - వొక అక్క, వొక తమ్ముడు ఖైదీలుగా  , నాజీ ల దగ్గర పట్టుబడి విడిపోతారు. 

నాజీ ల చేత విడ గొట్ట బడటానికి ముందు - తమ్ముడు, రైలు పట్టాల మీద ఆడుకుంటూ తన షూ / సాక్స్ ను పోగొట్టుకుంటాడు. అప్పుడు వాడి అక్క, వాడిని బాగా తిట్టేస్తుంది . వచ్చేది చలి కాలము, యిప్పుడు సాక్సులను పోగొట్టుకున్నావే, మూర్ఖుడా, అంటూ, రక,రకాలుగా, అక్క తమ్ముడిని తిడుతూ వుండగానే -  వారిద్దరూ విడగొట్ట బడతారు.చెరొక రైలులో - చెరొక ఖైదీల  కాంపుకు  తీసుకుని  వెళ్ల బడతారు. 

తరువాత, ఎప్పుడూ, అక్కా, తమ్ముడూ - కలవలేదు.

కొంత కాలం తరువాత, అక్క విడుదలవుతుంది. తమ్ముడు మరో కాంపులో చనిపోయినాడన్న  వార్త వింటుంది.
భోరుమని ఏడుస్తుంది.

విడిపోవడానికి ముందు , తమ్ముడిని తానన్న కరుకైన తిట్లు తలుచుకుని చాలా, చాలా బాధ పడు తుంది.  

ఆ కొన్ని క్షణాలను  - మరెంతగా, తమ్ముడికి ధైర్యం చెప్పడానికో, సంతోషంగా వుండడానికో - వుపయోగించి   వుంటే - ఎంత బాగుండేది? కనీసం మనం ఎలా కలవగలం, నువ్వెలా వుండాలి - అని చెప్పి వుంటే - ఎంత బాగుండేది - అని రక రకాలుగా, చాలా బాధ పడింది.

యిప్పటికి, కొన్ని క్షణాల తరువాత - ఏం జరుగుతుందో - మనకు తెలీదు.

కాని, మన వాళ్ళు, మనతో వున్న ఈ క్షణాలను మనం ఎంతో వ్యర్థం చేసుకుంటున్నాము. వొకరితో వొకరు కొట్లాడుకో వడానికి , వాదించడానికి, వైరం పెంచుకోవడానికి, ముభావంగా కూర్చోవడానికి - ఇలాంటి పనులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము.

అమూల్యమైన ఈ క్షణాలను -వ్యర్థం చేసుకుంటున్నాము.

(i ) పిల్లలు అల్లరి చేస్తే మనం కోప్పడతాము. కొడతాము. తిడతాము. తప్పని చెప్పను.  కానీ- వొక్క సారి -యోచన చేసి చూడండి  - 

పిల్లలు లేనివారు, చెట్ల చుట్టూ, రాళ్ల చుట్టూ, డాక్టర్ల చుట్టూ, మీ పిల్లల వంటి పిల్లలు తమకు పుట్టాలని  తిరుగుతున్నారు. అటువంటి అల్లరి కోసమే - వాళ్ళ మనసులు తహతహలాడుతున్నాయి. మరి వున్న దాని విలువ మనకెందుకు తెలియడం లేదు?  తెలుసు. అయినా వోర్పు లేని తనంతో - పిల్లలకు, మనకు మధ్య, మాటలతో, చేతలతో అంతరం మనమే కల్పించుకుంటాము. 

అనే మాటలు, చేసే, చేతలలో - మరింత ప్రేమ నింపి అదే మాటలే అన్నా, అదే చేతలే చేసినా - మీ క్షణాలు వృథా కావు. మీ క్షణాలు మధుర క్షణాలు కావచ్చు. మీ పిల్లలతో - మీ సంబంధం ఎంతో మెరుగుగా వుంటుంది.


(ii )  మీకు తెలుసా?  మీ పిల్లలు, మీకు దేవుడిచ్చిన వరమని!  ఎంతో  మందికి, ఎందుకో గానీ, దేవుడు, మీకిచ్చిన గొప్ప వరం ఇవ్వలేదు.  దేవుడిచ్చిన ఆ వరాన్ని  - మీరు ఎలా చూసుకోవాలి?   వరం లాగానా, శాపం లాగానా? తప్పులు చెయ్యని పిల్లలు లేరు, యిప్పటి వరకు పుట్టలేదు. తప్పులను మీరు సరిదిద్దాలి. చెప్పొచ్చు. కొట్టొచ్చు కూడా. కాని - అన్నిటిలో - అమితమైన ప్రేమ వుండాలి. అది - ఆ పిల్లలకు తెలియాలి. ఆ పిల్లలే లేక పోతే - మీ జీవితం నిస్సారమని కూడా తెలుసుకోండి. 

(iii ) మీకు తెలుసా?  మీ భర్త / మీ భార్య , మీకు దేవుడిచ్చిన వరమని!  దేవుడిచ్చిన ఈ  వరాన్ని  - మీరు ఎలా చూసుకోవాలి?   వరం లాగానా, శాపం లాగానా?

లక్ష రూపాయలను మీకిస్తే - మీరెంత భద్రం గా చూసుకుంటారు?
కోటి రూపాయలిస్తే - అంత కంటే - భద్రంగా చూసుకుంటారా - లేదా? 

మీ భర్త / మీ భార్య - మీకు దేవుడిచ్చిన  ఎంతో, ఎంతో  అమూల్యమైన కానుక.  ఆ కానుక విలువ చాలా కుటుంబాలలో, ఇద్దరికీ తెలియడం లేదు - సుమా!

వొక 45  రోజులు - " తను ఏం చేసినా, ఎలా వున్నా - నా భార్య లేదా భర్త తో నేను మాత్రం మృదువుగానే, ప్రేమ గానే, మాట్లాడుతాను" - అని వొట్టే సుకోండి. దేవుడి ముందు ప్రమాణం చేయండి. పాటించండి; చూద్దాం.

రేపు ఎవరుంటారో వుండరో - రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో - ఆ అక్కకూ - తెలియలేదు.    మనకూ తెలియడం లేదు. ఈ రోజు, మనం తిడుతున్న / కొట్లాడుతున్న  -   ఈ  భార్య / భర్త - రేపు లేక పోతే? రేపు లేయక పోతే? అప్పుడు పశ్చాత్తాప పడి  ప్రయోజనం ఏమిటి? 

అందుకని - మీ ప్రతి మాటలోనూ, చేతల్లోనూ - ప్రేమ నింపండి. తిట్లలో కూడా. 

వారికి - మీరు ఏమేం చేయగలరో - అవన్నీ  చేయండి. యిది జన్మ జన్మల అనుబంధమనే - భావన వారిలో మీరు కలుగ జేయాలి.  మీ కంటే మంచి భర్త లేదా భార్య మరొకరు దొరకరనే భావన వారిలో కలగాలి.

అప్పుడు - వారిలోనూ, అనూహ్యమైన మార్పు వస్తుంది.  కొందరిలో, వొక వారంలోనే మార్పు రావచ్చు. కొందరిలో - 45 రోజులూ పట్ట వచ్చు. కొందరిలో - మరో 45 రోజులూ కావచ్చు.  కాని మార్పు తప్పకుండా వస్తుంది.  మీ లోని మార్పు - రాయిని కూడా కరిగించ గల శక్తి కలది.

(v )  మీ అమ్మ, నాన్న - మీకు ఎన్నో చేశారు. వారు, - దేవుడు మీకిచ్చిన అతి గొప్ప వరం.  మీ వయసెంతయినా  ఫరవాలేదు. (యిది మీరు తప్పకుండా చేసి వుండరు). మీ అమ్మ వొళ్ళో; మీ నాన్న వొళ్ళో, తల వాల్చి పడుకుని - "మీరు నాకెంతో చేశారు, మీరంటే నాకెంతో యిష్టం" అని చెప్పి చూడండి. అదీ - ఏదైనా, మంచి రోజు నాడు, చేయండి.  మీరు ఎన్ని తప్పులు చేసివున్నా - వాళ్ళు , యిట్టే- క్షమించేస్తారు. వారిలో, పొంగి పొరలే సంతోషాన్ని, తృప్తినీ చూడండి.

రేపటి ప్రయాణంలో - మనతో బాటు నడిచే వారెవరో మనకు   తెలీదు.  ఈ రోజు, ఈ క్షణాలనెలా గడపాలన్నదే - మనముందున్నది. మనం చేయగలిగేది.

(vi ) యాభై సంవత్సరాల క్రితం వరకూ - మన దేశంలో - పెద్ద పెద్ద కుటుంబాలు కలిసే వుండేవి. అప్పట్లో, చిన్న చిన్న రచ్చలు వచ్చినా- అందరికీ - ఆ కుటుంబాలలో వున్న  సౌభాగ్యం, సౌలభ్యం తెలిసి వుండేది. "కలసి వుంటే, కలదు సుఖం" లాంటి సినిమాలు వచ్చేవి - ఆ రోజుల్లో.  

కాని - తరువాత రోజుల్లో, ఈ పెద్ద కుటుంబాలు వద్దు - అనుకునే వారు ఎక్కువయినారు. పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు కావడము, చిన్న కుటుంబాలు, మరీ  చిన్న కుటుంబాలు కావడము జరుగాయి. యిప్పుడు - తల్లితండ్రులు - కొడుకు, కోడళ్ళతో వుండడానికే  యిష్టం చూపడం లేదు. కోడళ్ళు, అత్త, మామలతో వుండడానికి యిష్టం చూపడం లేదు. వొక్కొక్క సారి - కొడుకులు కూడా, తల్లి తండ్రులను తమతో చూసుకోవడానికి యిష్టం చూపడం లేదు. ఎన్నో కారణాలు.

స్వార్థం చాలా ముఖ్యమైన కారణం. కనీసపు  ముందు చూపు లేకపోవడం రెండవ కారణం. వొకరితో, వొకరు సర్దుకుని పోయే స్వభావం లేక పోవడం మరొక కారణం. 

ఇప్పుడున్న  పరిస్థితి - తల్లిదండ్రులు వేరే కుటుంబం. లేదా, వృద్ధాశ్రమాలలో  వుండడం . కొడుకు కోడళ్ళు వేరే కుటుంబం.   పిల్లలు - హాస్టళ్ళలో. 

వస్తున్న పరిస్థితి - భార్య, భర్త కూడా, వొకటిగా, వొక చోట వుండటానికి యిష్టం చూపక పోవడం!!
పెళ్ళే వద్దు. ఏ బంధమూ వద్దు -  ఏ బాదర బందీ వద్దు - అనుకునే పరిస్థితి. ఎవరూ, ఎవరినీ నమ్మలేని పరి స్థితి.ఎవరూ, ఎవరితోనూ, సర్దుకోలేని పరిస్థితి.  ఆంగ్లం లో " ఐ యాం ఓకే - యు ఆర్   ఓకే" అన్న ప్రసిద్ధమైన వొక సిద్దాంతం వుంది. అందులో చెప్పిన - "నేనూ బాగలేదు - నువ్వూ బాగ లేదు - వారూ బాగ లేదు"  ( ఐ యాం నాట్ ఓకే - యు ఆర్  నాట్  ఓకే, దే ఆర్ నాట్ ఓకే) అన్న పరిస్థితిలో వున్నారు చాలా మంది.

ఎక్కడికి వెళ్ళుతున్నాం మనం?

రేపు ఏమవుతుందో తెలీదు. ఈ రోజు - మీ పరుగును - మీ వొంటరి పరుగును - ఆపండి. ఏం జరుగుతోందో, వొక్క సారి చూడండి.

మీలో యిప్పుడు రాజ్యమేలుతున్న -  సందేహాలు, అనుమానాలు, అహంకారాలు మాత్రమే కాదు.

మీలో  -  ప్రేమ అనే దేవుడు వున్నాడు. 

వాడిని - నిద్ర లేపండి. ప్రేమ ముందు -  అన్ని సందేహాలు, అనుమానాలు, అహంకారాలు కరిగి పోతాయి. ప్రపంచమే కొత్తగా, ఎంతో అందంగా కనిపిస్తుంది.
ప్రేమంటే - ఈ రోజుల్లో అపోహ పడుతున్నట్టు, సెక్సు కానే కాదు. ప్రేమంటే - కరుణ, ఆదరణ,

నిన్ను నాలోని  భాగంగా చూడగలగడం. నీ బాగోగులు - నా బాధ్యత అని ఆనందంగా తీసుకోగలగడం . నీ సంతోషానికి నేను కారణంగా వుంటానని చెప్ప గలగడం. నీ కష్టాలన్నిటిలో, నీడగా, తోడుగా వుంటానని - చెప్పగలగడం, వుండగలగడం - యిదీ ప్రేమంటే.

వొక్క క్షణం నిలిచి యోచన చేయండి. మీరు ఎంత మంది సంతోషానికి, బాధ్యత తీసుకుంటున్నారని.

నిజానికి - చాలా మంది - తమ సంతోషానికి కూడా, బాధ్యత తీసుకోవడం లేదు.
మీలో ప్రేమ లేని నాడు, మీలో బాధ్యత లేదు. - మీలో మనిషీ లేడు; దేవుడూ  లేడు. 

ఆ ప్రేమే మీలో వుంటే - మీరే దేవుడై పోతారు.

ఈ వొక్క రోజు - మీ చుట్టూ వున్నా వారిలో - సంతోషాన్ని పంచండి . చూద్దాం.

మీ జీవితం చాలా, చాలా, మారిపోతుంది.

వేరే ఏమీ, ఎవరూ - మీకు చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇందులో ఏమీ కష్టమే లేదు. సుఖం తప్ప. ఆనందం తప్ప. అసలు, సిసలైన, నిజమైన జీవితం తప్ప.

అందుకే వొక్క క్షణం ఆగండి. ఆగి దారి మళ్లించండి.

ఈ  వొక్క రోజు ప్రేమపథంలో వెళ్లుదాం.ప్రతి వొక్కరికీ  సంతోషాన్ని పంచుదాం. ప్రపంచాన్ని ప్రేమ మయంగా మారుద్దాం.

= మీ

వుప్పలధడియం  విజయమోహన్

13, మే 2011, శుక్రవారం

అసెంబ్లీ ఎన్నికలూ - ఫలితాలూ


ఎన్నికలూ  - ఫలితాలూ 

పశ్చిమ బెంగాల్ . తమిళనాడు, ఆస్సాం,కేరళ , పాండిచ్చేరి రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలు వచ్చేసాయి .
రిజల్టు తెలుసు - కాని ఎందుకలా జరిగింది? అన్న ఊహా గానాలకు - ప్రశ్నలకు, సరియిన సమాధానాలు చెప్పలేం.

గెలిచినా వారందరికీ - ఈ బ్లాగు శుభాభినందనలు.


బెంగాలు లో గెలిచిన మమతా బెనర్జీ గారిని అడిగితే - వొక్క విషయం చాలా బాగా చెప్పారు.


"నాలో వున్నా సర్వ అహంకారమంతా - నా కంటి నీటిలో తుడిచి పారేసేయ్యి" - అని. యిది రవీంద్ర నాథ్ టాగోర్ గారి పాట అట.

యిది నాకు - ఎన్నికల కంటే - ఎన్నికల  ఫలితాల  కంటే - చాలా బాగా నచ్చింది.

మన పాలకులంతా - యిది  ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే - ఇండియా నందన వనం అయిపోదా? 

2 జీ లాంటి, సి డబ్లుయు జీ లాంటి స్కాములెందుకొస్తాయి ?

ముందు, ముందు - మమతా గారిలో - మమత ఎలా వుంటుందో నాకు తెలీదు.

కాని -  

ఎన్నికల  ఫలితాల తరువాత ఆమె చెప్పిన ఈ వాక్యం ఎల్లప్పుడూ - ఆమె మనసులో వుండాలని - దేవుడిని  అడుగుదాం.

అలా వుంటే - బెంగాల్ లో - మరో రవీంద్రుడు, మరో రామకృష్ణుడు పుట్టడానికి  అవకాశాలున్నాయి.

గెలిచిన మిగతా అందరూ - అలాగే వుండాలని కోరుతూ - 


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

ఈ అదృష్టం ఎందుకొచ్చింది? = సుఖాలూ - కష్టాలూ = మీలో వున్న శక్తులు = సంతోషం మీ జన్మ హక్కు


ఈ అదృష్టం ఎందుకొచ్చింది? 

యింతకు ముందు పోస్టు లో దృష్టాదృష్ట ఫలాలను గురించి కొంత తెలుసుకున్నాం.
అదృష్టం - అంటే మనకొక అపోహ వుంది. 

ఏదో గొప్ప మంచి జరిగితే, అది మన కొక వరం లాగా మనం భావిస్తే - అది మన అదృష్టం అని అంటుంటాము  .

అదృష్టం -  అంటే - జరిగిన దానికి,  కారణం, మూలము మనకు, కనిపించడం   లేదని మాత్రమే అర్థం.

ఎందుకొచ్చిందిది, ఏ కారణము వలన - అంటే, మనకు సరి అయిన జవాబు దొరకడం లేదు - అందుకని దాన్ని అదృష్టమని అంటున్నాము. అంతే కాని - అది చాలా మంచిది కాబట్టి అదృష్టం అని కాదు.  మంచో, చెడో - మనకు కారణము తెలీకండా వచ్చింది. అంతే.

నువ్వు - నా భార్య (లేదా భర్త)   గా దొరకడం నా అదృష్టం - అని మీరు ఏ అర్థం తో నైనా  అన వచ్చు. 

అసలు విషయం తెలీక వారూ పొంగి పోవచ్చు. 

నిజానికి - మనకొచ్చే చాలా సంగతులకు  - మనకు మూల కారణం తెలీదు. అవన్నీ మన అదృష్టాలే.

మీ  భార్య (లేదా భర్త)  మీకు  దొరకడం నిజంగా మీ  అదృష్టమే! 

మీ అత్త గారు మీకు అత్త గారిగా  దొరకడం మీ  అదృష్టమే! ఎటువంటి  అత్త గారైనా - వారే మీరు చేసిన పుణ్య పాపాలకు - మీకు తగిన వారు. మీరూ, వారికి తగిన వారే.

మీ కొడుకు / లేదా కూతురు - మీకు పుట్టడం మీ అదృష్టమూ - వారి అదృష్టమూ  కూడా!

మనకు జరిగే చాలా విషయాలు మన అదృష్టాలే. 

మీకు యివ్వ బడిన శరీరము, ఆరోగ్యము, రోగాలు, కష్టాలు, డబ్బు,విరోధాలు, వినోదాలు   - అన్నీ మీ అదృష్టాలే.

మీ పనులకు మెచ్చి - మీకు యివ్వ బడిన పారితోషికములు.

కాకపోతే - మీ - ఎప్పటి, ఏ పనికి, ఫలానా, ఫలానా పారితోషికం, అదృష్టం గా   యివ్వబడిందని  - మీకు తెలీదు.

కష్టాలెవరూ కొని తెచ్చుకోరు. రోగాలెవరూ అడిగి తీసుకొచ్చుకోరు. కాని - అవి మీకు యివ్వ బడ్డాయి. మీ పనులకు ప్రతిఫలంగా.  వాటిని - మీరు వద్దనే ప్రసక్తే లేదు మరి.

పనులంటే - ఉత్త పాప పుణ్యాలా? మరేమైన ఉన్నాయా?

మీరు తిన కూడని వస్తువు తిన్నా, త్రాగ కూడని పదార్ధం త్రాగినా - ఎప్పుడో, మీ శరీరానికి, దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అది కూడా - మీరు, మీ శరీరానికి చేసిన "పాపమే" అని చెప్పుకోవచ్చు. 

సుఖాలూ - కష్టాలూ

అంటే - అదృష్టమనేది - సుఖాన్నివ్వచ్చు. దుహ్ఖాన్నివ్వచ్చు .ఏదైనా - ఆ కర్మ ఫల దాత మన పనులకు, మనకిచ్చిన  ప్రతిఫలమే.
కష్టాలొస్తే - రోగాలొస్తే - దేవుడా, కాపాడు నాయనా - అంటాము. తప్పులేదు. అనొచ్చు. ఈ వినమ్రత, సమర్పణా భావము కూడా వొక పనే; వొక పుణ్యమే. దాని ఫలితమూ మనకు వస్తుంది.

అయితే - దేవుడిని మరొక రకంగా కూడా - మనం తలుచుకోవచ్చు. చిన్న కస్టాలు వచ్చినపుడు - ఏదైనా - నీవిచ్చిన ప్రసాదమే - సంతోషంగా తీసుకుంటాను - అన్నారనుకోండి . ఆ కష్టాలే సుఖాలుగా మారిపోవచ్చు. 

మనకు కష్టాలు అని అనిపించే ఎన్నిటినో - సుఖంగా గడిపిన వారెందరో వున్నారు.

ఎలా?

ఎన్నో రకాలుగా - కష్టాలను, సుఖాలుగా గడపొచ్చు.

తోడుగా - నీడగా, ప్రేమిం చే, భార్యో, భర్తో, వుంటే -  ఎన్నో కష్టాలు, సుఖాలుగా మారిపోతాయి. మీరు - వెంటనే అలాంటి భార్యగానో, భర్తగానో, మారండి. .....   మీ వారు / మీ భార్య - మీ ఉదాహరణతో - కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో -  మిమ్మల్ని అమితంగా ప్రేమిం చే వ్యక్తిగా మారిపోతారు. ప్రేమలో భగవంతుడున్నాడు.  ప్రేమకు అమితమైన శక్తి వుంది.

మంచి స్నేహితులు ఇద్దరో, ముగ్గురో, నలుగురో వుంటే -   ఎన్నో కష్టాలు, సుఖాలుగా మారిపోతాయి. మీరు - వెంటనే వొక మంచి వాడికి - అలాంటి స్నేహితుడిగా మారండి.అతనూ మీకు మంచి స్నేహితుడిగా మారతాడు.

మంచి వాత్సల్య పూరితులైన తండ్రిగా, తల్లిగా, ప్రేమమయులైన పుత్రులుగా, పుత్రికలుగా మారండి. ఎన్నో కష్టాలు సుఖాలుగా మారిపోతాయి.

అంటే - పక్కనున్న వారి - కష్టాన్ని పంచుకోండి. వారి శరీర, ఆర్ధిక, మనో భారాల్ని తగ్గించండి. 

అందు వల్ల మీకూ మంచే  జరుగుతుంది. వారికీమంచే జరుగుతుంది.

అన్నిటినీ మంచి - ఏదొచ్చినా - నీ ప్రసాదమే - నీ ప్రసాదమేదైనా, సం తోషంగా  స్వీకరిస్తానన్న భావన మీలో వుంటే - కష్టాలను, చాలా సులభం గా సుఖాలుగా స్వీకరించ వచ్చు. 

మీ మనసుకు -కష్టాన్ని - సుఖంగా మార్చుకునే  అపారమైన శక్తి వుంది.   

ఉదాహరణకు - మీరు వొక కిలో మీటరు నడవాలని కష్ట పడుతూ, బాధ  పడుతూ నడుస్తున్నారు.  చేతిలో, 10 రూపాయలుంటే  -   రిక్షా లో వెళ్లి వుందును గదా - అని మీ మనుసు లో బాధ. 
కాస్త ధన వంతుడుగా  వుంటే - కార్లో వెళ్ళే వాడిని గదా - అనుకుంటున్నారు.  

కాస్త    మనుషులను  గమనిం చండి. 

కొంత మంది - మా ఆరోగ్యం  బాగుండాలి  - కాబట్టి మేము నడుస్తామని , కార్లున్నా, డబ్బు వున్నా, ఏదీ లేక పోయినా, వొక కాలే లేకున్నా  - ఎన్నో కిలోమీటర్లను, సంతోషం గా  నడిచే వాళ్ళను మీరు చూడగలుగుతారు. మీకూ, వారికీ తేడా ఎక్కడ? మీ మనసులోనే.  కష్టం కాదనుకునేదేదీ కష్టంగా వుండదు. కష్టం అనుకునేదేదైనా - సుఖంగా వుండదు. కారులో వెళ్ళడం కష్టంగా అనుకునే వాళ్ళెంతో మంది వున్నారు. 

ముఖ్య మంత్రి పదవి వద్దు బాబోయ్ అన్న వారూ వున్నారు. కావాలని కొట్టుకునే వారూ వున్నారు. అన్నిటికీ మనసే కారణం.

పనులూ - ప్రతిఫలాలూ

యిక్కడ  మీరు కర్మ సిద్దాంతం యొక్క విశిష్టతను బాగా అర్థం చేసుకోవాలి.

యిప్పుడు - మీకివ్వబడుతున్న ప్రతి ప్రతిఫలమూ - మీరు గతంలో - చేసుకున్న పుణ్య, పాప ఫలితాలే. మళ్ళీ - పాపమంటే - సరిగ్గా అర్థం చేసుకోవాలి. దారిలో, చూడకుండా, రాయిని తన్నారనుకోండి .  మీకు తగులుతుంది.  నొప్పి  పెడుతుంది. రక్తమూ రావచ్చు. యిది పాపమా? మీకు మీరు చేసుకున్న పాపము. ప్రతి పనీ - పాపమైనా, పుణ్యమైనా, రెండూ కాక పోయినా -  దానికి, ప్రతి ఫలం మాత్రం తప్పక వుంటుంది. 

మీకు వచ్చిన ఏదో ప్రతిఫలం - ఏదో చెడు జరగడం  అనుకోండి. ఏదో రోగం వచ్చిందనుకొండి . 

యిది ఏదో పాపానికి మీకొచ్చిన ప్రతిఫలం అనుకుందాం. "మా ఫలేషు కదాచన" అన్నట్టు, ఈ ప్రతిఫలం రావడంలో - మీ ఎంపిక లేదా ఛాయిస్ చాలా తక్కువ. ఇది వస్తుందని -మీరు అనుకోలేదు. అయినా వచ్చింది. మనం చెడ్డ చేసేటప్పుడు - ఎప్పుడో, మనకూ చెడ్డ తప్పకుండా జరుగుతుందని మనం అనుకుని చేస్తున్నామా? కాని - అటువంటి ప్రతిఫలం - రాక మానదు. ఎప్పుడో తెలీదు. ఎలాగో తెలీదు. కానీ వస్తుంది. 

మీలో వున్న శక్తులు
కాని - "కర్మణ్యేవ  అధికారస్తే" అన్నట్టు - ఈ వచ్చే, ప్రతిఫలాన్ని, మీ జీవితం లో , మీ మనసులో,  మీరు  ఎలా  తీసుకుంటారో -  అది, మళ్ళీ మీ "పనే" , అది మీ "కర్మ"నే .       అది - మీరే నిర్ణయించుకోగలరు.

కష్టాన్ని - సంతోషంగా తీసుకోగల సామర్థ్యం దేవుడు మీకు యిచ్చాడు.   అది మీలో వుంది.

రేపటి సుఖాలను, ఈ రోజు కర్మలతో మలుచుకో  గల సామర్థ్యమూ మీకు దేవుడు యిచ్చాడు.అదీ మీలో వుంది.

ప్రక్క వాడి కష్టాలను తగ్గించగల సామర్థ్యమూ మీకు దేవుడు ఇచ్చాడు.

ప్రేమలో, జ్ఞానంలో, ధ్యానంలో, నిస్స్వార్థ కర్మలలో - దేవుడినే మీలో చూడగల, మీలో బంధించుకోగల   సామర్థ్యమూ మీకు  దేవుడు ఇచ్చాడు.
    
యిన్నిఅపార  శక్తులను పక్కన బెట్టి - నోట్ల కట్టలలో, అధికారాలలో - పదవులలో - మట్టిలో - సంతోషం వెదికితే - అవి ఎండమావులే అవుతాయి. వాటి ప్రతిఫలాలు - వెంటనే - మన వెన్నంటుతాయి.    అవి ఎప్పుడు ,ఏ రూపంలో మీ జీవితంలో ప్రవేశిస్తాయో మాత్రం తెలియదు.

కర్మ సిద్దాంతం -కొన్ని వేల, లక్షల సంవత్సరాల నాటిది. నిజానికి, సృష్టిలో - అది వొక మౌలికమైన ధర్మం. ఎప్పుడూ ఉన్నదే.

ఇంగ్లీషులో - కాస్ - అండ్ - ఎఫెక్టు - థియరీ అని పేరు పెట్టాము. అంతే.
సంతోషం మీ జన్మ హక్కు. అది "ఎఫెక్టు" అయితే - "కాస్" ఏమిటో, ఎవరో తెలుసా?


మీరే!


=మీ

వుప్పలధడియం విజయమోహన్

11, మే 2011, బుధవారం

ఈ వొక్క రోజు సంతోషం గా గడపండి = ఈ వొక్క విషయంలో - మీ మాట మీరు వినండి. = యిదే వేదాంతమంటే !



ప్రపంచంలో ఎవ్వరు మీ మాట విన్నా - మీరు పూర్తి 'శాంతి' తో వుండలేరు.

మీ చుట్టూ వున్న వారు - మీకు  ఏమి చేసినా - మీ 'సంతోషం' పరిపూర్ణంగా వుండదు.

ఎందుకంటే - 

మీ మాట ముఖ్యముగా వినవలసిన వొకే వొక ముఖ్య వ్యక్తి - మీ మాట వినడం లేదు గనుక.

యింతకీ - ఎవరా  ముఖ్య వ్యక్తి?

మీరే!                  మీరే, ముఖ్యంగా  మీ మాట వినడం లేదు.
అందు వల్లనే - మీలో పరిపూర్ణత లేక పోవడం, అశాంతి నిండి వుండడం.

నా మాట నేను వింటున్నా కదా. వినడం లేదని మీరెలా చెబుతారు?

మీ యీ ప్రశ్నకు మీరే సమాధానం వెతుక్కోవచ్చు. చాలా సులభం.

మీరు రేపు - ఏమేం చేయాలో వొక డయరీ లో రాయండి. 

ఎప్పుడు లేయాలో, ఎప్పుడు పడుకోవాలో, ఏమేం తినాలో, ఎవరితో మాట్లాడాలో, ఏమేం చేయాలో - అన్నీ వివరంగా , సమయంతో బాటు రాసుకోండి.

ఈ రోజు రాత్రి 9 గంటలకు -  యివన్నీ రాసి, మీ దగ్గిరే పెట్టుకుని, పడుకోండి. 

తరువాత - తెల్ల వారి లేయడం నుండీ - పడుకునే వరకు - మీరుగా రాసుకున్న లిస్టు లో - ఏమేమి సరిగ్గా, సమయం ప్రకారం చేస్తారో  చూసుకోండి.

మీరు 25 నుండి 50 శాతం వరకు చేయ గలిగితే - చాలా ఎక్కువ, చాలా బాగా చేసారన్న మాట.

మీరు అనుకున్న సమయానికి లేయను కూడా లేయరు. అనుకున్న సమయానికి పడుకోరు. నిద్ర పోరు. తినరు. యివి కాక, ముఖ్యమైన పనులు రాసుకుని వుంటే - ఆ అనుకున్న పనులలో సగం చేస్తే చాలా, చాలా ఎక్కువ. సగం చదివితే చాలా ఎక్కువ.   25 % రాస్తే చాలా, చాలా ఎక్కువ.వ్యూహాత్మకంగా, రచనాత్మకంగా చేయాలనుకున్న పనులు ఆరంభం చేస్తేనే ఎక్కువ. యిలా వుంటుంది సగటు మనిషి జీవితమంతా.

విద్యార్థులు తాము అనుకున్న వాటిలో - సగం అయినా  చదువ గలుగుతున్నారా? ఎక్కువైతే -  పది శాతం మంది చేస్తుండొచ్చు.

ఆ పది  శాతం మంది   మంచి  మార్కులతో పాసవుతూ వుండొచ్చు. అరవై లోపు మార్కులతో - పాసయే వారే ఎక్కువ కదా. వారంతా - సగటు మనుషులలోకే వస్తారు.
జీవితం లోనూ అంతే. అరవై మార్కుల కంటే తక్కువతోనే - ప్రతి విషయం లోనూ - మనం పాసవుతున్నాము.

ఎందుకు?  

మన మాట మనమే వినడం లేదు గనుక.

సరే. మన ముఖ్యమైన  ఆశ, ఆకాంక్ష  ఏమిటి? మనం సంతోషంగా  వుండాలని.

అంతేనా. 

వొక పని చేద్దాం.

ఈ వొక్క రోజు - యీ వొక్క  24 గంటల కాలం - ఏం జరిగినా - అంటే : అత్త గారు  ఏమన్నా - బాసు తిట్టినా , డబ్బు పోయినా - కోడలు ఏ పనీ చేయకున్నా, భార్య ఎన్ని రకాలుగా మీ మూడు పాడు చేయాలని ప్రయత్నించినా,   భర్త తాగొచ్చినా - మిగతా ప్రపంచం ఏమైనా,  ...

నేను మాత్రం సంతోషం గానే వుంటానని భీష్మ ప్రతిజ్ఞ  చేయండి.

ఈ క్షణం నుంచి - యిది జరగాలి. 

మళ్ళీ వాయిదా వేసుకోకండి - రేపటి నుండి, వచ్చే  వారం నుండి అని. 

ఈ క్షణం నుంచి. వొక్క  24 గంటల కాలం- మీరు సంతోషంగా వుండాలి.

ఏ కారణానికీ - మీ సంతోషాన్ని మాత్రం పాడు చేసుకోకండి. డబ్బు పోతే పోనీయండి. సంతోషాని విడవకండి.

ఎవరు తిట్టిన్నా - తిట్టుకోనీయండి. మీ సంతోషాన్ని మాత్రం విడవకండి.

వొంట్లో - ఏవైనా రోగాలున్నా - మందులేసుకోండి. అంతకు మించి, అవి రేపెమవుతుంధో  - మాపెమవుతుం ధో నాన్న దిగుల్లంతా  విడిచెయ్యండి.  యీ 24 గంటల పాటు. అంతే. చాలా సింపుల్.

 వొక్క  24 గంటల కాలం - అంతే.

జీవితంలో ఈ వొక్క రోజు సంతోషం గా  గడపండి. ( రేపేం చేయాలో  రేపు చూద్దాం.)

యిదే వేదాంతం.       మరేం లేదు. అసలేం లేదు!!

చిదానంద రూపః  ; శివోహం; శివో హం. 
= మీ 

వుప్పలధడియం విజయమోహన్

మీ సుఖానికి కారణం ఎవరు? = మీ విజయానికి ఎన్ని మెట్లు?




మీరు  ఏ  పని చేసినా  - దానికి - దృష్ట ఫలము;. అదృష్ట ఫలము - అని - రెండు రకాల ఫలితాలు వుంటాయి.

దృష్ట ఫలం మీరు వెంటనే చూడగలిగేది, లేదా, ఏదో విధంగా , త్వరగా అనుభవించ గలిగేది. 

మీరు, వొక మంచి పాట విన్నారు.  చాలా హాయిగా అనిపించింది.  యిది దృష్ట ఫలము. మీకు వెంటనే తెలిసి పోయింది. 

తరువాత - ఆ పాట అర్థానికో, మాదుర్యానికో  -  మీ మనస్సులో - వొక ముద్ర పడ వచ్చు. మీలో, కొద్దో, గొప్పో, వొక మౌలికమైన మార్పు రావచ్చు. అయితే - అది ఈ పాట వలన వచ్చిందని మీకు తెలియక పోవచ్చు. ఈ మార్పు - అదృష్ట ఫలం గా చెప్ప వచ్చు. యిలా - మనం చేసే పనులలో, ఎన్నిటికో - రెండు రకాల ఫలితాలూ వుంటున్నాయి.

దృష్ట ఫలము   - చాలా వరకు - వెంటనే తెలిసి పోయేటటువంటి ఫలితము. అదృష్ట ఫలం - ఎప్పుడో గానీ తెలీదు. ఫలం తప్ప కుండా వస్తుంది - గానీ,  మన పనికీ, ఫలానికీ - ఏ రకమైన లింకు  మనకు కనిపించదు, చాలా గమనికతో చూస్తే తప్ప.
 
ఉదాహరణకు - మత్తు పదార్థాల వాడకం లో - యిప్పుడే వచ్చేది మత్తు. తరువాత వచ్చేవి  - రోగాలు, ధుహ్ఖాలు.పదుగురి మధ్య అవమానాలు, కోపాలు, కొట్లాటలు  యిత్యాది.

యిలా - ప్రతి పని లోనూ వున్న - దృష్ట, అదృష్ట ఫలాల్ని అన్నిటినీ, బేరీజు వేసి, రెండు ఫలితాలూ, అనుకూల ఫలితాలుగా వుండేటట్టు - పని చేసే వాడు - దీర్ఘ దర్శి, దూర దృష్టి గలవాడు, అని చెప్పుకోవచ్చు. 

ఆటువం టి వారికి - భాగ్య రేఖ కూడా అనుకూలిస్తూ వుంటుంది. 

అంటే - అదృష్టఫలం కానీయండి; దృస్ట ఫలం కానీయండి  -  రెండింటినీ - కొంత వరకూ, మనం ముందుగానే, వూహించ వచ్చు.  ఊహించాలి కూడా.

విజయానికి ఎన్ని మెట్లు?  అని యండమూరి గారిని అడిగితే - ఏమంటారు?

నేను - నేషనల్ అకాడెమి ఆఫ్ టెలికాం (హైదరాబాదు) లో వున్నప్పుడు - దాదాపు 4 - 5  సంవత్సరాలు -  యండమూరి గారిని, బి,వి. పట్టాభిరాం గారిని - వొక్కొక్క వారమూ మా అకాడెమీకి - ఆహ్వానించే వాడిని. దేశంలోని - ప్రతి రాష్ట్రం నుండీ  వచ్చిన వారు - మన ఈ యిద్దరు  ప్రముఖ రచయితల - ఉపన్యాసాలను  - ఎంతో ఇష్టంగా వినే వారు. వారు వెళ్లి - వొక్కొక్కరు, మరో ముగ్గురిని, తమ రాష్ట్రాల నుండి,  పంపించే వారు.  

యండమూరి గారు తమకు యిష్టమైనది, అందరికీ వెంటనే ఉపయోగ పడే -  విజయానికి ఐదు మెట్లు - లాంటి అంశం పైననే మాట్లాడే వారు.పట్టాభిరాం గారు - మనస్తత్వ శాస్త్రం నుండి, అనేక అంశాల పైన మాట్లాడే వారు. 

ఈ ఆసక్తి కరమైన ఉపన్యాసాల గురించి -మరో సారి చెబుతాను.

విజయానికి మెట్లు వున్నాయంటేనే - మన  మనస్తత్వాన్ని - మనం మలుచుకోగలం  - అంటేనే - దృష్ట, అదృష్ట ఫలాల్ని అన్నిటినీ, ఏదో కొంత వరకైనా, చెప్పొచ్చుననే గదా.

అది ముఖ్యం.

కొన్ని రకాల పనులకు - దృష్టాదృష్ట   ఫలాలు మరో రకంగా వుంటాయి.

ఉదాహరణకు - మీరు ఎవరైనా - వొక అనాథ బాలుడికి, విద్యాసౌకర్యం కలిగించారనుకోండి. దాని దృష్టాదృష్ట ఫలాలు ఎలా వుంటాయి.

  • ఆ బాలుడికి విద్య వస్తుంది. (దృష్టం)
  • అతడికి - సంఘం లో వొక సముచిత స్థానం ఏర్పడుతుంది.(దృష్టం)
  • మీ డబ్బు కాస్తా ఖర్చవుతుంది.(దృష్టం).
  • మీ మనసులో వొక మంచి పని చేశామనే సంతృప్తి, వెంటనే కలుగుతుంది (దృష్టం).

  • భగవంతుడి దగ్గర - మీ పుణ్యం అనే ఖాతాలో - వొక పెద్ద మొత్తం చేరుతుంది. దాని నుండి, ఆ కర్మ ఫల దాత ఈ జన్మ లోనే మీకు  - ఏదో వొక మంచి ఫలితాన్ని ఈవచ్చు. (అదృష్టం).
  • ఆ బాలుడు, పెరిగి పెద్ద వాడై, మీకు, అనుకోని రీతుల్లో, సహాయ పడవచ్చు.(అదృష్టం).
  • మీరు చేస్తున్న మంచి పనులు, - మీరు, ఎవరికీ చెప్పక పోయినా - పది మందికి తెలిసి   సంఘంలో, అనుకోని రీతుల్లో, మీ గౌరవం పెరగవచ్చు.(అదృష్టం).
మీరు చేస్తున్న నిస్స్వార్థ పనుల అదృష్ట ఫలాన్నే - పుణ్యం అంటారు.

వీటి ఫలం, ఎక్కువైతే - అవి మీ తరువాతి జన్మకు కూడా, మీతో బాటు వస్తాయి.   మీరు, మంచి కుటుంబంలో పుట్టడము, సంతోషమైన జీవితం గడపడమూ జరుగుతుంది.(అదృష్టం). ఈ విషయం - శ్రీ కృష్ణ పరమాత్మ స్వయానా భగవద్ గీత లో కూడా అన్నారు.

పుణ్య కార్యాల అదృష్ట ఫలాలను -  వొక పండులో వుండే గింజతో పోల్చవచ్చు. గింజ చిన్నదే. కానీ - ఆ వొక్క  గింజ నాటి పోషించిన వాడికి  -  ఆ గింజ నుండి వొక మహా (ఫల)వృక్షము పుట్టి, వేల కొద్ది పండ్లను , సంవత్సరాల తరబడి - తర తరాలకూ - యిస్తుంది.  పుణ్య ఫలం ఇలాంటిదే. చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం రావచ్చు.

పాప ఫలమూ ఇలాంటిదే. కాక పోతే - అది చెడు ఫలితాలను, ముళ్ళ చెట్టు లాగా, యిస్తుంది.

మీరు చేస్తున్న కీడు / చెడ్డ పనుల అదృష్ట ఫలాన్నే పాపం అంటారు.

ఉదాహరణకు - మీరు ఎవరి భూమినో అక్రమంగా - ఆక్రమించారనుకుందాం. వారికి శక్తి లేక, వూరికే శాపనార్థాలు మాత్రమే పెట్టగాలిగారనుకుందాం. దాని ఫలితాలేమిటి?

  • మీకు భూమి స్వంతం అయ్యింది (దృష్టం)
  • మీరు,లేదా, యితరులు, ఈ శాపనార్థాలు విన్నారు (దృష్టం).
  • అందరూ - మిమ్మల్ని గురిం ఛి - రౌడీ అనుకున్నారు (దృష్టం).
  • కర్మఫలదాత ఖాతాలో - మీ పేరు క్రింద, వొక పెద్ద పాపం నమోదు అయింది (అదృష్టం).
  • దీని కర్మ ఫలంగా - మీకు, ఎప్పుడైనా ఆక్సిడెంటు కావచ్చు.రోగాలు రావచ్చు. ముందుగా చనిపోవచ్చు. (అదృష్టం).
  •  వచ్చే జన్మలో - మీరు ఆ భూమిలోనే, పాముగానో, ఎలుకగానో పుట్టి, మీ  వారి చేతిలోనే - దెబ్బలు తిన వచ్చు. (అదృష్టం).
  • వొక వేళ మనిషిగా పుట్టినా - నీచుల కుటుంబంలో పుట్టి -  నానా కష్టాలు అనుభవించ వచ్చు.(అదృష్టం).

అయితే - ఈ కష్టాలన్నిటినీ, మానసికంగా అధిగమించి - యీ జన్మలో - మళ్ళీ మంచి పనులు చేయ గలిగే వారు - త్వరగా - కష్టాల నుండి బయటపడ వచ్చు.

నిన్నటి కర్మ యొక్క అదృష్ట ఫలం మీకు ఈ రోజు వస్తుంది; లేదా, రేపో, మాపో, వచ్చే జన్మ లోనో వస్తుంది.. అది  మీ చేతుల్లో  లేదు.

ఈ రోజు కర్మ మీచేతులలో వుంది.   అందుకనే అన్నారు - "కర్మణ్యేవ అధికారస్తే, మా ఫలేషు కదాచన" అని.
 
కర్మ మీ చేతుల్లో వుంది. మీ "చేతల్లో" వుంది. మీరు ఎటువంటి కర్మ అయినా  - చేయ వచ్చు. కాని, వాటి ఫలితాల పైన - ముఖ్యంగా అదృష్ట ఫలితాల పైన -  అధికారం వున్నది, ఆ కర్మ ఫల ధాతకు మాత్రమే. అది, ఎప్పుడు, ఎలా మీకు ఇవ్వాలో మీ   కర్మ ఫల ధాత మాత్రమే నిర్ణయిస్తాడు.

అందుకనే - మన సంస్కృతిలో - నాలుగు పురుషార్థాలు చెప్పారు.

అందులో మొదటిది - ధర్మం - అంటే - పుణ్యము మరియు, పాపము.

యివి - మన భవిష్యత్తుకు , మనం వేసే బాట. మన భవిష్యత్తును, వీటి ద్వారా, మనం, నిర్ణయించుకోవచ్చు. ఇవి, మనకు, తిరుగులేని, ఇన్స్యూరన్సు గా చెప్పుకోవచ్చు.వీటిలో - దృష్ట ఫలం పోగా, మిగిలింది, మనతో బాటు వస్తుంది.మన భవిష్యతును శాసిస్తుంది  .

అర్థము, కామము - మన వర్తమానం కోసం, మనం చేసే కృషి, వాటి  ఫలితాలు, యివి.
ధనం సంపాదించడం, అన్ని రకాల కోరికలు తీర్చుకోవడం - యివి చాలా వరకు వర్తమానానికి, లేదా, ఈ జన్మకు మాత్రం సంబంధించినవి.

కామము - అంటే , అన్ని రకాలయిన కోరికలు. అర్థాన్ని (ధనాన్ని), కోరికలను , ధర్మ మార్గంలో  పొందాలనే, మొదటి పురుషార్థముగా , "ధర్మాన్ని "  చెప్పారు.

చివరిది మోక్షం - ధర్మ, అర్థ, కామాలు మూడూ - ప్రతి మనిషిని తమలో బందిస్తాయి. మూడిటినీ, బంధ హేతువులని  - అంటారు.  మోక్షమనేది - అన్ని బంధాలనుండి బయట పడడం.
 
మనిషి కే  కాదు.  దేశాలకు కూడా ఈ పురుషార్థాలు వర్తిస్తాయి.

ధర్మం ఎక్కువగా వున్నా దేశాలలో, అర్థము, కామము అనుభవించ గలగడం  కూడా ఎక్కువగా వుండడం మనం చూస్తూనే ఉన్నాము.

ధర్మ బుద్ధి తక్కువగా వున్నా దేశాలలో - అర్థము, కామము ,- అన్నీ తక్కువవడం;  నేరాలు, దొమ్మీలు లాంటివి ఎక్కువవడం, అందరూ, అశాంతిలో  వుండడము  - మనం చూడవచ్చు.

కొన్ని దేశాలలో - ఎప్పుడు చూసినా - అశాంతే! దీనికి - ముఖ్య కారణం - ఎక్కడో వెదకాల్సిన పని లేదు.

మనిషి మనసులో - దయ, కరుణ, వాత్సల్య భావన, ఉదారత, లాంటి ధర్మ గుణాలు లోపించడమే.


మనం ,  చేసే ప్రతి పని యొక్క "అదృష్ట ఫలం" తెలుసుకొని చేస్తే చాలు - 

మన అందరి మనసులూ  పెద్దదవుతుంది. ప్రతి మనిషీ  పెద్ద వాడవుతాడు.దేశమూ గొప్పదవుతుంది.

చిన్న మాటల్లో చెప్పాలంటే -

- మీ సుఖానికి కారణం నేను కావాలి.

- నా సుఖానికి కారణం మీరు కావాలి.

ఈ చిన్న పాటి సూత్రం తెలిస్తే - ఎకనామిక్సు అక్కరలేదు. పాలిటిక్సు అక్కర లేదు. మరేం అక్కర లేదు.

 ఇదండీ మన సంస్కృతి, సైన్సు .

=  మీ

వుప్పలధడియం విజయమోహన్

  .

10, మే 2011, మంగళవారం

సత్యం వద = సత్యమేవ జయతే = ఏది నిజం?


"సత్యం వద" అన్నారు పెద్దలు.            

"సత్యమేవ జయతే" అని కూడా అన్నారు.


యిది  కాకుండా  -  యింకా యిలా అన్నారు. 


"సత్యం    బ్రూయాత్,  ప్రియం  బ్రూయాత్,  


న  బ్రూయాత్  సత్యం  అప్రియం 



ప్రియం చ  నానృతం బ్రూయాత్ 

ఏషా  ధర్మః సనాతనః "


యిలా - మన పూర్వీకులు, మహర్షులు సత్యాన్ని గురించి ఎన్నో చెప్పారు. వారు చెప్పినవి - ఈ కొన్ని మాత్రం, వొక్క సారి - సమీక్షించు కుందాం.

  • నిజమే చెప్పాలి. 
  • నిజమే  జయిస్తుంది; 
  • నిజమే చెప్పాలి. కాని నిజాన్ని, ప్రియంగా వుండేటట్టు చెప్పాలి. 
  • నిజమే అయినా -  ప్రియం కానిది  - చెప్పకండి.
  • ప్రియమైనటువంటి దైనా - అబద్ధాన్ని చెప్పకండి.
  • యిదే మన సనాతన ధర్మం.

నిజంగా - నిజమే జయిస్తుందని మనం మనసారా నమ్మితే ; నమ్మ గలిగే పరిస్థితులు, మన మధ్య వుంటే -

మనలో, అబద్ధాలు మాట్లాడే వారు వుండరు. వున్నా - చాలా తక్కువ మంది వుంటారు.

దేవుడి సృష్టిలో - అబద్ధం అస్సలు జయించధం టే - ఆ పరిస్థితి  చాలా, చాలా  బాగుంటుంది.  అప్పుడు, అందరూ - నిజమే మాట్లాడుతారు.

కానీ - మనకందరికీ తెలిసిన  నిజం - అబద్ధం కూడా, చాలా చాలా సార్లు, జయిస్తూ వుందని;


నిజానికీ, అబద్ధానికీ మధ్య - ఎప్పుడూ, యుద్ధం జరుగుతూనే వుంది. వొక్కో సారి, నిజం జయిస్తూ వుంది. వొక్కో సారి అబద్ధం జయిస్తూ వుంది. ఔనా, కాదా??
పగలు, రాత్రి వున్నట్టుగా , ప్రకృతిలో - నిజం, అబద్ధం ఎప్పుడూ వుండనే వుంది.

నిజం  వొక్కటే.

నిజంగా - జరిగింది వొక్కటే.  సంఘటన వొక్కటే.

కానీ - దాన్ని, ప్రతి వొక్కరూ  - వొక్కొక్క విధంగా చెప్పచ్చు.

నిజమే  చెప్పాలనుకునే వాళ్లకు కూడా -  జరిగింది జరిగినట్టుగా,.- యదాతథం గా , చెప్పడం చాలా, చాలా కష్టం.

కళ్ళతో చూసిందీ  అబద్ధం. చెవులతో వినిందీ అబద్ధం, పూర్తిగా, విచారించి తెలుసుకొన్నదే నిజం -  అని తమిళం లో వొక గొప్ప సామెత వుంది.చూసినంతనే, వినినంతనే  , తొందర పడక, ప్రశాంతమైన  మనస్సుతో, అన్ని విషయాలూ తెలుసుకొన్న తరువాతనే -మనం, నిజం  ఇది అని తెలుసుకోగలం. చెప్పగలం.

మన కళ్ళు మనను మోసం చేస్తాయి. మన చెవులు, మన మనస్సు అన్నీ, మనల్ని, మోసం చేసి, అబద్దాల్ని, నిజమని నమ్మేట్టు చేస్తాయి. తొందరపాటు వుంటే - యిది చాలా సార్లు జరుగుతుంది.

మన ఋషులు - నిజాన్ని మూడు రకాలుగా మన ముందుంచారు.

(1 ) పారమార్థిక సత్యం  : ఇది, ఎప్పుడూ సత్యమే. మారదు. నిన్న ఎంత సత్యమో, ఈనాడూ అంతే సత్యం. రేపూ అంతే సత్యం. ఉదాహరణకు  - మీరెవరు? అన్న ప్రశ్నకు సమాధానం - "సత్-చిత్-ఆనంద" స్వరూపం. దీన్ని, యిప్పుడు మనం, విశ్లేషించ బోవడం లేదు.  మీకెప్పుడైనా - చాలా బోరు కొడితే - ఈ"ప్రశ్నయొక్క సమాధానాల" వెనుక వెళ్ళండి. మీరెవరో తెలుసుకోండి. అదే పెర్మనెంటు ట్రూత్, లేదా,  పారమార్థిక సత్యం. కానీ -పారమార్థిక సత్యం, ఎంత సత్యమైనా - ఈ ప్రపంచ వ్యవహారాలకు, ఏ మాత్రమూ ఉపయోగ పడదు.

(2 ) ప్రాతిభాసిక సత్యం : కొన్ని, నిజం మాదిరి అనిపిస్తుంది. కాని, నిజం కాదు. ఎండమావులు  దూరం నుండి - జలాశయాల మాదిరి అనిపిస్తుంది. కాని, కావు.  
                               దూరం నుండి వొక రకంగా కనిపించేవి, వినిపించేవి, అనిపించేవి - నిజానికి, అవి కావు;  మరొకటి అని తెలుస్తున్నాయి కదా. 
                                    అయినా - మన పంచేంద్రియాలకు , దూరం  నుండి, మళ్ళీ, మళ్ళీ, ఎన్ని సార్లు చూసినా, అవే అనే భ్రాంతి కలిగిస్తూనే  వుంటాయి.  
                                   దాన్లో సుఖం వుంది, దీన్లో సుఖం వుంది - అని మనం వెదికి, వెదికి, వేసారి, కట్ట, కడపట, చిట్ట చివర - పారమార్థిక సత్యం వెనుక పడతాం. ప్రాతిభాసిక సత్యాల వెనుక పరుగువేట - కడ వరకు విడువలేం.

 (3 ) వ్యావహారిక సత్యం :  వ్యావహారిక సత్యం  అనేది - పంచేంద్రియాల ఆట. మనస్సు ఆట.
                               నేనెవరు - అన్న ప్రశ్నకు, మనం చెప్పే సమాధానం, మన శరీరం, మన మనస్సు, వాటికి మనం పెట్టుకొన్న పేరు, మన చదువు, మనం పుట్టిన రాష్ట్రం, మన భాష యిత్యాదులు. 
                               వ్యావహారికం గా - ఈ రోజుకు, యివన్నీ కరెక్టే. కాని - కొన్ని రోజులకు - ఇవేవీ చెప్పరు, మనల్ని  గురించి. "బాడీ" అంటారు.
                                       యిరవై, ముప్ఫై  ఏళ్ళ క్రితం వున్న మీరు , యిప్పటి మీరు, వొక్కటేనా?
                                  కానే కాదు. అప్పటి మీలో వున్న, వొక్క అణువు కూడా,  యిప్పుడు మీలో లేదు తెలుసా. అయినా- మనలోని, ఏదో చైతన్య "రూపం" , అదీ నేనే, ఇదీ నేనే అనే భావం కలిగిస్తూ వుంది. దీన్నే మనం వ్యావహారిక సత్యం అని అంటూ  ఉన్నాము.

"నిజం చెప్పండి" - అని మనం అంటే - ఈ వ్యావహారిక సత్యం గురించే. పారమార్థికం కాదు. ప్రాతిభాసికం కాదు.
ఈ వ్యావహారిక సత్యం పూర్తిగా -భూత కాలానికి సంబంధించినదే

ఈ వ్యావహారిక సత్యము భవిష్యతులోనిది  కాదు. -  వర్తమానము లోనిదీ కాదు. 


సత్యం వద - అంటే, మన పంచేంద్రియాలతో చూసిన, వినిన, ఘ్రాణించిన, తాకిన, రుచి చూసిన వాటి గురించి,   భూత కాలం లో  ఎలా గ్రహించామో - అలాగే, యధా తథంగా చెప్పడం.

మరో విధంగా చెబితే - అది అబద్ధమవుతుంది.

దీన్లో కూడా - నిజం వొక్కటే. జరిగింది వొక్కటే.

మీరు రెండు నిజాలు చూడలేదు. రెండు వినలేదు. నిజం వొక్కటే. కాని - పది మంది, పది రకాలుగా చెప్ప వచ్చు.

యిం దులో - మీరు ఐదు మంది - నిజమే చెప్పాలనుకునే వాళ్ళు  కూడా - జరిగిందాన్ని , ఐదు రకాలుగా చెప్ప వచ్చు. మీ కళ్ళతో వాళ్ళు  చూడలేరు.   వాళ్ళ కళ్ళతో మీరు చూడలేరు. మీ మనస్సు విశ్లేషించినట్టు వాళ్ళ మనస్సు విశ్లేషించదు.  వాళ్ళ మనస్సు విశ్లేషించినట్టు మీ మనస్సు విశ్లేషించదు.వొకే సంఘటనకు - యిప్పుడు ఐదు నిజాలున్నాయి.

ఏ వొక్కరూ   - పూర్తి నిజాన్ని పూర్తిగా చూసి, పూర్తిగా, నిజంగా చెప్పలేరు.

యిది కేవలం, మన సృష్టిలోనే  వున్న,  మన అసంపూర్ణత, శక్తీ హీనత ల కారణంగా జరుగుతూ వుంది.

పూర్తి నిజాన్ని గ్రహించ గలిగే శక్తి - మనిషికి యివ్వ బడ లేదు. ఏ విషయం లో నైనా సరే.

అందుకే అన్నారు - కళ్ళతో చూసిందీ  అబద్ధం; చెవులతో వినిందీ అబద్ధం; పూర్తిగా, విచారించి తెలుసుకొన్నదే నిజం - అని.

కాని, యిది , నిజంగా, నిజమే - చెప్పాలనుకునే  వాళ్ళ సంగతి.

మిగతా ఐదు మంది సంగతేమిటి ? వాళ్ళు చూడక్కర లేదు. వినక్కర లేదు. సంఘటనా స్థలం లో వాళ్ళు లేకపోయినా - వున్న వారికంటే బాగా, వర్ణించి మరీ చెప్ప గలరు. యిప్పటి సమాజంలో - వీరి సంఖ్య బాగా పెరిగిం ది.

నిజం వొక్కటే. 

అది - మన అసంపూర్ణత కారణం వల్ల - కాస్త, అటూ, యిటూ రూపాంతరాలు చెందడం సహజం. దాన్ని, మనం, చాలా వరకు సరిదిద్దుకోవచ్చు .

కాని - మన "సనాతన సంస్కార" హీనత వల్ల వొచ్చే రూపాంతరాలను - మనం అబద్దాలని చెప్పొచ్చు.

నిజమే చెప్పాలి - అన్న భావనే మనలో లేకపోతే - అబద్ధాలు ఎన్నైనా చెప్పొచ్చు.

నిజం చెప్పాలంటే - మీరేం చూసారో, విన్నారో  , మీరు  బాగా జ్ఞాపకం చేసుకోవాలి. కాని, మీ మనస్సు అంత  గొప్ప  జ్ఞాపక శక్తి కలిగిం దేమీ కాదు. మరిచి పోతుంది.

కాబట్టి  - రెండో సారో, మూడో సారో,   . జ్ఞాపకం చేసుకోవడంలో, జ్ఞాపకం మాత్రమే గాక - మీ ఊహాగానాలు, అంటే అబద్ధాలు, చాలా వుంటాయి.

మొన్న ఎం తిన్నాడో జ్ఞాపకం రాని మనిషిని -  సంవత్సరం క్రితం జరిగిన, ఆ సంఘటనను , మళ్ళీ  యిప్పుడు కరెక్టు గా  చెప్పు - అన్నది నా దృష్టిలో, చాలా, చాలా, చాలా అర్థ రహితమైన విషయం.

నా అభిప్రాయంలో - అటువంటి వాడు - ఈ రోజు చెప్పేవన్నీ, కట్టుకథలే.  నిజానికి,అతని  పెళ్లి రోజును గురించి  కూడా - అతను  కరెక్టు గా చెప్ప లేడు.

సరే.   మరి నిజమే చెప్పాలి - అంటే మన మహర్షుల అభిప్రాయం ఏమిటి? మీకు నిజంగా జ్ఞాపకం  వున్న, నిజంగా తెలిసిన, వ్యావహారిక సత్యం మాత్రమే చెప్పాలని.

దాన్ని గురించి ఊహాగానాలు చేయక, తెలిసింది, తెలిసినంత వరకు, వున్నది వున్నట్టు  చెప్పాలి.

అందరూ - యిలా తమకు నిజంగా తెలిసింది మాత్రం చెబితే - "సత్యమేవ జయతే" - అంటే, సత్యమే జయిస్తుంది. లేకపోతే, అబద్ధం జయిస్తుంది.

ఉదాహరణకు - వొక భార్య, భర్త మధ్య నిజాలు మాత్రమే వుందనుకోండి. వారు - వొకరినొకరు పూర్తిగా నమ్మొచ్చు.

నమ్మకం వున్న చోటనే - ప్రేమ కూడా వుంటుంది.   .

ప్రేమ వున్న చోట, సత్యం వున్న చోట - జన్మ జన్మల అనుబంధం  సాగిపోతుంది.

అంటే - సత్యం వున్న చోటే ప్రేమ వుంటుంది.  సత్యం లేని చోట ప్రేమ వుండే ఆస్కారమే లేదు - అన్న నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి..

కొన్ని దేశాలలో, జరిగే వివాహాలలో, 54 శాతం పైగా  , మొదటి  రెండు సంవత్సరాలలోనే - వివాహ రద్దు జరిగిపోతూ వుందని, లెక్కలు (స్టాటిస్టిక్సు )  చెబుతున్నాయి. అవన్నీ - పేరుకు, ప్రేమ వివాహాలే కావడం విశేషం. సత్యం లేని   చోట ప్రేమ వుండనే వుండదు. ప్రేమ వుండని చోట - జన్మానుబంధం వుండే ఆస్కారమే లేదు. ఆటువం టి వాటికీ - ప్రేమ అనే పేరు పెడుతున్నారు మరి!

కొన్ని దేశాలలో - దేశానికి ముఖ్యమైన విషయాలలో చాలావరకు నిజం చెప్పాలని పాటిస్తారు. మరి కొన్ని దేశాలలో, దేశ వ్యవహారాలన్నీ -ఎక్కువగా  అబద్దాలతో నిండి  వుండటం మనం గమనించ వచ్చు.  అటువంటి దేశాలు, అడుగడుగునా, చాలా విషయాల్లో,  విఫలాన్ని, వోటమిని, చవి చూడటమూ మనం గమనించ వచ్చు. సత్యమేవ జయతే - అన్న విషయం ఇక్కడకూడా మనకు బాగా తెలుస్తుంది.

ప్రేమ వివాహాలు విఫలమైనా, దేశం సఫలం కావడం కూడా కొన్ని చోట్ల మనం చూడొచ్చు. ఎక్కడ సత్యం వుందో - ఆ విషయం విజయం వైపు పయనిస్తుంది. ఎక్కడ అబద్ధం వుందో - ఆ విషయం వోటమి వైపు పయనిస్తుంది.  కొన్ని దేశాలలో, వైవాహిక సంబంధాలలో - లేని నిజాయితీ దేశం విషయంలో కనిపిస్తుంది. అక్కడ అది సఫలం కావచ్చు.

ఒక సంఘము , వొక సంస్కృతి - సఫలం, విజయవంతం కావాలంటే - వ్యక్తిత్వ సంబంధాలలోనూ-   నిజాయితీ వుండాలి. సాంఘిక సంబంధాలలోనూ నిజాయితీ వుండాలి. అప్పుడు - సత్యమేవ జయతే - అన్నది - ఆ దేశము, లేదా, సంఘము విషయం లో సార్థకమవుతుంది.

లేదంటే - ఆ యా దేశాలలో - చాలా సార్లు అబద్ధానికి విజయం సంప్రాప్తించినా  -  దేశం మొత్తానికి - ఆ అబద్ధాల పుట్ట, చేటు తెచ్చి  పెడుతుంది. దేశం విఫలమవడానికి కారణమవుతుంది.

సరే. నిజమే చెప్పాలి. కాని ప్రియంగా చెప్పాలి అని మహర్షులు అన్నారు.

అప్రియం కాని నిజాల్ని చెప్పరాదనీ అన్నారు. ప్రియమైన అబద్ధాలనీ - చెప్పరాదన్నారు.

నీ ముక్కు అస్సలు బాగాలేదని - మీరు, మీ భార్య తోనో, స్నేహితుడితోనో చెబితే - మీరేదో చాల గొప్ప నిజాన్ని, చాలా ఫ్రాంకు గా చెప్పినట్టు కాదు. అది - మీ సనాతన సంస్కార హీనతను మాత్రమే చాటుతుంది. మీరు నిజాలనుకునే అటువంటి, అప్రియ  వాక్యాల్ని చెప్పే హక్కు  మీకు లేదు.

ఏ నిజాన్ని చెప్పినా -మీరు ఎంత ప్రియంగా , ఎంత అందంగా , ఆనందం కలిగించే విధంగా, సమయోచితం గా (ఎప్పుడు చెప్పాలో అప్పుడు), ఎవరి మధ్య చెప్పాలో అప్పుడు (సభోచితముగా), చెబితే - అదే నిజమనిపించుకుంటుంది. అలాకాకుండా చెప్ప బడేది - నిజమనిపించుకోదు.

సనాతన సంస్కారానికి    - మరో ముఖ్య లక్షణం వుంది.

మీరు   -   ఎంత ప్రియంగా , ఎంత అందంగా , ఎంత ఆనందం కలిగించే విధంగా , మరెంత సమయోచితంగా , మరెంత సభోచితముగా  చెప్పినా -  అబద్ధాలు  చెబితే అది సనాతన  ధర్మము, సంస్కారము, నిజము - అని అనిపించుకోదు

అబద్ధం ఎంత బాగున్నా - నిజం అనిపించుకోదు.

కాని - నిజం నిజం అనిపించుకోవాలంటే - దానికి, ఎన్నో అర్హతలు వుండాలి..

అదండీ నిజం. 

= మీ

వుప్పలధడియం విజయమోహన్